ఆకుపచ్చని లోకంలోకి ఏకాంత ప్రయాణం -కొండవీటి సత్యవతి

ప్రయాణమంటే ఎందుకింత పరవశం? కదలికలో ఎంత సంతోషముందో అర్థమైనందుకా? ఒకే చోటు, ఒకే ప్రాంతం, ఒకే మనిషితో సహవాసం కొంతకాలం భలేగా ఉంటుంది. చలం రాజేశ్వరి ఇంటి నాలుగ్గోడల ఇరుకులోంచి మైదానాల్లోకి ఎగిరిపోయింది కానీ కొంతకాలానికి అదీ యాంత్రికమైపోతుంది కదా! బహుశా యాంత్రికత మనుషుల మనసుల్లో ఉంటుందేమో! అందుకేనేమో మనుష్యులు అలవాటైన పరిసరాలని వదిలేసి ప్రయాణాల్లో కదులుతుంటారు. కొత్త ప్రాయాలు, కొత్త మనుష్యులు, కొత్త సంస్కృతులు మనిషికి కొత్త చూపునిస్తాయి. కుటుంబాలతో చేసే ప్రయాణాల్లో ఎన్నో పరిమితులుంటాయి. ప్లాన్‌ చేసుకుని కొన్ని పరిధిల్లో నడుస్తుంటాయి. బృందాలతో చేసే ప్రయాణాలు చాలా భిన్నంగా ఉంటాయి. సామూహిక నవ్వుల గానంలా ఉంటాయి. మరి ఒంటరి ప్రయాణాలు??? ఒంటరి ప్రయాణమంటే…

ప్రకృతిలోంచి అంతరంగంలోకి, అంతరంగంలోంచి ప్రకృతిలోకి చేసేదే ఒంటరి ప్రయాణం. నిజానికి దీనికి ఒంటరి ప్రయాణం అనకూడదేమో! ఎందుకంటే మనం ఒక్కరిమే కావచ్చు కానీ, మనతో మరో మనిషి (మనకి సేవలందించే వాళ్ళు కాదు) లేకపోవచ్చు కానీ సమస్త ప్రకృతి మనతోనే ఉన్నప్పుడు మనది ఒంటరి ప్రయాణం ఎలా అవుతుంది? అవ్వదు. ఎగిసిపడే కెరటం ముందు నిలబడ్డప్పుడు, నువ్వు కెరటం మాత్రమే. చుట్టూ ఎంతమంది ఉన్నా నీ సంభాషణ కెరటంతోనే. నీ ఆనందం కెరటం చిమ్మిందే. ఉవ్వెత్తున

ఉరికిపడే జలపాతం, జరజరా కదిలిపోయే సెలయేరూ, ఆకుపచ్చని అడవి, అంతెత్తు కొండ… వెరసి సమస్త ప్రకృతి నీతో నడుస్తుంటే, నీతో సంభాషిస్తుంటే, ఆనందాన్ని నీ మీద కుమ్మరిస్తుంటే నువ్వు చేసేది ఒంటరి ప్రయాణం కాదు.

మన ప్రపంచంలో మనకిష్టమైన మనిషి మనతో ఉంటే మహదానందంగా ఉంటుంది. నిజమే కానీ… ఏకాంతపు ప్రయాణం ఇచ్చే కిక్‌ ఇక్కడుండదు. మనతో ఉన్నవాళ్ళ ఆలోచనలు, దృక్పథం, దృష్టికోణం తప్పకుండా భిన్నంగా ఉంటాయి. మనల్ని సంబరపరిచేది వాళ్ళకి పేలవంగా అన్పించవచ్చు. అందుకే కొన్నిసార్లు రాజీ పడాల్సి వస్తుంది. అలా అని నేస్తంతో ప్రయాణం వద్దని కాదు. ఏకాంత ప్రయాణంలో నీకు నువ్వే అన్నీ… నవ్వినా, ఏడ్చినా, గెంతినా, పాడినా, పారవశ్యంలో మునకలేసినా అన్నీ నువ్వే… సమస్తాన్నీ అమర్చుకుంటూ, ఆనందాన్ని కూడా సూట్‌కేసులో సర్దుకుంటూ తిరుగుతుంటే… ఆ కిక్కే వేరు. ఎటువంటి ఏర్పాట్లు, సర్దుబాట్లు లేకుండా గాలి ఎటు వీస్తే అటువైపు కదలిపోవడం, పచ్చదనాలని, పరిసరాలని, పరిచయం లేని మనుష్యుల్ని పెనవేసుకుంటూ, పంచుకుంటూ తిరగడంలోని మజా ఎలా

ఉంటుందో మనసారా అనుభూతించిన అనుభవాన్ని అక్షరాల్లోకి అనువదించాలని నా ప్రయత్నం. నా మనసులో సుళ్ళు తిరుగుతున్న అనుభవాలను అక్షరీకరించడానికి పడిన తపనే పైన రాసిన నేపథ్యం.

ప్రతి సంవత్సరం నవంబరు నెలలో కోయంబత్తూరులో పార్టనర్స్‌ మీటింగ్‌ జరుగుతుంది. దాదాపు 60 మంది భాగస్వాములు వివిధ రాష్ట్రాల నుండి హాజరవుతారు. ఈసారి ఈ మీటింగ్‌కు రమ్మని ఆహ్వానం అందిన దగ్గరనుండి నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. కోయంబత్తూరులో మీటింగ్‌ జరిగే చోటు ఎత్తైన కొండల మధ్య చాలా అందంగా ఉంటుంది. రెండు రోజులు మీటింగ్‌ తర్వాత చుట్టుపక్కలుండే మరేదైనా ప్రాంతానికి వెళితే ఎలా ఉంటుంది? అక్కడికి దగ్గరగా ఏమున్నాయా అని చూస్తే ఊటీ, కొడైకెనాల్‌, మున్నార్‌ ఇంకా కొన్ని ప్రాంతాలు దొరికాయి. ఊటీ మీద ఆసక్తి లేదు. రెండుసార్లు వెళ్ళాను. కొడైకెనాల్‌ వెళ్ళాలని నిర్ణయించుకుని ప్రశాంతిని అడిగాను. కోయంబత్తూర్‌ మీటింగుకు వెళ్ళి రెండు రోజులు కొడైకెనాల్‌ వెళదామా అన్నాను. వ్యక్తిగత కారణాలవల్ల తను రాలేనంది. ప్రాణం

ఉస్సురంది. తను రాలేను అంటే ఇక అంతే. రెండో మాటకి తావులేదు. కోయంబత్తూర్‌ వెళ్ళి వచ్చేద్దాంలే అనుకున్నాను కానీ కొడైకెనాల్‌ మనసును పట్టుకుంది. గూగుల్‌లో సమాచారం సేకరించి పెట్టుకున్నాను. బడ్జెట్‌ ఎంతవుతుందో అర్థమైంది. సడన్‌గా మనసులోకి మున్నార్‌ ప్రత్యక్షమైంది. ఇటా, అటా అనే ఆలోచనలు మున్నార్‌ దగ్గర ఆగిపోయాయి. పార్ట్‌నర్స్‌లో ఎవరో మున్నార్‌కి దగ్గర ప్రాంతానికి చెందిన వారున్నారని గుర్తొచ్చింది. అంతే మున్నార్‌ స్థిరమైపోయింది. గూగుల్‌లో మున్నార్‌ ఫోటోలు పద పద పోదామని తొందరపెట్టాయి.

నవంబరు 5న బయలుదేరి లంచ్‌ టైమ్‌కి కోయంబత్తూర్‌ చేరిపోయాను. ఉదయం కోయంబత్తూర్‌కు వెళ్ళే ఫ్లయిట్‌ రద్దవడం వల్ల ఒక రోజు ముందే వెళ్ళాల్సి వచ్చింది. పార్టనర్స్‌ ఒకరో ఇద్దరో తప్ప సెంటర్‌ అంతా ఖాళీగా ఉంది. సౌందర్యం మూర్తీభవించిన పరిసరాలు. పచ్చగా మెరిసిపోతున్న కొండలు. ఆ కొండలమీద కొలువై అటూ, ఇటూ నడుస్తున్న తెల్లటి మేఘాలు. అసంఖ్యాకంగా కూస్తున్న నెమళ్ళు. సెంటర్‌ అంతా తిరుగుతూ కొంత దూరంలో చెట్ల మధ్య కట్టిన మెడిటేషన్‌ సెంటర్‌వైపు నడిచాను. మెడిటేషన్‌ సెంటర్‌ వెనక ఎత్తైన కొండలు… పెద్ద పెద్ద చెట్లు… చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చెట్లమీద ఎగురుతున్న నెమళ్ళు. చల్లటి గాలి వీస్తోంది. చిన్న సైజు అడవిలాగా ఉంటుంది కూడా. మెట్లమీద కూర్చుని కళ్ళు మూసుకుంటే పక్షుల కిలకిలారావాలు, నెమళ్ళ కూతలు… చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. దగ్గరగా ఏదో శబ్దమైతే

కళ్ళు తెరిచి చూద్దును కదా.. అతి దగ్గరగా నెమలి. పురి విప్పడానికి సన్నద్ధమౌతూ…

కళ్ళు తెరిచి కొంచెం కదలగానే ఎగిరెళ్ళి చెట్టుమీదికి పారిపోయింది.

సన్నగా తుంపర మొదలైంది. గాలి, తుంపర, పక్షుల శబ్దాలు తప్ప ఎవ్వరూ లేని ఏకాంతం. అలాగే కూర్చుండిపోయాను. హఠాత్తుగా వాన పెరిగిపోయింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు, తుంపర కాస్తా పెద్ద పెద్ద చినుకులుగా జోరున వర్షం కురవసాగింది. ఎక్కడో పిడుగు పడిన భీకర శబ్దం. గుండె జల్లుమంది. పిడుగులు ఎందుకో గాభరా పెడతాయి. క్రమంగా చీకటి పడిపోయింది. వాన తగ్గేవరకు కదిలే పరిస్థితి లేదు. నా రూమ్‌ వరకు వెళ్ళాలంటే చాలా దూరం నడవాలి. తడిసి ముద్దయిపోతాను. ఫోన్‌ తడిసిపోతుంది. వానని చూస్తూ, వాన సంగీతం వింటూ గంటన్నరసేపు కూర్చుండిపోయాను. చుట్టూ నిశ్శబ్దం… వర్షం చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. నేనిక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. నా గురించి ఆరా తీసేవాళ్ళూ లేరక్కడ. అలా నిరామయంగా నాలోకి నేను చూసుకుంటూ, కూనిరాగాలు తీసుకుంటూ ఎవరికీ పూచీ కాని ఏకాంత ఆనందంలో మునిగిపోయాను. ఆ అనుభవం అద్భుతంగా

ఉంది. వానధారల్ని చూస్తూ, ఆ సంగీతం వింటూ జీవితంలో మొదటిసారి అంతసేపు గడిపాను. చాలా రిలాక్సింగ్‌గా అన్పించింది. అలా నా ఏకాంత ప్రయాణానికి నాంది పడింది.

రెండు రోజులు సమావేశాలు ముగిసాయి. నాలుగ్గంటలకల్లా ఫ్రీ అయిపోయాం. మున్నార్‌కి దగ్గరగా ఉండే పార్టనర్‌, హూూూ=ణ అనే సంస్థకి చెందినవారితో మాట్లాడాను. అంతకుముందు రోజే మాట్లాడాను. ఆ సంస్థ డైరక్టర్‌ ఫాదర్‌ జోస్‌ ఆంటోని, అక్కడ పనిచేసే సురేష్‌లతో నా ప్లాన్‌ గురించి మాట్లాడాను. నన్ను ఎలా గైడ్‌ చెయ్యాలో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ ఆఫీసు ”కుమిలి” అనే ప్రాంతంలో ఉంది. కోయంబత్తూర్‌ నుండి ఆరేడు గంటల ప్రయాణం. వాళ్ళు బస్‌లో వచ్చి, బస్‌లోనే వెళతారట. ‘కుమిలి’ హిల్‌ స్టేషన్‌. అక్కడినుండి మున్నార్‌ 110 కిలోమీటర్లు. ప్రయాణం మొత్తం కొండల మీద, అడవుల్లోంచి ఘాట్‌ రోడ్‌లో

ఉంటుంది. కనీసం ఆరు గంటలు పడుతుంది. మరి ‘కుమిలీ’ వరకు బస్‌ ప్రయాణం చెయ్యగలరా? అని అడిగాడు సురేష్‌. చేస్తానన్నాను కానీ టాక్సీ బుక్‌ చేసుకుంటే బెటరేమో అనిపించింది. మా మానిటరింగ్‌ ఆఫీసర్‌ సుహాస్‌ నాయర్‌ని అడిగాను ఒక టాక్సీ మాట్లాడమని. రాను పోను ఛార్జ్‌ చేస్తాడు మేడమ్‌! అన్నాడు సుహాస్‌. ఫర్వాలేదు బుక్‌ చేయమంటే చేసాడు. మా మీటింగ్‌ అయ్యేటప్పటికి టాక్సీ వచ్చేలా ఏర్పాటు జరిగింది. ఫాదర్‌, సురేష్‌ వాళ్ళతో బయలుదేరి, వాళ్ళను కుమిలిలో దింపేసి నేను మున్నార్‌ వెళ్ళాలని మొదటి ప్లాన్‌. దీనికి ఫాదర్‌ ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు రూమ్‌ బుక్‌ అవ్వలేదు. అర్థరాత్రి మున్నార్‌ చేరితే రూమ్‌ దొరక్కపోతే చాలా ఇబ్బంది కాబట్టి రాత్రికి కుమిలిలో ఆగిపోయి మర్నాడు వెళ్ళమని ఫాదర్‌ సలహా ఇచ్చారు. ఇది బాగానే ఉంది. మరి వాళ్ళ ఆఫీస్‌లో ఉండడానికి ఏర్పాటు ఉందో లేదో అనుకుంటూ ఫాదర్‌ని అడిగితో ”నో ప్రాబ్లమ్‌ రూమ్స్‌ ఉన్నాయి” అన్నారు సురేష్‌.

నాలుగున్నరకంతా టాక్సీలో బయలుదేరాం. ఫాదర్‌కి, సురేష్‌కి థాంక్స్‌ చెప్పాను. నా ప్రయాణం సాఫీగా మొదలైంది. మా మధ్య కొంచెం సంభాషణ తర్వాత ఫాదర్‌ వాళ్ళ ఆఫీసువాళ్ళతో నా రాక గురించి, చెయ్యాల్సిన ఏర్పాట్ల గురించి మాట్లాడడం, మళయాళంలో మాట్లాడినా నాకు అర్థమౌతూనే ఉంది. కాసేపు డ్రైవర్‌ రామనాధంతో వాళ్ళు మాట్లాడుతుంటే నేను ప్రతిమకి కాల్‌ చేసాను. నా ప్రయాణం గురించి చెబుతూ నాతో ఉన్న ముగ్గురూ మళయాళంలో మాట్లాడుకుంటున్నారు నీతో కాసేపు మాట్లాడదామని చేసాను అన్నాను. అబ్బ! మున్నార్‌ వెళుతున్నావా? అలాంటి టైమ్‌లో నేను గుర్తొచ్చానా? అంటూ సంతోషపడింది. ప్రతిమతో మాట్లాడడం పూర్తయ్యాక డ్రైవర్‌ రామనాధం మేడం! నాకు కొంచెం కొంచెం తెలుగొచ్చు అన్నాడు. వార్నీ! ముందే చెప్పొచ్చు కదా అనుకుని ప్రతిమతో నేనేం మాట్లాడానో వాళ్ళకి చెప్పాను. సురేష్‌ నవ్వాడు. ‘మీ రహస్యాలు డ్రైవర్‌కి తెలిసిపోయాయి’ అన్నాడు. మధ్యలో డిన్నర్‌ చేసాం. నేను బిల్‌ చెల్లించబోతుంటే ఫాదర్‌ చనువుగా ‘మీరు నా జ్యూరిస్‌డిక్షన్‌లో ఉన్నారు. రేపటివరకు నా మాటే వినాలి’ అంటూ బిల్లు కట్టనివ్వలేదు. క్రమంగా టాక్సీ కొండల మీద ప్రయాణిస్తోంది. దట్టమైన చీకటి చుట్టూ. ఏమీ కనబడడంలేదు కానీ ఘాట్‌ సెక్షన్‌లో వెళ్తున్నామని అర్థమైంది. చలి పెరిగింది. పదకొండు గంటలకి ‘కుమిలి’ చేరాం. టాక్సీ ‘వొసార్ట్‌’ ఆఫీసు ముందు ఆగింది. విశాలమైన ఆవరణ. పెద్ద బిల్డింగ్‌. మంచు కురుస్తున్నట్టుంది. చలిగా ఉంది. ఆఫీసు లోపలికెళ్ళేటప్పటికి ‘జోషి’ అనే కుర్రాడు ఎదురుపడ్డాడు. ‘మేడమ్‌! ఆప్‌ కీ రూమ్‌’ అంటూ ఒక రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. నీట్‌గా సర్దిన రెండు మంచాలున్నాయి. నా వెనకే ఫాదర్‌ వచ్చి దుప్పట్లు, దిండ్లు సర్ది ‘ఇది మీకు సౌకర్యంగానే ఉంటుందని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఇది చాలా హాయిగా ఉంది. మీరు వెళ్ళండి’ అన్నాను. ‘ఉదయం తొమ్మిదికి గానీ ఇక్కడ ఏదీ మొదలవ్వదు. మీరు రిలాక్స్‌ అవ్వండి. ఉదయం మా స్టాఫ్‌ మెంబర్‌ సెల్లి వస్తుంది’ అని చెప్పి తాళం వేసుకుని ముగ్గురూ వెళ్ళిపోయారు. అంత పెద్ద బంగళాలో ఒక్కర్తినీ మిగిలాను. నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ ఇళ్ళు ఉన్నాయో లేదో తెలియదు. స్నానం చేస్తే కానీ నిద్ర రాదు. వేన్నీళ్ళు రావడంలేదు. చల్లటి ఐస్‌లాంటి నీళ్ళతో స్నానం కానిచ్చి పడుకునేటప్పటికి పన్నెండు దాటింది. ఓ అరగంట అటూ ఇటూ దొర్లాక గాఢనిద్రలోకి జారిపోయాను. ఆరున్నరదాకా మెలకువ రాలేదు. కిటికీలోంచి బయటకు చూస్తే ఏమీ కనబడడం లేదు. మొత్తం మంచు కమ్మేసింది. చలిగాలి వీస్తోంది. బయట తాళం వేసే ఉంది. మళ్ళీ రూమ్‌లోకొచ్చి మంచం మీద వాలాను. ఎవరో ఒకరు వచ్చి తాళం తీసేవరకు ఇంతే.

ఎనిమిదిన్నరకి సురేష్‌ ఫోన్‌ చేసాడు. బాగా నిద్రపోయారా? బ్రేక్‌ఫాస్ట్‌ కేరళ స్పెషల్‌ తింటారా? అని అడిగాడు. ఎస్‌… అన్నాను. అప్పటికే నేను రెడీ అయిపోయాను. తొమ్మిదింటికి సురేష్‌ మాట్లాడిన టాక్సీ వస్తుంది. కుమిలీలో చూడాల్సిన ప్రాంతాలు చూసేసి లంచ్‌ తర్వాత నా ప్రయాణం మున్నార్‌వైపు. తొమ్మిదింటికి బ్రేక్‌ఫాస్ట్‌తో సురేష్‌, సెల్వి వచ్చారు. ఇడియాపం, శనగల కూర… తింటుంటే ఫాదర్‌ వచ్చారు. ”బాగా నిద్రపట్టిందా? కొత్త ప్రాంతం కదా! మధ్యాహ్నం లంచ్‌ ఇక్కడే. మీతో సెల్వి వస్తుంది. ఇక్కడ చూడాల్సినవి చూడండి. ఏనుగు ఎక్కుతారా? అక్కడికి వెళ్ళండి” అన్నారు. తొమ్మిదవుతున్నా మంచు తెరలు తొలగలేదు. ఆవరణలో చాలా చెట్లున్నాయి. నాకు తెలియనివి ఉంటే సురేష్‌ని అడిగాను. అతను చెప్పాడు కానీ కొన్ని పేర్లు మర్చిపోయాను. మల్టీ స్పయిస్‌ చెట్టు ఇది అంటూ ఓ ఆకు తుంచి తినమన్నాడు. మిర్చి కొరికినట్టు సుర్‌మంది. మంచి వాసనొస్తోంది. అన్ని మసాలా దినుసులు కలిపిన వాసనొస్తోంది. మొక్క దొరుకుతుందా? అని అడిగితే నర్సరీలో దొరకొచ్చు అన్నాడు. నాలుగైదు కొమ్మలు కోసి ఇచ్చాడు. సూట్‌కేస్‌ అంతా మసాలా వాసన.

టాక్సీ వచ్చింది. మహమ్మద్‌ ఆలీ అంటూ డ్రైవర్‌ని పరిచయం చేసాడు సురేష్‌. హమ్మయ్య ముస్లిమ్‌ కదా హిందీ వస్తుందిలే అని సంతోషపడితే నాకు హిందీ రాదన్నాడు. కొంచెం కొంచెం ఇంగ్లీష్‌ వచ్చట. టాక్సీ రెండు రోజులు నాతోనే ఉంటుంది. నన్ను కొచ్చిన్‌ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్‌ చేసేవరకు నాతోనే. ఎంతకి మాట్లాడాడో చెప్పాడు సురేష్‌. చాలా రీజనబుల్‌ అనిపించింది. ”ఇంత తక్కువకి ఎవరూ రారు. మీకు సంతోషమనిపిస్తే అతనికి ఏమైనా ఇవ్వండి” అన్నారు ఫాదర్‌. ”తప్పకుండా… నేను చూసే ఇస్తాలెండి” అన్నాన్నేను. లోకల్‌ సైట్‌ సీయింగ్‌కి బయలుదేరాం. నాతో సెల్వి వచ్చింది. మొదట ఎర్నాకులం టైగర్‌ రిజర్వ్‌ పార్క్‌కి తీసుకెళ్ళింది. పార్క్‌ చుట్టూ ఎత్తుగా, బలంగా పెరిగిన వెదురు వనాలు. పార్క్‌ లోపల మహా వృక్షాలు. పార్క్‌ మధ్యలో పెద్ద సరస్సు. చాలా అందమైన ప్రాంతం. బోటింగ్‌కి గంటన్నర పడుతుందంటే టైమ్‌ సరిపోదని వెళ్ళలేదు. సరస్సు దగ్గర, అడవిలో బోలెడు ఫోటోలు దిగాం. ఒక చెట్టుకి రకరకాల రంగుల పూలు కనబడి ఆశ్చర్యపరచాయి. ”నిజానికి మూడు రంగుల్లో మూడు స్టేజిల్లో ఈ పూలు పూస్తాయట. మొదట ఆకుపచ్చ, తర్వాత పసుపుపచ్చ, చివరికి ఎర్ర రంగులోకి మారతాయట. చెట్టుపేరు సెల్వికి తెలియదు. సరస్సు పక్కన విస్తరించిన అడవిలో ఈ చెట్లే

ఉన్నట్టున్నాయ్‌. వనమంతా భిన్న వర్ణాలతో శోభాయమానంగా ఉంది. పార్క్‌ వాళ్ళ బస్సులో బయటికి వచ్చేసి మా కార్‌ ఎక్కాం.

”మేడమ్‌! ఇక్కడొక ట్రైబల్‌ విలేజ్‌ ఉంది. చూస్తారా? అలాగే ఏనుగు ఎక్కాలంటే కూడా అటే వెళ్ళాలి” అంది సెల్వి. తప్పకుండా వెళదామని వీలైతే వాళ్ళతో మాట్లాడదామని అన్నాను. ‘తొందరగా మాట్లాడరు. ప్రయత్నిద్దాం, ఎలిఫెంట్‌ రైడ్‌కి వెళదాం’ అంది. ఓ పెద్ద ఆవరణలో భారీకాయాలతో రెండు ఏనుగులున్నాయి. ‘ఎన్ని ఏనుగులున్నాయని అడిగితే పన్నెండు, అన్నీ ఆడవే’ అన్నాడు అక్కడున్న మనిషి. ‘ఎందుకని ఆడవే ఉన్నాయి. మగ ఏనుగులు లేవా?’ అంటే ‘ఆడ ఏనుగులు చెప్పిన మాట వింటయ్‌. మావటి ఏది చెబితే అదే చేస్తుంది. మగ ఏనుగులు అలా కాదు. ఒక్కోసారి హింసాత్మకంగా ప్రవర్తించి మావటి మీద కూడా దాడి చేస్తాయి. అందుకే మగ ఏనుగుల్ని పబ్లిక్‌ రైడ్‌కి తీసుకోము’ అన్నాడతను. ఆడ ఏనుగులు కూడా ఒద్దికగా, క్రమశిక్షణతో

ఉంటాయన్నమాట. నవ్వొచ్చింది నాకు. నేను ఎక్కాల్సిన ఏనుగొచ్చింది. అన్నట్టు మర్చిపోయా. టికెట్లు ఇచ్చే చోట ఇలా చెప్పారు… అరగంట రైడ్‌, గంట రైడ్‌, గంటన్నర రైడ్‌, వాటికి వివిధ రేట్లు. అంతసేపు ఎందుకు అంటే ఎక్కువసేపు, ఎక్కువ దూరం తిరగడంతో పాటు ఏనుగు తనమీద కూర్చున్నవాళ్ళకి తన తొండంతో నీళ్ళు జల్లుతూ స్నానం చేయిస్తుందంట. వారెవా! భలేగా ఉందే… కానీ నాకు అంత టైమ్‌ లేదు. అరగంట మాట్లాడుకుని ఏనుగు మీదికెక్కి కూర్చున్నాను. కాళ్ళు చాలా ఎడంగా పెట్టుకుని కూచోవడం కష్టమౌతుందేమో అనుకుంటూ పది నిమిషాలు చాల్లే అన్నాను. ‘అలా కుదరదు. ఏనుగు వెనక్కి తిరగదు. మొత్తం రెండు రౌండ్లు తిరగాలి’ అన్నాడు మావటి రంజీత్‌. ‘సరే అయితే’ అని ఠీవిగా వచ్చి నిలబడ్డ ఏనుగు అంబారీ మీదికెక్కి కూర్చున్నాను. భూమికి అంతెత్తులో ఉంది. యాలకుల తోటల్లో సన్నగా వేసిన బాటమీద వయ్యారంగా నడుస్తోంది. చెట్ల కొమ్మలు తగులుతున్నాయి. మళయాళంలో ఏనుగుకి ఆదేశాలిస్తున్నాడు. ‘ఎక్కడినుండి వచ్చారు’ అడిగాడు మావటి. హైదరాబాద్‌ అంటే ‘ఆంధ్రా’ అన్నాడు, ‘కాదు తెలంగాణ’ అన్నాను. ఏనుగు పేరు మరియా. మావటి పేరు రంజీత్‌. ‘మరియాకి మళయాళం మాత్రమే అర్థమౌతుంది’ అన్నాడు. మరియా అని నేను తెలుగులో పిలిచా. రంజీత్‌ నవ్వాడు. మధ్యలో ఆపి ఫోటోలు తీసాడు. నాకు స్ట్రెయిట్‌గా ఫోటో కావాలంటే తీసాడు. ఏనుగుమీద పచ్చటి తోటల్లో ఊరేగడం భలే ఉంది. పిల్లలు భలే ఎంజాయ్‌ చేస్తారు. పది నిమిషాల తర్వాత మరియా ఆగిపోయింది. రంజీత్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ‘రంజీత్‌! ఆగిపోయింది చూడు’ అని అరిచాను. అతను ఏదో అన్నాడు గట్టిగా. ఊహు… కదల్లేదు. ‘ఏమైంది?’ అంటే ‘టాయ్‌లెట్‌’ అన్నాడు. మరియాకి టాయ్‌లెట్‌ వచ్చిందన్నమాట. అన్నీ పూర్తి చేసుకుని మెల్లగా బయలుదేరింది. మరో పది నిమిషాల తర్వాత ఎక్కిన చోటుకి వచ్చి దిగేసాను. కిందికి రమ్మని పిలిచింది సెల్వి. ఇద్దరం మరియా దగ్గరికెళ్ళాం. అంతకు ముందు ఏనుగుమీద తనకు ఫోటో తియ్యమంటే తీసాను.

‘మరియాని ముట్టుకోండి. ఏమీ అనదు. పైసలిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది’ అన్నాడు రంజీత్‌. మరియా కళ్ళల్లోకి చూసాను. ఎంతో కరుణపూరితంగా ఉన్నాయి. నావైపు చూస్తుంటే తొండం పట్టుకుని ఫోటో దిగాను. ఇరవై నోటిస్తే తొండంతో లాక్కుని నా తలమీద తొండంతో తాకించింది. మరియాకి బై చెప్పేసి ట్రైబల్‌ విలేజ్‌కి బయలుదేరాం. గ్రామంలోకి వెళ్ళేటప్పటికి పన్నెండవుతోంది. అక్కడక్కడా ఇళ్ళు కనబడుతున్నాయి. ఒకచోట ముగ్గురు మహిళలు కూర్చుని ఉన్నారు. అక్కడ దిగి గ్రామంలో నడవసాగాం. ‘మేడమ్‌! మా సంస్థ ఇక్కడ పనిచేస్తోంది. విద్య, బాల్యవివాహాల మీద పనిచేస్తున్నాం. వీళ్ళతో మాట్లాడడం కష్టం, తొందరగా రెస్పాండ్‌ అవ్వరు’ అంది సెల్వి. ప్రయత్నిద్దాం, వాళ్ళ భాష ఏంటి? ‘మళయాళమే. కొంచెం తమిళ్‌ కూడా మాట్లాడతారు’ అంది. మెల్లగా ఆ ముగ్గురు స్త్రీల దగ్గరికి వెళ్ళాం. మావైపు చూస్తున్నారు వాళ్ళు కూడా. ఒకామె చాలా కోపంగా చూస్తోంది. ఇంకొకామెకు ముఖం కొంచెం ప్రసన్నంగా ఉంది. ఇంకొకామె కారా కిళ్ళీలాంటిదేదో బరాబరా నములుతోంది. వాళ్ళ ఎదురుగా వెళ్ళి ‘నేను తెలుగు, నమస్తే’ అన్నాను. ‘నమస్తే’ అంది ప్రసన్న వదనం. ‘అన్నం తిన్నారా?’ అన్నాను సైగలతో. ‘ఆ…’ అన్నారు. వాళ్ళ పక్కనే యాలకుల మొక్క ఉంది. సెల్వి చెప్పింది అది యాలక్కాయల మొక్క అని. ‘యాలక కాయలు… లవంగ… మొక్కలున్నాయా’ అంటే ‘యాలక’ ఉంది అన్నారు. అలా ముక్కలు, ముక్కలుగా సంభాషణ. వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉన్నా భాష కష్టంగా ఉంది. వాళ్ళు చూడడానికి కేరళ స్త్రీలలాగా లేరు. నల్లగా నిగనిగలాడే ఉంగరాల జుట్టు, నుదుటిమీద తెల్లటి బొట్లు వగైరాలు లేవు. ఆ విధంగా వాళ్ళ గిరిజన సంస్కృతి మిగిలే ఉన్నట్టనిపించింది. కొంచెం ఎత్తుమీదున్న చిన్న ఇంటిని చూడాలనిపించి, అక్కడున్న ఎర్రటి పూలవైపు వెళ్ళాం. గట్టెక్కి పైకి వెళ్ళేసరికి ఒకమ్మాయి మమ్మల్ని పిలిచింది. లంగామీద షర్టు వేసుకుంది. నవ్వు ముఖం. ఆమె చేతిలో ఆకుపచ్చటి విత్తనాల్లాంటివి పట్టుకుని ‘యాలక’ అంది. పచ్చి యాలక్కాయలు. ‘ఓహో! యాలక్కాయ… భలే…’ చాలా సంతోషమన్పించింది.

యాలక్కాయల్ని నా దోసిట్లో పోసింది. ‘పేరు… నేమ్‌ ఏమి’ ‘మై నేమ్‌ సచిత్ర’ అంది. ‘ఇంగ్లీషు వచ్చా? ఎంతవరకు చదువుకున్నావ్‌’ ‘కొంచెం కొంచెం’ అంది సిగ్గుపడుతూ. ”తనది ఈ ఊరు కాదట. ఈ ఊరి అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకుందట. చదువాపేసిందట. గ్రామంలో మొత్తం 500 మంది ఉంటారట”. ఫోటో తీసుకోవచ్చా అంటే నవ్వుతూ నా పక్కకొచ్చి నిలబడింది. థాంక్స్‌ అంటూ సచిత్రకి షేక్‌హాండ్‌ ఇచ్చి గట్టు దిగి కిందికొచ్చేసాం. కింద కూర్చున్న ముగ్గురిలో సీరియస్‌గా ఉన్న ఆమె వెళ్ళిపోయింది. ప్రసన్నవదనం, కారాకిళ్ళీ ఆమె ఉన్నారు. ఫోటో అంటే వెంటనే లేచి నిలబడ్డారు. సచిత్ర కూడా వచ్చి నిలబడింది. గ్రూప్‌ ఫోటో తీసుకుని వాళ్ళకి థాంక్స్‌ చెప్పి అక్కడినుంచి బయలుదేరాం.

ఒంటిగంట కావొస్తోంది. అన్ని మసాలా మొక్కలు ఉండే నర్సరీకి వెళ్దామంది సెల్వి. సరే అన్నాను. మొక్కలు చూడడానికి టికెట్‌ పెట్టారు. అయితే గంట టైమ్‌ పడుతుందట. వద్దులే అని బయటికొచ్చి ‘వొసార్ట్‌’ ఆఫీసుకి బయలుదేరాం. అప్పటికే ఫాదర్‌ ఆఫీసుకొచ్చారు. వాళ్ళు చేసే కార్యక్రమాల గురించి వివరంగా చెప్పారు. జర్మనీ నుంచి వచ్చిన వాలంటీర్‌ అమ్మాయి కలిసింది. మా దగ్గర కూడా టీనా అనే వాలంటీర్‌ ఉంది. వీళ్ళద్దరికీ ఒకరికొకరు తెలుసట. నాకు భూమిక తెలుసు అంది. ఆ తర్వాత లంచ్‌ చేసి, ఒక గ్రూప్‌ ఫోటో తీసుకుని ఫాదర్‌కి, సురేష్‌కి థాంక్స్‌ చెప్పి మున్నార్‌కి బయలుదేరాను. నిజంగా వాళ్ళు నన్ను ఎంతో ఆదరంగా, ఆత్మీయంగా చూసుకున్నారు. కొత్త మనుష్యులు, కొత్త ప్రాంతం అనే భావనే రాలేదు. మళ్ళీ రమ్మని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు.

రెండు గంటలకి ‘కుమిలి’ వదిలేసి, రాత్రి చీకటిలో చూడలేకపోయిన ఎత్తైన కొండల మీదుగా మున్నార్‌ ప్రయాణం మొదలైంది. పడమటి కనుమల సౌందర్యం, ఆ పచ్చదనం, జలపాతాలు, సెలయేళ్ళు… రెండు రోజులు వీటి మధ్యనే ప్రయాణం. గమ్యం మీద దృష్టి లేదు. ఆ గమనం ఆగిపోకుండా సాగిపోతే… ఎంత కాలం… ఏమో! మున్నార్‌లో ఏదో అద్భుతం ఎదురుచూస్తోందని నాకు అనిపించలేదు. ఆకుపచ్చటి కొండలు, హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే జలపాతాలు, కొంచెం దూరం వెళ్ళగానే కాళ్ళకి, కళ్ళకి అడ్డంపడే సెలయేళ్ళు… డ్రైవర్‌ పేరు మహమ్మద్‌ ఆలి. నా ఉద్వేగాలను అతను బాగా అర్థం చేసుకున్నాడు. బయలుదేరిన వెంటనే ఏపుగా పెరిగిన ఒక యాలకుల తోట దగ్గర ఆపాడు. అచ్చం మన చెరుకు తోటల్లాగా ఉన్నాయి లేదా అరటి తోటల్లాగా కూడా ఉన్నాయి. మొక్క అంతెత్తు ఎదిగినా యాలకులు నేలమీదే కాయడం చూసి ఆశ్చర్యపోయాను. గెలలు, గెలలుగా నేలబారుగా యాలకుల గుత్తులు. కొన్ని గుత్తులు తెంపుకున్నాను. కొంచెం దూరం వెళ్ళగానే పోకచెట్లకో, మరే ఇంకో చెట్టుకో పాకించిన మిరియాల తీగలు. కనబడిన మేరంతా ఈ మసాలా దినుసుల మొక్కలే. అసలు ఆ పచ్చదనం కళ్ళకి ఎంత హాయినిస్తుందో…

ఈ ప్రయాణంలో ఎదురైన తొలి జలపాతం చాలా చిన్నది. చాలా తక్కువ ఎత్తుమీంచి కిందికి దూకుతోంది. పోను పోనూ అడుగడుగునా జలపాతమే. చాలా దూరం నించే జలపాత సంగీతం వినబడేది. తెల్లటి పాలనురుగులా నింగి నుంచి నేలకు జాలువారే జలపాతం ముందు ఎన్నోసార్లు అలా నిలబడిపోయేదాన్ని. ఒక తన్మయం తనువంతా కమ్మేసేది. ఇంక చాలు అని కానీ, ఇంక వెళదాం అని కానీ చెప్పేవాళ్ళు, తొందర పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఆలీ జలపాతంలో నన్నొదిలేసి వెళ్ళి కారులో కూర్చునేవాడు. నా ఇష్టమైనంతసేపు గడిపేదాన్ని. ఒకవేళ జలపాతాన్ని వదిలేసి ముందుకెళ్ళినా వెంటనే ఓ సెలయేరు దర్శనమిచ్చేది. ఆకుపచ్చటి కొండల్లోంచి జలజల సంగీతాన్ని ఆలపిస్తూ కిందికురికే జలపాతాలు… ఒక్కోసారి అంతెత్తు కొండలమీంచి, ఒక్కోసారి చిన్నపాటి కొండలమీంచి మలుపులు తిరుగుతూ…

నాలుగ్గంటల పాటు సాగిన ‘కుమిలీ’ మున్నార్‌ ప్రయాణం… ఏమా సౌందర్యం, ఏమా మహా పర్వత పంక్తులు, ఏమా జలపాతాలు… వాహ్‌!! కళ్ళల్లోంచి గుండెల్లోకి జాలువారిన ఆకుపచ్చటి అనుభవాలు. చీకటి పడుతోంది. ఇంకో గంట ప్రయాణం చెయ్యాలన్నాడు ఆలీ. బాత్‌రూమ్‌కి వెళ్ళాలి. ప్రయాణం మధ్యలో ఊళ్ళొస్తున్నాయి. చిన్న చిన్న హోటల్స్‌ కనబడుతున్నాయి. కానీ బాత్‌రూమ్‌ల జాడలేదు. ఆలీకి చెప్పిన దగ్గర నుండి ప్రతి హోటల్‌ని పరిశీలనగా చూస్తున్నాడు. కానీ కనబడడం లేదు. ఎంతోమంది టూరిస్ట్‌లు వచ్చే ప్రాంతం. టాయిలెట్‌లు ఏర్పాటు చెయ్యకపోతే ఎలా? ఇదొక్కటే నాకు నచ్చలేదు. సన్నటి ఘాట్‌ రోడ్లో కారు ఆపడమే కష్టం. రకరకాల వ్యక్తులు ప్రయాణాలు చేస్తుంటారు. దారిలో వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలన్న ఇంగితం, సెన్సిటివిటీ లేని వ్యవస్థలు. ఒకచోట ఒక రిసార్ట్‌ లాంటిది కనబడింది. దేదీప్యంగా లైట్లు వెలుగుతున్నాయ్‌ కానీ మనుష్యులు లేరు. ఆలీకి చెప్పాను రిసార్ట్‌ దగ్గర ఆపమని. వెళ్ళనివ్వరేమో అని కాబోలు అన్నాడు. ఫర్వాలేదు ఆపమన్నాను. ఆపాడు. దిగి లోపలికెళ్ళాను.

కారు ఆగిన చప్పుడుకి లోపల్నుంచి ఓ కుర్రాడు వచ్చాడు. బాత్‌రూమ్‌కెెళ్ళాలి అని అడిగాను. చాలా మర్యాదగా దారి చూపించాడు. హమ్మయ్య అనుకుని… బయటకు వచ్చాక, కాఫీ ఉందా అని అడిగాను, లేదన్నాడు. అది రిసార్ట్‌ అని, టూరిస్ట్‌లుంటేనే క్యాంటీన్‌ నడుస్తుందని చెప్పాడు. పేరు అడిగితే కార్తీక్‌ అని చెప్పాడు. మున్నార్‌ వెళుతున్నానని, అక్కడ రూమ్‌ బుక్‌ చేసుకోలేదని, దొరుకుతాయా అన్నాను. ఇక్కడే ఉండండి రూమ్‌లున్నాయి, మున్నార్‌ ఇక్కడికి దగ్గరే. ఎంతమంది ఉన్నారు? అన్నాడు. కారులో ఇంకా జనాలున్నారనుకున్నట్టున్నాడు. ‘ఒక్కదాన్నే… ఇంకెవ్వరూ లేరు. హైదరాబాద్‌ నుంచి వచ్చాను’ అన్నాను. ”ఒక్కరేనా?” అంటూ చాలా ఆశ్చర్యపోయాడు. సరే… కార్తీక్‌కి థాంక్స్‌ చెప్పి కారెక్కాను. ‘ఆలీ! మున్నార్‌లో రూమ్‌ దొరక్కపోతే ఇక్కడికే వద్దాం. ప్లేస్‌ గుర్తుపెట్టుకో’ అన్నాను. ‘నో… నో… యు విల్‌ గెట్‌ రూమ్‌’ అన్నాడు . ‘చూద్దాం’. మొత్తం చీకటి పడిపోయింది.

ఇంకో గంట ప్రయాణం తర్వాత మున్నార్‌ చేరాం. ఒక మహా నిశ్శబ్దంలోని రణగొణ ధ్వనుల శబ్ద ప్రపంచంలోకి వచ్చి పడ్డాను. హోటళ్ళు బాగానే కనబడుతున్నాయి. చిన్నవి, పెద్దవి. ఆలీ ఒక హోటల్‌ ముందు కారాపాడు.

లోపలికెళ్ళి రూమ్‌ కావాలని అడిగాను. హోటలంతా సందడిగా, పాటల హోరుతో దద్దరిల్లుతోంది. రెండు మూడు టారిఫ్‌లు చెప్పాడు. ఒక టారిఫ్‌లో పక్కనే మహా జోరుగా, విపరీత శబ్దాలతో సాగుతున్న డిజె పాటల ప్రోగ్రామ్‌కి వెళ్ళొచ్చని, ఇంకో దాంట్లో స్పాలో మసాజ్‌ చేయించుకోవచ్చని చెబుతున్నాడు. నాకవేమీ ఒద్దని, డీసెంట్‌గా ఉండే రూమ్‌ కావాలని అడిగాను. పక్కనే నది పారుతుందని ఆ సైడ్‌ రూమ్‌ కావాలంటే కూడా ఇస్తానన్నాడు. ప్రస్తుతం చీకటయిపోయింది, పొద్దున్నే నేను బయటకెళ్ళిపోతాను, నదిని చూస్తూ కూర్చోను కదా అని నవ్వాను. కుర్రాడు హుషారుగా ఉన్నాడు. తనూ నవ్వి రూమ్‌ కన్‌ఫర్మ్‌ చేసాడు. హోటల్‌ బాయ్‌ లగేజ్‌ తీసుకెళ్ళి రూమ్‌లో పెట్టాడు. డిన్నర్‌ గురించి ఎంక్వయిరీ చేశాను. ‘రూమ్‌ సర్వీస్‌ ఉంది. ఇక్కడ మెనూ కార్డుంది’ అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

రూమ్‌ నీట్‌గా ఉంది. బాత్‌రూమ్‌ శుభ్రంగా ఉంది. హమ్మయ్య! హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటూ ‘సెల్వి’కి మెసేజ్‌ పెట్టాను రూమ్‌ దొరికిందని, బావుందని. పొద్దున్న తిన్న తిండే. మధ్యలో ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తోంది. మెనూలో కింగ్‌ ఫిష్‌ ఫ్రై కనబడింది. ఫిష్‌, గ్రీన్‌సలాడ్‌, పెరుగు ఆర్డర్‌ చేసి స్నానం ముగించేసి, కాసేపు మంచానికి అడ్డం పడ్డాను. ఓ అరగంటకి ఫుడ్‌ తెచ్చాడు. పెరుగు మహా పులుపు. కింగ్‌ ఫిష్‌ చాలా బావుంది. డిన్నర్‌ ముగించి, కాసేపు ఫోన్లు మాట్లాడి, తొందరగానే నిద్రపోయాను. రోజంతా తిరుగుతూనే

ఉన్నాను కదా హాయిగా నిద్ర పట్టేసింది. మధ్య రాత్రిలో దడదడా శబ్దాలకు మెలకువ వచ్చింది. లేచి కిటికీ కర్టెన్‌ తీసి చూస్తే బాగా వాన పడుతోంది. పక్కన రేకుల మీద పడిన వర్షం చేసిన శబ్దమది. టైమ్‌ చూస్తే రెండున్నర. ఇంకా చాలాసేపు నిద్రపోవచ్చు అనుకుంటూ ముసుగు పెట్టేసాను. మూసుకున్న రెప్పల వెనక క్రితం రోజు చూసిన అద్భుత దృశ్యాలన్నీ ఆవిష్కృతమయ్యాయి. వాన శబ్దం జలపాత హోరులాగానే అన్పిస్తుంటే మళ్ళీ నిద్రపోయాను.

మర్నాడు ఉదయమే తయారై రెస్టారెంట్‌కి వస్తే, ఎదురుగా నిదానంగా, నిమ్మళంగా పారుతున్న నది. రాత్రి నది పక్కన గది కొంచెం రేటెక్కువ అని చెప్పింది ఇదేనన్నమాట. నిజానికి అది నదిలాగా లేదు. మా ఊరి కాలవలాగా ఉంది. ఎక్కువ విశాలంగా లేదు కానీ మెల్లగా పారుతోంది. నాకు శ్రీనగర్‌లోని జీలం నది గుర్తొచ్చింది. గెస్ట్‌హౌస్‌కు ఆనుకుని, చీనార్‌ చెట్ల పక్కనుంచి పారే జీలం నది ఇలాగే ఉంటుంది. ఆ నది పేరేంటని అడిగితే ఎవరూ చెప్పలేదు. ఉదయమే నీటి ప్రవాహం పక్కనే కూర్చుని వేడి వేడి కాఫీ తాగడం భలేగా ఉంది. అవతలి తీరాన దట్టంగా కమ్ముకున్న చెట్లు, ఆ వెనక పచ్చటి కొండలు… ఇలాగే చూస్తూ కూర్చుంటే టైమ్‌ సరిపోదు. రూమ్‌ ఖాళీ చేసేసి, మేనేజర్‌కి థాంక్స్‌ చెప్పి పోర్టికోలోకి వచ్చేసరికి ఆలీ రెడీగా ఉన్నాడు. మున్నార్‌ సైట్‌ సీయింగ్‌ వివరాలున్న పేపర్‌ను హోటల్‌ వాళ్ళిచ్చారు. ఏమేం చూడాలో, ఎంతెంత దూరాలో ఆలీకి తెలుసు. మున్నార్‌లో చూడాల్సినవన్నీ చూసేసి, కనీసం మూడుగంటలకంతా బయలుదేరి కొచ్చిన్‌కి వెళ్ళాలి. కొచ్చిన్‌లో నా ఫ్లయిట్‌ తొమ్మిది గంటలకి. దూరం 120 కి.మీటర్లే కానీ కొండ దారుల్లో, ఘాట్‌ రోడ్లో ప్రయాణం చాలా మెల్లగా నడుస్తుంది. మధ్యలో ఏ సెలయేరో, మరో జలపాతమో కళ్ళకి అడ్డం వస్తే ఇంక అంతే సంగతులు. అందుకని రెండు గంటలకల్లా మున్నార్‌ని చుట్టేసి కొచ్చిన్‌ వైపు వెళ్ళిపోవాలని ఆలీకి చెప్పాను. కుదిరితే కొచ్చిన్‌లో ఉండే జర్నలిస్ట్‌ ఫ్రెండ్‌ సుచిత్రను కలవాలనుకున్నాను.

మున్నార్‌ ఊరంతా ఇరుకిరుకుగా, రద్దీగా ఉంది. హోటళ్ళు, గెస్ట్‌హౌస్‌లు అడుగడుగునా కనబడుతున్నాయి. ఎక్కడికి వెళుతున్నామో తెలియదు. ఆలీని అడిగాను, ఎక్కడికి అని. ఎర్నాకుళం నేషనల్‌ పార్క్‌ అని హోటల్‌ వాళ్ళిచ్చిన కాయితంలో చూపించాడు. పది కిలోమీటర్ల దూరంలో ఉంది. అరగంటలో అక్కడికి చేరిపోయాం. పార్క్‌ లోపలికి మినీ బస్సులుంటాయని, టికెట్‌ తీసుకోవాలని చెప్పాడు. నేషనల్‌ పార్క్‌ అంటే జంతువులుంటాయని, చాలా టైమ్‌ కూడా పడుతుందని అనుకున్నాను కానీ అలా జరగలేదు. ఉదయమే వెళ్ళిపోవడం వల్ల మొదటి బస్సులో సీటు దొరికింది. బస్‌ బయలుదేరుతుంటే బిలబిలమంటూ ఆరు బస్సుల్లో ఏదో కాలేజి నుండి అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చారు. భలే సందడిగా, హుషారుగా వచ్చి మా బస్‌ ఎక్కారు కొంతమంది. నా పక్కన కూర్చున్న అబ్బాయినడిగితే ఏదో కాలేజి పేరు చెప్పాడు. బస్సు దట్టమైన అడవిలోంచి, టీ తోటల మధ్య నించి వెళ్ళసాగింది. చుట్టూ పచ్చటి కొండలు, అడవి, మధ్యలో వేలాది ఎకరాల టీ తోటలు… కళ్ళు తిప్పుకోనీయని సౌందర్యం. నా దృష్టి ఒక చెట్టు మీద పడింది. నిజానికి ఒక చెట్టు కాదు, రెండు చెట్లు. ఒకదానికొకటి పెనవేయడంతో పాటు ఒక చెట్టుకి చెందిన రెండు కొమ్మలు కాళ్ళల్లాగా ఇంకో చెట్టుకి అటు ఇటు అతుక్కుని రెండు చెట్లు ప్రేమలో మునిగి తేలుతున్నట్టుగా ఉన్నాయి. బస్సు వేగంగా వెళుతుండడం వల్ల నేను ఫోటో తీయలేకపోయాను. తిరిగి వచ్చేటప్పుడు డ్రైవర్‌ని అడిగినా ఆపలేదు. అతనికి అర్థం కాలేదు. అతని భాషలో నేను చెప్పలేకపోయాను.

తేయాకు తోటల్లో ప్రయాణం సాగుతోంది. ఉదయపు గాలి హాయిగా ఒంటికి తగులుతోంది, చల్లగా ఉంది. చాలామంది స్వెట్టర్‌లు తగిలించారు. కొండలమీద మంచు కమ్ముకుని ఉంది. ఇలాంటి ఉదయపు గాలి నాకు చాలా ఇష్టమైంది. పచ్చదనాన్ని చీల్చుకుంటూ బస్సు వెళుతోంది. హఠాత్తుగా నేను కూర్చున్న కుడివైపున అచ్చం ఏనుగులా కనబడుతున్న కొండ, ఆ కొండమీద నుంచి సన్నటి ధారలాగా జలపాతం కనిపించింది. ఒక్క చెట్టు కూడా లేదు. నల్లటి కొండ. బస్సు దగ్గరగా వెళుతుంటే సన్న ధార కాదు ఉరవడిగా ఉరుకుతున్న పెద్ద జలపాతం. అంతెత్తుమీంచి బండలాంటి కొండమీద నుండి కిందికి దూకుతున్న జలపాతం. నేను వీడియో తీసాను. జలపాతం పక్కనుంచి బస్సు వెళుతుంటే ఒళ్ళంతా చిమ్మిన నీటి తుంపరలు. తనువంతా తన్మయమైపోయింది. చాలాసేపు కళ్ళు మూసుకుని ఆ అనుభవాన్ని పదే పదే అనుభూతి చెందాను. నాతో నేను పంచుకున్న కమ్మటి అనుభవం.

కొండలెక్కిన బస్సు ఒకచోట ఆగిపోయింది. అక్కడే దిగి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. జంతువులేమైనా ఉన్నాయా అంటే లేవన్నారు. నేను బస్సు దిగి నడవడం మొదలుపెట్టాను. పైకి వెళుతున్నకొద్దీ తేయాకు తోటల పచ్చదనం మరింత గాఢంగా కనబడుతోంది. మలుపు మలుపులోను ఆగి ఎవరినో ఒకరిని అడుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చాను. కొంచెం సేపటికి ఆరు బస్సుల్లో వచ్చిన పిల్లల గుంపు వచ్చింది. వాళ్ళతో కాసేపు గడిపి బోలెడు ఫోటోలు తీసుకున్నాను. సెల్ఫీలు తీశారు కొంతమంది. వాళ్ళంతా కొండపైకి, నేను దిగువకి బయలుదేరాం. ఏదో ఒక బస్‌ ఎక్కేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చని గబగబా దిగేసాను. నాతోపాటు కొంతమంది దిగారు. బస్సు ఆగేచోట బల్లమీద క్యూలో కూర్చున్నాం. నా పక్కన ఒక పంజాబీ ఆవిడ కూర్చుంది. ”ఎక్కడి నుంచి వచ్చారు? మీ గ్రూప్‌ ఇంకా దిగలేదా కొండమీంచి” అని అడిగింది. ”గ్రూప్‌ ఎవరూ లేరు. ఒక్కదాన్నే వచ్చాను” ”అంత దూరం నుంచి ఒక్కరే వచ్చారా?” అంటూ ”సునోజీ! ఈవిడ ఒక్కరే వచ్చారట. నువ్వు నన్ను ఎక్కడికీ పంపవ్‌ కదా?” అని భర్తతో లడాయికి దిగింది. ”ఒక్కదానివీ ఎందుకు? మా అమ్మను తీసుకెళ్ళొచ్చు కదా?” ”మీ అమ్మతో…” ‘ఈ మనిషి ఇంతే. నన్ను ఎక్కడికీ కదలనివ్వడు. నీకేం తెలియదు అంటాడు. వాళ్ళమ్మకి 70

ఏళ్ళు. ఆమెని తీసుకెళ్ళాలంట. ఆప్‌ కో బదాయి…. చాలా ధైర్యం మీకు. ఈసారి నేను ప్రయత్నిస్తాను. కానీ ఈయన నన్ను వదలడు” పంజాబీలో అతనితో ఏదో అంటోంది. ఈ లోపు బస్సు వచ్చింది.

బస్సు దిగువకు వెళ్తుంటే తేయాకు తోటల్లోకి జారిపోతున్నట్లుగా అనిపించింది. ఓ అరగంటలో బస్సు ఎక్కినచోట దిగిపోయాం. ఆలీ ఎక్కడున్నాడో! అక్కడ ఎయిర్‌టెల్‌ పనిచేయదట. ఒక కానిస్టేబుల్‌ని అడిగితే ఆలీ నంబరు కలిపి ఇచ్చాడు. కాల్‌ ఆలీకి కనెక్ట్‌ కావడం లేదు. అతనికి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉందో లేదో! రెండు మూడు సార్లు ప్రయత్నించి పార్కింగ్‌ దగ్గరికి వెళ్ళి చూడమని సలహా ఇచ్చాడు. బోలెడన్ని కార్లు, బస్సులు… ఎక్కడని వెతకను? ఏం చేసేది లేక నడుచుకుంటూ వెళుతున్నాను. అతని కార్‌ నంబరు కూడా నాకు తెలియదు. పార్కింగ్‌ దగ్గరికెళ్ళగానే ఆలీ చెయ్యూపాడు. హమ్మయ్య! దొరికాడు అనుకుని ‘ఎయిర్‌టెల్‌ పని చేయదట కదా!’ అంటే ‘ఓన్లీ బిఎస్‌ఎన్‌ఎల్‌’ అన్నాడు. టైమ్‌ తొమ్మిదిన్నర అయింది. ‘నెక్స్ట్‌ ఫ్లవర్‌ గార్డెన్‌’ అన్నాడు ఆలీ. ఎన్నో భిన్నమైన వర్ణాలతో, భిన్నమైన పూవుల మధ్యకి తీసుకెళ్ళాడు. కొత్త కొత్త మొక్కలు, పువ్వులు చూసాను. అన్నింటికీ మించి అద్భుతమైన పూలపందిరి చూసాను. దూరం నుంచి చూస్తే ద్రాక్ష గుత్తుల్లాగా అనిపించాయి కానీ దగ్గరికెళితే గుత్తులు గుత్తులుగా కిందికి వేలాడుతున్న పువ్వులు. బోలెడు ఫోటోలు దిగాను. పూల సువాసనల మధ్యనుంచి బయటపడి కారెక్కాను. ”హమ్‌ అభి ఇకో పాయింట్‌” అన్నాడు అలీ. అతనికి హిందీ కూడా సరిగ్గా రాదు. ఇకో పాయింటంటే ఏంటో? ఏముంటుందో అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక ఓ అద్భుతం జరిగింది. దాదాపు ఇరవై కి.మీ. వెళ్ళాలి. మధ్యలో ఒక నదో, సరస్సో కనబడింది. అక్కడ బోటింగ్‌ వుంది. ‘బోటింగ్‌’ అన్నాడు. ‘నో బోటింగ్‌, నో టైమ్‌’ అన్నాను. ఇకో పాయింట్‌కి వెళ్ళే దారికిరువైపులా ఆకాశంవైపు అత్యంత పొడవుగా ఎదిగిన యూకలిప్టస్‌ వృక్షాలు. ఆరేడు అంతస్థుల బిల్డింగ్‌ని మించిన ఎత్తు, లావుతో… కళ్ళెత్తి ఆ చెట్లని చూడలేకపోయాను. ధ్వజస్తంభాల్లా సన్నగా ఎదిగిపోయిన ఆ చెట్ల మధ్యనుంచి వెళుతుంటే… ఆ మహా వృక్షాలకి మోకరిల్లాలనిపించింది. ఒక్క ఆకు కూడా కనబడని ఆ వృక్షాలు దారికటూ ఇటూ నిలబడి నన్ను చూస్తున్నట్లనిపించింది. నేను మహా విభ్రమంగా వాటిని చూస్తూనే ఉండిపోయాను. ఒక చెట్టు విరిగిపడితే దానితోపాటు ఎన్ని చెట్లు విరిగిపోతాయో లెక్కలేసుకుంటుంటే ఇకో పాయింట్‌కి చేరాం. ఇంతకు ముందు ‘బోటింగ్‌’ దగ్గర చూసిన నది దగ్గర కారాపాడు. ఎదురుగా ఆకుపచ్చ రంగులో మిలమిల మెరుస్తున్న నీళ్ళు, ఆ వెనక దట్టమైన అడవి, అడవి వెనక కొండలు… అద్భుతంగా ఉంది దృశ్యం. నీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే టికెట్‌ కొనాలి. టికెట్‌ కొని లోపలికెళుతుంటే గట్టిగా అరుపులు, పిలుపులు, నవ్వులు, కేరింతలు వినిపిస్తున్నాయి. నాతోపాటు ఒక జపాన్‌ జంట నడుస్తున్నారు. ”వాటీజ్‌ హ్యాపెనింగ్‌” అన్నాన్నేను. ”ఇది ఇకో పాయింట్‌. నువ్వెవరి పేరయినా పిలిస్తే, ఆ కొండల్లోంచి బదులొస్తుంది.” అంది ఆమె. ”భలే… భలే”. వాళ్ళిద్దరూ వారం నుంచి ఇక్కడే మున్నార్‌లో ఉన్నారట. ”నిన్న కూడా వచ్చాం” అన్నాడతను. ‘నాకో ఫోటో తీస్తారా?’ ‘ఫోటో ఎందుకు? వీడియో తీస్తాను’ అంది. నేను నా ఫోన్‌ను ఆమెకిచ్చి నీళ్ళ దగ్గరగా వెళ్ళి ‘ప్రశాంతీ!!’ అని గట్టిగా పిలిచాను. నా పిలుపు అడవి దాటి, కొండల్లో ప్రతిధ్వనించి తిరిగి నాకు వినబడింది. సంబరంగా ఇంకా చాలా పేర్లు పిలిచాను. అన్నీ తిరిగి వినిపించాయి. అయితే అందరూ ఒకేసారి పిలుస్తుండడంవల్ల ఒక్కోసారి స్పష్టంగా వినబడలేదు. మొత్తానికి ఇకో పాయింట్‌ దగ్గర చాలా సరదాగా, చిన్నపిల్లల సంబరంగా గడిపి యూకలిప్టస్‌ భారీ వృక్షాల మధ్యనుంచి వెనక్కి బయలుదేరాం.

టైమ్‌ ఒంటిగంట కావస్తోంది. ”ఎక్కడికి” అని అడిగాను ఆలీని. ”బిడ్‌ వాటర్‌ ఫాల్‌” అన్నాడు. ”ఓహో! జలపాతమా” దట్టమైన తేయాకు తోటల్లోంచి ఒక గ్రామానికి తీసుకెళ్ళాడు. సన్నటి రోడ్డు. కొండలమీద పరచుకున్న తేయాకు తోటల్లోంచి ఉధృతంగా దూకుతోంది జలపాతం. అరలు అరలుగా కనిపిస్తున్న టీ తోటల మధ్యనుంచి తెల్లటి నురగలా కనిపిస్తున్న జలపాతం మహాద్భుతంగా ఉంది. అక్కడ మనుష్యులెవరూ లేరు. అప్పుడే అటుగా నడిచి వస్తున్న ఇద్దరమ్మాయిలు కనిపించారు. వాళ్ళనడిగి ఫోటో దిగాను. ‘ఎక్కడినుంచి వస్తున్నారు?’ అంటే టీ కంపెనీలో ఇంటర్వ్యూకెళ్ళి వస్తున్నారట. స్పష్టమైన ఇంగ్లీషులో చెప్పారు. చాలాసేపు ఆ జలపాతాన్ని చూస్తూ నిలబడిపోయాను. ఎంత రమణీయ దృశ్యం నాకళ్ళముందుంది? టైమ్‌ నెత్తిమీద ఓ మొట్టికాయ వేస్తుంటే అయిష్టంగా అక్కడినుండి కదిలాను.

కారు కొచ్చివైపు బయలుదేరింది. మున్నార్‌ని వదిలేసి కొత్త దారిలో ప్రయాణం. రెండు రోజులుగా ఎక్కిన కొండల్ని దిగడం మొదలయింది. నాలుగైదు గంటల ప్రయాణమది. దారి పొడుగునా లెక్కలేనన్ని జలపాతాలు, సెలయేళ్ళు కనిపించాయి. అడవిలోంచే ప్రయాణం. నిజానికి అవన్నీ రకరకాల తోటలు. కొబ్బరి, పోక, కర్ర పెండలం, పసుపు, అరటి… అన్నీ కలగలిసిపోయి అడవిలాగానే

ఉన్నాయి. ఈ దారిలో మిరియాల తోటలు ఎక్కువగా కనిపించాయి. యాలకుల తోటలు అస్సలు కనబడలేదు. మధ్యలో లంచ్‌ కోసం ఓ హోటల్‌ దగ్గర ఆగాం. ఆలీని నాతో రమ్మంటే రానన్నాడు. ”కాస్ట్ల్లీ… యూ గో… ఐ దేర్‌” అంటూ ఇంకో చిన్న హోటల్‌వైపు చూపించాడు. ”నో… నో… యూ ఆల్సో కమ్‌” ”నో… ఐ దేర్‌” అంటూ అటు వెళ్ళిపోయాడు. ఫిష్‌, సాలాడ్‌, ఆర్డర్‌ చేస్తే గంట ఆలస్యం చేసి పుల్ల పెరుగుతో వచ్చాడు. పెరుగు వద్దని చెప్పి నాలుగు తిట్లు తిట్టి హోటల్‌ నించి బయటపడ్డాను. ఆలీకి చెబితే నేను సరిగా తినలేకపోయానని చాలా బాధపడిపోయాడు. మరో హోటల్‌ దగ్గర ఆపనా అని అడిగాడు. వద్దు పోదామన్నాను. దారి పొడుగునా కొండల్లోంచి, వాలుల్లోంచి జారిపడుతున్న అసంఖ్యాకమైన జలపాతాలు. తిరుగు ప్రయాణం కూడా అంతే ఉత్తేజితంగా సాగింది. కొన్నిచోట్ల దిగిపోవడం, టైమ్‌ చూసుకుని పరుగెత్తడం… మళ్ళీ ఏదో ఒకటి కళ్ళకు అడ్డం పడడం, ఆగిపోవడం అలా… అలా సాగి ఏడు గంటలకి కొచ్చి చేరాం. కొచ్చిలో గూటి పడవలు గుర్తొచ్చాయి. విమానం రా రమ్మని పిలుస్తోంది. సుచిత్రకి ఫోన్‌ చేసి మాట్లాడాను.

ఆలీ నన్ను ఎయిర్‌పోర్ట్‌లో దింపేశాడు. రెండు రోజులకు నేను మాట్లాడుకున్న ఛార్జ్‌ కాకుండా కొంచెం ఎక్కువే టిప్‌ ఇచ్చాను. అది చూసి అతని ముఖం వికసించినపుడు నాకు చాలా సంతోషమన్పించింది. రెండు రోజులపాటు నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. అన్నీ చూపించాడు. అతను చూపించకపోతే నేను చేసేది ఏమీలేదు, నాకేమీ తెలియదు కాబట్టి. ముఖ్యమైన ప్రదేశాలన్నీ తిప్పాడు. ఆలీకి థాంక్స్‌ చెప్పి ఎయిర్‌పోర్టులోకి నడిచాను. చెకిన్‌ అయ్యాక లోపలికెళితే లోపలంతా, మొత్తం ఎయిర్‌పోర్టంతా సోఫాల మయం. ఒకేలాంటి సోఫాలు. దీని వెనక ఏదో కథ ఉండే ఉంటుంది అనుకుంటూ ఫ్లయిట్‌ వేపు వెళ్ళాను. దీనితో నాలుగు రోజుల ప్రయాణం ముగింపుకొచ్చింది.

విమానంలో సెటిల్‌ అయ్యి కళ్ళు మూసుకుంటే ఓ అద్భుత ప్రపంచం కళ్ళముందుకొచ్చింది. దృశ్యం తర్వాత దృశ్యం సినిమా కదలాడుతోంది. ఆ సమయంలో ఎవరైనా నా ముఖం చూస్తే, నా చిరునవ్వుని గమనిస్తే, నాలో ఎగసిపడుతున్న ఆనందం అర్థమయ్యేది. కోయంబత్తూర్‌లో యోగా సెంటర్‌ దగ్గరి వాన సంగీతంతో మొదలై జ్ఞాపకాల ఊటలు… జలపాతాలై, పశ్చిమ కనుమల సౌందర్యమై, సెలయేళ్ళై, అడవులై, తేయాకు తోటలై, యాలకుల వనాలై… ఏమి సౌందర్యం, ఏమి పచ్చదనం. మనసంతా మహోద్విగ్నమైపోయింది. ఈ అనుభవాలన్నీ అక్షరాలుగా జాలువారే వరకు నా లోపల అలాగే, చెక్కు చెదరకుండా నిలిచి ఉంటాయి. పొల్లుపోకుండా, గాఢానుభూతిని మళ్ళీ మళ్ళీ పొందుతూ రాయగలిగిన కళ నాకు ఎలా అలవడింది? ఎప్పుడు అలవడింది? ఏమో!! నాకు తెలియదు. చెయ్యి నొప్పెడుతున్నా కలం ఆగకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది. దృశ్యం తరువాత దృశ్యం మనసులో స్ఫురించి, చేతివేళ్ళలోకి ప్రవహించి కలాన్ని పరుగులు పెట్టిస్తుంది. నా ప్రయాణం రెండోసారి మొదలైంది, ఇదిగో ఇలా అన్నమాట.

ఈ మొత్తం ప్రయాణంలో నన్ను బాగా బాధించిన అంశం ఒకటుంది. నేను చూసిన మేరంతా, నాకు కనబడిన స్త్రీలు చాలా విచారంగా, అలసటగా, నిర్వికారంగా కనిపించారు. మగవాళ్ళు మాత్రం హుషారుగానే కనిపించారు. సంతోషంగా ఎందుకు లేరో, ముఖాల్లో అంత నిర్వేదం ఎందుకో నాకు అర్థం కాలేదు. బహుశా కేరళ పచ్చదనాన్నంతా సృష్టిస్తున్నది మహిళలే కావచ్చనిపించింది. అక్కడ మద్యం ఏరులై పారుతుంది. మగవాళ్ళు మద్యంలో మునిగి తేలితే మహిళలే పచ్చదన సృష్టికర్తలేమో! పని వొత్తిడి, మద్యం తెచ్చే హింస… వాళ్ళ ముఖాల్లో నవ్వు, సంతోషం మాయమవ్వడానికి ఇవి కూడా కారణమేమో! ఏమో!! ఇది నా ఊహ మాత్రమే. నిజం కాకపోవచ్చు.

ప్రయాణాన్ని ప్రేమించే నేను, ఏకాంత ప్రయాణాన్ని మరింతగా ఇష్టపడడానికి కారణం నాతో నేను గడపగలగడమే. స్నేహితులతో ప్రయాణం ఉల్లాసంగా ఉంటుంది. నాతో నా ప్రయాణం ఉద్విగ్నంగా ఉంటుంది. నాకెంతో ఉద్విగ్నంగా అనిపించింది నాతో ఉన్నవాళ్ళకి పేలవంగా అనిపించొచ్చు. అందుకే చాలాసార్లు నేను ఒంటరిగా ప్రయాణించడానికే ఇష్టపడతాను. ఈసారి చేసిన ఏకాంత ప్రయాణం… ఆకుపచ్చని లోకాల్లోకి చేసిన ప్రయాణం మహదానందంగా సాగిందనేది నిజం. ఎంతోమంది నాకు సహకరించారు. అందరికీ వందనం.

Share
This entry was posted in యాత్రానుభవం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.