(28 మే అంతర్జాతీయ మెన్ట్రు ్సవల్ హైజీన్ డే సందర్భంగా)
మెన్‌స్ట్రుయేషన్ (నెలసరి) గురించి తెలుసుకోవలసిన విషయాలు :-
1. రజస్వల అవ్వడానికి సరైన వయస్సు ఏమిటి?
సహజంగా ఏ అమ్మాయి అయినా 8-15 సం||ల మధ్య ఎప్పుడైనా రజస్వల కావచ్చు. రజస్వల అనే ప్రక్రియ ప్రతి స్త్రీలోనూ సహజమైనది. అందరూ ఒకే వయస్సులో రజస్వల అవ్వడం అన్నది సరికాదు. వారి శరీర పెరుగుదలను బట్టి రజస్వల కావడం జరుగుతుంది. 16 సం||ల వరకు రజస్వల కానట్లయితే వాళ్ళు తప్పకుండా స్త్రీల వైద్య నిపుణులను (గైనకాలజిస్టు) సంప్రదించాలి.
2. వేరు వేరు వయస్సుల్లో రజస్వల కావడానికి కారణాలు ఏమిటి?
శరీరపు పెరుగుదలను అనుసరించి రజస్వల అవ్వడానికి కారణమైన హార్మోన్లు విడుదల అవ్వడానికి మెదడు సంకేతాలను ఇవ్వడం జరుగుతుంది. సహజంగా రొమ్ముల పెరుగుదల మొదలైన 2-1/2 సం||లలో రజస్వల అవుతారు. చిన్నవయస్సులోనే శరీరము పెరుగుదల బాగా వున్నట్లయితే 8 సం||లకే రజస్వల అయ్యే అవకాశం వుంది. శరీరంలో పెరుగుదల మెల్లగా వున్నవాళ్ళు 15 సం||లకి రజస్వల కావడం జరగవచ్చు. సాధారణంగా తల్లి ఏ వయస్సులో రజస్వల అవుతుందో దాదాపు అదే వయస్సులో తన పిల్లలు రజస్వల అయ్యే అవకాశం వుంది.
3. శరీరంలో ఎటువంటి మార్పులను గుర్తించడం జరుగుతుంది?
1. వేగంగా పెరుగుతారు.
2. తొడలు, పిరుదుల భాగాలలో కొవ్వు చేరి శరీరపు ఆకారం మారుతుంది. రొమ్ముల పెరుగుదల మొదలవుతుంది.
3. శరీరంలోని ఆయిల్ గ్లాండ్స్ (నూనె గ్రంథులు) ఎక్కువగా నూనె ఉత్పత్తి చేయడం వలన శరీరం నుండి వాసన వెలువడుతుంది.
4. కాళ్ళమీద, చంకలలోను, మర్మావయవం వద్ద వెంట్రులకు పెరుగుతాయి.
5. మొటిమలు 13 సం||ల వయస్సు నుండి వచ్చే అవకాశాలు వున్నాయి.
4. మానసికంగా ఎలాంటి మార్పులు జరుగుతాయి?
1. కోపం, బాధ, సంతోషం మరింకేదైనా ఫీలింగ్స్ త్వరత్వరగా మారుతూ వుంటాయి.
2. అబ్బాయిల వైపు ఆకర్షితులవుతుంటారు.
3. తమలోని మార్పులకు సంబంధించి, ఆరాటంతో/ఉద్రేకంతో వుంటారు.
4. పెరిగిన బాధ్యత సమాజంలో తమ స్థానం గురించి ఆందోళన చెందుతుంటారు.
5. రక్తస్రావం ఎంత అయితే విపరీతం అనుకోవాలి?
ఒక గంటలో ఒక ప్యాడ్ మార్చుకోవలసి వస్తే విపరీతమనుకోవాలి. విపరీతంగా రక్తస్రావం జరిగేటప్పుడు ఎర్రటి, చిక్కటి రక్తం పోయే అవకాశముంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించాలి.
6. క్రమం తప్పకుండా నెలసరి కాకపోవడం సరైనదేనా?
మొదటి 2 సం||లలో ఏ విధమైన ఇతర ఇబ్బందులు, బాధలు లేనపుడు క్రమంగా నెలసరి రాకున్నా ఫరవాలేదు. నెలసరి క్రమబద్ధం కావడానికి శరీరం దాదాపు 2 సం||ల సమయం తీసుకుంటుంది. మరే ఇతర ఇబ్బందులు కలిగినా గైనకాలజిస్టును సంప్రదించాలి.
7. తెల్లబట్ట లేదా వైట్ డిశ్చార్జి అంటే ఏమిటి? దీని గురించి ఆందోళన అవసరమా?
ఇది మన శరీరం విడుదల చేసే మ్యూకస్ అనే సాధారణ స్రవం. ఒకవేళ అది తెలుపు నుండి పసుపు రంగుకి మారినా, వాసన వస్తున్నా గైనకాలజిస్టును సంప్రదించి మందులు వాడితే సరిపోతుంది. ఎటువంటి ఆందోళన అవసరం లేదు.
8. నెలసరిలో వచ్చే రక్తం చెడు రక్తమా? కాకుంటే ఎందుకు దుర్వాసన వస్తుంది?
మూత్రము, మలం, చెమటలో లాగా టాక్సిన్స్ నెలసరి రక్తంలో లేవు. ఈ రక్తంలో గర్భాశయ లోపలి పొర, అండం మాత్రమే వుంటాయి. నెలసరి కేవలం గర్భధారణ జరగనప్పుడు విడుదలైన అండాన్ని, గర్భాశయ లోపలి పొరను బయటికి నెట్టివేసే ప్రక్రియ మాత్రమే.
నిజానికి ఈ రక్తం ఎటువంటి చెడు వాసన కలిగి వుండదు. కానీ శరీరం నుండి బయటికి వచ్చిన రక్తము గుడ్డకు కానీ, ప్యాడ్‌కు కానీ అంటుకున్నప్పుడు జరిగే రసాయన చర్యవల్ల వాసన కలుగుతుంది.
9. నెలసరి క్రమం అంటే ఏమిటి? ఎలా లెక్కించాలి? నెలసరి రోజును ఎందుకు అంచనా వేసుకోవాలి?
నెలసరి మొదటి రోజు నుండి మరుసటి నెలసరి మొదటి రోజు వరకు వున్న సమయాన్ని నెలసరి క్రమం అంటారు.
రజస్వల అయిన మొదటి 2 సం||లు ఈ నెలసరి క్రమం 21 రోజుల నుండి 45 రోజుల వరకూ వుండవచ్చు. చాలామందిలో 2 సం||ల తరువాత నుండి నెలసరి క్రమం 28 రోజులకి అలవాటు పడుతుంది. కొందరిలో 5-10 రోజులు ఎక్కువ లేదా తక్కువగా వుండవచ్చు.
10. తక్కువగా రక్తస్రావం అయ్యేటప్పుడు ప్యాడ్ మార్చుకోవడం అవసరమా? ఎంత సమయంలో మార్చుకోవాలి?
ప్యాడ్ పూర్తిగా తడిచిన వెంటనే మార్చుకోవాలి. పూర్తిగా తడవకపోయినా కూడా 8 గంటలకు మించి వుంచకూడదు. అలా ఉండచవ మూలంగా బాక్టీరియా పెరిగి చెడు వాసన మరియు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం వుంటుంది.
11. రక్త స్రావం ఎంతకాలం వుంటుంది?
నెలసరి రక్తస్రావం 2 నుండి 7 రోజుల వరకు వుండవచ్చు. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా వుంటుంది.
12. నెలసరి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
1. ఆకుకూరలు బాగా తినాలి.
2. పచ్చళ్ళు, మసాలాలు వంటివి వీలైనంతవరకూ తీసుకోకపోవడమే మంచిది. వీలైనంతవరకూ చప్పిడివి తినాలి.
3. అధిక రక్తస్రావంలో బొప్పాయి పండు తినకూడదు.
4. మజ్జిగ అధికంగా తీసుకోవాలి.
5. నెలసరి సమయంలో ఎక్కువగా నీళ్ళు త్రాగడం వలన కొంతవరకు నొప్పిని తగ్గించవచ్చు.
6. రక్తస్రావం గడ్డలుగా వున్నప్పుడు, నొప్పిగా వున్నప్పుడు వాము కానీ, జీలకర్ర కానీ, సోంపు కానీ వేయించి కొద్దిగా దంచి నీళ్ళల్లో వేసి మరిగించి వడబోసుకుని ఆ నీరు తాగాలి.
7. నొప్పిని నివారించడానికి మజ్జిగలో పంచదార వేసి కొద్ది కొద్దిగా త్రాగుతూ వుండాలి.
13. పరిశుభ్రంగా వుండడానికి ఏం చేయాలి?
1. రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. మర్మావయవాలను తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.
2. చెమట మరియు దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి చంకల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి.
3. ఇన్‌ఫెక్షన్ రాకుండా వుండడానికి తరచూ మూత్ర విసర్జన చేయాలి.
4. ముఖం మీద మచ్చలు లేకుండా వుండడానికి మొటిమలను గిల్లడం, రుద్దడం లాంటివి చేయకూడదు.
14. నెలసరి సమయంలో గుడ్డ ఉపయోగించే వారు తీసుకోవలసిన జాగ్రత్తలు?
శుభ్రమైన, పొడిగా వున్న, తడిని పీల్చుకోగలిగిన మెత్తని కాటన్ (నేత) గుడ్డను మాత్రమే వాడాలి. 8 గంటలకు ఖచ్చితంగా గుడ్డను, డ్రాయర్‌ను మార్చుకోవాలి. ఆ వస్త్రాలను సబ్బుతో, వేడినీటితో శుభ్రం చేసి ఎండలో ఆరవేసినట్లయితే బ్యాక్టీరియా నశిస్తుంది. ఆరిన తర్వాత శుభ్రమైన చోట భద్రపరచుకోవాలి. నెలసరి సమయంలో వాడుకునే వస్త్రాలను ప్రతి ఒక్కరూ ఎవరివి వారే ఉపయోగించుకోవాలి. కుటుంబ సభ్యులతో కానీ, మరెవ్వరితోనైనా కానీ పంచుకోకూడదు. ప్రతి 3 నెలలకు ఒకసారి పాతవి పారవేసి కొత్తవి వాడాలి.
15. శానిటరీ ప్యాడ్‌ను ఎందుకు, ఎలా ఉపయోగించాలి?
శానిటరీ ప్యాడ్ కాటన్ మరియు ప్లాస్టిక్‌ని ఉపయోగించి తయారుచేస్తారు. గుడ్డకంటే ఇదే ఎంతో శుభ్రమైనది. ఎందుకంటే ఇది నెలసరి సమయం కోసమే ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఎప్పటికప్పుడు కొత్త ప్యాడ్‌ను ఉపయోగించడం వల్ల దురద మరియు బ్యాక్టీరియా నుండి రక్షింపబడతాయి. సరైన సమయంలో ప్యాడ్ మార్చుకోవడం ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాము.
బ్యాక్టీరియా వాతావరణంలో వ్యాపించకుండా ఉండడానికి ప్యాడ్‌ను సరైన పద్ధతిలో పారవేయాలి.
డ్రాయర్ నుండి ప్యాడ్‌ను తీసివేసి మడిచి కాగితంలో చుట్టి చెత్తకుండీలో వేయాలి. మరుగు దొడ్డిలో పారవేయకూడదు. అలా చేసినట్లయితే మరుగు దొడ్డి గొట్టాలలో అడ్డుపడుతుంది. ప్యాడ్‌లను వీథులలో పారవేయకూడదు, మరియు కాల్చకూడదు అలా చేసినట్లయితే వాతావరణం కలుషితమవుతుంది.
అస్సలు ఏమీ కుదరనప్పుడు ప్యాడ్‌లను భూమిలో పాతిపెట్టినట్లయితే కొంతకాలానికి మట్టిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్‌ని మాత్రం తర్వాత పారవేయవచ్చు.
(కస్తూర్బ గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు ప్రచురించిన పుస్తకం నుండి)