సత్యవతిగారికి నమస్కారం
అక్టోబరు ‘భూమిక’లో చాలా ఆసక్తికరమైన విషయాలకి నా స్పందన తెలియజేయాలనిపించింది.
‘అడవి పిలిచింది’ పుస్తక సమీక్ష చాలా బాగా వచ్చింద. జాక్ లండన్ నాక్కూడా అభిమాన రచయిత. సుజాత గారు చాలా చక్కగా విశ్లేషించారు. ఆమె చిరునామా ఇవ్వగలరా?
తారకం గారికి నివాళి (టిడిఎఫ్) సముచింగా ఉంది. తారకం గారు ఎందరికో ఆప్తుడు. అన్యాయం జరిగినచోటకల్లా చుండూరు నుంచీ లక్షింపేట దాకా పరుగులు దీసి. దుర్మార్గాల్ని బహిర్గతం చేశారు. ‘ఎన్ కౌంటర్ల’ భాగోతాల్ని బట్టబయలు చేశారు. ప్రతి ప్రసంగం ఆవేశపూరితంగా, విశ్లేషణాత్మకంగా ఉంటుంది. కర్తవ్యాన్ని ప్రబోధిస్తుంది. విజయ భారతిగారు కూడా అంత బాధ్యతగానూ ఎన్నో వ్యాసాలు రాస్తూ, ‘అంబేద్కర్’ లాంటి ఉత్తమ గ్రంథాల్ని అందిస్తున్నారు. ”ఉన్న ధూళినంతా సమాజం స్త్రీల కళ్లల్లోనే కొడుతూ ఉంది” అని కుండ బద్దలు కొడుతూ రాస్తారు. దంపతులిద్దరూ స్నేహపాత్రులు. సమాజం పట్ల కర్తవ్యదీక్షని పాటిస్తారు.
”మహిళా దక్షతలో మనమెక్కడ?” అంటూ డా|| లచ్చయ్యగారు ప్రశ్నిస్తూ, సామాజిక విద్య అందించడంలో విఫలమైన తల్లిదండ్రుల్ని పక్కనపెట్టి విద్యార్థి సంఘాల బాధ్యతని గుర్తుచేశారు. కాని, 1940ల నుంచీ ఎంతో చైతన్యవంతంగా పనిచేసిన విద్యార్థి సంఘాలు ”నేడెక్కడమ్మా ఉన్నదీ?” అని అడగవలసి వస్తోంది.
కొలంబోను తను చుట్టబెట్టడమేకాక, మననీ తిప్పింది ప్రతిమ. అయితే, స్థలాల్నే కాక ప్రజల జీవితాల్నీ పరిశీలించి చెప్పగలిగే అవకాశాల్ని దొరకబుచ్చుకోగలిగితే మరింత బాగుంటుంది – యాత్ర కోసమే యాత్రకాక!
ఉదయమిత్ర ఒక అభాగ్య మహిళ స్వేచ్ఛ కోసం పడే తపనని చిన్నంగా సూటిగా చిత్రించారు.
భూమికకి అభినందనలు
……..ఙ…….. – కృష్ణాబాయి, విశాఖపట్నం