కె.సుధ
ప్రేమ పేరిట ఆడపిల్లల హత్యలు, ఆత్మహత్యలు ఇటీవల కాలంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగా ప్రచారమవు తున్నాయి. ఇదివరకటి కంటే నిజంగా ఈ నేరాల సంఖ్య పెరిగిందా లేదా మీడియా వీటిని వెలుగులోకి తేవడం మాత్రమే పెరిగిందా అనేది అధ్యయనం చేసి నిర్ధారణకు రావలసిన అంశం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు టీవీ ఛానల్స్ రోజుల తరబడి ప్రసారం చేస్తూ పోతుంటే ఒకర్ని చూసి మరొకరు నేర్చుకునే ప్రమాదం మటుకు ఉంది. విజయవాడలో మీనాకుమారి మెడని కోసిన మర్నాడే విశాఖపట్నంలో వరలక్ష్మిపై బ్లేడులతో దాడి జరిగింది. భయానక దృశ్యాలను పదే పదే ప్రసారం చేయడంతోపాటు ఒక టీవీ ఛానల్ కొంచెం ముందుకి వెళ్ళి దీనికి ‘కోతల సీజన్’ అనే శీర్షిక కూడా పెట్టేసింది. ప్రతి టీవీ ఛానల్ నేరాలు ఘోరాలంటూ ఒక కార్య క్రమం తప్పకుండా ప్రసారం చేస్తుంది.
కాని తప్పంతా మీడియపై నెట్టేద్దామా?
ప్రేమ ఫలించని కారణంగా స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి సంఘటనలు సమాజంలో ఎప్పుడ జరుగు తూనే ఉన్నాయి. ఇదివరకు అవి లా జర్నల్స్ కే పరిమితమయ్యేవి. ఇప్పుడు మీడియ ప్రభావం పెరిగింది కనుక నిమిషాల మీద మన దృష్టికి వస్తున్నాయి. ‘ప్రేమొన్మాదం’ పేరు మీద చర్చ మన ముందుకి వచ్చింది కనుక ప్రేమ, జీవితం తదితరాలను నేటి యువతరం అర్థం చేసుకుంటున్న పద్ధతి, వాళ్ళ తల్లి దండ్రులు, సమాజం ఎదుర్కొంటున్న సమస్య లను ఈ వార్తల ఆధారంగా అర్థం చేసుకోడా నికి ప్రయత్నిద్దాం.
ఇన్నేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో ప్రేమ ఇతివృత్తంగా లేని సినిమాలను వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. ఒక్కో సినీనిర్మాత – దర్శకుడి చేతిలో ఆ రెండు అక్షరాల పదం ఎన్ని వంకర్లు తిరగాలో అన్ని వంకర్లు తిరిగింది. ప్రేమంటే స్త్రీని లైంగిక వస్తువు (ఐలిని ళిలీశీలిబీశి) కింద జమకట్టెయ్యడం ఎక్కువ సినిమాల్లో జరిగే వ్యవహారం. సినిమా అందరికీ అందుబాటులో ఉండే మాధ్యమం కాబట్టి అందరూ వీటికి ప్రభావితులౌతారు.
ప్రేమ పేరిట ఇటీవల జరుగుతున్న హత్యలు ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితం కాలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జనవరి వరకు కృష్ణా జిల్లాలో 8, అనంతపురం 4, కరీనంగర్ 2, నల్గొండ 1, చిత్తరు 1, గుంటరు 1, శ్రీకాకుళం 1, విశాఖపట్నం 1, పశ్చిమ గోదావరి 1, ప్రకాశం 1, హైదరాబాద్ 3, ఆదిలాబాద్ 1 చొప్పున దాడులు నవెదయ్యయి.
అన్ని విషయాల్లో ‘ముందు’ ఉన్నట్టే ఈ విషయంలో కూడా కృష్ణా జిల్లా ముందుంది. విద్యా సంస్థలు ఎక్కువ ఉండటమే దీనికి కారణమని స్థానికుల అభిప్రాయం. 80 వ దశకం వరకు ఈ జిల్లా విద్యార్థులు చదువుల నిమిత్తం గుంటూరు, హైదరాబాద్‌లకు వలస వెళ్ళేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎంసెట్, ఐఐటి, కోచింగ్ బాగా ఇస్తాయని విజయవాడ ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలలు బాగా పేరు గడించాయి. గత రెండు దశాబ్దాల్లో విజయవాడ నిండా రెసిడెన్షియల్ కళాశాలలు పుట్టలు పుట్టలుగా అవతరించాయి. ఈ కళాశాలల ధ్యేయమల్లా విద్యార్థుల మెదళ్ళలో ఎంసెట్‌లో వచ్చే ప్రశ్నలకు జవాబులు చొప్పించడమే. ప్రతి నిమిషం ‘విలువైనదే.’ విద్యార్థుల బుర్రల్లో నిమిషానికి నాలుగు బిట్లు చొప్పించేద్దాం అనుకుంటున్నారు. అందరూ ఇదే పరుగులో ఉన్నారు. మనమూ ఈ దారిలోనే పోకపోతే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందేమొనని భయపడి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ కళాశాలల్లో భర్తీ చేస్తున్నారు.
పదిహేను పదహారేళ్ళ ప్రాయంలో పిల్లలు ఎన్ని రకాల మానసిక ఉద్వేగాలకు గురవుతారో పెద్దవాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరికీ అది స్వానుభవమే. ప్రతి వ్యక్తికి ఆ దశ అలజడితో కూడుకున్నదే. పెద్దవాళ్ళ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి అది తొలిమెట్టు. కెరియర్ ఎంచుకోడానికి అది ఒక కీలకమైన సమయం. వీటికి తోడు అదే సమయంలో శరీరంలో మార్పులు, ఆలోచనల్లో మార్పు వచ్చే కాలం. ఈ శారీరక మార్పులు, మానసిక మార్పులను అర్థం చేసుకోవడానికి పిల్లలకి కొంత వ్యవధి కావాలి. ఈ మార్పుల గురించి వాళ్ళకి తలెత్తే సందేహాల్ని తీర్చే పెద్దవాళ్ళు ఉండాలి. మన సమాజంలో లైంగికత్వం గురించి బాహాటంగా మాట్లాడ్డం ఇప్పటికీ తప్పే. కనుక తల్లిదండ్రుల దగ్గర తమకొచ్చే సందేహాల్ని తీర్చుకోలేరు. పిల్లలతో ఈ విధమైన విషయలు మాట్లాడే తల్లిదండ్రులు మహా అరుదు. విద్యాసంస్థల సంగతి సరేసరి. ఎక్కువ మంది చదివేది రెసిడెన్షియల్ కళాశాలల్లోనే. అక్కడ సిలబస్‌కి కుట్టబడి పాఠాలు చెప్పడం మినహా మరో విషయం ప్రస్తావించరు. ఇక తమ ఆలోచనలను బిడియపడకుండా వ్యక్తపర్చగలిగేది తమ తోటి విద్యార్థులు, స్నేహితులతోనే. వీళ్ళందరూ పొందే ఉమ్మడి జ్ఞానం సినిమా, ఇంటర్‌నెట్, బూతుసాహిత్యం. ఖాళీ సమయల్లో ఏం చేస్తారని ఒక రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థిని అడిగితే ‘బూతు పుస్తకాలు చదువుతాం, ఎదుటి కాలేజీలో చదివే అమ్మాయిల గురించి కామెంట్ చేస్తాం’ అని చెప్పాడు.
ఇంటర్‌నెట్ సెంటర్లు అన్ని ఊర్లలో వెలిశాయి, ఇంటర్‌నెట్ కెఫేలు ఎప్పుడ యువతీ యువకులతో కిటకిటలాడుతూ ఉంటాయి. వీటిని ఉపయెగించడానికి కొంత అక్షర జ్ఞానం, కంప్యూటర్ ఆపరేట్ చేసే జ్ఞానముంటే చాలు. ఇది ఎటువంటి నియంత్రణ లేని మాధ్యమం. పోర్నోగ్రఫీని ప్రోత్సహించే వెబ్‌సైట్‌లు కోకొల్లలు. వాటిని చిన్నపిల్లలు కూడా నిరాటంకంగా చూసే అవకాశం ఉంది. ఇళ్ళల్లో స్వంత కంప్యూటర్లు ఉన్న వారిపై అప్పుడప్పుడైనా తల్లిదండ్రుల నియంత్రణ ఉంటుంది. ఇంటర్‌నెట్ కెఫేల్లో అటువంటిది కూడా ఉండదు. యువతకు అందుబాటులో ఉన్న మరో సౌకర్యం సెల్‌ఫోన్లు. అర్ధరాత్రిళ్ళు పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక, వాళ్ళని అరికట్టలేక తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదు. తల్లిదండ్రుల్లో ‘స్ట్రెస్’, ‘డిప్రెషన్’ పెరగడానికి ఇదొక కారణం అనుకోవచ్చు. ‘ప్రేమొన్మాదం’ మాదిరే ‘స్ట్రెస్’ కూడా ఇటీవల కాలంలో బాగా వాడకంలో ఉంటున్న పదం. నియంత్రణ లేని ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం, తద్వారా వారికి ప్రాప్తించే జ్ఞానంవల్ల ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకి, పిల్లలకీ మధ్య టెన్షన్స్ పెరుగుతున్నాయి. తరానికి తరానికి మధ్య అంతరాలు ఎలాగూ ఉంటాయి. కాని ఈ సాంకేతిక ‘పరిజ్ఞానం’ ఆ అగాధాన్ని మరింత పెంచుతోంది. ఫలితంగా తమ బిడ్డల్ని తామే పోల్చుకోలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటున్నారు.
మితిమీరిన ఇంటర్‌నెట్ వాడకం వల్ల మరో ప్రమాదం కూడా తలెత్తుతోంది. యువత యంత్రాన్ని అర్థం చేసుకున్నంత బాగా మనుషులను అర్థం చేసుకోలేకపోతున్నారు. కంప్యూటర్ మనం ఏ కమూ౦డ్ ఇస్తే అది చేస్తుంది. మనం ఏ టీవీ ఛానల్ పెట్టుకోవాలో మన చేతిలోని రిమొట్ చెబుతుంది. మానవ సంబంధాలు అలా కాదే? ఏకపక్షంగా మానవ సంబంధాలను నిర్మించుకోదలచినప్పుడే ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకునేది. మీట నొక్కితే పలికినట్టు మనుషులను పలకమంటే ఎలా? ఒకే కార్యక్రమం ఏకాగ్రతతో చూస్తూ టీవీ ఛానల్ మార్చకుండా ఎవరైనా చూస్తున్నారా? చూద్దామన్నా మధ్యలో వ్యాపార ప్రకటనలు ఏకాగ్రతను భగ్నం చేస్తాయి. మనుషుల కంటే టీవీతో ఎక్కువ కాలం సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లల్లో కుదురు, ఏకాగ్రత, ఓర్పు ఎక్కడ నుంచి వస్తాయి? టీవీ రివెట్ ఛానల్స్ వర్చినంత సులువుగా జీవన దృశ్యం వరిపోదుగా. అక్కడే మొదలవుతుంది అసహనం.
పోర్నోగ్రఫీ, లైంగిక స్వేచ్ఛల పట్ల వైఖరి తీసుకోవడంలో మానవ హక్కుల ఉద్యమం ఎప్పుడ ఇబ్బంది పడుతూనే ఉంది. మహిళా ఉద్యమంలో కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయం లేదు. పోర్నోగ్రఫీని నిషేధించాలి అనే వారి దగ్గర నుంచి అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని సమర్థించే వారు వరకు ఉన్నారు. అశ్లీలతకు నిర్వచనం ఏమిటి అనే దగ్గర మొదలువుతుంది పేచీ, ఒకరికి అశ్లీలం అనిపించింది మరొకరికి కాదు. డ్రెస్ కోడ్ వల్ల ఇరాన్, టర్కీ వంటి దేశాల్లో స్త్రీలు ఎన్ని అవస్థలకి, అణచివేతకి గురవుతున్నారో చదువుతూనే ఉన్నాం. ఖొమైనీ లాంటి వారికి స్త్రీలు బురఖా తొడుక్కోకపోవడం అశ్లీలం. అంతెందుకు మన రాష్ట్రంలో 1980లలో ఈదర గోపీచంద్ గారి సారథ్యంలో నడిచిన ‘అశ్లీలత వ్యతిరేక పోరాట కమిటీ’ ఓల్గా తర్జువ చేసిన కొల్లంటాయ్ నవల ‘మూడు తరాల’ను నిషేధించాలనే తీర్మానం ప్రవేశపెట్టింది. ఇలాంటి చర్యలు భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం. అలాని స్త్రీని లైంగిక వస్తువుగా చూపించడాన్ని చూసీ చూడనట్టు పోవాలా? ఇప్పుడు అది మన రాష్ట్రంలో స్త్రీల మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితిని సృష్టించింది. ఈ విషయంలో వివిధ హక్కుల మధ్య ఏర్పడ్డే వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాలో, విభజన రేఖ ఎక్కడ గీయలో ఆలోచించాలి.
ఆడపిల్లల మీద దాడులు జరగడానికి ఇంటర్‌నెట్టే కారణం అనుకుందామా అంటే అది అందుబాటులో ఉన్న చదువుకున్న కుర్రకారే వీటికి పాల్పడటం లేదు. గ్రామాల్లో కూడా ఈ దాడులు జరుగుతున్నాయి.
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని మామిడాలకు చెందిన కొత్తపల్లి తిరుమలేశ్ కూలిపని చేసుకుని బతుకుతున్నాడు. తాను ప్రేమించిన ఇంటర్ విద్యార్థిని ప్రేమలత పెళ్ళికి ఒప్పుకోలేదని గత ఏడాది డిసెంబరు 27న ఆమె మీద గొడ్డలి, రోకలి బండతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.
కరీంనగర్ ఇందిరానగర్‌కి చెందిన కొండయ్య ఆటోడ్రైవర్. అదే ఊరికి చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రియా౦క (17)ని ప్రేమించాడు. మూడు నెలల పాటు వెంటపడినా ఆ అమ్మాయి పట్టించుకోవడం లేదని గత ఏడాది డిసెంబరు 22న కొబ్బరి బోండాల కత్తి తీసుకుని ఆ అమ్మాయి మీద దాడి చేశాడు.
హనుమాన్ జంక్షన్ అప్పనవీడు నివాసి సృజని (22) మండపల్లిలో ఉద్యోగం చేస్తోంది. గుడివాడకు చెందిన లారీడ్రైవర్ నానీ ప్రేమిస్తున్నానని గత కొద్ది కాలంగా ఆమె వెంటపడుతున్నాడు ఆమె తిరస్కరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె లెక్క చేయకపోవడంతో గత ఏడాది అక్టోబరు 4 రాత్రి ఆటోలో ఆమె ఇంటికి వెళ్ళి ఆసిడ్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో సృజని తల్లి, అక్క, బావ, చెల్లి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఒకామె 9 నెలల గర్భిణి.
ప్రేమని పూజించే పేరుతో జీవితాన్ని ఎంత అలుసుగా తీసుకుంటున్నారు ఈ యువకులు. ‘ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే మెదడులో కెమికల్ రియాక్షన్ జరిగి ఏం చేస్తున్నారో వారికే తెలియదు’ – ఒక 20 ఏళ్ళ ఫార్మసీ విద్యార్థి ఇటువంటి దాడులకు ఇస్తున్న విశ్లేషణ అది. ‘నో’ అనే మాటని అంగీకరించడం చాలా కష్టమని ఒక రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థి భావన. ఈ దాడులన్నిటికీ ఒక ఉమ్మడి సంజాయిషీ తయారైపోతోంది. పిల్లలు రకరకాల తిరస్కారాలకు గురవుతున్నారు. అందర్నీ ఇలాగే నరికి పోగులేస్తున్నారా అంటే అన్ని పరాభవాలు తట్టుకోగలిగినా ఆఖరుకి అమ్మాయి కూడా తిరస్కరించిందే అనేది మింగుడు పడని విషయమేమొ. ఈ విషయంలో మటుకు సనాతనంగా ఆలోచిస్తున్నారు. అలాని ఆధునికతకు పూర్తిగా దూరంగా ఉన్నారా అంటే అదీ లేదు.
ఇవాళ స్కూల్ దశలోనే ఆడ మగ పిల్లల మధ్య ఎఫైర్స్ సర్వసాధారణమైపోయాయి. ఈ ఎఫైర్స్‌లో ఏ రకమైన కమిట్‌మెంట్ కూడా ఉండటం లేదు. నాలుగు రోజులు సరదాగా గడపడమే ఉద్దేశం అంతే. ఈ విషయలేవీ తల్లిదండ్రులకి తెలియకుండా జరిగి పోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఒకవేళ వారికి తెలిసినా నలుగురికి తెలిస్తే పరువుపోతుందని వారూ గుట్టుచప్పుడు కానివ్వడం లేదు, పాశ్చాత్య దేశాల్లో మాదిరి డేటింగ్ విధానాన్ని హర్షించే స్థితిలో పెద్ద వాళ్ళు లేరు. వారికి అది మింగుడు పడని విషయం. అందుకే పాశ్చాత్య డేటింగ్ విధానంలో పిల్లల యొగక్షేవలను కాపాడుకునేందుకు ఉన్న రక్షక చర్యలు మనకి కొరవడ్డాయి. ఈ చర్యలు పెద్ద వాళ్ళ ఆమొదంతో చేసేవి కాదు కనుక వాటిని గోప్యంగా ఉంచడం వల్ల కూడా ఆడప్లిలకి ఈ విషయంలో అందాల్సిన సహకారం అందటం లేదు.
ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ దాడుల్లో చాలా సందర్భాల్లో నేరస్తుడికి బాధితురాలు పరిచయస్తురాలు. గతంలో ప్రేమించి నిరాకరించినామె. తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడమొ, లేక ఆ అమ్మాయే మనసు మార్చుకోవడమొ ఈ దాడులకు కారణాలుగా చూపుతున్నారు.
గుంతకల్లుకి చెందిన వెంకటరమణ ఎమ్.బి.ఏ, రాజేశ్వరి బి.ఇడి చదువుతున్నారు. ఇంటర్‌లో కలిసి చదువుకున్నారు. ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు వారి పెళ్ళికి ఒప్పుకోలేదు. రాజేశ్వరి అతనికి దూరమైంది. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో గత ఏడాది డిసెంబరు 10న పరీక్ష రాయడానికి వెళ్ళింది. పరీక్షా కేంద్రంలో ఉండగా పసుపుతాడు ముందుగానే ముడివేసి వెంకటరమణ ఆమె మెడలో వేయబోయాడు. విద్యార్థులు అధ్యాపకులు కలిసి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకి అప్పగించారు.
వెంకటపతిరాజు, ఐశ్వర్యుల ఉదంతం ఇంత సులువుగా అంతమవ్వలేదు. సినీనిర్మాత శాఖమూరి పాండురంగారావు ఇంట్లో కడపజిల్లా రాయచోటికి చెందిన డి. వెంకటపతిరాజు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇంటర్ చదువుతున్న పాండురంగారావు కూతురు ఐశ్వర్య వెంకటపతి రాజు ఒకరినొకరు ఇష్టపడి ఇంటి నుంచి పారిపోయి జంషెడ్‌పూర్ వెళ్ళిపోయారు. పోలీసులు కేసు నమొదు చేశారు. 20 రోజుల తర్వాత ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఐశ్వర్య గత ఏడాది డిసెంబరు 10న ట్యూషన్‌కి వెళ్తుండగా వెంకటపతిరాజు తన ఒంటిపై పెట్రోలు పోసుకుని అంటించుకుని ఐశ్వర్యను కౌగిలించుకోబోయాడు. (అతని మీదే ఎవరో పోశారని మరో కథనం) ఇటువంటి సంఘటనలు చదువుతుంటె ఎంత బాధకు గురైనా అవి సినిమా స్క్రిప్ట్‌లను తలపించక మానపు.
రాజేశ్వరి (25) విషయనికొస్తే – అప్పటికే ఒకసారి ప్రేమ పేరుతో మొసపోయింది ఆ అమ్మాయి. జూనియర్ ఆర్టిస్టు శివకుమార్ (28)తో మరోసారి అనుబంధం ఏర్పడింది. పెళ్ళి చేసుకోమంటే కలిసి గడపడానికి అభ్యంతరం లేదు కాని పెళ్ళి చేసుకోనన్నాడు. గత ఏడాది డిసెంబర్ 19న ఇద్దరూ కలిసి హివయత్‌సాగర్ వెళ్ళారు. మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెస్తే తిరస్కరించాడు. అలాంటప్పుడు చంపెయ్యమని వేడుకుందట. అతను మెడకి చున్నీ బిగిస్తే అడ్డుచెప్పలేదు. చున్నీని మరింత బిగించి చంపేసి కట్టపై నుంచి చెట్ల పొదల్లోకి నెట్టేసి చీకట్లో ఇంటికి వెళ్ళి పోయాడు. ఇలా జరిగిందని అతనే తర్వాత పోలీసులకి సరండరై పోయి శవాన్ని చూపించాడట.
కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన రోటపాడు పద్మశ్రీ (18)కి విస్సన్నపేటకు చెందిన ఇనపసరి కరుణబాబుకి పెద్దలు పెళ్ళి నిశ్చయించారు. అందుకు పద్మశ్రీ అంగీకరించలేదని అతను గత ఏడాది ఆగస్టు 16న కత్తితో నరికి చంపాడు.
అనంతపురం జిల్లా పెద్దాపురం మండలం చాగల్లుకి చెందిన ఇంటర్ విదార్యర్థిని అనితకి (16), సోమశేఖర్ (18)తో గత రెండేళ్ళుగా పరిచయం. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు మందలించేసరికి అనిత అతనికి దూరమైంది. ఇంటి నుండి పారిపోదామని అతను వత్తిడి తెస్తూనే ఉన్నాడు. గత ఏడాది నవంబరు 10న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి కత్తితో ఆమె గొంతు కోసేశాడు.
ఆమె కాదన్నా, అతను కాదన్నా, తల్లిదండ్రులు కాదన్నా ముప్పు వాటిల్లుతున్నది మాత్రం అమ్మాయిలకే. అయితే అక్కడక్కడా ప్రేమ పేరుతో మగపిల్లల్ని వేధించిన కేసులు కూడా పత్రికల్లో వెలువడ్డాయి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పదో తరగతి చదువుతున్న శివప్రసాద్‌రెడ్డిని అతని సహాధ్యాయిని ప్రేమించింది. కాని అతను తిరస్కరించే సరికి ఆమె గత ఏడాది డిసెంబరు 8న రెండు చేతుల్ని, గొంతును బ్లేడుతో కోసింది. పదో తరగతిలో ప్రేమేంటి? గొంతులు కోయడాలేమిటి?
విజయవాడలో ఇంజనీరింగ్ నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తనను ప్రేమించమని, పెళ్ళి చేసుకోమని పదే పదే వెంటబడుతోందని ఆమె తోటి విద్యార్థి గత ఏడాది జులై 6న పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.
పాతిక ముప్పయి సంవత్సరాల వారికి కాస్త మానసిక పరిపక్వత వస్తుందనుకుంటాం. అలాంటి వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో డిగ్రీ చదువుతున్న కల్పనపై ఒకప్పటి ఆమె అధ్యాపకుడు సిడిపల్లి దామొదర్ గత ఏడాది నవంబరు 2న యాసిడ్ పోశాడు. ప్రకాశం జిల్లా పర్చరు మండలం నాగులపాలేనికి చెందిన హిందీ పండిట్ దేవరకొండ ఆంజనేయులు (29) ఇంటర్ విద్యార్థిని దిల్‌షాద్ బేగం (16) తనని తిరస్కరించిందని గత ఏడాది అక్టోబరు 15న హతమార్చాడు.
ఏడాది నుంచి వెటపడుతున్నా తమకు ఫిర్యాదు ఇవ్వలేదేమని మీనాకుమారి కుటుంబీకులను మందలించిన పోలీసులు ఫిర్యాదు ఇచ్చిన కేసుల్లో ఏపాటి చర్యలు తీసుకున్నారు? విజయవాడ శ్రీలక్ష్మి స్వయంగా పోలీసులకు మొరపెట్టుకున్నా ఫలితం దక్కని విషయం తెలిసిందే.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని పశుబొట్ల పాలెంకి చెందిన చిట్టిబొమ్మ మహాలక్ష్మి (18)ని కమ్మిలి సత్యనారాయణ ఆరు నెలలుగా వేధిస్తున్నాడని ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై తిరిగి సత్యనారాయణ కేసు పెట్టాడు. పోలీసులు ఏమీ చేయలేదు. మహాలక్ష్మిపై వేధింపులు కొనసాగాయి. తట్టుకోలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. నాలుగు రోజులకి చనిపోయింది. పోలీసులు సకాలంలో చర్య తీసుకుంటే మహాలక్ష్మి చనిపోయేదా?
మెదక్ జిల్లా గజ్వేల్‌కి చెందిన తోగటి విద్యాసాగర్ ఉపాధి కోసం కుటుంబ సమేతంగా కరీంనగర్ వలస వెళ్ళాడు. తొమ్మిదవ తరగతి చదువుతున్న అతని రెండవ కుమార్తెని అదే ప్రాంతానికి చెందిన కిరణ్, తేజ అనే యువకులు వేధించేవారు. విద్యాసాగర్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుల మద్దతుదారులు విద్యాసాగర్ కుటుంబంపై బెదిరింపులు అధికం చేశారు. అది తట్టుకోలేక విద్యాసాగర్ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం జిల్లా పెద్ద వడుగరు మండలం కిష్టిపాడు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన చిన్న కుళ్ళాయి అనే యువకుడు గత ఏడాది డిసెంబరు 29న బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ప్రేమించమని వేధిస్త తమ బిడ్డ వెంటపడుతున్నాడని ఆరు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
అనేకసార్లు దాడులు చేసిన కేసులు కూడా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బుగ్గయ్య గౌడ్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గడలో నివసించే స్వాతి (20)ని ప్రేమించాల్సిందిగా వెంటబడుతున్నాడు. 2003 సెప్టెంబరులో కత్తితో దాడిచేసి గాయపర్చాడు. 2004 మార్చిలో మరోసారి దాడిచేశాడు. గత ఏడాది అక్టోబరు 5న మళ్ళీ కత్తితో దాడి చేయగా తీవ్ర గాయలయ్యయి. ఇన్నిసార్లు ఆమె మీద దాడి జరిగితే పోలీసులు ఏమయ్యరు? అయితే అత్యుత్సాహం ప్రదర్శించి వరంగల్ మనీషా ఆలి లాంటి కేసుల్లో ఎన్‌కౌంటర్లు చేయడం లేదా విజయవాడ ఆయేషా మీరా కేసులో మాదిరిగా మొహం చాటేయడం, కేసులు నిర్వీర్యం చేయడం. రెండు రకాల అతి-మిత ధోరణులను చూస్తూనే ఉన్నాం.
స్త్రీలపై ఈ దాడులు జరిగినప్పుడల్లా మరణశిక్షలపై చర్చ తప్పకుండా తలెత్తుతుంది. ఆ ప్రస్తావన రావడంతోనే మానవ హక్కుల సంఘాలని విమర్శించడం పరిపాటైపోయింది. ఓ పక్క పోలీసులు, మరోపక్క బాధితుల బంధువులు, మహిళా సంఘాల వారు చేసే విమర్శలను తట్టుకుంటూ బాధితురాలి పక్షాన జరిగే ఉద్యమంలో పాల్గొనడం ఒక్కోసారి సాహసంతో కూడుకున్న పనే. ఇటీవల బాధితురాలి బంధువులు ఏకంగా నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసెయ్యలని డిమా౦డ్ చేస్తున్నారు. వారి ఆవేదనని సానుభూతితో అర్థం చేసుకోవచ్చు కాని ఆవేశంతో వారు చేసే అన్ని డిమా౦డ్లను సమర్థించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇటువంటి దాడులు జరుగుతున్నది మరణశిక్షలు విధించకపోవడం వల్ల కాదు. దేన్నయినా హింసద్వారా పరిష్కరించవచ్చు అనే భావన సమాజంలో ఉండటం వల్లనే. నేరస్తులని పట్టుకోవడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తే వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని మానవ హక్కుల సంఘాలు గుర్తుచేస్తాయి. అదేవిధంగా అత్యుత్సాహం ప్రదర్శించి నేరస్తులను ఎన్‌కౌంటర్ల పేరిట హత్యచేసినా ఊరుకోవు. అతి మిత పోకడలకు పోకుండా అధికార వ్యవస్థ పని చేయాల్సిన చట్రాన్ని మానవ హక్కుల ఉద్యమం ఎల్లవేళలా గుర్తు చేస్తూనే ఉంటుంది.
ఆడపిల్లలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కారణం తల్లిదండ్రుల పెంపకమా, విద్యాసంస్థలా, ఇంటర్‌నెట్టా, సినిమానా, సాంకేతిక పరిజ్ఞానమా, పోలీసుల నిర్లక్ష్యమా, మీడియ అత్యుత్సాహమా? అంటే ఒకటని చెప్పలేం. ఎందుకంటే అవి వేటికవి మూసపోసినట్టు విడివిడిగా ఏ మనిషి మీదా పని చేయవు.
ఒక పక్క లైంగికత్వం గురించి మాట్లాడ్డం తప్పని భావించే తల్లిదండ్రులు మరో ప్రక్క ఇంటర్‌నెట్‌లో అంతులేని వక్ర సమాచార ప్రసారం. దీనితో తాము చేస్తున్నది తప్పనే భావనతో పిల్లలు ఇటువంటి విషయలు పెద్దవాళ్ళ దగ్గర దాయడం, వాళ్ళ కళ్ళుగప్పి ప్రవర్తించడం ఒక సాధారణ లక్షణమై కూర్చుంది. పిల్లల మనసులోని ఆ సంకోచాన్ని తొలగించకుండా తల్లిదండ్రులు ఈ వయస్సులో ఇటువంటి ఆలోచనలు తప్పని హితబోధ చేస్తుంటే పిల్లలు తమలో తాము మరింత ముడుచుకుపోయి ఇటువంటి విషయాలు ఓపెన్‌గా మాట్లాడుకునే వారి దగ్గరికి పోతున్నారు. ఇంటర్‌నెట్ వైపు ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం చేయవలసిందల్లా పిల్లలతో కమ్యూనికేషన్ పెంచుకోవడం. మనసులో మాట చెప్పుకోలేని మానసిక స్థితికి పిల్లల్ని నెట్టకూడదు. ఆడమగపిల్లల మనసులో మాట స్వేచ్ఛగా చెప్పుకోగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి. బైటా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఆలోచనల్లో పొరపాట్లను స్నేహపూర్వక వాతావరణంలోనే సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. దాడులు చేస్తున్న కుర్రవాళ్ళు కూడా కరుడుగట్టిన నేరస్తులు కాదు. మన మధ్య మసిలే సాదాసీదా మనుషులే. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం యండ్రపల్లికి చెందిన శేఖర్ నాయక్ (15) పెద్దదోర్నాల ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అదే తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నాడు. ఆ అమ్మాయి అతని ప్రేమను తిరస్కరించింది. తల్లిదండ్రులకు చెబుతానంది. దీంతో భయపడి శేఖర్ పురుగుల మందు తాగి చనిపోయాడు. జీవితం ఏమిటో తెలిసేలోపే దాన్ని ప్రేమకు తాకట్టు పెట్టేస్తున్నారు.
చెడు సంస్కృతికి ఒక్కటే ప్రత్యామ్నాయం. మంచి సంస్కృతి. ప్రేమని కొట్టో చంపో పొందలేనట్టే పిల్లల్లో చెడు సంస్కృతిని కొట్టో తిట్టో పోగొట్టలేం.
కత్తులతో అమ్మాయిల వెంటపడకండిరా, మీ అవసరం సమాజానికి వుంది. మీరు లేక అన్ని ఉద్యమాలు వయెభారంతో కృంగిపోతున్నాయి అని వారికి ఏ విధంగా నచ్చజెప్పాలో చూద్దాం.
ఇందులో పేర్కొన్న సంఘటనల వివరాలు ‘ఈనాడు’ దినపత్రిక నుంచి సేకరించినవి.
(మానవ హక్కుల బులిటిన్-9 నుంచి పునర్‌ముద్రణ)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
నేడు సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే సమయమ తగ్గిపోతున్నది. వారి పని ఒత్తిడిలో పిల్లల బాగోగులు పట్టించుకోలేక పోతున్నారు. పిల్లలకు డబ్బులు ఇస్తె చాలు అదే వారి పై ప్రేమ చూపటమనే భావనలో ఉన్నారు.
పిల్లలలో అనిశ్చింత పెరగటానికి ఇది కూడా ఒక కారణమ. పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి..అందులో అమ్మమ్మలు తాతయ్యలు వారు చెప్పె కధల ద్వారనే పిల్లలకు మంచిచెడుల విచక్షణను నేర్పేవారు.
ఏమైనా ఉమ్మడి కుటుంబాలు తిరిగి వస్తె ఈ నేరాలు కొంతవరకు తగ్గవచ్చని నా భావన.
ఈ వ్యాసం లొ సుధ గారు రాసినవన్నీ అక్షర సత్యాలు.ప్రస్తుత వ్యాపార వినిమయ విషసంస్కృతి లక్షణాలివి……….మీడియా కూడా అందులో ఒక భాగమే
Pingback: The Road to Proletarian & Women’s Revolution » Blog Archive » మహిళలపై దాడులు పెరగడానికి ఇంటర్నెట్, టి.వి.లే కారణమా?
కృష్ణ గారూ మన శ్రీకాకుళం జిల్లాలోనే దామోదర అనే లెక్చరర తన స్టూడెంట మీద యాసిడ పోసిన వార్త మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. దామోదర పల్లెటూర్లో స్కూల టీచర గా పనిచేసే రోజుల్లో 8వ తరగతి స్టూడెంట ని లొంగదీసుకున్నాడు. టీచర ఉద్యోగం మానేసి లెక్చరర ఉద్యోగానికి వెళ్ళాడు. అమ్మాయి స్కూల చదువు పూర్తై కాలేజికి వెళ్ళింది. అయితే ఆ అమ్మాయి ఆ లెక్చరర ని వదిలేసిందని ఆ లెక్చరర ఆమె మీద యాసిడ పోసాడు. ఇంటర్నెట అందుబాటులో లేని పల్లెటూర్లలో కూడా జనం బూతు సంస్కృతి వల్ల చెడిపోతోంటే ఇంటర్నెట అందుబాటులో ఉన్న పట్టణాలలో జనం ఇంకెంత సులభంగా చెడిపోతారో ఊహించడం కష్టం కాదు. సినిమాలు, టి.వి., ఇంటర్నెట ఇవన్నీ ఆడవాళ్ళ పై దాడుల్ని పెంచి పోషిస్తున్నాయి.