ఇంద్రగంటి జానకీబాల
17 అక్టోబరు సాయంత్రం 4.40కి విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలని సికింద్రాబాద్ స్టేషన్‌లో అడుగుపెట్టినప్పుడు ఆనందంగా అనిపించింది. అంతమంది స్నేహితులతో కలిసి ప్రయాణం ఎంతో వుషారుగా తోచింది. ఎంతో శ్రమకోర్చి ఏర్పాట్లన్నీ చేసిన సత్యవతిని, భూమిక స్టాఫ్‌ని చూస్తుంటే వారిమీద ఆరాధనాభావం కలిగింది.
యాత్ర గురించి పూర్తిగా ఊహించలేకపోయినా, ముందుగానే తెలియజేసిన విషయాల వల్ల, ఇందులో వినోదంతో బాటు, సామాజికావగాహన కూడా వుంటుందని తెలుసు. అందరం కలిసి బయలుదేరడమే వినోదం. విశాఖపట్నంలో సముద్రం కనిపిస్తూ గెస్ట్‌హౌస్ – గంగవరం బస్సులో – స్టీల్ ప్లాంట్ కోసం గ్రామాలు గ్రామాలు ఖాళీచేయించి, వాళ్ళని నిరాశ్రయుల్ని చేసిన తీరుచూస్తే అందరికీ కన్నీటిసముద్రాలే అయ్యాయి మనసులు. దిబ్బపాలెం చూస్తే – మరిడమ్మ మాటలు వింటే – ఒక యుద్ధం – దాని తర్వాత విధ్వంసం తలంపుకొచ్చాయి. సముద్రంలో చేపలు పట్టుకుని జీవించే ఆ కుటుంబాలు నీటిలోంచి బయటపడిన చేపల్లా విలవిల్లాడిపోతున్నారు – అందరి మనస్సులో ఒకటే ఆవేదన – ప్రశ్న – మనం వీళ్ళకి ఏం చెయ్యగలం? ఆ చేసే పని ఎక్కడ్నించి మొదలుపెట్టాలి? వాస్తవ జీవిత చిత్రణకు మొదలెక్కడ? తుది ఎక్క్డడ? గుండెల నిండా మంటతో – మండే ఎండలో – ఆలోచించే శక్తిని ఆవేదన మింగేసింది. మూడు రోజుల యాత్రలో సెంట్రల్ జైలుకెళ్ళినా దుఃఖమే – స్త్రీలు ఎన్నిరకాల దుర్మార్గాలకు ఆహుతవుతున్నారనే ఆలోచన మరింత అశాంతి నిచ్చింది. వాకపల్లి దారుణం వింటుంటేనే ఊపిరాడని భయం కలుగుతుంది – రాజ్యహింస – దాని వెనుక రాజకీయం – అందని లోతులు. జీవన పోరాట శిథిలాల మధ్య నడుస్తూ పోతుంటే సైట్ సీయింగ్ – ప్రకృతి శోభ – చల్లని గాలి – గలగల పారే చాపరాయి వాగు చూసినా తెచ్చిపెట్టుకున్న ఉత్సాహమే – అక్కడే ఆవిష్కరింపబడిన పుస్తకం కొంత ఊరట – మళ్లీ మామూలు లోకంలోకి తీసుకొచ్చినట్టనిపించింది. జిందాల్ వల్ల భూములు పోగొట్టుకున్న ఆవేదన – అరకులోయ అందాలు ఏ మాత్రం మనసుకి తాకలేదు. బరువెక్కిన మనసులతో విజయనగర రచయితలతో కలసి కాస్సేపు కబుర్లు. తెలుగునుంచి కథలు, కవితలు హిందీలోకి తర్జువ అయి, అవి పుస్తకాలుగా వచ్చాయి. ఆనందించగలిగినంత ఆనందించలేదనిపించింది. మనసు ఉక్కిరిబిక్కిరైంది. చీకటి నీడల్ని తొలిగించేటంత వెలుగు కనిపించలేదు. మనసులోని బరువును దించేయగల మార్గం వెంటనే తోచలేదు. ఒక్కొక్క విషయం మీదా విడివిడిగా ఆలోచనల్ని పోగుచెయ్యాలని, అక్షరాల్ని, వాక్యాల్ని ఏరుకునే కార్యక్రమంలో అశాంతిగా వున్నాను.
సత్యవతి గారు!
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ బాధితుల దీనగాథలను తెలుసుకునే అవకాశం కల్పించినందుకు అభినందనలు. ప్రజల కష్టనష్టాలను తీర్చి వారిని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు లక్ష్మణరేఖలకు తలొగ్గి ప్రజాస్వామ్య విలువలకు నీళ్ళొదిలి న్యాయం ధర్మం నీతి అనే మాటలకు స్వస్తి చెప్పి, ప్రజలను అగాధాల్లోకి నెట్టివేస్తుందనటానికి నిలువెత్తు దర్పణంగా గంగవరం దిబ్బపాలెం, వాకపల్లి, శృంగవరపుకోట బాధితుల కథనాలు కనబడ్డాయి. అజ్ఞానంతో అత్యాశతో ప్రజలు తమలో తాము విభేదించుకున్న సందర్భాల్లో న్యాయపక్షంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం బాధితుల చేత గుడ్డి ప్రభుత్వమనిపించుకోవటం సిగ్గుచేటు. ప్రకృతిలో లభించే సహజవనరులనుపయెగించుకునే సముద్రవాసులను నిర్వాసితులను చేస్తూ, విద్యాగంధంలేని ఆ అమాయక జనానికి ఉద్యోగాలిస్తాననడం విడ్డరం. కార్పొరేట్ విద్యావిధానం వల్ల లక్షలాది ప్రజలను చదువులకు దూరం చేస్తూ ఉద్యోగాలు కల్పిస్తాననడం శుష్కవాగ్దానం కాదా? న్యాయనికి దర్పణంగా నిలబడాల్సిన రాచరికానికి తమ చేతల్లోని అరాచకత్వం అభద్రతను కల్పించిందేమొ? అందుకే వాకపల్లి మహిళలపై అత్యాచారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం. ఈ ప్రాంత మహిళల ధైర్యం, చొరవ, నిజాయితీ, అస్థిత్వ పోరాట పటిమ నన్నెంతో ఆశ్చర్యానికి లోను చేసాయి. ఒకపక్క ఆడవాళ్ళు అస్థిత్వంలో భాగంగా పోరాడుతుంటే, మగవాళ్ళ తాగుబోతుతనాన్ని ఆసరా చేసుకొని బలవంతంగా వాళ్ళ భూములను ప్రత్యేక ఆర్థిక మండలులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం ఎంత దుర్మార్గం? రత్నమాలగారన్నట్లు వాకపల్లి సంఘటన రైతాంగ పోరాటంలోని వాకపల్లిని, సత్యవతిగారు పద్మజానాయుడు గారిని గుర్తుకు తెస్తున్నారు. కాకపోతే మాచిరెడ్డిపల్లె సంఘటన ఎన్‌కౌంటర్‌లా జరిగింది. న్యాయపోరాటంలో భాగంగా దాడి చేసినందుకు మరింత పోలీసు బలగాన్ని తెచ్చుకొని పోలీసులు పశువులయ్యరు. వాకపల్లిలో ఎలాంటి సౌకర్యాలు లేక కొండప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న అతిపేద కుటుంబాలపై ఈ పశువాంఛ దాడి చేసింది. లోయల్లోని ప్రజలను పట్టణానికి రప్పించి వారి మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ పర్యటనలో ప్రభుత్వ దమననీతివల్ల ప్రజలు దిక్కులేనివారవుతున్న వాస్తవ కథనాలు నా మనస్సును తీవ్రంగా కలచివేసాయి. ఇంతగా పోరాడుతున్న మహిళలు కుటుంబం నుండి, భర్త కట్టుబాట్ల నుండి బయటపడలేకపోవడం మన కుటుంబ వ్యవస్థలో స్త్రీలను ఎంత పకడ్బందీగా నిర్బంధించారో మరోమారు ఆలోచించాల్సిన విషయం. అగాధ గాథల యథార్థ దృశ్యాలను చూపినందుకు కృతజ్ఞతలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags