కొండేపూడి నిర్మల
మనిషన్న వాడు రోడ్డెక్కి తీరాలి. తన గల్లీ ఏమిటో, రాజకీయమేమిటో దాని మీద ముద్దులొలికించే ఒక నెక్లెస్ రోడ్డు మెలితిరగడానికి ఎన్ని జీవితాలు నేల కూలాయె, అభివృద్ధి కబుర్లు చెప్పే ఓట్ల రాజకీయం చిరునవ్వులో ఎంత విషం బుసకొడుతుందో తెలియాలంటే ఇంటి తలుపులు బద్దలు కొట్టి బయటికి రావాలి. దేశద్రిమ్మరి కానివాడు రచయిత కాలేడట…, సగటు మనిషి కూడా కాలేడని నేను నమ్ముతాను.
భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి మరోసారి నలభై మంది రచయిత్రుల్ని అత్యంత ప్రేమతో రోడ్డుమీద పడేసింది. లోగడ చేసిన మా తలకోన, పాపికొండలు పర్యటనల్లోనూ కొంతవరకూ అభివృద్ధి బాధితుల్ని గురించి తెలుసుకోవ డానికి కేటాయించుకున్నా గానీ, ఎక్కువ శాతం ప్రకృతి సౌందర్యానికి, ఆహ్లాదానికి, మనుషుల మధ్య పెరగాల్సిన సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సారి అలా కాదు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఉత్తరాఆంధ్ర యాత్ర ఏర్పాటు చేసుకున్నాం. అది సహజంగానే సామాజిక సమస్యల అధ్యయనంతో గుండె బరువెక్కించి కర్తవ్యాన్ని గుర్తు చేసింది. దాదాపు ఆర్నెల క్రితమే నిర్ణయించుకున్నాక, అక్టోబరు పదిహేడు ఇంకా ఎన్నాళ్ళుంది? అని వేళ్ళు లెక్కపెట్టుకున్నాక, క్యాంపు వివరాలతో మొదటి ఉత్తరం అందింది. అది ఎంత సులభంగా వుందంటే కూచోవాల్సిన సీటు దగ్గర్నించీ, తెచ్చుకోవాల్సిన తువ్వాలు దాకా అన్ని జాగ్రత్తలూ సత్య సూచించింది. ఇది తన కార్య నిర్వహణా సామర్ధ్యానికి దర్పణం. పదిహేడవతేదీ సాయంత్రం అయిదుకల్లా విశాఖ ఎక్స్‌ప్రెస్ అందుకోవ డానికి కాజీపేట నుంచి రమ, రజిత, అరుణ, కొండేపూడి నిర్మల సికిందరాబాదు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న నేస్తాలైన అబ్బూరి ఛాయదేవి, శాంత సుందరి, సుజాతామూర్తి, జానకీబాల, దేవకీదేవి, శివలక్ష్మి, సమతరోష్ని, జి.విజయలక్ష్మి, శిలాలోలిత, పంతం సుజాత, బి.జయ, గిరిజ, సీతామహాలక్ష్మి, కె.బి.లక్ష్మి, హిమజ, రేణుకా అయెల, నాగలక్ష్మి, హేమంత, దివ్య, ప్రసన్న, కల్పన, ఎస్. లక్ష్మి, ప్రమీల సిద్ధంగా వున్నారు. ఘంటసాల నిర్మల ఈ సారి రైలు గొలుసు లాగకుండానే ఎక్కడం తెరిపి ఇచ్చింది. పి. సత్యవతి విజయవాడలో ఎక్కారు.
ఇక చూడాలి మా ఆనందం.. ”ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈ నాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే..” అనే పాటసారాన్ని అక్షరాలా అనుభవిస్తూ, అంత్యాక్షరి అందుకున్నాం. ఇంటితోనూ, ఆఫీసుతోనూ, మూసపోసిన సమస్యలతోనూ బూజు పట్టిన బుర్ర దులిపి పాత పాటల మధురిమ నాలుగు డబ్బాల నిండా మార్మోగింది. అపరిచితులు మా గాత్రాలకు దడుసుకుని అటు తిరిగి కళ్ళు మూసుకోగా, కొందరు మాత్రం గుండె దిటవు చేసుకుని విన్నారు. ఒక చోట మాలో పదిమంది పేకాటలో ఓడిపోయి గొల్లుమన్నారు. ఓడిన వాళ్లకు ఒదార్పుగా ఇంకొకరు లడ్డూలు పంచిపెట్టారు. మరొకరు తప్పాలా చెక్కలు అందించారు. అందరికోసం భూమిక తెచ్చిన డిన్నర్ తిని అలిసిన వాళ్ళు ఒరిగిపోగా, అలసట అంటే ఏమిటో తెలియని వాళ్ళు తెల్లవార్లు కబుర్లకు దిగారు. తెల్లగా తెల్లారేసరికి విశాఖ స్టేషను వచ్చింది. ఒక విడత కాఫీలు తాగిన వాళ్లం అంతా కల్సి ప్లాట్‌ఫారానికి అవతల సిద్ధంగా వున్న జగదాంబ స్పెషల్ బస్సెక్కి గెస్ట్ హౌస్‌కి చేరుకున్నాం. స్థానిక కవులైన మల్లేశ్వరి, వర్మ సాదరంగా ఆహ్వానించారు. అందరం కలిసి అంతదూరాన కనిపించే సముద్ర కెరటాలమీద ఇడ్లీలు నంజుకుంటూ ఉదయ ఫలహారం చేశాం. అప్పటికే ముందు చేరుకున్న ప్రతిమ, విష్ణూ సూర్యోదయన్ని పలకరించి వచ్చారని తెలిసి మా అందరికీ బొలెడంత కుళ్ళు వచ్చింది. బస్సెక్కి సింహాచలం మీదుగా గంగవరం వెళ్ళాం. విశాఖ స్టీల్ ప్లాంటు దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోనేలేదని తెలుసు. ఇప్పుడు చేపలు పట్టుకోకుండా సముద్రాన్ని కబ్జా చేస్తున్నారని, దీని వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని వాళ్ళంతా వాపోయారు.
కాన్సన్ట్రేషను సర్కారీ ముళ్లతీగల పక్కన దిగాలుపడివున్న వాళ్ళను చూస్తుంటే, చాలా బాధనిపించింది. దిబ్బపాలెంలోన అదే పరిస్థితి. జాగా ఖాళీ చెయ్యమని సతాయిస్తున్న సర్కారీకి నిరసన తెలియజేస్తూ జనం…ఇళ్ళన్నీ కూలిపోయి భూకంపం వచ్చినా కూడా ఇలా వుండదు. నిర్మాణం కూలినా మట్టి మిగులుతుంది. ఇక్కడ రాజ్యం కంటే విధ్వంసక శక్తి ఇంకోటి ఏముంది? ఆ మాట వాళ్ళే అన్నారు. నువ్వు, నేను భావవ్యక్తీకరణ బలంతో అంటే, వాళ్ళు అనుభవంతో అన్నారు.
”మా సముద్రం ఎత్తుకుపోతున్నా రమ్మా.. మాజాగా జేబులో వేసుకుపోతున్నా రయ్యా.. మా పంట కడుపులో గునపం దించుతున్నారక్కా..” అంటూ రోదిస్తున్నారు. ఆ రోదన మనుషులు చేసిన రోదనలా లేదు. భూమికీ ఆకాశానికీి గొంతు వుంటే అలాగే ఏడుస్తాయేమొ…
స్పెషల్ ఆఫీసరుతో మాట్లాడాం… ఏమంటారాయనా..?
”పట్టాలిచ్చాం, ఇంటింటికీ ఉద్యోగాలిస్తామ్…అది ఇస్తాం, ఇది ఇస్తాం” ఎప్పుడూ వింటున్నవేగా..మాలో కొందరు తమాయించుకోలేక అతనితో గొడవపడ్డారు.
జీవితాల్ని ఆక్రమించుకుని స్వలాభం కోసం కడుతున్న ఫోర్టు నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ గాని, పర్యావరణశాఖ ఆమొదం కానీ, నష్టపరిహారం కానీ ఏదీ, ఎక్కడా ఇంతవరకూ స్పష్టత లేదని వాళ్ళు చెబుతుంటే రాజ్యహింస మూలాలు ఎంత బలమైనవో అనిపించింది.
వాళ్ళకోసం పనిచేస్తున్న కార్యకర్త లక్ష్మి వివరంగా అందర్నీ పరిచయం చేసి సమస్యలు చెప్పింది. బాక్సైటు తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ పక్షాన వారి కార్యాచరణ అంశాల్ని అడిగి తెలుసుకున్నాం.
దిబ్బపాలెం నుంచి నేరుగా విశాఖ జైలుకు వెళ్ళాం. అక్కడున్న మహిళా ఖైదీలతో గడపాలని మా ఉద్దేశ్యం. అక్కడున్న జైలు అధికారి మాకోసం వాళ్ళందరినీ ఆవరణలో సమావేశపరచాడు. ఒక్కొకరిదీ ఒక్కొక్క కన్నీటి సముద్రం. ఎక్కువశాతం కుటుంబ తగాదాలే అని అక్కడి నిర్వాహకుడు ఒకరు చెప్పారు. అన్ని నేరాల చేసిన వాళ్ళు పదవుల్లో వుంటే తెలిసో తెలియకో చేసిన చిన్న నేరాలకు వీళ్ళకు శిక్ష ఏమిటి అనిపించింది నాకయితే…మాలో వున్న అడ్వకేట్స్ కొందరు వారికి న్యాయసలహాల నిచ్చారు. అనంతరం ఒక సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏదో వాళ్ళు ఏర్పాటు చేశారు చూశాం. అక్కడికి పురుష ఖైదీలు మాత్రమే వచ్చారు. మహిళా ఖైదీలు రారా అని అడిగి, సెక్యూరిటీ సమస్య అని చెబితే విన్నాం. అక్కడినుంచీ విశాఖ రచయితల్ని కలుసుకున్నాం. ఒకే వస్తువును మళ్ళీమళ్ళీ రాస్తున్నారనే అభియెగానికి అందరం తీవ్రంగా స్పందించాం..ప్రాథమిక అవసరాలే కరువై బాధపడుతున్న ఆ గడ్డమీద, ఆ సందర్భంలోనూ ఆ ప్రశ్నకే అర్థంలేదని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరిగి గెస్ట్‌హౌస్‌కి వచ్చేసరికి బాగా రాత్రయిపోయింది.
రెండవరోజు తెల్లారుఝాము అయిదింటికల్లా తయరై పాడేరుకి ప్రయణం కట్టాం. పాడేరు నుంచి వాకపల్లి బాధితుల్ని కలవడానికి కిలోమీటరు రాళ్ళదారి వుంది. దేశవ్యాప్తంగా అట్టుడికిపోయిన వాకపల్లి మహిళల బాధ మా మనసులో మార్మోగుతూ వుండగా మాలో వయసురీత్యా ఓపికలేని సీనియర్సు కూడా బస్సులో కూచోదల్చుకోలేదు. అందరం ఎలాగైనా సరే నడుస్తామన్నారు. రాళ్ళమీద ఇద్దరు జారిపడ్డారు. పదిమంది పడకుండా తట్టుకున్నారు. ఆ దారి వాకపల్లి మహిళల కష్టాలకు దర్పణంలా వుంది. అత్యాచారం జరిగిన రోజు ఈ దారిగుండా పసిపిల్లల్ని భుజాన వేసుకుని న్యాయం కోసం ఆ ఇల్లాళ్ళు నడిచి వచ్చారంటే…అది చూసి సూర్యుడు కూడా సిగ్గుతో చితికిపోయి వుండాలి. వాకపల్లి ఇల్లాళ్ళను చ్గూస్తూనే మాలో కొందరం భావోద్వేగానికి గురయ్యం. వాళ్ళు చెప్పిన సమాచార౦ విన్నాక అసలు ఇది రాజ్యమేనా..? ఇక్కడ మానవహక్కులు వున్నాయా..? అని అందరికి తీవ్రంగా అనిపించింది.
వారు చేస్తున్న పోరాటానికి నైతిక, సామాజిక మద్దతు ఇస్తామని చెప్పాం. ప్రభుత్వం అయిదు లక్షల పరిహారం ఇస్తామని ప్రలోభాలు పెడుతోందని, న్యాయం మాత్రమే తమకు కావాలని వాళ్ళు చెప్పారు. సంఘటన జరిగిన తర్వాత నుంచి ఇప్పటివరకు పుట్టింటి మొహం చూడటానికి కూడా సిగ్గుపడుతున్నామని, ఎక్కడ కనిపించినా ”పోలీసు పోరి” అంటున్నారని అక్కడి స్త్రీలు కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. అందరికీ గుండె పిండినట్టయింది. ఒక దశలో సత్య దుఃఖంతో బొంగురు పోయిన గొంతుతో ”అక్కలారా, మీకు జరిగిన అన్యాయనికి మేము స్పందిస్తున్నాం, మీ పోరాటానికి, శక్తికీ మేము తలఒంచి మొక్కుతాం..లేదు..మీరు మైలపడలేదు..ఆ ఆలోచన రానివ్వకండి. ఈ ప్రభుత్వమే మైలపడింది. మానవత మైలపడింది. రచయిత్రులుగా మీకు కావాల్సిన సామాజిక మద్దతు మేము ఇస్తున్నాం…” అని చెప్పింది. అందరి అభిప్రాయము అదే, సత్య చెప్పగలిగింది. మేము మాట కూడా లేని మూగవాళ్ళం అయ్యా౦.
ఆ తర్వాత అరకు వెళ్ళాం. అరకు సౌందర్యం రైలులో వెళ్ళినప్పుడు తెలుస్తుందట. ఏమొ మాకు తెలీదు. మా మనసునిండా నిన్న చూసిన వాకపల్లి ఇల్లాళ్ళు వున్నారు. కొండలూ, నీళ్ళు, గట్లు అన్నీ అమాయక గిరిజనుల్లాగా కనిపించాయి. మొదటిసారిగా ప్రకృతి సౌందర్యం అంటే భయం వేసింది. వీటిని కూడా మనుషులు అమ్మేస్తారా..? కొనేస్తారా? దోచేస్తారా..? దగాచేస్తారా..? అనిపించింది. అరకు వ్యాలీలో వున్న ఒక ప్రభుత్వ మ్యూజియం చూశాం. గంగవరం, దిబ్బపాలెం, వాకపల్లి నిర్వాసితుల్ని చూసిన కళ్ళకి మ్యూజియం అనేది ఒక కుట్రగా అనిపించింది. ఏ ఆదివాసి జనాల్ని తరిమికొట్టారో, వాళ్ళ భూమినీ, సముద్రాల్నీ, కొండల్నీ, కడుపుల్నీ, అడవుల్నీ లాక్కున్నారో, అవే చిహ్నాల్ని ఇక్కడ బంధించి కళాత్మకత ప్రదర్శించడం…!!! ఆ దగాపడ్డ ప్రతిబింబాలే కదా, ఆత్మలే కదా ఈ మ్యూజియంలో మూలుగుతున్నది అనిపించి బాధనిపించింది. వారణాసి నాగలక్ష్మి కూడా నాతో ఇదే నిట్టూర్పు పంచుకుంది. మూడో రోజు ఒక సస్పెన్సు మాకోసం ఎదురుచూస్తోందని తెలీదు. చాపరాయి వెళ్ళి అక్కడి సౌందర్యానికి పులకించిపోయి ఆ రాళ్ళమీదుగా పారుతున్న సెలఏటి గలగల మీద పరుగులు పెట్టాం. క్యాంపు మొత్తంలో కొంచెం తెరిపిన పడింది ఆ ఒక్కరోజే. పైకి తేటగా కనిపిస్తున్నా అక్కడ చాలా లోతు వుంటుందని స్థానికులు హెచ్చరించగానే గొణుక్కుంటూ కొంచెం అల్లరి తగ్గించాం. కొంతసేపటికి సత్య అందర్నీ పిలిచి గుండ్రంగా కూచోపెట్టింది. కళ్ళు మూసుకోమంది. కొందరు దొంగచూపులు చూడగానే వారించింది. కళ్లు తెరిచే వేళకి ఏం మిఠాయి పెడుతుందా అని ఎదురుచూసి, కళ్ళు తెరిచేసరికి ప్రతిమ, పి. సత్యవతి మధ్యలో కూచుని కనిపించారు. అందరం ఆశ్చర్యంగా చూస్తూ వుండగానే, కొండల, గుట్టల సాక్షిగా ప్రతిమ కథల పుస్తకం ”ఖండిత” ఆవిష్కరణ జరిగింది. పి. సత్యవతి అందులో వున్న కథల గురించి చెప్పింది. ఇంతమంది ఆత్మీయుల మధ్య, ప్రకృతి మధ్య తన కథావిష్కరణ జరగడం అదృష్టమని ప్రతిమ అంది. యా౦త్రికంగా ఒక బల్లెక్కి, మైకుల నిండా ఉపన్యాసాలు కక్కే వక్తలకు దూరంగా ఈ సభ చాలా రసవంతంగా అనిపించింది. కొంతమందిమి అయితే సంబరం తట్టుకోలేక కథారచయిత్రికి తలొక ముద్దు కానుకగా ఇచ్చాం. వాన వల్ల బొర్రాకేవ్స్ లోపలికంటా వెళ్ళి సరిగా చూడలేకపోయం. కొద్దిమంది మాత్రం వానలో తడుసుకుంటూ లోపలి కంటా వెళ్ళి సెలయేరు చూసి వచ్చామన్నారు. సెజ్ బాధితుల్ని మళ్ళీ కలిసి బాక్సైటు తవ్వకాల పోరాటకమిటీ కొత్త డిమా౦డ్లను తెలుసుకున్నాం. సర్కారి తొక్కిన పంటపొలాల్ని చూసి ఆగ్రహపడ్డాం. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కాని, వాడి బాబు కాని ఎవరేం చేసినా మేము ఖండిస్తూనే వున్నాం. అక్కడి అధికారుల్ని నిలదీస్తూనే వున్నాం.
చివరగా విజయనగరం రచయితలు చాగంటి తులసి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మా యాత్రా స్పందనని వారితో పంచుకున్నాం. ఇక్కడ కూడా ఇంకో సస్పెన్సుకి అందరి ముందు తెర తీశాం. అదేమిటంటే ప్రముఖ రచయిత్రి శాంత సుందరి తెలుగు నుంచి హిందీలోకి అనువదించిన కథా కవితల సంకలన ఆవిష్కరణ. నిర్వాహకులైన ఇద్దరు ముగ్గురికి తప్ప ఈ విషయం మిగిలిన రచయిత్రులకి తెలీదు. మాలో ఎక్కువ మంది అనువాదిత కథలు, కవితలు అందులో వుండటం వల్ల అందరు ఉత్కంఠకు గురి అయ్యారు. విజయనగరం సాహితీప్రియులు, మా అనుభవాల్ని మరీ మరీ అడిగి తెలుసు కున్నారు.
ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మూడు రోజుల్లో పూర్తిచేసుకున్న యాత్ర ఇది. నాకయితే అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఎక్కువ మంది ఇదే మాట చెప్పారు.
కదిలే బస్సులో నుంచుని కలేజాగా నాటకాలేశాం. నవ్వీ నవ్వీ సత్యవతికి వెన్నెముక పట్టేసింది. నేను వెనక్కి పడ్డాను, నన్ను చూసి నవ్వబోయి ఇంకెవరో ముందుకి పడ్డారు. ఘంటసాల నిర్మల మొకాలుకీ, వరంగల్లు రమ మొచేతికీ తోలు వూడ్డం చూశాను. మొహమాటంగా, ముక్తసరిగా వుండేవాళ్ళు కూడా ఈసారి కబుర్ల పోగులయిపోయారు. ఈ క్యాంపు మనుషులుగా మమ్మల్ని దగ్గర చేసింది. రచయిత్రులుగా బాధ్యతను గుర్తుచేసింది. సామాజిక స్పందనకి సామూహిక మద్దతు అంటూ వుంటే అది ఎంత బలంగా వుంటుందో తెలిసింది. పోగొట్టుకున్న చోటునే నిలబడి యుద్ధం చేస్తున్న ఒక ఆదివాసీి మహిళ పాదాల సాక్షిగా మాలో ఏదో జరిగింది. ఆ ఏదో…చెప్పడానికి పరమ దుర్మార్గమైన నా నాగరిక భాష సరిపోవడం లేదు.