గాలివాన -శైలజా మిత్ర

ఎడతెగని వర్షంతో కామేశ్వరికి కంగారుగా ఉంది. ఒకవైపు గాలి, మరోవైపు వరదతో జనజీవనం అతలాకుతలం అయిపోతోంది. విద్యుత్తు తీగలు తెగిపోవడంతో కరెంటు లేదు, ఫోన్లు లేవు. నెట్‌వర్క్స్‌ అన్నీ కట్‌ అయి ఎవరితో మాట్లాడడం కుదరటం లేదు. తలుపులు తీసినా వేయలేని స్థితి, వేసినా తీయలేని స్థితితో బిక్కుబిక్కుమంటూ ఒక వారంగా మంచంపై కూర్చున్నారు కామేశ్వరి, కూతురు సౌమ్య.

”ఈ వేల్టికి మూడు రోజులవుతోంది. ప్రకృతి కరుణించడం లేదు. హే భగవాన్‌! కాపాడవయ్యా!” పైకే అనుకుంది కామేశ్వరి.

”మనల్ని కాపాడాడు కదమ్మా! నేను, నువ్వు ఇంట్లోనే ఉన్నాము కదా?” నవ్వుతూ సౌమ్య.

”కాపాడటం అంటే ఒకచోట ఉంచడం సరే! ఏ క్షణంలో ఏమవుతుందో అనే భయంగా ఉంది. బయట ఎవరెవరు ఇరుక్కుపోయారో పాపం! వారందరినీ కాపాడమని వేడుకుంటున్నాను” అంది కాఫీ అందిస్తూ కామేశ్వరి.

”అసలు వారినెవరు బయటికి వెళ్ళమన్నారు? బయట బాగోలేకపోతే ఇంట్లో ఉండచ్చు కదా? అంతా ఓవర్‌ ఏక్షన్‌ కాకపోతే…?” అంది విసుగ్గా సౌమ్య.

”సౌమ్యా! ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయో? తిండానికి ఉందో లేదో పాపం. బయటకెళ్ళి బాధపడాలని ఎవరికీ ఉండదు కదా? మా చెల్లెలు ఎలా ఉందో పాపం? అందరివీ కింద ఇళ్ళు. మనింటికి వచ్చేస్తే బావుండునే! మా తమ్ముళ్ళు ఎలా ఉన్నారో? కాస్త

ఉపశమిస్తే అందరూ ఒకేచోట ఉండచ్చు. మనం కనీసం రెండో అంతస్తులో ఉన్నాం” అంది కంగారుగా కామేశ్వరి.

”మీ చెల్లెలు… ఇన్నాళ్ళూ ఏమయింది? మీ సోకాల్డ్‌ తమ్ముళ్ళు ఇన్నాళ్ళూ మనల్ని పలకరించడానికి కూడా రాలేదు. అసలు మనం బతికున్నామో లేదో అని కూడా తొంగి చూడలేదు. నీకు మాత్రం వాళ్ళంటే ప్రేమ పొంగిపోతోంది. పాపం అట పాపం” అంది కోపంగా సౌమ్య.

”పోనీలేవే! ఎవరి పరిస్థితులు వారివి. నేను ఇష్టపడ్డానని ఇంట్లో చెప్పకుండా వచ్చి పెళ్ళి చేసుకున్నాను. నువ్వు పుట్టాక ఆడపిల్లవి పుట్టావని మీ నాన్న మనల్ని వదిలి పారిపోయాడు సరే. నా ఖర్మ. నేను తీసుకున్న ఒక చిన్న నిర్ణయం నాకు జీవితంపైనే విరక్తి కలిగేలా చేసింది. తప్పు చేస్తే ఎవరైనా క్షమిస్తారా ఏంటి? అయినా మా అమ్మ అపుడపుడు కనిపించి పలకరించేది. ఎంతైనా అమ్మ అమ్మే! ఆమెకు సాటి ఎవరుంటారు? నేను ఒంటరిగా ఉన్నానని తెలిసి ఎంత ఏడ్చిందో పాపం!” అని కన్నీరొత్తుకుంది కామేశ్వరి.

”మరి ఆ ఏడుపు మీ నాన్నకు ఎందుకు రాలేదు? మీ తోబుట్టువులకు ఎందుకు రాలేదు? కులం కాకపోతే మనుషులం కామా? తప్పులు ఎవరూ చేయరా? అసలు ప్రేమించడం తప్పెలా అవుతుంది?” అంది విసుగ్గా దిండును నేలకేసి విసిరేస్తూ… సౌమ్య.

”అలా అని మనం అంటాం. తప్పు చేసిన వారం కదా? పైగా నేను తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. దాంతో మరింతగా వాళ్ళ మనసు కష్టపడింది”.

”ఓడిపోయినపుడు దగ్గరకు తీయరామ్మా? అలా ఒంటరిగా వదిలేస్తారా? కనీసం నీ చెల్లెలయినా పలకరించవచ్చు కదా? ఆఖరికి మీ అమ్మ, నాన్న పోయినపుడు కూడా పిలవలేదు. వాళ్ళు నీకు చుట్టాలు. స్టుపిడ్స్‌. ఒకవేళ ఇంటికి వచ్చినా సరే నేను బయటకు గెంటుతాను” అంది ఆవేశంగా సౌమ్య.

…….ఙ……..

కామేశ్వరి ఏమీ మాట్లాడలేదు. నిజమే! గత పాతికేళ్ళుగా తనను పలకరించిన పాపాన పోలేదు. ఎప్పుడో తప్పు చేసానని తనను వెలివేశారు. కనీసం బిడ్డను కూడా చూడడానికి రాలేదు. ఆ విషయం తలచుకుంటే తనకు కూడా ఎంతో బాధ కలుగుతుంది. అయినా తనేం తప్పు చేసిందని? తన కులం కానివాడిని ఇంట్లో ఒప్పుకోరని గుడిలో పెళ్ళి చేసుకుంది. రాజు తనని జీవితాంతం చూస్తాడనుకుని అనుకుంది. ఆడపిల్ల కడుపులో పడిందని తీయించుకోమంటే తాను ఒప్పుకోలేదు. తీసుకోకపోతే నన్ను వదిలేస్తానని చెప్పాడు. కానీ తాను బిడ్డను చంపడానికి, గర్భంలో విచ్ఛిన్నం చేయడానికి ఒప్పుకోలేదు. కానీ అన్న ప్రకారం వదిలేస్తాడని అనుకోలేదు. పుట్టాక చూసి మనసు మారుతుందని ఎంతో ఎదురుచూసింది. అసలు బిడ్డ ముఖమే చూడకుండా ఉండడంతో ఇక తనకు మనసు మారదని అర్థమయింది. అప్పటినుండి ఒంటరిగా చదివిన డిగ్రీతో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేసుకుంటూ బిడ్డని పోషించుకుంది. తన బిడ్డ పోటీగా ఆటల్లో, చదువులోనూ ఎందులోనూ తీసిపోకుండా రాణించడం తనకు మిగిలిన ఆస్తిగా అనుకుంది. కానీ అప్పుడప్పుడూ అందరూ గుర్తొస్తే మాత్రం కుమిలిపోతుంది. అయినా మా మధ్య ఏం గొడవలున్నాయని? తనకిష్టమైన పెళ్ళి, ఆ పెళ్ళివల్ల కలిగిన కష్టాల్ని, నష్టాల్ని తాను అనుభవిస్తోంది. మధ్యలో వీరికెందుకు సమస్య” అనుకుంది తప్ప కోపంతో శాపనార్ధాలు పెట్టడం కానీ, కనీసం తిట్టుకోవడం కూడా తాను చేయలేదు. కానీ తనకు నమ్మకం ఉంది. అందరూ కలుస్తారని… ఆ ఆశతోనే జీవితం నెట్టుకొస్తోంది.

…….ఙ……..

”సౌమ్యా! ఒక్కసారి నా మాట వినవూ” అంది నెమ్మదిగా కామేశ్వరి.

”మీ చుట్టాలకు సేవ చేయమని మాత్రం చెప్పకు. అది మాత్రం వినను. ఇంకేదయినా చెప్పు వింటాను” అంది మొండిగా.

”ఆ దూకుడే వద్దంటాను. నువ్వెళ్ళే దారిలోనే లక్ష్మి పిన్ని ఇల్లు ఉంది. అక్కడంతా నీరు ఇంట్లోకి వచ్చిందని టీవీలో వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి ఆ వైపు చూసి వెళ్ళవే. నువ్వెవరో దానికి తెలియదు కదా? ఏదో విషయం కనుక్కున్నట్లు వెళ్ళు. రాత్రంతా ఆ అపార్ట్‌మెంట్‌లో వారికి నిద్రలేదట” అంది కాస్త సంశయంగానే.

”నువ్వు మారవు అమ్మా! నాకేం వారిపైన కోపం లేదు. నువ్వెలా ఉన్నావో వారు ఒక్కసారైనా ఆలోచించారా? ఇప్పుడు మనం వెళ్ళినా అవమానం జరుగుతుంది తప్ప ఆదరిస్తారని ఎందుకనుకుంటున్నావో నాకు అర్థం కావడంలేదు” అంది బాధగా సౌమ్య.

”అందుకేనే! నువ్వు గమనించు, నేను తర్వాత చూసుకుంటాను. ఆ అవమానమేదో నేనే పడతాను.నిన్నేమీ వారిని పలకరించమనలేదు. అలాగని నువ్వు వెళ్ళనని అంటే నేనే వెళ్తాను” అంది అక్కడున్న బట్టలు మడతపెడుతూ.

”మధ్యలో ఈ బెదిరింపులొకటి. ఏం చేస్తాం? తప్పుతుందా? రేపు వారివల్ల నాకేమయినా అవమానం జరగాలి చెప్తా. నిన్ను కూడా వదిలేసి నా దారి నేను చూసుకుంటా” అంటూ కోపంగా లోపలికెళ్ళిపోయింది.

…….ఙ……..

”ఎవరు కావాలమ్మా?” అడిగారు అక్కడ ప్రాంతవాసులు.

”ఈ అపార్ట్‌మెంట్‌లో వారు అంతా ఖాళీ చేసారా?” అడిగింది.

”అవునమ్మా! కింద పోర్షను వారే ఖాళీ చేసారు. కొందరేమో తమ వారెవరో ఉంటే వెళ్ళిపోయారు. మరికొందరు ఆ పక్కనే ఉన్న పునరావాస కేంద్రంలోకి వెళ్ళిపోయారు. మీకెవరు కావాలమ్మా?” అని అడిగాడు వాచ్‌మేన్‌.

”ఆ కేంద్రం ఇక్కడికి ఎంత దూరం?”

”అదిగోమ్మా! ఆ కనిపిస్తోందే… ఎర్రటి రేకు ఒకటి. ఆ పక్కనే” అనగానే బండిని అక్కడికి

ఉరికించింది ఏమీ మాట్లాడకుండా.

అదొక సత్రంలా ఉంది. అందరూ ఇంతో కొంతో ఉన్నవారే. కానీ దొరకదేమో అన్నట్లు తినడం, రేపటినుండి మన జీవితం ఏమిటో అని గబగబా స్నానాలు చేయటం, ఇచ్చిన స్థలాన్నే తమదిగా భావించి పిల్లల్ని అడ్డంగా పడుకోబెట్టేయడం లాంటి విపరీతాలు కొట్టొచ్చినట్లు అక్కడి వాతావరణంలో కనిపిస్తోంది. ఇంతమందిలో లక్ష్మిని ఎలా కనిపెట్టడం? అనుకుని అటు ఇటు చూడగానే చాలావరకు అమ్మలానే కనిపించింది ఒకామె. కొడుకు కాబోలు. పదిహేనేళ్ళుంటాయేమో. అక్కడే చదువుకుంటున్నాడు. పక్కనే బాబాయేమో! స్నానం చేసి తుడుచుకుంటున్నాడు. ఆమె మాత్రం స్తంభానికి ఆనుకుని కూర్చుని వారికి ఏం కావాలో చూస్తోంది. ఆమెకు సమీపంగా వెళ్ళింది కాస్త భయంగా.

”మేడమ్‌! మీరు అనేలోగానే వచ్చారా? రండి.. రండి.. ఈ న్యూస్‌ పేపర్ల వాళ్ళు, టీవీ ఛానెళ్ళ వాళ్ళు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. వచ్చారా? రాత్రి నుండి నిద్రలేదు. చలి! ఇంకా ఎంతకాలమో అని భయంగా ఉంది. ఈ సత్రానికి గోడల్లేవు. ఓపెన్‌ కదా? ఏం చేద్దాం?” అని గబగబా అంది లక్ష్మి.

హమ్మయ్య… ఏమని పరిచయం చేసుకోవాలా అనుకునేలోగానే తానే ఒక దారి చూపడం సంతోషం కలిగించింది. మెల్లగా సర్దుకుని ”మరి మీ వాళ్ళెవరూ లేరా మేడమ్‌. అంటే చాలామంది వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారని మీ వాచ్‌మేన్‌ చెబితే…” అంది మెల్లిగా.

”ఉన్నారు, మా అన్నయ్యలు. కానీ ఈ వర్షాలకు వారి పరిస్థితే బాగోలేదు. వారికి తోడు నేనెందుకు అని మా బాధలు మేం పడుతున్నాం” అంది విసుగ్గా గవర్నమెంట్‌ వారు అందించిన పులిహోరలో మిరపకాయలు ఏరుతూ.

”ఇంకెవ్వరూ లేరా? అంటే స్నేహితులు ఎవరూ” అంది బయటపడలేక.

”స్నేహితులు ఉన్నారు కానీ.. వారేమి ఆదుకుంటారమ్మా. వాళ్ళంతట వారు పిలిస్తే తప్ప వెళ్ళలేం కదా?” అంటూ ఆలోచించి… కాసేపాగి ”ఆ వైపు గీతా అపార్ట్‌మెంట్స్‌లో మా అక్క ఉంది. కానీ తనకీ, మాకూ అంత సయోధ్య లేదు. వెళ్ళాలని ఉన్నా ఎలా రిసీవ్‌ చేసుకుంటుందో అని సంశయం. కష్టం వచ్చాక వచ్చానని అనుకుంటుంది కదా? అని మేము వెళ్లలేదు” అంది నిర్లిప్తంగా.

”అక్క అంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి వెళ్తే కదా తెలిసేది. ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇలా ఎంతకాలమని?”

”ఇదిగో అమ్మాయ్‌! ఇవన్నీ టీవీలో చూపొద్దు. పేపర్లో రాయొద్దు. అలాగయితేనే నేను చెప్పగలను” అంది ఖచ్చితంగా లక్ష్మి.

”అబ్బే! ఇలాంటివి రాయమండి. కొందరు అని జనరల్‌గా రాస్తామే తప్ప ఫలానా లక్ష్మిగారు అని రాయమండి” అంది తెలివిగా.

”అవునూ! నా పేరు నీకెలా తెలుసు?” అంది ఆశ్చర్యంగా.

తొందరపడి పేరు చెప్పినందుకు ఉలిక్కిపడి… ”అబ్బే! అదేం లేదండి. మీ వాచ్‌మేన్‌” అంటూ ఆగింది ఎలా చెప్పాలో తెలియక.

”వాచ్‌మేన్‌ చెప్పాడా? వాడికి నేనంటే వల్లమాలిన అభిమానం” అనగానే వెనకగా వచ్చిన బాబాయ్‌ ”ఎందుకుండదూ అభిమానం? వండినదంతా వాడికి అందిస్తుంటే” అన్నాడు వెటకారంగా.

”వండిందంతా ఇచ్చానా? మిగలితే ఒంటరివాడని ఇచ్చాను. అయినా వాడు మనకు కరెంటు బిల్లు కట్టడం, సరుకులు తేవడం లాంటి పనులు చేస్తున్నాడుగా పాపం” అంది గట్టిగా.

”అరవకు. ఇది ఇల్లు కాదు సత్రం” అన్నాడు హెచ్చరిస్తూ.

”అది నాకూ తెలుసు. అంతా నా ఖర్మ. బట్టలన్నీ తడిసిపోయాయి. స్నానం చేద్దామంటే కుదరటంలేదు” అంది దిగులుగా.

”పోనీ మీ అక్కగారి ఇంటికి వెళ్ళండి” అంది మళ్ళీ రెట్టిస్తూ సౌమ్య.

”తనేం వెళ్ళదమ్మా! వీళ్ళ నాన్న చేతిలో ఒట్టు వేయించుకున్నాడట, తనతో మాట్లాడవద్దని. అప్పటికి వీరేదో ఉద్ధరించినట్లు. తన జీవితంలో ఒక తప్పు నిర్ణయం తీసుకుంది. అసలు ఆమె కాదు నేను దీన్ని చేసుకుని తప్పు చేసాను. పాపం! ఆమె పెళ్ళి చేసుకుని ఆ తర్వాత వచ్చిన బాధలు ఆమే అనుభవిస్తోంది. మధ్యలో వీరికేంటి మరి… తండ్రి మాట జవదాటకూడదని ఇలా బిగుసుకు కూర్చుందే తప్ప రోజూ తన గురించే చెబుతూ ఉంటుంది. తనకో కూతురుందని, ఎలాగైనా పలకరించాలని అనుకుంటూనే ఉంటుంది. కానీ ఇన్నాళ్ళూ పట్టించుకోకుండా ఇప్పుడు కష్టమొచ్చిందని వెళ్తే ఎలా రియాక్ట్‌ అవుతుందో అని భయం. ఆ ఒట్టు వేయించుకున్నవాడు తప్పుకున్నాడు. వీళ్ళు మాత్రం ఇలా విడిపోయి బతుకుతున్నారు” అన్నాడు బాబాయ్‌.

”పెద్దవాళ్ళు తమ మాట కాదన్నారని ఆవేశంగా కొన్ని మాటలు అంటారు. అవి పట్టుకుని మీరు ఇలా ఉండిపోవడం కరెక్టు కాదేమో! ఆలోచించండి. పోనీ నా మాటలు మీకు నమ్మకం లేకపోతే మీరు నాతో రండి. నేను అక్కడ కూడా పరిస్థితుల్ని తెలుసుకోవడానికి వెళ్తున్నాను. మిమ్మల్ని మీ అక్కగారు పట్టించుకోకపోతే వచ్చేయండి. పలకరిస్తే మాట్లాడండి.. ఏమంటారు? ఇలా చలిలో ఉంటే ఆరోగ్యం… ముఖ్యంగా బాబు…” అనగానే లక్ష్మి కళ్ళు మెరిసాయి. భర్తవైపు చూసింది ఏమంటారు అన్నట్లు.

బాబాయ్‌ కాస్త ఆలోచించి… ఆ అమ్మాయి ఏదో చెబుతోంది కదా? వెళ్ళు అనగానే కాస్త సంశయంగానే బయలుదేరింది లక్ష్మి. అక్కని చూడగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అలాగే చెల్లిని చూడగానే కామేశ్వరి కళ్ళు చెమర్చాయి. ఏదో చూసి వస్తానని వెళ్ళి ఏకంగా వెంటపెట్టుకుని వచ్చిన కూతుర్ని దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకుంది. అక్క అలా ఆ అమ్మాయిని ముద్దుపెట్టుకోవడం చూసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. కాసేపయ్యాక ఆ అమ్మాయి అక్క కూతురన్న విషయం అర్థం చేసుకుంది. తనకోసమే అక్క పంపిందని తెలుసుకుంది. కళ్ళనీళ్ళతో దగ్గరకు వెళ్ళి ”నన్ను క్షమించు అక్కా” అంది.

కామేశ్వరి వెంటనే లక్ష్మిని అక్కున చేర్చుకుంది. అంతే! క్షణాల్లో కుటుంబాన్ని తన ఇంటికి రప్పించుకుంది. లక్ష్మి కబుర్లతో పాటు అన్నయ్యలకు ఫోన్‌ చేయడం, తను కామేశ్వరి ఇంట్లో ఉన్నట్లు తెలియజేయడం జరిగిపోయింది. ఇక అందరికీ అక్కని చూడాలనే తపన ఉండడంతో ఇన్నాళ్ళూ ఏవేవో సంశయాలతో నిండి ఉన్నవారు అందరూ ఒకరికొకరు మాట్లాడుకుని అందరూ కామేశ్వరి ఇంటికి ఒకటి రెండు రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగిపోయింది. ఇప్పుడు కామేశ్వరికి పట్టరాని సంతోషంగా ఉంది. బోలెడన్ని కబుర్లతో సమయం చాలటం లేదు. తమ్ముళ్ళ పిల్లలు, మరదళ్ళతో ఇల్లంతా పెళ్ళివారిల్లులా కళకళలాడిపోయింది.

…….ఙ……..

ఈ గాలి వాన ఎన్నో కుటుంబాలకు నష్టం చేకూర్చింది. తన కుటుంబాన్ని మాత్రం కలిపింది కదా అనుకుంటూ ఇంటినిండా నిద్రపోతున్న తనవారందరినీ చూసుకుని మురిసిపోయింది కామేశ్వరి…!!

 

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో