అమానవీయ ఆచారాల నిర్మూలనలో సావిత్రీబాయి ఫూలే కృషి -అనిశెట్టి రజిత

 

నూటా ఎనభై సంవత్సరాల క్రితం మనది క్రూరమైన దురాచారాలు, అణచివేతలు, ఆధిపత్యాలతో కునారిల్లుతున్న సమాజం. భారతదేశానికి స్వాతంత్య్రం అనేది ఇంకా 70-80 ఏండ్ల దూరంలో ఉన్న కాలం. ఒకవైపు కులస్వామ్యం, మరొకవైపు భూస్వామ్య మతస్వామ్యం అత్యంత హేయంగా రాజ్యమేలుతున్న కాలం అది.

శూద్ర-అతి శూద్ర కులాల జనం పశువులకన్నా హీనంగా, మానవ గౌరవం లేకుండా నీచంగా చూడబడుతూ అణచివేతలకూ, శ్రమ దోపిడీ, అంతరానితనంతో శిక్షింపబడుతున్న సామాజిక దుస్థితి నెలకొన్న సమయం అది. అలాంటి పరిస్థితులలో కాలం కన్నా ముందుగా సంస్కరణలను ప్రవేశపెట్టిన తాత్వికులు, దార్శనికులు, మహనీయులు, మానవతావాదులు ఎందరో పుట్టుకొచ్చారు. ఆధునిక యుగారంభం ప్రారంభమయంది.

కాలం సాంఘిక మార్పులను, సంస్కరణ కార్యక్రమాలను ప్రసవించడానికి నిండుగా గర్భం ధరించి వేచి ఉన్న సందర్భం. బ్రాహ్మణీయ మతాధిపత్యం దురహంకారంతో సమాజాన్ని శాసిస్తూ దేవుళ్ళలా పూజలందుకుంటున్న వాతావరణంలో కింది కులాల వాళ్ళు, స్త్రీలు గడప దాటడం, చదువులు నేర్వడం ధర్మభంగంగా, అపచారంగా, అనర్థంగా భావించబడేది. ఎవరైనా వాటిని ఉల్లంఘించబోతే దారుణ శిక్షలు అనుభవించాల్సి వచ్చేది.

అస్పృశ్యులు మూతికి ముంతా, నడుముకు చీపురు కట్టుకుని నిర్ణీత వేళల్లో నిర్ణీత దారుల్లో మాత్రమే బయటకు నడిచి పోవాల్సిన దీన పరిస్థితి.

బ్రాహ్మణుల్లో బాలికలకు బాల్యంలోనే వయసు మళ్ళిన వ్యక్తితో వివాహం జరిగి… ఆ వ్యక్తి మరణిస్తే కులగౌరవమనీ కుటుంబం, వంశ మర్యాదను కాపాడేందు కోసమని వైధవ్యం పొందిన బాలికకు/యువతికి వెంటనే శిరోముండనం చేయించడం అనేది ఆనాటి ఆచారం. అది వాళ్ళకు పవిత్ర ఆచారం. కానీ మానవీయ దృష్టితో చూస్తే అది దుర్మార్గమైన దురాచారం. సాంఘిక నేరం.

వితంతువైన స్త్రీల శవాలకు కూడా శిరోముండనం అంటే తల వెంట్రుకలు గొరిగించి వారిని వికృతం చేసి తృప్తిపడే మూర్ఖత్వంతో తమ దాష్టీకం చెల్లుబాటు చేసుకునే కాలం. స్పష్టంగా చెప్పవలసి వస్తే అది చీకటి యుగం. గతం, వర్తమానం, భవిష్యత్‌ అంతా అంధకారమయం.

అలాంటి దుర్భర పరిస్థితులున్నా మరాఠా సమాజంలో మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో వేగు చుక్కలు పొడిచినట్లు సంస్కరణ వాదులు జన్మించారు. వారిలో జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలు… వారు స్థాపించిన సత్యశోధక సమాజ్‌ సభ్యులు ఉన్నారు. వారు అప్పుడున్న సమాజపు అమానవీయమైన కట్టుబాట్లను, నియమాలను, నీతులను నిలదీశారు, ప్రశ్నించారు, నిరసించారు. ధిక్కార శంఖం పూరించి ప్రత్యామ్నాయ నియమాలను, ఆచారాలను ప్రతిపాదించారు. ఆచరణాత్మక ఉద్యమాలకు ఓనమాలు దిద్దారు. సమసమాజం కోసం ముందడుగులు వేసిన సాహసికులుగా చరిత్రను మలుపు తిప్పి కొత్త మార్గంలో నడిపించ పూనుకున్నారు.

అజ్ఞానం వల్ల నిమ్న కులాల పేద జనం దుర్భరమైన బతుకులు గడుపుతున్నారనీ, దానికి అవిద్య కారణమని భావించి 1848లో శూద్ర బాలికల కోసం పూణే పట్టణంలోని బుధవారపు పేటలో జ్యోతిరావు ఫూలే పాఠశాలను ప్రారంభించారు. మహిళా ఉపాధ్యాయినుల అవసరాన్ని గుర్తించి చదువులో తన భార్య సావిత్రీబాయికి, ఫాతిమా షేక్‌కు శిక్షణనిప్పించి వారిని ఆ బడిలో ఉపాధ్యాయినులుగా నియమించాడు. ఫూలే ఆ విధంగా అర్థంలేని కఠిన నియమాల సంకెళ్ళను తెంచి వేస్తూ గడపలోపల, వంటింట్లో పొగలో మగ్గిపోతున్న స్త్రీలకు, ఆనాటి అగ్రకుల సమాజం ఈసడించుకునే దళిత బాల బాలికలకు విద్య నేర్పడానికి ప్రోత్సహిస్తూ సాహసోపేతమైన పునాది వేశాడు.

… … …

భారతదేశపు స్త్రీ లోకం బరువైన ఇనుపద్వారాలను తోసుకుని, గృహ బానిసత్వపు ఇనుప కచ్చడాలను తెంచుకొని వెలుగుల ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి తొలి అడుగు సావిత్రీబాయి, ఫాతిమాషేక్‌ల రూపంలో పడింది. ఆధునిక భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచరుగా సావిత్రీబాయి కొత్త చరిత్రకు నాంది పలికింది. ధర్మ భ్రష్టత అని ఆనాడు కుల, వర్ణ సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న దురహంకారులు వారిపై విరుచుకుపడి భౌతిక దాడులకు పాల్పడినా ఫూలేలు ధర్మబద్దమైన పనిని చేపట్టి అవిద్య, అజ్ఞానంలో కొట్టుకుపోతున్న లక్షలాదిమంది వెనుకబడిన కులాల ప్రజల ఉద్ధరణకు దృఢంగా అడుగులు వేశారు. ఆనాడు సంస్కరణ అనేది సామాన్యమైన విషయం కాదు. అది పదిమందీ నడిచే బాట కాదు, సంఘానికి వ్యతిరేకమైన పని చేయాలంటే ప్రాణాలమీద ఆశ వదులుకోవాలి.

ఒక శూద్ర కులానికి చెందిన స్త్రీగా అలాంటి సాహసాలకు సహకరించడం, ముందుకు రావడం అనేది అత్యంత దుస్సాహసం. జ్యోతిబా సాహచర్యంలో సావిత్రిబాయి అనేక పుస్తకాలు చదివేది. ఆ చదువుల వల్ల నానాటికీ ఆమె మనోవికాసం చెంది జ్ఞాన జ్యోతుల్ని దర్శించేది. నల్లజాతి వారి స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు థామస్‌ క్లార్క్స్‌ జీవిత చరిత్రను చదివి ప్రభావితమై సమాజ సేవకు దృఢంగా ముందడుగులు వేసింది.

ఆ రోజుల్లో వితంతువుల సమస్య శూద్ర కులాల వారిది ఏ మాత్రం కాదు. అది సమాజంలో పైస్థాయిలో ఉన్న బ్రాహ్మణ, రాజ్‌పుత్‌ వర్గాలకు, వారి వంశాలకూ సంబంధించింది. వితంతు స్త్రీకి సాధారణ జీవితం గడిపే హక్కు లేదు. భర్త మరణిస్తే వెంటనే గుండు గొరిగించుకోవాలి. అది శాస్త్రం అనబడే జీవిత శాపం.

సావిత్రీబాయి వితంతు వివాహాలను సమర్ధించడమే కాకుండా ఒక ఉద్యమంగా నిర్వహించేందుకు కూడా తోడ్పడింది. 1864లో ‘సత్యశోధక సమాజ్‌’ ద్వారా మొదటిసారిగా ఒక వైష్ణవ వితంతువుకు పునర్వివాహం జరిపించి అర్థంలేని కట్టుబాట్ల అమానవీయతను ధిక్కరిస్తూ మరో సాహసోపేతమైన సంస్కరణకు ముందడుగు వేసింది. 150 ఏళ్ళ క్రితం జరిగిన ఈ సంఘ సంస్కరణ కార్యక్రమం భవిష్యత్‌ తరాలకు మనోధైర్యాన్నీ, సంస్కరణా శక్తినీ ఇచ్చింది.

భర్తలు చనిపోయిన బ్రాహ్మణ బాలికలు, యువతులు వారి వారి కుటుంబాల లోపల అత్యాచారాలకు గురై గర్భం ధరించేవారు. కుటుంబ, వంశీకుల పరువు కోసం నాటుపద్ధతుల్లో ఆ గర్భం తొలగించేందుకు ప్రయత్నించేవారు. అది వికటించి వారు ప్రాణాలు కోల్పోతుండేవారు. అట్లాంటి అసంఖ్యాకమైన బాధిత స్త్రీల కోసం తమ ఇంటిలోనే ”బాల హత్యా నిరోధక” గృహాన్ని ఫూలే దంపతులు ఏర్పాటు చేశారు. దాన్ని సావిత్రీబాయి ఒక నర్సు సహాయంతో నిర్వహించేవారు. ”నిర్భయంగా వచ్చి ఈ గృహంలో పురుడు పోసుకుని పిల్లల్ని కనవచ్చు సోదరీమణుల్లారా” అని పుణ్యక్షేత్రాలున్న ప్రదేశాల్లో పోస్టర్లు వేసేవారు.

… … …

బ్రాహ్మణ వితంతువులకు జుట్టు తీయించి గుండు కొట్టించడాన్ని ఆపడానికి సావిత్రీబాయి మంగలి వాళ్ళందరినీ కూడగట్టే ప్రయత్నంలో లోఖాండేతో సహకరించారు. మంగలివాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసే కష్టతరమైన పనిని చేపట్టి ”మీరు ఆడవాళ్ళకు గుండు చేసే పని ఆపేయాలి” అని చెప్పారు. అందుకు మంగలి వాళ్ళు ”మేమా పనిని ఆపేస్తే మాకు తిండి ఎవరు పెడ్తారమ్మా” అని అడగడంతో ”నేను పెడతాను, మీరా పనిని ఆపెయ్యండని” సావిత్రిబాయి వారికి నచ్చచెప్పబోయారు. దానికి వారు ”మీరు ఎంతమందికి తిండి పెడ్తారమ్మా, మేమా పని చేయకపోతే మరెవరైనా ఆ పని చేస్తారని” అనేవారు మంగలివాళ్ళు.

అప్పుడామె ”జుట్టు తీయించుకునే పని ఆ స్త్రీలకు ఇష్టం లేదని మీకు తెలుసా?” అని అడిగిన దానికి ”చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు కదా, ఇష్టమున్నా లేకున్నా సంఘాచారం ప్రకారం నడుచుకోవాలి కదా” అని వారు అన్నారు. ఆమె ”ఏ సంఘం? ఎవరు ఈ ఆచారాలన్నీ పెట్టింది? ఏ వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో మీ చెల్లెళ్ళకు, అక్కలకు, తల్లులకు గుండు చేయించమని రాసుంది? ఏ పుస్తకంలో రాసుంది?” అని అడుగుతూ ”చదువొచ్చిన వాళ్ళు అలా రాసుందని చెప్తున్నారు, అది మీరు నమ్ముతున్నారు. కానీ మీరు చదవండి, రాయడం, చదవడం మీకు నేను నేర్పుతాను. అంతేకానీ మీరు చేయకూడని పని చేయకండి. చదువొచ్చినవాళ్ళు ఇష్టమొచ్చినట్లు చెప్తారు. అంతమాత్రాన అదంతా సబబేనా? మీకు చదువు జ్ఞానం లేకపోవడం వల్ల అదంతా నిజమని నమ్మి ఆ ఆడవాళ్ళను బాధపెడ్తున్నారు” అని సవివరంగా చెప్తారు.

”మా ఆడవాళ్ళకు గుండు చేయండని చెప్పే తండ్రులు, మామలు, అన్నలూ స్వయంగా వాళ్ళే ఆ పని ఎందుకు చేయరు? వాళ్ళ చేతులతో వాళ్ళా పని చేస్తారా?” అని అడగడంతో మంగలివాళ్ళు ”మీరు చెప్పేది బాగానే ఉంది కానీ దీన్ని ఎదిరించడానికి మాకు భయంతో వణుకొస్తోంద”ని అంటారు.

ఈ వాదన జరిగిన తర్వాత ఆ రోజుల్లో జున్నార్‌, వాయి, గంగాధాడి, పూనా, బొంబాయి ఊర్ల నుండి వెయ్యిమంది మంగలివాళ్ళు వచ్చి బొంబాయిలో ప్రదర్శన నిర్వహించారు. వాళ్ళ కత్తుల్ని దించేసి తిండికి మాడడానికైనా సిద్ధమన్నారు. తమ తల్లులు, అక్కచెల్లెళ్ళ పట్ల జరిగే ఈ అవమానాలు, ఆమానుషాలు ఆగాలని కత్తులు దించేసారు. ఆ ఊరేగింపునకు డొబాన్వావి అనే వృద్ధుడైన మంగలి ముందు నిలిచి సారధ్యం వహించాడు. బాబాజీ మోరే అనే మంగలి ఒక వ్యాసం రాసి వాళ్ళందరికి చదివి వినిపించాడు.

ఆ మంగలి వాళ్ళందరూ తమవాళ్ళు కాని, తమ స్త్రీలు కాని వాళ్ళందరి కోసం, బ్రాహ్మణ స్త్రీల జుట్టు తీయకూడదని తీర్మానించుకున్నారు. తమ తమ ఇళ్ళల్లో వితంతు స్త్రీల జుట్టు తీయాలనుకునే మగవాళ్ళకు కూడా తామా పనిచేయబోమని తీర్మానించుకున్నారు. మరో ఆలోచన లేకుండా మంగలివాళ్ళు స్త్రీల మంచికోసం ముందుకొచ్చారు.

ఆనాటి భూస్వామ్య-మత వ్యవస్థల కరడుగట్టిన వికృతత్వాన్ని బద్దలుకొట్టిన విప్లవాత్మకమైన సంఘటన అది. సావిత్రీబాయి ఫూలే సమన్వయంతో స్త్రీల పరంగా స్త్రీల కోసం చేసిన సంస్కరణవాద సాహసం ఆ ఘటన. మంచి పనులు చేయడానికి మంచి హృదయముండాలి. మంచి ఆలోచనలు మనల్ని ముందుకు పోయేలా ప్రేరణనిస్తాయి.

శతాబ్దంన్నర క్రితం ఇన్ని మంచి పనులకు నాంది జరిగితే ఈ ఆధునిక యుగంలో ఇంకా మూర్ఖత్వాలూ, మూఢత్వాలూ ఎందుకు? సభ్యత, నాగరికత, మానవత, సమానతలు పాటించే సమాజానికి మనమింకా ఎంత దూరంలో

ఉన్నాం? ఇది ప్రజాస్వామ్య సమాజమంటారే… దానిలో స్త్రీలకు లేదా భాగస్వామ్యం? ఆలోచించాలి. వితంతు వివక్షతను రూపుమాపడానికి ముందడుగు వేయాలి. అందుకు ఈ ఆధునిక యుగంలో ఎదిగిన మనుషులం కావాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ వితంతు వ్యవస్థను నిరసించాలి. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి. అందరం మాట్లాడాలి. అందరం ఎదిరించాలి. అందుకు ప్రేరణకు సావిత్రిబాయి ఫూలే శతాబ్దంన్నర క్రితమే ముందడుగు వేసింది. మనం అంతకంటే వెనకబడి ఉన్నామా?

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.