జెండాల పోరాటం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

ఎన్నికల వెంటనే బొగ్గు గనుల యజమానులు రామ్‌గఢ్‌ పార్టీ లెజిస్లేటర్‌ మంజూర్‌ హుసేన్‌ను (ఇంకా వారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు) హత్య చేయించారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల క్రితమే సిర్‌కాలో ఎటెక్‌ యూనియన్‌ వాళ్ళకు, మా యూనియన్‌ (ఇంటక్‌) కి పోట్లాట జరిగింది. నా మీద ఎటక్‌ నేతలు హత్యా ప్రయత్నం చేశారు. బిందేశ్వరి దూబే గారు బర్డ్‌ కంపెనీ రెస్ట్‌ హౌస్‌లో ఉన్నారు. బర్డ్‌ సౌందా, సిరకా గనులలో ఎటక్‌ ద్వారా సమ్మె జరుగుతోంది. రెండు యూనియన్ల మధ్య గొడవ పెరిగిపోతూనే ఉంది. రైలీగఢాలో వాళ్ళకన్నా మా యూనియన్‌కు మంచి పేరు ఉంది. అక్కడ హత్యాకాండలో చిక్కుకున్న కూలీలను విడిపించడానికి, యాజమాన్యం వారిపై ఒత్తిడి తీసుకురావాలని హజారీబాద్‌ నుండి సిర్‌కా వచ్చాను.

జె.పి.సింహ్‌ ఒకప్పుడు మా యూనియన్‌లో ఉండేవారు. రైలీగఢాలో శ్రామికుల పోరాటంలో మాకు ఎంతో సహాయపడ్డారు. తర్వాత ఎటక్‌కి వెళ్ళిపోయారు. లపంగా కోల్‌ మైన్స్‌లో ముగ్గురు కార్మికుల హత్య కేసులో ఆయన కూడా నేరస్థుడే. సిర్‌కాలో ఎటక్‌ ఇన్‌ఫ్లుయన్స్‌ ఉండాలని ఆయన్ని పంపించారు. కానీ రైలీగఢా శ్రామికులు ఆయనను వద్దన్నారు. రెస్ట్‌ హౌస్‌ నుంచి నా అంబాసిడర్‌ కారులో నేనే డ్రైవ్‌ చేసుకుంటూ బయలుదేరాను. జె.పి.సింహ్‌, ఆయన ముఠావాళ్ళు బల్లాలు-గొడ్డళ్ళతో నాపై దాడి చేశారు. కారు అద్దాలు విరిగిపోయాయి. నా దగ్గర ఉన్న డ్రైవర్‌ యువకుడు. ఒకవేళ అతను స్టీరింగ్‌ దగ్గర ఉండి ఉంటే నేను బతికి బట్టకట్టేదాన్ని కాదు. నేను ధైర్యంగా దాడి చేసిన వాళ్ళ వైపే కారుని తిప్పాను. వాళ్ళు లాఠీలు విసురుతూనే ఉన్నారు. నేను కారుని వేగంగా నడుపుతూ మెయిన్‌ రోడ్డు పైకి వెళ్ళిపోయాను. ఎటక్‌ వాళ్ళ ఊరేగింపు నా దగ్గరిదాకా రాలేదు. నేను బతికిపోయాను.

దూబేగారికి దాడి విషయం తెలిసింది. నేను బయటపడ్డాక పోలీసులు వచ్చారు. ఇంతలో రైలీగఢా శ్రామికులలో పెద్ద దుమారం రేగింది. వాళ్ళు సిర్‌కాపై దాడి చేయాలని సంసిద్ధులయ్యారు. ఆ రోజు నేను ఎంతో కష్టంమీద వారిని ఆపాను. సిర్‌కా శ్రామికులలో రెండు చీలికలు వచ్చాయి. ఇంత జరిగినా నేను మర్నాడు వెనక్కు తిరిగి వచ్చి గనుల వద్దకు వెళ్ళాను. శ్రామికులకు ఎంతో ధైర్యం చెప్పాను. చుట్టుపక్కల ఉన్న కోల్‌-ఫీల్డ్స్‌ నుంచి శ్రామికులు సిర్‌కాకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ శ్రామికులకు, యాజామాన్యానికి మధ్య పోరాటం కాకుండా శ్రామికులకు, శ్రామికులకు మధ్య వైరం పెరిగింది. అంటే జెండాల పోరాటం అన్నమాట. ఎవరి జెండా

ఉండాలి? ఇంటక్‌దా లేక ఎటక్‌దా? శ్రామికుల మధ్య ఇంటక్‌ సాంప్రదాయవాదులైన నేతలలాగా నా పేరు లేదు. వాళ్ళందరూ నన్ను సాహసవంతురాలైన మహిళా నేత అనుకునేవారు. నేను ఇంటక్‌కి వెళ్ళినా ప్రభుత్వంతో పోరాడి శ్రామికుల పక్షాన తీర్పు వచ్చేలా చేయగలనని వాళ్ళకు నా మీద ఎంతో నమ్మకం. శ్రామికులకు చెడు ఏదైనా జరిగితే నేను వాళ్ళ పక్షానే నిలబడతానని, నాకు పదవీ వ్యామోహం లేదని వాళ్ళకి ఎంతో నమ్మకం. అందువలన నలువైపుల నుండి నా పైన జరిగిన దాడిని నిందించారు, వ్యతిరేకించారు. సిర్‌కాలో గొడవలు జరిగాయి. బుల్లెట్లు దూసుకువెళ్ళాయి. అందులో ఇద్దరు కూలీలు మరణించారు. ముఖ్యమంత్రి కేదార్‌ పాండేను బోనులో నిలబెట్టారు. నేను ఇందిరా గాంధీ గారి దగ్గరకు వెళ్ళాను. ఆవిడ ఈ గొడవల గురించి అడిగారు. నేను జవాబు చెప్పాను. – ”అక్కడ పోరాటం మువ్వన్నెల జెండాకి, ఎర్ర జెండాకి మధ్య జరిగింది. పోలీసులు దాడి చేసిన వారిమీద గుళ్ళ వర్షం కురిపించారు. ఇది నిజమే. సి.పీ.ఐ. నేతల రికార్డు తెలిసిందేగా. కోల్‌-ఫీల్డ్స్‌లో శత్రువులను మట్టుబెడతారు. డకరాలో, బీరమోలో మా వాళ్ళను హత్య చేశారు. సిర్‌కాలో మా డిఫెన్స్‌ గట్టిగా ఉందని వాళ్ళను చంపేశారు. మేమయితే దాడి చేయలేదు. పోలీసులు దాడి చేసినవాళ్ళని కొట్టారు. ఇందులో పాట్నాలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతారు? ఆయనని అడిగి అయితే వాళ్ళు ఆ పని చేయలేదుగా?”

ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేదార్‌ పాండేకి వ్యతిరేకంగా ఒక వాతావరణం తయారు చేయబడింది. దీనికి సూత్రధారులు నారాయణ మిశ్రా, ఇంకా బీహార్‌లోని కొందరు నేతలు.

సీతకు వనవాసం ఇవ్వాలని ఆజ్ఞ

నేను రాయగఢ్‌ విధానసభకి టికెట్‌ తీసుకోవడం కోసం రాయగఢ్‌ వెళ్ళాను. అక్కడ ఉమాశంకర్‌ దీక్షిత్‌ కోడలు షీలా దీక్షిత్‌ ఇంటర్వ్యూ తీసుకుంది. టికెట్‌ ఇస్తాం అని మూడోరోజు ఫైనల్‌ చేశారు. నామినేషన్‌ ఇవ్వడానికి ఇంకా రెండు రోజుల టైమ్‌

ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఆ రోజుల్లో శ్రామికుల నివాస స్థలాలలోనే ఉండేదాన్ని. అక్కడే భోజనం చేసేదాన్ని. రాకపోకలకు నా కారులో పెట్రోలు వాళ్ళే పోయించేవారు. షీలాగారు నన్ను అడిగారు. ”ఎట్లా వెళ్తావు రమణికా?” అని. ”మీరే చెప్పండి ఎట్లా వెళ్ళాలి. ట్రెయిన్‌ అయితే ఒక రోజు పడుతుంది” అన్నాను. ఢిల్లీ-కోడ్‌రమా-కలకత్తాలకి మధ్యలో అప్పుడు కేవలం సాంద్యహ్‌ ఎక్స్‌ప్రెస్‌, కాల్కా మెయిల్‌ నడిచేవి.

షీలాగారు అన్నారు -”ప్లె˜ౖట్‌లో వెళ్ళు”

నేనన్నాను- ”ఫ్లైట్‌ ఫేర్‌ ఎక్కువ. అంత నా దగ్గర లేదు. ట్రెయిన్‌లో వెళ్ళగలను”

ఆవిడ అడిగారు – ”సెక్యూరిటీ మనీ ఎక్కడ నుండి తెస్తావు?”

నేనన్నాను – ”చందాలు వసూలు చేస్తాను”

ఆవిడ అడిగారు – ”చందాలు వసూలు చేసేంత టైమ్‌ ఎక్కడుంది? ఎన్నికల్లో ఎట్లా పోటీ చేస్తావు?”

నేనన్నాను – ”శ్రామికులే చందాలు వసూలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ గనుల యజమానులకు విరుద్ధమే. వాళ్ళనైతే అడుగను”

ఆవిడ అడిగారు – ”నీవు ఏ పార్టీ నుంచి వచ్చావు?”

నేనన్నాను – ”సోషలిస్టు పార్టీ నుంచి”

ఆ రోజుల్లో సోషలిస్ట్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలలో నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళేవారిని అందరూ ఎంతో గౌరవించేవారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళ భ్రష్టాచారాలని, ద్వంద్వనీతిని గుర్తించారు. పార్టీని మెరుగుపరచాలని ఆవిడ ఉద్దేశ్యం. అందువలన వేరే పార్టీలలో నుండి వచ్చిన వారి ఇమేజ్‌తో పడిపోతున్న పార్టీని నిలబెట్టాలని ఆవిడ కోరిక. అంతగా పార్టీ మెరుగుపడక పోయినా భ్రష్టాచారాలు కొంత తగ్గుతాయి. కానీ స్థితి అంతకన్నా హీనంగా అయింది. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారి చరిత్ర కూడా కాంగ్రెస్‌ వాళ్ళ చరిత్రలాగానే తయారయింది. కాంగ్రెస్‌లో మోసం, ద్వేషం పరిధిని దాటిపోయాయి.

షీలాగారు ఉమాదీక్షిత్‌ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయనకి స్థితిగతుల గురించి వివరించింది. ఆయన నన్ను పిలిచారు. ఎంతో ఆప్యాయంగా కూర్చోమని చెప్పారు. – ”షీలా నీ ఫ్లైట్‌కి, సెక్యూరిటీకి డబ్బు ఇస్తుంది. ఎన్నికలకు బీహార్‌ పార్టీ ధనం సమకూరుస్తుంది. కొంత శ్రామిక వర్గం నుంచి వసూలు చేయి”.

ఆయన షీలాగారిని సంభోదిస్తూ అన్నారు. – ”చూడు! మన పార్టీలో ఇటువంటి సమర్పిత కార్యకర్తలు కూడా ఉన్నారు”

నేను వెనకే వచ్చాను. ఎన్నికల బరిలోకి దిగాను. ఈ మధ్యలో బర్‌దా – కాదాలో శ్రామికులు ఎన్‌.సి.డి.సి. వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సభలో సత్యేంద్ర నారాయణ సింహ్‌తో నాకు పరిచయం కలిగింది.

వారు అన్నారు – ”చూడండి రమణిక గారూ! మీ క్యాండిడేట్‌ శ్రీ కృష్ణ సింహ్‌ ఎన్నికలలో నిల్చుంటున్నారు. మీరు మీ నామినేషన్‌ని వాపసు తీసుకోండి”

– ”నేనెందుకు నా నామినేషన్‌ తిరిగి తీసుకోవాలి. మా పార్టీవాళ్ళు నన్ను నిల్చోబెట్టారు. మీ కాండిడేట్‌ని నేను మా యూనియన్‌ అధ్యక్ష పదవినుండి తొలగించాను. ఇది మీకు తెలిసిన విషయమే.”

– ”మీరు ఔరంగాబాద్‌ లాఠీని చూశారుగా”

– ”మీరు కేదలా కోల్స్‌-మైన్స్‌ మట్టిగడ్డల్ని చూడలేదా?” (కేదలా గనులలో ఠేకేదార్లతో జరిగిన పోరాటంలో ఔరంగాబాద్‌లోని ముగ్గురు ఠేకేదార్లు చంపబడ్డారు. 36 మంది గూండాలు బాగుపడ్డారు.)

– ”నువ్వు చాలా ధైర్యస్థురాలివి”.

– ”క్షత్రాణి (క్షత్రియ స్త్రీ) పట్టుదల క్షత్రీ (క్షత్రియ పురుషుడు) కంటే బలంగా ఉంటుంది సత్యేంద్ర బాబూ!” నేను ముఖం మీద కొట్టినట్లు జవాబిచ్చాను.

ఎన్నికల వాతావరణం వేడిగా ఉంది. రెండువైపులా ప్రచారం జోరుగా నడుస్తోంది. ఎర్రజెండా, తిరంగా జెండాల మధ్య పోరాటం. కాండిడేట్లు ఒకరితో ఒకరం మాట్లాడుకునేవాళ్ళం కాదు. నేను, మంజూర్‌ హుసేన్‌ భార్య మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఇంతలో లలిత్‌ నారాయణ్‌ మిశ్రా విదేశాల నుంచి వచ్చేశారు. వీరేంద్ర పాండే నాకు వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలని ఢిల్లీలో ఉన్నారు. లలిత్‌ బాబు , కేదార్‌ పాండేకి విరోధి. పాండేగారి రికమండేషన్‌ వలనే నాకు టికెట్‌ దొరికింది.

ఆయన తిన్నగా ఇందిరాగాంధీ గారి దగ్గరకు వెళ్ళారు. – ‘రాయ్‌గఢ్‌లో మీ కాండిడేట్‌ని సి.పి.ఐ.కు వ్యతిరేకంగా నిలబెట్టి పెద్ద తప్పు చేశారు.”

చంద్రశేఖర్‌ సింహ్‌ తర్వాత వీరు బీహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఎన్నికలలో నిలబడకూడదన్న ఆజ్ఞను మోసుకువచ్చారు. రాయ్‌గఢ్‌ ధర్మశాలలో కాంగ్రెస్‌ పార్టీ మెంబర్లతో నిండిన సభలో చంద్రశేఖర్‌ అన్నారు. – ”సీతని వనవాసానికి పంపించాలని ఇచ్చిన ఆజ్ఞను మీకు తెలియపరచాలని నన్ను పంపించారు. నాకు ఇష్టంలేదు. కానీ ఇది పై నుండి వచ్చిన ఆజ్ఞ. శిరసావహించాలి తప్పదు. ఇవాళ ఆవిడ కాగితం మీద సంతకం చేసి ఎన్నికల నుండి తొలగిపోవాలి. మీరు ఈ కాగితాలని ప్రజలలో పంచండి. ఆవిడ నాతోపాటు ఈ రోజే పాట్నా వచ్చేస్తారు.”

కార్యకర్తలందరూ ఉత్తేజితులయ్యారు. కొంతమంది హాలు నుంచి బయటకు వెళ్ళిపోయారు. నేను కాన్సిలేషన్‌ పేపర్‌ మీద సంతకం చేశాను. ఈ పేపరును ముద్రించి అందరికీ పంచారు. మా కార్యకర్తలు పార్టీనుండి వెళ్ళిపోయారు. ఎలక్షన్ల పేపర్లు ఇంతకు ముందే ముద్రింపబడ్డాయి. అందులోంచి నా పేరు తీసేయడానికి కుదరలేదు. అందుకని కొందరు నాకు ఓట్లు వేశారు.

దీని తర్వాత మేము బిందేశ్వరీ దూబే గారి ద్వారా కేదలా గనులను నేషనలైజ్‌ చేయాలని నోటీసు ఇప్పించాము. గనులు నేషనలైజ్‌ అయిపోయాయి. కానీ బీహార్‌లో లలిత్‌ బాబు, కేదార్‌ పాండేలకు శత్రువులు ఎక్కువయ్యారు. కేదార్‌ పాండేని తొలగించాలన్న ఉద్దేశ్యంతో లోలోపల కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళే జయప్రకాష్‌ నారాయణ్‌ గారి ఉద్యమానికి మద్దతు ఇవ్వసాగారు. ఒకరకంగా ఇందిరాగాంధీని ఓడించడానికి ఇది ఒక వ్యూహం. లలిత్‌ నారాయణ్‌ మిశ్రా తాను ప్రధానమంత్రి కావాలని కలలు కనేవారు. ఆయన సంజయ్‌ గాంధీని తన గుప్పెట్లో పెట్టుకుని ఇందిరాగాంధీని ఓడించాలని అనుకున్నారు. మరోపక్క ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి స్థితిలో 1973లో అన్ని నాన్‌-కోకింగ్‌ గనులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది.

ఇక దీని తర్వాత మొదలయింది మా దీర్ఘకాల యుద్ధం. శ్రామికులు మళ్ళీ పనిలో ప్రవేశించడానికి పోరాటం చేయాల్సి వచ్చింది.

కార్మికుల ఉద్యోగాలు – ఒక యుద్ధం

మా ఎదురుగుండా ఒక పెద్ద యుద్ధం… కార్మికుల

ఉద్యోగాలు నిలపడం. ఇదివరకు పనిచేసే వారి ఉద్యోగాలను నిలపాలి. నలువైపులా గనులు నేషనలైజ్‌ అయ్యాక తెరవబడ్డాయి. కానీ కేదలా – ఝార్ఖండ్‌ గనులు మూతబడ్డాయి. ఠేకేదార్లు రిసీవర్‌ రికార్డులను ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అవి జాలీవి. ఎన్‌.సి.డి.సి.లోని కొందరు అధికారులు జాలీ యూనియన్ల ద్వారా తమ వారి పేర్లను జాబితాలో ఎక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. యూనియన్‌ కార్యకర్తలు తమవారి జాబితాలు, కోర్టు ఎస్‌.డి.ఓ., పోలీసుల జాబితా… అంటే జాబితాలే… జాబితాలు. ఉద్యోగాల కోసం కార్మికులు గుంపులు గుంపులుగా పరేజా బంగళాకి చేరడం మొదలుపెట్టారు. కేదలాలో పాత ఉద్యోగుల పేర్లను తీసివేసి కొత్తవాళ్ళ పేర్లను రాయడం మొదలుపెట్టారు. ఎ.డి.నంది లాంటి నేతలు గ్రామస్థులను ప్రేరేపించి లోపల, బయట గొడవలు లేపడం మొదలుపెట్టారు. ఈయన ఇదివరకు ఠేకేదార్ల పక్షాన సమ్మెను విరమింపచేయడానికి రాంచీ నుంచి కూలీలను తీసుకువచ్చి కేదలా, ఝరవా ఠేకేదార్లకు సప్లై చేసేవారు.

ఒకసారి ఎ.డి.నంది, మరి కొందరు నన్ను చుట్టుముట్టారు. స్థానికంగా జరిగే పోరాటాలకు నేనే నాంది పలికాను. కొంతమంది యువకులు ఒక జాబితా పైన నన్ను సంతకం చేయమని అడిగారు. ”వీళ్ళకే ఉద్యోగాలు దొరకాలి” అని వాళ్ళన్నారు.

”చుట్టుముట్టండి, లేదా చంపండి. ఈ గనులలో ప్రారంభంలో పని చేసినవారికి ఉద్యోగాలు రావాల్సిందే. కొత్త ఉద్యోగాలు రావాలని మీ కోసం పోరాటం చేయవచ్చు. కానీ మాజీ ఉద్యోగులను బయటివాళ్ళు అంటూ పీడించడం నేను ఒప్పుకోను. ఎవరు పనిచేస్తే వాళ్ళకి ఉద్యోగం దొరకాలి. ఇదే మా పోరాటం” నేను కఠినంగా అన్నాను.

నేను పోరాటం నేర్పానని గ్రామస్థులకు తెలుసు. ఈ ప్రదేశంలో స్థానీయులకు పోరాటం నేర్పించాను. ‘ధరతీ పుత్ర్‌ కో కామ్‌’ (ధరతీ పుత్రుడికి పని) అని మా యూనియన్‌ నినాదం. బేరమా క్షేత్రం, వాహరీ మరియు కథరా బొగ్గు గనులలో జరిగిన సోషలిస్టు పార్టీ సభలలో నేను ‘ధరతీ పుత్ర్‌ కో కామ్‌’ అని నినాదం చేశాను. ఈ పోరాటంలో ఖుద్‌గడ్డా, గోమియా, సాడమ్‌లో దాదాపు 300 మంది అరెస్టయ్యారు. ఆ రోజుల్లో ఎన్‌.సి.డి.సి.లో మెహతర్‌ (పాకీవాళ్ళు) స్వీపర్లని ఉద్యోగాలనుంచి తొలగించేవారు. డోమ్‌ (పాకీ కులం) వాళ్ళని పిలిపించేవారు. నేను ఈ తొలగింపునకు విరుద్ధంగా పోరాటం మొదలుపెట్టాను. అందువల్ల హజారీబాద్‌ జిల్లాలోని గ్రామస్థులు ప్రతిసారీ నాతో కలిసేవారు. శ్రామిక వర్గం ‘గ్రామస్థుల రోజ్‌గార్‌ ఉద్యమం’లో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో తోడ్పడేది.

గ్రామస్థులు కలగచేసుకోవడంతో ఆ రోజు చుట్టుముట్టిన వాళ్ళందరూ చెల్లాచెదురయ్యారు. నేను వచ్చాను. మర్నాడు ఆఫీసు బయట ఈ లిస్టుని కస్టోడియన్‌ బలవంతంగా స్వీకరిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి.

నిజానికి నేను ఎప్పుడూ నా పేరు, ప్రతిష్ఠల కోసం, అందరి మన్ననల కోసం, అవతలివాళ్ళు ఎంత బలంగా ఉన్నా వారి ముందు తలవంచలేదు. నేను నా నిర్ణయాన్ని ఏనాడూ మార్చుకోలేదు. చాయ్‌బాస్తా, సింహభూమ్‌, పురలియా, ముండా, ఉరాంవ్‌, బిలాస్‌పూర్‌, ఒరిస్సాలలోని ఆదివాసీలు గయకు చెందిన నోనియా, పాలాముకికి చెందిన కేవట్‌, కరోములీ, మాంఝీ అందరూ దళితులే. వీళ్ళందరికీ కనాకష్టంగా నాలుగు మెతుకులు దొరికేవి. వీళ్ళందరినీ ‘బయటివాళ్ళు’ అని ముద్ర వేసి తొలగించాలని కుట్రలు పన్నే

వాళ్ళు. మేం వీటన్నింటికీ ఎదురు నిలిచాం. ఆ గ్రామస్థుల రికార్డులను ఇవ్వకుండా వాళ్ళ ఠేకేదార్లు మాయం చేసేవారు. వాళ్ళందరికీ మేం పనులు ఇప్పించాం. మా నినాదం – ”టోకరీ కా నా కోయీ స్థాయీ ఘర్‌ నా కోయీ దేశ్‌” (తట్టకి స్థిరమైన ఇల్లు లేదు, దేశమూ లేదు), ”జహా కామ్‌ వహీ ధామ్‌” (ఎక్కడ పనో అదే పవిత్ర స్థలం), ”జహా నౌకరీ వహీ టోకరీ” (ఉద్యోగం ఎక్కడో గంప అక్కడే), ”టోకరీ బాహరీ భీతరీ నహీ హోతీ” (గంప బయటిది లోపలిది అంటూ ఉండదు). మరి దాన్ని మోసే బీద శ్రామికులు బయటి వాళ్ళు, లోపలివాళ్ళు ఎట్లా అవుతారు? మేం బయటినుండి వచ్చిన ఠేకేదార్లు, సిబ్బందిని బయటివాళ్ళు అని వ్యతిరేకించేవాళ్ళం కానీ శ్రామికుల పట్ల ఇట్లా ప్రవర్తించేవాళ్ళం కాదు. ఎందుకంటే వీళ్ళు స్థానికులను దోపిడీ చేసేవాళ్ళు కారు. నేషనలైజ్‌ అయ్యాక చాలామంది శ్రామికులకు పని దొరకలేదు. శ్రామికులు వాళ్ళ కోసం నకిలీ పేపర్లను రాయించేవారు. రోజ్‌గార్‌ (ఉపాధి) ఆవశ్యకత సంఘర్షణని స్వార్థంగా మార్చివేసింది. అయినా మా దగ్గర కొంతమంది కూలీల పరిచయ పత్రాలు ఉన్నాయి. మేం సమ్మె చేసి వాటిని సంపాదించాము. వాళ్ళ ఫోటోలను మార్చడం మొదలుపెట్టారు. గనులలో పనిచేయడం ఎప్పుడో మానేసిన మనోజ్‌ దేశ్‌ముఖ్‌ మళ్ళీ వచ్చి లంచాలు తీసుకుని కొత్త కార్డులపైన సంతకాలు చేయించు కోసాగాడు. అన్నివైపులా లూప్‌హోల్స్‌ ఉండేవి. బహాతీల (బయటినుండి వచ్చినవాళ్ళు) కోసం పెద్ద పోరాటం జరిగింది. ఎన్నో వివాదాలు తలయెత్తాయి.

కేదలాలో రిక్విజేషన్‌ మొదలయింది. పన్నెండు, పదమూడు వేలమందికి బదులు ఎనిమిది వేల మందికి మాత్రమే కేదలాలో

ఉద్యోగాలు దొరికాయి. దాదాపు రెండువేల మంది మహిళా కూలీలను తీసివేశారు. ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు. ఎంతోమంది మాజీ కూలీలు ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎదురుచూశారు. నిజానికి రాత్రింబవళ్ళు కష్టపడ్డవారికి ఉద్యోగాలు పోయాయి. ఎప్పుడూ గనుల ముఖాలు చూడనివాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ట్రక్‌ లోడర్లకు ఉద్యోగాలు పోవడంతో అందరూ నిరాశా నిస్పృహలకు గురయ్యారు. శ్రామికులు దీర్ఘ పోరాటం వలన అలసిపోయారు. అసలు వీళ్ళందరినీ ఈ దు:ఖం నుండి ఎట్లా బయటపడేయాలి అన్న చింత మాకు ఎక్కువయింది. కేసు గెలిచి కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించాము. కొంతమందికి ఆర్బిట్రేషన్‌లో ఉద్యోగాలు దొరికాయి. ఈ మధ్యలో పుట్టగొడుగుల్లా ఎన్నో యూనియన్లు వెలిశాయి. ఈ విషయం గురించి ఒక పెద్ద నవల రాయవచ్చు. ఒరిస్సా, బిలాస్‌పూర్‌, పురూలియా, సంథాల్‌, పర్‌గణా, పలామూ, రాంచీ, గయ, కోడరమా, ధన్‌బాద్‌, గిరీడీహ్‌, చతరా, దుమ్‌కాల నుండి కూలీలు ఇక్కడికి వచ్చి పనిచేసేవారు. కానీ వీళ్ళ పేర్లమీద ముంగేరీలు ఉద్యోగాలలో చేరసాగారు. రాత్రికి రాత్రి శుక్లా, మిశ్రా, తివారీ, సింహ్‌, కోల్‌కటర్‌, మున్షీ (గుమస్తా)లుగా మారిపోయారు. జడ్జి రిసీవర్‌గా తన కొడుకు పేరు రాయమని నన్ను తన ఛాంబర్‌లోకి పిలిచి అడిగారు. నేను ఈ విధంగా చేయలేనని చెబుతూ ఆయనని అడిగాను. – ”మర

నిజంగా పోరాటం చేసిన శ్రామికులంతా ఏం కావాలి? నేను మీరు చెప్పినట్లుగా చేయలేను”.

1973 సంవత్సరం తర్వాత శ్రామికులకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించడానికి సుదీర్ఘమైన పోరాటం చేశాం. దాదాపు 16, 17 వేల మంది కార్మికులకి కుజు – అర్‌గడా క్షేత్రంలో కూలీ పని ఇప్పించాము. ఇంటక్‌లో నేను అపీల్‌ కమిటీ మెంబర్‌ని. అందువలన కార్మికుల జాబితాలను ఇంటక్‌కి అనుసంధానమైన కొలియారీ మజ్దూర్‌ సంఘ్‌ వైపు నుండి పంపించేదాన్ని. అధికారులు కాక ఇంటక్‌, ఎటక్‌ నుండి ఇద్దరు చొప్పున సభ్యులు అపీల్‌ బోర్డులో

ఉండేవాళ్ళు.

కొంతమంది రిసీవర్లు, ఠేకేదార్ల ద్వారా తయారు చేయబడ్డ నకిలీ జాబితాల వలన, కొంత ప్రభుత్వ అధికారుల ప్రవర్తన వలన కేదలాలో బహాతీ ప్రారంభం కాలేదు. కానీ దీంతోపాటు నేషనలైజ్‌ అయిన గనులలో స్క్రీనింగ్‌ అయి బహాతీ ప్రారంభమయింది. మిగిలిన గనులలో తవ్వకాలు మొదలయ్యాయి. మేం అక్కడ జాబితాలు చూశాము. శ్రామికులకు పనులు దొరికాయి. అయినా కేదలా మూసివేసే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు వెనుక ముందులాడసాగారు. కేదలాలో బహాతీ కోసం 20 వేల అప్లికేషన్లు వచ్చాయి. కానీ అసలు అక్కడ ఉన్నవాళ్ళు పది, పన్నెండు వేలమందే. ప్రభుత్వం నాలుగైదు వేలకన్నా ఎక్కువ మందిని బహాతీగా తీసుకోవడంలేదు. మేనేజ్‌మెంట్‌ వాళ్ళు కొత్త కొత్త షరతులు పెట్టడం మొదలుపెట్టారు. రికార్డు లభ్యం కాకపోవడం వలన వాళ్ళు అన్ని జాబితాలు జాలీవే అని అన్నారు. డైరెక్టర్‌ స్థాయికి పై స్థాయిలో మీటింగులు జరిగాయి. అందులో ఇంటక్‌ తరపున బిందేశ్వరి దూబే, నేను, దామోదర్‌ పాండే ఉండేవాళ్ళం. ఎటక్‌ వైపు నుండి చతురానంద్‌ మిశ్రా, రవీంద్ర కుమార్‌, షఫీక్‌ ఖాన్‌ ఉండేవారు. మేనేజ్‌మెంట్‌ వైపు నుండి ఛైర్మన్‌ బి.యల్‌.బడేరాతో పాటు డైరెక్టర్‌ (పర్సనల్‌) శ్రీ మూర్తి, జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) ఎ.డి.సింహ్‌, డైరెక్టర్‌ శ్రీ వర్మ కూర్చునేవాళ్ళు. కేదలా క్షేత్రంలో మా ఒక్క యూనియన్‌ ‘కోయలా శ్రామిక్‌ సంఘటన్‌’ మాత్రమే ఉండేది. నేషనలైజ్‌ కాకముందు శ్రమ విభాగం వెరిఫికేషన్‌ చేసి అనుమతి ఇచ్చింది. ఈ యూనియన్‌ సభ్యత్వం, రికార్డు మా యూనియన్‌ ద్వారా కేంద్రీయ శ్రమాయుక్త దగ్గర ఫిర్యాదులు, వివాదాల సమయంలో ఇవ్వబడిన శ్రామికుల జాబితాలు, తవ్వకాల విభాగం ద్వారా మా యూనియన్‌ ఇచ్చిన ఫిర్యాదు, ఎంక్వైరీ సమయంలో గనులలో జప్తు చేయబడిన అటెండెన్స్‌ రిజిస్టర్‌, మా యూనియన్ల ద్వారా పోరాటం జరిపి శ్రామికులకు ఇవ్వబడ్డ పరిచయ పత్రాలు.. అన్నింటినీ దస్తావేజులు అనుకొని కార్మికుల నియుక్తి ప్రమాణంగా, నిజమైన రికార్డుగా భావించారు. ఆ ప్రదేశంలో గూండాలను ఎదుర్కొనే శక్తి మా యూనియన్‌కి తప్ప మరో యూనియన్‌కి లేదు. దీంతోపాటు ఒక అపీల్‌ ఫారమ్‌ని నింపమని, కార్మికులకు ఇవ్వమని అన్నారు. అందులో పేరు, అడ్రస్‌ కాకుండా ఏ ఠేకేదార్‌ దగ్గర ఉండేవాడు, ఎప్పటినుండి పనిలో ఉన్నాడు.. వంటి వివరాలు కూడా ఇవ్వాలి. దీనికోసం ఆధారాలు చూపించాలి. ఉత్తర కేదలా కార్మికులు పోరాడి పోరాడి అలసిపోయారు. వాళ్ళకి బహాతీ మొదలవ్వాలని నేను ఎన్నో ఉద్యమాలు నడిపాను. సమ్మెలు చేశాను. బిందేశ్వరీ దూబే గారి చేత కూడా చెప్పించాము. ఇంతలో చుట్టుపక్కల నడుస్తున్న గనులలోని కార్మికులు కేదలా కార్మికుల కోసం చందా వసూలు చేసి వాళ్ళకు సహాయం చేశారు.

రైలీగఢా హత్యా కాండ తర్వాత మర్డర్‌ కేసు నడుస్తున్న దాదాపు 37 మందిని పనులలోకి తీసుకోలేదు. మూసివేసినప్పటి నుండి ధన్‌బాద్‌ ట్రిబ్యునల్‌ కోర్టులో వివాదం నడిచింది. నాకు నలువైపులా శత్రువులే. దామోదర్‌ పాండే గారు నాకు అడుగడుగునా ఏదో ఒక ఆటంకం కలిగిస్తూనే ఉండేవారు. బిందేశ్వరీ దూబే నాకు సహాయం చేశారు కానీ తర్వాత ఆయన మా ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి తను నాయకుడై తమాషా చూశారు.

నేషనలైజ్‌ అయ్యాక నా సలహా తీసుకుని దూబేగారు శ్రామికుల నేత అయిన ఉమావచన్‌ తివారీని రొహతాస్‌ నుండి పిలిపించి యూనియన్‌ నాకు సహాయం చేయాలని చెప్పారు. కానీ ఆయన కార్మికులను నాకు వ్యతిరేకంగా ప్రేరేపించారు. ఆయన ఠేకేదార్ల పక్షం వహించారు. దూబేగారికి చెప్పి ఎంతో కష్టంగా ఆయనను యూనియన్‌లో నుండి తొలగించడం వలన ఆయన నా మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. కేదార్‌ పాండే గారి తోడల్లుడు జగదీష్‌ చౌబే (ఈయనని మేం యూనియన్‌కి అధ్యక్షుడిగా చేశాం)తో కలిసి ఆయన నన్ను బాధపెట్టడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఆయన లయియో ఠేకేదార్‌తో పాటు ఎస్‌.డి.శర్మతో చేతులు కలిపాడు. వాళ్ళిద్దరూ కలిసి నకిలీ కార్మికులని బహాతీ చేయించాలని కుట్ర పన్నడం మొదలుపెట్టారు. అందువలన గొడవలు మొదలయ్యాయి. జగదీష్‌ను మేం ముందే యూనియన్‌ అధ్యక్ష పదవి నుండి తొలగించాము. ఆయన ఠేకేదార్లతో చేతులు కలిపి కేదలాని బి.ఎం.డి.సి.(బీహార్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కి ఇచ్చేయాలని ఉద్యమం నడిపారు. ఠేకేదార్లు కూడా బి.ఎం.డి.సి.ని తీసుకు రావాలనుకున్నారు. మేం దీనికి వ్యతిరేకం. ఎందుకంటే ఠేకేదార్ల ద్వారా గనులను నడపాలన్న ఉద్దేశ్యం బి.ఎం.డి.సి.కి ఉండేది. అక్కడ శ్రామికుల దోపిడీ జరగడం తథ్యం. ఇంతలో కేదార్‌ పాండే గారు బిందేశ్వరి దూబే గారి సలహాతో మా యూనియన్‌ ఇంటక్‌ను కొలియారీ మజ్దూర్‌ సంఘ్‌లో విలీనం చేయాలని ప్రస్తావన పెట్టారు. మేం మా యూనియన్‌ను మూసేసి కొలియారీ మజ్దూర్‌ సంఘ్‌లో విలీనమయ్యాం.

(ఇంకావుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

One Response to జెండాల పోరాటం – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో