పల్లెను విడిచి అమ్మ రాదు
పట్నం విడిచి వీడు పోడు.
ఆమె వస్తే ఆమెతోపాటు
పల్లె కూడా రావాలి
పట్నంలో దానికి జాగా లేదు.
పల్లెకు వెళ్ళి
అతడు చేసేదేమీ లేదు.
అతని అస్తిత్వం
ఇంకా పల్లెలో కొంత ఉంది.
కాని క్రమంగా అది
నాస్టాల్జియాగా మారిపోయింది.
అక్కడి విశాలమైన ఆవరణ,
ఇరుగు పొరుగు ఆప్యాయతలు
మేకా కోడి పిల్లీ బల్లీ
వాటితో తన ప్రాణ బాంధవ్యం
అదే ఆమె జీవన కావ్యం.
ఆమెకున్నది ఒకటే ఉనికి
పల్లె మాత్రమే ఆమె మమతల కిటికీ.
మనుమలూ మనుమరాండ్ల ముఖాల్లో
పోలికలను వెతుకుతుంది
వారి చేష్టలను
తులన దృష్టితో చూస్తుంది.
పల్లె కెళ్తే
పల్లె నిండా ఆమె నీడే.
పట్నంలో వీడికసలు
నీడలే ఉండవు.