గుడంబానే ఎందుకు? మద్యం షాపులు మూసేయండి – సత్యవతి, ప్రశాంతి

”కల్లు తాగొచ్చు, బీర్‌ తాగొచ్చు, బ్రాందీ తాగొచ్చు కానీ గుడంబా తాగొద్దంట, గుడంబా చెయ్యొద్దంట. మరి మా పెద్దోళ్ళు ఏం తాగాలి? క్వార్టర్‌ కొనాలంటే వంద కావాలి. వందతో నాలుగు బాటిళ్ళ గుడంబా సేసుకుంటాం కదా! మా ఇంట్లో బెల్లముందని నన్ను పట్టుకుని పోలీసులు జైల్లో ఏసారు. ఏం… మేము పండక్కి స్వీట్లు ఒండుకోవద్దా? బెల్లం కొంటే తప్పేంటి? ఇంట్లో ఎందుకు పెట్టుకోవద్దు. మీరే సెప్పండి న్యాయం.”

నిన్న చంచల్‌గూడా జైలుకి వెళ్ళినప్పుడు గుడంబా నేరం కింద అరెస్టై వచ్చిన ఒకామె ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమెతోపాటు నలుగురు ఆడవాళ్ళు ఒకే తండాకి చెందినవాళ్ళు… కళ్ళనిండా నీళ్ళతో, వెక్కుతూ, ఏడుస్తూ మాట్లాడారు.

”మేమేమైనా దొంగతనం చేసామా? ఎవర్నైనా చంపేసినామా? మా ఇంట్లో ఉన్న మమ్మల్ని పోలీసులొచ్చి, కొట్టి జైలుకు తెచ్చిండ్రు. ఇదేం న్యాయం?” వాళ్ళు అలా చెరిగేస్తుంటే కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాము. వాళ్ళని కాసేపు దృష్టి మళ్ళిద్దామని ”తెలంగాణలో గుడంబా తయారు చెయ్యడం నేరం కదా! అమ్మడం ఇంకా నేరం కదా” అన్నాం.

”మేమేడ అమ్మామమ్మా! మా ఇంట్లో ముసలోళ్ళ కోసం కాసాం” అంది ఒకామె. ”అవునా! సరే కానీ గుడంబా ఎట్లా కాస్తారు చెప్పు. ఏమేం కలుపుతారు. ఎందుకు గవర్నమెంటు గుడంబా తాగొద్దంటుంది”.

”ఏముంటదమ్మా! బెల్లం, పటిక కలిపి వారం ఊరబెడతాం. తర్వాత కాస్తాం. అంతే”.

”అంతేనా? దాంట్లో ఇంకేం కలపరా?”

”పండ్లు కూడా కావాలంటే కలపొచ్చు”

”కెమికల్స్‌ అంటే వేరే రసాయనాలు కలపరా?”

ఒకామె చెంపలు వాయించుకుంటూ, ”అయ్యో! అలాంటివేమీ కలపమమ్మా. మా ఇంటోళ్ళే తాగుతారు గదా” అంది.

”నిజంగానే బెల్లం, పటిక కలిపితే ఊరబెడితే, కాస్తే అంత మత్తొస్తుందా? ఇంకేమీ కలపరా?”

చాలా ఆశ్చర్యమనిపించింది. కెమికల్స్‌ లాంటివేమీ కలపకుండా గుడంబా తయారు చెయ్యరని అనుకున్నాం.

”మేం తయారు చేసేది మా పెద్దవాళ్ళ కోసమే. ఆళ్ళు తాగకుండా ఉండలేరు. అవీ ఇవీ కలిపి మేము సెయ్యము. ఇంట్లో దొరక్కపోతే ఆళ్ళు పైసలియ్యమని లొల్లి సేస్తరు. క్వార్టర్‌ బాటిల్‌ కొనాలంటే 100 రూపాయిలయితయి. రోజూ వంద ఏడకెల్లి తేవాలి? వంద రూపాయలతో మేమే తయారుచేస్తే వారం సరిపోతది కదా! మమ్మల్ని తెచ్చి ఈ జైల్లో ఏస్తే ఎలాగ మరి?”

”మీరు చెప్తున్నది నిజమే కానీ, గవర్నమెంటు రూల్‌ కదా!…”

”ఏంటి గవర్నమెంటు రూలమ్మా! కల్లు కాంపౌండులు పెట్టొచ్చంట. కల్లు తాగొచ్చంట. వైన్‌ షాపులు పెట్టొచ్చంట… ఆడనే కూసుని తాగొచ్చంట… అవేంటివవి… బార్లు … ఆడ తాగి తాగి తూలొచ్చంట… ఇవన్నీ గవర్నమెంట్‌ రూల్‌ ఎందుకు కాదు. మా గుడుంబానే ఎందుకైంది…?” కోపంతో రగిలిపోతోంది.

మా నోట మాట రాలేదు. వాళ్ళ ప్రశ్నలకి మా దగ్గర సమాధానం లేదు. ఇంకేం ప్రశ్నలు గుప్పించే వాళ్ళో కానీ జైలులో సమయం అయిపోయింది. వాళ్ళంతా భోజనాలకి వెళ్ళాలి.

రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తామని చెప్పి బయటికొచ్చాం కానీ మనసులో వాళ్ళ ప్రశ్నలే మెదులుతున్నాయి. ఆ నలుగురు ఆడవాళ్ళు మా కళ్ళల్లోంచి కదలడం లేదు. వాళ్ళు సంధించిన ప్రశ్నలకి మా దగ్గర సమాధానం లేదు. ఈ మధ్య ప్రభుత్వం గుడంబా నిందితుల్ని అరెస్ట్‌ చేయడం, కొన్ని కేసుల్లో పి.డి. చట్టం ప్రయోగించడం తెలుసు. అలాగే తెలంగాణని గుడంబారహిత రాష్ట్రంగా చెయ్యాలంటూ ప్రచారం చెయ్యడం, గుడంబా అమ్మకం చేసే వర్గాల వారి పునరావాసం కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇంతకుముందు నగరంలోని ధూల్‌పేట నుండి చాలామంది స్త్రీలు గుడంబా అమ్మారన్న నేరం మీద జైలుకొచ్చారు. వారితో మాట్లాడినపుడు గుడంబా తయారుచేసి అమ్ముతామని, ఎన్నో సంవత్సరాలుగా తాము అదే వృత్తిలో ఉన్నామని, ఇప్పుడు ఆ పని చెయ్యొద్దంటే మా బతుకులు ఏం కావాలి? మేమెలా బతకాలి అని ఏడ్చేవాళ్ళు. మీలాంటి వాళ్ళకోసం ప్రభుత్వం ఒక పథకం పెట్టింది కదా… పునరావాసానికి కొంత డబ్బు కూడా ఇస్తున్నారు కదా! రెండు లక్షలు వడ్డీ లేకుండా ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మీకు తెలుసా ఆ విషయం అంటే, ‘మాకు తెల్వది… అయినా ఆ డబ్బుతో మా జీవితాలు నడుస్తయా?” అన్నారు.

ధూల్‌పేట మొదలు నగరంలోని మరికొన్ని మురికివాడల్లో గుడంబా వ్యాపారం జోరుగా సాగుతోందని అందరికీ తెలుసు. వారు గుడంబా తయారుచేసేది వ్యాపారం కోసమే అన్నది వాస్తవమే. చాలా అపరిశుభ్రమైన పరిసరాల్లో వాటిల్లో ఏమేమో కల్తీ చేసి గుడంబా తయారు చేస్తారని, అది తాగినవాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయని చాలా మీడియా కథనాల్లో చూసాను. గుడంబాకి బానిసలైపోయిన మనుషులు నగరంలోని ఎన్నో మురికివాడల్లో కనబడుతుంటారు.

అయితే జైలులో మాట్లాడిన మహిళల ఘోష కూడా అర్థం చేసుకోదగ్గదే. అసలు త్రాగుడు లేని సమాజమైతే గుడంబా తయారీ నేరం, తాగడం నేరం అనే నిబంధన విధించొచ్చు. కానీ అడుగడుగునా కల్లు కాంపౌండులు, వైన్‌ షాపులు, బెల్టు షాపులు, బార్లు మనుషుల్ని గుంజుకుపోయి పీకల్దాకా తాగిస్తుంటే ఒక్క గుడంబా తయారీనే కంట్రోల్‌ చేస్తే లాభమేంటి? గుడంబా అందుబాటులో లేకపోతే కల్లు, క్వార్టర్‌ తాగుతారు. తమకొచ్చే ఆదాయంలో ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తాగుబోతు మగవాళ్ళు డబ్బుల కోసం ఆడవాళ్ళని ఎన్ని రకాల హింసలకి గురిచేస్తారో ఎవరికీ తెలియదు.

గిరిజన సంస్కృతుల్లో వారు స్వంతంగా తయారుచేసుకుని సేవించే విప్పసారా, జీలుగు కల్లు లాంటివి తరాలుగా వారి జీవన విధానంలో భాగం. వారు చేసుకునే పండగల్లో వారు తయారుచేసుకునే విప్ప, జీలుగు కల్లు లాంటివి వరదలై పారుతాయి. అదే లేకుండా వారి సంబరాలు అసంపూర్ణం. గుడంబా కూడా నగరంలో బతుకుతున్న కొన్ని గిరిజన తెగలవారే తయారు చేసుకుంటారు. నేను మాట్లాడిన నలుగురు మహిళలు లంబాడా తెగకి చెందిన గిరిజనులే. గిరిజనుల సంస్కృతిలో భాగమైన అలవాట్లను బలవంతంగా మాన్పించాలని ప్రయత్నించడం, వారిని నేరస్తులుగా చిత్రించి అరెస్టు చేసి జైలుపాలు చెయ్యడం ఎంతవరకు సబబు? విప్పసారాని, జీలుగుకల్లుని, గోవాలాంటి చోట తయారయ్యే జీడిమామిడి పండు నుండి తయారుచేసే ఫెనీని నిషేధించగలరా? గిరిజనులు సాంప్రదాయంగా, వారి సంస్కృతిలో భాగంగా వారే స్వయంగా తయారు చేసుకుని సేవించే మత్తు పానీయాలను నిషేధించడం, వాటికి నేరం రంగు పూయడం అంటే వారిని వైన్‌ షాపుల వైపు నడిపించడమే. తాగుడు నేరంకాని చోట అలవాటైన వాళ్ళు గుడంబా కాకపోతే విస్కీ తాగుతారు. క్వార్టర్‌ బాటిళ్ళకు తమ ఆదాయమంతా తగలేస్తారు. కుటుంబ ఆదాయం అంతంత మాత్రమే అయిన చోట కుటుంబమంతా వంద రూపాయిల గుడంబాని వారమంతా తాగితే, ప్రతి ఒక్కరికీ రోజుకు వంద రూపాయల మద్యం కొనుక్కు తాగే దారుణ పరిస్థితి వారి ఆర్థిక స్థాయిని మరింత దిగజార్చదా? ఈ దుస్థితి మహిళల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. హింసని ప్రేరేపిస్తుంది. కుటుంబ పోషహాకార స్వీకరణ మీద భయానక ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఆర్భాటంగా మొదలు పెట్టాలనుకున్న ‘నగదు బదిలీ’ పథకం కనుక నిజంగా అమలవ్వడం మొదలైతే ఆ నగదంతా మళ్ళీ మద్యం షాపులకే అంటే తిరిగి ప్రభుత్వానికే నేరుగా జమ అయిపోతుంది. మగవాళ్ళు తాగి తూగుతుంటే స్త్రీలు, పిల్లలూ అర్థాకలితో, పూర్ణాకలితో అలమటించాల్సిన స్థితిలోకి కుటుంబాలు జారిపోయే దృశ్యం మనసులో మెదలి తీవ్ర దుఃఖం కలుగుతోంది.

అక్షరాశ్యతకు నోచుకోని ఆ నలుగురు లంబాడా స్త్రీలు నేరస్తుల్లా జైలులో మగ్గుతూ సంధించిన ప్రశ్నలు మాలో అనేకానేక ప్రశ్నల్ని లేవనెత్తాయి. ప్రభుత్వం మద్యం పాలసీని అర్థం చేయించాయి. గుడంబా వల్ల తమ మద్యం షాపుల ఆదాయం తగ్గుతుందన్న మద్యం షాపుల సిండికేట్‌ అమానుష దోరణిని రూపుకట్టించింది. అమాయక గిరిజనుల్ని జైల్లోకి తోయించి అమానవీయం గర్హనీయం.

గుడంబానే ఎందుకు నిషేదించడం మొత్తం మద్యం షాపుల్ని మూసివేయండి. మద్యం వరదల్లా పారుతున్న బెల్టు షాపుల్ని మూసివేయండి. మద్యపానం ఎన్ని కుటుంబాల్ని కూల్చుతోందో, ఎంతమంది మహిళల జీవితాలు బుగ్గయిపోతున్నాయో కళ్ళు తెరిచిచూడండి. మద్యం లేని సమాజం కోసం మీరు కృషి చేస్తే మేమంతా మీ వెంటే నడుస్తాం… ప్రయత్నమైనా చెయ్యగలరా???

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.