క. కందువమాటల సామెత | లందముగా గూర్చి చెప్ప నవి తెనుగునకుం
బొందై రుచియై వీనుల | విందై మరి కానిపించు విబుధులకెల్లన్.
తఱిగొండ వెంగమాంబ వసిష్ఠ గోత్రికుడను, నందవరీక బ్రాహ్మణుడును అయిన కృష్ణయ్య అనునతని పుత్రిక. ఈమె నివాస స్థానము కడప మండలంలోని తఱిగొండ అని ఊహించబడుతున్నది. వెంగమాంగ తెలుగునందు విద్వాంసురాలని ఆమెచే రచింపబడిన గ్రంథములే వేనోళ్ళ తెలుపుచున్నవి. వేంకటాచల మహాత్మ్యమునందు ఈమె ఆశ్వాసాదిని వేసిన శ్లోకముల వలన సంస్కృతమునందు కూడా ఈమెకు కొంత పరిచయం కలదని అనిపిస్తుంది. ఈమె బాల వితంతువు. వేదాంత గ్రంథ పఠనము వలనను, గ్రంథ రచనల వలనను కడప మండలంలోనే కాక తెలుగుదేశమునందంతటా వెంగమ్మగారి కీర్తి విస్తరించింది. కావున జనులు ఆమెయందు అధిక విశ్వాసం కలిగి దేశాచార ప్రకారం ఆమెపైన అనేక కథలను చెప్పుకోసాగారు. అవి అన్నీ ఇందులో ఉదహరించడం అవసరం లేదు కనుక ఒకటి రెండు మాత్రం ఇక్కడ ఉదహరించెదను.
వెంగమాంబ గ్రంథరచన చేస్తూ ఏకాంతంగా ఒక గదిలో కూర్చునేది. అక్కడినుండి ఆమె ఇవతలికి రాగానే ఆమె ముఖమునందు ఆనందము, దేహం నందు సుగంధము కనిపించేవట. దీనివలన ఆమె వదినలు ఆమెయందు దోషము కలదని తలచి, దానిని కనిపెట్టడానికి ఆ గది ద్వారము వద్ద కాచి ఉన్నారట. అంతట కొంతసేపటికి లోపల ఎవరో పురుషుడు నవ్వినట్టు, నృత్యము చేసినట్టు వారికి వినబడెనట. ఆపై వారు తమ భర్తలను పిలిచి తాము విన్న సంగతులను తెలిపారట. అలా అందరూ గుమిగూడి వెంగమ్మను తలుపు తెరవమనగా ఆమె నిర్భయంగా తలుపు తీసెనట. అప్పడు వారు ఆ గదినంతా శోధించి పురుషుడు ఎవ్వరూ కనబడక ఆమెనడగగా శ్రీకృష్ణుడు తప్ప అన్యపురుషుడేల వచ్చునని అన్నదట. ఇవి అన్నీ ఆమె భక్తి విశేషాలను తెలిపే కథలే కానీ వేరుకాదు.
వెంగమాంబ తన జీవితకాలమునందంతా శిరోజాలను తీయలేదని చెప్తారు. ఆమె చాలా రోజులు శిరోజాలను
ఉంచుకున్నందున ఆమె అన్నదమ్ములు బహిష్కరించెదమని బెదిరించారు. వారు అంతటితో ఊరుకోకుండా శంకరస్వాముల వారు రాగా ఆ లోకగురువునకు ఈ సంగతి విన్నవించారు. అంతట ఆ స్వాములవారు వెంకమ్మను పిలిచి నీ శిరోజములు తీయించుకోమని చెప్పారు. అందుకామె కొంచెం కూడా జంకక పరమేశ్వరుడిచ్చినవి మనుషులెందుకు తీయాలనీ, అందువలన పరపురుషుని స్పర్శ దోషము కలుగునని, ఒకసారి తీసినవి మరల రాని యెడల అది పరమేశ్వరునికి సమ్మతమని, అలాగాక మరుదినముననే మరల వెంట్రుకలు మొలుచుటచే అది పరమేశ్వరునకు అసమ్మతమని స్పష్టంగా తెలుస్తోందని వాదించింది. అంతటితో ఊరుకోక గురువు ఆజ్ఞాపించగా బంధువులు ఆమెను పట్టుకుని బలవంతంగా కేశఖండనం చేయించారని, ఆపై ఆమె నదికి పోయి స్నానం చేయగా వెంటనే పూర్వం వలెనే కేశములు మొలిచెనని, అది చూసిన గురువులు, బంధువులు మిక్కిలి ఆశ్చర్యపడి ఆ తర్వాత ఆమె జోలికెళ్ళడం మానారని కొందరు చెప్తారు. ఏది ఎలా ఉన్నా వెంగమాంబ గారికి వితంతు స్త్రీలకు కేశవపనము చేయుడం ఇష్టం లేదనటం వాస్తవం.
వెంగమాంబ గారికి ఇష్టంలేని ఈ పని ఏ స్త్రీలకు సమ్మతం కాజాలదు. మన దేశంనందు పరంపరగా వచ్చిన ఈ ఆచారమును కాదనలేక కొందరు యువతులు సమ్మతించినట్లు కనబడినా, వారి అంతరంగంలో అపరిమిత దు:ఖం కలిగే ఉంటుంది. వారి వారి భర్తల మరణ సమయంకన్నా కేశ విసర్జన కాలాలయందే వారు ఎక్కువ దు:ఖితులగుచున్నారు. వపనకర్మ వలన తమకు, తమ భర్తకు నిజంగా పుణ్యలోకాలు దొరుకునని వారికి నమ్మకమున్న యెడల వారు ఆ సమయములందు దు:ఖించుటకు బదులు అమిత సంతోషాన్ని పొందవలసిందే. స్త్రీలు పతివిహీనులై. అలంకార రహితలై, మంగళ కార్యాలకు దూరమై మితిమీరిన దు:ఖంలో
ఉండగా సుఖమునందున్న వారి బంధువులు మంచి మాటలతో వారి శోకాగ్నిని ఆర్పుటకు బదులు పరమేశ్వరుడిచ్చిన కిరీటమనదగ్గ కేశకలాపమును నేలపాలు చేసి ఆ దు:ఖాగ్నిలో నెయ్యిపోసి ప్రజ్వలింపచేస్తారు. ఇది ఎంతటి అన్యాయము. ఈ దురాచారము సహగమనముకంటే తక్కువ కూృరమైనదైనా కొందరు యువతులకిది సహగమనముకన్నా గొప్ప భయంకరమైనదని అనిపిస్తుంది. వారిలా బాధపడి నలుగురిలో అవమానకరమైన ఇలాంటి బ్రతుకు బ్రతుకుటకన్నా సహగమనము చేసి ఒక గడియ దు:ఖంతో దేహం విడుచుట నూరురెట్లు ఎక్కువ సులభమని తలచుచున్నారు. వారు సహగమనము లేకపోవడంతో గొప్ప బాధపడి దానిని మాన్పినవారినే క్రూరులని నిందిస్తున్నారు. సాధారణంగా పురుషులకైనా దుస్సహమైన అవమానంతో బ్రతుకుట కంటే మరణమే సుఖదాయముగా
ఉండునని అనిపించటం సహజం. ముందు తమకు అవమానం కలుగునని తెలిసి ఆత్మహత్య చేసుకున్న పురుషులెందరో ఉన్నారు. ఇందువలన కూడా అవమానం కంటే మరణమే మేలని జనులకు అనిపిస్తుందని మనకు తెలుస్తోంది. కావున దేశబాంధవులందరూ మన దేశంలోని స్త్రీలకు కలుగుతున్న ఈ బాధాకరమైన అవమానమును తొలగించడానికి ప్రయత్నింతురు గాక!
ఈమె బాగా వృద్ధురాలై కాలధర్మము పొందింది. 1840వ సంవత్సరం వరకు ఈమె జీవించి ఉన్నట్లు తెలుస్తోంది. బాలవితంతువు అయినందున ఈమె భర్త నామగోత్రాలు ఎక్కడా కనబడవు. వెంగమాంబచే రచించబడిన గ్రంథాలలో రాజయో గసారం అను వేదాంతపరమైన ద్విపాద కావ్యము, వెంకటాచల మహత్యము మాత్రమే ముద్రించడి ఉన్నాయి. వీటిలో రాజయోగసారం నందలి తృతీయ స్కంధాంతర్గతమైన కపిలదేవహుతి సంవాదమును తీసుకుని మిక్కిలి రసవంతంగాను, సులభంగాను, ద్విపదకావ్యంగాను రచించబడింది. దీనిలో సామాన్య జనానికి కూడా సులభంగా తెలిసేలా వేదాంతం వివరించబడింది. వేంకటాచల మహాత్మ్యము నందు విష్ణుమూర్తి పద్మావతిని వివాహమాడిన కథ చాలా విచిత్రంగా చెప్పబడింది. మిగిలిన గ్రంథములేవీ ముద్రింపబడ నందున వాటిని గురించి ఏమీ వ్రాయడానికి లేదు. ”ఈమె కవిత్వంనందు అల్పదోషములు అక్కడక్కడా కనిపించుచున్నా మొత్తం మీద కవనం అతి కఠినంకాక మృదుమధుర రచనను కలిగి ఉన్నద”ని కవి చరిత్రమునందు రాయ బహదూరు కందుకూరి వీరేశలింగం గారు ఈమె కవిత్వమును పొగిడారు. ఇలాంటి వారిచే పొగడ్తను పొందదగిన విద్యయు, కవిత్వశక్తియు కలిగి ఉన్నా ఈమె ఇసుమంత కూడా గర్వం లేకుండా ఎంతో వినయవతిగా ఉండెనని రాజయోగసారము లోని ఈ క్రింది ద్విపదలు వెల్లడించుచున్నవి.
ద్వి. వినరయ్య కవులార విద్వాంసులార
వినరయ్య మీరెల్ల విమలాత్ములార
ఘనయతిప్రాస సంగతులు నేనెరుగ
వరుస నాక్షేపింపవలదు సత్కృపను
ఈమె రచించిన గ్రంథములు తఱికొండ నృసింహస్వామికి అంకితం చేయబడినవి. ఈమె శృంగార రసాధి దేవతయగు కృష్ణుని భక్తురాలయినను, ఆమె తన గ్రంథములనందు ఎక్కడా శృంగార వాక్యములను జొప్పింప ఇష్టపడకపోయి ఉండొచ్చు. అందువలన ఆమె కృష్ణుని ఇలా స్తుతించింది.
శా. శృంగార ఆకృతితోడ వచ్చి పదముల్ శృంకార సారంబుతో
డం గూఢంబుగ జెప్పు నీవనినట్లే జెప్పనేనన్న వన్ ముంగోపంబున జూచి లేచి యటనే మ్రొక్కంగ మన్నించి త
చ్ఛృంగారోక్తులు తానె పల్కికొను నా శ్రీృకృష్ణు సేవించెదన్.
ఇందువలన తన గ్రంథములయందు శృంగార వాక్యములను ఇముడ్చుటకు తనకెంత మాత్రం ఇష్టం లేకుండగా సందర్భానుసారంగా ఆ గ్రంథములలో అక్కడక్కడా వచ్చిన శృంగార పద్యములను శ్రీకృష్ణుడే రచించెనని ఆమె తెల్పుతోంది. ఈ విద్యావతి కవనరీతిని తెలుపుటకై ముద్రిత గ్రంథంలోని కొన్ని పద్యములు ఇక్కడ ఉదహరించి ఆమె చరితమును ముగిస్తాను.
వేంకటాచల మహత్మ్యము
ఉ. రామనృపాల, హోరతర రావణ శౌర్యవిఫాల, భవ్య సు త్రామ సురార్య యోగిజన తాపసపాల, కృపాలవాల, శ్రీ
భూమి సుతాత్మలోల, పరిపూర్ణ సుకేర్తి విశాల, వానర
స్తోమముతోడవచ్చు మిము జూచి కృతార్థులమైతి మిద్ధరమ్.
చ. విని యది భీతినొందుచు వివేకముతో ద్విజుమోముజూచి యి
ట్లనియెను జారకాంతను మహావిషసర్పమువంటి యెవ్వరై
నను గడతీరినారె నిను నమ్మిన భార్యను వీడి నన్ను బొం
దిన నిహమున్ బరంబు చెడు ధీరతతో జను బ్రాహ్మణోత్తమా!
రాజయోగసారము
ద్వి. సంపద గలిగిన సామర్ధ్యమనుచు
సొంపుమీరిన తుచ్ఛసుఖ మిచ్ఛయించి
కామాంధులై తమ గతి గానలేక
భామల వలలోన బడి లేవలేక
తరగని యీషణత్రయనార్థిలోన
మరిమరి మునుగుచు మమత రెట్టింప
నాలు బిడ్డల కని యర్థంబు గూర్చి
కాలంబు నూరకే గడుపుచునుండి
***
పుట్టుచు గిట్టుచు పొరలుచుండెదరు.
***