ప్రపంచీకరణ నుంచే అస్థిత్వ ఉద్యమాలు, పోరాటాలు ప్రారంభమయ్యాయనే అంచనాలకు భిన్నంగా ఈ దేశంలో రెండు వేల ఆరు వందల సంవత్సరాల కిందటే ”బహుజన హితాయ – బహుజన సుఖాయ” అన్న బుద్ధుడు బహుజన తాత్వికతను సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా పీడనకు గురౌతున్న వివిధ సమూహాలను సంఘటితం చేశాడు. పురాతన కాలం నుంచీ బహుజనుల అస్థిత్వ పోరాటాల చరిత్రే బహుజనేతరుల ఆధిపత్య పోరాటాల చరిత్రగా మారిపోయిందనే వాస్తవాన్ని తన తాజా కవితల సంపుటి ”అనివార్యతలోకి” ద్వారా ఆవిష్కరించాడు కవి సన్ని (రాపాక సన్ని విజయ్ కృష్ణ). మొత్తం ఇరవై నాలుగు కవితలున్న ఈ పుస్తకంలో దేనికదే చదివిస్తుంది. తొలి కవిత ”ఒక అనివార్యతలోకి”లో ఎన్నో అంశాలను స్పృశిస్తూనే చివరికి ”అనాదిగా యుద్ధకాంక్ష లేని మనం… ఒక యుద్ధం వైపుకి… అనివార్యంగా… అత్యవసరంగా కదలాల్సొచ్చి… ఆగమాగమైపోతూ మనం” అని ముగించిన తీరు నేటి పరిస్థితులకి అద్దం పడుతోంది. రెండో కవిత ‘రాతి దిగులు’లో ”రాతి గుండెలు పగిలి… ఒక జల… పెల్లుబికి రావాలిగాని… జాతి పునరుజ్జీవానికి” అని ఆకాంక్షిస్తాడు. ‘మరణం కోసం మేల్కొంటాను’ కవితలో ”మనిషి మనిషిగా బతకనీయని ఆంక్షలున్నాక… అంతకంటే బలమున్నదే నా మరణం” అని స్పష్టం చేస్తాడు. ‘సత్యం’ కవితలో ”భరత ఖండం నామవాచకానికి కులం సర్వనామం” అని చెబుతూనే ”అణిచివేతకు తిరగబడని బలపడని ఏ జాతైనా నశించిపోతుందని అంబేద్కర్ మహాశయుడు చాటిన సత్యమిదే” అంటూ కర్తవ్యబోధ చేస్తాడు. మరో కవితలో ”కట్టుబాట్లు… చట్టాలు… ఒప్పందాలు… మీ సహజ కవచాలు” అంటూ మనువాదుల కుటిలత్వాన్ని బయటపెడతాడు. బహుజన తాత్వికతని గందరగోళానికి గురిచేసే సంకుచిత ఆలోచనాపరులకు షాకిచ్చేలా ఈ కవితలన్నీ ఉన్నాయి.
అడుగడుగునా అబ్బురపరిచే వాస్తవికతను తన కవితాక్షరాల నిండా వెదజల్లాడు సన్ని. వాటిని ఏరుకుని జీవనాకృతులుగా పేర్చుకోవాల్సిన అవసరాన్ని అతను తప్పనిసరి అని చెబుతున్నాడు. తాత్కాలిక ప్రతీఘాతక దళిత ఉద్యమాలను ఎండగడుతూనే శాశ్వత ఫలితాలనిచ్చే వ్యూహాత్మకమైన, ప్రణాళికాబద్ధమైన, సుదీర్ఘ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు అవసరమని కవి తన ఆలోచనా వైశాల్యాన్ని కవితల్లో ఆవిష్కరించాడు. ఎంతోమంది తామే తిరుగులేని కవులమని జబ్బలు చరుచుకుంటున్న వేళ వారంతా ఒకసారి ఈ సంపుటిలోని కవితలు చదివితే తాము రాయలేనిది… ఇందులో ఉన్నదేమిటో… నేటి సమకాలీన సమాజంలో తాము ఎవరి కోసం సాహిత్య సృజన చేస్తున్నామో స్వీయ విమర్శ చేసుకోక తప్పదు.
వయసులో చిన్నవాడైనా ‘సన్ని’ కవిత్వంలో ఒక గాఢమైన తాత్వికత కనిపిస్తుంది. అయితే అది సమాజానికి అవసరం లేనిది కాదు… అత్యవసరమైనదే కావడం విశేషం. అతనే ఈ సంపుటి చివరిగా చెప్పుకున్నట్లు, ‘ఇది కవిత్వమని, నేను కవిని అని అనుకోవడం పేర్లు పెట్టడం నాకిష్టం లేదు. నా దుఃఖానికి, తిరుగుబాటుకి, పోరాటానికి ఇదొక అభివ్యక్తి అంతే’ అనడం సమాజం పట్ల అతనికి ఉన్న వినమ్రతకు దర్పణంగా నిలుస్తోంది. కవిత్వం రాస్తున్నామని అనుకునేవారే కాకుండా సమాజంలో అన్ని వర్గాల వారంతా చదివి ఆలోచింపచేసే కవితలివి.