2002… నోమా ఫంక్షన్ హాల్… క్రింది అంతస్థులోని డైనింగ్ హాల్… ఏడు రంగుల బెలూన్స్, రిబ్బన్లతో ఇంద్రధనస్సును తలపిస్తోంది. మొదటి అంతస్థులోని కాన్ఫరెన్స్ హాల్‌లో వేదిక సమావేశానికి సిద్ధమవుతోంది. హాల్ యాజమాన్యం వేదికమీద కుర్చీలు, అందంగా కుచ్చుల తెరలు అమర్చిన టేబుల్స్ వేసుంచారు. వాటిని తీయించేసి మెత్తటి పరుపులు, వాటిపైన పోచంపల్లి దుప్పట్లు పరిపించి… వేదిక వెనకున్న గోడకి అమర్చిన బ్యానర్‌ని సరిచేసి తృప్తిగా ఒకర్నొకరు చూసుకున్నారు శాంతి, ఉష. బ్యానర్ చక్కగా వచ్చిందంటూ మెచ్చుకుంది ఉష – బ్యానర్‌పై ఉన్న హరివిల్లు… దానితో ఆడుకుంటు న్నట్లున్న ఏడుగురు అమ్మాయిలు… ఏడు జిల్లాల్లోని మహిళా శిక్షణ కేంద్రాలకి ప్రాతినిధ్యంలా తయారుచేసిన లోగో… ఆ వాతావరణానికి చక్కగా అమరింది.
మహిళా శిక్షణ కేంద్రం… విద్యావకాశాలు అందుబాటులో లేకో, కుటుంబ పరిస్థితులవల్లో, అవగాహనా లేమివల్లో, మారుమూల గ్రామాల్లోని బడులకి టీచర్లు వెళ్ళకపోడంవల్లో, వెళ్ళినా ఒకే టీచరు 5 తరగతుల్లోని 30-40 మంది పిల్లల్ని సంభాళించలేకపోడంతోనో, చెప్పే చదువునచ్చకో పనికి పోతున్న బాలికల కోసం జీవన నైపుణ్యాలతో కూడిన విద్యనందించడానికి మహిళా సమత ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ కేంద్రాలు! ఇక్కడ బాలికల, మహిళల హక్కుల నేపధ్యంగా చదువుతో పాటు, నాణ్యమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తూ యుక్తవయసు బాలికలను, యువతులను స్వశక్తివంతులుగా తీర్చిదిద్దుతూ రెండోతరం నాయకత్వాన్ని తయారు చేయడం దిశగా జరిగిన వినూత్న ప్రయత్నం.
మహిళా సమత పని చేస్తున్న ఏడు జిల్లాల్లోని మహిళా శిక్షణ కేంద్రాల్లో అప్పటికి ఏడేళ్ళుగా చదువుకుని వెళ్ళి తమ చదువుని కొనసాగిస్తున్న అమ్మాయిలు… పదోతరగతి పూర్తిచేసి అంగన్‌వాడి కార్యకర్తగానో, ఆరోగ్య కార్యకర్తగానో, మరో పనిలోనో కుదురుకున్న యువతులు… కాస్త వయసెక్కువుండి చదువు కొనసాగించలేక పెళ్ళిళ్ళు చేసుకుని వారు నేర్చుకున్న విషయాలని వారి వారి గ్రామాల్లోని స్త్రీలందరికీ పంచుతూ, హక్కుల్ని సాధించుకోడం కోసం వారిని సంఘటిత పరుస్తున్న మహిళలు… ఇంకా ఎమ్‌ఎస్‌కె లలోనే చదువుకుంటున్న బాలికలు… వారికి చదువు చెప్తున్న, వారి కుటుంబాలని చైతన్యపరుస్తున్న అక్కయ్యలు… సుమారు వెయ్యిమంది…
వీరందర్ని ఒకచోట కలిపి వారి వారి భావాల్ని పంచుకునేందుకు, మనసు లోతుల్లోని ప్రశ్నల్ని వెలికితీసేందుకు, మరింత ఆలోచనని కల్పించేందుకు ఉద్దేశిం చిన ‘హరివిల్లు మేళా’లో ఆ అమ్మాయి లందరూ వారి కోపాల్ని, ఆవేశాలని విషయ సంబంద్ధంగా వెలిబుచ్చుతుంటే శాంతి మనసు ఉప్పొంగింది. వారి అభివృద్ధికి ఆటంకంగా ఉన్న వ్యవస్థలు, సంస్కృతి, ఆచారాలపై నిప్పు కణికలై రగులుతుంటే శాంతి కళ్ళు ఎర్రబడ్డాయి. లేతవయసులోనే బలవంతపు పెళ్ళిళ్ళకి గురై చంటి పిల్లల్ని చంకనేసుకు వచ్చిన వారి వెతలు వింటుంటే మిగతా అమ్మాయిలు సెగలుగక్కారు. చివరికి అందరూ కలిసి ‘చట్టాన్ని గౌరవిద్దాం… బాలికల హక్కుల్ని కాపాడుకుందాం… 18 ఏళ్ళు దాటాకే పెళ్ళిళ్ళు…’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలొగ్గక నిలిచారు!!
2016… మద్దూరు కేంద్రంగా… బాలల సంఘాల పిల్లలు… వారివారి హక్కులకై భూమిక ఆధ్వర్యంలో బాలదండుగా ఏర్పడ్డ యుక్త వయసు బాలబాలికలు… దాదాపు ఐదారువందల మంది… వంద ఊళ్ళకి, తండాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక దగ్గర చేరిన ఈ తరం యువత!
యుక్తవయసు బాలబాలికల స్థితి, వారి హక్కులు – అందుబాటు, చదువు – సహకార వ్యవస్థలు బాల్య వివాహాలు, చిన్న వయసు పెళ్ళుళ్ళు, బలవంతపు పెళ్ళిళ్ళు, యుక్తవయసు ఆకర్షణలు, మీడియా ప్రభావం… చర్చించని విషయాల్లేవు! నిలదియ్యని వ్యవస్థ లేదు!! అచ్చంగా పధ్నాలుగేళ్ళ క్రిందటి హరివిల్లు మేళాలో బాలికలు, యువతలు స్పందించినట్లే ఉంది.
కాని, ఈ తరం సంధించిన ఒక ప్రశ్న, లేవనెత్తిన ఒక కీలకమైన అంశం – ”మాకు ఇష్టాలుండవా? మా భవిష్యత్తును మేం నిర్ణయించుకోలేమా? విషయాలన్నీ తెల్సుకున్నాం – చట్టపరంగా వివాహ వయసు అమ్మాయికి 18 ఏళ్ళని అబ్బాయికి 21 ఏళ్ళని తెల్సు! కాని మరి మా ‘Right to Choice’ సంగతేంటి? మార్పు సహజ మైనపుడు ఈ మార్పు నెందుకు కాదంటు న్నారు? చట్టపరమైన వివాహ వయసును చేరుకోడానికి ఏడాది కన్నా తక్కువే ఉన్నా… పెళ్ళొద్దంటున్నారు! మరి వయసుకి మించిన కథల్తో సినిమాలు తీసి మమ్మల్నెందుకు ఆకర్షితుల్ని చేస్తున్నారు? టీవి సీరియళ్ళూ అలాగే ఉన్నాయి. మరి juvenile వయసును మాత్రం 16 ఏళ్ళకు తగ్గించాలంటున్నారే? POCSO చట్టం ఇంకా కఠినంగా ఉంది… చట్టాలు మనం చేసుకున్నవేగా? మారుతున్న కాలంతోపాటు అవీ మార్చుకోవాలిగా?” ప్రశ్నల శతఘ్నులు పేలుతూనే ఉన్నాయి.
చట్టపరంగా వివాహ వయసుకన్నా ముందే యువతరం లైంగికంగా చైతన్యవంతు లౌతున్న నేపధ్యంలో ఈ ప్రశ్నలకి సమాధానా లేవి? ఈ మార్పు కాలానుగతమా? సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల పర్యవసానమా? చట్టాలు Vs. Right to Choice!! వీటికి సమాధానాలెక్కడ?