”మా వూరి ముచ్చట్లు” చెప్పిన పాకాల యశోదారెడ్డిది మా ఊరు కావడం నా పూర్వజన్మ సుకృతం. ఈమె 08.08.1929 నాడు సరస్వతమ్మ వొనకల్లు కాశిరెడ్డి దంపతులకు జన్మించింది. వీరి స్వగ్రామం ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి. స్త్రీ విద్యకు ప్రోత్సాహం లేని కాలం అది. అంతేకాదు ఈ ప్రాంతం నిజాం ప్రభువుల ఆధీనంలో ఉండి, విద్యకు ఆదరణలేని కాలంలో చదువును కొనసాగించారు. స్వయంకృషితో చదివి తెలుగు సాహిత్య చరిత్రలో తన ముద్రను వేసుకోవడంలో తన నిరంతర కృషి ఎంతో దాగి ఉంది.
”పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అనే నానుడిని నిజం చేస్తూ చిన్ననాటి నుండే కథలు, వ్యాసాలు రాశారు. ఈ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి ప్రోత్సాహంతో హైదరాబాదులోని మాడపాటి హనుమంతరావు పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర విద్య తెలుగును 1955లో, సంస్కృతంను 1962లో పూర్తి చేశారు. 1955లో అధ్యాపక వృత్తిని చేపట్టి 1987లో పదవీ విరమణ చేశారు. ”తెలుగులో హరివంశములు” అనే అంశముపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1989లో డాక్టరేట్ పట్టా పొందారు. పూర్వ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా 1990 నుండి 1993 దాకా తన సేవలను అందించిన తొలి మహిళ కావడం విశేషం.
అంతర్జాతీయ చిత్ర కళారంగంలో ప్రసిద్ధుడైన పాకాల తిరుమల రెడ్డిని 1947లో వివాహమాడారు. వీరిరువురు తమ తమ రంగాలలో పై కెదగడానికి ఒకరికొకరు సహకరించుకుంటూ సాహిత్య, చిత్రకళల అపూర్వ సంగమంగా గోచరించింది. నారాయణగూడలోని వారి నివాస భవనం (సుధర్మ) వారి కళాభిరుచికే గాక సాహిత్య చర్చలకు కూడా నిలయంగా నిలిచింది.
వీరిద్దరి విదేశీ పర్యటన సందర్భంగా 1976లో ”భారతీయ చిత్రకళా గ్రంథం” వెలువరించింది. భర్త మరణానంతరం పి.టి.రెడ్డి స్మారక పురస్కార నిధిని ఏర్పాటు చేసి తన ఔన్నత్యాన్ని చాటుకొన్నారు.
తెలంగాణ జీవనస్థితులను తన కథలలో నిక్షిప్తం చేసినటువంటి అగ్రశ్రేణి కథా రచయిత పాకాల యశోదారెడ్డి. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకొన్నారు. ”మా వూరి ముచ్చట్లు” కథా సంపుటిలో 1920-40 నాటి తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రిస్తుంది. ”ఎచ్చమ్మ కథలు” 1950-70ల నాటి తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు. ”ధర్మశాల” కథా సంపుటి 1980-90ల నాటి తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులకు దర్పణం వంటిది. యశోదారెడ్డి పౖౖె మూడు కథా సంపుటాలు తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి, సామాజిక జీవితానికి నిదర్శనంగా ఉండేటట్టు అక్షరబద్ధం చేసి అందించారు.
యశోదారెడ్డి విమర్శనా ప్రతిభకు నిదర్శనమైన గ్రంథాలు కావ్యానుశీలనం, ఎర్రాప్రగడ, తెలుగులో హరివంశములు, పారిజాతాపహరణ పర్యాలోచనం, ఆంధ్ర సాహిత్య వికాసం, భాగవత సుధ, భారతంలో స్త్రీ మొదలైనవి. కావ్యానుశీలనం విమర్శనా గ్రంథంలో ఎం.కులశేఖరరావు మూడు వ్యాసాలు, యశోదారెడ్డి రాసిన నాలుగు వ్యాసాల సంకలనం ఇది. ఇందులో యశోదారెడ్డి గారు ఉత్తర హరివంశంలోని సామెతలు, జాతీయాలు, సొగసును వివరించారు. పాండురంగ మహత్మ్యంలోని పుండరీకుడు నిగమశర్మ కథలలో రామకృష్ణుడు కనబరచిన ప్రజ్ఞావిశేషాలు వెల్లడించారు. కవయిత్రులైన మొల్ల, రంగాజమ్మ, ముద్దు పళని కావ్యాల విశేషాలను సమకాలీన ప్రభావ నేపథ్యంలో విశ్లేషించారు. ఎర్రన, నంది తిమ్మనలపై ప్రత్యేక గ్రంథాలు కూడా ఆమె విమర్శనా పటిమకు తార్కాణాలు.
నిరంతర పరిశోధనకు కొనసాగింపుగా నేమాని భైరవకవి ”ఉత్తర హరి వంశమును” వెలుగులోకి తేవడమే కాక, సాహిత్య అకాడమీ ప్రచురించిన నాచన సోమన ”ఉత్తర హరివంశానికి” వివేచనాత్మకమైన విపుల పీఠికను సమకూర్చారు. పారిజాతాపహరణం, రుద్రభట్టు కన్నడ కావ్యం జగన్నాథ విజయానికి అనువాదం అన్న దురభిప్రాయాన్ని ఖండించి రెండింటికి సంస్కృత హరివంశమే మూలమని నిరూపిస్తూ ”పారిజాతాపహరణ పర్యాలోచనము” రాశారు. యుగ యుగాలుగా ఉన్న స్త్రీ సమస్యలను స్త్రీ వాద దృక్కోణం నుంచే కాక పూర్వాపర సంబంధ పూర్వకంగా స్త్రీ పురుషుల మధ్య తలెత్తే సమస్యలను ”భారతంలో స్త్రీ” అన్న రచనలో నిష్పక్షపాతంగా చర్చించారు.
”ఉగాదికి ఉయ్యాల”, ”భావిక” అనే వచన కవితా సంపుటాలు ఆమె భావనాశక్తికి గీటురాళ్ళు. ”దేశమంటే మట్టి కాదోయ్” అని గురజాడ అంటే ”మట్టి మనుషులు రెండోయ్” అంటూ మట్టిమీద ఉన్న మమకారాన్ని చాటారు. రచ్చబండ, నాగి, నందిని, పరివ్రాజక దీక్ష మున్నగు నాటికలు, చిరుగజ్జెలు మున్నగు బాల సాహిత్య రచనలు ఆమె కలంనుండి జాలువారినవే. ఇవేకాకుండా ఈమె ఇతర రచనలు కథా చరిత్ర, అమరజీవులు, నారదీయం, ద్విపద వాఙ్మయం, ప్రబంధ వాఙ్మయం. వీరు పరిశోధనా పటిమ గల వ్యాసాలెన్నో రాశారు. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం ”మహాలక్ష్మి ముచ్చట్లు” ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది యశోదారెడ్డి తిరుమలరెడ్డి పేర తెలంగాణ ముచ్చట్లుగా ప్రసారమైంది.
అటు వక్తగా, ఇటు రచయిత్రిగా తనదంటూ స్థానం నిలుపుకున్నారు. కంచి కామకోటి పీఠంలో ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారు. దివాకర్ల వెంకటావధానితో సహాయ ఆస్థాన వక్తగా సాహిత్య అకాడమీ, ఆంధ్ర సారస్వత పరిషత్తులో పాల్గొనడం, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా పనిచేయడం జరిగింది.
యశోదారెడ్డికి సంస్కృతం, ఉర్దూ, జర్మన్, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పరిచయం ఉంది. వీరు 25 గ్రంథాలు రాశారు. దక్కన్ రేడియో ద్వారా వందకు పైగా కథలు, నాటికలు, సాహిత్య ప్రసంగాలు, కవితలు అందించారు. తెలంగాణ బాస, యాస ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అసలు సిసలైన తెలుగు భాషా రుచిని ఆస్వాదించాలంటే తెలంగాణ తెలుగును వినమని, చదువమని చెబుతుండేవారు. నాగరికతా ముసుగులో కనుమరుగైపోతున్న మన భాషా సంపదను భద్రపరచుకోవాలన్న తాపత్రయం ఆమె అడుగడుగునా కనిపించేది.
యశోదమ్మ ప్రతిభకు గుర్తింపుగా ఆగ్రా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇంకా నాళం కృష్ణారావు అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి అవార్డు మున్నగు సత్కారాలు పొందారు.
పలు భాషల్లో ప్రావీణ్యం పొంది, అగ్రశ్రేణి కథా రచయిత్రిగా, మహావక్తగా, ఉత్తమ విమర్శకురాలిగా పేరు పొందిన సరస్వతి మూర్తి యశోదమ్మ అనారోగ్యంతో తన 78వ యేట 08-10-2007న స్వర్గస్థులైనారు.
ఎస్. గాయత్రి