(భూమిక నిర్వహించిన కథ, వ్యాసం, కవితల పోటీల్లో తృతీయ బహుమతి పొందిన కథ)
మా హోమ్‌కు కొత్తగా వచ్చిన వాళ్ళ వివరాలు రికార్డు చేసుకునే క్రమంలో నాకు ఎదురుగా కూర్చున్న ఆమెను నీ పేరు అని అడిగీ అడగకముందే నన్ను ఎదురు ప్రశ్నిస్తూ, కళ్ళను చక్రాల్లా తిప్పుతూ, పది దినాల నుండి పేపరులోను, టి.విలలోను నేనే కదా కనబడుతా వుంది. నా పేరు తెలవదా? తెలిసినా యిలా మేము అడగాలిలే.
అట్లానా, సరే రాసుకో. మేరీరాణి. అందరూ రాణి అని పిలుస్తారు. అది సరేగాని, ఈడ నేను ఎన్ని నాళ్ళు వుండాల?
నీ యిష్టమొచ్చినంతకాలం.
మా వూరికి ఎల్లాలంటే.
నీ అత్త, బావ, తోడికోడలు నీకు ఏ హానీ జరగదని రాసి యివ్వాలి.
నా పిల్లలను కూడా తోలుకొని పోవచ్చా?
నీకు పిల్లలను పోషించే స్తోమత లేదని పిల్లల హోమ్‌లో వేశారు. అదీగాక యిప్పుడు నీ పరిస్థితి ఏమీ బాగా లేదు. అక్కడే వుండి బాగా చదువుకుంటారులే. అప్పుడప్పుడు చూసి రావచ్చు.
ఏడవుంటే ఏమిలే, ఆళ్ళు సక్కంగా వుంటే సాలు. ఈడ నేను సచ్చిందాకా వుండచ్చా.
ఏం అలా అడుగుతున్నావు?
ఏం లేదులే, సచ్చినా బతికినా మా ఊరి కాడనే అనుకున్నా ఇన్నాళ్ళూ. ఇట్టాటి సోటు
ఉంటదని ముందరే తెలియకపోయా. అదేదో ముందే తెలిసుంటే ఈడకే వచ్చేదాన్ని. సిన్నపిల్లను అట్టా దిక్కుమొక్కు లేకుండా సెట్టుకింద వదిలేయకుండా ఈడనే పురుడుబోసుకుని పిల్లను సక్కంగా చూసుకునేదాన్ని.
ఏంటీ, నువ్వు చెట్టుక్రింద వదిలేశావా? కంప చెట్లలోకి విసిరేశావట కదా?
అదేందో జనాలు ఇదేమాట అనుకుంటున్నారు. సూస్తా, సూస్తా యా తల్లియైనా ఇట్లా బిడ్డలను పారేసుకుంటదా? సెట్టుకు కాయ బరువవుతాదా, దానిని వదిలనేకు పానం కొట్టుకులాడినాది. పసిదాన్ని సంపను సేతులు రాక మర్రిసెట్టు కింద వదిలేసినా. దాని జాతకం బాగుంటే ఎవరో ఒకరి కంటబడితే బతికి బట్టకడతాది కదా.
నిజం చెప్పు, అక్రమ సంతానమని అది ఆడపిల్ల అని కదా ఈ పాపపు పని సేసింది. మా దగ్గరకు వచ్చేవాళ్ళు అసలు కథ చెప్పరులే. కట్టుకతలు బాగా వినిపిస్తారు. నీలాంటివాళ్ళను ఇప్పటికే చాలామందిని చూశానులే.
ఇటు నా కల్లల్లోనికి సూడు మేడాం. నేను కట్టుకతలు చెప్పేదానిలాగా అగుపడుతున్నానా? అంటూ రోషపడిపోయింది.
సరే, నువ్వు ఏది చెబితే అదే రాసుకుంటా. అబద్ధాలు చెబితే నీకే నష్టం. నీవు చెప్పిన విషయాలు, మాకు వచ్చే రిపోర్టు ఒకటే వుంటే నీకు మంచి జరుగుతుంది.
నిజాలు చెబితే నిజంగా మంచి జరుగుతాది అంటే మొదలు కాడనుండి జరిగింది జరిగినట్లు చెబుతా. చెప్పింది రాస్తావుగా. నే సెప్పింది పొల్లుబోగుండా రాయాల సూడు.
నాయన తాగని రోజు ఉండదు. తాగితే మడిసి కాదు, తాగని దినం దేవుడి లెక్క. అమ్మను బో సతాయిస్తడట. నాకు రెండేళ్ళప్పటి మాట. నాయన అమ్మ బాగా తన్నులాడుకుని అమ్మను ఇంటినుండి గెంటేసినాడు. అమ్మ నన్ను సంకనేసుకుని తాత కాడికి సేరింది. ఎంతమంది సెప్పినా మొగుడికాడికి పోనని మొండికేసినది. నాయనకు పల్లెల్లోళ్ళు నీ పెళ్ళాం ఎవరినో మరిగినాదిలే నీ మొగం ఎట్టా సూస్తది అని లేనిపోని అనుమానాలు ఎగదోసినరు.
నాయన నాలుగు తూర్లు అమ్మను తోలుకొని పోను వచ్చినా అమ్మ పోలా. నాయన జనాలు సెప్పిన మాటలు తలకెక్కించుకున్నాడు. శివరాతిరి తిరునాళ్ళకు మా ఊరికి వచ్చి పది దినాలు తాగకుండా సానా మంచిగా ఉన్నాడు. మా ఇద్దరిని బాగా సూసుకుంటానని, తాగటం మానేసానని సెప్పి పెద్ద మడుసుల కాడ కాళ్ళ ఏళ్ళా పడ్డాడు. ఆ పెద్ద మడుసులు ఏం జెప్పినారో అమ్మ నన్ను అమ్మమ్మకాడ వదిలేసి నాయనతో ఎల్లినాది. ఆ పోవటం పోవటం అమ్మ మల్లీ నా కల్లకు కనబడలా.
ఎవురితోనో అక్రమ సంబంధం ఎట్టుగుందని అది సూసినాడని, మొగోడు కదా పెళ్ళాం ఎవుడితోనో కులుకుతా ఉంటే సూస్తా ఉంటాడా. కడుపు మండదా? అందుకే గొడ్డలేసుకుని తల నరికేసినాడని అందరూ అనబెట్టె. అనుమానపు సచ్చినోడు. పెళ్ళాన్ని నరికాడని ఏ ఒక్కడూ, ఏ ఒక్కతీ నోరిప్పి అనలా.
అమ్మ దినం నాటికి అమ్మ సెల్లెలు, పిన్నమ్మను ఇచ్చి నాయనకు మారుమనువు జేస్తమని మాట యిచ్చినాడు తాత.
బావయ్యతో మనువా అంటూ పిన్నమ్మ చిర్రుబుర్రులాడింది. ఏంది తెగ నీలుగుతున్నావు. ఆడికి ఎకరా పొలం ఉంది. ఈ మద్దెనే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. వయసులో ఉన్నాడు, ఎట్టాగు ఇంకో మనువుకు పోతాడు. వచ్చినది అప్పబిడ్డను చూస్తదా? పాడా? నీవైతే దాన్ని సొంత బిడ్డలెక్క సూస్తావు. అటు ఆస్తి కలిసొస్తాది, పెద్దోళ్ళం, మంచి చెడు తెలిసినోళ్ళం. సెప్పిన మాట వినుకో. మొదలే మాట కూడా ఇచ్చినాము.
ఆస్తి, పిల్ల… ఈ మాటలు బాగానే ఉండాయి. తాగుబోతోడికి ఇచ్చి ఆప్ప పాణాలు తీసారు. దానిలాగా నేను కూడా సావాలా.
ఈ రోజుల్లో తాగనోడు ఎవడే? నూటికి పదిమందిని సూపించవే తాగనోల్లని. అట్టా తాగని పదిమంది నుండి ఒకడిని తెచ్చి నీకు తాళి కట్టించను సేతకాదే. సిన్న బిడ్డను సూత్తా ఉంటే కడుపు తరుక్కుపోతా వుంది. దాని మొగం సూసి ఎట్టాగో సర్దుకుపోవే. సూస్తా సూస్తా పరాయోల్ల సేతుల్లో ఎట్టా పెడతామే? బతుకన్న తర్వాత సర్దుకుపోవాలి.
ఎవురికి ఎదురు సెప్పలేక గొనుగుతా నాయనను పెళ్ళి సేసుకుంది.
పిన్నమ్మకు ఇద్దరు కొడుకులు కాక ముందు వరకు నన్ను బాగానే సూసుకుంది. పిల్లలు అయినకాడ నుండి నా బతుకు పెనంమీద నుండి పొయ్యిలోకి పడ్డ సామెత అయింది.
నా మేనత్త నన్ను సానా బాగా సూసుకుంటది. నేను ఎర్రగా బొద్దుగా ఉంటానని మా వంశంలో నీలాంటిది ఇప్పటికి పుట్టలేదే అంటూ ముద్దులాడేది. నేను సవత్త అయిన కాడనుండి నాకు పెండ్లి చేయమని నాయనను పోరుతా ఉండేది.
అన్నో నీ పెళ్ళాం దాన్ని సరిగ్గా చూడదురా. పెద్దమనిషి అయినకాడ నుండి నీ బిడ్డ ముద్దమంతి పువ్వు లెక్క మిసమిసలాడుతా
ఉంది. ఎవడి కన్ను పడుద్దో కాని ఏమి రోజులు సూస్తే మంచిగా లేవు. మంచి సంబంధం చూసి పెండ్లి సెయ్యమని సెవికింద జోరీగలాగా పోరుతా ఉండేది. నాయన ఏ గుణాన ఉన్నాడో ఏమో, యేసోబుకిచ్చి పెండ్లి చేసినాడు. నాయన నా పెండ్లి అయిన ఆరు నెలలకు కల్తీ సారా తాగి సచ్చాడు.
… … …
నన్ను ఇచ్చిన ఊరు నల్లమల అడవిలో చిన్న ఊరు. మా ఊరి నుండి పెద్ద రోడ్డెక్కితే కర్నూలు, దోర్నాల, శ్రీశైలం పోవచ్చు. మా ఊరికి బస్సులు ఉండవు. పెద్ద రోడ్డు నుండి పది మైళ్ళు నడిచి పోవాలి.
నా పెనిమిటి సానా మంచోడు, నాయన లెక్క తాగుబోతు కాదు. నన్ను గుమ్మందాటి యే పనులకు అంపడు. సక్కంగా ఇల్లు జూసుకోమనేటోడు. సల్లంగా కడుపులో నీళ్ళు కదలకుండా బతుకుతున్న. శోభనం తరువాత ఇక బయట జేరలా కడుపొచ్చినాది. ముందు కూతురు, తరువాత కొడుకు పుట్టినాడు.
యేసోబు సానా కష్టం జేస్తడు. పొగాకు తోటలో పచ్చాకు కొట్టను ముఠాలను దీసుకొని బోతాడు. మూడు నెలలకు ఆకు కొట్టనుబోయి లచ్చ కట్ట దీసుకొని వస్తాడు. ఒక్కడే మూడు బార్నీలకు ఆగు కొట్టేంత మొగోడు. మిగతా రోజుల్లో ఊరిలోనే ట్రాక్టరు పనికి బోతాడు.
ఆడికోసం ఊర్లనుండి ఆసాములు రెండు నెలల ముందే డబ్బులు ఇచ్చిపోతారు. ఆడు మాటంటే మాటే. ముందుగానే డబ్బులు తీసుకున్నాడంటే భూమి తల్లకిందులైనా మాట తప్పడు.
నా ఖర్మ కాకపోతే ట్రాక్టరు మీద ఆకు ఏసుకుని వస్తావుంటే లారీ గుద్దేసినాది. యేసోబు పోయినకాడ నుండి బతుకు బరువైనాది.
యేసోబును సివరి సూపు సూడవచ్చిన అన్న వదిన ఈడనే నిలబడిపోయినారు. ఆల్లు బేలుదారు పనులకు హైదరాబాదు పోయి సానా ఏండ్లయినాది. పెండ్లయి పదేళ్ళు అయినా పిల్లలు కాలా.
అత్తమ్మ యేసోబు పోయినకాడనుండి మెత్తబడిపోయింది. ఒరేయ్ సామ్యేల్ చిన్నోడు ఇంట తిరుగుతా ఉంటే కడుపు నిండినట్టు ఉండేదిరా. ఆడు కనబడకపోతే కాలు సెయ్యి ఆడటంలా. పెద్దోడా నీవు యాడకు పోమాకురా. నా కల్లెదుటే ఉండరా. ఉన్నదాంట్లో కలో గంజి తాగుదాం అని అంటుండె.
యేసోబు చచ్చినాక లారీ ఓనరు మీద కేసు కాకుండా చేసినందుకు నా పేరిట రెండు లక్షలు వేయించినారు. తోడికోడలు యా డబ్బులమీద ఆశపడినది.
నేను పనికి బోనుకదా ఆయమ్మి కూడా పనికి బోకుండా ఇంటనే ఉంటాది. బావయ్య ఒక్కడే సంసారం లాగుతున్నాడు. ఆయమ్మ రోజు తగవులాడుతా ఉంటుంది. నా మొగుడు ఒక్కడు సంపాదిస్తా ఉంటే ఇంట కూర్చొని తింటా ఉన్నారు. పోయేటప్పుడు కట్టుకుపోతావా. నీ పేరిట డబ్బులు తీయవే అంటూ గోలజేస్త ఉండె.
నా యిద్దరు పిల్లలను జూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది, ఆళ్ళను ఊకి ఊకినే కసురుతా ఉంటది. పిల్లలన్నాక గోలెట్టగుండా ఉంటారా? ఊ అంటే సాలు మెల్లి దీసుకుని బాదిపెడుతుంది.
పల్లెల్లో కనబడిన వారందరూ ఏంది ఇంకా పిల్లలు కాలేదని విసిత్రంగా అడుగుతా ఉంటే హైదరాబాదులో పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరకు తిరిగినాము, అబ్బో ఆంబోతు లెక్క ఎదిగినాడు కాని పిల్లలు పుట్టడానికి ఒంట్లో ఇత్తులు లేవట. నేను మటుకు ఏం చేస్తును. మందులు వాడుతున్నాము. ఒక సంవత్సరం సూస్తా, లేదంటే ఐదు లచ్చలు ఉంటే పిల్లలు అవుతారట.
అందుకే నాకాడ ఉన్న రెండు లచ్చలు ఇమ్మని సతాయిస్తా ఉంది. అత్తమ్మకి, ఈయమ్మకి సరింగా పొత్తు కుదిరి సావదు. పట్నంలో ఉండినాది కదా. ఏ నాడూ చీర ట్టుకోదు. రేయింబవల్లు నైటీ డ్రస్సులే. మా ఈధిలో ఏడకు బోయినా ఆ డ్రస్సుమీద తువ్వాలు వేసుకొని తిరుగుతా ఉంటది. అత్తమ్మకు ఇట్టా ఇస్టంలేదు. ఇలా ఉంటే ఊరుకోనని సెప్పింది.
ఆ యమ్మికి చాలా పొగరు, రోషం జాస్తి, ఊరికినే సిన్న మాటకి శివాలెత్తుతాది. సూస్తా, సస్తా ఆయమ్మి జోలికి పోరు. ఇవన్నీ మనస్సులో ఎట్టుకొని అందరిమీద గొడవేసుకుని సెప్పాపెట్టకుండా పుట్టింటికి పోయినాది.
మూడు నెలలు గడిచినా బావకాడకు రాకపోగా పిల్లలు పుట్టనోడితో కాపురం చేయను. ఊరిలో అందరూ నన్ను గొడ్డుబోతులెక్క చూస్తున్నారు. రానుగాక రాను అని వచ్చిన వాళ్ళను నానా మాటలు అన్నదట.
పెల్లాం లేదు కదా, బావకు అన్నం ఎయ్యవే, తానానికి నీళ్ళు పెట్టు, కాస్తాంత వీపు రుద్దు. ఇదిగో ఆడికి గుడ్డలు ఇవ్వు, తలకు చమురు ఎత్తు అంటూ పనులు సేయించేది అత్తమ్మ.
… … …
సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది. మంచు పడతా ఉండటాన పెందలకాడ నిద్దరపోయాము. పగలంతా పనిచేసి వళ్ళు తెలియకుండా నిద్రపోతున్న. అత్తమ్మ సావిట్లో పడుకునింది. చలికి ఇంటిలో పడుకోమంటే రానని ఆడనే పడుకుంది.
అర్థరేతిరికాడ బావయ్య పక్కలోకి జేరి అటుయిటు మెసలను సందు లేకుండా ఉడుంపట్టు పట్టినాడు. ఏంది బావయ్య అంటే సెవిలో భయమెట్టుకోకు, పెండ్లి జేసుకుంటా. పిల్లల్ని సొంత పిల్లల లెక్క జూసుకుంటా, నా మాట నమ్ము అంటూ కొండ సిలువ లెక్క సుట్టుకుపోయిండు.
సెట్టంత మనిషి కుశాలు జేస్తవుంటే యేసోబు మతికి వచ్చినాడు. వయస్సులో ఉంటిని. ఉప్పు, కారం తింటున్న కదా, ఒళ్ళు తెలవలా, తప్పని అనిపించలా.
బావయ్య సానా ఉషారుగా ఉంటున్నాడు, పెళ్ళాం ఊసు ఎత్తటంలా. పిల్లకాయల్ని బాగా సూసుకుంటున్నాడు. యేసోబు దిగులు తగ్గి అత్తయ్య కూడా బాగానే ఉంటావుంది.
నాకు కడుపొచ్చినకాడ నుండి బావయ్య బుర్రమీసాలు పెంచుకున్నాడు. అప్పుడే ఈనిన దూడ లెక్క జోరుగా ఉంటున్నాడు.
నీ అక్క మొగాన పేడనీళ్ళు కొట్టి, దాని మొగాన ఊసి, ఒసే పనికిమాలినదానా, ఏనాడన్నా యిద్దరం డాకటరుకాడికి ఎల్లినామటే. నా మూలంగా పిల్లలు పుట్టలేదని పుకార్లు పుట్టిస్తవటే. ఇప్పుడు సెబుతా నేను మొగోడ్ని, అదే గొడ్డుమోతుదని మీసం మెలేసి జెబుతా. ఇన్నాళ్ళూ ఊళ్ళో జనాలు ఎటకారంగా, ఎకసెక్కాలు జేస్తుంటే తల కొట్టేసినట్టు బతికినా, దాని యమ్మను దిగిరాని, ఎవురు అడ్డమొస్తారో చూస్తా, విడాకులు ఇచ్చి పారేస్తానని అంటుంటే బావయ్యని చూసి సంతోషమేసేది.
అత్తమ్మ బావయ్య మాటలకు వత్తాసు పలుకుతూ, ఒరేయ్ పెద్దోడా ఊకే మాటలు కాదు, దానికి డబ్బులంటే పిచ్చి. పెద్దమనుషులను తోలుకొని పోయి రాణెమ్మ పేరిట ఉన్న రెండు లచ్చలు ఎత్తుకుపోయి ముదనష్టపు దాని మొగాన కొట్టి పంచాయితీ జేసుకొని రమ్మని రోజు నిలబడనీయదు, కూసోనీయదు.
అత్తమ్మకు గుండె గుబులయింది.
కడుపొస్తదని అత్తమ్మ కూడా అనుకోలా. ఆయమ్మి సెప్పిన సెప్పుడు మాటలు ఇని పిల్లలు పుట్టరని అనుకునే వయస్సులో ఉండి మగాడి సుఖం కోసం ఎవడితో ఒకడితో సంబంధం ఎట్టుకుంటానేమోనని భయమెట్టుకుంది. అట్టా పరువుబోయేకంటే యింటి గుట్టు బయటకు రాదని బావతో మంచిదనే అనుకునే.
నాకాడ ఉన్న రెండు లచ్చలు దీసుకొని పోదామని అనుకుంటుంటే యేసోబు బాబాయి కొడుకు ఊరంతా అప్పులు జేసి తీర్చలేక మందు దాగి సచ్చాడు. అంటు పోయినాక పోదామని పెద్దమనుషులు అనె.
ఇయ్యాళో, రేపో పోదామని అనుకుంటుంటే ఓ తెల్లారగట్ట ఆయమ్మి ఉరుము మెరుపు లేకుండా ఆళ్ళ ఊరికాడ నుండి దున్నపోతుల్లా ఉన్న మడుసులను టాకటరులో తోలుకొనివచ్చె. ఆళ్ళను సూడంగానే నేను, పిల్లలు, అత్తమ్మ, బావయ్య పానంలేని శవాలు మాదిరి అయినాము.
ఒసే దొంగముండ, లంజతనం జేసి కడుపు తెచ్చుకొని, నా మొగుడే కడుపు సేసిండని ఊరంతా నువ్వు, ఈ ముసలిది సాటింపు ఏసి సెబుతున్నారని మీ ఊరోళ్ళు, మా ఊరోళ్ళకు సెబుతుంటే మావోళ్ళు నన్ను ఎట్టా చూస్తనరో తెలుసా. మా అమ్మ నాయన పరువుబోయి తలెత్తుకోలేక పోతున్నారు. నా మొగుడితో నాకురాని కడుపు నీకు ఎట్టా వస్తదే. ఏడ ఏడనో పడుకొని నా మొగుడుని మొగోడిని సేయాలని, నన్ను గొడ్డుమోతుదాన్ని సేయాలని నువ్వు, ఈ ముసలిది నాటకాలు ఆడుతున్నారే.
ఈ ముసలిదాన్ని అనుకోవాలి. పెద్దదానికి బుద్ధి సెప్పద్దు, దాన్ని ఊరిమీద వదిలేసినావు, బావకి మరదలికి సంబంధం ఉందని నువ్వే ఊరంతా సాటింపు ఏస్తున్నావంట. దీన్ని సంపి పాతరేయాలి. దీని అంతు సూడాలి అంటూ ఒకడిని కొట్టమని సైగ జేయటం ఆలస్యం గంగిరెద్దు లెక్క ఆడు అత్తమ్మను మెడమీద సేయేసి ముందుకు తోసినాడు.
పాపం గువ్వలా కూలిపోయింది. నోటిమాట రాలేదు. అది జూసి బావయ్య పంచెలో ఒంటేలు పోసుకున్నాడు.
ఒసే ఆళ్ళను ఏం సేయమాకే. నేను మొగోడ్ని కాదే. నేను కడుపు సేయలా అని ఆమె కాళ్ళట్టుకున్నాడు.
ఆయమ్మి ఊళ్ళోవాళ్ళు రౌడీ ముండా కొడుకులు. తేడా వస్తే తలకాయలు తీస్తారు. ఆళ్ళమీద నాలుగు కేసులు కూడా నడుస్తుండె. బావయ్య తలకాయ తీస్తారని భయమెట్టుకున్నాడు.
సరే ఏ పాపం తెలవదు కదా. యిప్పటిదాకా నువ్వు జేసిన సంబరం సాలుగాని ఈడ ఒక్క నిమిషం ఉన్నావంటే, మక్కెలిరగతన్ని అడవిలో నక్కల పాలు చేస్తాను. ఎక్కు బండి అని నెట్టుకుంటూ పొట్టు బస్తా లెక్క టాకటరులోకి యిసిరేసిండు.
ఈ తిరునాళ్ళు అయిన కాడ నుండి జనాలు మమ్మల్ని ర్షాసుల లెక్క జూస్తున్నారు. అత్తమ్మ బయటకు రావటంలా. నెలలు నిండుకున్నాయి. ఏ పనికి పోను సేతకాదు. సేతిలో సిల్లిగవ్వ లేదు. బావయ్యకు ఇచ్చిన రెండు లచ్చలు కానరాలా, ఆయమ్మ యిల్లంతా గుల్లగుల్ల జేసింది కదా ఎత్తుకుపోయుంటది.
అత్తమ్మ తల ఎత్తుకోలేక కింద మీద అవుతా ఉంది. అడిగినోల్లకు, అడగనివాల్లకు నాకు ఏ పాపము తెలవదని అంటుంటే ఆ మాటలు వింటుంటే నాకు భయమెట్టుకుంది.
యేసోబు బతికుంటే నా బతుకు ఇట్లా అయ్యేదా.
పది దినాలు గడిసినాక మా ఊరి పెద్దమనుషులు మా అత్తమ్మను పిలవనంపించారు. పల్లెల్లో ఇంత గొడవ అయినాక ఊరుకుంటే ఎట్టా. పక్కఊరోల్లు ఇంత గొడవ చేసి మన పరువు తీసినాక మనం ఏదో ఒకటి సేయాల. దీనికంతటికి కారణం యేసోబు పెళ్ళాం మేరీరాణి మూలంగా పరువు పోయింది. దానికి పుట్టే బిడ్డకు అబ్బ ఎవడు? మొగుడు లేకుండా ఇట్టా పిల్లల్ని కంటుంటే సూస్తా ఊరకుండాలా? ఇట్టా వదిలేస్తే పల్లెల్లో చాలామంది వెధవ పనులు చేస్తా ఉంటారు. ఏమి సేస్తారో తెలవదు. అది బిడ్డతో
ఉంటే ప్రాణాలతో ఉండదు అని గట్టిగా సెప్పి పంపించారు.
అది జరిగిన నాటినుండి అత్తమ్మ నాతోను, పిల్లలతోను ఉలుకు పలుకు లేదు. పొయ్యిలో పిల్లి లేవడంలా. పిల్ల పొగాకు బార్నీ పనికిపోతుంది. తెచ్చిన డబ్బులను అత్తమ్మ గుంజుకుంటా ఉంది. వారం బట్టి తిండి పెట్టడం లేదు అత్తమ్మ, సుట్టుపక్కలోల్లతో కూడా మాటామంతి లేదు. పుట్టింటికి పోను మటుకు ఎవురుండారు? నన్ను కడుపులో పెట్టుకొని సూసుకోను లేనిదాన్ని అయితిని.
యిట్టా కూడు ఎట్టకపోతే కడుపులో బిడ్డ సచ్చిపోతదట. పుట్టే బిడ్డకు అబ్బ ఎవరో తెలియదు కదా. అందుకని అది పుట్టకూడదు. పుట్టినా బతికి బట్టకట్టకూడదని అందరూ అనుకునే ఇట్లా చేస్తున్నారు. ఎవరికంటా పడకుండా నా కూతురే దొంగతనంగా ఒక ముద్ద అన్నం పెడతా ఉంది. నీరసపడిపోతున్నా ఏం చెయ్యాలో అర్థమవటంలేదు.
నా కూతురు దేవతమ్మ దేవత. అద్ధరేతిరి నన్ను తట్టిలేపి అమ్మా తెల్లారేపాటికి ఈడనుండి పోదామే. నీ కడుపులో బిడ్డ సచ్చితే నీవు కూడా సచ్చిపోతావట కదా. నీవులేని మేమెట్టా బతకాలి. దోర్నాల ఆసుపత్రికి పోదాం. నేను ఏదన్నా అడుక్కొచ్చి పెడతాను. లెగు లెగు అంటూ లేపి కూర్చోబెట్టింది.
ఇద్దరం అడ్డదారిని అడివిలోగుండా బయలుదేరినం ఎండ పొద్దుకాడ పెద్దరోడ్డుమీదకు ఎక్కి ఆటోను ఎక్కించుకోమన్నా ఏ ఒక్క నా కొడుకూ ఎక్కించుకోలా. ఆటోవాళ్ళందరూ మా పల్లెల్లోవాళ్ళే కదా. యేసోబు బతికున్న రోజుల్లో ఈళ్ళందరూ వదినా వదినా అంటూ నోరారా పిలిచేటోల్లు.
సిన్నంగా దారిపట్టి నడుచుకుంటా నాలుగు మైళ్ళు పోయినా. అంతే తెలుసు. కల్లు తెరిసేటప్పటికి పక్కలో పిల్ల ఉంది. మూడు దినాలు సోయిలేకుండా బోయినానంట. పెద్దాపరేషన్ చేసి పిల్లను తీసినారు.
సంటి పిల్లను ఎత్తుకొని ఏడకు పోవాలో తెలవల. ఎన్నడూ బయటకు రాలా. యేసోబు ఒక తూరు ఒంగోలుకు తీసుకొని వచ్చినాడు. ఆడి మేనత్త కూతురి పెళ్ళికని. యింటికాడ పిల్లోడు ఎట్టా
ఉన్నాడో మతికి వస్తున్నాడు. యేసోబు నోటిలోనుండి ఊడిపడినట్లు ఉంటాడు. పల్లెను కాదని బతకడం తెలవదు. ఈ పిల్ల లేకపోతే ఎప్పటిలా పల్లెలో బతకొచ్చు.
నేను నా పిల్లలు బతకాలంటే ఈ పిల్ల బతకకూడదు. సంపను సేతులు ఎట్టా వస్తాయి? పెద్దలు సానా కతలు చెబుతారుగా. మొగుడు లేకుండా బిడ్డను కన్న కుంతమ్మ, మరియమ్మ పిల్లలను చంపలేదు కదా. పిల్లలను ఎట్టానో ఆలోచన చేసి బతికించారు. ఆల్లంతా దేవుని బిడ్డలు అయినారు కదా. ఆ యిసయాలు గుర్తుకు వచ్చాయి.
అప్పుడే మా ఊరు పోయే మొదళ్ళో మర్రిచెట్టు కళ్ళల్లో అగుపడినాది. అది చానా పెద్ద చెట్టు. ఓడలు దిగి చానా లెక్క సాగిపోయింది. చాలామంది ఆ చెట్టుకిందకు కూర్చోనికి పోతూ ఉంటారు. తెల్లారేసరికి చిన్నబిడ్డకు కడుపునిండా పాలిచ్చి పండబెట్టినా. మధ్యాహ్నందాకా లేవదు. ఎవరో ఒకరు చూసి ఎత్తుకుపోతారని నేను, నా పెద్దబిడ్డ దూరంగా చేలల్లో కూర్చొని చూస్తావుంటిమి.
నా కర్మ కాకపోతే మా పల్లె పిండిబడి పంతులమ్మ (అంగన్‌వాడీ టీచర్) ఆటోకోసం మర్రిచెట్టు కాడ నిలబడి పిల్లను చూసింది. బ్యాగులోనుండి ఫోన్ తీసి ఎవరితో మాట్లాడిందో ఏమో పదినిమిషాల్లో వ్యానులో పోలీసులు వచ్చి పంతులమ్మను, పిల్లను ఎత్తుకొని పోయినారు.
బయమేస్తావుండి, కాలు సెయ్యి ఆడటంలేదు. పోలీసంటే అసలే బయ్యం. సాయంత్రందాకా అట్టానే ఉండినాము.
నా కూతురు చాలా తెలివిగలది. ఈడవద్దు మనం మల్లీ దోర్నాలకు పోదాం ఆడనుండి ఎక్కడికైనా పోదాం. పల్లెకు పోతే మర్రిచెట్టు కింద పిల్ల మనదే అని తెలుస్తది.
దాని మాట ప్రకారం దోర్నాలకు దారిపట్టాము. అప్పుడే కాస్త మసకపడ్తా ఉంది. కాస్తంత దూరం పోగానే ఆటోలో పంతులమ్మ ఎదురైనాది. నన్ను చూడకూడదని చీర పైట తలమీదకు వేసుకున్నా.
నన్ను చూడలేదనుకున్నా. కాస్తంత దూరం పోయినాక నన్ను గుర్తుపట్టినట్టు ఉంది. ఆటో ఆపి దిగి రానెమ్మా ఇటు రా అని కేకవేసింది. నాకు పై పేనాలు పైనే పోయినాయి. ఏం విననట్టు అట్టే నిలబడిపోయా. ఆయమ్మే నాకాడికి వచ్చింది.
నా గురించి ఆయమ్మకు అన్నీ తెలుసు. కనబడినపుడల్లా ధైర్యంగా ఉండు అంతా మంజే జరిగిద్దని చెప్పేది.
ఏం రాణెమ్మ ఎట్టాగున్నావు? కాన్పు అయినావా అని నా కడుపు వంక చూసింది. నేను ఏమీ మాటలాడకుండా గుడ్లనీరు గుడ్లకక్కుకుంటూ తప్పు చేసినదానిలా నిలబడిపోయా. దాపరికాలు తెలియనిదాన్ని, అబద్ధాలు చెప్పడం రానిదాన్ని. నోటినుండి మాటరాక కళ్ళల్లో నీల్లెల్ల బెట్టుకుని తడబడతా ఉంటే ఏందే రాణెమ్మా నిన్ను చూస్తావుంటే అనుమానంగా ఉంది. మర్రిచెట్టుకింద చేసిన పని నీదేనా అని నిలేసింది. కాదని చెప్పను సేతకాలేదు. ఇక ఇసయాలు తెలుసుకదా, పేపర్లోల్లు, టీవీలోల్లు, పోలీసోల్లు… ఆఖరికి ఇదిగే నీకాడకు వచ్చా.
మరి నేను సెప్పినవన్నీ నిజాలే. జాగ్రత్తగా రాసినావా. ఈడవుండి నేను ఏ పనులు సెయ్యాలి అంటూ అమాయకంగా అడుగుతున్న మేరీరాణికి సమాధానం చెప్పడానికి నా మనస్సు వాయుగుండం పడిన సముద్రంలా అయ్యింది.