‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’ యిది నా బాల్యంలో జరిగిన కుల భంగపాటు. అవి యింకా మానని పుండ్లయి సలుపుతనే వుంటయి, రసి కార్తనే వుంటయి. నాకు మంచి దోస్తు లీల. యిప్పటికి ఆమె స్నేహం యాదొస్తే కళ్ళల్లో చెరువులు దునుకుతయి. నా బాల్యంలో జరిగిన కుల అవమానాలు, పసితనంలో అట్లా ఎందుకో ఏమో తెలువక పొర్లి పొర్లి యేడ్చిన పొరలు పోర్కాడ్తనే వుంటయి. ఆ పొరల నుంచి తెర్లిందే ‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’ కత. మా దోస్తుకు నాకు కులం దెలువది. ఆటపాటలు సదువులు అప్పుడప్పుడు సోకులు గిదే బల్లె లోకం. కాని యింటికొస్తె వూల్లె అసలు బత్కులతో అల్లల్లాడేవి ఆ పసిమనసులు.
ఆ మానని గాయం గండిని కతగా చెప్పిన ‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’. నాకు పంద్రాగస్టుకు కొత్త యూనిఫామ్ లేదంటే… మా దోస్తు దొంగతనంగా తన పుస్తకాల బ్యాగులో పెట్టి తెస్తే… పంద్రాగస్టును మురిపించిన. నేను, మా దోస్తు బట్టలేస్కున్ననని తెలిసి వాల్లమ్మ ”ఆ బట్టలు తెర్లయిపాయె గదెనే గా మాదిగోల్లు పిల్లేస్కున్న బట్టలు మల్లా యెట్లేస్కుంటవే” అని తగలవెట్టిన తీవ్ర కుల వివక్షలు ఆ పసి మనసును ఎంత చిద్రం జేసిందో ననే కతే ‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’.
యిట్లాంటి వివక్షే దాదాపు 200 ఏండ్ల కింద మహాత్మ జ్యోతిరావు ఫూలేకి కూడా జరిగింది. నిమ్నకులం వాడైన జ్యోతిరావు ఫూలేని తన దోస్తు (బ్రాహ్మిన్) పెండ్లికి పోతే… తరిమేసినరు దోస్తు పెద్దవాల్లు. (ఆనాడు బాల్య వివాహాలు మామూలే అందరికీ). పెండ్లికి బోతే ‘నీచజాతోన్ని ఎందుకు పిలిచినవని పూలే దోస్తును తిట్టి, పూలేను ఆ పెండ్లి గుంపునుంచి వెళ్ళగొడ్తరు. ఆ అవమానం భరించలేక పూలే నాలాగే ఏడ్చుకున్నడేమో! పూలే ఇంటికొచ్చి తమ వాల్లకి చెప్తే అది మామూలేరా వాల్లు మంచోల్లు పొయినందుకు చంపకుండా వదిలేసిండ్రు, సంతోషపడమన్నారట. అంత దుర్మార్గంగా, క్రూరంగా వుంటయి కుల వివక్షలు. 200 ఏండ్ల తర్వాత కూడా పూలే అనుభవాలు యింకా కొనసాగడంను ఏమని నిర్వచించుకోవాలి సమాజాన్ని?
అయితే ‘బల్లెనే దోస్తు వూల్లె గాదు’ అనే నా కతను సాంఘిక సంక్షేమ గురుకులాల నిర్వాహకులు ‘దోస్త్’ అనే పేరిట లఘు చిత్రాన్ని తీసిండ్రు. వీరు సమ్మర్ క్యాంపులు పెట్టి గురుకులాల్లో చదువుకునే పిల్లల్లో వుండే భిన్నమైన టాలెంట్స్‌ని బైటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం గొప్ప సంగతి. అట్లా ఆదిలాబాద్ జిల్లా యిచ్చోడ సాంఘిక సంక్షేమ గురుకులంలో పదో తరగతి చదువుతున్న యానాం అనూషతో దర్శకత్వం చేయించడం యింకా గొప్ప సంగతి. యీ సందర్భంగా అనూషకి అభినందనలు. అట్లనే కుల వివక్షల నేపథ్యాలున్న కతల్ని తీసుకొని లఘు చిత్రాలు, భారీ చిత్రాలు, టీవీ సీరియల్స్‌గా పెద్ద ఎత్తున వచ్చి అవి కుల నిర్మూలనకు దారితీసి, మనిషి మనిషిగా మానవ విలువల సమాజంగా మారాలి. కాని నిత్యం జీవితంలో కులాన్ని ఎదుర్కొంటూ, ఆపరేట్ చేస్కుంటున్న వాల్లు ఆ కుల అనుభవాల్ని, వివక్షల్ని, బాకున కుమ్మిన బరిసెల్ని అవాచ్యం చేస్తుంటరు.
కుల వివక్షల మీద ‘దోస్త్’ లఘు చిత్రం రావడం, అది ఒక పదో తరగతి బాలిక డైరెక్ట్ చేయడం, అది అంతర్జాతీయ బాలల చలన చితోత్స్రవం (Iజఖీఖీ) లో ఎంపిక కావడం చాలా చాలా సంతోషం. అది మీడియా కూడా చాలా హైలేట్ చేయడం సంబురమే.
బాధాకరమైన విషయమేంటంటో నా కత అయిన ‘బల్లెనే దోస్తు వూల్లెగాదు’ను వున్నదున్నట్లు ఏమి మార్చకుండా అంటే ఆ కతలోని శ్రీలత, సువర్ణ పాత్రల పేర్లు కూడా మార్చకుండా పొల్లు పోకుండా తీస్కున్నారు కాని నా పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్తపడిండ్రు సోషల్ వెల్ఫేర్ గురుకులాల నిర్వాహకులు. మూల కత మా అనుభవాల్నించి వచ్చిందనే చెప్పించారు గానీ… నా పేరు ఎక్కడా మెన్షన్ చేయలేదు. లఘు సినిమా గొప్పతనం, డైరెక్టర్ ఒక బాలిక కావడం, కథాంశం, అంతర్జాతీయంగా ఎంపిక కావడంను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది ‘దోస్త్’ అనే లఘుచిత్రాన్ని. కాని ఆ ‘దోస్త్’ అనే కత ‘బల్లెనే దోస్త్ వూల్లెగాదు’ అనే కత అని గానీ, అది రాసిన కథయిత్రి ‘జూపాక సుభద్ర’ అని కాని ఎక్కడా ఉత్తరించకపోవడం బాధాకరము. మామూలుగా అయితే, సినిమా తీసేముందు రచయిత పర్మిషన్ అడగాలి అది కూడా జరగలే, రచయితకు సినిమా తీసే విషయం తెలపాలి. కనీసం అది కూడా జరగలే. కనీసం ఆ లఘు సినిమా కథ ఎక్కడిది, ఎవరిది అనే విషయం కూడా దాచి పెట్టడం దారుణం. ప్రభుత్వం, సంస్థల నిర్వాహకులు కూడా యిట్లా చేయడంను ఏమనాలి?
ఏంటిది? అని అడిగితే… తెలువది… తెలువది అని సమాధానాలు. రచయితకు తెలుపడం, రచయిత పేరు పెట్టడం కనీస బాధ్యత. దళిత మహిళలు, అందులో మాదిగ మహిళలంటే చాలా నిర్లక్ష్యం, చిన్నచూపు. వారు వల్నరేబుల్. వాల్లని, వాల్ల హక్కుల్ని ఏ రూపంగా ధ్వంసం చేసినా ఏం గాదనే ఒక కుల మగ అహంకారాలు, ఆధిపత్యాలు చెలామని అవుతున్న కాడ మా గొంతులు గోరంత దీపాలై మండుతనే వుంటయి.