‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు -సత్యవతి

మా అమ్మకి 50 ఏళ్ళ వయసపుడు మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోయినపుడు నేను హైదరాబాదులో అనామకంగా ఉన్నాను. ఆయన చనిపోయాడని నాకు చెప్పకుండా నన్ను ఊరికి రమ్మన్నారు. నేను వెళ్ళేటప్పటికి మా నాన్న లేడు. మా అమ్మని మా పడిమీద వసారాలో చీకట్లో కూర్చోబెట్టారు. ఎవరెవరో రావడం, మా అమ్మ, అక్కలు, వదిన గొల్లుమంటూ ఏడవడం. నాకు అలా ఏడవడం రాదు. మా వీథి అరుగుమీద కూర్చుని మా నాన్నని తల్చుకునేదాన్ని. ఆయన అదే అరుగుమీద చాపలాంటిదేదీ వేసుకోకుండానే ఆదమరిచి నిద్రపోయే దృశ్యాన్ని పదే పదే తలుచుకుంటూ ఉండేదాన్ని. నా చిన్ననాటి నేస్తం భారతి నాతో ఉండేది. నాలుగైదు రోజులు గడిచాక నాన్న చనిపోయిన పదో రోజో, పదకొండో రోజో ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే తర్జన భర్జనలు మొదలయ్యాయి. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. బోలెడు మంది కజిన్స్‌… పెద్దమ్మలు, చిన్నమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్నలు.

మా అమ్మకి ఏదో తంతు చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారని అర్థమైంది. మా అన్న, నేను తీవ్రంగా వ్యతిరేకించాం. అమ్మ ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలి. ఏమీ మార్పులుండవ్‌. అమ్మని కాలువ దగ్గరికి చీకట్లో తీసుకెళ్ళి గాజులు పగలగొట్టడాలు లాంటివి చేస్తే మర్యాద దక్కదని గొడవ పెట్టాను. చివరిసారి అంటూ ముఖమంతా పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పూలు పెట్టి సోకాల్డ్‌ ముత్తయిదువులు వెళ్ళి చూడడం… మళ్ళీ అవన్నీ తీసేసి అమ్మ నెత్తిమీద వైధవ్యం ముద్ర వేయడం… ఇలాంటివన్నీ జరగనివ్వలేదు. దానికి చాలా పోరాటమే చేయాల్సి వచ్చింది. నాన్న పోయిన దుఃఖంలో మునిగి ఉండి కూడా ఈ పోరాటం చేయడం… నేను చాలా డిప్రస్‌ అయిపోయాను. దానినుండి బయటపడి మళ్ళీ మామూలు మనిషిని కావడానికి, హైదరాబాదు తిరిగి రావడానికి చాలాకాలమే పట్టింది. అమ్మ మామూలుగానే రంగు రంగు చీరలు కట్టుకోవడం నాకు గొప్ప సంతోషాన్నిచ్చింది.

నా జీవితంలో నాకు ఎదురైన ఈ అనుభవం నా ఒక్కదానిదీ కాదని నాకు తెలుసు. మనసును మెలిపెట్టే ఇలాంటి అనుభవాలు ఎదురుకాని వాళ్ళుండరంటే అతిశయోక్తి కాదు. భర్తల్ని కోల్పోయిన ఆడవాళ్ళ పట్ల మన సమాజం అనుసరించే దుర్నీతి, అమానవీయ పద్ధతులు వేలాది సంవత్సరాలుగా కొనసాగుతుండడం వెనుక ఉన్నది ఆధునిక తరం నిర్లిప్త వైఖరి. తమ కుటుంబాల్లో స్త్రీల పట్ల అమలౌతున్న అమానుష పద్ధతుల్ని ఆధునికులు కూడా ఆమోదించడం, వాటిని ఆచారాలుగా, కట్టుబాట్లుగా అంగీకరించి తమ తమ కుటుంబాల్లో భర్తలు చనిపోయిన స్త్రీల పట్ల అత్యంత అమానవీయ పద్ధతుల్ని ఆచరించడం సిగ్గుచేటు.

హిందూ మతావలంబికులే ఈ దారుణ ఆచారాలన్నీ కొనసాగిస్తున్నారు. భర్త చనిపోయిన స్త్రీ ముఖంమీద ‘విధవ’ ముద్ర వేసి ఆమె జీవితాన్ని మోడులాగా మార్చేస్తారు. ఆమె తిరిగి చిగురించడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా కుటుంబం, సమాజం ‘అరిష్టం’ ‘అనర్ధం’ పేరుతో ఆ చిగుళ్ళను చిదిమిపారేస్తారు. ఏది అరిష్టం? ఏది అనర్ధం? ఏది అశుభం? భార్య చనిపోతే నెల తిరక్కుండా పెళ్ళి చేసుకునే మగవాడు వైధవ్యపు ముద్రలేమీ మొయ్యకుండానే కాలరెత్తుకుని తిరగడం ‘అరిష్టం’ ఎందుకు కాకుండా పోయింది. ఉదయాన్నే అతని ముఖం చూడడం ‘అశుభం’ ఎలా కాకుండా పోయింది. భార్య చనిపోయిన దుఃఖపు ఛాయలు కనబడకుండా మామూలుగానే ఎలా మసలగలుగుతాడు. భర్త చనిపోయిన స్త్రీ మాత్రం ఆ దుఃఖాన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు వ్యక్తం చెయ్యాల్సిన దుస్థితి ఎందుకు? ఒక్కోసారి ఆమెకు దుఃఖం కలగకపోయినా ‘రుడాలి’లా గుండెలు బాదుకుంటూ ఎందుకేడవాలి? భార్య చనిపోయిన మగాడు మహా అయితే పది రోజులు గడ్డం పెంచుకుని దుఃఖ వ్యక్తీకరణ చేస్తాడేమో! అంతకు మించి ఏడుపులు, పెడబొబ్బలు చెయ్యడు కదా!

ఒకసారి నాకెదురైన ఓ అనుభవం ఇప్పటికీ నా రక్తాన్ని మరిగిస్తుంది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు. ఎవరో పేరంటం పిలుపులంటూ మా ఇంటికొచ్చారు. నేను, మా అమ్మ ఇంట్లో ఉన్నాం. వచ్చినవాళ్ళు నాకు బొట్టు పెట్టడానికి వస్తే నేను పెట్టించుకోను అన్నాను. అలా అనకూడదు.’అరిష్టం’ అంది ఒకామె. అరిష్టమంటే ఏంటి? చెబుతావా? అని అడిగాను. మా అమ్మ అక్కడే ఉంది. ఆమె వైపు కూడా చూడకుండా ”సర్లే అమ్మాజి! (నన్ను ఇంట్లో అమ్మాజి అని పిలుస్తారు) నీతో వాదించలేను. ఏం చేయను మరి నువ్వు పెట్టించుకోనంటున్నావ్‌’ అంటూ మా వీథి గడపకి బొట్టు పెట్ట్టింది. మా అమ్మకి పెట్టలేదు. ఆమె చేతిలో ఉన్న పసుపు, కుంకుమ పెట్టిన పళ్ళాన్ని ఎగిరి తన్నాలన్నంత కోపమొచ్చింది నాకు. కానీ వాళ్ళంతా మా చుట్టాలు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆవరించి అమ్మవైపు చూడలేకపోయాను. అమ్మకన్నా గడప విలువైందన్నమాట. చెక్కముక్కకి బొట్టు పెట్టొచ్చు కానీ నాన్న లేని అమ్మ ముఖాన పెట్టకూడదన్నమాట. ఈ చెత్త ఆచారాలను భోగి మంటలో వేసి తగలెయ్యాలి. స్త్రీలు తమకు తెలియకుండానే ఎలా పితృస్వామ్య భావాల ప్రభావంలో ఉంటారో, తోటి స్త్రీని అవమానిస్తున్నామనే స్పృహ లేకుండా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో అర్థమయ్యాక వాళ్ళ పట్ల జాలి కలిగింది. చూడడానికి ఇవన్నీ స్త్రీల పట్ల స్త్రీలే దారుణంగా వ్యవహరిస్తున్నట్లు కనబడినా అంతర్లీనంగా ప్రహించేది పితృస్వామ్య భావజాలమే. స్త్రీలందరూ మేము ఈ దుర్మార్గ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం, సాటి స్త్రీలను అవమానించం అని తీర్మానించమనండి… పురుషస్వామ్య, పితృస్వామ్యం బ్రాహ్మణీయ భావజాలం పడగ విప్పుతుంది. విషం కక్కుతుంది. ముత్తైదువులనీ, పునిస్త్రీలనీ, విధవలనీ విడగొట్టి వికటాట్టహాసం చేస్తుంది. మీరు వీటిని వ్యతిరేకిస్తే మీ భర్తలకి అరిష్టం, ప్రాణ నష్టం అంటూ ఊదరగొట్టి, స్త్రీలందరూ అనివార్యంగా సోకాల్డ్‌ ”మంగళసూత్రాల”ను కళ్ళకద్దుకుని తమ క్రూర పద్ధతులను కొనసాగించేలా భయభ్రాంతులను చేస్తారు. భర్తకంటే ముందు చనిపోయిన స్త్రీల కర్మకాండలను పండగలా చేసి కేవలం భర్తలున్న ”సోకాల్డ్‌ సుమంగళు”లనే పిలిచి వారికి పసుపు, కుంకాలు, కానుకలు ఇచ్చి సత్కరించి, భర్తలు లేని స్త్రీలను అత్యంత హీనంగా అవమానించే పరమ నికృష్ట ఆచారమిది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. భర్త లేని స్త్రీని అవమానించే ”సుమంగళి” మొగుడు శాశ్వతంగా బతికి ఉంటాడా? తనకు ఈ దుస్థితి ఎదురుకాక తప్పదని తెలిసీ పురుషస్వామ్యం చేతిలో పాచికలా పనిచేస్తుంది కదా! అదే అత్యంత విషాదం.

నాకు ఎదురైన మరో భయానక అనుభవం. నేనూ, మా పెద్దక్క ఏదో పెళ్ళికి వెళ్ళాం. మా బావ చనిపోయాడు. ఆయన చనిపోకముందు మా అక్క ”పెద్ద ముత్తైదువ” హోదాలో చాలా యాక్టివ్‌గా అన్నింట్లో పాల్గొనేది. అదరూ తనను అన్ని ”శుభ” కార్యాలలో ముందుంచేవారు. మా బావ చనిపోగానే ఆమె దేనికీ పనికిరాకుండా పోవడమే కాక అనేక అవమానాలను ఎదుర్కొంటోంది. నేను పైన రాసిన పెళ్ళిలో పురోహితుడు సోకాల్డ్‌ మంగళసూత్రాలు పట్టుకుని జనంలోకి వచ్చి ”ముత్తైదువుల” మెడలకు తాకిస్తూ మా దగ్గరకొచ్చాడు. నేను నాకు తాకించొద్దని తల అడ్డంగా ఊపాను. నా పక్కనే ఉన్న అక్కకు ఎక్కడ తాకించేస్తాడో అని అక్క పక్క కూర్చున్న ఆమె ”పంతులుగారూ! ఆవిడకి వద్దులెండి” అంటూ కంగారుపడిపోయి తన మెడకి ఆనించుకుంది. నిజం చెప్పొద్దూ… మా అక్కని అవమానించిన ఆ సూత్రాన్ని లాక్కుని నేలకేసి కొట్టాలన్నంత ఆవేశాన్ని ఆపుకుంటూ ఆ పెళ్ళిలోంచి లేచి వెళ్ళిపోయాను. ఇలాంటి పెళ్ళిళ్ళకు వెళ్ళడం మానేసి చాలాకాలమైంది. నేను వెళ్ళడం మానేసినంత మాత్రాన అవమానాలు ఆగిపోతాయని కాదు కానీ ఆ బీభత్సాలను, ఆ అమానవీయ దృశ్యాలను చూసి తట్టుకోలేక గొడవ పడతానేమో అనే భయంతోనే మానేసాను.

నాకు చాలా దగ్గరి స్నేహితుడు ఒకరి తల్లికి జరిగిన అవమానం అతనిని కూల్‌గానే ఉంచింది కానీ నా రక్తాన్ని మరిగించింది. ఆవిడకు నలుగురు కొడుకులు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆవిడ భర్త హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయాడు. చాలా కష్టపడి పిల్లల్ని పెంచి, చదువు చెప్పించింది. అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే కొడుకుల పెళ్ళిళ్ళ సమయంలో ఆవిడ పట్ల ప్రవర్తించిన తీరు ఘోరం. ఆవిడ పెళ్ళి మండపంలోకి రాకూడదట. అక్షింతలు వెయ్యకూడదట. ఆవిడ ఆహుతుల్లో ఒకరిగా కూర్చోడానికి కూడా అర్హురాలు కాదట. పెళ్ళిపందిట్లో ఆర్భాటంగా పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉండిపోయింది. నా ఫ్రెండ్‌ పెళ్ళిలో నేను అతనిని ”మీ అమ్మేది” అని అడిగినపుడు ”అమ్మెలా వస్తుంది. నాన్న లేడుగా” అన్నాడు. ”ఓరి మూర్ఖుడా! నాన్న ఎలాగూ లేడు. అమ్మరావాలి కదా!” అంటే ”భలేదానివే! అలా వస్తే కోడలికి అరిష్టమట. పిన్ని చెప్పింది.” నా కోపం నషాళానికి అంటింది. ”కోడలికి అరిష్టమంటే ఏంటి? నువ్వు చస్తావా?” అందామనుకుని తమాయించుకున్నాను. ఆ తల్లి పడే మానసిక వేదన, అవమానం, దుఃఖం చదువుకున్న మూఢులకు కూడా అర్థం కాకపోవడమే అసలు విషాదం. రాసుకుంటూపోతే ఎన్నో అనుభవాలు ముల్లులాగా గుచ్చుకుంటూనే ఉంటాయి.

వైధవ్యం పేరుతో తరాల తర్వాత తరాలు ఎలాంటి మార్పు లేకుండా భర్తల్ని కోల్పోయిన మహిళల పట్ల అమానుషంగా, అమానవీయంగా ప్రవర్తిస్తూనే ఉన్నాయి. ఆచారాలు, అరిష్టాలు, అశుభాలు, కట్టుబాట్లు లాంటి పడికట్టు పదాలు ఈ స్త్రీల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. మతం, సమాజం, కుటుంబం ఎన్నో అంశాలలో మారుతున్నా, మార్పును ఆహ్వానిస్తున్నా ”వైధవ్యం” అనే పదం పట్ల శిలాజరూపంలోనే ఉండిపోయింది. దీనిని బద్దలు కొట్టాల్సిన అవసరముంది. పితృస్వామ్య భావజాల మత్తులో మహిళలు తోటి మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు, ఆచరిస్తున్న ఘోరకృత్యాల అసలు రూపాన్ని అర్థం చేసుకోవాలి.

స్రీలను ముత్తయిదువులు, విధవలు అంటూ విభజించే క్రూర సంస్కృతికి సమాధి కడదాం… రండి… ఆలోచించండి… వ్యతిరేకించండి…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to ‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు -సత్యవతి

  1. Tejaswi Vunnam says:

    “ఎవరో వేసిన సంకెళ్ళను వారినే వచ్చి తీసివేయమని
    ప్రాధేయపడేకంటే సత్తా పెంచుకొని , వాటిని తామంతట
    తామే చేధించుకోవటం మంచిది”
    …………………………..అంబేద్కర్………….
    ఎప్పుడో ఎవరో విజ్ఞానం నేర్వని మనిషి భర్త చనిపోయాక స్త్రీ ఇలాంటి అవమానం అనుభవించాలి అని పెడితే విజ్ఞానం నేర్చిన ఈ ఆధునిక కాలములో కూడా స్త్రీ ఎదిరించకుండా మౌనంగా భరించడం స్త్రీదే తప్పు. మన మీద మూఢఆచారాలను మనమే తొలగించుకోవాలి. ఈ “వికృత తంతు”ని ఆడవారే దగ్గరుండి మరీ వేడుకలా చేయడం మొత్తం స్త్రీ జాతికే అవమానకరం కాదా?!
    ఇంకొక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనదేశంలో సాంప్రదాయ ముసుగులో కుల, మత వివక్షలు ఉన్నాయి !
    కానీ ఆ వివక్ష ఎదురుకుంటున్న బాధిత వర్గం నుండి తిరుగుబాటు రావడం ఎప్పుడో మొదలైంది ! కాని స్త్రీని “నీవు వితంతువువి”, “ఈ రోజు నీపై అవహేళన జరుపుతాం”, “నీవు అశుభం”, “నీవు ప్రక్కకి ఉండు” అని అనగానే ఆమె ఇది “నా రాత” అని మౌనంగా భరించడమేమిటి?!
    బాధిత వర్గం నుండి కొంచెం అయిన తిరుగుబాటు రాకపోవడం ఏంటి?! ఎన్ని పెద్ద చదువులు చదివి ఉన్నా,ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీలు అయిన కూడా ఈ పరిస్థితి రాగానే బేలగా తలవంచడమేమిటి ?! ఏ స్త్రీకైనా ఈ పరిస్థితి ఎదురైనప్పుడు ఆ స్త్రీ ఎదిరించడం ఒక్కటే కాదు, సాటి స్త్రీలందరూ తనకు అండగా నిలబడాలి. ఎందుకంటే భర్త పోయిన స్త్రీ పైన అలాంటి అకృత్యం సాటి స్త్రీలే ఒక వేడుకలా జరుపుతారు. ఇది ఆడవాళ్ళందరూ చాలా సిగ్గు పడాల్సిన విషయం. ఈ మూర్ఖపు ఆచారంలో మన స్త్రీ జాతి మొత్తము పై వివక్ష, అవమానం ఉంది అని ప్రతి ఒక్క స్త్రీ గ్రహించాలి.
    అలాగే చాలా చోట్ల ఈ విషయంపై మాట్లాడుతున్నప్పుడు స్త్రీకి పసితనంనుండి పూలు, బొట్టు, గాజులు వుంటాయి, భర్తతో కేవలం తాళి, మెట్టెలు వస్తాయి భర్త పోయాక అవి ఒక్కటి తీసివేస్తే సరిపోతుంది అంటారు కానీ అది తప్పు.భర్త చనిపోగానే పూలు,బొట్టు, గాజుల వరకు వుంచి కేవలం తాళి, మెట్టెలు తీసివేయడం కూడా ఆమెని అవమానించడమే . పెళ్ళితో తాళి, మెట్టెలు ధరించాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితాంతం కలిసి ఉంటామనే ఒప్పందం వుంటే చాలు. అయితే స్త్రీ పెళ్ళితో తాళి, మెట్టెలు ధరిస్తానంటే అది ఆమె వ్యక్తిగత ఇష్టం. స్త్రీకి తాళి, మెట్టెలు భర్తతో వచ్చినట్లు కాదు., వివాహంతో వస్తాయి. వివాహంతో వచ్చిన గుర్తులు ఆ వివాహ బంధం రద్దు అయినపుడు తీసివేయాలి కానీ భర్త చనిపోతే తీసివేయడం ఎందుకు? విడాకులతో వివాహ బంధం రద్దు అవుతుంది కానీ భర్త చనిపోగానే ఆ వివాహ బంధం రద్దు కాదు కదా! అలాంటప్పుడు భర్త చనిపోగానే పసితనం నుండి అలంకరించుకున్న వాటితోపాటు, వివాహంతో వచ్చిన అలంకరణ వస్తువులను కూడా ఆమె నుండి దూరం చేయడంతోపాటు, నీవు అశుభం అని ముద్ర వేయడం చాలా హేయమైన చర్య. ఇది సమాజంలో ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.