స్త్రీయ స్తథా పాఠనేయా యధా తా: కార్యవస్తుని
పుంవత్ ప్రవృత్తి మాధాయ సాధయేయు రనాకులా:
”పురుషులవలె ధైర్యమును అవలంబించి, భయపడక సర్వ కార్యములను నిర్వహించేలా స్త్రీలకు విద్య నేర్పవలయును”.
సంసారమనే రథానికి స్త్రీ పురుషులు రెండు చక్రాలని అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు చక్రాలు సమానంగా
ఉంటేనే గానీ సంసార రథం తిన్నగా నడవదు. రెండు చక్రాలలో ఎంతెంత భేదం ఉంటుందో అంతంత కష్టంగా రథం నడుస్తుంది. పురుషుడు జ్ఞానవంతుడు, స్త్రీ అజ్ఞానాంధకారమగ్నమై ఉన్నట్లైతే కుటుంబంలో కొంతమాత్రమైనా సౌఖ్యముండబోదని మనలోని అనేక ఉదాహరణల వలన స్పష్టమవుతోంది. భార్యభర్తల రూపమైన రెండు గీతలు విద్యాబుద్ధులతో సమానంగా ఉన్నట్లయితే సంసార శకటం అత్యంత సులభంగా నడుస్తుందని, మధ్యలో ఎన్ని ఆటంకాలు, కష్టాలు వచ్చినా ఆగక రెండు చక్రాల సహాయంతో సులభంగా నడవగలదని, తుదకు ఆనందంగా నిర్ణీత స్థలానికి రథం చేరునని చూపుటకు వీరమతి చరిత్ర అత్యంత ఉపయోగకరమైనది. కాబట్టి చదువరులు దీన్ని విశేష శ్రద్ధతో చదవవలెను.
శాలివాహన శకంలోని రెండో శతాబ్దంలోనో లేక మూడవ శతాబ్దంలోనో గుజరాతు దేశమున చావడా వంశస్థుడగు బిరజుడను రాజు టుకటోడా అనే గ్రామాన్ని రాజధానిగా చేసుకుని ప్రజాపాలన చేస్తుండేవాడు. ఇతని తండ్రి బ్రతికి ఉన్నా అతి వృద్ధుడు అయినందువలన బిరజుడే ప్రజాపరిపాలన చేస్తుండేవాడు. వృద్ధరాజుకు బిరజుడు కాక వేరే సంతానం ఉండేవారు. వారందరిలో చిట్టచివరి కూతురి పేరు వీరమతి. ఈమె అందరికంటే చిన్నదయినందున ఎంతో గారాబంగా పెరుగుతుండేది. చిన్ననాటి నుండి రాజపుత్రులతో కలిసి మెలిసి ఉండడం వలన ఆమె రాజపుత్రులు నేర్చుకునే విద్యలన్నీ నేర్చుకుంది. కావ్య వ్యాకరణాలయందు ఆమె కృషి చేసిందో లేదో తెలియదు కానీ చక్కగా వ్రాయటం, చదవటం, లెక్కలు మొదలైన వాటిలో ఆమె ప్రావీణ్యత సంపాదించిందని చరిత్రవలన తెలుస్తోంది. ఇదేకాక అశ్వారోహణము, గజారోహణము, సాముచేయటం, గద త్రిప్పుట, యుద్ధంలో విల్లంబులను ఉపయోగించటం మొదలైన రాజపుత్రులకు అత్యంత ఆవశ్యకమైన ధనుర్విద్యలను కూడా ఆమె నేర్చుకుంది. ఇలా యుక్తవయసు వచ్చేవరకు వీరమతి స్త్రీలకు స్వాభావికమైన సౌందర్య గాంభీర్య వినయాది సుగుణాలను విడవకుండానే ‘పుంవత్ప్రగల్ప’ అయింది.
వీరమతి దినదిన ప్రవర్థమా నమై పదహారు సంవత్సరాల వయసు రాగానే ఆమె వివాహ యోగ్యమైందని తలచి అప్పట్లో అత్యంత శ్లాఘనీయమైన స్వయంవర పద్ధతి ననుసరించి ఆమె వివాహాన్ని చేయడానికి నిశ్చయించి, ఆమె అన్నగారైన బిరజ మహారాజు దేశదేశాలకు పురోహితులను పంపి అక్కడి రాజ పుత్రుల వివరాలను తెల్సుకుని వారి పటాలను తెమ్మని చెప్పాడు. వారు ఆ ప్రకారమే దేశదేశాలకు వెళ్ళి అనేకమంది రాజపుత్రుల చిత్ర పటాలను తెచ్చి వీరమతికి చూపించి ఆయా రాజపుత్రుల స్వభావగుణాలను నోటితో వర్ణించారు. వారిలో ధారా నగరంలో రాజ్యాన్నేలుతున్న ఉదయాదిత్య మహారాజుగారి కుమారుడైన జగదేవుడనే రాజపుత్రుని సద్గుణాలను విని, అతని సుందర రూపం చూసి తాను అతనిని తప్ప మరొకరిని వరించనని వీరమతి నిశ్చయించుకుంది. ఈ సంగతి ఆమె అన్నగారికి తెలుపగా అతడు ‘నా చెల్లెలైన వీరమతిని మీ కుమారుడైన జగదేవుడికి ఇచ్చెదమ’ని ఉదయాదిత్యునికి శుభలేఖ పంపాడు.
ఉదయాదిత్యుడు సూర్యవంశపు రాజు, విక్రమాదిత్యుని వంశంలోని 48వ పురుషుడు. ఈయన మాళవ దేశంలోని ధారానగరాన్ని తన రాజధానిగా చేసుకుని అనేకమంది సామంతులకు చక్రవర్తిగా ఉన్నాడు. చావడా వంశస్థుడగు బిరజ రాజు అతనికి సామంతుడుగానే ఉన్నాడు. ఉదయాదిత్యుడు అత్యంత శౌర్యవంతుడనే ప్రఖ్యాతిని పొందాడు. అతనికి ఇద్దరు భార్యలున్నారు. ఈ రాణీల పేర్లు తెలియకపోయినా, పెద్ద భార్య వాఘేలీ వంశంలోనిదని, రెండో భార్య సోళంకీ వంశస్థురాలని తెలుస్తోంది. వాఘేలీ రాణికి రణధవళుడు, సోళంకీ రాణికి జగదేవుడనే పుత్రులు కలిగారు.
వాఘేలీ, సోళంకి రాణులు సవతులైనందున ఒకరిపై ఒకరు అత్యంత కోపంతో ప్రవర్తిస్తుండేవారు. బహుపత్నిత్వ దోషం ఈ దేశంలో చాలాకాలం నుండి ఆచారంగా నడుస్తున్నందున అనేక కుటుంబాలలో గృహ సౌఖ్యం నాశనమవుతోందని అందరికీ తెలిసిన విషయమే. ఒక స్త్రీని వివాహమాడి, ఆమె తన సహధర్మచారిణి అని, అర్ధాంగి అని, ‘నాతిచరామి’ అని వివాహమప్పుడు ఆమెకు మాట ఇచ్చినది మరచి రెండవ యువతిని వివాహమాడి మొదటి భార్యపట్ల ఉన్న ప్రేమను విభజించుట గొప్ప అన్యాయమని చెప్పాలా? ఏక పతివ్రతము, ఏక పత్నీవ్రతమూ ఉత్తమ నాగరికతను తెలియచేస్తాయని పెద్దలు చెప్తారు. మన సమాజంలో స్త్రీల పట్ల జరిగే అన్యాయాలలో బహు పత్నీకత్వము ఒక గొప్ప అన్యాయం. ‘సవతి పోరు స్వర్గమునందైనా అక్కరలేద’న్న సామెతవలనే
బహుపత్నీత్వము వలన సమాజమునందు కలిగే కల్లోలములు వ్యక్తమవుతాయి. కావున కుటుంబ దు:ఖానికి కారణమైన ఈ బహు పత్నిత్వము మాని, అనాది కాలం నుండి ఈ దేశంలో నడుస్తున్న ఏక పతివ్రతము వలెనే ఏక పత్నీవ్రతమును దేశాభిమానంతో స్థాపిస్తారని నమ్ముతున్నాను.
ఉదయాదిత్య మహారాజు వాఘేలి రాణి పట్ల అనురాగము తోను, సోళంకి రాణిని దాసివలెను చూస్తుండేవాడు. కొంతకాలానికి సవతి పోరు ఎక్కువై వాఘేలి రాణి సోళంకి రాణిని ఇంటినుండి వెళ్ళగొట్టించింది. కానీ, మంత్రి మొదలగువారు మధ్యవర్తులై సోళంకి రాణి, ఆమె కుమారుని యొక్క పోషణకు గాను రెండు గ్రామాలను ఇప్పించి, నివసించడానికి ఊరి బయట ఒక గృహాన్ని ఇప్పించారు. సోళంకి రాణి ఆలోచన ఉన్నది కనుక ప్రాప్తించిన దుస్థితినందు కూడా తన కుమారునికి విద్యాబుద్ధులు చెప్పించడం మరవలేదు. ఇతర వ్యయాలన్నీ తగ్గించి మిగిలిన ధనంతో కుమారునికి రాజ యోగ్యమైన విద్యలన్నీ చెప్పించింది. ఇలా జగదేవుడు కొన్నాళ్ళలోనే రణధవళుడు కంటే శూరుడని విఖ్యాతి పొందాడు. దీంతో రాజ్యంలోని లోకులందరూ జగదేవునియందే బద్ధానురాగులై ఉన్నారు. రాజు కూడా జగదేవుని శౌర్య సాహసాలను విని సంతోషిస్తుండేవాడు. కానీ వాఘేలి రాణికి కోపం వస్తుందేమోనని రాజు తనకు జగదేవుని పట్ల గల ప్రేమను వ్యక్తీకరించడానికి వెనుకాడేవాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత పైన వర్ణింపబడిన బిరజు రాజుగారు పంపిన శుభలేఖను తీసుకుని కొందరు బ్రాహ్మణులు ఉదయాదిత్యుని సభకు వచ్చారు. ఆ శుభపత్రికలను చూసి రాజు ఆనందభరితు డయ్యాడు. కానీ రణధవళునికి వివాహం కానందున వాఘేలి రాణి జగదేవుని వివాహానికి అనుమతి ఇస్తుందో లేదో అని సంశయించాడు. కానీ జగదేవుని అదృష్టం వలన రాజుగారు వాఘేలిని త్వరలోనే సమాధాన పరచగలిగాడు.
ఇలా పెద్ద భార్య అనుమతి పుచ్చుకుని ఉదయాదిత్యుడు టుకుటేడా గ్రామానికి తరలివెళ్ళి, కుమారుడైన జగదేవునికి వివాహం చేసి కోడలు వీరమతిని వెంట తీసుకుని ధారానగరానికి వచ్చాడు. జగదేవునికి వివాహం అయినప్పటి నుండి సోళంకి రాణి, జగదేవుడు పూర్వపు ఇంటినందుండక రాజగృహమునందే ఉన్నారు. కొన్ని రోజులు అత్తవారింట ఉండి, వీరమతి పుట్టింటికి వెళ్ళింది.
ఇలా పెద్ద భార్య అనుమతి పుచ్చుకుని ఉదయాదిత్యుడు టుకుటేడా గ్రామానికి తరలివెళ్ళి, కుమారుడైన జగదేవునికి వివాహం చేసి కోడలు వీరమతిని వెంట తీసుకుని ధారానగరానికి వచ్చాడు. జగదేవునికి వివాహం అయినప్పటి నుండి సోళంకి రాణి, జగదేవుడు పూర్వపు ఇంటినందుండక రాజగృహమునందే ఉన్నారు. కొన్ని రోజులు అత్తవారింట ఉండి, వీరమతి పుట్టింటికి వెళ్ళింది.
రాజగృహమునందే ఉండి రోజూ సభకు వచ్చి రాజకార్యము లను నిర్వహిస్తుండడం వలన జగదేవుని కీర్తి దినదినము వృద్ధిచెంది సభవారందరూ అతనినే ప్రేమిస్తుండేవారు. వాఘేలీ కుమారుడైన రణధవళుడు చిన్నప్పటి నుండి వెర్రివానివలె ఉండడంచేత అతడెవరికిని ప్రియుడు కాలేకపోయాడు. ఇలా తన కుమారుని చూసి అందరూ అసహ్యపడుతున్నారని, తన సవతి కుమారుడిని అందరూ ప్రేమిస్తున్నారని చూసి అలాగే కొన్ని రోజులు జరగనిస్తే తన కుమారుడ్ని వెళ్ళగొట్టి జగదేవుడే రాజవుతాడని వాఘేలీ రాణి భావించింది. జగదేవుడు తన సవతితల్లి అయిన వాఘేలీ రాణిని ఎప్పుడూ సంతోషపెట్టాలని, తనపై ఆమె పుత్ర వాత్సల్యం చూపించాలని, ఎల్లప్పుడూ ఆమె అంత:పురానికి పోయి ఆమె కరుణని పొందడానికి ప్రయత్నించేవాడు. ఇలా తన అంతఃపురానికి స్వచ్ఛమైన ఆలోచనతో పలుమార్లు వచ్చిన బాలునిపై గొప్ప నెపమొకటి మోపి, రాజుకి నమ్మకం కలిగేలా చేసి వాఘేలీ రాణి ఆ జగదేవుడ్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టించింది. అప్పుడా కుమారుడు ఒక గుర్రాన్ని, తన ఆయుధాలను మాత్రం వెంట పుచ్చుకుని, పట్టణంలోని స్వతంత్ర సంస్థానానికి వెళ్ళి అక్కడ రాజువద్ద ఏదైనా అధికారం సంపాదించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ సంస్థానానికి బయలుదేరాడు. కానీ అంతలో తన సహధర్మచారిణి అయిన వీరమతిని చూసి, ఆమె అనుమతిని పొంది పట్టణానికి వెళ్దామని అనుకుని గుర్రాన్ని టుకుటేడా పట్టణం వైపునకు తిప్పాడు. ఇలా జగదేవుడు ప్రయాణమై కొన్ని దినాలకు టుకుటేడా గ్రామ సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనం చేరాడు. అక్కడికి చేరేసరికి సాయంత్రమైనందున గుర్రం ప్రయాణంతో అత్యంత ఆయాసపడినందువలన అక్కడ కొంతసేపు శ్రమ తీర్చుకుని రాత్రి వెన్నెలలో గ్రామం చేరవచ్చని తలంచి జగదేవుడు ఆ ఉద్యానవనంలోనికి వెళ్ళి గుర్రం విడిచి, తాను ఫలహారం చేసి నిద్రపోయాడు.
జగదేవుని వెళ్ళగొట్టిన తర్వాత వాఘేలీ రాణి వెంటనే కొందరు దుర్మార్గులకు ధనాశ చూపి జగదేవుని త్రోవలో చంపిరండని పంపింది. జగదేవుడు వెళ్ళిన దిక్కుకే వారూ వెళ్ళారు, కానీ తన సవతి తల్లి తనను చంపడానికి ఇలా మనుషులను పంపుతుందే మోనని ఆలోచించి జగదేవుడు పెద్ద త్రోవను విడిచి వంకర దారిన వెళ్ళాడు. కనుక వాఘేలీ పంపిన మనుష్యులకు అతడు త్రోవలో కనబడలేదు. అయితే పైన వర్ణించిన ఉద్యానవనంలో నిదురిస్తు న్నప్పుడు ఆ నలుగురు మనుష్యులు అక్కడికి ప్రవేశించి నిదురిస్తున్న రాజపుత్రుని బంధించి అడవిలోనికి తీసుకుపోయారు. ఇంతలో దైవవశమున వీరమతి, ఆమె చెలికత్తె పురుష వేషాలు వేసుకుని వేటాడి ఆ వనంలోకి వచ్చారు. అప్పుడక్కడి సేవక జనం ఆమెతో ఎవరో రాజపుత్రుడు అక్కడికి వచ్చాడని, నిద్రిస్తున్న సమయంలో అతన్ని నలుగురు దొంగలు పట్టుకెళ్ళారని చెప్పారు. ఆ మాటలు విన్నంతనే వీరమతి, ఆమె చెలికత్తె దొంగలు పోయిన త్రోవలోనే రాజపుత్రుని విడిపించుటకై గుర్రాలను పరుగెత్తించారు. కొంతదూరం పోయిన తర్వాత ఒక అరణ్యంలో ఆ శూర స్త్రీలు కాళ్ళూ, చేతులూ కట్టేసి ఉన్న జగదేవుడ్ని మధ్యలో పెట్టుకుని అతన్ని చంపాలా, వద్దా అని తమలో తాము వాదించుకుంటున్న నలుగురు దొంగల్ని చూశారు. పురుష వేషాలలో ఉన్న వీరిద్దరినీ చూసి దొంగలు వారివద్ద ధనం తీసుకోవాలన్న కోరికతో వారిమీదికి వచ్చారు. కానీ వీరమతి, ఆమె సహచరి భయపడక వారిపై తమ కంకపత్రాలను, బల్లాలను ప్రయోగించసాగారు. ఆ దుష్టులు చేయగలిగిన ప్రయత్నాలు చేశారు కానీ, వారిలో ఒకడు వీరమతి చేతిలో చచ్చాడు. మరొకడు చెలికత్తె యొక్క బల్లెం దెబ్బకి తొడతెగి కింద కూలాడు. వీరమతిని చూసి మిగిలిన ఇద్దరూ పారిపోయారు. అప్పుడు వీరమతి జగదేవుని కట్లు విప్పి, అతను తన పెనిమిటి/భర్త అని తెలుసుకుని, తానెవరో చెప్పకుండా అతన్ని గ్రామానికి రమ్మని బలవంతం చేసి వెంట తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజస్వరూపం చూపగా తన ప్రాణాలు రక్షించినది తన అర్ధాంగేనని తెలుసుకుని జగదేవుడు అత్యంత సంతోషపడ్డాడు. అప్పుడు వీరమతి ”మాకు తెలియ చేయకుండా ఇలా ఒక్కరూ వచ్చుటకు కారణమేమిటని” భర్తను అడిగింది. అందుకు అతడు తన వృత్తాంతమంతా చెప్పి ”నన్ను తీసుకుపోయిన దుష్టులు మా సవతి తల్లిగారిచే పంపబడినవారు. నేను ఇకమీదట ఇక్కడ ఉన్న పక్షాన, నీ అన్నగారు మా తండ్రికి సామంతుడు కనుక, అతనికి చేటు వాటిల్లును కనుక, నేను పట్టణ సంస్థానానికి పోయి అక్కడ ఉద్యోగము సంపాదించుకుని నిన్ను పిలిపించుకుంటాను. పోడానికి అనుమతి ఇవ్వు” అని అన్నాడు. అంతట వీరమతి, తనను వెంటతీసుకుని వెళ్ళమని తొందర పెట్టసాగింది. దాంతో జగదేవుడు బావమరిదియైన బిరజుని సమ్మతి పొంది, భార్యను వెంటతీసుకుని పోడానికి ఒప్పుకున్నాడు. వెంట కొంత సైన్యాన్ని తీసుకెళ్ళాల్సిందిగా బిరజుడు బలవంతపెట్టాడు కానీ, అందుకు జగదేవుడు సమ్మతించలేదు. భార్యాభర్తలిరువురూ రెండు గుర్రాలపైనెక్కి, యుద్ధానికి ఉపయోగించే శస్త్రములను వెంట తీసుకుని, పట్టణానికి బయల్దేరారు.
ఇలా ప్రయాణం చేస్తూ వారొకరోజు మధ్యాహ్నం ఒక ఊరిలో దిగి, భోజనం చేసి, విశ్రమించి అక్కడున్న వారిని పట్టణానికి దారి ఏదని అడగగా, వారు రెండు దారులున్నాయని, వాటిలో ఒక దారిలో మనుష్యులను తినే రెండు పెద్దపులులు ఉన్నాయని చెప్పారు. అప్పుడు పులులున్న త్రోవలోనే మనం వెళ్ళి వాటిని వేటాడి చంపి లోకులకు ఉపకారం చేద్దామని వీరమతి జగదేవునితో చెప్పింది. భార్యయొక్క శౌర్యోత్సాహాలను చూసి జగదేవుడు సంతోషించి ఆ దారిలోనే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఆ దారిలో నాలుగు క్రోసుల దూరం పోగానే వారు ”ఈ క్రూరమృగాన్ని చంపి మా ప్రాణాలను రక్షించండి” అన్న ధ్వనిని విన్నారు. వారిద్దరూ ఆ శబ్దం వచ్చిన దిక్కుకు తమ గుర్రాలను త్రిప్పి కొంత దూరం వెళ్ళారు. దూరం నుంచి చూడగా పెద్ద చెట్టుపైన ఇద్దరు మనుష్యులు కూర్చుని గజగజ వణకడం, క్రింద ఒక పెద్దపులి బొబ్బలు పెడుతూ, ఎగురుతూ, భయంకరమైన రూపంలో చెట్టుపైనున్న మనుష్యులను క్రింద పడేయడానికి ప్రయత్నిస్తుండడం కనపడింది. ఇది చూసి వారిరువురూ ఆ పులిని సమీపించి ఒక పొదచాటు నుంచి దాని వీపుకు తగిలేట్టుగా బాణం వేసారు. దానితో ఆ పులి ఆ వృక్షం మీది మనుష్యులను వదిలి, వెనుకకు తిరిగి తనను నొప్పించిన దంపతులపైకి ఉరికింది. అంతలో జగదేవుడు మరొక బాణం వేయగా అది తప్పిపోయింది. అందుచేత ఆ పులి మరింత గర్జిస్తూ జగదేవుని సమీపించింది. అప్పుడు వీరమతి తన చేతి బల్లెము ఆ పులి పొట్టలో గ్రుచ్చగా అది క్రిందపడి ప్రాణాలు విడిస్తూ పెద్దగా బొబ్బరించింది. ఆ ఘోర శబ్దాన్ని విని, పొదలలో ఉన్న ఆడపులి అంతకంటే పెద్దగా అరుస్తూ తన ప్రాణనాయకునికి సహాయంగా వచ్చింది. అప్పుడు ఆ శూర దంపతులు కలిసి ఆ పులిని కూడా చంపారు కానీ దాని గోళ్ళతో గీరబడినందున జగదేవుని గుర్రం ఆ బాధతో మృతి చెందింది. అందుకు జగదేవుడు ఎంతో చింతించి, తన దేహంపైనున్న పచ్చడము దానిపై కప్పాడు. చెట్టుపైనున్న ఇద్దరు మనుష్యులు దిగివచ్చి, తమ ప్రాణదాతలకు నమస్కరించారు. మీరెవ్వరని జగదేవుడు వారిని అడుగగా వారిలా చెప్పారు. ”ఉదయాదిత్య మహారాజుగారి రెండో కుమారుడైన జగదేవుడు ఇరవై రోజుల క్రిందట ఏ కారణం వలననో ఇంటినుంచి బయలుదేరి ఎవరికీ చెప్పక ఎక్కడికో పోయినాడు. అతని తల్లియైన సోళంకీ రాణి అతనిని వెదకడానికి ధీరసింహుడను మంత్రిని పంపింది. మేము ధారానగరం వద్ద ఉన్న ఒక పల్లెలోని వారము. ప్రయాణంతో అందరికంటే ముందుపోయి భోజన ప్రయత్నం చేయడానికై ధీరసింహుడు మమ్మల్ని వెంట తెచ్చాడు. నిన్నటిరోజు మేము ధీరసింహుని కంటే మొదట బయలుదేరి ముందటి గ్రామానికి పోతుండగా త్రోవతప్పి ఈ అడవిలోకి వచ్చి పెద్దపులులచే బాధితులమైనాము”. ఇలా వారిచే తన తల్లి క్షేమ సమాచారాన్ని, తనను వెదకడానికై తన తల్లిగారు తనకి అత్యంత ప్రియమైన ధీరసింహుడ్ని పంపిందని విని, జగదేవుడు అత్యంత సంతోషితుడై ధీరసింహుడు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకుని పొమ్మని వారిని ఆజ్ఞాపించాడు. వారిలో ఒకడు ముందు, నడుమ గుర్రంపైన జగదేవుడు, వీరమతి, వారి వెనుక ఇంకొక సేవకుడు.. ఇలా నడుస్తూ కొంతదూరం వెళ్ళిన తర్వాత వారికి ఎవరో గుర్రపు రౌతులు ఎనిమిది, పదిమంది ఎదురుగా వస్తున్నట్లు కనిపించారు. వారు ధీరసింహుని మనుష్యులేనని నమ్మి జగదేవుడు, ఇతరులు వారి రాకకై ఎదురుచూస్తూ నిలబడ్డారు. కానీ కొంతసేపటికి వచ్చేవారు తమకు మిత్రులు కాక, ఎవరో శత్రువులని తెలిసింది. అప్పుడు జగదేవ, వీరమతులు శస్త్రాస్త్రములను సవరించుకుని యుద్ధానికి సన్నద్ధులైనారు. వారి వెంట ఉన్న సేవకులు కొన్ని రాళ్ళను పోగు చేసుకుని అక్కడున్న ఒక వృక్షాన్నెక్కి శత్రువులపై రువ్వసాగారు.
ఇంతలో ఆ గుర్రపు రౌతులు వచ్చి ఆ దంపతులను చుట్టుకున్నారు. వారు ఎనిమిది మంది ఉన్నందున వారితో పోరాడి గెలవడం అసాధ్యమని తలచి, జగదేవుడు వారు తమపైకి రాకుండా ఖడ్గము తన చుట్టూ త్రిప్పుకొనమని తన భార్యకు సూచించి, తాను కూడా అదే ప్రకారం చేశాడు. వీరిలో మునుపు జగదేవుని పట్టుకొనిపోయిన వారిలోనివాడు ఒకడున్నందున వీరందరూ వాఘేలి రాణిగారిచే తమని చంపడానికి పంపబడిన వారని గ్రహించారు. ఇలా కత్తి చుట్టూ త్రిప్పుకుని ఆత్మ సంరక్షణ చేసుకుంటున్న ఆ దంపతులపై ఆ శత్రువులు అనేక బాణాలు కురిపించారు కానీ అవన్నీ వేగంతో త్రిప్పబడుతున్న ఖడ్గముచేత ముక్కలయ్యాయి. ఆ సమయంలో వారి శరీరాన్ని స్పృశించడానికి వాయుదేవునికి కూడా సాధ్యం కాలేదు. ఇలా మహావేగంతో కత్తి కొంతసేపు తిప్పి అలసి, ఇక అలా చాలాసేపు చేయడం అసాధ్యమని తలచి వీరమతి వారు చుట్టిన ఆవరణమును పగుల గొట్టి అవతలికి పోడానికి ప్రయత్నించింది. అలాగే చేయమని పతికి కూడా సూచించింది. వారిద్దరూ రెండు ప్రక్కల ఆవరణమును పగలదీయడానికి ప్రయత్నించసాగారు.
వీరమతి ఆ శత్రువుల నాయకునిపై ఒక బాణం వేయగా అతడు ఆ బాణాన్ని తప్పించుకున్నాడు కానీ ఆ బాణం తగిలి వాని గుర్రం కూలిపోయింది, ఆ గుర్రం కూలగానే అతడు కూడా క్రిందపడి మూర్ఛపోయాడు. ఇలా వీరమతిచే తమ నాయకుడు భంగపడటం చూసి ఇతరులందరు కోపావేశ పరవశులై ఆ అబలపైకి ఉరికారు. వారందరూ ఇలా ఒక్కసారిగా వచ్చినా వీరమతి వారితో పోరాడింది కానీ, అంతవరకు ఖడ్గం త్రిప్పి త్రిప్పి అలసి ఉన్నందున ఆ ఘోర కలహంతో ఆమె చేతిపట్టు జారి ఖడ్గం క్రిందపడింది. దానిని తీసుకోడానికై ఆమె ప్రయత్నించేంతలో రెండు బాణాలు వచ్చి ఒకటి ఆమె కాలికి, మరొకటి ఆమె చేతికి తగిలాయి. దాంతో ఆమె మూర్ఛిల్లింది కానీ, ఇంతలో జగదేవుడు తన ఖడ్గంతో ఆ దుర్మార్గుని రెండు చేతులను నరికి తన ప్రియభార్యను విడిపించుకున్నాడు. ఇక జగదేవునికి మూర్ఛిల్లిన భార్యను రక్షించుకోవటం, శత్రువులతో యుద్ధం చేయటం రెండు పనులూ చేయవలసి వచ్చింది. ఇలా జగదేవుడు తన శౌర్యమంతా చూపుచుండగా ధీరసింహుడు ఇరవై గుర్రపు రౌతులతో అదే మార్గాన రావటం జరిగింది. ఆయన జగదేవుని గుర్తించి ఆ దొంగలనందరినీ ఖైదు చేసాడు. తరువాత ధీరసింహుడు గుర్రం దిగి జగదేవుని కౌగలించుకుని అతనిచే దొంగల వృత్తాంతమంతా విని మూర్ఛిల్లి ఉన్నది వీరమతి అని తెలుసుకుని ఆమెకు శీతోపచారాలు చేయించి, గాయాలకు కట్లు కట్టించాడు. అంతట ఆమె స్పృహలోకి వచ్చి, ధీరసింహుని చూసి అతనికి మ్రొక్కింది. తరువాత వారందరూ ఆ రోజున అక్కడే కలిసి భోజనాదులు చేసారు. భోజనానంతరం ధీరసింహుడు జగదేవునితో ఇలా అన్నాడు ”ఇది అంతా వాఘేలీ రాణిగారు చేసిన పనే. కనుక నువ్వు ధారానగరానికి వచ్చి ఈ సంగతినంతా మీ తండ్రిగారికి విశదపరచి నీ యందు దోషం లేదనేది నిరూపించుకోవాలి. ఇందుకోసం నేను నీవైపు సాక్ష్యమిస్తాను”. అంతట తానలా చేస్తే తన సవతి తల్లికి అవమానం అవుతుందని, తాను ఇంటినుండి బయలుదేరినప్పుడు తన బాహుబలంచే కీర్తి సంపాదించి కానీ తండ్రికి ముఖం చూపనని ప్రతిజ్ఞ చేసానని, తాను పట్టణానికి వెళ్ళి అక్కడ తన బాహు పరాక్రమంతో కీర్తిని, సిరిని సంపాదించి, తల్లిని తండ్రిని చూడటానికి వస్తానని జగదేవుడు ధీరసింహుడికి చెప్పాడు. ధీరసింహుడు అందుకు సమ్మతించి తన గుర్రాలలో ఒకదానిని జగదేవునికిచ్చి, అతని అనుమతి పుచ్చుకుని ధారానగరానికి వెళ్ళాడు. అప్పుడు జగదేవుడు ”మా తల్లిగారికి నా క్షేమసమాచారం చెప్పి, ఆమెకు ఏమీ కష్టం కలగకుండా చూస్తుండవలసింది”గా చెప్పాడు. ఆ మంత్రి ఉత్తముడు రాజధానికి పోయి అలాగే చేసాడు. ఇక్కడ ఆ దంపతులిద్దరూ గుర్రాలపై సవారులై మార్గంలో అనేక కష్టాలను పడుతూ కొన్ని రోజులకు పట్టణమని అపరనామముగల అణహిత పురానికి చేరారు. ఆ గ్రామానికి సమీపాన సహస్రలింగ తటాకమనే ఒక చెరువు ఉంది. ఆ తటాక తీరాన దిగి అక్కడే గుర్రాలను, వీరమతిని ఉంచి తాను బస చూసి వస్తానని జగదేవుడు గ్రామంలోకి వెళ్ళాడు.
(ఇంకా ఉంది)