ప్రియమైన సత్యవతి గారికి,
‘ఆనందార్ణవం’ మీరిచ్చిన మర్నాడే చదివాను. అక్షరాల్లో పెట్టడానికే ఇంతాలస్యం. చాలా రోజుల వ్యవధి తర్వాత మరలా చదివాను.
ఒక వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేవరకూ తనలో సంతోషం పొంగిపొర్లుతూ ఉంటుంది. అలసట లేదు. ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ అపరిమితంగా ఉంటాయి. ‘ఈ రోజు మనిషిని నలిపేస్తున్నవేవీ నన్ను ఏమీ చేయలేవు ఐయామ్ లిబరేటెడ్’ అని నిబ్బరంగా, నిర్భయంగా, నిజాయితీగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్పగలగడం చిన్న విషయం కాదు. మీ ప్రతి అక్షరంలో అది వెల్లువెత్తుతూంది. ఇంతకంటే జీవన సాఫల్యమేముంటుంది? దాన్ని మీరు సాధించారంటే మీ అన్వేషణ, జిజ్ఞాస, సెల్ఫ్ ఇంక్వయిరీ, ఆనంద మూలాల్ని పట్టుకోవాలన్న పట్టుదలతో అంతరంగ లోతుల్లోకి మీరు చేసిన ప్రయాణం వెలకట్టలేనిది.
ఈ క్రమంలో మీరెన్నో విలువయిన విషయాలు స్పృశించారు. యధాతథంగా ఆలోచనల్ని గమనించుకొంటూ, పరిశోధిస్తూ, మరెన్నో ఆలోచనల్ని రగిలిస్తూ రాళ్ళూ ముళ్ళూ తొలగిస్తూ మార్గం వేస్తూ వెళ్ళారు. ప్రశ్నా జవాబు రెండూ మీరే అయి ప్రశ్నించుకొంటూ జవాబు రాబట్టుకొంటూ తృప్తి కలిగేవరకూ అన్వేషణ సాగించారు.
ఈ ఆర్ణవంలో ఆణిముత్యాలెన్నో దొరుకుతాయి.
స్వేచ్ఛ!
అవధులు లేని స్వేచ్ఛ. శృంఖల బద్ధం కాని స్వేచ్ఛ. సంకెళ్ళనేవి ఇతరులు వేసినా, సమాజం వేసినా, మనకి మనం వేసుకున్నవైనా అంతా ఇరుకే. ఊపిరాడనితనం, బాధ్యతతో కూడుకున్న స్వేచ్ఛ. బాగా విశ్లేషించారు.
‘విపశ్యన’ – భూమికలో మీ వ్యాసం చదివినప్పుడు వెళ్ళాలని ఊగాను. చెప్పారు కదా. కంటికి కనిపించని సంకెళ్ళు! ఏవేవో సందేహాలు.
ఎక్స్‌పెక్టేషన్స్ –
ఫలితం ఆశించకుండా పనిచేసుకుపోవడం. నిష్కామ కర్మలాంటిదా ఇది. చేస్తున్న పనే ఆనందమయినపుడు ఫలితంతో పనేంటి? ఇష్టంతో చేసే పనిలోంచి ఆనందం ఊటలా ఊరుతుంది. మనశ్శరీరాలు శక్తి పుంజుకుంటాయి. మీరు చెప్పింది నిజం.
ప్రకృతి!
ఎంత అద్భుతమైంది ప్రకృతి, ఎంత సేదతీర్చుతుంది. మీరు వ్యక్తీకరించిన అనుభూతులన్నీ ఎంత వాస్తవమో! ప్రకృతి ఒడిలో పరవశించిన క్షణాలు అనుభూతిస్తున్నప్పుడు అంత సంతోషాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఏడుపొచ్చిన సందర్భాలున్నాయి నాకు. ఎవరికో వినమ్రంగా నమస్కరిద్దామనిపిస్తుంది, ఎవరినో ప్రేమించుదామనిపిస్తుంది. సమస్త విశ్వం సౌందర్యమయమై గుప్పెడు గుండెలో ఇమడదు. సమస్త కలుషితాల నుంచి మనసుని ప్రక్షాళన చేయగలిగే శక్తి ప్రకృతికుంది. ‘వనవాసి’లో అడవి ఆవహిస్తుందంటాడు బిభూతి భూషణ్. ‘ఆవహించడం’ అతికినట్లు సరిపోయే వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్). మీ అక్షరాలనిండా పచ్చదనమే, పరిమళమే.
ఇప్పుడిలా ఆలోచిస్తున్నాను, మీరొక ‘దర్పణం’, ఎవరి ప్రతిబింబాన్ని వాళ్ళు ఆ దర్పణంలో వెతుక్కుంటున్నారు. నా ఆనవాళ్ళు గుర్తించిన సందర్భాలు నాకూ సంతోషాన్నిచ్చాయి. ఓ రచన చదివినా, ఓ చిత్రం చూసినా, సంగీతం విన్నా ముగ్ధులమౌతున్నామంటే అందులో లీనమౌతున్నామంటే మనల్ని మనం వాటిల్లో వెదుక్కోవడం వల్లేననుకుంటాను. ఆ మమేకత్వం మనల్ని మనం కోల్పోయేట్టు చేస్తుంది. మైమరచిపోయానని వాడుతాం, నన్ను నేను మర్చిపోయానంటాం. కొన్ని అనుభూతుల వ్యక్తీకరణకి భాష చాలదు. ఇరుకైపోతుంది. మౌనం మాట్లాడుతుందంటాడు చలం.
నేనిక్కడిది రాస్తున్నప్పుడు మామిడి గుబురుల్లో పిట్టలు రొదపెడుతున్నాయి. ఉడతలు కొమ్మ కొమ్మకి గెంతుతున్నాయి. ఆ మామిడికాయలు అంత బరువుగా వేలాడ్డం చూడడానికి ముచ్చటేస్తుంది. నిజానికి మొక్క నాటడం మినహా ఆ చెట్టుకి నేనేమీ చేయలేదు. అయినా ప్రతేడూ ఠంచనుగా ఫలాలు. బొప్పాయి అయితే నాటను కూడా లేదు. తిని పారేసిన గింజల్లోంచి మొలకలొచ్చి వందల పళ్ళు! ఆ పిట్టకి, ఆ ఉడతకి ఒక పండో, గింజో దొరికితే ఆ పూటకింకేమీ అక్కర్లేదు. పరుగులే పరుగులు. ఆనందమే ఆనందం, మనిషి ఎంత స్వార్థపరుడో గుర్తుచేస్తూనే ఉంటాయి ఆ చెట్టూ, ఆ పిట్టా. నేలా, నీరూ, చెట్టూ, చేమా సహజవనరులన్నీ ఒకరి సొంతం ఎలా కాగలవు? ఇదేమి న్యాయం. ఇది నాది… ఇది నాది… ఎంత దుర్భరమైపోయింది బ్రతుకు?
మా పక్కన ఇల్లు కట్టే మిషతో పెద్ద పెద్ద వేపచెట్లు, కొబ్బరి చెట్లు, ప్రొక్లెయినర్‌తో దున్నించేశారు. వందల కొంగలు, పక్షులు నెలవు వెదుక్కుంటూ కకావికలమైపోయాయి. వారికి కావలసిన జాగా కొంచెమే అయినా దానికి రెండింతలు చదును చేశారు. తమ ఇంటి చుట్టూ ‘శుభ్రంగా’ కనపడాలి కదా! యాంత్రికత మనిషిలోని సెన్సిటివిటీ, సెన్సిబిలిటీలని మాయం చేసింది. అన్నీ కోల్పోయాక మిగిలిందేమిటి? ఎంతమంది ‘లారీబేకర్లు’ మనిషి చేస్తున్న ప్రకృతి గాయాల్ని మాన్పగలరు?
ఉదయాన్నే చెట్లలోకి రాగానే విడిచిన మల్లెలు, వాటి పరిమళంతో నా దృష్టిని ఆకర్షిస్తాయి. ఆ కాసిన్ని పువ్వులు కోసి బల్లమీదుంచితే అటూ ఇటూ పనిచేసుకుంటుంటే తమ సువాసనలతో సేదతీరుస్తాయి. వాటి మూగభాష మీ చెవి గ్రహించగలదు, అర్థం చేసుకోగలదు. స్వరముంటేనే భాష కాదుగా. అక్షరాలే భాష కాదుగా. వాటికీ తమదైన భాష ఒకటుంది. అందుకే ఈ ‘అద్దం’లో నన్ను నేను వెతుక్కుంటున్నాను.
బిందాస్ –
మాట విన్నాను. మీ ద్వారా అర్థం తెలిసింది. ఓ సినిమా పాట గుర్తొస్తూంది…
తెరలను వొదిలీ పొరలను వొదిలీ
తొలితొలి విరహపు సిరులను వొదిలీ
గడులను వొదిలీ ముడులను వొదిలీ
గడబిడలన్నీ గాలికి వొదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…
ఆనందం –
విషాద రాహిత్యం, ఆనందం కాదు. ఆ పదానికి వ్యతిరేక పదం లేదంటాడో మిత్రుడు. దానికదే ఏక పదం. కొన్ని పదాలు ఏకపదాలే. వాటికి వ్యతిరేక పదాలుండవ్. అనందం, అల్టిమేట్, అది ఒక స్థితి అంటాడు.
ఇలా ఎన్నో జ్ఞాపకాలు ముసురుకుంటున్నాయి. ఆలోచనల తుట్టె కదిలించారు. మీలా జీవించగలగడం ఒక ‘వరం’. కానీ… ఈ కానీ ఒదలదు.
ఇండివిడ్యువల్ ఫిలాసఫీ – మాస్ ఫిలాసఫీ – మధ్య వైరుధ్యం, ఒకటి అంతర్ముఖం… ఒకటి బహిరంగం. రెంటినీ ఎట్లా సమన్వయపరచాలి?
మాలాంటి కొందరం ”సంధ్యా జీవులం, సందేహ భావులం, ప్రశ్నలే ప్రశ్నలు జవాబులు, సంతృప్తి పరచవు”
”సుఖదుఃఖాలను బ్యాలెన్స్ చేసుకోవడంలోనే ఉంది చమత్కారం” అన్నారు. స్థితప్రజ్ఞత్వమా? ఎట్లా చేతనవుతుందది?
ఈ క్రూరాతి క్రూర ప్రపంచంలో ఏ మూలా ఆశకు చోటు కనబడని నిర్భర, నిష్ఠుర జీవికి సైతం, ఆ స్థిమితత్వం, ఆ ప్రశాంతి ఎట్లా దొరుకుతుంది?
నిజ జీవిత దుఃఖం ఆనంద పర్యవసాయి కాగలదా?
సందేహించకు ‘నమ్ము’ అంటారు మత ప్రవక్తలు
ప్రశ్నే శోధనకి బీజమైనపుడు నమ్మకం గుడ్డిదేకదా!
”బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్” – అన్నాడో సినీ కవి నిజమా!
ప్రేమ – విశ్వప్రేమ
నియమరహిత ప్రేమ (ఖఅషశీఅసఱ్‌ఱశీఅవస శ్రీశీఙవ) గొప్పగా ఉంది.
‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును’ అవును. ఇవ్వడంలో ఎంత ఆనందం. ‘ణఱరషశీఙవతీ ్‌ష్ట్రవ యశీవ శీట స్త్రఱఙఱఅస్త్ర’ అన్నది ుaస్త్ర శ్రీఱఅవ గా పెట్టుకుందామనుకునేదాన్ని. ఆ యశీవ ని బాగా కనిపెట్టారు మీరు.
ఏ కండిషన్స్ కూడా మనమీద ఆధిపత్య పాత్ర తీసుకోకుండా మనం మనంగా నిలబడి మనలోంచి మనం ఆలోచించగలగాలి అంటాడు మా జె.కె.మిత్రుడు. ఆ పరిస్థితి ఒక వ్యక్తికుంటుందా? తరతరాలుగా ఏదో ఒక స్థాయి, ఏదో ఒక సంస్కృతి, కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు – ఇలా ఎన్నింటినో మోస్తూ కొనసాగుతున్నాడు మనిషి. అన్నింటినీ ఒదిలించుకున్నాక ‘నేను’ అన్నది అదృశ్యం! ఈ స్థితి అనేది అసలుంటుందా? మీ నుంచి తెలుసుకోవాలనే రాస్తున్నాను.
బుద్ధ!
పాతికేళ్ళు లేక ముప్ఫై ఏళ్ళనుకుంటా… అదే మిత్రుడు కొన్ని విషయాలు పరిచయం చేశాడు. ఆ విషయాలని చాలా కాలం మధిస్తూనే వచ్చాను. అధ్యయనం – ఆలోచన – స్వీయానుభవాలతో సరిచూడడం. జిడ్డు కృష్ణమూర్తిని ఆకళింపు చేసుకున్న ఆయన తనదైన ఒక ప్రత్యేక జీవన విధానంలో జీవిస్తున్న వ్యక్తి. మా సైకాలజీ లెక్చరర్ ఒకావిడ అదే అవగాహనతో బుద్ధ – జె.కె.ల మధ్య సారూప్యాన్ని కనిపెట్టి తులనాత్మక పరిశీలనతో శోధించారు. మా మిత్రుడి ద్వారా సృజనాత్మకత, సెల్ఫ్ ఎంక్వయిరీ, ఇన్‌ట్యూషన్, పాషన్, ఆ క్షణంలో జీవించగలగడం, గతం నుండి విముక్తి, అలవాటు పడిపోకుండా ఉండడం, ఒక రొటీన్‌కి గురికాకుండా నిత్య నూతనంగా జీవించడం, సృజనలో పరిసరాలు, కాలం విస్మృతి, ధ్యానం – ఇలాంటి మంచి విషయాలు పరిచయమయ్యాయి. అయినప్పటికీ కొస దొరకదు.
ఎక్స్‌పెక్టేషన్స్ ఒద్దు, గోల్ ఒద్దు, దేనికేదీ ఎవరికెవరూ పోటీ కాదు. అంతా వైవిధ్య భరితం. చాలా బాగుంది. ఎక్కడో అంతః స్నాయువుని తాకుతూంది. చాలాకాలం తర్వాత ఈ మధ్య కాలంలో స్వీయ సమస్యలో నలుగుతూ – ఇప్పుడు మరలా మీ అక్షరాల్లో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
మీరన్నట్లు దించేసుకోవడం చాలా ముఖ్యం, అవసరం. మీరు దుఃఖితుల పక్షమై ఇష్టమైన పనిలో నిమగ్నమయ్యారు. ఆనందానుభూతులు ఆత్మీయులతో పంచుకుంటున్నారు. అక్షరాల వాహిక ద్వారా ప్రవహిస్తున్నారు. ఎలా వచ్చిన దాన్ని అలాగే స్వీకరించగలిగే ఆత్మస్థైర్యాన్ని సాధించారు. జీవనసారాన్ని ఆనందార్ణవంలో ఆవిష్కరించారు. ఇంక కావలసిందేముంది.