లైంగిక హింస: కుల మతాల నీడలు పరిచయం: జెండర్‌, స్వీయత్వ నిర్మాణం – కల్పన కన్నబిరాన్

నేను దక్షిణ తమిళనాడులో ఒక ప్రాజెక్టు కోసం సమాచార సేకరణ చేస్తున్నప్పుడు నాకొక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అది ఒక తీర్థక్షేత్రంగా విరాజిల్లుతోంది. కరిసల్‌ కాడు (నల్లరేగడి మట్టి ప్రాంతం) నలుమూలల నుంచి జనం అక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. విరుదు నగర్‌ నుంచి తిరునల్‌ వేలి దాకా విస్తరించిన ఈ కరిసల్‌ కాడులో తెలుగు వాళ్ళ జనాభానే ఎక్కువ. వీళ్ళంతా ఆంధ్ర దేశం నుంచి వలస వెళ్ళిన జనం. విజయనగర రాజు సైన్యంలో భాగంగా అక్కడికెళ్ళి స్థిరపడిన వాళ్ళు కొందరైతే ఎక్కువ మంది ఆంధ్ర దేశం మీదకి ముస్లింలు దండెత్తి వచ్చినప్పుడు వలస పోయినవాళ్ళు. ”ముస్లిం దురాక్రమణ” గురించిన జ్ఞాపకాలు వారి అంతరాంతరాల్లో చాలా బలంగా ఉండిపోయాయి. ఈ మర్రిచెట్టును పూజించడానికి కారణం కూడా ఆ జ్ఞాపకాలే. ముస్లిం దుండగులు ఒకామెను రేప్‌ చేసి ఆమె పారిపోతుంటే గుర్రాలమీద వెంటబడ్డారని, ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మర్రిచెట్టును కావలించుకుంటే ఆ చెట్టు ఆమెను తనలో ఇముడ్చుకుందని స్థల పురాణం లాంటి కథ ఒకటి చెబుతారు. ఆమె ఇవ్వాళక్కడ ‘పవిత్రతకు’ చిహ్నం. చరిత్రలో మళ్ళీ ‘తెలుగువాళ్ళకు జరిగిన అపచారాన్ని’ గుర్తుచేసే ఒక శాశ్వత సంకేతం.

ఇలాంటిదే ఒక కథ మా నాయనమ్మ నాకు చెబుతుండేది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆడవాళ్ళు చాలా కాలం జాకెట్లు వేసుకునేవారు కాదని, ముస్లింలు వచ్చి ఆడవాళ్ళ వక్షోజాలు పట్టుకుని లాగుతుంటే వాళ్ళ నుంచి రక్షణ కోసం రవికెలు ధరించడం ప్రారంభించారని ఆమె కథ సారాంశం. ఈ కథలను పుక్కిటి పురాణాలుగా కొట్టేయలేము. ఎందుకంటే వివిధమతాల వారు ఇవ్వాళ ఒకర్నొకరు ఎలా చూసుకుంటున్నారనే దానిమీద వీటి ప్రభావం ఉంది. ఇవి వర్తమానంలో భాగమై, మన ఆలోచనల నిర్మాణ క్రమంలోనే అంతర్భాగమైపోయాయి. శత్రుత్వం ఉందని భావించబడుతున్న రెండు మతాల వారి అనుభవాలలోకి అవి జొరబడిపోయాయి.

ఒక మతానికి స్వీయత్వమనేది స్త్రీల శరీరాలను ఆధారం చేసుకుని ఎలా రూపొందుతుందో, ఆ పద్ధతిని ఈ వ్యాసం పరిశీలిస్తుంది. స్త్రీలను కుటుంబం లోపల, మతం లోపల ఉంచి వారిని ఒక ఆస్తిహక్కుగా ఎలా నిర్వచించారో అలాగే వాటినుంచి వాళ్ళను తొలగించి ఆ భావనను ఎలా సవాల్‌ చేశారో కూడా ఈ వ్యాసం పరిశీలిస్తుంది. స్త్రీలు ఒక మతానికి లేదా కుటుంబానికి చెందని వారని నిరూపించగలిగితే చాలు. వారిమీద దౌర్జన్యానికి సులభంగా ఆమోదం లభిస్తుంది. స్త్రీలమీద జరిపే దౌర్జన్యం ద్వారా, దాని నిర్వచనం ద్వారా, మతానికి ఏర్పడుతున్న స్వీయత్వంలో ఈ రెండు క్రమాలూ ఉన్నాయి. కులం, మతం బలంగా పనిచేస్తున్నచోట ఈ దౌర్జన్యం ఆయా కులమతాల రూపంలోనే వ్యక్తమవుతుంది. వివిధ వర్గాల ప్రయోజనాలు సంఘర్షించినపుడు కొన్ని కులాలు, లేదా మతాల స్త్రీలను మాత్రమే ఎంచుకుని దౌర్జన్యాలు చేస్తారు.

ఈ స్వీయత్వ నిర్మాణం రెండు విధాలుగా జరగడం సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. మొదటి విధానం- మైనారిటీ గ్రూపులకు, మత గ్రూపులకు, కుల గ్రూపులకు చెందిన స్త్రీల మీద లైంగిక అత్యాచారం చేయడం. అట్లా చేయడమంటే ఆ స్త్రీలు ఏ గ్రూపునకు చెందుతారో ఆ కమ్యూనిటీ అంతటిమీదా అత్యాచారం జరిపి ఆ గ్రూపు అసలెప్పుడూ మొదటినుంచి అవినీతిగానే ఉందనే దాన్ని అందరికీ బహిరంగంగా చూపించడం. ఇది కూడా ఒక రకంగా తన భిన్నత్వాన్ని, తేడాను ధృవపరచుకుంటూ దాడి చేసిన వాడిగా తన స్థానం చాలా సరైనదిగా, తగినదిగా వున్నదని గట్టిగా చూపించుకోవడమే. ఇక స్వీయత్వ నిర్మాణం జరిగే రెండవ పద్థతి, అగ్ర వర్ణాలకు, ఆధిపత్య గ్రూపునకు చెందినవారు, తమ స్త్రీలమీద మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన పురుషులు అత్యాచారం, దాడి జరిపారని ఆరోపించడం. ఈ ఆరోపణ ద్వారా అగ్రవర్ణాలు తమ కుల ఆధిపత్యాన్ని సమర్థించుకుంటాయి. మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన పురుషులకు శీలం లేదని, స్త్రీలను గౌరవించడం తెలియదని అందరికీ చూపి చెప్పే ప్రయత్నం ఇది. దీనివల్ల ఈ మైనారిటీ గ్రూపులకు చెందిన స్త్రీలకు రాజ్యాంగం నుంచి గానీ, ఇతర విధాలుగా కానీ లభించే రక్షణను పూర్తిగా నిరాకరించే పరిస్థితి కల్పించబడుతుంది.

స్త్రీలమీద పబ్లిక్‌గా, రాజకీయంగా జరిగే చర్చ, ముందు వాళ్ళను కులపరంగా, మతపరంగా

విభజించడం మీదే కేంద్రీకరిస్తుంది. వాటిలో రకరకాల స్థాయిలు సృష్టిస్తుంది. దానివల్ల వివిధరకాలైన విభాగాలు సహజీవనం చేయగలిగి ‘సామాన్యం’ (అశీతీఎaశ్రీ) నుండి ‘సామాన్యం’ ప్రతి స్థాయిలోను వేరు చేయబడుతుంది. ఎవరైతే సామాన్యం నుండి బయట ఉన్నవారుగా అర్థం చేసుకోబడతారో వారు రాజ్యం నుండి రక్షణను చట్టబద్ధంగా కోరే హక్కును ధృవపరచుకోలేరు. స్త్రీలే కాదు కమ్యూనిటీలు కూడా రక్షణను పొందలేవు.

ఈ వాదనను కొనసాగిస్తే మైనారిటీ స్త్రీల, దళిత స్త్రీల దౌర్భాగ్య పరిస్థితి ఒకే రకంగా ఉన్నప్పటికీ, వాళ్ళు వేర్వేరు స్థాయిలలో ఉంచబడతారు. మైనారిటీ కమ్యూనిటీకు చెందిన స్త్రీలను భారత రాజ్యాంగం బయటనే గుర్తిస్తారు. ‘వేరే తనాన్ని’ (శ్‌ీష్ట్రవతీఅవరర) నిర్మించడం అంటే, ఆ కమ్యూనిటీ యొక్క వేరేతనాన్ని నిర్మించడమే. ‘ఇండియన్‌ కమ్యూనిటీ’ యొక్క సందర్భంలో, ఇంకొక పక్క దళిత స్త్రీలు హిందుత్వం పొందిన భారత రాజ్యాంగం లోపలనే ఉంటారు. వారి వేరే తనం హిందూ మతంలోని అగ్ర వర్ణ సంప్రదాయాన్ని బలంగా విధించే పద్ధతిలో నిర్మించబడుతుంది. ఆ వేరే తనం తప్పనిసరిగా హిందూ సమాజంలో ఎవరూ కోరని పొరపాటు. లోపలినుండే హిందుత్వాన్ని నాశనం చేస్తుంది. మెజారిటీ అగ్రవర్ణ హిందువు తన రెండు వైపుల నుంచి దాడికి గురవుతున్న వాడిగా తనను తాను చూసుకుంటాడు. బయటినుంచి అవినీతి పరులైన మైనారిటీల దాడి, లోపలినుంచి అపరిశుద్ధమైన కులాల నుండి వచ్చే దాడి. ఈ దాడిని అర్థం చేసుకోవడంలోనూ, ఆ దాడిని అణచడానికి హింసను ఉపయోగించడంలోనూ స్త్రీలే ప్రధానమైన లక్ష్యంగా ఉంటారు. కమ్యూనిటీ మీద దాడి అంటే ఆ కమ్యూనిటీలోని స్త్రీల పవిత్రతమీద దాడిగా నిర్వచించబడుతుంది. ఈ గ్రూపులకు చెందిన స్త్రీలమీద జరిపే దౌర్జన్యం ద్వారా ఈ దాడి సవాల్‌ చేయబడుతుంది.

అధికారం, పెత్తనం వీటికోసం జరిగే యుద్ధాలు స్త్రీల శరీరాల మీదనే జరుగుతాయి కాబట్టి రేప్‌ ద్వారా స్త్రీల మీద కంట్రోల్‌ను స్థాపించుకోవడం, స్త్రీలను రేప్‌ చేయడం ద్వారా ఒక కమ్యూనిటీని ఉల్లంఘిస్తున్నామని చెప్పడం జరుగుతాయి. ఈ వ్యాసంలో నేను ఒక ప్రత్యేక రేప్‌ సంఘటనను పరిశీలించి ఈ విషయం మీద ప్రధానమైన చర్చను ప్రారంభిస్తున్నాను.

రమీజాబీ రేప్‌

1978లో రమీజాబీని నలుగురు పోలీసులు సామూహికంగా రేప్‌ చేసినపుడు ఆమె వయసు 18 ఏళ్ళు. వీరిలో ఒకరు హిందువు, మిగతా ముగ్గురూ ముస్లింలు. వారు ఆమె భర్తను కూడా కొట్టి చంపారు. రమీజాబీ రేప్‌కు, ఆమె భర్త అహ్మద్‌ హుస్సేన్‌ హత్యకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కోపోద్రిక్తులైన జనం మీద వారు చట్టవిరుద్ధంగా గుమిగూడారనే నెపంతో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి మరింత ప్రాణనష్టం కలిగించారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిచేత న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నియమించిన జడ్జి పేరు ముక్తదార్‌. ఆయన భూస్వామ్య కుటుంబానికి చెందిన ఒక సంపన్న ముస్లిం. ఇదే సమయంలో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ మరణాలమీద భార్గవ కమిషన్‌ విచారణ జరుపుతోంది. జస్టిస్‌ ముక్తదార్‌కి ఇచ్చిన పరిశీలనాంశాలు మూడు – అహ్మద్‌ హుస్సేన్‌ మీద జరిగిన దాడి, అతని మృతికి కారణాలు, రమీజాబీపై జరిగిన అత్యాచారం. ఏ విచారణ సంఘమైనా దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తుంది తప్ప దానికి తీర్పు చెప్పే అధికారం ఉండదు. కమిషన్‌కు కావలసిన ఆఫీసు, సిబ్బంది తదితర సదుపాయాలు సమకూర్చడంతో రాష్ట్ర ప్రభుత్వం తన పనైపోతుందనుకుంది. దర్యాప్తు జరపడంలో ఏ విధమైన సహాయాన్ని అందివ్వలేదు. సాక్ష్యాలు సేకరించడం వగైరా పనుల్లో కమిషన్‌కు సహకరించమని హోం శాఖ కార్యదర్శి పోలీసు శాఖకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేరం చేసిన పోలీసులను కాపాడడానికి ప్రభుత్వం అలుసు చూసుకుని పోలీసు శాఖ రమీజాబీ, ఆమె భర్త అహ్మద్‌ హుస్సేన్‌ల పనుల మీద ప్రజలకు ఉండే వ్యతిరేకతను

ఉపయోగించుకోవాలనుకుంది. ఆమె వ్యభిచారి అని, అతను ఆమెను తార్చేవాడనీ కదా వాళ్ళ ఆరోపణ. రమీజాబీ రేప్‌ చేయబడలేదని నిరూపించే ప్రయత్నం పోలీసులు ఏ దశలోనూ చేయలేదు. కానీ అహ్మద్‌ హుస్సేన్‌ తమ దెబ్బలకు కాక గుండెపోటుతో మరణించాడని నిరూపించే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేశారు. స్పెషల్‌ బ్రాంచి పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులను కొనేసి ఈ సహజ కారణాన్ని సృష్టించారు. అయినా జస్టిస్‌ ముక్తదార్‌ నలుగురు పోలీసులూ ఉమ్మడిగా రేప్‌, దౌర్జన్యం, హత్య… మూడూ చేశారని నిర్థారించారు. ఈ నేరాలకు గాను వారిమీద కేసుపెట్టి కోర్టులో విచారణ జరపమని సిఫార్సు చేశారు. పోలీసు శాఖ దర్యాప్తు జరిపి ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే నిందితులు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు విచారణను కర్నాటక రాష్ట్రంలోని రాయచూర్‌ జిల్లా జడ్జి కోర్టుకు బదలీ చేయించుకున్నారు. ఈ సంఘటన మీద న్యాయ విచారణ జరిపిన జడ్జి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఇప్పటికీ పని చేస్తున్న జడ్జి కాబట్టి కింది కోర్టులేవైనా ఆయన పట్ల పక్షపాతం చూపే అవకాశం ఉందని పోలీసు నిందితుల వాదన. రాయచూర్‌ జిల్లా జడ్జి నలుగురు పోలీసులూ నిర్దోషులని తీర్పు చెప్పాడు. న్యాయ విచారణ సంఘం నమోదు చేసిన సాక్ష్యాలను కోర్టులో ప్రాసిక్యూషన్‌ ఉపయోగించుకోవడానికి వీల్లేక పోవడంవల్ల ఇది సాధ్యమయింది. ఈ దశలో బెంగుళూరుకు చెందిన ‘విమోచన’ స్రీల సంస్థ రివిజన్‌ పిటిషన్‌ వేసి అప్పీలుకు వెళ్ళక తప్పని పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది. అయితే దాన్ని కోర్టు తోసిపుచ్చింది.

రమీజాబీ చరిత్ర ఏమిటి? ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ”చిన్నతనంలోనే నాకు పెళ్ళయింది. అప్పుడు నా వయసు ఎంతో నాకు గుర్తులేదు. ఆ పెళ్ళి ఎన్నేళ్ళ క్రితం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. కానీ నా మొదటి భర్తను సంవత్సరం క్రితం వదిలిపెట్టాను. ఇవ్వాళ్టికి నెలన్నర క్రితం నేను రజస్వలనయ్యాను. నా మొదటి భర్తకు నేనంటే ఇష్టంలేదు, నాకూ అతనంటే ఇష్టం లేదు. అతన్ని వదిలిపెట్టగానే అహ్మద్‌ హుస్సేన్‌ను పెళ్ళి చేసుకున్నాను. రజస్వల కాక ముందు నుంచి కూడా అతన్ని ప్రేమిస్తున్నాను. అహ్మద్‌ హుస్సేన్‌, నేను పొలాల్లో కూలీ పనికి వెళ్ళేవాళ్ళం”.

భర్త మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు ఇద్దరు పోలీసులు రమీజాబీని పట్టుకెళ్ళి రేప్‌ చేశారు. కేసుకి, ఈ విషయానికి ఏమీ సంబంధం లేకపోయినా క్రాస్‌ పరీక్షలో ఇది కీలకాంశం అయింది. ఆమె ఇచ్చిన ఈ క్రింది జవాబు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.

”మూత్ర విసర్జన కోసం నా భర్త స్మశానంలోకి వెళ్ళాడని, నేను బారిగారికి చెప్పలేదు. నా రిక్షా ఆగిన చోటు నుంచి నేనొక స్మశానాన్ని చూశాను. ముస్లింలు తమ స్మశాన వాటికను గౌరవిస్తారో లేదో నాకు తెలియదు. వాళ్ళు తమ సమాధుల మీద పూలు ఉంచుతారో లేదో, ఫతేహ చేస్తారో లేదో నాకు తెలియదు. మూత్ర విసర్జన చేస్తే సమాధులు అపవిత్రమవుతాయని ముస్లింలు భావిస్తారో లేదో కూడా నాకు తెలియదు”.

ఒక్క రమీజాబీనే కాదు, అహ్మద్‌ హుస్సేన్‌ తల్లి మిలన్‌ బీని కూడా ఇస్లాం సంప్రదాయం గురించి చాలా ప్రశ్నలడిగారు. అమ్మాయిలను వ్యభిచార గృహాలకు సరఫరా చేస్తుందనే ఆరోపణల నుంచి, ఆమె కూడా తనను తాను రక్షించుకోవాల్సి వచ్చింది. మిలన్‌ బీ క్రాస్‌ పరీక్షలో ఒక ముఖ్యమైన భాగం – రమీజాబీకి, ఆమె కొడుక్కి జరిగిన పెళ్ళి ఇస్లామిక్‌ చట్టం ప్రకారం చెల్లుతుందా లేదా అనే విషయానికి సంబంధించినది.

”ఇస్లాం సంప్రదాయం ప్రకారం నిఖా జరిగితేనే పెళ్ళయినట్లు భావిస్తారని నాకు తెలుసు. నా పెళ్ళిలో నిఖా జరిగింది. రమీజాబీ, అహ్మద్‌ హుస్సేన్‌ల పెళ్ళిలో నిఖా జరగలేదు. కానీ నలుగురు పెద్ద మనుషుల ముందు వాళ్ళు దండలు మార్చుకున్నారు. తాంబూలాలు పంచిపెట్టారు. ఇస్లాం ప్రకారం ఇద్దరు స్త్రీ, పురుషులు నిఖా లేకుండా కలిసి ఉండడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. నా సోదరుడు ఇమాం సాహెబ్‌ నిఖా చేసుకోకుండానే సాంబక్కతో కలిసి ఉంటున్నాడేమో నాకు తెలియదు”.

రమీజాబీ వివాహం చెల్లదని ఒకవైపు, వ్యభిచారంతో ఆమెకు సంబంధాలున్నాయని మరోవైపు, వాదించి, ఆమె రేప్‌ ఏ రకమైన అత్యాచారం కిందకూ రాదని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఆమె శరీరాన్ని, చట్టాన్ని కూడా ఉల్లంఘించడం లేదు కాబట్టి – వ్యభిచారిని ఎవరైనా రేప్‌ చేయడం ఏమిటి – అది అసలు నేరమే కాదనే అభిప్రాయం కలిగించాలని చూశారు.

రమీజాబీ కేసులో డిఫెన్స్‌కు కీలకమైన సాక్షులు, కుతుబుద్దీన్‌ అనే ఆమె దూరపు బంధువు, మరో ఇద్దరు స్త్రీలు. ఆ స్త్రీలు రమీజాబీ తమలాగే వృత్తి వ్యభిచారిణి అని సాక్ష్యమిచ్చారు. ముగ్గురి సాక్ష్యం చూస్తే కచ్చితంగా పోలీసుల సృష్టి అని తెలిసిపోతుంది. కుతుబుద్దీన్‌ అహ్మద్‌ హుస్సేన్‌ మొదటి భార్య షాజాదీ బీ దగ్గరి బంధువు. అతని సాక్ష్యం ఈ విధంగా ఉంది –

”నేను ఒకప్పుడు తాపీవాడ్ని. ఎక్కడ పని దొరికితే అక్కడ చేసేవాడ్ని. ఇప్పుడది మానేసి చేపలు, మామిడిపళ్ళు అమ్ముతున్నాను. రవాణా మంత్రి, మా పంచాయతీ బోర్డు సభ్యుడు అలీ సాహెబ్‌కు ఫోన్‌ చేసి చెబితే ఆయన ఈ సమాచారం సేకరించమని నాకు చెప్పాడు.”

కుతుబుద్దీన్‌ సేకరించిన సమాచారం ఏమిటి?

”రమీజాబీ రెండేళ్ళ క్రితం మరొకర్ని పెళ్ళి చేసుకుంది. ఈ రెండో పెళ్ళి మండ్లంలో జరిగిందని తెలిసింది. ఆమె ఎంతమందిని చేసుకుందో, ఎవరెవరితో కలిసి బతికిందో నేను ఇప్పుడెందుకు చెప్పాలి? ఆవిడ నూర్‌ అహ్మద్‌ను రెండో పెళ్ళి చేసుకుందని తెలిసింది కానీ దాని గురించి నాకు వ్యక్తిగతంగా ఏమీ తెలియదు. అన్నీ వాళ్ళు, వీళ్ళు చెప్పుకునేవే. మళ్ళీ అహ్మద్‌ హుస్సేన్‌ను చేసుకుందో లేదో నాకు తెలియదు. ఆమె శీలం అంత మంచిది కాదు. దాని గురించి వినడమే కానీ నేను ప్రత్యక్షంగా ఏమీ చూడలేదు. సత్తార్‌ కొడుకుతో, రహ్మతుల్లా అనేవాడితో కూడా ఆమె స్నేహంగా ఉంటున్నట్లు విన్నాను. వీళ్ళతో కలిసి తిరగడం నేను చూడలేదనుకో”.

అహ్మద్‌ హుస్సేన్‌ మొదటి భార్య షాజాదీ బీ ప్రకారం –

”మా ఆయన తాపీ పని చేస్తాడు. ఆ పని చేస్తూనే రాళ్ళమ్మే వ్యాపారం పెట్టాడు. ఆయన ఎప్పుడూ అమ్మాయిలను సప్లయ్‌ చేయడం కానీ, తార్చడం కానీ చేయలేదు. మా అత్తగారు నందికొట్కూరులో మంత్రసాని పని చేస్తుంది. మా ఆయన చావు వార్త కుతుబుద్దీన్‌ ద్వారానే నాకు తెలిసింది. అతనే ప్రభుత్వం నాకు నష్ట పరిహారం కింద రెండువేల రూపాయలు ఇస్తుందని చెప్పాడు. ఒక పోలీసు కూడా

మా ఇంటికి వచ్చాడు. పిటిషన్‌ ఇవ్వడానికి కుతుబుద్దీనే నన్ను హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. ఆ పిటిషన్‌లో ఏం రాసి ఉందో, ఏ భాషలో ఉందో అదేమీ నాకు తెలియదు. నేను రమీజాబీ గురించి ఏమీ చెప్పలేదు. ఈ నష్టపరిహారం తనకొద్దని, దానిమీద నాకే హక్కు ఉందని ఆమె కనుక చెప్తుంటే నాకు చాలా సంతోషమే… నాకు రెండువేలిప్పిస్తామని చెప్పే వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు.”

షాజాదీ బీ అన్నీ నిజాలే చెప్పి రమీజాబీ, అహ్మదుస్సేన్‌, మినల్‌ బీ ల మీద ఉన్న ఆరోపణలన్నీ అబద్ధమని స్పష్టం చేసినా కోర్టు దీనికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. రమీజాబీ వ్యభిచారి అనే దానిచుట్టూనే సాక్ష్యమంతా నడిచింది. లేదా ఆమె లెక్కలేనన్ని సార్లు పెళ్ళి చేసుకుంది కాబట్టి ఒకవేళ రేప్‌ జరిగినా దానికి ఎలాంటి ప్రాముఖ్యం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

ఇస్లాం సంద్రాయాలను పాటించని ముస్లింల మీద రాజ్యం కానీ, మెజారిటీ మతస్థులు కానీ చేసే దౌర్జన్యం రాజ్యం దృష్టిలో సమర్ధనీయమైంది. వాళ్ళు ఇస్లాం సంప్రదాయాలను పాటించారా లేదా అనేది – ఈ సంఘటనలో – నిర్వచించింది. అంచనా వేసింది కూడా, రాజ్యం, దాని సంస్థలే కానీ, ముస్లింలు కారు. అంటే మతంతో సంబంధం లేని ఒక సమస్యకు మతం రంగు పులమడానికి ప్రయత్నించింది రాజ్య సంస్థలే. మెజారిటీ మతస్థుల ఆధిపత్యానికి ఆమోదం కల్పించడంలో రాజ్యం నిర్వహించిన పాత్ర గురించి చెప్పేముందు ఈ కేసుకున్న మరో కోణాన్ని వివరించాలి.

రమీజాబీకి మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీల్లో వామపక్షాలు, ముస్లిం మతతత్వ సంస్థ అయిన మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌లు కూడా ఉన్నాయి. మిగతా ఆంధ్రప్రదేశ్‌లాగా కాకుండా హైదరాబాద్‌ సంస్థానం నిజాం పరిపాలనలో ఉండేది. దక్కన్‌ పీఠభూమిలో ఎక్కువ భాగం – దాదాపు 82 వేల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ సంస్థానం విస్తరించి ఉంది. జనాభాలో అధిక శాతం హిందువులు. ఉర్దూ మాట్లాడే ముస్లింలు 12 శాతం మించి లేరు. జమీందారీ పద్ధతి వల్ల తెలంగాణలో భూస్వామ్య దోపిడీ చాలా ఎక్కువగా ఉండేది. దీనికి నిజాం ప్రభుత్వం మద్దతూ ఉండేది. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు నిజాం అందులో చేరడానికి ఇష్టపడలేదు. హైదరాబాద్‌ను స్వతంత్ర రాష్ట్రంగా కొనసాగించాలనుకున్నాడు. ఈ దశలో ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ తన పారామిలటరీ సైన్యమైన రజాకార్ల ద్వారా చురుకుగా పని చేయడం ప్రారంభించింది. అసలు ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ ఏర్పడిందే ముస్లింల రాజకీయ, సాంస్కృతిక హక్కుల్ని పరిరక్షించి, వారి ఆధిపత్యాన్ని కొనసాగింపచేయడానికి. ఇది 1927లోనే ప్రారంభమయినా 1940-46 మధ్య పారా మిలటరీ విభాగాన్ని ఏర్పరచుకుని సైనిక శిక్షణ ఇప్పించింది. ఈ సాయుధ వలంటీర్ల పేరే రజాకార్లు. వీరు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ముస్లిం ఆధిపత్యాన్ని రక్షించడం కోసమని నగరంలోను, చుట్టుపక్కల గ్రామాల్లోను విపరీతమైన బీభత్సం సృష్టించారు.1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపి నిజాం పాలనను అంతం చేసింది. రజాకార్ల దళాన్ని రద్దు చేసింది. పునరుద్ధరించబడిన మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ ఇప్పుడు రమీజాబీకి మద్దతు తెలిపింది.

మజ్లిస్‌ చరిత్ర రాజకీయాల దృష్ట్యా రమీజాబీ కేసును వారు మతపరమైన సమస్యగా మారుస్తున్నారనే అభిప్రాయం కూడా కలిగింది. మజ్లిస్‌ మద్దతు తెలపగానే ప్రభుత్వం తనను తాను సమర్ధించుకోవాల్సిన పరిస్థితిలో పడింది. ఫలితంగా ఆధిపత్య పోరాటం మళ్ళీ జరిగింది – ఈసారి అక్షరాలా రమీజాబీ శరీరమే వాళ్ళకు యుద్ధభూమి అయ్యింది. దేశ విభజన సమయంలో స్త్రీల అనుభవాల నుంచి, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో స్త్రీల అనుభవాల నుండి స్త్రీల శరీరాల మీద యుద్ధమెలా జరుగుతుందో, వాళ్ళ శరీరాలు యుద్ధభూములుగా ఎలా మార్చబడతాయో మనకు తెలుసు. డిఫెన్స్‌ వాదనలు కానీ, ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ ప్రసంగాలు కానీ వాళ్ళను వాళ్ళు సమర్థించుకునే పద్ధతిలోనే సాగాయి. ఈ క్రమంలో రమీజాబీ రేప్‌, అహ్మదుస్సేన్‌ మరణం పూర్తిగా విస్మరించబడ్డాయి. ఈ మొత్తం అనుభవం – కోర్టు విచారణ, ప్రజల నిరసనకు, కమిషన్‌ సిఫారసులకు ప్రాముఖ్యమివ్వకపోవడం – మైనారిటీ అనుభవంలో ఒక పాఠం.

రమీజాబీ అనుభవాన్ని అర్థం చేసుకోవడం

ఒక్క సంఘటన ఆధారంగా సూత్రీకరణ చేయడం అసాధ్యమైనప్పటికీ రమీజాబీ కేసు విచారణ, రాజ్య సంస్థల పనితీరు, వాటిని నియంత్రించే నియమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నియమాలను మెజారిటీ మతస్థులు – అంటే అగ్రకుల హిందువులు – రూపొందిస్తారు. ఏ ముస్లిం స్త్రీ (ఆ మాటకొస్తే దళిత స్త్రీలు కూడా) దేనిమీదా ముఖ్యంగా రాజ్యసంస్థలకు వ్యతిరేకంగా – ఫిర్యాదు చేయడానికి వీలులేదు.

పరిపాలనా నియమాలను రూపొందించే అధికారం రాజ్యానిదే అయినా – కంటికి కనిపించే దానికంటే బాగా సంక్లిష్టమైన పరిస్థితి గురించి మనమిక్కడ మాట్లాడుతున్నాం. భారతదేశంలో రాజ్యానికి పునాది సెక్యులరిజమే అయినా వలస పాలనలోనూ, ఆ తర్వాత కూడా జాతీయతను, మత రాజకీయాలను చూస్తే చెప్పేదానికి చేసేదానికి మధ్యనున్న తీవ్రమైన అంతరాలు బయటపడతాయి.

భారతదేశ విభజన తర్వాత మన విధాన నిర్ణేతలు సెక్యులరిజాన్ని మత వ్యతిరేకతగా భావించలేదు. ప్రజా వ్యవహారాల నుంచి మతాన్ని వేరుచేయడంగా, అన్ని మత విశ్వాసాల నుంచి రాజ్యాన్ని విడదీయడంగా, మతం వ్యక్తుల ప్రైవేటు వ్యవహారంగా, సెక్యులరిజాన్ని వారు నిర్వచించారు. దీనితోపాటు ముస్లింల విస్వాశాన్ని పొందేందుకు భారత ప్రభుత్వం ముఖ్యంగా నెహ్రు ప్రయత్నించారు. అందువలనే ఉమ్మడి సివిల్‌ కోడ్‌ ప్రతిపాదనను పక్కకు పెట్టారు. రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేశారు కానీ, చట్టం నుంచి కాదు. ఒకరకంగా అదే దేశ సెక్యులర్‌ గుర్తింపునకు ఎక్కువ అవసరం. ముస్లింలు కూడా సెక్యులర్‌ చట్టాన్ని తమ ప్రయోజనాలకు విరుద్ధమైనదిగానే భావించారు. అప్పటికే కోల్పోయిన వాటికి మత చట్టాలను కూడా చేర్చడం వాళ్ళకు ఇష్టం లేకపోయింది. కొన్ని సదుపాయాలు కోల్పోయి భవిష్యత్తు నిరాశాజనకంగా కనిపిస్తున్న వాళ్ళకు దేశంలోని మత తత్వ వాతావరణం మరింత భయపెట్టింది. దేశంపట్ల వాళ్ళ భక్తే ప్రశ్నార్థకమైపోయింది. పశ్చిమ పంజాబ్‌ నుంచి, తూర్పు బెంగాల్‌ నుంచి ప్రజల వలస పెరిగేకొద్దీ ముస్లింల మీద దేశభక్తిని రుజువు చేసుకోవాలన్న ఒత్తిడి పెరిగింది. తాము కాశ్మీర్‌ వేర్పాటు వాదులనో, తెలంగాణా రజాకార్లనో సమర్థించడం లేదని చెప్పుకోవాల్సిన అగత్యం వారికి ఏర్పడింది.

పోయిన ఆస్తులకు బదులుగా స్త్రీలమీద ఆధిపత్యం కొనసాగించేందుకు రాజ్యం అంగీకరించింది. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా చేర్చడం ద్వారా ఇది సులభంగానే సాధ్యమైంది. ఈ హక్కుకు అర్థమేమిటంటే భారతదేశంలోని అన్ని మతాల వారు వారి సొంత పర్సనల్‌ లా ను మాత్రమే పాటిస్తారని ఈ చట్టాలు, పెళ్ళి, విడాకులు, పిల్లల సంరక్షణ, వారసత్వం, దత్తత వగైరా అన్ని కుటుంబ విషయాలను నియంత్రిస్తాయి.

కాబట్టి ఒకవైపు సెక్యులరిజమనే ఆదర్శం ఉన్నా మరొకవైపు రాజకీయ కార్యాచరణ దానికి విరుద్దంగా ఉంది. కాంగ్రెస్‌ రాజకీయాలు చూసినా, ఇతర పార్టీ రాజకీయాలు చూసినా అన్నీ కుల, మత ప్రాతిపదికన నడుస్తున్నవే. ఇవి ఎంతగా అంతర్భాగమైపోయాయంటే బయటి సమాజంలో కనిపించే అధికార క్రమమంతా మీకు కాంగ్రెస్‌ పార్టీలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత భారతదేశాన్ని పాలించింది ప్రధానంగా కాంగ్రెస్‌ కాబట్టి కాంగ్రెస్‌ లోని అగ్రకుల హిందూ లక్షణాలన్నీ ప్రభుత్వంలోనూ భాగమయ్యాయి. సెక్యులరిజంతో పాటు ప్రభుత్వం వీటిని తనలో ఇముడ్చుకుంది. రాజ్యం నేరుగా హింసకు పాల్పడిన సందర్భాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. హింసకు పాల్పడిన మెజారిటీ వర్గాలను శిక్షించడంలో రాజ్యం చూపే నిర్లక్ష్యం, అలసత్వం ఈ విషయాల్ని రుజువు చేస్తుంది. నేను మరో సందర్భంలో చెప్పినట్లు ఇది దళిత స్త్రీల విషయంలో కూడా అంతే సత్యం.

స్త్రీల మీద దీని ప్రభావం ఎంత ఉంటుంది? రమీజాబీ కేసునే ఉదాహరణగా తీసుకుందాం. ఆమెను నలుగురు సామూహికంగా రేప్‌ చేశారు. అయినా, ఆమె మొదట తాను వ్యభిచారిని కాదని రుజువు చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత చాలామందిని పెళ్లి చేసుకోవడం ద్వారా శీలం కోల్పోయిన దానిని కాదని నిరూపించుకోవాల్సి వచ్చింది. మూడోది – అహ్మద్‌ హుస్సేన్‌ను చట్టబద్ధంగా పెళ్ళి చేసుకున్నానని కోర్టుని నమ్మించాల్సి వచ్చింది. నాల్గవది – తాను మంచి ముస్లింనని ఇస్లాం సంప్రదాయాల గురించి తెలిసినదాన్ని, వాటిని గౌరవించేదాన్నని రాజ్యాన్ని నమ్మించాల్సి వచ్చింది. ఇలాంటివి ఆమె చాలా చేయాల్సి వచ్చింది. రేప్‌ అనే కఠోర వాస్తవం మాత్రం వీటన్నింటి మధ్య ఎక్కడో మరుగున పడిపోయింది. ఆమె వారు చెప్పిన చెడు లక్షణాలన్నీ కలిగి ఉన్నదైనా రేప్‌ అబద్ధమైపోదు. పైగా వాటివల్ల ఆమె రేప్‌కు గురికావడానికే ఎక్కువ అవకాశాలున్నాయని తేలుతుంది.

స్త్రీలు ఈ విధంగా స్వీయత్వ పోరాటాలలో చిక్కుబడిపోవడం, సెక్యులర్‌, క్రిమినల్‌, సివిల్‌ న్యాయం వారికి అందుబాటులో లేకపోవడం, వీటి దృష్ట్యా ఈ పరిస్థితిలోని సంక్లిష్టతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఫెమినిస్టులుగా మనకే ఎక్కువ ఉంది. సెక్యులరిజానికి ప్రభుత్వం ఇస్తున్న నిర్వచనం ఫలితంగా స్త్రీలు కుటుంబంలో, మతంలో ఉండిపోవాల్సి వస్తుంది. దీనివల్ల వారికి ఒకవైపు సమాన పౌరసత్యం, ప్రజాస్వామిక సివిల్‌, క్రిమినల్‌ న్యాయం అందుబాటులో లేకుండా పోతున్నాయి; రెండోవైపు కుటుంబంలో, మతంలో పురుషాధిపత్యం కొనసాగింపునకు ఆమోదం లభిస్తోంది. కుటుంబానికి చెందని స్త్రీలు, చట్టానికి కూడా బహిష్కృతులై పోవడంతో, వారిమీద జరిగే దౌర్జన్యం అన్యాయం కూడా కాకుండా పోతోంది. కుటుంబం వెలుపలి స్త్రీలకు చట్టం రక్షణ లేకపోవడమనేది స్త్రీలందరికీ, ముఖ్యంగా కుటుంబ స్త్రీలకు తీవ్ర పర్యవసానాలు తెచ్చిపెట్టగలదు. కుటుంబ స్త్రీ మీద దౌర్జన్యం, అత్యాచారం జరిపినపుడు, వాళ్ళు చేయాల్సిందంతా ఆమె ఏ మగాడికీ చెందింది కాదనీ వ్యభిచారనీ, నిరూపించడమే. వారి నిర్వచనాన్ని ఆమోదించడమంటే వ్యభిచారికి, యింకా చెప్పాలంటే, స్వతంత్రంగా బతికే ఒంటరి స్త్రీకి ఈ సమాజంలో ఎలాంటి రాజ్యాంగ పరమైన, ప్రజాస్వామికమెనౖ హక్కులు ఉండవని ఒప్పుకోవడమే.

(కృతజ్ఞతలు: మత ఛాందసవాదంపై కొలంబోలో 1992 మార్చిలో జరిగిన దక్షిణాసియా ఫెమినిస్టు వర్క్‌షాప్‌లో చదివిన వ్యాసం ఇది. స్త్రీలమీద జరిగే హింస గురించి వసంత కన్నబిరాన్‌తో జరిగిన చర్చల ఫలితంగా రూపొందిందీ వ్యాసం. అన్ని రాజకీయ పార్టీలు, పౌర హక్కుల సంఘాల తరపున ముక్తదార్‌ కమిషన్‌ విచారణలో పాల్గొన్న కె.జి.కన్నబిరాన్‌తో జరిపిన చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. దక్షిణాసియా ఫెమినిస్ట్‌ వర్క్‌షాప్‌లో ఈ వ్యాసానికి స్పందించి, చర్చలు జరిపి నా వాదానికి పదును పెట్టిన రోడా రెడ్డాక్‌కు, ఇతర మిత్రులకు కూడా కృతజ్ఞతలు.)

(‘సరిహద్దులు లేని సంధ్యలు’ పుస్తకం నుంచి…)

Share
This entry was posted in చట్టం - న్యాయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.