ఎన్ని ఉషోదయాలు
మరెన్ని అస్తమయాలు
పొగమంచు దుప్పట్లను
కప్పుకుంటూ కదిలిపోలేదు?
ఆశల హరివిల్లులు
ఆనందాల అలల తలుపులు
హృదయ ద్వారాన్ని తెరుచుకుని
ఎన్నిసార్లని ఎగిసిపడలేదు?
గాయాల అనువేదనలు
మర్మాల అధీనతలు
నిశ్శబ్ద ప్రపంచాన్ని ఈదుతూ
మౌనశోధనలో ఎన్నిసార్లు కరిగిపోలేదు?
విషాద అగ్ని శిఖలు
సుదీర్ఘ బాధాతప్త పగుళ్ళు
ఒంటరి రాత్రులను ఖండిస్తూ
గుండెను చీల్చుక ఎన్నిసార్లు రాలేదు?
అలలమీద ఊయలలూగుతూ
గడ్డకట్టిన చలిని విరిచేస్తూ
గాలితెమ్మరల్లో గింగిర్లు తిరుగుతూ
జ్వలిస్తున్న రాత్రులను ఎన్నిసార్లు కరిగించలేదు?
అతి జాగరూకతో
ఎదురుచూపుల నావకు లంగరేసి
కలల పడవలను వెలిగిస్తూ
విశాలసంద్రంలో ఎన్నిమార్లు విహరించలేదు?
అనుకూల పవనాలనే కాదు
ప్రతికూల పవనాలనూ దాటుతూ
సుదీర్ఘ అడవిమార్గాన్ని ఛేదిస్తూ
ప్రేమదృక్కులను ఎన్ని ప్రసరింపచేయలేదు?
ఖండఖండాలుగా విరజిమ్మిపడుతున్న
ఓ! నా అంతరంగ ప్రవాహమా!
అనంతకాల వీధులను కనుమరుగు చేస్తూ
ఎన్నిసార్లని నగ్నంగా పరుగులు తీయను?
నావ ఆవలి రేవుకు చేరబోతున్నది
స్వేచ్ఛా ఊపిరులతో శాంతించి స్వాగతించు
మరొక్కసారి నన్ను ఒలిచి విప్పుకో!
నేను సింధువులో కరిగిపోయే బిందువును!