రాణి సంయుక్త – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

12 వ శతాబ్దంలో రాఠోడ్‌ వంశీయుడైన జయచంద్రుడు కనౌజ (కాన్య కుబ్జ) రాజ్యంను, చవ్హాణ వంశోద్ధారకుడైన పృథ్వీరాజు ఢిల్లీ రాజ్యంను పాలించుచున్నారు. ఈ అసమాన్య పరాక్రమవంతులిద్దరిలో సంయుక్త జయచంద్రునకు కూతురు, పృథ్వీరాజునకు భార్య అయింది. కావున ఆ రెండు వంశాలు ఆమె వలన పవిత్రమయ్యాయనుటలో సందేహం లేదు.

జయచంద్రుడికి సంయుక్త ఒక్కతే కూతురవటం వలన జయచంద్రుడు సంయుక్తను ఎక్కువ గారాబంగా పెంచాడు. సంయుక్త స్వాభావికంగానే సద్గుణవతి కాబట్టి పెరిగేకొద్దీ అనేక విద్యలను నేర్చుకుని ఎంతో ఖ్యాతికెక్కింది. ఆమె సద్గుణాలను, లావణ్యమును చూసి ప్రజలందరూ తమ జన్మ సార్థకమైందని తలచి సంతోషిస్తుండేవారు. ఇలా ఈమె కొన్ని రోజులు బాల్యావస్థనందు గడిపి యవ్వనావస్థను దాల్చింది.

ఇలా యుక్తవయస్కురాలైన బిడ్డకు తగిన వరుడు ఎవరా అని జయచంద్రుడు ఆలోచించసాగాడు. సంయుక్త రూపలావణ్యాల కీర్తి అన్ని దిక్కులకు వ్యాపించినందున అనేకమంది రాజపుత్రులు ఆమెను తమకిమ్మని కోరుతూ వర్తమానాలు పంపారు. ఢిల్లీ పతియైన పృథ్వీరాజు ఆమె రూపగుణాలను విని ఆమెను ఎలా అయినా చేపట్టాలని నిశ్చయించుకున్నాడు. సంయుక్త కూడా అనేకమార్లు పృథ్వీరాజు పరాక్రమాలను విని రూపము చూసి ఉన్నందున అతనినే వరించెదనని మనసులో నిశ్చయించుకుంది. జయచంద్రుడు తన కూతురుకి తగిన వరుడు దొరకాలని స్వయంవరం చేయాలని నిశ్చయించుకుని సకల దిక్కుల రాజులకూ వర్తమానాలు పంపాడు. జయచంద్రుడు పరాక్రమవంతుడగుట వలన ఇతర మాండలిక రాజులందరూ ఆయన పిలిచిన రోజుకు వచ్చి కనోజ నగరమునలంకరించారు. పృథ్వీరాజు మాత్రం జయచంద్రునితోగల పూర్వ వైరం వలన ఆ ఉత్సవానికి రాలేదు. అందుకు జయచంద్రుడు చాలా కోపగించుకుని అతనితోగల వైరం వలన, పృథ్వీరాజు యొక్క ప్రతిమను ఒక దానిని చేయించి, ఆ ప్రతిమను ద్వారపాలకుని స్థానంలో ఉంచి తన పగ సాధించాలనుకున్నాడు. యజ్ఞము విధి ప్రకారం జరిగిన పిదప స్వయంవరోత్సవం ప్రారంభమైంది. అప్పుడనేక దేశాధీశులు ఒక చోట ఆనందంగా కూడినందున కనౌజ పట్టణం ఎంతో అందంగా కనిపిస్తోంది / కనిపించింది.

రాజాజ్ఞ ప్రకారం మంత్రులు మండపమును అలంకరించి రాజుల నందరినీ వారివారికి తగు స్థానాలలో కూర్చుండపెట్టారు. ఆ తర్వాత సంయుక్త చేతుల్లో పుష్పమాలను ధరించి సఖీసహితంగా ఆ మండపానికి వచ్చింది. రాజకన్య సభకు రాగానే రాజపుత్రులందరి చూపులు ఆమె వైపునకే మరలాయి. ప్రతి భూపతి కూడా ఆమె తనని వరించాలని కోరుకుంటున్నాడు. సంయుక్త గంభీర దృష్టితో రాజలోక మంతటిని ఒక్కసారి కలయజూసింది. తనకి ఇష్టుడైన పృథ్వీరాజు అక్కడికి రాలేదని, ఆయనను పరిహసించుటకు ఆయన ప్రతిమనొకదానిని చేసి ద్వారమునందు ఉంచారని ఆమెకు అంతకు పూర్వమే తెలిసింది. అందువలన ఆ బాల ఒక గడియవరకే ఆలోచించి, తుదకు దృఢనిశ్చయురాలై, తిన్నగా నడిచి ఢిల్లీశ్వర ప్రతిమను సమీపించి ఆ మూర్తి కంఠంనందు పుష్పహారాన్ని వేసింది. దానిని చూసినంతనే సభ అంతటా ఒకటే కల్లోలమయింది. జయచంద్రుడు ఈ అవమానాన్ని సహించలేక కోపావేశపరవశుడై ”దుష్టురాలగు దీనిని కారాగృహమునందు ఉంచండ”ని ఆజ్ఞాపించాడు. అంతట రాజులందరు నిరాశచెంది తమ తమ నగరాలకు వెళ్ళారు. ఇదే ఈ దేశంనందు జరిగిన చివరి స్వయంవరం.

ఈ సంగతంతా విని పృథ్వీరాజు పరమానంద భరితుడయ్యాడు. జయచంద్రుడు తనకు చేసిన అవమానం, సంయుక్త తనయందు కనబరచిన ప్రేమ కలిసి తనను త్వరపెట్టగా పృథ్వీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్రకు వెళ్ళాడు. ఇలా ఆయన శూరులైన యోధులతో కనోజ పట్టణం సమీపంలో విడిది చేసాడు. అక్కడున్న కాలంలోనే ఒక రాత్రి చాలా రహస్యంగా పృథ్వీరాజు సంయుక్తను కలిసి గాంధర్వ రీతిలో ఆమెను వరించాడు.

వీరి వివాహ వార్త ఒకరిద్దరు దాసీలకు తప్ప ఇతరులకు ఎంత మాత్రం తెలియదు. పృథ్వీరాజు వచ్చి తన గ్రామం బైట విడిది చేయటం విని అతనిని పట్టి తెమ్మని జయచంద్రుడు మూడు వేల సైన్యాన్ని పంపాడు. కహర కంఠీరుడనే వానిని ముందు పెట్టుకుని శత్రుసైన్యాలు తమవైపుకు రావటం చూసి పృథ్వీరాజు కూడా వారితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఆ రెండు సైన్యాలు ఒకదానితో ఒకటి ఘోరంగా పోరాడసాగాయి. అంతలో పృథ్వీరాజు సేనానియైన ఆతతాయికిని, జయచంద్రుని సైన్యాధిపతియైన కహరకంఠీరుడికి ద్వంద్వ యుద్ధం ప్రాప్తించింది. ఆ శూరులిద్దరూ సింహనాదాలు చేస్తూ ఒకరితో ఒరు పంతం మాటలు పలుకుతూ ఒకరినొకరు నొప్పించుకొనుచున్నారు. కొంత సేపటికి భటులయొక్క, గుర్రాల యొక్క, ఏనుగుల యొక్క దేహాల నిండా కారుతున్న రక్తం ప్రవాహమై పారసాగింది. ఆ సమయంలో కహరకంఠుని రోషావేశం అధికమవడంతో అతడు తన రథం దిగి ఆతతాయిని తన ఖడ్గానికి బలిచ్చి పృథ్వీరాజు యొక్క కంఠాన్ని తెగవేయడానికి ఉరికాడు. కహరకంఠుని శౌర్యమునకు ఓడిపోయి పృథ్వీరాజు బలగాలు చెదిరి పారిపోసాగాయి. ఆ సమయంలో ఆకస్మికంగా ఒక శౌర్యనిధి అక్కడికొచ్చి పృథ్వీరాజు కంఠంపై పడనున్న ఖడ్గాన్ని ముక్కలు చేసి అతనిని కాపాడింది. ఈ పరాక్రమవంతుడెవరో ఒక రాజపుత్రుడని చదువరులు భ్రమపడగలరు. అలా తన సాహసంతో పృథ్వీరాజును కాపాడినది అడని పత్ని, జయచంద్రుని కూతురు ఐన సంయుక్తే. ఆమె తన భర్తను కలిసి అతనితో వెళ్ళాలని ఎంతో ప్రయాసతో కారాగృహం దాటి సరైన సమయానికి ఆ ప్రదేశానికి వచ్చింది. తను ఏనాడూ సంగ్రామం చూడక పోయినా ఆమె జంకకుండా సమయ స్ఫూర్తి కలిగినదైనందున తాను కూడా యుద్ధం చేసి తన భర్త ప్రాణాలు కాపాడింది.

సంయుక్త వచ్చిన తర్వాత పృథ్వీరాజు బలగాలు మళ్ళీ చేరుకుని జయచంద్రుని సేనలను ఓడించాయి. తదనంతరం పృథ్వీరాజు భార్యాసమేతంగా ఢిల్లీ నగరానికి వెళ్ళాడు. ఈ దంపతులిద్దరూ కొంతకాలం వరకు పరస్పర అనురాగం కలిగినవారై ప్రజలను తమ బిడ్డల లాగే పాలిస్తుండేవారు.

ఇక్కడ జయచంద్రుడు, పృథ్వీరాజు తన సైన్యాన్ని ఓడించి, తన కూతుర్ని తీసుకుపోవటం వలన బాధాతప్త హృదయుడై పగతీర్చుకునే సమయం కోసం వేచి ఉన్నాడు. ఇలా ఈ దేశపు రాజులలో అన్యోన్య ద్వేషాలు కలిగి ఉన్న సమయంలో ‘శాహ బుద్దీ మహమ్మద్‌ గోరీ’ అను మహమ్మదీయుడు హిందూదేశంపై దండెత్తి వచ్చాడు. వాడిక్కడికొచ్చి దేశమంతా నాశనం చేయసాగాడు. అనేక దేవాలయాలను పడగొట్టి, మునిజనులను అన్యాయంగా చంపి, స్త్రీల పాతివ్రత్యాలను చెరిచి వారిని తన దాసులను చేసుకుని, మహా కూర్రత్వాన్ని చూపసాగాడు. వాని పాదం సోకిన చోటల్లా నాశనమవుతోంది. కావున అతనిని ఓడించి పతివ్రతల పాతివ్రత్యంను, మఠమందిరాలను కాపాడాలని తలంచి పృథ్వీరాజు గోరీని శిక్షించడానికి వెళ్ళాడు. అప్పుడు జయచంద్రుడొక్కడు తప్ప ఇతర రాజులందరూ అతనికి తోడ్పడ్డారు. కోపమే ప్రధానంగా ఉన్న జయచంద్రుడు దేశక్షేమం కోసం పృథ్వీరాజునకు తోడ్పడకపోయినా, స్వదేశీయుల దురదృష్టం ఇంకా ముదరనందున అప్పటికి మాత్రం గోరీకి సహాయకుడు కాలేదు.

పృథ్వీరాజు మహా శౌర్యంతో దిలావడేయను ఎడారినందు గోరీ సైన్యాలను పలుమార్లు ఓడించాడు. పృథ్వీరాజు పరాక్రమానికి ఓర్వలేక గోరీ బహుకష్టంతో పలయానమయ్యాడు. పృథ్వీరాజు విజయానందంతో ఇతర సామంతులతో పాటు తన నగరాన్ని ప్రవేశించాడు.

పృథ్వీరాజుకు కలిగిన జయం వలన జయచంద్రుడు అధిక బాధను పొందినందున అతని మనసెప్పుడూ పృథ్వీరాజు చెరుపునే కోరుకుంటుండేది. అందువలన అతడు ఎలాంటి నీచోపాయం వలనైనా పృథ్వీరాజునకు చెరుపు చేయాలని నిశ్చయించుకున్నాడు. దాన్తో అతడు తన దూతను పంపి పారిపోతున్న గోరీని మరల మనదేశానికి తీసుకొచ్చాడు. ఇలా రప్పించి ఆ కుత్సితుడు తను అతనికి తోడ్పడటమే కాక, ఇతర రాజులను అనేకమందిని నీకు తోడు తెస్తానని నమ్మబలికి అతనిని మరల పృథ్వీరాజుపైకి యుద్ధానికి ఉరికొల్పాడు.

జయచంద్రుని సహాయం పొందడంతో గొప్ప ధైర్యంతో గోరీ మరల ఢిల్లీ నగరంపై దండెత్తాడు. జయచంద్రుడు తానన్న ప్రకారం ఇతర రాజులు అనేకమందిని తన వెంట తీసుకుని ఆ తుష్కరునికి దోహదపడ్డాడు. ఇలా చేసి పృథ్వీరాజుకు ఇక విజయం దొరకదని ఆ దీర్ఘక్రోధి సంతోషపడుతున్నాడు. దుర్జనులు తమ కార్యం ఈడేరటం వలన దేశమునకంతటికి నష్టం కలుగుతుందని తెలిసినా వెనకడుగు వేయరు కదా?

కాలిందీ నదీ తీరం నందు జయచంద్రుడు తన సేనలతో దిగి ఒక రోజు తన శిబిరంలో కూర్చుని రాబోవు స్థితిని తలచుకుని సంతోషిస్తున్నాడు. ఇంతలో ఒక సేవకుడు వచ్చి తమ వైరి సైన్యంలో నుండి ఒక రాయబారి తమతో మాట్లాడాలని వచ్చాడని చెప్పాడు. దానికి అతడు పరిచారకుడితో ”నువ్వవతలే ఉండి అతనిని నావద్దకి పంపమ”ని చెప్పి తాను తన ఖడ్గం చేతబట్టుకుని కూర్చున్నాడు.

అంతలో కొంతసేపటికి ఒక యువకుడక్కడికి వచ్చి జయచంద్రుని పాదాల వద్ద కెళ్ళాడు. ఆ వచ్చిన యోధుడు పురుషుడు కాదు, మన కథానాయిక సంయుక్తే. కావున జయచంద్రుడు తన కుమార్తెను గుర్తించి నీవేమి కోరుతున్నావని అడిగినంతనే ఆమె ఇలా అంది. ”నాయనా! నేను తమ అనుజ్ఞ పొంది మన దేశానికి శత్రువైన గోరీని చంపాలని వచ్చాను. ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకుని వెళ్తే తప్పక విజయం కలుగుతుంది.” జయచంద్రుడు కూతురు మాటలు విని కొంతసేపు ఏమీ తోచక ఉండిపోయి తర్వాత ”ఓసి స్వేచ్ఛాచారిణీ, ముందు జరగబోవు ప్రజా క్షేమమంతకూ నువ్వే కదా కారణం. పొమ్ము, నీవిక్కడికి వచ్చి నా క్రోధాన్ని పెంచావే కాని వేరే లాభం లేదు” అని కోపంతో అన్నాడు. దానికి సంయుక్త వినయంతో ”ఓ నాయనా, మీరు మీ జన్మభూమివైపు కొంచెం దృష్టి సారించండి. నిరాశ్రయులైన అనేకమంది స్త్రీల మానములను కాపాడండి. మనమెంతో భక్తితో కొలిచే విగ్రహాల నాశనానికి

తోడ్పడకండి. మన స్వాతంత్ర సుఖమును చెరపడానికి ప్రయత్నించిన యెడల తర్వాత గొప్ప దుఃఖం కలుగుతుంది” అని విన్నవించుకుంది. ఇంతలో జయచంద్రుడు రోషంతో కన్నెర్రబడగా ”నోరు మూసుకుని వెళ్ళు. నావద్ద నీవంటి దుష్ట స్త్రీలు మాటలాడతగరు” అని ధిక్కరించాడు. ”అలా అయితే నా ప్రార్థనంతా వృథానేనా నాయనా?” అని ఆ కాంత రౌద్రరూపం వహించి తండ్రి వంక చూసి ఇలా అంది. ”పూర్వులార్జించిన సత్కీర్తిని నాశనం చేసి మీ దుష్కీర్తిని శాశ్వత పరచుకోడానికి ముందే నీ కుమార్తెనైన నన్ను ఈ అపకీర్తి వినకుండ ఎందుకు చంపేయలేదు? నీవు నా తండ్రివి కాబట్టి నేనింతగా చెప్పవచ్చాను. కాని నీ అభిప్రాయం తెలిసిన మీదట స్వదేశ ద్రోహి కూతురనిపించుకుని బ్రతుకుటకంటె చావుట మేలని తోస్తోంది.”

అడవి సింహంలా ఎదిరించి మాట్లాడుతున్న కూతురుకి ఏమీ చెప్పలేక జయచంద్రుడు మెల్లగా అవతలికెళ్ళి గుర్రమెక్కి ఆ మ్లేచ్ఛసైన్యంలోనికి వెళ్ళాడు. ఇక్కడ సంయుక్త తండ్రి లోపలకు వస్తాడని కొంతసేపు ఎదురు చూసి అతడు వచ్చే జాడ కనబడక నిరాశతో తిరిగి తన పతి చెంతకెళ్ళింది. ఈ సారి తమవైపు తక్కువ సైన్యము, పగవారి వైపున ఎక్కువ సైన్యం ఉంది కాబట్టి తనకు అపజయమే కలుగుతుందనే పృథ్వీరాజు ఆ సంగతిని సంయుక్తకు చెప్పాడు. ఆ దంపతులిద్దరూ కొంచెం కూడా ధైర్యం విడవక ఒకరికొకరు తగు నీతులను చెప్పుకుంటూ ఉత్సాహవంతులై ఉన్నారు. వారిద్దరి ఆలోచన ప్రకారం మంచిదని తోచగా ఆమె ఢిల్లీకి ప్రయాణమైంది. వెళ్ళే సమయంలో ఆమె భర్తకి నమస్కరించి ”ప్రాణేశ్వరా! తమరు క్షత్రియులు కనుక మీ శస్త్రాస్త్రములను కాపాడుకుని యుద్ధానికి సిద్ధమవండి. క్షత్రియులు తమ దేశం యొక్క, వంశం యొక్క ప్రతిష్ఠల కోసం ప్రాణాలు విడిచినా అది మృతి అనబడదు. మనిషి జన్మించినందుకు ఫలంతా సత్క ృత్యాలను చేసి సత్కీర్తిని పొంది అమరుడు కావాలి. తమకు జయం కలిగినచో మరల మనమిరువురం సుఖమనుభవిస్తాము. లేనిపక్షంలో నేనూ తమతో స్వర్గసుఖాన్ని అనుభవించడానికి త్వరలోనే వస్తాను” అని ధీరోక్తులు పలికింది. అందుకు పృథ్వీరాజు తన భార్యను కౌగలించుకుని ”సతీమణీ! నా దేహంలో ప్రాణమున్నంత వరకు నేను శత్రువుకు వెన్నియ్యనని దృఢంగా నమ్ము. నా సైనికులూ కీర్తికావాలనుకునే వారే కనుక వారెప్పుడూ పరాజయం పొంది మరల తమ ముఖం ఇతరులకు చూపించాలనుకోరని నేను నమ్ముతున్నా”నని చెప్పాడు. ఆ వాక్యాలు విని సంయుక్త ”స్వామీ! ఢిల్లీలోని స్త్రీలు తమను తాము రక్షించుకొనుటకు అసమర్థులు. కావున, నేనిపుడు అక్కడికెళ్ళి వారికందరికీ ధైర్యం చెప్తాను. నేనిక్కడే ఉంటే ఆ కాంతలు ఏమీ తోచక ఉంటారు. ఏది ఎట్లైనా మిమ్మల్ని గెలిచి ఆ మ్లేచ్ఛుడు ఢిల్లీకి వచ్చినా, వానికి రాజపుత్ర స్త్రీ ఒక్కతి అయినా జీవంతో దొరకదు” అని ఆమె ఢిల్లీకి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె గొప్ప నియమంతో పరమేశ్వరుని తన భర్తకు విజయమునిమ్మని ప్రార్థన చేయుచున్నది. ఆమె ఉపదేశము విని ఆ నగరమందలి యువతులందరూ ఆమె వలెనే ఢిల్లీశ్వరునకు విజయం కలగాలని పరమేశ్వరుని అనేక విధాల వేడుకొనుచున్నారు.

తుదకు ఒక దినమున ఆ సైన్యములు రెండూ ఒకదానితో ఒకటి తలపడి, ఆ ఉభయ సైన్యాలలోని వీరులు తమ తమ యుద్ధ కౌశలాన్ని మించి ఘోరంగా పోరాడసాగారు. వారు అలా పోరాడుతుండటంతో ఆకాశమంతా ధూళి కమ్మి, సూర్యుని మరుగు పరచింది. కొంత సేపటికి ఆ దూళి తగ్గి రక్తం నదులుగా పారడం మొదలైంది. పీనుగులు/ శవాలు గుట్టలుగా పడ్డాయి. ఇలాంటి రణరంగంనందు పృథ్వీరాజుకు అపజయం కలిగింది. కాని అతని సైనికుల్లో శత్రువుకు శరణుజొచ్చినవాడు కాని, యుద్ధభూమినుండి పారిపోయినవాడు కాని కనబడలేదు. పృథ్వీరాజు కూడా ఆ యుద్ధంలోనే మరణించాడని కొందరు చెప్తారు. గోరీ విజయుడై పృథ్వీరాజును చెరబట్టి కనుగుడ్లు తీసేసి, అతని పాదాలకు ఎంతో బరువైన లోహపు బేడీలను వేసి కారాగృహంలో ఉంచాడని, ఈ సంగతంతా విని పృథ్వీరాజు యొక్క మంత్రి, అతని చరిత్రలేఖకుడు, మహాకవి అయిన చాందభట్టు గోరీ ఆస్థానానికి వెళ్ళి కొన్ని దినాలు అక్కడ ఉండి అతని కృపకు పాత్రుడై పృథ్వీరాజును చూడటానికి అనుమతి తీసుకున్నాడని, అలా కారాగృహంకు వెళ్ళి పృథ్వీరాజును పలకరించగా అతడు కళ్ళు లేకపోయినా మాటను గుర్తించి ఆ భట్టును కౌగలించుకున్నాడని, అక్కడ వారిద్దరూ ఒక యుక్తివలన ఆ తురష్కుని చంపాలని నిశ్చయించుకున్నారని, ఆపై చాందుభట్టు గోరీ వద్దకు వెళ్ళి మాటల్లో పృథ్వీరాజు యొక బాణనైపుణ్యాన్ని వర్ణిస్తూ అతడిపుడు కన్నులు లేకున్నా శబ్దమును బట్టి సూటిగా బాణం వేయగలడని చెప్పగా, గోరీ ఆ విచిత్రాన్ని చూడటానికై ఒక సభ చేసి ఆ సభకు పృథ్వీరాజును పిలిపించి అతని విల్లు బాణాలిచ్చి చమత్కారమేమైనా చూపించమని ఆజ్ఞాపించాడని, ఆ మాట సూచిని బట్టి పృథ్వీరాజు అతనిపై బాణం వేయగా అతడు (గోరీ) మృతి చెందాడని, అనంతరం చాందుభట్టు, పృథ్వీరాజు ఇద్దరూ తురకల చేతికి చిక్కక ఆ సభయందే ఒకరినొకరు పొడుచుకుని ప్రాణాలు విడిచారని మరికొందరు చెప్తారు. పైన చెప్పబడిన శరసంధాన మహోత్సవమంతా మనదేశంలోనే జరిగిందని ఒకరు, తురక దేశాన జరిగిందని మరొకరు/ ఇంకొకరు వక్కాణిస్తారు. వీటిలో ఏది నిజమో మనం చెప్పలేము.

గోరీకి జయము కలిగి, వాడు ఢిల్లీకి వచ్చుచున్నాడన్న వార్త వినగానే పట్టణంలోని స్త్రీలందరితో సంయుక్త అగ్ని ప్రవేశం చేసింది. గోరీ ఢిల్లీకి వచ్చి చూసేటప్పటికి గ్రామమంతా భస్మరాశులు అవిచ్ఛిన్నంగా కనిపించాయి.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.