రైలెక్కేసిన ఆడపిల్ల

పి.సత్యవతి
వేటగాడికి భయపడి వణుకుతూ పరిగెత్తుకొచ్చిన లేడి పిల్లలా ఆ పిల్ల కదులుతున్న రైల్లోని రిజర్వుడ్‌ కంపార్ట్‌మెంట్‌ లోకి ఎక్కేసింది.
”నీ బెర్త్‌ నంబర్‌ ఎంత? ఇది జనరల్‌ కంపార్టెమెంట్‌ కాదు.”, వగైరా అతి మామూలు కంగారుతో పాటు నువ్వొక్క దానివే బయలుదేరావా? ఎక్కడిదాకా? వగైరా భారతీయ ఉత్సుకత దాకా ప్రశ్నలే ప్రశ్నలు. పిల్ల చూస్తే ఇంకా మైనారిటీ తీరనిదానిలా, కాస్త అమాయకంగా, కాస్త నగరానికి దూరంగా ఒ మొస్తరు బస్తీలో పుట్టి పెరిగిన దానిలా వుంది. ఒక జత బట్టలు పట్టె అతి చిన్న సంచీ…ఒక చిన్న పర్స్‌..రైల్లో పడ్డాక కళ్ళల్లో ఇందాకటి బెదురు పోయింది.. చెప్పింది. తను ఇంటర్‌ చదువుతోంది. సెలవుల్లో హైదరాబాద్‌ చూడ్డానికి వెడుతోంది. హైదరాబాద్‌ ఇంతకుముందు వెళ్ళలేదట. ఇదే మొదలు. తెల్లవారు ఝమున దిగి ఒక్కదానివే ఆటో ఎక్కి వెళ్ళగలవా? ఈ మధ్యన కొంతమంది ఆటోవాళ్ళ అఘాయిత్యాలు వినలేదా? లాంటి ప్రశ్నలు, అలా వెళ్ళకు, తెల్లరేదాకా స్టేషన్‌లో వుండి అప్పుడు వెళ్ళులాంటి సలహాల కాస్త ఆ పిల్లలో అసహనాన్ని కలిగించినట్టున్నాయి, అలాగలాగే అంది. తన కోసం స్టేషన్‌కి ఎవరూ వస్తారని చెప్పలేదు.
ఎదుటి సీట్లో కూచున్న ముగ్గురు యువకులు పాపం ఆ పిల్ల దీన స్థితికి చలించిపోయి ఎక్కడికెళ్ళాలో చెపితే తాము దింపుతామని మరీ మరీ చెప్పారు. చెప్పటమే కాదు ఆమెతో సంభాషణ కొనసాగించడానికి అత్యుత్సాహం చూపుతున్నారు. తనెక్కడి కెళ్ళాలో స్పష్టంగా ఆప్లిలకి తెలీనట్టే వుంది. విజయవాడ స్టేషన్‌లో దిగి ఆమె జనరల్‌ కంపార్టెమెంట్‌ ఎక్కేసింది..
సెలవుల్లో హైదరాబాద్‌ చూడ్డానికి వెళ్ళే పిల్లకి ఒక జత బట్టలు చాలా? రాత్రి వేళ ఆమెని రైలెక్కించడానికి తల్లి దండ్రులో అన్నదమ్ములో రాలేదెందుకని? ఆ వయసు పిల్లని వంటరిగా పంపేటప్పుడు సాధార ణంగా తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు చెప్తారు? ఇలాంటి ప్రశ్నల్ని అనాహ్వానిత సహాయన్ని వదిలించుకోడానికి ఆ అమ్మాయి జనరల్‌ కంపార్టెమెంట్‌లోకి పోయిందని అర్ధమైంది. ఎంత అమాయ కంగా కనపడ్డా ఆ పిల్ల కళ్ళల్లో ఏదో అబద్ధం కనపడుతూనే వుంది. తనంత తను నిభాయించుకోగల శక్తి, లోకంలో మెసిలే తెలివితేటలు మొహంలో కనపడ్డం లేదు. అక్కర్లేని ప్రశ్నలు వేసే వాళ్ళని తప్పించు కోటానికి ”నాకోసం మా వాళ్ళు స్టేషన్‌కి వస్తారు లెండి’ అనే అబద్ధం కూడా చెప్పలేదు. హైదరాబాద్‌లో దిగాక ఆటో స్టాండ్‌ దగ్గరగానీ బ్రిడ్జ్‌ మీద గానీ ఎక్కడా కనపడలేదు. ఆ పిల్ల మొహం వెంటాడుతూనే వుందింకా.. ఏమైంది? ఎక్కడికెళ్ళింది? తిన్నగా చేరిందా? అలాంటప్పుడు ”ఎక్కడికెళ్ళాలో చెప్పు. మేం దింపుతాం” అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోయం.!!! ఒక వేళ మేం అట్లా వెంబడిస్తామని మమ్మల్ని తప్పించుకు పోయిందా? ఆ పిల్ల ఏమొ దాస్తోందని అందరికీ తెలుసు.. ఎంత గడుసుగా ఉందా మని ప్రయత్నించినా కళ్ళల్లో అమాయకత్వం దోబచులాడుతూనే ఉంది…
అమ్మతో నాన్నతో తగాదాలాడి, స్వంతంగా బ్రతుకుదామని వెడుతోందా? ప్రేమలో పడి ప్రియుడ్ని కలవడానికి వెడుతోందా? ఇష్టం లేని పెళ్ళి తప్పించుకు పారిపోతుందా? చాలా మంది గొప్ప నటుల దర్శకుల అనుభవాలు చదివేసి, సినిమాల్లో, టీవీల్లో నడించడానికి వెడుతోందా? వాళ్ళల్లాగా ఎక్కడో అక్కడ ఉండి, ఏదో ఒక పని చేసి, టీ కప్పులు కడిగయినా చివరికి గొప్ప తారగా వెలుగొంది వాళ్ళలాగే పత్రికల వాళ్ళకి తను ఎలా ఒక వంద రూపాయలతో హైదరాబాదొచ్చేసి అష్టకష్టాలు పడి పైకొచ్చిందో గర్వంగా చెప్పడాన్ని ఊహించు కుంటూ వెడుతోందా? ఇంట ికొచ్చాక కూడా ఆ పిల్ల అమాయకపు మొహం వెంటాడుతూనే ఉంది…
ఒంటరిగా చిక్కిన ఆడపిల్ల నోరూరంచే తాయిలమని తెలీని పిల్ల అయితే మనం ఆమెని మళ్ళీ ఎక్కడ చూడాలి? రైలు కట్ట పక్కన అనాధ శవంగానా? ఎర్రదీపాల క్రీనీడల్లోనా?
నువ్వు మరీ అతిగా ఆలోచిస్తున్నా వేమొ! నిజంగా ఆ పిల్ల సెలవులకి హైదరాబాద్‌ వెడుతోందేమొ!!! ఇంకా ఆడపిల్లలు నువ్వకున్నంత అమాయకంగా లేరేమొ!!అని నన్ను నేను కాసేపు ప్రశ్నించు కుని సమాధానాలు చెప్పుకుని ఆ పిల్ల అమాయకపు కళ్ళనించీ తప్పించుకున్నాను. కానీ ఒక ఆడపిల్ల ఇట్లా రైలైక్కేసి, తన జీవితాన్ని తను నిర్మించుకోడాన్ని ఇప్పట్లో మనం కలగనగలమా? కనీసం కలలోనైనా ఇది సాధ్యం అవుతుందని నమ్మగలమా? కలలు కనేముందు వాళ్ళని ఎలా పెంచు తున్నామొ ఒక్కసారి తరచి చూసుకుని ఉలిక్కిపడగలిగినా చాలు.

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.