ఆ పొలాల పచ్చని పిలుపు వినిపిస్తోందా? సుజాత బెడదకోట

శాఖా గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివేటపుడు వెనక చివరి పేజీ వరకూ పుస్తకం మిగిలి ఉందా లేదా చెక్‌ చేసుకుని చదవాలని చాలా పుస్తకాలు అసంపూర్ణంగా మిగిలిపోయినా నేను నేర్చుకోని పాఠం. అలా ఏళ్ళ తరబడి అసంపూర్తిగా మిగిలిపోయిన వాటిలో ఈ ”మరల సేద్యానికి” ఒకటి. ఆ నవల కోసం చాలా ఏళ్ళు అన్వేషించినా ఫలితం లేకపోయింది. బెంగుళూరులో ఒక స్నేహితుల ఇంట్లో ”మరళి మణ్ణిగె” అనే కన్నడ ఒరిజినల్‌ కనిపించింది. ఎదురుగా మంచి నీళ్ళున్నా దాహం తీరే వీలులేదన్న మాట. కన్నడం రాదుగా! ఇంగ్లీష్‌ అనువాదం ఉందని తెలిసింది. చదవాలని పీకింది కానీ తెలుగులోకి తిరుమల రామచంద్ర అనువదించారు కాబట్టి అది పూర్తిగా తెలుగులోనే చదవాలని కోరిక. ఇంగ్లీష్‌ వెర్షన్‌ తర్వాత ఆప్షన్‌గా పెట్టుకున్నాను.

చివరికి హైదరాబాద్‌లోనే మిత్రుల సహాయంతో దొరికింది. హమ్మయ్య! వారం రోజుల్లో చదివేశాను. నిజానికి అది వారంలో పూర్తయ్యే ఆషామాషీ నవల కాదు. అది చదివేశాక ఎన్నాళ్ళనుంచో ఉన్న ఖాళీ ఏదో పూడినట్లయి వారం, పది రోజులపాటు ఎవ్వరినీ విసుక్కోకుండా సంతోషంగా

ఉండాలనిపించింది.

నా ఇంటి లైబ్రరీ కోసం ఆ పుస్తకం కోసం ప్రయత్నిస్తుండగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆ పుస్తకాన్ని తిరిగి ప్రచురిస్తోందని తెలిసి చాలా సంతోషం వేసింది. పుస్తకం చేతికి వచ్చాక ”మూడు తరాల కథని, వందేళ్ళ కథని ఇన్ని పాత్రలతో నిత్య జీవితంలోని ఏ ఒక్క సంఘటననీ వదలకుండా ఇంత విస్తారంగా అల్లుకుంటూ, పేనుకుంటూ ఎలా రాశాడీ కారంత్‌?” అని అబ్బురం కలిగింది.

శివరామ కారంత్‌ జ్ఞానపీఠ్‌తో పాటు ఎన్నో అవార్డులు పొందిన రచయితగా కన్నడ సాహిత్య ప్రపంచంలో అగ్రస్థాయి రచయితగా అందరికీ పరిచయమే. 1941లో రాసిన ఈ నవల పేరు కన్నడలో ”మరళి మణ్ణిగె”. అంటే ”తిరిగి మట్టికి” (వ్యవసాయానికి) అని అర్థం. అయితే మట్టికి మరలడమనే మాట తెలుగులో అంత అర్థవంతంగా లేదు కాబట్టి దాన్ని ”మరల సేద్యానికి” అని అనువదించారు తిరుమల రామచంద్ర. నవల రాసిన 36 ఏళ్ళ తర్వాత 1977లో ఇది తెలుగులోకి అనువాదమైంది.

ఒక వందేళ్ళలో సాగిన మూడు తరాల కథ ఇది. ఈ మూడు తరాల జీవితాల్లోని ప్రతి సంఘటననీ, ప్రతి మలుపునీ, ఏ సూక్ష్మాంశాన్నీ కూడా వదలక చిత్రీకరించిన సుదీర్ఘమైన నవల. అయినా ఎంతో ఆసక్తితో చదివించే పుస్తకం కూడా.

దక్షిణ కర్నాటకలో ఉడుపికి సమీపంలో, ఒకవైపు పడమటి కనుమలు, మరోవైపు సముద్రం పరచుకున్న చోట కోడి అనే చిన్న గ్రామం. అక్కడ అందరూ పేదవాళ్ళే. కొద్ది మంది బ్రాహ్మలు, మిగతా కులాల వాళ్ళు ఉంటారు. కథాకాలం 1850 నుంచి మొదలవుతుంది. అంటే పూర్తిగా బ్రిటిష్‌ పాలన సమయం. ఐనా ఆ మారుమూల గ్రామం మీద దాని ప్రభావం ఏమీ కనిపించదు. రోజువారీ జీవితంలో శ్రమించడం, సమద్ర తీరంలో ఉన్న ఆ ఇసుక నేలల్లో వ్యవసాయం చేయడం, పక్క గ్రామాలకు నడిచి వెళ్ళడం, నదిలో పడవైనా వాడక దాటి వెళ్ళడం… ఇదే దినచర్య!

ఇది దాదాపు వందేళ్ళలో నడిచిన ఒక మూడు తరాల కథ. మొదటి తరం వైదిక పురోహితుడు రామైతాళుడితో మొదల వుతుంది. పౌరోహిత్యం చేస్తూనే తనకున్న పొలాన్ని భార్య పారోతి (పార్వతి), వితంతువై పుట్టిల్లు చేరిన చెల్లెలు సరసోతి (సరస్వతి)తో కలిసి సాగుచేసి వ్యవసాయం కూడా ప్రధాన వృత్తిగా జీవిస్తుంటాడు. వరి, అనుములు, ఉలవలు… ఇవే అక్కడ పండేవి. ఇసుక మేటలు వేసిన ఆ పొలాన్ని బాగు చేయడం, చెరువు పూడిక మట్టి పొలాల్లోకి తెచ్చి నింపడం, చెరువు నీళ్ళు తోడి పొలాలకు పెట్టడం వంటి పనులన్నీ ఎక్కువగా సరసోతి, పారోతిలే చేస్తుంటారు. పొదుపుకి, పిసినారి తనానికి మధ్యలో జీవించే రామైతాళుడు పొలాలు, తోటలు కొనడం, డబ్బు మూటలు గోడల్లో దాచడంలో తీరిక లేకుండా ఉంటాడు. ఎదురింటి మరో బ్రాహ్మడు శీనమయ్యరు, రామైతాళుడు ఒకరి ఎదుగుదల చూసి ఒకరు ఓర్చుకోలేరు.

రామైతాళుడు సంతానం కోసం రెండో పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి రోజు వచ్చేదాకా ఇంట్లో ఆడంగులకు కూడా చెప్పడు. కొడుకు లచ్చడు పుట్టాక వాడిని వైదిక విద్యకు పంపాలా వద్దా అనే ఆలోచన!! శీనమయ్యరు కొడుకులు బెంగుళూరులో హోటళ్ళు పెట్టి రెండు చేతులా సంపాదిస్తుంటే మత్సరం పాలై తన కొడుకుని వకీలు చేసి డబ్బు సంపాదించాలని నిశ్చయించుకుని వాడిని కుందాపురం,

ఉడిపిల్లో ఇంగ్లీష్‌ విద్యకు పంపిస్తాడు. అది మొదలు తాను పోయేదాకా లచ్చడి గురించే బెంగపెట్టుకుని ఆస్తి లచ్చడి చేతిలో నిలబడదని గ్రహించి, మొత్తం కోడలు నాగవేణి పేరున రాసి కాలం చేస్తాడు.

రెండో తరం లచ్చడిది. అతను కోడి గ్రామం వదిలి స్కూలు విద్యకు కుందాపురం వెళ్ళగానే రెక్కలు విప్పుకున్న స్వేచ్ఛ అతని సొంతమైపోతుంది. ఎన్నడూ చూడని అర్బన్‌ ప్రపంచం అతని కట్లు తెంపేస్తుంది. ఇంట్లో చదువుకున్న వారెవరూ లేకపోవడంవల్ల తనమీద అజమాయిషీ కూడా లేకపోవడంతో చదువుకుంటూనే మరోపక్క తన తోటి పిల్లలతోపాటు వ్యసనాలతోనూ స్నేహం కుదుర్చుకుని హైస్కూలు దాటకుండానే స్త్రీ సాంగత్యం కూడా సంపాదిస్తాడు. జూదం, వ్యభిచారం… ఈ రెండూ అలవాటై వాటికి కావలసిన డబ్బు కోసం అబద్ధాలు చెప్పడం అనివార్యమవుతుంది.

పెళ్ళి చేసుకున్న నాగవేణి మీద అతనికి ప్రత్యేకానురాగం ఏమీ ఉండదు. మంగుళూరులో మామగారింట్లో ఉండి చదువు కుంటూనే తన వ్యాపకాల్లో తాను బిజీగా ఉంటాడు. తన సరసోల్లాస జీవితం తాలూకు రోగ బంధాలు నాగవేణికి కూడా ప్రసాదించి, మామగారింట మర్యాద పోగొట్టుకుంటాడు. నాగవేణి కోడి గ్రామం చేరాక లచ్చడు కేవలం డబ్బు కావల్సి వస్తే తప్ప కొంప మొహం చూడడు. తండ్రి పోయాక నాగవేణిని నమ్మించి ఆస్తి మొత్తం తనపేర రాయించుకుని దాన్ని అనతికాలంలోనే స్వాహా చేస్తాడు. చిన్నప్పటి నుంచీ నిర్లక్ష్యంగానే పెరిగిన లచ్చడు కుందాపురం, ఉడిపిల్లో విశ్వరూపం చూపిస్తాడు. పేకాట, హైస్కూలు దాటకుండానే స్త్రీలు, ఇతర వ్యసనాలు… ప్రతిదాన్నీ సహజంగా అనుసరించి ఇష్టం వచ్చిన లైఫ్‌స్టైల్‌ని స్వీకరిస్తాడు. ఈ క్రమంలో ఉచితానుచితాలు ఎలాగూ ఉండవు కాబట్టి, స్నేహితుడి భార్య జలజతో సైతం సంబంధం నెరపడానికి వెనకాడడు. కొడుకన్నా అతనికి ప్రేమ లేదు. తండ్రి పోయినా, తల్లి పోయినా ఎలాంటి బాధ ఉండదు. ఎక్కడెక్కడో తిరిగి డబ్బంతా పోయి చివరికి తనతోపాటు శీనమయ్యరు కొడుకు ఒరటమయ్యర్‌ని కూడా పతనం చేసి అనామకుడై పోతాడు. అయినా అతనిలో ఇసుమంతైనా పశ్చాత్తాపం ఉండదు. కారంత్‌కి కూడా లచ్చడిమీద కోపమేమో, మిగతా పాత్రలకు ఉన్న ప్రాధాన్యం కానీ, వర్ణన కానీ, అతని ఉత్థాన పతనాలు కానీ ఏవీ పట్టించుకోడు. లచ్చడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా క్లుప్తంగా ఇదీ సంగతి అన్నట్లు చిత్రిస్తాడు తప్ప లచ్చడి వెర్షన్‌ కానీ, మనోభావాలు కానీ, పోనీ కుట్ర తాలూకు అతని పథక రచన గానీ వేటినీ వివరంగా చెప్పడు.

డబ్బు, సెక్స్‌… ఇవే లచ్చడి గమ్యాలు. తన కొడుకు రాముడు పెద్దవాడై అతడిని చూడడానికి వెళ్తే ”ఎందుకొచ్చాడటా?” అని పక్కవాళ్ళని అడిగి రాముడి మనసులో రేకెత్తబోతున్న ప్రేమను నిర్దాక్షిణ్యంగా కట్‌ చేస్తాడు. అంతటితో ఆగక ఆ ముసలి వయసులో కూడా రాముడి హోటల్లో స్నేహితులతో సహా వచ్చి పడి తిని బిల్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించి కొడుకు మనసులో శాశ్వతంగా చోటు పోగొట్టుకుంటాడు. అందుకు సూచనగా అక్కడితో నవల్లో లచ్చడి ప్రస్తావన ముగిసిపోతుంది కూడా!

మూడో తరం ఐతాళుడు తాత పేరు పెట్టుకున్న రాముడు. అతనే కథను తీరం చేర్చే నాయకుడు. ఆధునిక భారతదేశం నిర్మితమవుతున్నవేళ ఆత్మ విశ్వాసానికి, ఆదర్శ యువతకు ప్రతీకగా రాముడి పాత్ర సాగుతుంది. పుట్టేనాటికే ఆస్తి మొత్తం పోయి దరిద్రంలో ఉన్న కుటుంబం. ఒక పూట తింటే రెండో పూట పస్తులు! తల్లి తప్ప ఎవరూ లేని జీవితంలో అతనికి తల్లే గొప్ప స్నేహితురాలు. చింకి బట్టలేసుకున్నా, అటుకులు నీళ్ళతో కలిపి తిన్నా, సముద్రం ఒడ్డున ఆడుకున్నా తల్లే వాడికి తోడు. మేనమామల నిరాదరణ అతనికి అర్థమవడంతో కోడి గ్రామానికి వచ్చేయడానికి సిద్ధమవుతాడు. తల్లికి ఏ మాత్రం కష్టం కలగకూడదని పట్నంలో ట్యూషన్లు చెబుతూ చదువుకుంటాడు. పినతల్లి ఇంట్లో కూడా

ఉచితంగా తినడానికి ఒప్పని ఆత్మాభిమానం.

ఒకప్పుడు తనకు గొప్ప ఆస్తి ఉండేదని, తండ్రి అది పాడుచేయబట్టే తనీ దీనస్థితిలో ఉన్నాననే ఆలోచన ఒక్కసారైనా అతని మనసులోకి రాదు. రేయింబవళ్ళు కష్టపడుతున్నా, చేతిలో పైసా లేకపోయినా ఉసూరుమనడు, ఆశను పోగొట్టుకోడు. రాముడు ముంబైలో ఉద్యోగం కోసం పడే ఇబ్బందులు చదువుతుంటే బిభూతి భూషణ్‌ అపరాజితుడు గుర్తొస్తాడు. అలుపెరగని యాత్రికుడు రాముడు.

వీటన్నిటి వెనుకా దాగి ఉండేది రాముడి కళా హృదయం. అంతకుమించి సముద్రం మీద ప్రేమ. పసితనం నుంచే కోడి గ్రామపు సముద్రంతో రాముడికి ప్రేమ. మంగుళూరులో సముద్రాన్ని చూసి ”మన ఊరి సముద్రంలా లేదేంటమ్మా” అని అసంతృప్తి పాలవుతాడు. చెన్నైలో సముద్రమూ అతనికి నచ్చదు. ఎలాంటి హడావుడి లేని ప్రశాంతమైన, ప్రకృతి నగ్న సౌందర్యాన్ని నిండా నింపుకున్న సముద్రం కావాలి రాముడికి. ఊరికి రాగానే బట్టలైనా మార్చుకోకుండా సముద్రం దగ్గరికి పరిగెట్టే పిచ్చి ప్రేమ. అందుకే అతను చిత్రకారిణి నోవాకి ప్రామిస్‌ చేసిన సముద్ర సౌందర్యాన్ని తన పెయింటింగ్‌ ద్వారా చూపించాలని నిశ్చయించుకున్నపుడు కోడి గ్రామ సముద్ర తీరంలో మమేకమై గడుపుతాడు. ఎంత చూసినా తనివి తీరని ఆ అద్భుత సౌందర్యాన్ని చిత్రించడం అసలు సాధ్యమేనా అని దిగులు పడతాడు. అతని జీవితం పూర్తిగా అస్థిరమై గతిలేని పరిస్థితుల్లో భోజన హోటల్లో పని చేయాల్సి వచ్చి, అమ్మను ఊర్లో ఒంటరిగా వదిలి స్థిరత్వంలేని పరిస్థితుల్లో సముద్రం సాన్నిహిత్యంలో సేద తీరుతాడు కానీ ఆ సౌందర్యాన్ని చిత్రించగలిగే హృదయం, శాంతి, మనస్థిమితం లేక అశక్తుడై పోతాడు.

తిరుమల రామచంద్ర

అమ్మ దగ్గరికి తిరిగి వచ్చేసి ఆ పల్లెలోనే ఉండాలని, వ్యవసాయాన్ని కొనసాగించాలని నిర్ణయించుక్ను తర్వాత రాముడికి దక్కిన ప్రశాంతతను, శాంతిని అతనే స్వయంగా నిర్వచించు కోలేకపోతాడు. అతనిలో గమ్యం చేరిన స్థిరభావం! ఎన్నడూ ఎరగని సంతోషం! కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, తన చుటూ

ఉన్నవాళ్ళతో తన సొంత పొలంలో తాను పంచుకున్న శ్రమ, తాను నీళ్ళు తోడిన పొగాకు తోట, తాను పండించిన పంట, ఆ బెస్తవాళ్ళతో సాహచర్యం… రాముడి హృదయాన్ని నింపేస్తాయి. ఆ ప్రశాంతతలో ఆ నిండుతనంలో వాన కురిసి వెలసిన ఒక సాయంత్రం ఒకవైపు రౌద్రం, మరోవైపు ప్రశాంతత నిండిన తీరంలో ఆ కోడి సముద్రం అనంత సౌందర్యాన్ని అతని కుంచె పట్టుకోగలుగుతుంది. అపూర్వమైన చిత్రాన్ని నోవాకి కానుకగా పంపిస్తాడు.

పిల్లలందరికీ చదువు చెప్పాలనీ, బెస్తవాళ్ళందరితో తాగుడు మాన్పించాలనీ, వరి, అపరాలు వంటివి కాక పొగాకు లాంటి వ్యాపార పంటలు వేసి సంప్రదాయంలోనే కొంత ఆర్థిక కోణాన్ని చూడాలనీ, గ్రామాలన్నీ వికాసం పొందాలనీ… రాముడి అభిమతం. ఇవన్నీ ఆచరణలో చూపిస్తాడు.

తండ్రి పోగొట్టిన బంధాలన్నీ తిరిగి సంపాదించి, బంధువులను సంపాదించుకోవాలని తాపత్రయపడతాడు. సుబ్బత్త చెప్పిన సంబంధాన్ని చూడడానికి వెళ్తాడు. తల్లి పెళ్ళి ప్రస్తావన తెస్తే ”ఆ అమ్మాయి పొగాకు తోటలకు నీళ్ళు మోస్తుందటనా మరి?” అని తన శ్రమను పంచుకునే భాగస్వామి కావాలని సూచిస్తాడు. పెళ్ళి కూతురిని అలంకరించి చూపిస్తే ”ఇందాక ఆ డ్రస్‌లోనే (వాకిట్లో కళ్ళాపి చల్లేటపుడే) అందంగా ఉందే” అని చమత్కరిస్తాడు.

ప్రతి పాత్రనూ కారంత్‌ ఎంతో సవివరంగా చిత్రించినా, మనసుకు హత్తుకుపోయే గౌరవాన్ని కల్గించేవి మాత్రం సరసోతి, నాగవేణి, మూడో తరం రాముడి పాత్రలే..!

ఈ నవల్లో స్త్రీ పాత్రల్లో రెండింటికి తప్ప మిగతావాళ్ళకి పెద్ద ప్రాధాన్యం ఉండదు. ఆ ఇద్దరూ సరసోతి, నాగవేణి. 1950 ప్రాంతాల్లో సరసోతి లాంటి స్త్రీ పాత్రని ఒక సంప్రదాయ కుటుంబంలో, అందులోనూ వితంతువు… విప్లవమే! పుట్టింటితో బంధం పోకూడదని, అత్తగారింటి భరణంతో అన్నగారింట్లో ఉంటున్న సరసోతిని రెబల్‌గా గుర్తించాల్సిందే! రెక్కలు ముక్కలయ్యేలా పొలం పని, చెట్లు కొట్టడం, మైళ్ళ కొద్దీ దూరాలు నడిచి బరువులు మోసుకురావడం వంటి బండ పనులన్నీ సుకుమారాలు పోకుండా చేస్తుంది. న్యాయం అనుకున్న మాటను మొహాన్నే కుండ బద్దలు కొడుతుంది. ముసుగేసుకుని తిరిగే ఆ ముప్పయ్యేళ్ళ ధీర సరసోతి, అన్నింటికీ మించి అన్నగారి బుద్ధిని, కుటిలత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టి పారేస్తుంది. పండిన పంట నాలుగు మూటలు ఎక్కువ వస్తే తమకు చెప్పకుండా దాచిన రామైతాళుడిని ”ఏం? రెక్కలు ముక్కలు చేసుకోవడానికి పనికొస్తాం గానీ, పంట ఎక్కువొచ్చిందని చెప్పడానికి ఆడవాళ్ళం పనికిరామా?” అని నిలదీసినా, పొరుగింటి వాళ్ళ పంట వానకు మునిగిపోతే, ”రంకున పుట్టె, జగడాన చచ్చె అన్నట్లు పోతే పోయిందిలే ఊరికే వచ్చే డబ్బేగా?” అని మత్సరం చూపించే అన్నని ”పరాయివాడిని చూసి ఎందుకంత మత్సరం అన్నా నీకు? నీకు మాత్రం ఊరికే వచ్చింది కాదూ? దక్షిణలు కూడేస్తే వచ్చిన డబ్బేగా. నీకు ఎక్కువొస్తే గర్వమూ, ఎదుటివారికి పోయిందని సంతోషమూనా” అంటూ చీవాట్లు వేసినా సరసోతికే చెల్లు.

తనకు, పారోతికీ చెప్పకుండా సంబంధం కుదుర్చుకుని వచ్చిన అన్నమీద మండిపడుతుంది. ”ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పే పనేలేదా” అని శీనమయ్యరు ముందే నిలదీస్తుంది. అప్పట్లో రెండో పెళ్ళి మామూలు విషయమే కాబట్టి దాన్ని అంగీకరిస్తూనే, పారోతి గౌరవానికి భంగం వస్తే సహించనని అన్నకు స్పష్టం చేస్తుంది. కొత్త పెళ్ళి కూతురికే కాదు పారోతికి కూడా నగలు చేయించాల్సిందే అని పట్టుబడుతుంది. నిజానికి ఆ ఇంటికి ఒక ఒంటి స్తంభంలా చివరివరకూ సరసోతి నిలబడుతుంది. పారోతి మీద చివరివరకూ శ్రద్ధ చూపేది సరసోతి ఒక్కటే. నవల సాగుతూ పోతుంటే సరసోతి మీద అభిమానం పెరిగిపోతూ ఉంటుంది.

నాగవేణి నవల చివరివరకూ ఉండే పాత్ర. కొడుకుకి గొప్ప స్నేహితురాలు. కష్టాలు చుట్టుముట్టి, ఒంటరిదైనా ఫిడేలు సాయంతో ఊరట పొందుతూ అన్నింటినీ ఆత్మగౌరవంతో అధిగమిస్తుంది.

ఈ మూడు తరాల కథను కారంత్‌ 30 అధ్యాయాల్లో, అదీ 30 రోజుల్లో ముగించారట. అది ఆయనకు ఎలా సాధ్యమైందో గానీ ఈ నవలను వేగంగా చదవలేం. నెమ్మదిగా, నవలలోని జీవన విధానానికి తగ్గట్టుగానే ఎలాంటి తొందరా లేకుండా తాపీగా నడుస్తూ పోతుంది. ఈ కథ పారోతి, సరసోతిల దినచర్యను, సంఘటనల వారీగా పూర్తిగా వివరిస్తాడు రచయిత. కట్టెలు ఎండబెట్టుకోవడం, పొన్న కాయలను నూనె గానుగకు పంపి దీపాలకు నూనె ఏర్పాట్లు చూడడం, సరసోతి వేసవిలో మైళ్ళకొద్దీ నడిచి ఊరగాయ కోసం మామిడికాయలు తీసుకు రావడం, కొద్దిలో జరిగే వంట, ఏ కాలక్షేపమూ లేని వాళ్ళ జీవితాల్లో పని మాత్రమే కాలక్షేపంగా సమయం గడిచిపోవడం… ఇదంతా సవిస్తరంగా చిత్రిస్తాడు. ఎలాంటి హడావుడి లేని ఆ రోజుల ప్రశాంత జీవితంలోని ప్రతి రోజుని, ప్రతి సంఘటననూ రచయిత వర్ణిస్తూ, వివరిస్తూ పోయినా, అది ఎంత నెమ్మదిగా సాగినా పాఠకులకు ఆసక్తి కల్గిస్తూ పోతుందే తప్ప విసుగు పుట్టదు. అనుక్షణం వినిపిస్తూ ఉండే ఆ పడమటి సముద్ర హోరు, వదలని ముసురు వాన, ఇంటిముందు చెరువు, సముద్రంలో కలిసే ఆ నది, కొబ్బరి, పనస, పొన్న చెట్లు… ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఒక భాగంగా కలిసిపోయి నవల పొడుగునా పాఠకుడితో ప్రయాణి స్తుంటాయి. నవలలో కాలం నడుస్తూ ముందుకు కదలడంతో పాటే కథలో, సమాజంలో వచ్చే మార్పులు అత్యంత సహజంగా కథతో పాటు జరిగిపోతాయి. కథే మారుతున్న సమాజాన్ని కళ్ళకు కడుతుంది. సముద్ర తీరపు ఇసుక నేలల్లో వ్యవసాయం ఎంత కష్టమైనా, అక్కడ ఏది పండించాలన్నా ఎలాంటి ఆధునిక పనిముట్లూ లేని కాలంలో ఎంతటి శారీరక శ్రమతో కూడిన పని అయినా ఎవ్వరూ వెనుకాడరు. పంట పొలాల్లో పేరుకున్న ఇసుకను ఎత్తిపోయడం, చెరువు పూడిక మట్టిని తట్టలతో తెచ్చి పొలాల్లో నింపడం, నీటి వసతి లేని ఆ పొలాలకు చెరువునుంచి కడవలతో నీటిని తెచ్చి పోయడం… వీటన్నింటిలో రామైతాళుడికంటే ఆ ఇంటి ఇద్దరు స్త్రీలే ఎక్కువగా పాలు పంచుకుంటారు. వాళ్ళతోపాటే వాళ్ళ పాలికాపు కుటుంబమూ రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ నాలుగు గింజలు పండే పరిస్థితి ఉండదు. ఏ వస్తువో, సేవో కొనుక్నున్నా వడ్లు కొలిచే రోజులు కావడం వల్ల పంట పండించక తప్పదు.

ఈర్ష్యాసూయలు కాలాతీతాలు. అందుకే కులానికి ఒకటే అయినా శీనమయ్యరూ, రామైతాళుడూ ఒకరి అభివృద్ధిని ఒకరు ఓర్వలేకపోతుంటారు. శీనమయ్యరు కొడుకులు బెంగుళూరులో హోటళ్ళవల్ల డబ్బు సంపాదిస్తున్నారని తెలిసి ”అన్నం అమ్ముకుని బతికే గతి మనకేమి?” అని రామైతాళుడు ఎద్దేవా చేస్తే, లచ్చడిని వకీలుని చేద్దామన్న రామైతాళుడి ప్రయత్నాలను శీనమయ్యరు నలుగురి ముందూ ఎగతాళి చేస్తుంటాడు. ఉడుపిలో హోటల్‌ నడిపే బ్రాహ్మడు కిట్టు ఉపాధ్యాయ భార్య జలజ లచ్చడు, అతని స్నేహితులు, మరికొందరితోనూ శారీరక సంబంధాలు పెట్టుకుని నైతిక విలువల నిర్వచనం ఏ కాలంలో అయినా సాపేక్షం మాత్రమే అని రుజువు చేస్తుంది.

ఎలాంటి సద్దూ లేని ప్రశాంతమైన ఆ పల్లె నుంచి లచ్చడు కుందాపురం, ఉడుపిలకు చదువు కోసం చేరినపుడు అక్కడి వాతావరణం, స్నేహితులు, హాస్టల్‌ వసతిలో ఉండడం.. ఇలాంటివి నెమ్మది నెమ్మదిగా పల్లె పట్నంవైపు జరిగిపోవడాన్ని చిత్రిస్తూ పోతాయి. అందుకే లచ్చడు సెలవులకు ఇంటికి వచ్చినా అతనికి ఆ ఇల్లు నచ్చదు. ఈ విపరీత ధోరణిని గమనించే సరసోతి అంటుంది ”ఇంగ్లీష్‌ చదివితే ఇంటివారే పరాయి వారవుతారు” అని. నిజానికి సరసోతి అమాయకత్వం వల్ల ఇంగ్లీష్‌ చదువుని ఆక్షేపించడమే గానీ, అది పట్న వాసపు పోకడలకు సంబంధించిన మాటే. నాగరిక జీవితం అనేది నాగరికంగా ఉంటుందో, ఉండదో గానీ, స్వచ్ఛత మాత్రం లోపించే తీరుతుందని లచ్చడే రుజువు చేస్తాడు.

లచ్చడి నిర్వాకాల వల్ల ఆస్తి మొత్తం పోయిన తర్వాత అందర్నీ పోగొట్టుకున్న నాగవేణి కొడుకుతో మంగుళూరు చేరిన కాలానికే మనుషుల మధ్య బంధాల నిర్వచనాలు నెమ్మదిగా మారిపోతుంటాయి. చెల్లెలే ప్రాణంగా మెలిగిన సదాశివుడు, అతడి తమ్ముడు కొంత ఉదాసీనంగా వ్యవహరించడం, ఖర్చుల విషయంలో కొంత నిక్కచ్చిగా ఉండడం, మేనల్లుడి చదువు ఖర్చు విషయమై ఇద్దరూ వంతు వేసుకున్నట్లు ప్రవర్తించడం జరుగుతుంది. తండ్రి పోయాక నాగవేణిని బాబాయి నారాయణయ్యరు తమ ఇంట్లో ఉండమంటే ఆయన కొడుకులు, ఒకప్పుడు నాగవేణితో ఆడి పాడి ఒక కుటుంబంగా కలిసి ఉన్న వాళ్ళే, నాగవేణిని ఉండమని బలవంతం చేయొద్దని తమ తండ్రికి కరాఖండిగా చెప్పేస్తారు. నగర జీవితపు పోకడలు బంధుత్వాలను తేలిక పరుస్తుంటాయి.

ఎప్పటికీ మారక విశ్వాసంగా ఉండేది ఐతాళుల ఇంటి ముంగిట ఉన్న పాలికాపులే. చివరివరకూ వాళ్ళే నాగవేణికి, ఆమె కొడుక్కి కూడా అండగా నిలుస్తారు.

నవల మొత్తం మీద కథతోపాటు ప్రయాణిస్తూ ఉండేది సముద్రం మాత్రమే. కోడి గ్రామంలో ఇంటికి వంద గజాల దూరంలోనే సముద్రం. కథంతా నిత్యం ఆ హోరులోనే. సముద్రం మీద నిండైన సూర్య చంద్రుల అందాలతో, పట్నం మాలిన్యమూ, కాలుష్యమూ అంటని స్వచ్ఛమైన సముద్రం, దగ్గర్లోని కొబ్బరి తోటల టపటపలతో హోరు మిళితమైన సుందర సంగీతం నేపథ్యంలో ఆ నిశ్శబ్ద గ్రామం సైతం కువకువలాడేలా చేస్తుంది. మంగుళూర్లో సముద్రం… రాముడు మద్రాసు వెళ్తే అక్కడా వదలని దక్షిణ సముద్రం… అందుకే రాముడు తన పసితనంలోనే సముద్రంతోనే ప్రేమలో పడతాడు.

నవలా కాలం 1850 నుంచి మెదలు కావడం వల్లనేమో ప్రాచీన దక్షిణ కర్నాటక సంస్కృతి, ఆచార వ్యవహారాలు విస్తృతంగా కనిపిస్తాయి. కన్నడ బ్రాహ్మల తిండి అలవాట్లు (మనకు పరిచయం లేకపోవడం వల్ల) కొంత వింతగానూ, మరికొంత ఆసక్తిగానూ తోస్తాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళతో పాటు బెల్లం ముక్క ఇవ్వడం లేదా ఆకులో పెట్టిన ఊరగాయ ముక్కతో మంచినీళ్ళు ఇవ్వడం, నీళ్ళలో నానేసిన అటుకులు తినడం, కాఫీకి బదులుగా పెసర గంజి ఇవ్వడం వంటివి..! చిరుతిండిగా కోడి గ్రామంలో కేవలం అప్పడాలు, వడియాలు మాత్రమే కనిపిస్తుంటాయి. పెళ్ళి చూపులకి వచ్చిన వాళ్ళకు కూడా అవే.

అనేక చోట్ల చామ కూర అట్లు, పనసకాయ, గెనుసుగడ్డ (చిలకడ దుంప) అప్పడాల ప్రస్తావన వస్తుంది. పనసకాయతో పాటు అప్పడాలు ఎలా చేస్తారో అర్థం కాలేదు కానీ, మొత్తానికి అవి నాకు కూర్గ్‌లో ఒక స్నేహితుల ఇంట దొరికాయి.

అప్పటి ఆచార వ్యవహారాలు, పట్టింపులు అన్నీ నవల్లో సుస్పష్టం. లచ్చడు ఉడిపి హోటల్లో తిన్నాడని తెలిసి ”ఆ కామత్‌ల హోటల్లో తిని ఆచారం మంట పెడతావా” అని సరసోతి మండి పడుతుంది.

అసలు మొత్తంమీద కర్నాటక బ్రాహ్మల్లో చాలామందికి భోజన హోటల్‌ పెట్టడం ఒక రివాజైన కొలువుల్లో ఒకటిగా అర్థమవుతుంది. శీనమయ్యరు కొడుకులు బంధువుల హోటల్లో పనిచేసి ఆ పైన సొంత హోటల్‌ పెడతారు. వేద పాఠశాల నడిపే సుబ్రాయ ఉపాధ్యాయ కొడుకు కిట్టు ఉపాధ్యాయ కూడా కుందాపురంలో చిన్నపాటి హోటల్‌ ప్రారంభిస్తాడు. ఆస్తి మొత్తం తీసుకుపోయిన లచ్చడు కూడా హోటల్‌ పెట్టి నష్టపోతాడు. ఒరటమయ్యరుదీ అదే దారి. చివరికి రాముడు కూడా హోటల్లో పనిచేయక తప్పదు.

ఇంత పెద్ద నవలను కారంత్‌ 30 రోజుల్లో రాయడం ఒక ఎత్తైతే, డాక్టర్‌ తిరుమల రామచంద్ర దాన్ని అంత అద్భుతంగానూ తెలుగులోకి అనువదించడం విశేషం. ఈ నవల్లోని దక్షిణ కర్నాటక మాండలికాలకు నిఘంటువుల్లో కూడా సరైన అర్థాలు దొరకని పరిస్థితుల్లో ఎంతో శ్రద్ధగా వాటి అర్థాలను అన్వేషించి కన్నడం నుంచి నేరుగా తెలుగులోకి అనువదించారు. ఈ నవల వెలువడిన పధ్నాలుగేళ్ళకి ఏ.ఎన్‌.మూర్తి ని=వ్‌బతీఅ ్‌శీ జుaత్‌ీష్ట్రకు పేరుతో ఈ నవలను ఇంగ్లీష్‌లోకి మొదట అనువదించారు. అయితే అది కొంత సంక్షిప్త రూపంలో ఉండడంతో పద్మా రామచంద్ర శర్మ అనే ఇంగ్లీష్‌

టీచర్‌ (ఈమె ఆఫ్రికా దేశాల్లో కూడా పని చేశారు) తిరిగి ఆ నవలను ఆంగ్లంలోకి అనువదించారు.

అంత విస్తారమైన నవలను సంక్షిప్త రూపంలోని చిన్న పిల్లలకు కథ చెప్పినట్లు సరిపెడితే కుదరదంటారామె. అందుకే ఆ దక్షిణ కర్నాటక మాండలికాల్ని వెదికి పట్టుకుని రోజువారీ దినచర్యలోని ప్రతి ఘట్టాన్నీ వర్ణన అనే భావనకు అతీతంగా చిత్రిస్తూ పోయిన కారంత్‌ శిల్ప చాతుర్యాన్ని తానూ వీలైనంత సవిస్తరంగానే అనువదిస్తూ, మూలంలోని టశ్రీaఙశీతీ పోకుండా చూడ్డానికే ప్రయత్నించానంటారు. అనువాదకుల సృజనాత్మకత అనువాదంలో కనిపించవచ్చని అంగీకరిస్తూనే ”అనువాదకుడు గాలిపటం లాంటి వాడు. ఎంత ఎత్తైనా స్వేచ్ఛగా ఎగరొచ్చు గానీ అదుపులో మాత్రం ఉండాలి” (మూలం నుంచి దూరంగా జరగకూడదని) అని పద్మ అంటారు. ఆ పనిని తిరుమల రామచంద్ర అక్షరాలా నెరవేర్చారు. కన్నడ సువాసనలు ఏ మాత్రం తగ్గకుండానే రామైతాళుడు, నాగవేణి, సరసోతి, పారోతి, రాముడు, పాలికాపు సూరడు, అతడి కోడలు బచ్చి… అందర్నీ తెలుగు వాకిట్లోకి తెచ్చి మనతో చేతులు కలిపిస్తారు. సరసోతిని అభినందిస్తూ, నాగవేణితో సహానుభూతి పొందుతూ, రాముడితో పాటు ప్రయాణిస్తూ వాడి కష్టాలు చూసి చివుక్కుమన్నా, వాడు చేరుకున్న పచ్చని గమ్యం చూసి పాఠకుడు హాయిగా నిట్టూర్చేలా, నవలంతా తానై పరుచుకుని ఈ మూడు తరాల జీవన ప్రయాణానికి సాక్షిగా నిల్చిన కోడి గ్రామపు సముద్రానికి వీడ్కోలు చెప్పి పుస్తకం మూసేలా చేస్తారు.

వనవాసి నవల్లో బిభూతి భూషణ్‌లాగే కారంత్‌ కూడా ఈ నవల్లో వ్యవసాయ వృత్తిని వదిలిపెట్టి పట్నం వైపు పరుగులు తీస్తున్న వారి గురించి ఏమీ గగ్గోలు పెట్టరు. పట్నం చేరి పతనమైపోతున్న లచ్చడిని, శీనమయ్యరు కొడుకులను చూస్తున్న పాఠకుడు ”అయ్యయ్యో! వ్యవసాయం వదిలి, పల్లె వదిలి ఎంత పని చేశారు వీళ్ళు” అని ఆందోళన చెందేలా చేస్తారు.

ప్రకృతికి శ్రమను ధారపోయడంలో రాముడు పొందిన సంతోషం, తృప్తి చూస్తున్నపుడు, అతను తన తాతగారి జీవన శైలికి, వ్యవసాయానికి తిరిగి వచ్చినపుడు… పాఠకుడు తెలియని రిలీఫ్‌ పొందుతాడు. వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కాదు, ఆర్థిక స్వావలంబన కూడా అందులో ఒక అంశంగా ఉండాలంటాడు కారంత్‌. అందుకే రెండు తరాల వరకు రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ఇసుక నేలల్లో సరైన ఎరువులు కూడా లేకుండా వరి, ఉలవలు, మినుములు, దోసకాయలు పండించిన రామైతాళుడి కుటుంబంలో రాముడి తరం పొగాకు పండిస్తుంది.

బెస్తవాళ్ళు పట్టిన చేపల్ని చూడడానికి సైతం ”ఛీ” అనుకునే ఆ కుటుంబంలో రాముడు పొగాకు పంటకు ”చేపల ఎరువు” వేస్తాడు. పనిచేయడానికి మాత్రమే పాలికాపుని ఉపయోగించుకున్న రామైతాళుడి తరం వాళ్ళు అంతకు మించి సూరడి కుటుంబంతో పెద్దగా మాటలు నెరపరు. ”మీ శూద్రుల రాత అంతేరా! బ్రాహ్మల ఇంటి పాయసానికి నాలుక పీక్కుంటారుగా” అని మాట్లాడతాడు కూడా!! రాముడు ఇరవయ్యేళ్ళకే జీవితంలో ఎంతో చూసినవాడు కాబట్టి, పట్నవాసం చేసి వచ్చినవాడు కాబట్టి, ఆనాటి ఆచారాలను ఎంతవరకూ పాటించాలో, ఏది మూర్ఖత్వమో గ్రహించిన వాడూ కాబట్టి పాలి కాపుతో హాస్యాలు, చమత్కారాలు ఆడుతూ వాళ్ళతో కలిసి పనిచేస్తాడు. బెస్తల కుటుంబాలతో కలిసి తిరిగి ఎర్ర సీసాలు (తాగుడు) మానమని ప్రోత్సహిస్తాడు.

”నా కొడుక్కి రాసేది, చదివేది నేర్పు దొరా.. నాకు చూడు చదువు రాక ఎంత కష్టపడుతున్నానో” అని బెస్తల చెన్నడు అంటే ”అది రాకుంటేనే నయం రా. మా నాన్నకు చదువు వచ్చే.. ఆస్తి

ఉడుపి కోమట్ల వశమైంది” అని హాస్యాలాడతాడు.

”నాకూ ఫిడేల్‌ నేర్పుతారా” అని చెన్నడు అడిగితే ”సరే ముయ్యికి ముయ్యి (చెల్లుకు చెల్లు). నీవు నాకు వలలు పన్నేది నేర్పు, నీకు నేను ఫిడేల్‌ నేర్పుతాను” అంటాడు.

రాముడిలా ఆలోచించి వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలిపెట్టి పచ్చని ప్రకృతి ఒడివైపు పరుగులు తీసే యువత అక్కడక్కడా మనకు కనిపించకపోరు. ఫేస్‌బుక్‌ దీప్తిరెడ్డి వంగల అనే అమ్మాయిని చూస్తుంటాను. ఎకరాలకొద్దీ సేంద్రీయ (శీతీస్త్రaఅఱష) వ్యవసాయం అలవోకగా చేస్తూ, పంటల్ని బళ్ళకెత్తుతూ ఉంటుంది. ఈనాడు నుంచి ఉద్యోగం విరమించిన హేమ సుందర్‌ అనే పాత్రికేయుడు వ్యవసాయం వైపు మరలి డయాబెటిక్‌ బియ్యాన్ని పండిస్తున్నారు. అమెరికా నుంచి తిరిగొచ్చిన మరొక మహిళ, శ్రీకాకుళం దగ్గర ఇంజనీరింగ్‌ చదివిన కుర్రాడొకడు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి మరొకరు… ఇలా వ్యవసాయం మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ళ గురించి ఈ మధ్య ఒక టీవీ కార్యక్రమంలో చూసి ఎంతో సంతోషం వేసింది. ఈ క్రమంలో పట్నం నుంచి పల్లెలకు మళ్ళిన యువ రైతులెవరైనా ఇంకా ఉన్నారా (్‌శీబఅస్త్ర టశీతీఎవతీర ఱఅ ూూ aఅస ువశ్రీaఅస్త్రaఅa) అని వెదికితే లెక్కకు మించి యువరైతుల ఆత్మహత్యల వార్తలు పేజీలకొద్దీ ప్రత్యక్షమై బెంబేలెత్తించాయి. కొత్తగా వ్యవసాయం మొదలుపెట్టినా, పెట్టకపోయినా వ్యవసాయం కుటుంబాల నుంచి వచ్చిన వారు సొంతగానో, కనీసం కౌలుకి ఇచ్చో వ్యవసాయాన్ని కూలిపోకుండా కాపాడితే ఎంత బాగుంటుంది!!

రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌కి పంట భూములను ఇవ్వాలనే ఆలోచన ఎంత దుర్మార్గం! భూమిని నిలువునా హత్య చేయడం ఎంతటి నేరం!!

రాజధానుల పేరుతోనో, రియల్‌ ఎస్టేట్‌ పేరుతోనో ప్రపంచీకరణ వైపుగా పయనిస్తూ, వ్యవసాయ భూములన్నీ మాయమై కాంక్రీటు అడవుల్లా మారిపోతున్న కాలంలో, వ్యవసాయం చేయలేక పిట్టల్లా రాలిపోతున్న రైతుల ఆత్మహత్యల కాలంలో… చదువుకుని, పట్నంలోని శూన్యాన్ని అనుభవంతో అవగతం చేసుకుని సేద్యానికి తిరిగి మరలిన రాముడే ఇప్పుడు కావలసిన మోడల్‌. వ్యవసాయాన్ని మర్చిపోయి నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరూ తిరిగి ఆ వైపుగా సేద్యానికి మరలి వెళ్ళాలన్నదే ఈ నవల ఇచ్చే పిలుపు! మనకిప్పుడు వందలమంది రాముళ్ళు కావాలి!!

(చదువరి డైరీ నుంచి…)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.