ఏ పూటకాపూట
ఆకలేస్తున్న కాలం
కొత్త సంతకం
భావాల ఉక్కపోతలో
క్షణానికో పులకరింతల వసంతం
ఇల్లు ఒక పాతబడిన వస్తువు
చేతికందని జీవితం ఒక విండో షాపింగ్
ఆన్‌లైన్ పేజీల నయాగరా ఫాల్స్‌లో
భావోద్వేగపు సబ్ మెరైన్ల ఈత
కుప్పలుగా పేర్చిపెట్టిన బట్టల్లా మనుషులు
మాల్స్‌లో
తొడుక్కొని వదిలేసిన డ్రెస్సుల్లా
వివాహ బంధాలు
టేకాఫ్ ఎప్పుడో తెలియని రన్ వే బ్రతుకులు
కూలిపడే రెక్కల పక్షులు
హత్తుకొన్న చలిరేణువులన్నీ
విచ్చుకుపోతున్న వేసవిమబ్బులు
దూరమౌతున్న పచ్చదనంలో
వైశాల్యం పెంచుకున్న రావిచెట్ల సంగీతం
నిశ్శబ్దంగా చూస్తున్న వేకువ
బంధమని భ్రమపడుతుంటాంగానీ
ప్రేమ కరువైన చోటల్లా
అన్నీ అవసరాలే
అంతా గొప్పదనమే
ఈ ప్రేమే పాతది
తొడుక్కొని ఎలా వదిలేస్తుంటారో…
ఈ మనసును
ఏసీలో కూర్చోబెట్టాల్సిన కాలమేదో
పదేపదే తలుపుతడుతుంది
ఈ ట్రయల్ రూమ్ అద్దాల్ని
శుభ్రంగా తుడిచేయాలనుంది
కనీసం నాకు నేనైనా మిగలడానికి