ప్రతి సంవత్సరం జరిగే పుస్తక ప్రదర్శనలో పాల్గొనడం, ఒకటికి పదిసార్లు స్టాల్స్‌ని సందర్శించడం, ఇష్టమైన పుస్తకాలు కొనుక్కోవడం… ప్రతి సంవత్సరం చేసే పనే. ఓ రెండు నెలల క్రితం ప్రశాంతి, నేనూ ఏదో మాట్లాడుకుంటూన్నప్పుడు, మనం ఈసారి బుక్ ఫెయిర్‌లో స్టాల్ పెడదామా అంటూ చాలా మాట్లాడుకున్నాం. అలా అంకురార్పణ జరిగింది. అనుకున్నదే తడవుగా ‘తోపుడు బండి’ సాధిక్‌కి ఫోన్ చేశాను. బుక్ ఫెయిర్‌లో స్టాల్ పెట్టాలంటే ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు అతను ప్రోసీజర్ చెప్పాడు. డి.డి. ఎంత కట్టాలో, ఎలా కట్టాలో కూడా చెప్పాడు. డి.డి. కట్టేసాం.
స్టాల్ పెడతాం సరే అందులో పెట్టడానికి మన దగ్గరున్న పుస్తకాలెన్ని… ఎవరి దగ్గర నుండి తీసుకోవాలి… ఎంత చెల్లించాలి… ఇవేవీ తెలియవు. అయితే భూమిక హెల్ప్‌లైన్ గురించి, స్త్రీలకు సమస్యలొచ్చినప్పుడు ఆదుకునే సపోర్ట్ సెంటర్లు, బాల్య వివాహాల దుష్స్రభావాలు… వీటన్నింటి గురించి విస్త ృతంగా చెబుదామ నుకున్నాం. స్టాల్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరికి హెల్ప్‌లైన్ కార్డు ఇవ్వాలని, హెల్ప్‌లైన్ పనితీరు గురించి వివరించాలనుకున్నాం. చెంచల్‌గూడా మహిళా కారాగారంలో పని చేస్తున్నాం కదా! ‘నిర్మాణ్’ అనే సంస్థవారు మహిళా ఖైదీలకు శిక్షణనిచ్చి తయారు చేయించిన వస్తువులను భూమిక స్టాల్‌లో అమ్మాలనుకున్నాం. ఆ సొమ్ము వారికే చేరుతుంది. మేము రెండు స్టాల్స్ తీసుకున్నాం కాబట్టి ఒకవైపున ప్రిజన్ ప్రోడక్ట్స్ పెట్టాలని అనుకున్నాం.
భూమిక చేపట్టిన, నడుపుతున్న అన్ని కార్యక్రమాల గురించి వివరిస్తూ ఫ్లెక్సీలు తయారు చేయించాం. హెల్ప్‌లైన్ గురించి ఒక ఫ్లెక్సీ, మేమిచ్చే జెండర్ స్పృహ మీద శిక్షణలకు సంబంధించి ఒకటి, ప్రిజన్ కార్యక్రమం మీద ఒకటి, మహిళా పోలీస్ స్టేషన్‌లలో మేము నడుపుతున్న సపోర్ట్ సెంటర్ల గురించి ఒకటి, మహబూబ్‌నగర్‌లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్న కార్యక్రమాల గురించి ఇలా ఐదు ఫ్లెక్సీలు చేయించి స్టాల్‌లో వేలాడదీసాం. హెల్ప్‌లైన్ స్టిక్కర్లు అతికించాం. భూమిక టీమ్‌లో అందరూ స్టాల్‌లో వంతుల వారీగా ఉండేలా ప్రణాళిక తయారు చేసాం.
డిశంబరు 16 రానే వచ్చింది. పుస్తకాల సందడి మొదలైంది. మేము ఎలాంటి ప్రయత్నం చేయకుండా మాకు ఎంట్రన్స్‌కు దగ్గరలో, ఎదురుగా ఖాళీ జాగాతో 272, 273 స్టాల్స్ కేటాయింపు జరిగింది. గమ్మత్తుగా మాకు రెండు స్టాల్స్ అవతల మితృడు దాసరి అమరేంద్రగారి ‘ఆలంబన’ స్టాల్ ఉండింది. ఎదురుగా తెలుగు అకాడమీ, కొంచం అవతలగా నేషనల్ బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం స్టాల్స్ ఉన్నాయి. తోపుడు బండి స్టాల్, జ్యోతి వలభోజు స్టాల్ కొంచం దూరంగా
ఉన్నాయ్. మా స్టాల్ మాత్రం చాలా అనువైన చోట ఉంది.
272లో సందడి మొదలైంది. మధ్యాహ్నం నుండి సాయి, లక్ష్మి, రెహమత్‌లు ఉండేవాళ్లు. సాయంత్రానికి నేను, ప్రశాంతి చేరే వాళ్ళం. మధ్యలో రెండు రోజులు తప్ప అన్ని రోజులు వెళ్ళాను. భలే అనుభవం. స్టాల్ ముందు నిలబడితే చాలు పక్కస్టాల్ నుండి అమరేందర్ ఆత్మీయ పలకరింపులు… వచ్చేపోయే పుస్తక ప్రియులు… నాకు తెలిసిన ఎంతో మంది పరిచయస్తులు, ముఖ పుస్తక మితృలు… కబుర్లు, నవ్వులు, చాయ్‌లు, మిరపకాయ్ బజ్జీలు… ఎదురుగానే పబ్లిక్ స్టేజి ఉంది. ఎన్నో పుస్తకావిష్కరణలు, సాంస్క ృతిక కార్య క్రమాలు, కథలు చెప్పడాలు, సాహిత్య సమావేశాలు 2 గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర దాకా సందడి, సంబరం.
ప్రశాంతి రాత్రింబవళ్ళు కష్టపడి తెచ్చిన ఆనందార్ణవం, విపశ్యన పుస్తకాలొచ్చాయి. భూమిక స్టాల్‌లోనే సింపుల్‌గా ‘ఆనందార్ణవం’ ఆవిష్కరణ జరిగింది. ఎస్. వేణుగోపాల్, అమరేంద్ర, బత్తుల ప్రసాదరావు, విజయలక్ష్మీ పండిట్, మంజరి… ప్రశాంతి, నేను భూమిక టీమ్ అందరం కలిసి ఆవిష్కరించాం. పూలగుత్తులు, ప్రసంగాలు లేని అతి సాధారణ ఆవిష్కరణ హాయిగా జరిగింది.
రెండు రోజుల తర్వాత కథల సంపుటి ”కొన్ని మెరుపులు – కొన్ని ఉరుములు” పుస్తకం తెచ్చింది ప్రశాంతి. ఆ రోజు నేను జైపూర్‌లోఉన్నాను. ఆవిష్కరణ లేకుండా స్టాల్‌లో పెట్టేసాం. అలా మూడు పుస్తకాలు వచ్చేసాయి. కవిత్వ పుస్తకం రావాల్సి ఉంది.
పుస్తక ప్రదర్శనలో స్టాల్ పెట్టడం, ప్రత్యక్షంగా పాల్గోవడం అనేది బోలెడు అనుభవాల సిబ్బంది. ఎంతోమంది మితృల్ని, ముఖ్యంగా సాహితీ ప్రియుల్ని, పుస్తక ప్రేమికుల్ని కలుసుకునే అవకాశం దొరికింది. స్టాల్‌లోనో, స్టాల్ బయటో కూర్చుని వచ్చేపోయే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, హెల్ప్‌లైన్ గురించి వివరించడం చాలా బాగా అన్పించేది. ఓరోజు నాగర్‌కర్నూల్ నుండి బిలబిలమంటూ స్కూల్ పిల్లలొచ్చారు. వాళ్ళందరికీ బాల్యవివాహాల మీద వేసిన పుస్తకమిచ్చి చాలాసేపు మాట్లాడాను. వాళ్ళతో కలిసి గ్రూప్ ఫోటో దిగాం. అలా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడటం చాలా గొప్ప అనుభవం. రచయితలు, మితృలు, పరిచయస్తులతో పాటు భూమిక స్టాల్‌ను కొందరు ప్రముఖులూ సందర్శించారు. తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.వి.సత్యనారాయణ గారు, బి.సీ కమీషన్ మెంబర్ వకుళాభరణం కృష్ణమోహన్ గారు సందర్శించి భూమిక చేస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఓ చల్లటి సాయంత్రం వేళ అపర్ణతోట వచ్చింది వైజాగ్ నుంచి ఉమా నూతక్కి వచ్చింది. ఆ ముందు రోజు నంబూరి పరిపూర్ణ, దాసరి శిరీష గార్లొచ్చారు. అపర్ణ వచ్చిన రోజు నేను, ప్రశాంతి, అమరేంద్ర ఈలవెయ్యడంలో పోటీపడ్డాం. మేం ఖయ్‌మని విజిలేస్తుంటే జనాలు అబ్బురంగా మా స్టాల్ వేపు చూసారు. చుట్టు పక్కల స్టాల్స్ వాళ్ళు విచిత్రంగా చూసారు. అవేమీ పట్టించుకోకుండా మేం మా ఈలల కార్యక్రమాన్ని కొనసాగించాం.
బుక్ ఫెయిర్ చివరి రోజున నేనూ, ప్రశాంతి స్టాల్ వొదిలేసి పుస్తకాలు కొనుక్కోవడానికి తిరిగాం. నేషనల్ బుక్ ట్రస్ట్, మంచి పుస్తకం స్టాళ్ళలో చాలా బుక్స్‌కొన్నాం. ఆక్స్‌ఫర్ట్ షాప్‌లో కార్డు గీకి ‘అసురుడు’ బుక్ కొన్నాం. సాయంత్రం అయిపోయింది. పుస్తకాలన్నీ కట్టలు కట్టుకుని, మంచి మంచి అనుభవాలను మూటకట్టుకుని, వచ్చే సంవత్సరం మరింత విలక్షణంగా స్టాల్ నడపాలని నిర్ణయించుకుని ఇంటి దారి పట్టాం.
కొసమెరుపు: మర్నాడు 27వ తేదీన అలవాటుగా ఎన్టీఆర్ గ్రౌండ్‌కి బయలుదేరబోయి, ఆగిపోయి, అయ్యో! అయిపోయిందే అనుకుంటూ దిగులుపడి ఆఫీసుపనిలో పడ్డాను. భూమిక స్టాల్, పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచి అందరినీ ఆకర్షిం చడం… చెప్పొద్దూ… గొప్ప సంతోషాన్నిచ్చింది. స్టాల్‌ను అద్భుతంగా నిర్వహించిన భూమిక బృందానికి జేజేలు… నా పుస్తకాలను అద్భుతంగా అచ్చు చేయించి తెచ్చిన ప్రశాంతికి ప్రేమపూర్వక అభినందనలు… చివరగా సమయానికి పుస్తకాలను అందించిన యుగంధర్‌కి థాంక్స్… వచ్చే సంవత్సరం డిశంబరులో కలుద్దాం… బై… బై…