విషాద దర్శనం – ఉద్యమ స్పూర్తి

అబ్బూరి ఛాయాదేవి
మన చుట్టూ ఎన్నో విషాదకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి – కొన్ని ప్రకృతిసిద్ధమైనవీ, కొన్ని మానవులు సృష్టించినవీ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రకృతిసిద్ధంగా వచ్చే భూకంపాల, వరదల, సునామీల వంటి వాటిని ఎదుర్కొంటున్నవారు తోటివారి సహాయసహకారాల్నీ, ప్రభుత్వ సహాయన్నీ కొంతవరకు అందుకుంటూనే ఉన్నారు. కానీ కావాలని తోటి మనుషులే స్వార్థపూరితంగా చేసే విధ్వంసక చర్యల్ని అడ్డుకునేవారు గానీ, అటువంటి వారిని శిక్షించేవారు గానీ ముందుకి రావడం లేదు. ప్రభుత్వం తీరు చూస్తే, కంచే చేను మేసినట్లుగా ఉంటోంది. దేశ అభివృద్ధి పేరుతో, సాంకేతికాభివృద్ధి పేరుతో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం కోసం కొందరు ధనవంతుల్ని ప్రోత్సహిస్తూ, అనేకమంది పేదజీవుల్ని నిర్వాసితులుగా, నిస్సహాయులుగా, మరింత నిర్భాగ్యులుగా చేయడం విస్తృతంగా దేశమంతటా అనేక రాష్ట్రాల్లో జరుగుతోందని వివిధ ప్రచార మాధ్యవల ద్వారా తెలుసు కుంటున్నాం. మరొకవైపు, నాగరిక జనజీవనానికి దూరంగా తమ బతుకు తాము బతుకుతున్న ఆదీవాసీ మహిళలపై రక్షకభటులే రాక్షసరీతిలో అత్యాచారాలు జరిపి, వారిని మానసికంగా కూడా చిత్రహింసకి గురిచేయడం జరిగినట్లూ, నేరస్థులు శిక్షకి గురికాకుండా ప్రభుత్వరక్షణలోనే ఉన్నట్లూ వింటూ వచ్చాం.
ఇప్పుడు ఆ రకరకాల బాధితుల్ని కళ్ళారా చూసి, వాళ్ళ గోడుని స్వయంగా వినే అరుదైన అవకాశాన్ని కల్పించారు స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి. భూమిక నిర్వాహకవర్గం సహకారంతో, ఇతర మిత్రుల సహాయంతో స్పూర్తిదాయకమైన ఉత్తరాంధ్ర సాహితీయాత్రని ఏర్పాటుచేసి దాదాపు 40 మంది రచయిత్రులకు సామాజిక చైతన్యం పెరిగే అవకాశాన్ని కలిగించారు. సముద్రతీరంలోనూ, కొండకోనల్లోననూ ఉండే శ్రామిక జీవుల జీవనవిధానాన్ని కొందరు ధనవంతులు ప్రభుత్వం అండతో అస్తవ్యస్తం చేసి, వారి ఆవాసాల్ని విధ్వంసం చేసిన వైనాన్ని కళ్ళారా చూశాం, వాళ్ళ దీనగాథల్ని చెవులారా విన్నాం. వారి కష్టనష్టాల ముందు మన బాధలు ఏ పాటివి అనిపించింది. ఎప్పుడూ అదనపు సుఖాల కోసం ఆరాటపడే మా మనసులు సిగ్గుపడేలా చేశాయి వారి దుర్భర స్థితిగతులు.
విశాఖపట్టణానికీ విజయనగరానికీ మధ్య మేము మొట్టమొదట దర్శించిన విషాదకర దృశ్యాలు గంగవరంలోనూ, దిబ్బపాలెంలోనూ. ”మా సముద్రం పోయింది” అని విలపించడం మమ్మల్ని విచలితుల్ని చేసింది. సముద్రం మీద ఆధారపడి జీవనయనం చేసే మత్స్యకారుల్ని సముద్రానికి దూరం చేసి, తీరం పొడుగునా మైళ్ళ కొద్దీ ‘పోర్టు గోడ’ కట్టి ఉండటం చూశాం. ‘చైనావాల్‌’ని గుర్తుకి తెచ్చేటట్లుంది. తరతరాలుగా సముద్రాన్ని నమ్ముకున్న ఆ అమాయక జీవులు దేశాభివృద్ధికి శత్రువులన్నట్లుగా, వారి ఇళ్ళని కూలగొట్టి, వారి జీవనవిధానాన్ని రూపురేఖల్లేకుండా చేసినవారు నాగరికులేనా, మానవమాత్రులేనా అనిపించింది. దిబ్బపాలెం గ్రామం అంతా యుద్ధానంతర విధ్వంసమయ దృశ్యంలా ఉంది. అడుగడుగునా నివాసగృహాల శిథిలాలు. పాఠశాల, ముద్రణశాల మొదలైన అత్యవసర వసతులన్నీ శిథిలమై ఉన్నాయి. అక్కడ ఒక చిన్న బిల్డింగ్‌లో తన సిబ్బందితో పాటు కూర్చుని ఉన్న డిప్యూటీ కలెక్టరు గారు జరిగిన వాటిని సమర్ధించడం చస్తూ, పుండుమీద కారం జల్లినట్లుగా అనిపించింది. ఎంత నష్టపరిహారం ఇచ్చినా, తరతరాలుగా వస్తూ హఠాత్తుగా విచ్ఛిన్నమైన వారి జీవనసంస్కృతిని పునరుద్ధరించగలరా? వాళ్ళని సముద్రతీరానికి దూరంగా ఎక్కడికో నెట్టేసి, కుటుంబానికొక వ్యక్తికి చొప్పున ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినా, అది వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుంది? తక్కిన కుటుంబ వ్యక్తుల మాటేమిటి? ఒకరు సంపాదిస్తే తక్కిన వాళ్ళు కూర్చుని తినే రోజులు కావు ఇవి – ఏ స్థాయి వాళ్ళకైనా వాళ్ళకి వృత్తివిద్య తప్ప వేరే చదువు లేదు. ”మేం ఎట్ల బతకాలి?” అని అడుగుతున్నారు వాళ్ళు. ”మా సముద్రం మాకివ్వండి” అని దీనంగా విన్నవించుకుంటంటే మా గుండెలు చెమ్మగిల్లాయి.
అక్కడనుంచి మరో విషాద దృశ్యాన్ని – జైలులో నిర్బంధితులై ఉన్న మహిళల్ని దర్శించడానికి వెళ్ళాం. కొంత మంది యావజ్జీవ కారాగార శిక్షని అనుభవిస్తున్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది హత్యానేరం, కొంతమంది ఇతర నేరాల మొపబడి నిర్బంధితులైన వాళ్ళు తమ గోడు చెప్పుకున్నారు. ముఖ్యంగా, అన్యాయంగా హత్యానేరం మొపబడి, బెయిలు ఇప్పించే దిక్కులేక, పిల్లల్నీ తల్లిదండ్రుల్నీ చూసుకునే అవకాశం లేక విలవిల్లాడుతూ కళ్ళనీళ్ళతో తమ గాథలు చెప్పుకున్నారు. జైలు నిర్వహణాధికారి సహృదయుడూ, సంస్కారవంతుడూ అయి ఉండటం విశేషం. ఆయన ఆ నిర్బంధిత స్త్రీల గురించీ, ఆ స్త్రీలతోనూ మర్యాదగా మాట్లాడాడు. ఆ ఖైదీల పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించి, వాళ్ళ బాగోగులు చూస్తున్నట్లు వివరించారు. కొంతమంది నిస్సహాయులైన ఖైదీలకు బెయిలు లభించే విషయమై ఎవరైనా సహాయపడగలిగితే బావుండుననిపించింది.
జైలు అధికారులు మా రచయిత్రుల బృందం కోసం ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనం, ఆ తరవాత బృందవాద్య సంగీత కార్యక్రమం, జైలు సూపరింటెండెంట్‌ గారి ఇంట్లో అల్పాహారం, బృందవాద్య సంగీత కార్యక్రమానికి ఖైదీలందర హాజరవడం మాకు కొంత సాంత్వనని కలిగించాయి. పెద్దపెద్ద పచ్చని కొండల మధ్య ఉన్న ఆ జైలు వాతావరణంలోకి ప్రవేశించగానే, ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉన్నట్లనిపించింది. జనారణ్యానికి దూరంగా ఇలాంటి చోట ఉంటే ఎంత బావుంటుంది అనిపించింది. లోపల భోజనశాలకి వెళ్ళేదారిలో ప్రదర్శితమైన కళాత్మక శిల్పాల, వర్ణచిత్రాల ఆహ్లాదాన్ని కలిగించాయి. ఏకాంతానికి ఆవేదనా, ఆక్రోశం తోడైనప్పుడు సృజనాత్మకత ఉధృతమై విశిష్ట కళారూపాల్ని పొందుతుంది. కానీ అందుకోసం జైలు జీవితాన్ని కోరుకోలేం కదా!
ఆ ఉదయం శ్రీమతి జయ తయారుచేసిన బ్రహ్మాండమైన ‘బ్రేక్‌ఫాస్ట్‌’ తిని, బస్సులో బయలుదేరి గంగవరానికి వెళ్ళి, తరవాత జైలునుంచి తిరిగి చీకటి పడుతూ౦టే పోలీస్‌ గెస్ట్‌హౌస్‌కి చేరుకున్నాం.
విశాఖపట్నంలో కొసమెరుపు : ఆ రాత్రి ఎనిమిది గంటలకి, భూమిక నుంచి వచ్చిన రచయిత్రుల బృందం గౌరవార్ధం ఒక సాహిత్య సభనీ, విందుభోజనాన్నీ ఏర్పాటుచేశారు విశాఖ రచయితలు – ఆంధ్రా యూనివర్సిటీలోని తెలుగుశాఖ ఆవరణలో. శ్రీకాకుళం నుంచి ప్రముఖ రచయిత అప్పలనాయుడు రావడం విశేషం. జాన్‌సన్‌ చోరగుడి, చంద్రశేఖర్‌ మొదలైన రచయితలనూ, విమర్శకులనూ కలుసుకోవడం జరిగింది. ఆ సభకి వెళ్ళేముందు నేనూ, సుజాతామూర్తీ కలిసి డా. గోపాలకృష్ణ అబ్బూరి ఇంటికి వెళ్ళాలనుకున్నాం. శ్రీ వర్మ గారూ, మల్లీశ్వరి మమ్మల్ని ఇద్దర్నీ కారులో తీసుకువెళ్ళి గోపాలకృష్ణ ఇంటి దగ్గర దిగబెట్టారు. ఆ సమయానికి అక్కడ వీథిలో దీపాలు ఆరిపోయాయి. ఆ చీకట్లో వాళ్ళ సహాయం లేకపోతే మేము కొంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. గోపాలకృష్ణకీ ప్రమీలకీ వాడుకగా వచ్చే ఆటో అతను మమ్మల్ని తన ఆటోలో సభాస్థలి వరకూ జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు. విందుభోజనం అయిన తరవాత డా. వి. సీతారత్నం, శ్రీ ‘అల’ మొదలైనవారు తమ గ్రంథాల్ని నాకు బహూకరించారు.
విషాదం మూర్తీభవించిన వాకపల్లి :
మర్నాడు ఉదయాన్నే మా బస్సులో బయలుదేరి పాడేరు వెళ్ళి, అక్కడ శ్రీ రామారావు అనే సామాజిక కార్యకర్తని ఎక్కించుకుని వాకపల్లి వెళ్ళాం. కొండకోనల వరకూ సాఫీగా సాగిన తారురోడ్డు వాకపల్లి ప్రవేశంతో ఆగిపోయింది. అక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు రాళ్ళూ రప్పలతో నిండిన కాలిబాట ఉంది – కొండల లోయల మధ్య నుంచి, మాలో నలుగురైదుగురు, ఆ బాట మీద నడవలేమని వెనక్కివెళ్ళి బస్సులో కూర్చుండిపోయారు. మిగిలిన వాళ్ళతో పాటు నేను ధైర్యంగా ముందుకి సాగుతంతూ౦టే, ”మీరు రాలేరు ఛాయదేవిగారూ, వెళ్ళి బస్సులో కూర్చోండి” అని సత్యవతి గారు పదేపదే చెప్పినా, పట్టుదలగా ముందుకి సాగాను. నాకన్న ఎంతో చిన్నదైన శిలాలోలిత రెండుమూడుసార్లు రాళ్ళమీంచి జారింది గాని, నేను జాగ్రత్తగానే నడిచివెళ్ళాను. నా భుజాన వేళ్ళాడుతున్న సంచీని తీసుకుంటామని తోటి రచయిత్రులు ఎంతోమంది ముందుకొచ్చారు గాని, నేను నా బరువుని ఇతరులకి అప్పజెప్పలేదు. ఎత్తుమీంచి పల్లానికి దిగి, మళ్ళీ ఎత్తు మీదికి వెళ్ళాం ఆదివాసీల ఇళ్లవైపుకి. అక్కడ ఒక ఇంటి ముందు ఆవరణలో మా సవవేశం ఏర్పాటు చేశారు. అక్కడి మహిళలు కొందరిపైన సంవత్సరం క్రితం పోలీసులు సామూహికంగా చేసిన అత్యాచారం గురించీ, నేరస్థులకి శిక్ష విధించడం విషయమై ప్రభుత్వం పట్టించుకోకపోవడం గురించీ రామారావు గారు ముందుగా వివరించాక, ఆ మహిళల్ని తమ అనుభవాలు చెప్పమన్నాం. వాళ్ళలో ముందుగా సిత్తాయి అనే యువతి ధైర్యం కూడదీసుకుని చెప్పడం మొదలుపెట్టింది. తరవాత మరొకామె చెప్పింది. ఇద్దరూ చివరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. తక్కిన మహిళలు నిశ్శబ్దంగా కళ్ళు తుడుచుకుంటూ కూర్చున్నారు. ”మమ్మల్ని ఎవరూ నమ్మడంలేదు…భూమిని ఆకాశం నమ్మడం లేదు” అంటూ రోదించింది సిత్తాయి. ఆ మాటలకి సత్యవతి గారి హృదయం ద్రవించి, ఆమెని కౌగలించుకుని ఓదార్చారు, ”మేం నమ్ముతాం, మీ వెంట మేమున్నాం” అంటూ. దాంతో మా అందరికీ కళ్ళనీళ్ళు తిరిగాయి. నేరస్థులకి శిక్షపడాలనీ, తమకి సామాజికన్యాయం జరగాలనీ మొరపెట్టుకున్నారు ఆ మహిళలు. ”మేమందరం మీ వమాటల్ని నమ్ముతున్నాం. అక్షరాలతోనే మీకు సహాయం చేస్తాం, మీకు అండగా నిలుస్తాం” అని హామీ ఇచ్చాం. ఇటువంటి అత్యాచారాలు మళ్ళీ జరక్కుండా చూసే బాధ్యత సమాజానిది. కంచే చేను మేయకుండా చచూసే బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళ నోళ్ళు మూయించడానికి కొన్ని లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టినా వాళ్ళు అంగీకరించలేదు. నేరస్థులకి శిక్ష పడాలి, తమకు న్యాయం జరగాలి అని పోరాటం సాగిస్తున్నారు. డబ్బుకి లొంగకుండా పోరాటం సాగిస్తున్న వీళ్ళని చూసి, ధన వ్యామొహంలో పడి అదే అభివృద్ధి అనుకుంటున్న ఆధునిక సమాజం సిగ్గుపడాలి. అమాయక స్త్రీలపై సామూహిక అత్యాచారాలు జరపడం 60 ఏళ్ళక్రితంనాటి రజాకారుల రాక్షసత్వాన్నీ, ఈ మధ్య చూసిన గుజరాత్‌ క్రూరత్వాన్నీ గుర్తుకి తెస్తోంది. సందర్భం ఏదైనా, కొందరు పురుషులు పశుత్వాన్ని ప్రదర్శిస్తూ స్త్రీలపై దాడి చేస్తూనే ఉన్నారు.
దిగులుగా తిరిగి పాడేరుకి వచ్చాం. అక్కడ విశ్రాంతి స్థలం లేకపోవడం వల్ల ప్రకృతి అవసరాల్ని తీర్చుకోవడానికి ఇళ్ళ వెనక చాటుగా ఉన్న, చెత్తతో నిండిన బహిరంగ స్థలాన్ని వాడుకోవలసి వచ్చింది. అక్కడి స్త్రీలు బకెట్‌తో నీళ్ళు ఇచ్చి సహృదయతని ప్రదర్శించారు. నా చిన్నప్పుడు మా తాతయ్యగారి ఊళ్ళో వెళ్ళిన బహిర్దేశం గుర్తుకొచ్చింది.
ఆ రాత్రికి అరకులోయకి వెళ్ళి అక్కడ గెస్ట్‌హౌస్‌లో విశ్రమించారు. ఎక్కడికి వెళ్ళినా భోజనాల ఏర్పాట్లూ, మధ్య మధ్య టిఫిట్లూ, టీల, ఎప్పటికప్పుడు మంచినీళ్ళ సీసాల ఏర్పాట్లూ అన్నీ సత్యవతి, మల్లీశ్వరి చేయడం, భూమిక కార్యవర్గం వారు అందరికీ సహకారాన్ని అందించడం అనితరసాధ్యం! అంత శ్రద్ధగా, అంత ఆప్యాయంగా నిర్వహించారు ప్రసన్న, లక్ష్మి, కల్పన, హేమంత, దివ్య మొదలైనవాళ్ళు. బృందంలోని సభ్యుల్లో హిమజ, దేవకీదేవి మొదలైనవారు కొందరు స్వీట్లూ, హాట్లూ కొని అందరికీ పంచారు.
పుస్తకావిష్కరణ : అరకులోయలో ప్రకృతి పరిసరాల మధ్య – పిల్లసెలయేళ్ళ మధ్య చదునైన పెద్ద బండ మీద పుస్తకావిష్కరణ జరగడం ఒక అపూర్వ అనుభవం. వి. ప్రతిమ రాసిన ‘ఖండిత కథలు’ సంపుటాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి గారు ఆవిష్కరించి, పుస్తకం గురించి మాట్లాడారు. అందరం కరతాళధ్వనులతో ప్రతిమని అభినందించాం.
ఆ తరవాత బొర్రా గుహల్ని సందర్శించడానికి వెళ్ళాం. కానీ కొందరం బస్సులోనే కూర్చుండిపోయా౦ అలిసిపోయి. అనుకోకుండా వర్షం పడింది. గుహలు చూడటానికి వెళ్ళిన వాళ్ళందరూ తడిబట్టలతో తిరిగి వచ్చారు!
మరో విషాదస్థలం : అరకు నుంచి ఎస్‌.కోట (శృంగవరంకోట)కి బయలుదేరాం. మరో సెజ్‌ బాధితుల గాథ విన్నాం ఎస్‌.కోటలో. జిండాల్‌ అనే వ్యాపార సంస్థ బాక్సైట్‌ గనుల తవ్వకం కోసం ఎస్‌.కోటలోని పంట భూముల్ని తీసుకుని అక్కడి రైతు కుటుంబాల్ని నిర్వాసితుల్ని చేసింది. ఆక్రమించిన పొలాల చుట్టూ చాలావరకు గోడ కట్టారు. అక్కడి స్త్రీలు ఊరుకోలేదు. ‘బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక కమిటీ’ని ఏర్పరచారు. కమిటీ కన్వీనర్‌ కాకి దేవుడమ్మ. ఆమె ఊళ్ళో లేనప్పుడు పార్వతి అనే ఆమె నిర్వహిస్తుంది. ఇద్దరూ ధీరవనితలు. పురుషుల కన్న వాళ్ళే ధైర్యంగా ముందుకొచ్చి అందరినీ కూడగట్టుకుని, జిండాల్‌ అధికార ప్రతినిధుల్నీ, ఫ్యాక్టరీ పనులు ప్రారంభించినవాళ్ళనీ ఎదిరించి, వాళ్ళ పనుల్ని అడ్డుకుంటు౦టే వీళ్ళ మీద కేసులు పెట్టారుట. ‘పబ్లిక్‌ హియరింగ్‌’లో దేవుడమ్మ ధైర్యంగా మాట్లాడిందిట. ”ప్రభుత్వం అండతో జిందాల్‌ వాళ్ళు మా పంటభూముల్ని బీడుభూములుగా చేస్తున్నారు. …ఎయిడ్స్‌ రోగం ఎంత హానికరమొ ఈ బాక్సైట్‌ ఫ్యాక్టరీ అంత హానికరం…” అని చెప్పింది దేవుడమ్మ. ధర్నా చేసినందుకు 38 మందిని అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినా ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. ”మా రాజ్యం, మాది…” అన్న ధోరణిలో ఉంది ప్రభుత్వం. తర్వాత ఎలాగో ‘కండిషనల్‌ బెయిల్‌’ మీద విడుదల చేశారు, అని చెప్పిందామె. మాతోపాటు బస్సులో వచ్చి, కొంతదూరంలో ఉన్న తమ పొలాల్నీ, జిందాల్‌ గోడనీ చూపించారు. వాళ్ళ జీవితాల్ని నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్నట్లు దారి పొడుగునా జిండాదాల్‌ గోడ కనిపిస్తూనే ఉంది.
మా మనస్సులన్నీ ఉద్రిక్తమయ్యాయి. ఎస్‌.కోట వాసుల పట్లా, ముఖ్యంగా ‘బాక్సైట్‌ వ్యతిరేక కమిటీ’ నాయకురాళ్ళైన దేవుడమ్మ పట్లా, పార్వతి పట్లా ఆరాధనాభావం కలిగింది. విజయం సాధించేవరకూ వాళ్ళ పోరాటశక్తిని నిలుపుకోమని వాళ్ళని ప్రోత్సహించి, అక్కణ్ణించి విజయనగరానికి బయలుదేరాం.
విజయనగరంలో సాహితీసభ :
విజయనగరం అనగానే రచయితలకు గురజాడ గుర్తుకొస్తారు. తరవాత చా.సో. గుర్తుకొస్తారు. విజయనగరంలో ‘సాహితీ స్రవంతి’ సంస్థ తరపున డా. చాగంటి తులసి ఆహ్వానాన్ని పురస్కరించుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభకి వెళ్ళాం. ఒక హోటల్లో పై అంతస్తులో ఏర్పాటైంది సభ. ఆ సభలో ఒక ఆశ్చర్యకరమైన విశేషం – రెండు పుస్తకాల ఆవిష్కరణ! డా. తులసి సహకారంతో కొండవీటి సత్యవతి కావాలని రహస్యంగా చేసిన ఏర్పాటు అది. భూమిక సభ్యుల్లో కొందరు రాసిన కథలకూ, కవితలకూ ఆర్‌. శాంతసుందరి గారు చేసిన హిందీ అనువాదాల సంపుటులు రెండింటినీ అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆ తరవాత రచయిత్రుల బృందంలో చాలామంది తమ యాత్రానుభవాలనూ, అనుభూతులన విజయనగరం సాహితీ సదస్సులతో పంచుకున్నారు. ‘నాని’ అనే పిల్లల మాసపత్రిక సెప్టెంబర్‌-అక్టోబర్‌ 2008 సంచికని మాకందరికీ తలొకకాపీ ఇచ్చారు ‘నాని’ సంపాదకులు, ప్రచురణకర్త శ్రీ ఎన్‌.కె.బాబు. రాత్రికి భోజనాల పేకెట్లు ఇచ్చి మమ్మల్ని సాదరంగా స్టేషన్‌కి పంపించారు సభా నిర్వాహకులు. దివాకర్‌ దంపతులు స్టేషన్‌ వరకూ వచ్చి మమ్మల్ని రైలెక్కించి వెళ్ళారు.
రైల్లో వెళ్ళేటప్పుడూ, తిరిగి వచ్చేటప్పుడూ, మధ్యలో బస్సులో వెడుతున్నప్పుడూ భూమిక బృందంలోని సభ్యులందరూ స్నేహ సౌరభాలతో, నవ్వుల గలగలలతో నింపేశారు వాతావరణాన్ని. అంత్యాక్షరి పాటల జోరు సరేసరి! నాలాంటి వాళ్ళు మౌనంగానే చిరునవ్వులతో పాడేవాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించారు.
సావమాజిక చైతన్య స్పూర్తిదాయకమైన ఈ సాహితీయాత్రలో దారిపొడుగునా ఒకవైపు విషాదం, మరోవైపు వినోదం – మొత్తం మీద విజ్ఞానం!

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.