అమ్మా! అక్టోబర్ సంచికలో ‘కుటుంబమే కాదంటే..?!’ నన్ను కదిలించింది. అత్యుక్తులు లేకుండా రచయిత్రి పి.ప్రశాంతి వ్రాశారు. వారికీ, మీకూ నా అభినందనలు. మా దూరపు చుట్టాలలో 70 ఏళ్ళ క్రిందట యిటువంటిది జరిగింది. ఆ వ్యక్తి బాధ, ఆ కుటుంబం క్షోభ ఊహించలేను. ఆ వ్యక్తి చిన్న వయసులోనే మరణించడం విన్నాను. ఇది ఆత్మహత్యో, మరొకటో ఆ కర్మ సాక్షికే తెలియాలి…
– వి.ఏ.కె. రంగారావు, చెన్నై.
*****
ఆగస్టు నెల భూమికలో మహామనీషి – మహాశ్వేత వ్యాసం నాకెంతో ప్రేరణ కలిగించింది. ఆమె గొప్ప వ్యక్తిత్వాన్ని,
ఉద్యమశీలతను గురించి తెలుసుకుని గొప్పగా ఫీలయ్యాను. గొప్ప మానవతావాది, కారుణ్యమూర్తి మహాశ్వేత మీద వెలువడిన ప్రతి వ్యాసమూ విలువైన సమాచారాన్ని ఇచ్చింది. – బి.కళాగోపాల్, నిజామాబాద్.
*****
భూమిక ఎడిటర్‌గారికి,
పీడిత జనబాంధవుడు, ప్రజావాది – బొజ్జా తారకం గారి ముఖచిత్రంతో అక్టోబరు భూమిక వెలువడడం చాలా శ్లాఘనీయం. ‘నీలిజెండా’ పేపర్ నడిపిన ఆయన కృషిని గుర్తు చేస్తూ ‘నీలిరంగు’తో భూమిక వెలువడడం కూడా సందర్భోచితంగా వుంది. బాలగోపాల్, బొజ్జాతారకం, కన్నభిరాన్ లాంటి న్యాయవాదులు దళిత, అణగారిన వర్గాల వారి పక్షాన నిలబడినవారు. నిబద్ధతతో పనిచేసేవారిని వరుసగా కోల్పోయాం. తారకం గారికి నివాళినర్పిస్తూ… – సుధాకర్, హైదరాబాద్.
*****