ఆధునిక యుగం, వెయ్యేండ్ల తెలుగు సాహిత్యంలో ఓ ప్రత్యేకం. అధునాతన మానవ మూర్తిమత్వ ఉద్యమాలూ, ధోరణులకే కాక సాహితీ ప్రక్రియలకూ ఈ ఆధునిక యుగం పురిటిగడ్డ.
ఆధునిక యుగంలో, సాహిత్య ప్రక్రియలు ఎన్ని ఉన్నా, కవితకున్న విశిష్టతే వేరు. ఏ ఉద్యమమైనా, ధోరణైనా, భావావేశంతో మునుముందుగా రూపు కట్టుకునేది, కవితా ప్రక్రియలోనే. నవ్య సాహిత్యం నుండి నడుస్తూన్న సాహిత్యం వరకూ పరిశీలిస్తే, విషయం ఇట్టే అర్థమవుతుంది.
స్త్రీవాద కవిత్యం, దళితవాద కవిత్వం, మైనారిటీవాద కవిత్వం, ప్రాంతీయ అస్తిత్వ కవిత్వం, ఆధునికాంతరవాద కవిత్వం, ప్రపంచీకరణ ప్రతిఘటన కవిత్వం వంటివి, సంఘాన్ని నడిపిస్తున్న సాహిత్య ధోరణులు, కాలక్రమంలోనే కాక, వస్తు స్వీకరణలోనూ, భావావేశాన్ని రూపుకట్టుటలోనూ స్రీవాదం ప్రత్యేకతను కలిగి ఉంది.
1. స్త్రీవాదం-ఆవిర్భావ నేపథ్యం
‘ఫెమినిజమ్’ అన్న ఆంగ్ల పదానికి, స్త్రీ వాదాన్ని సమానార్థకంగా వినియోగించుకుంటున్నాం. స్త్రీ విముక్తి వాదం, స్త్రీ విమోచన ఉద్యమం, స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం వంటివి పర్యాయ పదాలుగా స్త్రీ వాదానికి కొంత ప్రాచుర్యం పొందాయి. ఏ వాదమైనా, ఉద్యమమైనా శూన్యంలోంచి భూమిమీదకు పరుగిడదు. సమాజమే దానికి పృష్ఠ భూమిక. స్త్రీ వాదమూ అందుకు మినహాయింపు కాదు.
దళిత, మైనారిటీ వాదాలు వర్తమాన తెలుగు సాహిత్య ధోరణులు. కారంచేడు సంఘటన, బాబ్రీ మసీదు విధ్వంసాలు, గుజరాత్ సంఘటనలు వీటికి మూలాలు. అయితే స్త్రీ వాదానికి ఇటువంటి మూలాలు కాక జాతీయ, అంతర్జాతీయ చర్చలు, సమావేశాలు ఆవిర్భావ కేంద్రంగా నిలిచాయి.
సామాజిక రంగం
సమాజం, కేవలం స్త్రీ పురుషుల సమూహం కాదు. పరస్పర సంబంధాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు వంటివన్నీ సమాజంగానే గుర్తించాలి. ఈ సమాజానికి వందల, వేల, లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈనాడు స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలు, వైరుధ్యాలు ఉండవచ్చు. సమాజం తొలి దశలో ఏ మానవ సమాజంలోనూ, సమూహంలోనూ స్త్రీ పురుషుల వ్యత్యాసాలకు, వైరుధ్యాలకు చోటు లేదు. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే భావన లేదు. కేవలం సమూహాల్లోని వావి వరుసలు, బృందాల మధ్య వివాహ సంబంధాలు వంటి విషయాల్లోనే కొన్ని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉండేవి. ఎన్ని వైవిధ్యాలున్నా, వైరుధ్యాలున్నా నాటి చారిత్రక నడకలో స్త్రీకి, పురుషునితో సమానత్వం ఉండేది. ఏ సందర్భంలోనూ తక్కువ చేయబడలేదు. కేవలం స్త్రీ శరీర ప్రకృతి ధర్మాన్ని బట్టి అప్పుడప్పుడూ కొన్ని ఆటంకాలు ఎదురయ్యేవి. గర్భిణిగా ఉన్న సమయంలో స్త్రీకి పరిస్థితి కొంత జఠిలంగా ఉండేది. అయినప్పటికీ, ఆనాటి సమాజంలో స్త్రీని తక్కువగా పరిగణించక పోవడం నేటి మానవాళికీ, సంఘానికీ ఒక మేల్కొలుపు. సహజమైన ఈ మానవ సంబంధాలకు, కృత్రిమత్వ విధి విధానాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు పుట్టుకొచ్చాయి.
పితృస్వామ్య-పురుషాధిపత్య వ్యవస్థలు
సమాజంలో పితృస్వామ్య దశలోనే వివాహ వ్యవస్థ ఏర్పడింది. ఆస్తిని సొంతగా సంపాదించడం, కూడబెట్టడం, వారసులకు తన తదనంతరం బదలాయించడం మొదలైంది. ఇదో చారిత్రక ఘట్టం. కారణం, ఈ ఘట్టాలు పురుషులకు ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్య తత్వం తెచ్చిపెట్టాయి. ఈ యాజమాన్యం మూలంగానే స్త్రీ మొదటి తరగతి నుంచి రెండవ తరగతి (ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్‌కు) స్థానానికి నెట్టబడింది. పురుషాధిపత్యం విత్తు ప్రజాస్వామ్య వ్యవస్థగా మొలకెత్తింది. ఇక్కడ కట్ చేస్తే, ఇది ఒక మహావృక్షమై వేర్లు దించుకుంది. ఊడలు పెంచుకుంది.
కుటుంబ సారభౌమత్వం, నిరంకుశాధికారాలన్నీ పితృస్వామ్య వ్యవస్థలోని పురుషుని ఆధీనంలో ఉండడమే పితృస్వామ్యం.ఈ ఆధీనత భౌగోళిక ప్రపంచమంతా వ్యాపించింది. ఫలితంగా, ఈ వ్యవస్థ పాదాల కింద స్త్రీ అణచివేతకు గురవుతూ ఉండడం ఓ విషాదం. ‘పుండు మీద కారం చల్లినట్లు, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, పితృస్వామ్య వ్యవస్థ పురుషాధిపత్య వ్వవస్థ’ గా మారింది, ఎదిగింది.
నిరంకుశాధికారాలన్నీ పితృస్థానంలో ఉన్న పురుషుని ఆధీనంలో ఉండడం పితృస్వామ్యం. కేవలం పితృస్వామ్యంలోని పురుషునికే కాక, కుటుంబంలో ఉన్న ప్రతి పురుషునికీ స్త్రీపై అధికారం బదలాయించడం పురుషాధిపత్యం. భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మామ కావచ్చు, మేనమామ కావచ్చు, వావి వరుసలు ఏవైనా కావచ్చు, పురుషుడైతే చాలు. స్త్రీపై సర్వాధికారాలూ పురుషుని సొంతం చేస్తుంది పురుషాధిపత్యం. సాక్ష్యం కింద మనుధర్మ శాస్త్రం ఈ శ్లోకాన్ని చూపిస్తుంది.
”పితా రక్షతి కౌమారే / భర్తా రక్షతి యౌవనే
పుత్రో రక్షతి వార్థక్యే / నస్త్రీ స్వాతంత్య్ర మర్హతీ”
ఆధిపత్య భావజాలాలు, మానవ ధర్మాన్ని మనుధర్మంగా మార్చాయి. సమాజాన్ని సంకుచితం చేస్తూ, ఇలా పితృస్వామ్య- పురుషాధిపత్యాలు సామాజిక వ్యవస్థ పరిణామ క్రమాన్ని సూచించే రెండు కొండ గుర్తులు. స్త్రీలు మనుషులు కారా? అయినప్పటికీ వారిని మనుషులుగా జీవించడానికి వీలు లేకుండా చేయడం, వారి వ్యక్తిత్వాలను, స్వేచ్ఛలను అణచివేయడం బండబారిన ఈ కొండగుర్తుల వ్యూహం.
కొండగుర్తులు-బలం, బలగం
ఏ దేశ అస్థిత్వమైనా ఆ దేశ సంస్కృతిపైనే ఆధారపడ ఉంటుంది. ఏ దేశ సంస్కృతైనా ఆ దేశ ప్రజల ఆచరణలో, అనుచరణలో నిలచిన సూత్రాలపై నిలబడి ఉంటుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, అన్ని సంస్కృతులు ఉన్నాయి. ఎన్ని సంస్కృతులున్నాయో, అన్ని మత ధర్మాలూ ఉన్నాయి.
మతం
ప్రపంచంలో, మతాల సంఖ్య తక్కువైనా, వాటిలోని అంతర్వైరుధ్యాల సంఖ్య అధికం. మతాలు ఎన్నున్నా, వాటి వైరుధ్యాలు ఏవైనా, స్త్రీని దర్శించే దృక్పథంలో మాత్రం వైరుధ్యమూ, వైవిధ్యమూ లేకపోవడం అన్ని మతాలకున్న గొప్ప విశేషం. స్త్రీ అణచివేయ బడడంలో ఈ మతాలన్నీ కూడబలుక్కున్నట్లు వ్యవహరిస్తాయి. కారణం, పురుషులే మత రూపకల్పనకు సారధులు.
హైందవ ధర్మాన్ని ఆవిష్కరించే వైదిక వాఙ్మయంలోనూ, పురాణేతిహాసాలలోనూ స్త్రీ జాతిని కించపరచే, అవమానపరచే అంశాలున్నాయి. వాత్స్యాయన కామశాస్త్రం కేవలం కామసూత్రాలనే వల్లించదు. సామాజిక మానవ సంబంధ సూత్రాలను కూడా ప్రతిపాదిస్తుంది. ఉత్తమమైన ఇల్లాలి ధర్మాన్ని పొదిగిన వాత్స్యాయన రచనా నిష్ఠను చూడండిక్కడ.
”భార్య భర్తను దైవ సమానంగా పరిగణించాలి. భర్త భుజించకుండా భార్య తినకూడదు. భర్తకు అసంతృప్తి కలిగించే ఏ పనీ భార్య చేయకూడదు. భర్తకు తెలియకుండా భార్య ఏ విధమైన దానధర్మాలూ చేయకూడదు. భర్త తరఫు బంధువులను, భర్త స్నేహితులను ఉచిత రీతిలో గౌరవించాలి. ఏ సందర్భంలోనూ అత్తమామలకు ఇల్లాలు ఎదురు చెప్పకూడదు. నిరంతరం అత్త మామల సేవలు చేస్తూ
ఉండాలి. వారి అదుపాజ్ఞలను సర్వదా పాటిస్తూ ఉండాలి. భర్తకు వేరొక భార్య ఉంటే ఆ విషయం గురించి భర్తతో కానీ, ఆమెతో కానీ కయ్యానికి దిగకూడదు. పైగా ఆమెను సోదరిగా పరిగణించాలి”. ఇవీ స్త్రీ విషయంలో వాత్స్యాయనుడి ప్రతిపాదనలు.
ప్రపంచంలో అతి పెద్ద మతం క్రైస్తవ మతం. స్త్రీ విషయంలో పట్టు బిగించిన క్రైస్తవ వైనాన్నీ తిలకించండి. ‘స్త్రీ పాపహేతువు. కేవలం పురుషుణ్ణి సంతోషపెట్టడానికే స్త్రీ సృష్టించబడింది. స్త్రీలు పాప గర్భంలోంచి పుట్టారన్న హైందవ మత ధర్మాన్ని క్రైస్తవ మతం కూడా ఆమోదించింది. స్త్రీ పుట్టుకతోనే పాపి అని బైబిల్ వాక్యం చెబుతుంది. స్త్రీని ఒక నీచ ప్రాణిగాను, బానిసగాను క్రైస్తవ మతం భావించింది. దేవుడు ఆదామును నిద్రపుచ్చి అతని పక్కటెముక నుంచి ఈవును సృష్టించాడన్న బైబిల్ వాక్యం ప్రపంచానికంతటికీ తెలిసిందే. అంతేకాదు, పురుషుని కష్టాలకు స్త్రీయే మూలకారణం’ అన్నది క్రైస్తవ మత సూత్రీకరణ.
ప్రపంచంలో పటిష్టమైన మరో మతం ఇస్లాం మతం. స్త్రీని న్యూనపరచడంలో ఇది ఇతర మతాలకు ఏ మాత్రం తీసిపో లేదు. ఇస్లాం మత ధర్మం ప్రకారం ‘స్త్రీలు పురుషులకు వ్యామోహాన్ని రేకెత్తించే వస్తువులతో సమానం. అందుకే, వారిని ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండాలి. అంతేకాదు, స్త్రీలు, పురుషుల సేద్యపు భూములవంటి వారనీ, ఆ భూముల్లోకి కోరినప్పుడు కోరిన విధంగా వెళ్ళే అధికారాన్ని కూడా ఇస్లాం మతం పురుషులకు కల్పించింది’.
ఇలాంటి కొండ గుర్తులు, బండ గుర్తులు, పనికిమాలిన మత గుర్తులు సంఘానికి గునపంలా తయారయ్యాయనే భావం సంఘ సంస్కర్తలకు, చదువరులకూ తెలిసిందే. సాంప్రదాయాల పేరుతో, వివిధ మతాల పేరుతో స్త్రీని వంటింటికీ, పడకటింటికీ పరిమితం చేశారు. ఇటువంటి విషమ ధర్మాలను తుంపి, తుంచి స్త్రీని విముక్తం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సామాజిక స్త్రీ విమోచనా ఉద్యమాలు వచ్చాయి.
స్త్రీ వాద సిద్ధాంత కర్తలు
అంతర్జాతీయంగా….అణచివేతకు గురైందీ, గురవుతున్నదీ స్త్రీలే కాబట్టి వారే తిరుగుబాటు చేయాలి. ఆ తిరుగుబాటుకు నేపథ్యంగా, భూమికగా ఇంగ్లాండ్-పారిశ్రామిక ఉద్యమం, ఫ్రాన్స్-ఫ్రెంచి విప్లవాలు నిలిచాయి. పారిశ్రామిక విప్లవంవల్ల యంత్రాలు వినియోగానికి వచ్చి, ప్రజలకు శ్రమ భారం తగ్గి, కొంతవరకు విముక్తులయ్యారు. వారికి కొంత విశ్రాంతి లభించింది. యంత్రాలతో ఉత్పత్తులు అధికమయ్యాయి. రవాణాలు సౌకర్యమయ్యాయి. దేశాలమధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. మానవ సమూహాల మధ్య సరికొత్త సంబంధాలు పుట్టుకొచ్చాయి. జీవన విధానంలో మార్పులు చిగురించాయి. ఆధునిక సమాజ అంకురార్పణకు అవకాశం కుదిరింది.
ప్రపంచాన్ని ఆధునికం చేయడంలో ఫ్రెంచి విప్లవ భూమిక పాత్ర అంతా ఇంతా కాదు. 1789లో ఈ ఉద్యమం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లింది. వాటి విశేషాలు బుద్ధి జీవుల్లో సమతాలోచనలు వికసింపచేశాయి. ఆకాశంలో సగభాగమైన స్త్రీ జాతికి, వారి వారి హక్కులు గోచరించాయి. వారికి సంఘబద్ధమైన చైతన్యంవైపు దారి మళ్ళింది.
మేరీ ఒల్ట్సస్ క్రాఫ్ట్ 1972లో ‘ద విండికేషన్స్ ఆఫ్ ది రైట్స్’ అనే గ్రంథం రాశారు. ఇది స్త్రీ విద్య, స్వాత్రంత్య్రం, ఆర్థిక, రాజకీయాంశాల గురించి సమాలోచనలు చేసింది. ముఖ్యంగా స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ద్వంద్వనీతిని ఇది చెరిపేసింది.
ఒలింప్-డి-గూజే ఫ్రెంచి దేశంలో స్త్రీలకు ఓటు హక్కు కోసం తీవ్రంగా పోరాడిన ధీరురాలు. ఈమె రచించిన గ్రంథం ‘మహిళలు, మహిళా పౌర హక్కుల ప్రకటన’. కేవలం ఓటుహక్కు గురించే కాక, స్త్రీలకు చెందవలసిన సంపూర్ణ ఆర్థిక, రాజకీయ, స్వేచ్ఛల గురించి కూడా ఈమె తన గ్రంథంలో సమీక్షించారు. స్త్రీకి గిలెటిన్ ఎక్కే పరిస్థితి ఉన్నప్పుడు ఆమెకు వేదిక ఎక్కే హక్కు కూడా ఉండాలని పోరాడింది. ఫ్రెంచి దేశంలో నేరస్తుల తలలను ఖండించే ఒకానొక పదునైన యంత్రం గిలెటిన్.
జాతీయంగా….భారతదేశం చాలాకాలం పాటు బ్రిటిష్ పాలనలో ఉంది. ఈ వలస పాలన దేశానికి ఎంత నష్టం చేకూర్చిందో అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వలస పాలన వల్ల మహిళలకు కొంత మేలు జరగకపోలేదు. స్త్రీలకు, శూద్రులకు వందల ఏళ్ళుగా భారతీయ సంస్కృతి, విద్యను నిషేధించిన విషయం తెలిసిందే. మొదటిసారిగా దేశీయులందరూ విద్యా విలువలను అంది పుచ్చుకుంది ఈ వలస పాలనలోనే. తద్వారా ప్రజా జీవితంలోను, వారి ఆలోచనల్లోను వచ్చిన మార్పులు ఉద్యమాలకు దారి చూపాయి.
సతీసహగమనం
దీనికి ‘సతి’ వ్యతిరేక ఉద్యమం అని మరో పేరు. చనిపోయిన భర్తతోపాటు బతికున్న భార్యను కూడా చితిపై సజీవంగా దహనం చేయడం సతీ సహగమనం. ఇది మధ్య యుగాల నుంచి భారతదేశంలోని కొన్ని కులాలలో కొనసాగుతున్న దురాచారం. 1818లో బెంగాల్ గవర్నర్ విలియం బెంటింగ్ ‘సతి’ని నిషేధిస్తూ చట్టం చేశారు. హిందూ సనాతనులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. సనాతనులకు, చైతన్యులకు మధ్య జరిగిన పోరాటంలో రాజా రామ్మోహన రాయ్, విలియం బెంటింగ్ ఆ చట్టాన్ని గెలిపించారు.
బాల్య వివాహ వ్యతిరేక ఉద్యమాలు
భారతీయ సంస్కృతిలో మరో మాయని మచ్చ బాల్య వివాహాలు. ముక్కుపచ్చలారని పసి బాలికలను, వయసు మళ్ళిన వృద్ధులకిచ్చి వివాహం జరిపించడం, సనాతన వివాహ వ్యవస్థలో ఒక దురాచార ఘట్టం. 1860లో బాలికల వివాహ వయసు కనీసం 10 సంవత్సరాలైనా ఉండాలనే నిర్ణయం చేయబడింది. అంతకు పూర్వం వివాహానికి సిద్ధంగా ఉన్న బాలికల వయసు ఊహించవచ్చు. కొన్నిచోట్ల భ్రూణ వివాహ సంబంధాలు కూడా జరగడంతో వాటిని ఆపడానికే ఈ నిర్ణయం చేయబడింది. 1889లో వివాహ వయసును 12 సంవత్సరాలకు పెంచుతూ చట్టం చేశారు. నేటికి వివాహ వయసును 18 సంవత్సరాలకు పెంచడానికి సామాజిక ఉద్యమాలే కారణమని చెప్పవలసిన అవసరం లేదు.
వితంతు వివాహాలు-ప్రోత్సాహ ఉద్యమాలు
బాల్య వివాహాల పుణ్యమా అని ముదిమి వయసు భర్తలు స్వర్గస్తులైతే ముక్కు పచ్చలారని భారతీయ వధువులకు భయంకరమైన వైధవ్యం సంభవించేది. వేద సంస్కృతి ప్రకారం విధవలకు పునర్వివాహం నిషేధం. ఈ నిషేధానికి బీటలు వారేలా 07-12 -1856న తొలి వితంతు వివాహం జరిపించారు ఈశ్వర చంద్ర విద్యాసాగర్. సంఘ సంస్కరణకు నడుం బిగించడం అంటే ఇదేనేమో!
ఇలా జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన మహిళా విమోచనా సంఘటనలు స్త్రీకి సమానత్వాన్ని తెచ్చిపెట్టాయి. వాటి సాధనకు స్త్రీలు నడుం బిగించారు. ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నానికి కొన్ని లక్ష్యాలను నిర్ధారించుకున్నారు.
2. స్త్రీ వాద లక్ష్యాంశాలు
ఏ వాదానికైనా, ఏ సిద్ధాంతానికైనా కొన్ని నిర్దుష్టమైన లక్ష్యాలు ఉంటాయి. తొలి రోజుల్లో స్త్రీ వాదులు ఆస్తి హక్కు, రాజకీయ హక్కు, గర్భ నిరోధక హక్కు, విడాకుల హక్కు వంటి ప్రజాస్వామ్యపు హక్కుల కోసం పోరాటం చేశారు. తదుపరి వీరు చట్టపరమైన హక్కులకు, సంస్కరణలకు మాత్రమే పరిమితం కాక, మొత్తం స్త్రీల విముక్తి కోసం కృషిచేసే లక్ష్యాలను నిర్ధారించుకున్నారు. పురుషాధిపత్యాన్ని నిర్మూలించడం, సెక్స్-జెండర్ మధ్య భేదాన్ని గుర్తించడం, లైంగికత్వ రాజకీయ కోణాన్ని పసిగట్టడం, కుటుంబంలోను, సమాజంలోను సమానత్వాన్ని కాంక్షించడం వంటివి. స్త్రీ వాదులు ఈ లక్ష్యాలను ఎంపిక చేసుకుని, వాటిని మిథోపోయి అభివ్యక్తి పద్ధతిలో కవిత్వబద్ధంగా పోరాడారు. స్రీ వాద కవయిత్రుల కవిత్వాన్ని పరిశీలించే ముందు, మిథోపోయి గురించి కొంత చర్చిద్దాం.
3. మిథోపోయి
మిథోపోయి, ఇది సాహిత్య సంబంధమైన పారిభాషిక పదం. ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యం ఈ అభివ్యక్తీ పదాన్ని, సాహిత్య విమర్శా రంగంలో నడిపిస్తోంది. కవిత్వ అభివ్యక్తీ రీతుల్లో ఒకానొక పద్ధతే ఈ మిథోపోయి. 2002 గమనం సంపాద సంచికను తెలకపల్లి రవి వేశారు. అందులో మేడిపల్లి రవికుమార్ తెలుగు సాహిత్యంలో మిథోపోయి అన్న సుదీర్ఘ విమర్శనాత్మక వ్యాసంలో మిథోపోయి వెలుగు చూసింది. మిథోపోయి (వీIునIూూజుIజు) పదబంధంలో రెండు పదాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి మైథాలజీ, ఇంకొకటి పొయిట్రీ. పురాణాలు, ఇతిహాసాలు ఆంగ్లంలో ఎపిక్స్‌గా వ్యవహరించబడతాయి. పురాణేతిహాసాల నేపథ్యంలో రాయబడిన కవిత్వం మిథోపోయి అవుతుంది.
మనం తెలుగులో వ్యవహరిస్తున్న పురాణ ప్రతీకలు, మిథోపోయికి సరిపోవు. మిథోపోయి ప్రత్యేకతలను ఈ ప్రతీకలు పట్టి చూపించలేవు. కనుక ఖచ్చితమైన తెలుగు పదం స్థిరపడేంత వరకు మిథోపోయి పదాన్ని విమర్శకులు స్థిరపర్చారు.
మిథోపోయి-నిర్వచనం
‘పౌరాణిక నేపథ్యంలో ఆధునిక జీవితాన్ని కవిత్వంలో ఆవిష్కరించడాన్ని ఆంగ్లంలో మిథోపోయి’ అంటారు. కేవలం పురాణ ప్రతీక ఉన్నంత మాత్రాన ఆ కావ్యంలో సామాజిక పురోగతి
ఉందనడానికి వీలులేదు. కొందరు సాంప్రదాయ వాదులు, సనాతన వాదులు సమాజాన్ని యధాతథంగా ఉంచేందుకో, సామాజిక తిరోగమనానికో పురాణ ప్రతీకను వాడుకోవచ్చు. అది మిథోపోయి కాదు. కనుక సామాజిక పురోగతిని కాంక్షించడం మిథోపోయి లక్షణం అని ఎవరూ మరువకూడదు.
ప్రపంచంలో ఈ మిథోపోయి అభివ్యక్తిని ఉపయోగించింది టి.ఎస్.ఎలియట్ ‘ద వేస్ట్ లాండ్’ కవితతో. ప్రత్యేకంగా తెలుగులో ఈ అభివ్యక్తికి ఆరంభం అంటూ ఏమీ లేదు. కొంత మసకగా కనిపిస్తోంది. కనిపించినంతవరకు, ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన వీరేశలింగం పంతులు గారే ఈ మిథోపోయికి ఆద్యుడుగా చెప్పాలి. ‘సరస్వతీ నారద విలాపం’ అనే ఖండకావ్యం ద్వారా కనిపిస్తోంది ఈ ధోరణి. అలా తెలుగులో మొదట వెలువడిన మిథోపోయి కవిత ఇదే.
అయితే, మిథోపోయి పద్ధతి తన కవిత్వంలో ప్రవేశపెట్టే ఏ కవికైనా, మైథాలజీ పట్ల మంచి పట్టు ఉండాలి. పాఠకుడ్ని సున్నితంగా తట్టి లేపగల నేర్పు ఉండాలి. అప్పుడే పాఠకుల హృదయాలు పూరేకుల్లా గుచ్చుకుని విచ్చుకుంటాయి. లేకపోతే ముళ్ళపొదల్లా గుచ్చుకుంటాయి.
ఇంతటి ప్రత్యేకతలు కలిగిన మిథోపోయి నిర్మాణ పద్ధతిని ఉపయోగించుకున్న స్త్రీ వాద కవయిత్రులు ఎందరో ఉన్నారు. వారిలో పాఠకుల హృదయాలను దోచుకున్న దొంగలు ఎంతమంది ఉన్నారో, దొంగతనం చేయని దొరసానులు ఎంతమంది ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం.
4. పురుషాధిపత్యం-మిథోపోయి
స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం అనేవి ప్రధానమైన వర్తమాన సాహిత్య ధోరణులు. 1980 దశకం నుంచి స్త్రీ వాదం తెలుగు సాహిత్యంలో పటిష్టమైన రూపాన్ని పొందుతూ ఉంది. స్త్రీ వాదులు పురుషాధిపత్య భావజాలాన్ని ప్రశ్నించడం వారికున్న ప్రధాన తాత్వికాంశం. సంఘంలో పురుష పక్ష ఆలోచనలకు అధిక ప్రాధాన్యం ఉండడం, సమస్త అధికారాలూ పురుషుని ఆధీనంలో ఉండడం, సమస్త పార్శ్వాలూ పురుషుని చెప్పుచేతల్లోకి జారిపోవడం పురుషాధిపత్య భావజాలంలోని ప్రధాన అంశాలు. ఈ అంశాలవల్ల స్త్రీ ఈ నాటికీ వివిధ కోణాల్లో దుర్భరమైన, భయంక రమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. ఈ విషయాన్ని స్త్రీ వాదులు మిథోపోయి అభివ్యక్తీకరణ పద్ధతుల్లో కవిత్వాన్ని ఎలా ఆవిష్కరించారో ఒకసారి పరిశీలిద్దాం.
భారతీయ వివాహ వ్యవస్థలో కట్టుబాట్లు, వాటి చుట్టూ అల్లుకున్న పతివ్రతా సూత్రాలూ స్త్రీకి జీవన సూత్రాలుగా పురుష వ్యవస్థ ఆశిస్తుంది. నిజానికి పతివ్రతల జీవితాలు మనం అనుకున్నంత గొప్పగా ఉన్నాయా? వాళ్ళ వ్యక్తిత్వాలకు, అస్తిత్వాలకు ఆటంకాలు లేకుండా వారు జీవించగలిగారా? ఇటువంటి లోతైన సందేహాలు స్త్రీ వాదులకు కలిగాయి. ఈ భూమికలోని సూత్రాన్ని ప్రముఖ కవయిత్రి జయప్రభ ‘విస్తరిస్తున్న ఎడారులం’ కవితా ఖండిక ద్వారా సూటిగా ప్రశ్నిస్తోంది.
సీతగానో / సావిత్రిగానో / అనసూయ గానో అరుంధతి గానో తప్ప / బతకలేని వాళ్ళం / మొగుడి ఛాయామార్గం వినా / వేరే తోవ తెలియని వాళ్ళం / మేం ఎవరిమని మాట్లాడగలం?/శతాబ్దాలుగా / ఈ జాతి ‘పుంసకత్వాని’కి / అరాచకత్వానికి సమిధలమై / సగం చచ్చి బతుకుతున్నవాళ్ళం!
సీత, సావిత్రి, అనసూయ, అరుంధతులు భారతీయ పతివ్రతలు. రామాయణంలోని సీత కష్టాలూ, భారతంలో సావిత్రి మరణించిన భర్తను అనుసరించిన వైనాలూ, అరుంధతి పాతివ్రత్యాలూ, మార్కండేయ పురాణమే కాక, భారత, రామాయణాలు అందించే అనసూయ పాతివ్రత్య శక్తులూ తెలియని భారతీయులు దాదాపు అరుదనే చెప్పాలి.
ఈ నలుగురు పతివ్రతలు ఏనాడూ తమ భర్తలకు బదులు (ఎదురు) చెప్పినవారు కాదు. భర్తల అడుగుజాడ, నీడజాడలై మెలిగినవారే (మిగిలినవారే). ఇతరేతర ఆలోచనలు, మార్గాలూ కోల్పోయి (నిలువు దోపిడీల్లో) నిలిచినవారే. తమ తమ కంఠస్వరాలు మూగపోయి, మానసిక వేదనా రాగాలాపనలో (రాళ్ళుగా) రాటుదేలినవారే. వారి అస్తిత్వాలు ఆలోచనా నాస్తికత్వ గుణాలు.
సీత వగైరా నాటి పతివ్రతలు ఈనాడు వ్యవస్థలో లేకపోవచ్చు. అయినా, సమాజంలో చాలామంది భార్యలు ఈనాడు ఆ దుస్థితిలో ఉన్నారు. నిజానికి కవయిత్రి ఒకనాటి పతివ్రతల మిషతో ఈనాటి భార్యల స్థితిగతులను ఈ ఖండికలో ఖండిస్తూ విశ్లేషించారు.
బి. ఇందిర అనే కవయిత్రి ‘అనాదిగా’ కవితలో అనాదిగా స్త్రీ అనుభవిస్తున్న ఇదే దుస్థితిని కవిత్వీకరించారు.
”హరిశ్చంద్రుడికి ఇల్లాలినైనా / అమ్ముడుపోక తప్పలేదు / పైగా అది తప్పుకాదట / ముప్పుతిప్పలు తప్పవట”
భర్తల అస్తిత్వం కోసం, పరువు ప్రతిష్టల కోసం, తమ తమ అస్తిత్వాలను వదులుకున్న భార్యలు, తమ తమ జీవితాలను త్యాగం చేసుకున్న అర్ధాంగులు మన ఇతిహాసాల్లో అనేకమంది
ఉన్నారు. యుగాలు గడుస్తున్నా, సమాజం ఎంతగా ఆధునికతను పుంజుకుని పరిగెడుతున్నా, ఒకనాటి భార్యల కష్టాలు, కన్నీళ్ళు ఇప్పటికీ సజీవ రూపాలుగా మార్చుకుని ప్రవహిస్తూనే ఉన్నాయి. భర్తల అవసరాల కోసం అమ్ముడుపోతున్న భార్యలు, బలవుతున్న భార్యలు ఇంకా సజీవంగానే ఉన్నారు. ఇది భారతీయ వైవాహిక వ్యవస్థలో, పురుషాధిపత్య సమాజంలో స్త్రీలపై పురుషులకు సంక్రమించిన అధికారాలకు నిదర్శనం.
5. జెండర్ వివక్ష-మిథోపోయి
పురుషాధిపత్యం తర్వాత స్త్రీ వాద తాత్విక దృక్పథంలో లక్ష్యాంశంగా ఉంది జెండర్ వివక్ష. స్త్రీ వాద కవయిత్రులు ఈ అంశాన్ని మిథోపోయి పద్ధతిలో ఏ విధంగా కవిత్వీకరించారో చూద్దాం. సెక్స్‌కూ, జెండర్‌కూ మధ్య ఉన్న స్పష్టమైన భేదాన్ని గుర్తించడం జెండర్ వివక్షతను అర్థం చేసుకోవడానికి ఉపకరించే తొలి దశ. సెక్స్ శరీరానికి సంబంధించింది. జెండర్ కుటుంబానికి, సమాజానికి సంబంధించింది. సెక్స్ సహజమైనది. జెండర్ కృత్రిమమైనది. ఒక వ్యక్తి ఆడగానో, మగగానో సమాజంలో పెరిగి, అసమానతలు రావడం జెండర్ పరంగానే అని గుర్తించారు. ఈ స్త్రీ పురుషుల మధ్య అసమానతలు లేకుండా ఇరువురినీ సమానంగా, ఒక మనిషిలా పెంచడంవల్లనే వీరి మధ్య అసమానతలు తొలగుతాయని స్త్రీ వాదుల భావన.
సెక్స్, జెండర్‌ల మధ్య వ్యత్యాసాలను స్త్రీ వాద కవయిత్రులు ఏ మేరకు గుర్తించారో పరిశీలిద్దాం. ప్రముఖ స్త్రీ వాద కవయిత్రి జ్వలిత రచించిన ‘అంధత్వం’ అనే కవితా ఖండికను చూద్దాం.
”ధృతరాష్ట్రునిలా, పుట్టుగుడ్డి కాదుకదా మనం / గాంధారిలా ఆపాదించుకున్న అంధత్వం మనది / ఇందుకు లింగభేదం లేదు / చూపుకేకాదు మనసుకూ మనకెందుకులే అని ఉపేక్ష”
మహాభారతంలోని గాంధారి, ధృతరాష్ట్రుని కథ లోక ప్రసిద్ధమే. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అని తెలిసినా గాంధారి అతన్ని వివాహమాడవలసి వచ్చింది. భర్తకు లేని చూపు భార్యకెందుకని తానూ కళ్ళకు గంతలు కట్టుకుని కృత్రిమంగా అంధత్వం ఆపాదిం చుకుంది. జీవితాంతం ఈ అంధత్వాన్ని కొనసాగించడం గాంధారికి జెండర్ వివక్ష పేరుతో సంఘం విధించిన శిక్ష అంటుంది జ్వలిత. భర్త అడుగుజాడల్లో తెచ్చుకున్న అంధత్వంతో నడిచింది గాంధారి.
తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎంత అపురూపంగా పెంచుకున్నా, మరెంత ఆణిముత్యంగా చూసుకున్నా, చివరికి ఏ ఆరళ్ళు పెట్టేవాడికో, అధికారాన్ని చెలాయించేవాడికో కట్టబెట్టాల్సిందే అన్న వ్యంగ్య ధోరణి కవిత్వంలో నింపుకుని కంఠస్వరాన్ని నినదించిన కవయిత్రి సావిత్రి. ఈమె రచించిన ‘అంతా నీకోసమే’ ఖండిక అందుకు వేదికైంది.
ఆరళ్ళు పెట్టే మొగుడికో, అధికార మదాంధుడికో / అప్పగించడానికే అపురూపంగా పెంచుతాం. / బతకనేర్వనందుకు పదే పదే విసుక్కోవడానికే / చక్కనైన మాటలతో ‘సామాజిక స్పృహ’ నేర్పుతాం / ఒంటరిని చేసి ఒదిలేయడానికి / పదిమందితో కలవమని బలవంతం చేస్తాం / చివరికి యిజాలను ‘కుట్ర’ల్లో యిరికించి, నిజాలను / నిలువునా నిషేధించడానికే / సత్యహరి శ్చంద్రుని అత్యాచారాలను కూడా / ఆదర్శం చేస్తాం.
పురాణేతిహాసాల కాలం నుండి పురుషాధిపత్య సామాజిక వ్యవస్థ స్త్రీకి అలవాటు చేసిన ఒకానొక ధర్మం పాతివ్రత్యం. నాటి నుంచి నేటి వరకు భర్తల పట్ల భార్య ఎంత అణకువగా ప్రవర్తించాలి? భర్త ఇష్టాయిష్టాల్ని ఏ మేరకు ఎలా నడుచుకోవాలి? ఏయే వేళల్లో ఏయే సేవలు చేయాలి? పర పురుషుల పట్ల ఎలా ప్రవర్తించాలి? వంటి పన్నాగాలు పతివ్రతలకు ధర్మపన్నాలు. ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుకే కాదు, బుద్ధి జీవులకూ ఎరుకే’ అన్నట్లు హరిశ్చంద్రుని అత్యాచారాలను సైతం ఆదర్శం చేయడం కవయిత్రి సమతాభావ ఆలోచనలకు పరాకాష్ట.
జెండర్ వివక్ష పట్ల స్త్రీ వాద కవయిత్రులలో సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారి స్వరాలు మార్పు చెందుతున్నాయి. మందరపు హైమవతి ‘ద్విపాత్రాభినయం’లో ఈ మార్పు గుర్తించగలం.
పతిదేవుని టేబుల్‌పై / కాఫీ కప్పుగా, మీల్స్ కారియర్‌గా / పిల్లల లంచ్ బాక్స్‌లుగా / బహు పాత్రాభినయ పోటీలో / నా చేతులకెపుడూ ఫస్ట్ ప్రైజే / నా శరీరమే చేతులుగా మారినా / నా హస్తద్వయమే / కార్తవీర్యార్జుని సహస్ర బాహువులుగా / పరిణమించినా పనిచేసినా / ఆఫీసుకు వెళ్ళేంతరకు నా పని అనంతమే
… … …
ఆఫీసరు అసురుడు అనేస్తాడు ఆఖరికి / ఆడవాళ్ళకెందుకమ్మా ఉద్యోగాలని / ఆనాటి సీత అభిమానం కాపాడిన భూమాత / మళ్ళీ ప్రత్యక్షమవకూడదూ అనిపిస్తుంది ఆ క్షణం
ఆడవాళ్ళకెందుకు ఉద్యోగాలనే మాట నేటికీ సంఘటిత రంగంలో తరచూ వినిపిస్తున్న మాట. తల్లిదండ్రులు, భర్త, ఆఖరికి అధికారులూ ఇంతే. స్త్రీ పురుషుల మధ్య నానాటికీ పెరుగుతున్న జెండర్ పరమైన వివక్షలు, బాధలు, కష్టాల నుంచి బైటపడాలని కోరుకుంటోంది. అందుకే, త్రేతాయుగంలోని రామాయణం అంతిమ ఘట్టంలో సీతాదేవి అభిమానాన్ని భూమాత కాపాడినట్లు, నేటి మహిళ కొత్త ఆలోచనకు సిద్ధమౌతోంది. భూమాత మళ్ళీ ప్రత్యక్షమవ్వడంలోని కవయిత్రి రచనా వ్యూహం ఆలోచించదగ్గదే…
6. లైంగిక వివక్ష-మిథోపోయి
స్త్రీ వాద తాత్విక చింతనలో చాలా ప్రాముఖ్యం కలిగిన అంశం లైంగికత. లైంగిక సంతృప్తి, దాంపత్య జీవితంలో స్త్రీ పురుష సంబంధాలు, బిడ్డల్ని కనడం వంటి విషయాల్లో స్త్రీకి సరైన స్వేచ్ఛ లేకపోవడాన్ని స్త్రీ వాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
వయసుతోనూ, వావి వరుసలతోనూ సంబంధం లేకుండా స్త్రీ సంఘం నిత్యం లైంగిక దాడులను ఎదుర్కొంటోంది. అత్యాచారాలు, వేధించడాలు వంటి అనేకాలు స్త్రీ జీవితానికి గ్రహణం పడుతున్నటువంటి అంశాలు. కారణం, స్త్రీకి హృదయం, మనసు లేవు. కేవలం శరీరమే ఉంటుంది. సొంత ఆలోచనలకు, ఇష్టాయిష్టాలకు తావులేని స్త్రీ శరీరం, పురుషుడు అనుభవించడానికి, ఇతరులకు ఎరవేసి అవసరాలను తీర్చుకోవడానికి లైంగిక వినియోగ పరికరంలా మిగలడం విచారకరం.
మందరపు హైమవతి ‘సంతకాలు చేద్దాం రండి’ కవిత ఈ సందర్భంలో ప్రస్తావించుకోదగినది.
గాయాలు మానినా / మచ్చలు మానవు / వెంటాడే విషాద స్మృతుల్లాగా / ఆనాడు పురాణాల్లో / ఏ మహర్షి తపోభంగానికైనా / ఓ ఊర్వశీ విలాస దృగంచలం / ఓ మేనకా మనోజ్ఞ భంగిమ / మహేంద్రుని ఆయుధాలు
దేవలోకంలోని అప్సరసలు ఊర్వశి, మేనకలు. వీరు ఇంద్రుని చేతిలో కీలుబొమ్మలు. తన పదవికి భంగం, విఘాతం కలుగుతుందన్న భయంతో ఏ మహర్షి తపస్సు చేసినా తపోభంగం చేయడానికి వీరిని ఎరవేస్తాడు ఇంద్రుడు. ఈ ఎరవేసే తత్వం ఇంద్రునితో పోలేదు. నేటి ఆధునిక ఇంద్రుల వరకూ నడిచింది, నడుస్తోంది.
కేవలం, శత్రువులను లోబరచుకోవడానికి స్త్రీని లైంగిక ఆయుధంగా వినియోగించుకున్నారనడానికి ఇదొక దృష్ట్యాంతం. నాటి పురాణేతిహాసాల్లో కనిపించే ఘట్టాల్లో ఈ నాటికీ స్త్రీ జాతిని వెన్నాడుతున్న విషాద స్మృతులను కవయిత్రి అభివర్ణించారు.
భారతీయ సాహిత్యంలో స్త్రీ శరీరం కేవలం భోగ వస్తువుగానే వర్ణించబడింది. దీన్ని మరోమారు నిర్ధారిస్తూ పాటిబండ్ల రజని ‘అబార్షన్ స్టేట్‌మెంట్’ రూపంలో ఇచ్చారు.
నీకు పంచేందుకు రక్తం లేకే కదా / నిన్ను పెంచేందుకు తీరిక లేకే కదా
… … …
రబ్బరు చేతుల ముసుగు నీ ముఖంపై కప్పి / అభిమన్యుడి శరాల కప్పజెప్పి / నిస్సహాయులైన పాండవుల్లా రోదిస్తూ / పెధిడ్రిస్ సెడేషన్‌లో నిన్ను పోగొట్టుకుని / పగిలిన జిల్లేడుకాయ తాలూకా పింజనై సోలిపోతూ… / నాలోని అమ్మను పాతిపెట్టుకుని / చెరకు పిప్పినై పారిపోతూ / కంసుడి కత్తిలాంటి ప్లాస్టిక్ బకెట్ మింగిన / ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ముద్దలాంటి నిన్ను చూసి / మళ్ళీ నా పొత్తిళ్ళలో పొదువుకోవాలనీ,
ఏయే పరిస్థితుల్లో, ఏయే కారణాల వల్ల ఒక స్త్రీ గర్భవిచ్ఛిత్తి చేసుకుంటుందో, దాని వెనుక ఏ శక్తులు ఏయే పార్శ్వాలలో పనిచేసి ఉంటాయో కవయిత్రి త్రీడీలో చూపించారు.
అభిమన్యుడి కథ మహాభారతం కావచ్చు. కంసుడి పాత్ర భాగవతం కావచ్చు. అభిమన్యుణ్ణి శరాలకు అప్పచెప్పినట్లుగా, కడుపులో పిండాన్ని వైద్యులకు అప్పజెప్పి, నిస్సహాయులై రోదిస్తున్న పాండవుల పరిస్థితే అబార్షన్ చేయించుకున్న తల్లులది. తల్లి ఆధీనంలోనే ఛిద్రమవుతున్న పసిగుడ్డుని, కంసుని కత్తిలాంటి ప్లాస్టిక్ బకెట్ మింగేసిన కుట్రను భారత భావితరానికి కనువిప్పుగా రచయిత్రి చూపారు.
7. కుటుంబ వ్యవస్థ-మిథోపోయి
కుటుంబాన్ని ఒక సామాజిక యూనిట్‌గా పరిగణించా లన్నది స్త్రీ వాదుల మరో ప్రధానమైన అంశం. ఇంటిపని, వంటపని, బిడ్డల పెంపకం వంటి విషయాలలో కుటుంబ భాగస్వామ్యం
ఉండాలన్నది వీరి తాత్విక ఆలోచన. ఇటువంటి అంశాలలో స్త్రీ వాదులు లోతైన కవిత్వ చర్చ చేశారు.
జయప్రభ ‘వంటింటి నుంచి వల్లకాటి దాకా’ ఖండిక కుటుంబ వ్యవహారాల్లో స్త్రీలు వివక్షకు గురైన అంశాల్ని మిథోపోయి ధోరణిలో గుర్తించారు.
అందుకే / నా విషయంలో / కర్ణార్జునులిద్దరికీ వైరం లేదు! / నా ముందు నుంచున్న / ధర్మరాజుకీ దుశ్శాసనుడికీ భేదం లేదు! / ఇల్లు సర్దుకునే పిల్లల నెత్తుకునే / పద్మవ్యూహంలో చొరబడి / పోరులోంచి పొయ్యిలోకి / పరిగెడుతుంటాను! / నిరంతరం… / నా శరీరంతో యుద్ధం / ఈ సమాజంతో యుద్ధం
‘వంటింటి నుంచి వల్లకాటి దాకా’ అనే శీర్షిక స్త్రీ జీవితంలో రెండు దశలను సూచిస్తుంది. మొదటిది వంటిల్లు, రెండవది వల్లకాడు. అంటే చనిపోయే వరకు సగటు మహిళ చిరునామా వంటిల్లే.
ఇల్లొక పద్మవ్యూహం. అందులోకి ఒకసారి ప్రవేశించాక బైటకు రావడం కష్టం. ఇల్లు సర్దుకోవడం-ఇంటి పనినీ, బిడ్డల్ని ఎత్తుకోవడం-బిడ్డల పెంపకాన్నీ సూచిస్తున్నాయి. కుటుంబ పని విషయాల్లో పురుషులెవ్వరూ పాలు పంచుకోకపోవడాన్ని ఈ ఖండిక ఖండిస్తోంది. ఇతరేతర విషయాల్లో కర్ణార్జునులకిద్దరికీ వైరం
ఉండవచ్చు. ధర్మరాజుకూ, దుశ్శాసనుడికీ భేదం ఉండవచ్చు. కానీ స్త్రీల విషయానికొస్తే చక్కటి ఒద్దిక వీరిలో కనిపిస్తుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తయినా, సాంప్రదాయం తెచ్చిన ఎన్నో ఉత్తమ గుణాలున్న మొగుడైనా వారి అవసరాలన్నీ పడక గదిలోనే కానీ, పనుల విషయంలో కాదన్నది ఈ ఖండిక వివరిస్తోంది.
ఆధునిక స్త్రీ ఇప్పుడు పురుషునితో సమానంగా విద్యావంతురాలైంది. పురుషునితో పాటు వివిధ రకాల ఉద్యోగాల బాధ్యతలనూ నిర్వహిస్తోంది. ఈ బాధ్యతల వల్ల స్త్రీ ఒక వ్యక్తిగా విజ్ఞానవంతురాలు కావచ్చు కాక, ఉద్యోగినిగా కుటుంబ ఆదాయాన్ని పెంచొచ్చు కాక, ఇంటి పనుల్లో ఏ మాత్రం వెసులుబాటు, విశ్రాంతి దక్కకపోవడం స్త్రీ జీవితాల్లో మరో విషాదం అంటూ మందరపు హైమవతి ‘ద్విపాత్రాభినయం’ ఖండిక ప్రస్తావిస్తుంది.
బహుపాత్రాభినయ పోటీలో / నా చెతులకెపుడూ ఫస్ట్ ప్రైజే / నా శరీరమే చేతులుగా మారినా / నా హస్త ద్వయమే / కార్తవీర్యార్జుని సహస్ర బాహువులుగా / పరిణమించినా పనిచేసినా / ఆఫీసుకు వెళ్ళేంతవరకు నా పని అనంతమే
ఆఫీసుకి వెళ్ళేంతవరకు స్త్రీలకు ఇంట్లో పని ఒక యుద్ధ వాతావరణం. ఈ వాతావరణాన్ని నెగ్గడానికి మనిషికున్న రెండు చేతులు సరిపోవు. ఈ పనికి కార్తవీర్యార్జునిలా సహస్ర బాహువులు అవసరం అంటోంది. కనుకే స్త్రీ తన శరీరాన్నే చేతులుగా మార్చుకుంది.
కార్తవీర్యార్జునుని పాత్ర రామాయణం లోనిది. ఇతడొక క్షత్రియుడు. వరసిద్ధి వల్ల వేయి చేతులు కావాలని దత్తాత్రేయుని నుండి వరం కోరుకున్నాడు, పొందాడు. కానీ, ఇక్కడ స్త్రీలకు కావలసిన సహస్ర బాహువులు వరసిద్ధి కోసం కాదు, పరసిద్ధి కోసం.
ఇంతటి ప్రత్యేకతలు కలిగిన మిథోపోయి నిర్మాణ పద్ధతిని అనుసరించిన స్త్రీ వాద కవయిత్రులు ఎందరో ఉన్నారు. పురాణేతిహాసాలపై కవులకూ, కవయిత్రులకూ విశ్వాసం ఉన్నా లేకపోయినా, సామాన్య ప్రజలకు ఇతిహాసాల పట్ల ఎనలేని గౌరవ ప్రపత్తులు ఉంటాయి. ఈ మైథాలజీకి సంబంధించి పాత్రలు, సన్నివేశాలు, ప్రతీకల పట్ల పాఠకుల హృదయాల్లో కొన్ని భావచిత్రాలు పదిలంగా, పవిత్రంగా ఉంటాయి. ఆధునిక జీవితాన్ని కవిత్వంలో ఆవిష్కరిస్తూ, వాటిని ప్రస్తావించినపుడు పాఠకుల్లోని భావచిత్రాలు స్పందిస్తాయి. గులాబీ రేకుల్లా విచ్చుకుంటాయి. కవితల పట్ల పాఠకులకు ఆసక్తి పెరుగుతుంది, విషయం చిరకాలం గుర్తుండడానికి అవకాశముంటుంది. ఈ అవకాశం వల్ల కవిత్వం పాఠకుల హృదయాల్లోకి నేరుగా ప్రవేశిస్తుంది. పాఠకుల సంఖ్యను పెంచుతుంది.
ఏది ఏమైనప్పటికీ ఆకాశంలోనూ, సమాజంలోనూ సగ భాగం స్త్రీలే కాబట్టి, వారికి ఇవ్వవలసిన, దక్కవలసిన హక్కులు, స్వేచ్ఛలు వంటి ఏ రంగమైనా వారికి దక్కవలసిందే. అప్పుడే సమాజం సమానమవుతుంది, లేకపోతే కుసమాజం అవుతుంది. అది సమ సమాజానికి మంచిది కాదనేది స్త్రీ వాదుల కవిత్వంలోని తాత్విక భావన.
ఆధార గ్రంథాలు
1. యుగయుగాల్లో భారతీయ మహిళ పుట. 240-241
2. కొండేపూడి నిర్మల సాహిత్యం పరిశీలన పుట. 42-43
3. ఇస్లాం స్త్రీలు పుట. 117-118
4. మహిళా జీవన సమస్యలు పుట. 2
5. మహిళా మార్గం పుట. 15
6. సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ పుట. 71
7. గమనం పుట. 76
8. వామనుడి మూడోపాదం పుట. 19-20
9. అభిమతం పుట. 43
10. కాలాన్ని జయిస్తూ నేను పుట. 10
11. సావిత్రి పుట. 27
12. నీలిమేఘాలు పుట. 129
13. నిషిద్దాక్షరి పుట. 1