ముందుగా వాళ్ళు
ముక్కు చెవులు కోశారు
ఆనక అగ్ని పరీక్ష అన్నారు
ఆపై పందెంలో పావులు చేశారు
ఎప్పుడో కదా అనుకున్నా
చితిపైకి నెట్టేశారు
శుల్కానికి అమ్ముకున్నారు
విధవను చేసి ఆడుకున్నారు
ఇప్పుడలా లేదులే అనుకున్నా
కట్నాలు తగలేసినా
నిలువునా తగలబెట్టారు
పొయ్యిలో పెట్టి నెయ్యేసి కాల్చారు
అత్యాచార పర్వాలు
చర్విత చరణమైనప్పుడు
‘షరా మామూలే…’ అనుకున్నా
నాదాకా వచ్చారు
అన్ని హింసలూ కలిపి
ఉమ్మడిగా
దాడికి సిద్ధమయ్యాయని
అర్థమైంది!
చుట్టూ చూశాను
నిశ్చేష్టనయ్యాను
ఎవరి దారి వారు… ఏమీ పట్టనట్టు…
చరవాణిలో చిత్రీకరిస్తున్నారొకరు
నా నడతను వక్రీకరిస్తున్నారింకొకరు!
నాలాగే వాళ్ళూ…
‘మామూలే’ అనుకున్నట్టుంది!
అందులో తప్పేముంది!!
నేటి వీళ్ళంతా ఎవరు
నిన్నటి ‘నేను’లే కదా!
కానీ రేపు అలా
తెల్లారకూడదనుకున్నా…
కాళ్ళలోకి బలం తెచ్చుకున్నా!!
నాలోంచి ఒక గర్జన!
తరతరాల తమస్సు బద్దలై
నిర్వేదం నిద్రవీడినట్టు!!
ఊరు ఉలిక్కిపడి లేచింది!!!