ప్రియమైన సత్యా, ప్రశాంతి పచ్చిపసుపు కొమ్ము చాల చక్కగా హృదయానికి హత్తుకునేలా, చేయితిరిగిన రచయిత్రిలా రాసేస్తోంది… తనకు నా అభినందనలు. పోతే ఉమా సమీక్షలు కూడ నన్ను బాగా ఆకట్టుకుంటున్నాయి సత్యా! ఏ పుస్తకాన్నైనా తను లోతుగా, పరిశీలనతో చదివే తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఉమాకి అభినందనలు. – వి. ప్రతిమ, నాయుడుపేట.
*****
డియర్ ఎడిటర్,
నాకు భూమిక పత్రిక అందులోని కథలు చాలా యిష్టం. మహామనిషీ – మహాశ్వేత గారితో తన అనుభవాలు వివరించిన సత్యవతి గారికి కృతజ్ఞతలు. అణగారిన వర్గాల కోసం పని చేసిన మహాశ్వేత యిక లేరు అనే విషయాన్ని చాల సున్నితంగా తెల్పడం బాగుంది. ‘ఇంకా పెళ్ళి కావాలా?’ కథ, వారిద్దరి మధ్య సంభాషణ బాగుంది. – అనుపమ, హైదరాబాద్.
*****
ఎడిటర్ గారికి,
భూమిక పత్రికని మొదటి పేజి నుండి చివరి పేజీ వరకు చదువుతాను. పి. ప్రశాంతి గారి కాలమ్ పచ్చిపసుపుకొమ్ము చాలా బావుంటోంది. ఇంతకు ముందెప్పుడూ ఆవిడ రచనలు చదివిన గుర్తులేదు. కానీ చాలా కాలంగా రచనానుభవం వున్న రచయిత్రిలా అనిపిస్తోంది తన కాలమ్ చదువుతుంటే. ముఖ్యంగా తను వర్ణించే గ్రామీణ వాతావరణం, అమ్మమ్మ, తాతయ్యలతో అనుబంధం, ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను, తన జీవితానుభవాలను మిళితం చేస్తూ, సమకాలీన పరిస్థితులకు అన్వయిస్తూ రాయడం సామాన్యమైన విషయం కాదు. చాలా అవలీలగా రాస్తూన్నట్టుగా ఉంది. వారి రచనా శైలి సున్నితంగా హృద్యంగా ఉండి, మంచి కథలు రాయగలరని అనిపిస్తోంది. వారు మరింత ఎక్కువగా రాయాలని కోరుకుంటూ, ఆవిడ సహసంపాదకులు కూడా కాబట్టి, సంపాదకులిద్దరికీ అభినందనలు తెలుపుతున్నాను.
– కమలారాణి, అనంతపురం