భూమిక ముచ్చటగా మూడో సారి నిర్వహించిన రచయిత్రుల సాహితీ యాత్ర విజయవంతమైనందుకు మాకు చాలా సంతోషంగా వుంది. ఈ యాత్రని ప్లాన్ చెయ్యడం, ఆ ప్లాన్‌ని తూచ. తప్పకుండా అమలు చెయ్యడం కోసం మేము రెండు నెలలు శ్రమించాం. నలభై మంది వివిధ వయస్సులకు చెందిన రచయిత్రులను మూడు రోజుల పాటు కొండలెక్కించి, గుట్ట లెక్కించి సముద్రతీరాల వెంబడి సాగిన ఈ యాత్ర మిగిలిన రెండిటికంటే చాలా భిన్నమైంది. సృజనాత్మక రచనల్లో సామాజిక ఉద్యమాలను మిళితం చేయడం, జీవన్మరణ పోరాటాల్లో వున్న స్త్రీల సామాజిక ఉద్యమాల అధ్యయనం ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషించాలని నేను అభిలషి౦చాను. ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న వారితో, వారికి తోడ్పాటునందిస్తున్న సంస్థలతో నిరంతరం మాట్లాడుతతూ, ఉద్యమ నేపధ్యాల గురించి, వెళ్ళాల్సిన ప్రదేశాల గుర్తింపు, ఎవరెవరిని కలవాలి, ఎలా కలవాలి, ఎక్కడ కలవాలిలాంటి అంశాల గురించి నేను గంటల తరబడి, రోజుల తరబడి మాట్లాడాల్సి వచ్చింది. ఇంతమందికి వసతి ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇంత భారాన్ని చాలా తేలికగా, ఎక్కడా ఎలాంటి లోటు, లోపం కలగకుండా పూర్తి చెయ్యగలగడం వెనుక ఎంతో మంది మిత్రుల సహకారం, కృషి దాగి వున్నాయి. వారి తోడ్పాటు లేకుంటే నేను ఇంత బృహత్ కార్యక్రమాన్ని పూర్తి చేసి వుండగలిగేదాన్ని కాదు. ముఖ్యంగా నాతో సమానంగా శ్రమపడిన వ్యక్తి మల్లీశ్వరి. వైజాగ్ ట్రిప్ వేయాలనుకుంటున్నాం మల్లీశ్వరీ అని నేను ఫోన్‌లో చెప్పిన మరుక్షణం నుండే తను కొంగు నడుముకు చుట్టేసి రంగంలోకి దిగి పోయింది. తనతో పాటు తన సాహితీ మిత్రులందరినీ కలుపేసుకుంది. విద్యాసాగర్‌గారు, నారాయణ, వేణుగారు, ప్రసాదవర్మగారు, చలంగారు వీరంతా ఎంతో ప్రేమగా మా ట్రిప్‌కోసం పనిచేసారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇంక శ్రీనివాస రాజుగారు. మేము వసతి కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా హాయిగా వుండేలా ఆయన చక్కటి ఏర్పాట్లు చేసారు. మామూలుగా అసాధ్యమైన సెంట్రల్ జైలు సందర్శనం లాంటి దాన్ని అతి సునాయసంగా ఏర్పాటు చేసి, అక్కడే భోజనంతో పాటు చక్కటి వినోద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చెయ్యడం, జైలర్‌గారు, వారి సహచరి, కృష్ణకుమారి ఎంతో సహృదయంతో మమ్మల్ని ఆదరించిన తీరు అభినందననీయం. వీరందరికి భూమిక కృతజ్ఞతలు. నా ప్రియ నేస్తం జయ స్వయంగా వండుకొచ్చి, ప్రేమగా వడ్డించిన అల్పాహారంలో తన స్నేహాన్ని కూడా మిళితం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక మా యత్రలో దిబ్బపాలెంలో పాపారావుగారు, వాకపల్లిలో రామారావ్ దొర, శృంగవరపు కోటలో, గంగవరంలో లక్ష్మిగార్ల సహకారం లేకుంటే మేము ఆయా ప్రాంతాల్లోకి అంత సులభంగా వెళ్ళగలిగివుండేవాళ్ళం కాదు. ‘లయ’ రవిగారు, ‘మన్నెంలో’ ఎడిటర్ మల్లిక్‌గారు ఎంతో సహకారమందించారు. అరకులో వేణుగారి మిత్రులు అందించిన సహకారం వెలకట్టలేనిది. తెర వెనుక ఇంత మంది సహకారం, సహృదయతలు పుష్కలంగా లభించడం వల్లనే నేను ఉత్తరాంధ్రయయాత్రని ఓ మరుపురాని యయాత్రగా మలచగలిగాను.
మొత్తం యాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంత మీడియ వ్యవహరించిన తీరు గురించి ఎంత ప్రశంసించినా తక్కువే. ఎంతో చైతన్య వంతమైన అవగాహనతో అక్కడ జరుగుతున్న సామాజిక ఉద్యమాలకు ఉత్తేజం అందిస్తూ, మా యాత్ర మొత్తం చిత్రాన్ని ఆంధ్ర దేశమంతా చాటింపు వేసారు. అద్భుతమైన కవరేజి ఇచ్చారు. మీడియ మిత్రులందరికి అభినందనవందనాలు.
అలాగే విశాఖ రచయితలు చక్కటి సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు పసైందైన విందు భోజనం పెట్టారు. విజయనగరంలో చాగంటి తులసిగారు ఏర్పాటు చేసిన సభలో మా హిందీ సంకలనాలు ఆవిష్కరించుకోవడం మరిచిపోలేని అనుభవం. తులసి గారికి, వారితోపాటు ఆ సభలో పాలుపంచుకున్న మిత్రులకి కృతజ్ఞతలు.
ఈ సాహితీ యాత్రలో మేము కలిసిన స్త్రీలు, వారి జీవన్మరణ పోరాటాలు, గుండెల్నిండా నిబ్బరాన్ని నింపిన దేవుడమ్మ, పార్వతి, గంగవరం శాంతి, మరిడమ్మ ఇంకా మరెంతో మంది సామాన్య స్త్రీల అసామాన్య వ్యక్తిత్వాల స్పూర్తి ధార లోపలి పేజీల నిండా ప్రవహిస్తోంది. అట్టడుగు స్థాయి స్త్రీల అవిశ్రాంత ఉద్యమాలు, ఉత్తేజానిచ్చే నాయకత్వాలు మా అందరిలో అలజడి, అశాంతిని రగిలించాయి. ఆపుకోలేని కన్నీళ్ళని సృష్టిించాయి. చైతన్యానికి, సంస్కారానికి, పోరాటానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన వాళ్ళ ముందు మేమంతా చిన్నబోయి, ఖిన్నులమై, నిస్సహాయులమై నిలబడ్డాం. వాళ్ళ పక్షాన మా అక్షరాలను మొహరించడం తప్ప ఇంకేం చేయగలం?వాళ్ళ దు:ఖాన్ని, వాళ్ళ బతుకు పోరును సిరాగా మార్చి ”అభివృద్ధి” ప్రపంచపు వికృత పార్శ్వం మీద అక్షరాల జడివానను కురిపించాలని మేమందరం శపధం తీసుకున్నాం.
అందుకే తర్పు కనుమల్లో వెలుగు రేఖల్లా ఉద్యమిస్తస్తూ, ఉద్యమంలో పడుతూ లేస్తూ, అచ్చమైన నాయకురాళ్ళై మా అందరికీ స్పూర్తినిచ్చిన ఆ స్త్రీలందరికీ ఈ ప్రత్యేక సంచిక అంకితమివ్వడం నాకెంతో గర్వంగా వుంది. ఈ మొత్తం యాత్రని భూమిక తరఫునించి నిర్వహించి, రత్నమాల పేర్కొన్నట్టు ఒక చారిత్రక బాధ్యతని నిర్విఘ్నంగా పూర్తిచేయగలిగినందుకు, కలవడం, కలబోసుకోవడం ప్రధాన ససూత్రంగా మొదలైన ఈ సాహితీ యాత్రలు రచయిత్రల మధ్య గాఢమైన స్నేహపూర్వక సాహిత్యానుబంధాన్ని ప్రోది చేయడం నాకు నిజంగా ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని కలిగించింది.
చివరగా, ఈ యాత్ర నిర్వహణలో నేనెదుర్కొన్న మానసిక సంఘర్షణని, దు:ఖభారాన్ని, తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడానికి నా కుడి ఎడమలు నిలబడి నేను కుప్పకూలకుండా నిలబెట్టిన వాళ్ళు గీత, హేమంత. గుండెల్లోకి వొలుకుతున్న దు:ఖానుభవాలను భరిస్తూనే యాత్రని పూర్తి చేయగలగడం వెనుక మా భూమిక టీమ్ ప్రసన్న, లక్ష్మి, కల్పన, నాగమణి, సుమ వీళ్ళందరి శ్రమ ఎంత వుందో నాకే తెలుసు. వీళ్ళు లేకుండా నేనిలాంటి పనుల్ని తలపెట్టనే లేను. వీళ్ళే నా బలం. జీవించడానికి అవసరమైన అనుభవాలనిచ్చిన ఉద్యమాల ఉత్తరాంధ్ర సాహితీ యాత్రని విజయవంతం చేసిన యవన్మందికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags