చింతలపూడి ఎత్తిపోతల పథకం – దగాపడ్డ జనం – విమల

చింతలపూడి ఎత్తిపోతల పథకం పేరిట తమకు జరుగుతున్న అన్యాయాలను, భూ మాఫియాలా మోసాలను, తమ దిగుళ్ళను, ఆగ్రహాన్ని, అసహాయతను ప్రజలు చెబుతున్నప్పుడు వాళ్ళకు అండగా నిలబడాల్సిన అన్ని వ్యవస్థల వైఫల్యాలు మనకు కళ్ళకు కట్టినట్లు కనపడతాయి.

జీలుగుమిల్లి మండలం తాటిరాముడి గూడెం.. సుమారు 120 కుటుంబాలకు పైగా ఉన్న ఒక ఆదివాసీ గ్రామం.

700 ఎకరాల సాగుభూమిలో 324 ఎకరాలు చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద ముంపునకు గురికానున్నదని కొద్ది కాలం క్రితమే వాళ్ళకు తెలిసింది. 1/70 చట్టం ఉల్లంఘనలు జరిగాయంటూ 18 కేసులు పెట్టబడిన 197 ఎకరాల భూమి కూడా దీనిలో ఉంది. అయినప్పటికీ బేఖాతరుగా, ఈ భూములన్నింటికీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వ్యక్తిగత పట్టాభూములతో పాటు, గ్రామాన్ని ఆనుకుని ఉన్న మరో 35 ఎకరాల అటవీ భూములను కూడా ఈ ప్రాజెక్టు కింద సేకరిస్తున్నారు. ఆదివాసీలైన కోయలు నివసించే ఈ గ్రామం పీసా చట్టం పరిధిలోకి వస్తుంది. పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న ఈ గ్రామస్తులు అనేకమంది గతంలో జైళ్ళకు వెళ్ళవలసి వచ్చింది. ఇది జరిగిన 20 ఏళ్ళ తర్వాత కూడా తాము సాగు చేసుకుంటున్న 135 ఎకరాల పాత పోడు భూములకు పట్టాలివ్వాలని వాళ్ళు ఇంకా సర్కారుతో పోరాడుతూనే ఉన్నారు. ఇంతలో అక్టోబర్‌ 2015లో వాళ్ళ భూములు చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద మాయం కానున్నాయని తెలిసింది. ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో ఉంటే, భూములను వదిలిపెట్టి ఎప్పుడో పారిపోయిన ఆదివాసేతరులు ఇప్పుడీ చింతలపూడి ఎత్తిపోతల పథకం పుణ్యమా అని గిరిజనుల భూములన్నీ తమవే అంటూ మళ్ళీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నారు. రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై, దొంగ సంతకాలతో ఆదివాసులను మోసగించడానికి, నష్టపరిహారాలను కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నారు.

ఇదిలా ఉండగా, మరో పక్క పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన గిరిజనులకు జీలుగుమిల్లిలోని 29 గ్రామాలలో రీహాబిలిటేషన్‌ రీసెటిల్మెంట్‌ ప్లాన్‌ (ఆర్‌ అండ్‌ ఆర్‌) కింద భూములను ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద కోట్లాది రూపాయలు విలువచేసే ఈ ప్రాంతపు అటవీ భూములను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. ఇక్కడ నివసిస్తున్న ఆదివాసీల వద్దకు పోలవరం నిర్వాసితులు వచ్చి ఈ భూములను ప్రభుత్వం తమకు కేటాయించిందని చెప్పేదాకా తమ ప్రాంత భూములు వారికి ఇచ్చిన సంగతి ఆదివాసులకు తెలియనేలేదు. దీంతో స్థానిక ఆదివాసులకు, స్థానికేతర పోలవరం నిర్వాసితులకు మధ్య ఘర్షణలు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తమ భూములు చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద పోతున్నాయని, మిగిలిన ఆ కొన్ని అటవీ భూములను పోలవరం నిర్వాసితులకు ఇస్తే తమ గతి ఏమిటని, తాము కోల్పోయిన భూములకు గాను నష్టపరిహారంగా ప్రభుత్వం తమకు ఇవ్వవలసిన భూములను ఎక్కడ ఇస్తారని జీలుగుమిల్లి ఆదివాసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడే లేడు.

జీలుగుమిల్లి మండలంలోని ఆదివాసీ గ్రామాలైన జిల్లేళ్ళ గూడెం, పి.నారాయణపురం, చాత్రప్పగూడెం గ్రామాలు, బుట్టాయిగూడెం మండలంలోని బెడదనూరు గ్రామం చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద పూర్తిగా ముంపుకు గురికానున్నాయని 2008లోనే ప్రభుత్వం ప్రకటించింది. పూచికపాడు, జగన్నాధపురం, రాచన్న గూడెం, గోపాలపురం, లంకాలపల్లి, తాటిరాముడి గూడెం, కామయ్యపాలెం, అంకంపాలెం గ్రామాల్లో వ్యవసాయ భూములు మునిగిపోనున్నాయి.

ఊర్లో తమ భూములలో తాము పంటలు వేసుకుంటూ, ఎవరి జోలికి పోకుండా తమ మానాన తాము బతుకుతున్నామని అనుకుంటున్న ఆదివాసులకు చింతలపూడి ఎత్తిపోతల పథకం సునామీలా వచ్చి చుట్టుకుంది. అసలేం జరుగుతుందో, తమ బతుకులు ఏమి కానున్నాయో ఆదివాసుల అంచనాలకు అందడంలేదు. వారికి తెలియకుండానే వారి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వారి పరిస్థితి దయనీయంగా ఉంది.

రైతుల వ్యథలు

ప్రగడవరం పంచాయితీలోని నాలుగు రెవిన్యూ గ్రామాలలో కాలువల నిర్మాణం కోసం 700 ఎకరాలను సేకరిస్తున్నట్లు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అంతేకాదు, మరో 200 ఎకరాలు ఫీల్డ్‌ కెనాల్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ కింద సేకరించనున్నారు.

ఈ భూములలో సుమారు 145 ఎకరాల అసైన్డ్‌ భూములలో దళితులు సాగుచేసుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాల కోసమనే పేరుతో వీరికి నష్టపరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక మరో పక్క రైతుల భూములకు మార్కెట్‌ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించకుండా నాటకాలాడుతోంది. ఈలోగా మధ్య దళారులు సరసమైన ధర ఇప్పించే పేరిట రంగంలోకి దిగి, రైతులతో బేరసారాలు మొదలుపెడుతున్నారు. కాగా, ఈ గ్రామంలో భూములు ముంపు కింద పోవడంతో, జీవనోపాధిని కోల్పోయే వ్యవసాయ కూలీల గోడు ఎవరికీ పట్టడంలేదు. చట్టప్రకారం కూలీలకు కూడా నష్టపరిహారం లభిస్తుందన్న విషయం వారికి తెలియనే తెలీదు. వారికి చెప్పేవారూ లేరు.

ఇదేదో ఒక ఆదివాసీ, ఒక మైదాన ప్రాంత గ్రామాల వ్యధే కాదు. ముంపునకు గురి కానున్న సుమారు 127 గ్రామాలలోని పరిస్థితి కూడా ఇలాగే, అగమ్యగోచరంగా వుంది. నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నామని అంటూ, ఈ గ్రామాలన్నింట్లో చీకట్లను పరుస్తోంది.

చింతలపూడి ఎత్తిపోతల పథకం – భూ మాఫియా

2008లోనే ఎనిమిది టి.ఎం.సి.ల నీటిని అందించేందుకు రూ.1,071 కోట్ల వ్యయంతో 2013 కల్లా పూర్తిచేసే లక్ష్యంతో ప్రారంభమై సుమారు 74 కిలోమీటర్ల కాలువలు తవ్విన తర్వాత ఆగిపోయిందీ ప్రాజెక్టు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక, తిరిగి దీన్ని రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి చివరికి నీటి సామర్థ్యాన్ని 20 టి.ఎం.సి.లకు పెంచారు. జిఓ నంబర్‌ 94 ప్రకారం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,909 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం తాడిపూడి వద్ద నిర్మిస్తున్న చింతలపూడి ఎత్తిపోతల పథకం సామర్ధ్యాన్ని పెంచడంవల్ల 17,042.61 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. దీనిలో 6,683 ఎకరాల అటవీ భూమి ఉంది. కాగా ఇప్పటివరకూ సేకరించిన భూమి సుమారు ఏడున్నర నుంచి ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే ఉంటుందని అంచనా.

ఈ ఎత్తిపోతల పథకం వల్ల 123 గ్రామాలలోని లక్షలాది ఎకరాల భూములు సాగులోకి వస్తాయని, 160 గ్రామాలకు తాగునీరు అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని 16 ఆదివాసీ గ్రామాలు, కృష్ణాజిల్లాలోని మైలవరం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాలలోని అనేక గ్రామాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. మొత్తం మీద 127 గ్రామాలలోని 70 వేలమంది ప్రజానీకం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ నిర్వాసితులు కానున్నారు.

పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలలోని భూములు సారవంతమైన, 3 కారులు పండే భూములు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, మినుము, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంటలతో పాటు వేలాది ఎకరాలలో పామాయిల్‌, కోకో, జీడిమామిడి, కొబ్బరి తోటలు వేస్తారు రైతులు. ఎకరాకు రూ.40 వేల నుండి రూ.70 వేల వరకు ఏటా ఆదాయం పొందుతున్న రైతులు అనేకమంది ఉన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం వల్ల వీరిలో అనేకమంది తమ భూములు కోల్పోతున్నారు.

గ్రామాలలో నోటీసులు, డప్పు చాటింపులు, గ్రామసభలు ఏమీ జరగకుండానే గ్రామస్థుల అభ్యంతరాలేమీ లెక్కచేయకుండానే, ఎకాఎకిన రైతుల భూముల్లోకి దిగి, కొలతలు తీసుకుంటూ, సరిహద్దు రాళ్ళను పాతుతూ, రైతులపైన దాడులకు దిగుతున్న రెవిన్యూ, నీటిపారుదల అధికారులు, పోలీసుల తెంపరితనానికి జనం నివ్వెరపోతున్నారు. భూముల ధరలను నిర్ణయించేందుకు ఎలాంటి చట్టబద్ధ, శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవడమే కాదు… పెద్ద ఎత్తున దళారులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. 20 నుంచి 25 లక్షల రూపాయల మార్కెట్‌ ధర ఉన్న వ్యవసాయ భూములకు 7, 12, 15 లక్షల ధరను కట్టి ఒప్పుకోకపోతే ప్రభుత్వం బలవంతంగా ఇంతకన్నా తక్కువ ధర ఇచ్చి భూములను లాక్కుంటుందంటూ రైతులను భయపెడుతూ భూ మాఫియా కోట్లాది రూపాయల అక్రమ ఆర్జనకి పూనుకుంటోంది. వీరినే ”ఆర్‌ అండ్‌ ఆర్‌” మాఫియా అని జనం పిలుస్తున్నారు.

ఇక రైతుల భూములపై ఆధారపడి కూలినాలి చేసుకుంటూ జీవించే వేలాదిమంది వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, అసైన్డ్‌ భూములున్న చిన్న, సన్నకారు రైతులు, ఇతర వృత్తిదారులు జీవనోపాధి కోల్పోతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీరికి జరుగుతున్న అన్యాయాన్నీ, నష్టాన్నీ పట్టించుకునేవారే లేరు.

భూ సేకరణ పునరావాస హక్కుల చట్టం 2013 పేరిట దగా

ఈ ఎత్తిపోతల పథకం అమలు పరిచేందుకు 2013 చట్టం తూచా తప్పక పాటిస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణలో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2013 చట్టం అమలుచేయకుండా, జి.ఓ.నెం.123 తెచ్చి, చివరికి జనం ముందు, కోర్టులలోనూ అభాసుపాలై, మరో కొత్త జిఓతో రాష్ట్రపతి వద్దకు పరుగెత్తాల్సి వచ్చింది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు. బహుశా తెలంగాణ ప్రభుత్వం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2013 చట్టాన్ని జపిస్తూ ప్రజలను మభ్యపెడుతూ

దాన్ని అడుగడుగునా ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటోంది. అవేమిటో మచ్చుకు కొన్ని చూద్దాం.

చట్టప్రకారం చేయవలసిన సామాజిక ప్రభావిత నివేదికను (సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ – ఎస్‌.ఐ.ఎ)ని తయారు చేయలేదు. అంటే ఈ ప్రాజెక్టువల్ల ప్రభావితులయ్యే ప్రజల జాబితాను అధికారికంగా తయారుచేయలేదని, ఈ ప్రాజెక్టు ప్రజలపై చూపే ప్రభావాన్ని, వారికి కలగనున్న నష్టాలను కూడా అంచనా వేయలేదని అర్థం.

ఇప్పటివరకూ గ్రామసభలను నిర్వహించలేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు. ప్రజల అభిప్రాయాలను, అభ్యంతరాలను ఎంతమాత్రం ఖాతరు చేయడంలేదు.

ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవు. పునర్నిర్మాణం, పునరావాస పథకం (రీహేబిలిటేషన్‌ రీ సెటిల్మెంట్‌ ప్లాన్‌ – ఆర్‌.ఆర్‌.ప్లాన్‌) ఏ గ్రామంలోనూ ప్రకటించలేదు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు అటవీ హక్కుల చట్టం వర్తింపచేస్తూ విధివిధానాలను పరిష్కరించటం లేదు. అంతేకాదు ఎల్‌టిఆర్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అక్రమ పద్ధతులలో అవార్డులు, తీర్పులు ఇస్తున్నారు.

భూముల మార్కెట్‌ విలువను చట్టంలోని సెక్షన్‌ 26 క్లాజ్‌ (బి) ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారం నిర్ణయిస్తున్నారు. అసైన్డ్‌ భూముల సాగుదారుల వివరాలను ప్రాథమిక ప్రకటనలో ఉంచి, అంతిమ ప్రకటనల్లో తీసివేస్తున్నారు. ఇంతవరకూ ఎస్సీ, ఎస్టీలకు చట్టప్రకారం భూమిని కేటాయించలేదు.

చంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ పునరావాస హక్కుల చట్టం 2013నే కాక, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం 2005, పీసా (ూజుూూ) చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పేరిట ప్రజలను వంచిస్తోంది. ప్రాజెక్టు కింద విస్థాపనకు గురవుతున్న ప్రజలకు చట్టబద్ధంగా తమకు గల హక్కులు ఏమిటో కూడా తెలియదు. ప్రభుత్వం తెలియచేయదు. ఆ జ్ఞానాన్ని అందచేయవలసిన వ్యవస్థల లేమి కాక, ప్రజలను కూడగట్టి చైతన్యాన్ని అందించగల బలమైన ప్రజా ఉద్యమాలు ఇక్కడ పెద్దగా లేకపోవడం వల్ల కూడా తెలుగుదేశం ప్రభుత్వం నిర్లజ్జగా, బాహాటంగా లెక్కలేనన్ని ఉల్లంఘనలకు పాల్పుడుతోంది.

ప్రజలు ఏమి కోరుకుంటున్నారు?

ముందు ప్రాజెక్టులోకి వచ్చే అన్ని గ్రామాలలోనూ తక్షణమే గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, సవరించిన ప్రాజెక్టు వివరాలను తమ ముందు ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఒకవేళ ప్రజలు ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించినట్లయితే, 2013 భూ సేకరణ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తూ, భూములు, జీవనోపాధి కోల్పోయే, ఇతరత్రా ప్రభావాలకు గురయ్యే వారందరికీ రీ సెటిల్మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేసి, సమగ్రమైన పునరావాస, పునర్నిర్మాణ పథకాన్ని అమలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ విలువల ప్రకారం కాకుండా, అసలైన మార్కెట్‌ ధరను చెల్లించాలని, భూములు కోల్పోతున్నవారికి… ముఖ్యంగా ఆదివాసులు, దళితులకు ఆయకట్టు కింద భూమికి భూమి ప్రాతిపదికన ఇవ్వాలని వారు కోరుతున్నారు.

చింతలపూడి పోలవరం ప్రాజెక్టులో భాగం కాబట్టి, అది కేంద్ర నిధులతో అమలవుతోంది కాబట్టి, కేంద్రం ప్రకటించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నది ప్రజల ముఖ్యమైన డిమాండు. అసైన్డ్‌ భూములను కూడా చట్టబద్ధ భూములుగానే పరిగణించి వాటికి కూడా నష్టపరిహారం అందచేయాలి.

చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద నష్టపరిహార నిర్థారణలోనూ, చెల్లింపులలోనూ అనేక అవకతవకలు జరిగాయి. వీటిపై ఒక స్వతంత్ర కమిటీతో న్యాయ విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.