ఓ నరసక్కా, ఓ స్టెల్లా, ఓ మౌలాబీ
ఆడెవడో దేశాన్ని ముందుకు తీసుకుపోతా అంటాండే!
మీరేమో ఆ ఎనకటెప్పుడో అమ్మమ్మలు, నాయనమ్మలు
వాడిన పాత గుడ్డముక్కలు
ఇంకెంత కాలం వాడతరే?
నెలకు నాలుగైదు రోజులు
సంవత్సరానికి అరవై రోజులు
జననాంగంలోని మొగి తెగ్గోస్తున్న గీతకత్తి
ఎరుపురంగు పూసుకున్న కేసుమెంటు తెల్లగుడ్డముక్క
ఉతికి ఉతికి ఆరేసి ఆరేసి చదలుతిన్న ఉలిపిరి కాగితం
ఇకనైనా ఆ కేసుమెంటు గుడ్డముక్క ఆపరాదండే!
లేకుంటే?
దునియా డవలప్మెంటు పరుగుల ఎనక బడతదంట
మన దేశంల యాపారం జేసుకొనేటోడు
బజారులోబడి అడుక్కుతినే రోజులు వస్తయంట
మీరు గూడ జరంత సాయం చేయాలే
ఏకష్టమైన బడతం
మా నెత్తురు చెమట జేసీ యాపారానికి పోసి
దేశాన్ని బతికించుకుంటమ్ అనకండి
మా అవ్వ, నా పెళ్ళాం, నా బిడ్డ గూడ
గా టీవీలల్ల సూపెట్టే దూది దిండ్లు వాడుతున్నరు
మీరు గూడ వాడితే!
దేశానికింత ట్యాక్సు, యాపరం గుడ మెరుగైతదంట
ఏందీ ఏమన్నవ్?
ఎవడు వాడు ఆ మాటన్నది?
ఆడదాన్ని, అమ్మని
యాపారం జేసుకొని బతుకుతనన్న మృగం
మురిగిన నా ముట్టుతో తయారైన మాంసపోడు
వాడు కప్పుకున్న నా ఆడితనపు సర్మానికి టాక్స్ ఎంతిస్తడో జెప్పి
నా కాడికి రమ్మను అప్పుడు కడతా ట్యాక్సు