జూపాక సుభద్ర
తెలుగుభాషకు ప్రాచీన హోదా వచ్చిందోచ్ అని సంబురపడి సంబరాలు చేస్కుంటుండ్రు. కాని మెజారిటీ ప్రజల ప్రయెజనాలకు వుపయెగించని తెలుగుభాషకు ప్రాచీనం, అర్వాచీనం, ఆధునికం అని ఏ హోదా వచ్చినా ఏం ఫరక్ బడది. ప్రజలు మాట్లాడే తెలుగుభాషకు గౌరవం యివ్వనిచోట ఏ హోదాలొచ్చినా రాకపోయినా ఒరిగేదేముండది. ప్రాచీనభాష ఎక్కడుందో ఒకసారి గ్రామాల్లోని అట్టడుగు సమూహాల్లోకి పోతే తెలుస్తుంది. అక్కడ తెలుగు ప్రాచీనభాష యింకా బతికి బట్ట కడ్తనే వుంది.
తెలుగుభాషను పాలనా యంత్రాంగం నుండి తరిమేసి పక్కనబెట్టి అవమానించి ప్రజలకు తెలువని అరువుభాషతో వ్యవహారాల్జేస్తున్న ప్రభుత్వానికి తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిందని ఉత్సవాలు చేసే నైతిక అర్హత లేదు. డబ్బులేని పేదలకు తెలుగు, డబ్బున్నవాళ్లకు యింగ్లీషును ప్రోత్సహిస్త మొత్తం తెలుగునే విస్మరించిన ప్రభుత్వానికి పండుగలు నిర్వహించే హక్కే లేదు.
ఒకవైపు మా తెలంగాణ మాకు కావాలి అని ఉద్యమిస్తున్న రాజకీయ సందర్భం. యింకోవైపు తెలుగంటే ఏ ప్రాంతం తెలుగు? ప్రాచీన తెలుగు హోదా ఏ ప్రాంతం సొంతం అనే చర్చలు లేస్తున్న సమయం. యివేటిని పట్టించుకోని ప్రభుత్వం ప్రాచీన హోదాతో తెలుగు వెలుగుతుందహో అని నెలరోజులపాటు భాషా ఉత్సవాన్ని జరపనీకి (15-11-08 నుంచి 15-12-08) మొదలుబెట్టింది.
తెలుగుభాషా ఉత్సవాల్లో ప్రకటించిన ఆహ్వానపత్రంలో సీమ, కోస్తాంధ్ర ఆధిపత్య కులాలతోనే నిండిపోయింది. తెలంగాణ దళిత, బహుజన కులాలకు, దళిత స్త్రీలకు, ముస్లింలకు చోటులేదు. తెలంగాణ అంటేనే మాదిగలు, మాదిగ సాహిత్యం ఎక్కువగా వున్న ప్రాంతం. అయినా యీ ఆహ్వానపత్రంలో మాదిగ సాహిత్యానికి ఒక్క అక్షరం కూడా కేటాయించలేదు. కవయిత్రుల సమ్మేళనంలో ఒక్క తెలంగాణ దళిత రచయిత్రికి తావులేదు. యిక యీ పత్రంలో వేసిన ముఖచిత్రాల్లో ఒక దళితస్త్రీ చిత్రం కనిపించదు, ఒక్క ముస్లిం ముఖం కనిపించదు. తెలంగాణ రచయితలని ఒక రెడ్డి, యిద్దరు బాపనోల్లని వేసి చేతులు దులుపుకున్నరు. ఒకటి అరా పాత చాపలు పరిచినం కదా సర్దుకోండి అంటున్నరు. తెలంగాణకు సామాజిక న్యాయంతో కూడిన ఆత్మగౌరవస్థానాలు కావాలని డివ్మా౦డ్ చేస్తున్నరు.
యిట్లాంటి ఆంధ్రవివక్షలకు తెలుగుభాషా ఉత్సవాల సభ ముందు మొదటి రోజునె తెలంగాణ దళిత, బహుజన, ముస్లిం రచయితలు ధర్నా చేసినము.
తెలుగంటే సీమ, కోస్తాంధ్ర ఒక్కటే కాదు
తెలంగాణ అస్తిత్వాలకు ప్రాతినిధ్యం లేని భాషా ఉత్సవాల్ని – బహిష్కరించండి
ప్రాచీన తెలుగు ఆధిపత్య కులాలదా
అణగారిన సాహిత్య అస్తిత్వాలు వర్ధిల్లాలి
ఆంధ్రాధిపత్యకుల సాహిత్య రాజకీయల్ని వ్యతిరేకించండి
తెలంగాణ భాషా సంస్కృతులు వర్ధిల్లాలి
ఆంధ్రాధిపత్య తెలుగుకు సన్మానాలా – అస్తిత్వసాహిత్యాలకు సంకెళ్లా” అనే నిరసనలు నినాదాలతో కరపత్రాలు పంచుతున్న వాళ్లను అరెస్టు చేయడం జరిగింది.
అయితే ఆ ధర్నాకు నినాదమై గొంతిచ్చింది బొనుగలోలె బొబ్బజేసింది బ్యానర్లు వెసింది, అరెస్టులయింది అంతా 80% మాదిగ రచయితలు, రచయిత్రులే.
ధర్నాలు, ఆందోళనలు, అరెస్టులు, నిరసనల పర్యవసానంగా తెలుగుభాషా ఉత్సవ కమిటీకి తెలంగాణ రచయితల్ని పిలువక తప్పలేదు. కాని ‘తెలంగాణ పదం లేకుండా ప్రోగ్రాం చేయండి’ అని ఓ దుర్మార్గమైన షరతు పెట్టింది. దాన్ని చాలామంది తెలంగాణ రచయితలు ఒప్పుకోకున్నా ఒకరిద్దరు అదే పదివేలన్నట్లు ఒప్పుకొని అగమేగాల మీద ప్రోగ్రాం నిర్ణయించిండ్రు. ఒక బిసి రచయితైతే ఎవ్వరిని సమన్వయం చేయక ఏకీకృతంగా ఆంధ్ర ఆహ్వానపత్రం మూసలోనే మాదిగ, స్త్రీ సాహిత్యం లేకుండా ప్రోగ్రాం తయరుచేసిండు. దానికి మాదిగలు వ్యతిరేకించి ”నిరసనలకు, నినాదాలకు, అరెస్టులకు మేము ముందుండాలి, నిర్ణయలు, నిర్వహణల దగ్గర మాత్రం ఆ చాయలకు రాకుండా తరిమి వెనకబెట్టే ప్రయత్నాలు చేయడం అన్యాయం” అని లొల్లిజేసిండ్రు.
నేడు మాదిగ సాహిత్యం తెలంగాణలో విస్తృతంగా వస్తంది. తెలంగాణ ప్రాంత ప్రత్యేక అస్తిత్వాలను అర్థం చేసుకోకుండా తెలంగాణ రచయితలు కూడా దళిత అని గంపగుత్త సాహితీ సదస్సులు బెట్టి తెలంగాణ మాదిగ సాహిత్యాన్ని అణచివేస్తున్నారు. తెలంగాణ అణచివేయబడిన గొంతుల సాహిత్య సంగం అని చెప్పుకుంటున్న తెలంగాణ రచయితల సంఘం కూడా తెలంగాణ మాదిగ సాహిత్యాన్ని గుర్తించ నిరాకరిస్తుంది. స్క్రిప్టులేని లంబాడా, కోయ సాహిత్యాల గర్చి సదస్సులు బెట్టి చర్చిస్తారు కాని మాదిగ సాహిత్య అస్తిత్వాలంటేనే దుక్కం. మాదిగ రచనలు సాహిత్యానికి పనికిరావా! ఎలాంటి ఉద్యవల్లేకుండా వస్తున్న సాహిత్యాలకు పీటలు వేస్తున్నపుడు నిర్దిష్టమైన సామాజిక న్యాయపంపిణీ కోసం ఉద్యమిస్తున్న మాదిగ అస్తిత్వ సాహిత్యాన్ని గుర్తించకపోవడం ఆధిపత్యకులాల సాహిత్యకుట్రే. ముస్లిం సాహిత్యాన్ని మైనారిటి సాహిత్యమని చెప్పడం ఎంత అణచివేతో…మాదిగ సాహిత్యమును దళిత సాహిత్యంగా గంపగుత్తగ చెప్పడం కూడా అణచివేతే. యివి ప్రశ్నించే మాదిగల్ని పక్కనబెట్టడం కూడా జరుగుతుంది. యివి మాదిగ రచయితల పట్ల, రచయిత్రుల పట్ల వారి సాహిత్యం పట్ల, జరుగుతున్న ఆధిపత్యకుల సాహిత్య రాజకీయలు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags