విద్యాసాగర జనని భగవతీదేవి భండారు అచ్చమాంబ – సరళీకరణ : పి. ప్రశాంతి

తే. ఒక పరోపకారంబు చేయుటయె కాదె

యిలపయిని జన్మమెత్తిన ఫలము మనకు;

గాన మన మేలు చూడకయైన దరుణి!

పరులకుపకార మొనరింపవలయు జూవె. – వీరేశలింగ కవి

బీదలయొక్క, దు:ఖితుల యొక్క బంధుడు, వంగదేశపు సత్పురుషుడు, భారతవర్షమనే ఆకాశానికి తేజోమయమైన నక్షత్రం, విధవాబంధుడు అయిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ తల్లియైన భగవతీదేవి చరిత్ర సకలజనులకు అనుసరణీయం. ఏ సద్గుణాల వలన విద్యాసాగర్‌ ప్రాత:స్మరణీయుడయ్యాడో, ఆ సద్గుణాలకు మూలకారణం అతని తల్లే అని చాలామందికి తెలియదు. ఎలాంటి విత్తో అలాంటి ఫలమే కలుగుతుందనటానికి భగవతీదేవి విద్యాసాగర్‌ల కథల వలన తెలుస్తుంది. దయ, ధర్మము, క్షమ మొదలైన సద్గుణాలు భగవతీదేవి వలననే విద్యాసాగర్‌కి పట్టుపడినాయి. కావున విద్యాసాగర్‌ తన తల్లిని సాక్షాత్తు అన్నపూర్ణగా భావించి పూజిస్తుండేవాడు.

ఈమె 1724వ సంవత్సరం ఫాల్గుణ మాసంలో బెంగాలీ దేశంలోని ఒక పల్లెలో బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఈమె తండ్రి పేరు రామకాంత చటోపాధ్యాయ, తల్లి గంగాదేవి. రామకాంతుడు చిన్నతనం నుండే దైవభక్తి కలిగి విరక్తుడయ్యాడు. అతడు ఎక్కువగా ఎవ్వరితోనూ మాట్లాడక అరణ్యానికి వెళ్ళి, ఏకాంతంగా జపం చేసుకుంటుండేవాడు. ఆయన బొత్తిగా సంసారంపట్ల విరక్తుడవటం విని గంగాదేవి తండ్రియైన విద్యావాగేశుడు తన కూతురిని పిల్లలతో పాటుగా పాతూల గ్రామానికి తీసుకెళ్ళాడు. అప్పటినుండి గంగాదేవి తన ఇద్దరు కూతుళ్ళతో పుట్టింట్లోనే ఉండిపోయింది. పంచావన విద్యావాగేశునికి ఇద్దరు

కూతుళ్ళు, నలుగురు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు పేరు రామమోహన విద్యాభూషణ్‌, రెండోవాని పేరు రామధన్‌తర్కవాగేశుడు, మూడవవాని పేరు గురుప్రసాద శిరోమణి, నాల్గవవాని పేరు విశ్వేశ్వర తర్కాలంకారుడు. ఈ కుటుంబం విద్య, దయ, ధర్మం, అతిధి సత్కారం మొదలైన సద్గుణాలతో విశేష ఖ్యాతి పొందింది. విద్యాసాగరుడు తన జీవిత చరిత్రలో ఈ పరివారం గూర్చి ఇలా వ్రాశాడు. ‘అతిధి సేవయందు, అభ్యాగతుడ్ని సన్మానించుటలో ఈ కుటుంబానికి గల శ్రద్ధ ఎంతో స్తుతింపదగ్గది. ఆ శ్రద్ధ మరోచోట కనిపించదు. ఆ పరివారం నందు ఈ సద్గుణాలు లేనివారు ఒక్కరూ కనిపించరు. రాధామోహన విద్యాభూషణుని వాకిట్లోకి వచ్చి అన్నం అడిగి దొరకక వెళ్ళిపోయిన అతిధి ఒక్కడూ కనపడడు. ఆ ఇంట్లో ఉండే పిల్లలు, వృద్ధులు అందరూ ఇలాంటి గుణాలు కలవారే”. ఇలాంటి పరివారంలో పెరిగినందువలనే భగవతీదేవికి అట్టి సద్గుణాలు వంటబట్టాయి. అందువలనే అదివరకు దురదృష్టవంతురాలైన వంగ జనని తేజోమయమైన నక్షత్రం వంటి విద్యాసాగర్‌ అనే న్యాయరత్నాన్ని పెంచే సమర్ధురాలయింది. తమ సంతానానికి సద్గుణాలు నేర్పడానికి, కుటుంబం ఎలా ఉండాలో నేర్చుకోదలచినవారికి పాతూల గ్రామంలోని విద్యావాగేశుడి పరివారమే చాలినంత దృష్టాంతం.

భగవతీదేవియొక్క, విద్యాసాగర్‌ యొక్క చరిత్రలందు ప్రకాశించే దయ, ధర్మం మొదలైన సద్గుణాలకు విద్యావాగేశుని కుటుంబమే మూలం. 1737వ సంవత్సరంలో బనిమాలాపురంలో రామజయ బందోపాధ్యాయుని పుత్రుడైన ఠాకుర్‌దాసుని భగవతీదేవి వివాహమాడింది. ఈ దంపతులకే ప్రాతఃస్మరణీయుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ జన్మించాడు.

ఠాకూర్‌దాసుని బాల్యంలోనే అతని తండ్రి సంసారంపట్ల విరక్తుడయి స్వదేశ పరిత్యాగం చేసి తీర్థయాత్రలు చేస్తుండేవాడు. కాబట్టి ఠాకూర్‌దాసుని తల్లియైన దుర్గాదేవి తన పుట్టింటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఆమె దు:ఖం ఎంత మాత్రం తగ్గకపోగా, అన్నల వదినల యొక్క బాధ పెరిగింది. దాంతో ఆమె ఆ గ్రామంలోనే ఒక కుటీరం నిర్మించుకుని ఒక విధంగా కాలం గడుపుతుండేది. ఆమె రాత్రంతా దారం వడికి దానినమ్మి తాను, కుమారుడు భోజనం చేస్తుండేవారు. బుద్ధిమంతుడైన ఠాకూర్‌దాసు తల్లి కష్టం చూడలేక కలకత్తా వెళ్ళి అతి కష్టంతో విద్యనభ్యసించాడు. ఆయన త్వరగా కొంత విద్య నేర్చుకుని తక్కువ వేతనంగల ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆ రోజుల్లో భోజన సామగ్రి చవకగా దొరుకుతుండటం వలన తక్కువ వేతనంగల ఉద్యోగం దొరికినా కానీ ప్రజలు ఆనందించేవారు. ఠాకూర్‌ దాసుకు 8 రూపాయల వేతనం గల పని దొరకడం విని దుర్గాదేవి తన పర్ణకుటీరంలో ఆనందోత్సవం చేసింది. వారి హితవు కోరేవారందరూ ఆ సమయంలో చాలా సంతోషించారు. తర్వాత కొన్ని రోజులకు రామజయుడు (విద్యాసాగరుని తాత) వచ్చి భార్య కష్టాలను విని ఎంతో చింతించి పుత్రుడ్ని కనుక్కొని అతని వివాహం చేసి మళ్ళీ తీర్థాటనకు వెళ్ళిపోయాడు; కానీ అతను పూర్వంలా ఎక్కువ రోజులు తీర్థాటన చేస్తూ ఉండక త్వరలోనే ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చినందుకు ఒక కారణాన్ని ఇలా చెప్తారు: ఒకరోజు అతడు కేదార పర్వతం దగ్గర నిద్రిస్తుండగా ఒక మహాపురుషుడు ఆయన కలలో కనబడి ఇలా అన్నాడు – ”ఓ రామజయుడా! నీవెందుకు నీ కుటుంబాన్ని వదిలి తిరుగుతున్నావు? త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళు. మీ వంశంలో ఒక మహాపురుషుడు పుడ్తాడు. వాని దయాదానవిద్యాది గుణాలతో మీ వంశం కీర్తిని పొందుతుంది. పరమేశ్వరునికి మీయందు ఎంతో దయ ఉంది.” ఈ కల చూసి రామజయుడు వీరసింహ గ్రామానికి వచ్చి చూసేటప్పటికి ఠాకూర్‌దాసు కలకత్తాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్యయైన భగవతీదేవి గర్భవతియై ఉన్మాదం కలిగి ఇంటివద్దే ఉంది. రామజయుడు కోడలి పిచ్చి పోడానికి అనేక ఔషధాలను, మంత్ర తంత్రాలను చేసి చూశాడు. కానీ దానివలన ఆ పిచ్చి కుదరట్లేదు. చివరికి ఒక జ్యోతిష్కుడిని పిలిచి అడగగా ఆ జ్యోతిష్కుడు భగవతీదేవి యొక్క జాతకాన్ని, ఆమె అవయవాల్ని చూసి ఇలా చెప్పాడట. ”ఈమె గర్భంలో ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన ప్రభావం వలననే ఈమెకి ఇట్టి ఉన్మాదావస్థ కలిగింది. ప్రసవానంతరం ఈమె బాగవుతుంది. ఇప్పుడు ఔషధోపచారములు చేయుటవలన ఏమీ ప్రయోజనం లేదు”. 1742వ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో సాక్షాత్తు దయయొక్క అపరావతారుడైన ఈశ్వరచంద్రుడు జన్మించాడు. నీళ్ళాడిన తర్వాత భగవతీదేవికి గల ఉన్మాదం పోయింది.

భగవతీదేవి గొప్ప అందగత్తె కాకున్నా, ఆమె ముఖంలోని తేజం ఎంతో హృద్యంగా ఉండేది. వంగ దేశంలోని ఆధునిక ప్రభాతకవియైన రవీంద్రనాధుడు భగవతీదేవి రూపాన్ని గూర్చి ఇలా వ్రాశాడు- ”భగవతీదేవి ముఖంలోని గాంభీర్యం, ఉదారత ఎంత చూసినా తృప్తి కలగదు. ఈమె బుద్ధి యొక్క ప్రసారతను తెల్పే ఉన్నత లలాటము, సుదూర దర్శులు, స్నేహ వర్షులు అయిన ఆ కళ్ళు, సరళ నాసిక, దయాపూర్ణమైన యోష్ఠోదరము, దృఢతాపూర్ణమైన చుబుకం- ఇలా అన్ని అవయవాలు పొంకంగా ఉండి మహిమమయమైన ఆమె ముఖ సౌందర్యం చూసేవారి హృదయానికి అధికంగా పూజ్యభావాన్ని పుట్టిస్తుంది. దీనివలన (భగవతీదేవి ముఖంలో దైవిక కళ కలిగినందున)నే విద్యాసాగరుడు ఇతర పౌరాణిక దేవతలనెవ్వరినీ పూజింపక తన తల్లినే దేవత అని పూజించడానికి కారణం కూడా వ్యక్తమవుతోంది.”

పేదల దు:ఖాన్ని చూసిన భగవతీదేవికి ఎంతో జాలిపుట్టి కళ్ళవెంట నీరు కారుతుండేది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టటం, రోగులకు ఔషధోపచారాలు చేయటం, దాహంతో ఉన్నవారికి నీళ్ళివ్వడం, చలికి బాధపడుతున్న వారికి బట్టల్విడం వంటివి భగవతీదేవి యొక్క నిత్యవ్రతాలు. ఎవరికైనా రోగం వచ్చిందంటే భగవతీదేవి చేతిలో ఔషధాలు తీసుకుని వారికి సేవ చేయడానికి సిద్దంగా ఉండేది. ఎవరైనా డబ్బులేక బాధపడుతుంటే భగవతీదేవి తన దగ్గరున్నది కొంగున కట్టుకుని వారికి రహస్యంగా సహాయం చేయడానికి వెళ్ళేది. ఎవరైనా చలితో బాధపడుతుంటే భగవతీదేవి తన వెచ్చని బట్ట వారికిచ్చేది! ఆమె బ్రాహ్మణ కులంలో జన్మించినదైనా క్రింది కులాలవారి మలమూత్రాలు తీసి వారికి ఉపచారాలు చేయటంలో ఎప్పుడూ అసహ్యపడేది కాదు. ఇదే నిజమైన భూతదయ.

ఒకానొక సమయంలో విద్యాసాగరుడు ఇంటివారు కప్పుకొనుటకు కొన్ని ఉన్ని వస్త్రాలను ఇంటికి పంపాడు. అవి ఇంటికి రాగా ఇరుగుపొరుగువారు చలితో బాధపడుతుండగా చూసి భగవతీదేవి వాటిని పొరుగువారికిచ్చి కొడుకుకి ఇలా వ్రాసింది. ”ఈశ్వరా! నీవు పంపిన బట్టలు మన పొరుగువారు చలితో బాధపడుతుంటే వారికిచ్చాను. కనుక మన ఇంటికోసం వేరే బట్టలు పంపవలెను”. తల్లియొక్క భూతదయకు సంతోషించి విద్యాసాగరుడు ‘మన ఇంటికొరకు, బీదవారి కొరకు కూడా ఇంకెన్ని బట్టలు కావాలో వ్రాసినట్లైతే పంపుతాను’ అని తల్లికి వ్రాశాడు. తల్లి ఎలాంటిదో కొడుకూ అలాంటివాడే అవుతాడు కదా!

విద్యాసాగరుడి సోదరుడైన దీనబంధు న్యాయరత్నం కూడా ఎంతో ఉదారంగా ఉండేవాడు. ఆయన బట్టలు లేనివారిని చూస్తే తన పైవస్త్రాన్నైనా వారికిస్తుండేవాడు. పరుల దు:ఖాన్ని చూసిన అతడు దు:ఖం తనకు కలిగినట్లు విచారపడేవాడు. ఒకరోజు దీనబంధు వీథిలో ఒంటరిగా నిలబడి ఉండగా ఒక బీద స్త్రీ చింపిరి బట్టను కట్టుకుని పోతోంది. అది చూసి దీనబంధు పైనున్న చిన్న వస్త్రాన్ని, తాను కట్టుకున్న కట్టుబట్టను ఆమెకిచ్చి వచ్చి తల్లికి ఆ వృత్తాంతమంతా చెప్పాడు. అందుకామె ఎంతో సంతోషించి ”నాయనా! నీవు చాలా

మంచి పని చేశావు. నేను ఒక రాత్రి నూలు వడికితే నీకు ధోవతి అవుతుంది” అని చెప్పింది. ఇంతటి బీదతనంలోనూ వారి ఇల్లు అతిధి అభ్యాగతులకు, దుఃఖితులైన వారికి సుఖప్రదంగా ఉండేది. తర్వాత విద్యాసాగరుడి బుద్ధికౌశలంతో, లక్షాధీశులయినప్పుడు ఎంత పరోపకారం చేసుంటారో పాఠకులే గ్రహించగలరు.

పండిత ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ వితంతు వివాహాలను గురించి ప్రయత్నం చేయటం భగవతీదేవిగారి ప్రేరణ చేతనే అని చెప్తారు. దీని గురించి జనానా పత్రికలో ఇలా వ్రాసుంది –

”విద్యాసాగరుడు మహోన్నత పదవిలో ఉండి తన సత్పాత్ర దానం వలన వంగదేశానికి ఒక్క కష్టమూ రాకుండా కాపాడుతున్న సమయంలో ఒకరోజు శ్రీ భగవతీ దేవిని దర్శించడానికి ఒక బాల వితంతువు వచ్చింది. ఆమె శ్రీ భగవతీదేవిని కలిసి మాటల సందర్భంలో తన నిర్బంధ వైధవ్య దశను గూర్చి దుఃఖంతో చాలా మాట్లాడింది. ఆర్తత్రాణ పరాయణత్వాన్ని వహించిన భగవతీదేవి ఈమె కష్టాలను వినగానే పట్టలేని దుఃఖంతో తన కుమారుని వద్దకు వచ్చి ”కుమారా! నీవు సమస్త శాస్త్రాలను చదివావు గదా, ఆపన్నులయిన బాల వితంతువులను సంరక్షించే శాస్త్రమేదీ నీకు కనిపించలేదా?” అని అడిగింది.

”విద్యాసాగరునికి తన తల్లిపట్ల అత్యంత గౌరవం ఉంది. అతడు తన ఔన్నత్యమంతటిని చిన్నప్పుడు తనకు ఆమె నేర్పించిన సద్గుణపుంజము వలన అందింది. దుఃఖంతో తన తల్లి చెప్పిన మాటలను వినగానే విద్యాసాగర్‌ తిరిగి శాస్త్రాలను చదవటం ప్రారంభించి చివరికి పరాశర స్మ ృతిలో స్త్రీ పునర్వివాహాలను తప్పక జరపాలని చెప్పిన ఈ క్రింది వాక్యాన్ని చూశాడు”.

”నష్టే మృతే ప్రవ్రజతే క్లే బేద పతితే పతే / పంచస్వాపత్సు నారీణాం పతి రన్యో విధేయతే”.

”తన కుమారుడు స్త్రీ పునర్వివాహాలను చేయడం ప్రారంభించిన తర్వాత అతనికి ఎన్నో విధాల ధైర్యాన్ని ఇస్తూ కుమారా! నీవు అవలంబించిన మార్గాన్ని విడవకుండా, ప్రారంభించిన ఈ మహాకార్యాన్ని నిర్వహించు. నీకెన్ని కష్టాలు వచ్చినా మేమెప్పుడూ నిన్ను విడవకుండా నీకు సహాయులమై ఉంటాము. ఒకవేళ మేము నిన్ను విడిచిపెట్టినా నీవు నిరుత్సాహపడకు సుమా” అని అతనికి బోధిస్తూ శ్రీ భగవతీదేవి బాలవితంతువుల పాలిటి నిజమైన రక్షకురాలై నిలిచింది.

పునర్వివాహం చేసుకున్న వధూవరులను ఆ కాలంలో వారి ఆప్తులు తిరస్కారంగా చూసి, చాలా బాధపెడుతుండేవారు. ఆ యువతులను తనవద్దకు పిలిచి భగవతీదేవి వారికి అనేక బుద్ధులు నేర్పి, బుజ్జగించి వారిని తన దగ్గర కూర్చోబెట్టుకుని, భోజనం పెట్టి ఆప్తుల తిరస్కారంతో ఖిన్నులైన వారిని సంతోషపెట్టేది. ఇంటికి వచ్చిన అతిథిని తను సన్మానించి పంపని రోజున భగవతీదేవికి చాలా దుఃఖంగా ఉండేది. తన శరీరం అస్వస్థతతో ఉన్నా కూడా అతిథికి అన్నం పెట్టించి కానీ ఆమె నిద్రించేదికాదు.

సివిలియన్‌ హరిసన్‌ దొరగారు ఒకరోజు వీరి ఇంటికి విందారగించడానికి వచ్చారు. అప్పుడు భగవతీదేవి తానే వంట చేసి వడ్డించింది. భోజనానంతరం వారందరూ మాట్లాడుకుంటుండగా ఆ దొర భగవతీదేవిని చూసి ”మీ వద్ద చాలా ధనం ఉందా” అని అడిగాడు. అందుకామె కార్నీలియాలాగా తన కుమారులను చూపించి వీరే నా ధనం అని చెప్పింది. ఆమెను చూసి ఆ దొర విద్యాసాగరునితో ‘ఈ సాధ్వి వలననే నీవింత సద్గుణవంతుడవయ్యావ’ని పలికాడు. భగవతీదేవి యొక్క సుగుణ సంపదలను చూసి ఆమెపట్ల అత్యంత పూజ్యభావం కలిగి ఆ ఆంగ్లేయుడు ఆమెకు హిందూరీతిని అనుసరించి సాష్టాంగ నమస్కారం చేసాడు.

స్త్రీలయినా, పురుషులయినా, శ్రీమంతులయినా, పేదలయినా, కులీనులైనా, కులహీనులైనా, విద్వాంసులైనా, మూర్ఖులైనా, భేదభావం లేక భగవతీదేవి అందరినీ సమానంగా చూస్తుండేది. ఈ సమభావం వలనే ఈమె సకలజనులతో సకల దిక్కుల పూజింపబడుతుండేది.

భగవతీదేవిగారి దయకు మితం లేకుండేది. పరుల దు:ఖాన్ని చూసిన ఆమె హృదయం కరిగిపోతుండేది. ఆమె అతిథులకు, అభ్యాగతులకు, విద్యార్థులకు, రోగులకు సహాయం చేస్తూ వీరసింహం అనే పల్లెలోనే నివాసం చేస్తుండేది. ఒక సమయంలో విద్యాసాగర్‌ ఆమెని కలకత్తాకి తీసుకొచ్చారు. కలకత్తాలో వీరసింహంలో చేసినట్లు పరోపకారం చేయడానికి వీలులేదని చూసి, ఆమె కుమారుడితో పలికిన పలుకులు వింటే పాషాణ హృదయాలు కూడా దయామయులవటం వింత కాదు. ఆమె కుమారునితో ఇలా అంది. ”నేను వీరసింహంకు పోకపోతే మన ఇంట భోజనం చేసి విద్యనభ్యసించే విద్యార్థులకు ఎవరు భోజనం పెడ్తారు? ఎండవానల్లో నడిచి అలసి వచ్చిన అతిథులకు ఆశ్రయం ఇచ్చేవారెవరు? నిరాశ్రయమైన కుటుంబానికి ఆశ్రయం ఇచ్చేదెవరు? ఇలా అక్కడ అనాథలు కష్టపడుతుండగా నేనిక్కడ ఎలా సుఖంగా ఉండగలను? నన్ను త్వరగా వీరసింహానికి పంపు”. విద్యాసాగరుడు ఆమె అభిప్రాయాన్ని కనిపెట్టి దీనరక్షణార్ధమై ఆమెను వీరసింహానికి పంపారు. మరొకసారి ఆమెను ఈశ్వరచంద్రులు తమ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ పరోపకారార్థమై ఆమె ఆ పల్లెను విడవలేదు.

స్వర్ణాలంకారాలయందు భగవతీదేవికి ఎంత మాత్రం ఇష్టంలేదు. ”నగలు పెట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఒకరోజు దొంగలు తీసుకొని పోగలరు. కానీ ఆ ధనంతోనే సహాయం లేని కుటుంబాలకు, దరిద్రులైన విద్యార్థులకు సహాయం చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది!” ఇలా భగవతీదేవి లోకులకు ఉపదేశిస్తుండేది. ఒకసారి విద్యాసాగరుడు తల్లితో ఇలా అన్నాడు. ”అమ్మా దేవి పూజ చేయటం మంచిదా? లేక ఆ ధనంతో నేను పరోపకారం చేయుట మంచిదా?” అందుకు ఆ పరోపకారాయణ ”అదే ధనంతో దుఃఖితుల దుఃఖం నివారణమవుతుందంటే పూజ చేయడానికంటే దుఃఖితులకు ఇవ్వడమే మేలు” అంది. ఆహా! భూతదయ అంటే ఇదే కదా! ఈమె వార్ధక్య కాలంలో కాశీవాసం చేసి అక్కడే కాలధర్మం చేసింది.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో