ఫూలే, అయ్యంకాళి, అంబేద్కర్‌, పెరియార్‌ల ఉద్యమపథంలో మహిళ -అనిశెట్టి రజిత

 

మానవ సమాజం ఏ తొలిరోజుల్లోనో తప్ప అన్ని యుగాల్లోనూ అన్ని కాలాల్లోనూ, అన్ని తరాల్లోనూ ఒక అణిచివేత చట్రం పరిధిలో మానవ సంబంధాలను బంధించి బాధిస్తూ వచ్చింది. సమాజం ఒక స్వరూపంగా ఏర్పడక ముందు గుంపులూ, గణాలుగా ఉన్నప్పుడు, సొంత ఆస్తి అనేది తెలియకముందు ‘మాతృస్వామ్యం’ అనే స్త్రీ నాయకత్వ నిర్దేశకత్వం ఉండేదని చరిత్ర రచనల్లో కనిపిస్తుంది.

బాహోఫెన్‌ రాసిన ‘తల్లి హక్కు’ (mother right) అనే గ్రంథం 1861లో వెలువడింది. దాంతో కుటుంబ చరిత్రను అధ్యయనం చేయడం మొదలయ్యింది.

కుటుంబం అనేది ఒకటి ఏర్పడి, అది మానవ సమూహాలను ఒక సమాజం అనే ఆకృతిలోకి తీసుకురావడం. సొంత ఆస్తి, మిగులు అనేవి అమలులోకి రావడం. భూమిపై హక్కు, ఇంటిపై పశుసంపదపై యాజమాన్యం, అదే విధంగా ఇంటి పనులకూ, పునరుత్పత్తికీ పరిమితం చేయబడిన స్త్రీలపై నియంత్రణ హక్కూ. పితృస్వామిక కుటుంబం నిర్మాణ రూపం చెందడం, రాజ్యాల ఆవిర్భావం, యుద్ధం పురుష లక్షణం, వీరత్వానికి చిహ్నంగా మారటంతో స్త్రీలపట్ల పురుషస్వామ్యం మరింత పట్టు బిగించింది.

భయంవల్ల అజ్ఞానంవల్ల ఏర్పడిన మత భావనలు వివిధ భౌతిక రూపాల్లొకి చేరి మతస్వామ్యం పితృస్వామ్యం మరింత అధీకృతమైన వ్యవస్థలుగా సమాజాన్ని తమ ఆధిపత్యం క్రిందికి లాక్కున్నాయి.

స్త్రీ పురుషుల సామాజిక స్థాయిలో చారిత్రక మార్పులు మతభావనలతో ప్రభావితమైనవి. తల్లి హక్కు తండ్రి హక్కుల మధ్య సాగిన పోరాటంలో తల్లి హక్కు తుడిచిపెట్టుకుపోయింది. ఎస్కిలస్‌ తన ‘ఓరెస్టెయలో’ అనే రచనలలో ఈ వీరయుగాన్ని చిత్రించాడు. అనేక పరస్పర గుంపుల దాడులూ, గణాలూ, గుంతంత్రాల, రాజ్యాల యుద్ధాలవల్ల ప్రజాసమూహాలు తమ రక్షణకోసం చీలిపోయి, వలసలు పోయి ఎక్కడెక్కడో చిన్న చిన్న సమూహాలుగా తలదాచుకుంటూ ఏదో ఒక పనిని చేపట్టంతో ఆయా పనులు వృత్తులుగా పరిణామం చెందుతూ కులభావనలు, కుల విభజలూ ఏర్పడ్డాయి.

మత పితృస్వామ్యానికి కులస్వామ్యాలు జత కలవడంతో సమాజం మరింతగా దిగజారటం జరిగింది. తొలుత ఉన్న వర్ణాల ఆధారిత వ్యవస్థ కులవ్యవస్థగా ప్రాచుర్యం పొందుతూ వచ్చింది. నాటికీ నేటికీ కుల-వర్గ-వర్ణ వ్యవస్థలతో పడగలెత్తిన ఈ సమాజం అవే చీలికలూ, అవే తరతమ్యాలూ ద్వేషాలు, అణిచివేతలతో అసమ సమాజంగా కునాలిల్లుతున్నది.

మన భారతీయ సమాజాన్నీ, చరిత్రనూ అబ్రాహ్మణీకరణ, బ్రాహ్మణిజపు రహితంగా చేయడానికి పూనుకున్న సంఘ సంస్కరణ తత్తవేత్తలు, బహుజన సిద్ధాంతకర్తలు ఆధునిక యుగారంభంలో జ్యోతీరావ్‌ పూలే, అయ్యంకాళి, బి.ఆర్‌.అంబేద్కర్‌, పెరియార్‌ ఆర్‌.నాయకర్‌లు.

ఆత్మగౌరవం, చదువు – విద్య, హేతువాదం, అన్వయం సత్యశోధనల భావజాల బలంతో వీరు సమతావాద సమాజ నిర్మాణానికి సంస్థల్లా జీవించారు. కులాల చీలికలు దాటి వెళ్ళిన ఈ తాత్వికలు చాతుర్వర్గానికి అవతల సమాజం చాలా బలమైనదని నిరూపించారు. దళితుల, స్త్రీల, ఆత్మగౌరవం, చదువు-విద్య కోసం హేతువాదాన్ని అన్వయం చేస్తూ సత్యశోధనామార్గంలో పయనించారు.

మహాత్మాపూలే, అంబేద్కర్‌, పెరియార్‌లు మనుస్మ ృతిని ఎదిరించారు. వారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొని ప్రమాదాలను తట్టుకొని సమాజ శ్రేయోభిలాషలుగా సంస్కర్తలుగా నిలబడ్డారు. వీరి ఆచరణలోని సాహసం, నిజాయితీ దళితేతరులనూ, అగ్రకులాల వారినీ ఆకర్షించింది. వీరు చేపట్టిన ఉద్యమలకు సంస్కరణ దృక్పథం కలిగిన ఆనాటి అగ్రకులస్థులు కూడా సహకరించారు.

దళితులు, మహిళల పట్ల ఉన్న బానిస భావాలనుండి సమాజాన్ని విముక్తం చేసేందుకు పూనుకున్న ప్రథమ విముక్తికారుడు జ్యోతిరావ్‌ పూలే. 24 సెప్టెంబర్‌ 1873లో ‘సత్యశోధక్‌ సమాజాన్ని స్థాపించి సామాజిక విప్లవ కార్యక్రమాలు చేపట్టాడు. ఆయన సహచరి సావిత్రీబాయికి చదువు నేర్పించి ఆమె తొలి ఆధునిక భారతదేశ ఉపాధ్యాయనిగా, సామాజిక విప్లవకారిణిగా ఎదిగేందుకు మార్గదర్శ అయ్యారు.

పెరియార్‌ స్వయం గౌరవ ఉద్యమంలో పితృస్వామ్యాన్ని టార్గెట్‌ చేసుకొని స్త్రీ విముక్తి ఉద్యమాలు నడిపారు. అంబేద్కర్‌ సైద్ధాంతిక సమీకరణలతో దళితుల్నీ, స్త్రీలనూరాజకీయ సాంఘిక ఉద్యమ పథంలోకి నడిపించారు. అయ్యంకాళి కేరళలో సవర్ణుల దౌష్యాలను ఎదిరిస్తూ స్త్రీల సాంస్క ృతిక వికాసానికి సాహసోపేతంగా ఉద్యమించి మార్పులు తీసుకొచ్చారు.

జ్యోతిరావ్‌ పూలే (20.02.1827-27.11.1890) భారతదేశం ఇంకా స్వాతంత్య్రానికి వందేళ్ళపైన దూరంలో ఉన్న కాలంలో మహారాష్ట్రలోని పూనేలో 1827లో ‘మాలి’ కులస్తుల ఇంట జన్మించాడు ఫూలే.

భారతదేశంలో ప్రధమ విప్లవ సంస్కరణవాదిగా కుల మతాల చీలికలతో ఆనాటి కరుడుగట్టిన వ్యవస్థలో సంచనాలు సృష్టించి అలజడికి గురిచేసాడు. భావ బానిసత్వం వల్ల భౌతిక బానిసత్వం ఏర్పడిందని చర్చించిన తొలి భారతీయుడు మహాత్మాపూలే.

పూలే ఆలోచనల్లో మహిళ మహోన్నతమైనది. తన ఆచారణాత్మక సంస్కరణల ప్రయోగాలను మహిళలూ అస్పృశ్యులతోనే ప్రారంభించాడు. సమాజంలో తీవ్రమైన అణిచివేతకు గురవుతున్న అస్పృశ్యులూ మహిళల ద్వారానే మార్పు అనేది సాధ్యమని పూలే గుర్తించాడు. వారికోసం సాహసోపేతమైన కార్యక్రాలు చేపట్టి చరిత్రలో మహిళల, నిమ్నకులాల వారి గౌరవాన్ని పొందిన అతికొద్దిమంది సంస్కర్తల్లో ఒకడైనాడు.

1827లో మరాఠ్వాడాలో చివరి బాజీరావ్‌ పీష్వా మరణానంతరం పదిసంవత్సరాలకు ఆంగ్లేయుల హస్తగతమవుతున్న మరాఠా నేలమీద పూలే శూద్ర కుటుంబంలో జన్మించాడు. ఆ సమయంలో ప్రపంచమంతటా చీకట్లను చీల్చుకొని ఆధునిక భావనలూ, ఆరాచక పాలకులపై తిరుగుబాట్లూ, విముక్తి ఉద్యమాల వెలుతురు కిరణాలు ప్రసరిస్తున్నవి.

పూలే కుల-వర్గ-వర్ణ నిచ్చెనమెట్ల వ్యవస్థను నిర్మాణంచేసిన బ్రాహ్మణవాదంపై, బ్రాహ్మణీయ పితృస్వామ్యంపై యుద్ధం ప్రకటించాడు. శూద్రులూ, అతిశూద్రులూ, మహిళలూ, అజ్ఞానాలుగా బానిసలుగా మానవగౌరవం లేకుండా పీడనలకు గురిచేయబడటాన్నీ, కులపితృస్వామ్యం, కుటుంబ పితృస్వామ్యం సంకెళ్ళలో బందీలుగా పడి ఉండాలని శాసిస్తున్న మనువు ధర్మసూత్రాలనూ, వాటిని చట్టబద్ధం చేసిన శాసనాలనూ తుత్తినియలు చేస్తూ పాలక కులాల కుట్రలను బట్టబయలు చేసాడు.

1848లో భారతదేశంలోనే మొదటిదైన దళిత బాలికలకు పాఠశాలను స్థాపించి తన భార్య సావిత్రీబాయికీ సోదరి సుగుణాబాయి, ఫాతిమాషేక్‌లకూ తగిన చదువు చెప్పించి శిక్షణనిప్పించి వారిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాడు.

ఆ స్త్రీలు కోటగోడలాంటి కుటుంబాల గడపల్ని దాటి, కుల సమాజపు సుడిగుండాలకు ఎదురవుతూ చదువుల తల్లులుగా సాంస్క ృతిక బంధనాలను తెంచుకొని బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అజ్ఞాన అంధకార ప్రపంచానికి జ్ఞానద్వారాలు తెరిచే సాహసం చేసారు. ఆధునిక భారతదేశపు మొదటి మహిళగా ఉపాధ్యాయులుగా సావిత్రీబాయిపూలే, మొదటి మైనార్టీ మహిళగా ఫాతిమాషేక్‌, బాల్యవితంతువైన టీచర్‌గా సుగుణాబాయి క్షీరసాగర్‌లు చరిత్రలో విముక్తి అధ్యాయనాలను నమోదు చేయడం ప్రారంభించారు.

ఫూలే ఇచ్చిన ధైర్యం చేసిన సాహసం ఆ స్త్రీలలో విద్యాసక్తినీ, జ్ఞానకాంక్షనూ, పీడిత మానవుల పట్ల సమతాకరుణార్ధ్రతలను నింపింది.

అగ్రవర్ణ బాల్యవితంతువులపై వారి వారి ఇళ్ళల్లో జరిగే అత్యాచారాలకు వారు గర్భం దాల్చి కుటుంబ పరువుల కోసం బాధింపబడుతుంటే వారు నిర్భయంగా సురక్షితంగా పురుడుపోసుకునేందుకు పూలే ఇంటిలోనే ‘బాల హత్యానిరోధక గృహన్ని’ ఏర్పర్చారు. దాన్ని ఒక నర్సు సహాయంతో సావిత్రిబాయి నిర్వహించేది.

అనేక కష్టనష్టాలూ, బెదిరింపులూ, దూషణ తిరస్కారాల నెదుర్కొంటూ పూలే అన్ని కులాలకు చెందిన బాల బాలికలకూ పూనే చుట్టుపక్కల 70 వరకు పాఠశాలలు నెలకొల్పాడు. ‘సత్యశోధక సమాజ్‌’ ద్వారా విద్యావిప్లవానికీ, దురాచారాల నిర్మూలనకూ అడుగు ముందుకేసారు. కులాంతర ఆదర్శవివాహాలూ, వితంతు పునర్వివాహాలూ చేయించాడు.

పూలే సావిత్రీబాయిలకు పిల్లలు కలగలేదని రెండోపెళ్ళి చేసుకొమ్మని ఇంట్లో ఒత్తిడి చేసినా అది తప్పని వాదించాడు. తమ ఇంటి ఆశ్రమంలోనే ఒక బాల్యవితంతువు కన్న పిల్లవాడిని తమ పుత్రునిగా దత్తత తీసుకున్నారా ప్రేమమూర్తులు.

పండిత రమాబాయి, ముక్తాబాయి, తారాబాయిషిండేలు పూలే స్థాపించిన సావిత్రీబాయి నిర్వహిస్తూ బోధించిన పాఠశాలలో చదువుకున్న బాలికలే. సావిత్రీబాయి మరాఠీ, ఆంగ్లం చదివి రాస్తూ కవయిత్రిగా, సంపాదకులిగా ఎదిగింది. భారతీయ స్త్రీ చరిత్రకు తొలి ఆధ్యాయాన్ని తిరిగిరాస్తూ అసమాన్య సేవా నిరతితో, జ్ఞాన జిజ్ఞాసతో ఎదగి మానవ హక్కులవాదిగా రూపొందింది. ఆమె పూలే ఆలోచనల్లో ఆచరణవాది అయిన సంపూర్ణ మహిళ. త్యాగశీలత, ఆత్మగౌరవం, సమతామార్గంలో నడిచిన వీరాంగన. జోతీబా మార్గదర్శనంలో, తాత్వికతలో, సంస్కరణల్లో ఆవిష్క ృతమైన మహిళ.

అయ్యంకాళి (1863-1941) దళిత సమరయోధుడైన అయ్యంకాళి ఆగష్టు 28, 1863లో కేరళలోని తిరువనంతపురం దగ్గరలోని వెంగనూరు అనే పల్లెలో పులయ కులానికి చెందిన కుటుంబంలో జన్మించాడు.

కేరళలో జన్మించిన అయ్యంకాళి అరుదైన విప్లకారుల్లో ముఖ్యుడు. చదువు, పలుకుబడులు లేని అట్టడుగు స్థాయి నుండి భూస్వామ్యానికీ అగ్రవర్ణ ఆధిపత్యానికీ వ్యతిరేకంగా నిలబడి పోరాడాడు సులభం కానీ ఈ ఎదిరించడాన్ని సాధించాడు.

దళిత స్త్రీలపై జరుగుతున్న నీచమైన సాంప్రదాయ దాడిని ప్రతిఘటించేందుకు ‘సాధుజన పరిపాలన సభ’ స్థాపించాడు. ఈ సభ ద్వారా ‘సాధుజన పరిపాలని’ అనే మాస పత్రికను నడిపాడు. అయోతీదాస్‌ నడిపిన ‘ఒరుపైసా తమిళన్‌’ అన్న పత్రికతోపాటు అయ్యంకాళి నడిపిన పత్రిక భారతదేశంలో మొట్టమొదటి దళిత పత్రిక.

మొదట అంటరాని జనం రోడ్లమీద నడిచే హక్కుకోసం రక్తాలు కారేట్టు సవర్ణులు కొట్టినా వారి నడిచే హక్కు కోసం పోరాటంలో భారతదేశంలో ఎక్కడాలేని చరిత్ర సృష్టించాడు అయ్యంకాళి. 1924లో జరిగిన వైకం సత్యాగ్రహం కన్నాముందే 1907లో దేవాయలయాల ప్రవేశం కోసం అయ్యంకాళి చేసిన పోరాటం గురించి ఎవ్వరూ చెప్పకపోవడం చారిత్రక అంటరానితనానికి నిదర్శనం.

అంటరానివారికి దేవాలయాల ప్రవేశం చదువుకోని కాళి చదువు విలువ తెలుసుకొని బడులకి పిల్లల్ని చేర్చటం కోసం వీధి పోరాటాలు చేసాడు పాఠశాలలు కూడా నెలకొల్పాడు. కేరళలో కమ్యూనిస్టు ఉద్యమం పుట్టకముందే కాళి కూలీ సంఘాలు పెట్టి కూలీ సమ్మెను చేయించాడు. 1907లో చేయించిన సమ్మె ప్రపంచ చరిత్రలోనే తొలి వ్యవసాయ కూలీల సమ్మె అంటారు చరిత్రకారులు.

ఇన్ని పోరాటాలు చేస్తూ ఆయన చేసిన మరొక విప్లవాత్మకమైన ఉద్యమం – స్త్రీలకు సంబంధించిన సాంస్క ృతిక సమస్యపైన. ఆ రోజుల్లో కేరళలో అంటరాని కులాల స్త్రీల రవికెలు వేసుకోరాదు. వీళ్ళు ఛాతిని కప్పుకోడానికి కేవలం రాళ్ళ, పూసల దండలు మాత్రమే వేసుకోవాలి. ఈ అలవాటునూ, నియమాన్నీ నిర్మూలించడానికి అయ్యంకాళి వేలాదిమంది స్త్రీలను సమావేశపరిచి వాళ్ళ మెడల్లోని రాళ్ల, పూసలదండల్ని తెంచివేయమని పిలుపునిచ్చాడు. వెంటనే వేలాది మంది స్త్రీ అది పాటించారు. వాళ్ళు రవికెలు వేసుకోవడం మొదలుపెట్టారు.

అయ్యంకాళి ఈ వికృత ఆచారాన్ని వొదులుకొమ్మని పిలుపునివ్వడం, స్త్రీలు వెంటనే అది పాటించడంతో ఆ సమస్య ముగిసిపోలేదు. ఇదంతా సహించలేని సవర్ణులు ఆ స్త్రీలపై దాడి చేసేవాళ్ళు కానీ దళిత స్త్రీలు వేలాది మంది ఎదురుదాడికి దిగి వాళ్ళను తరిమికొట్టే

వాళ్ళు.

కేరళలో పోరాట యుగానికి ఆద్యుడుగా నిలిచిన అయ్యంకాళి జీవితమంతా పోరాటాల సమాహారం.

పులయలు అనే దళితుల అంటరానితనాన్ని పోగొట్టి నాగరికంగా జీవించడానికి వారికి మానవ హక్కుల్ని దక్కేట్టు చేయడానికి రక్తాలు కార్చి రాచబాట వేసిన సాంఘిక విప్లవయోధుడు మన అయ్యంకాళి. అంటరాని కులాల్లో స్వాతంత్రేచ్ఛ, ఆత్మవిశ్వాసం నింపి స్త్రీల ఆత్మగౌరవం కోసం వారిని సాంస్క ృతికంగా చైతన్యపర్చిన సంఘసంస్కర్త అయ్యంకాళి ఉద్విగ్నభరితమైన పోరాటం, జీవితం ఒక మహాకావ్యం. ఆయనే ఒక హక్కుల సాధనాయుధం.

డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ (14.04.1891 నుండి 06.12.1956)

”పురుషసూక్తంలో పేర్కొన్న చాతుర్వర్ణవ్యవస్థకు మనువు దైవత్వాన్నీ, అమరత్వాన్నీ ఆపాదించినందువల్లనే ఆ వర్ణాలను కాపాడుకుంటూ తమ ఆధిపత్యాలను నిలబెట్టుకుంటూ వస్తున్న బ్రాహ్మణులు, తమకు ఎదురుతిరిగిన వారిని అణగద్రొక్కేందుకు నియమ నిబంధనలు, శాసనలు తయారు చేసి, జరిమానలూ, శిక్షలూ రూపొందించారు”.

మనుధర్మశాస్త్రం ప్రతివివ్లవ వాజ్ఞయానికి కిరీటంలా నిలిచి శూద్రులు, అస్ప ృశ్యులు, స్త్రీల భవిష్యత్తును శాశ్వతంగా సమాధి చేసి బ్రాహ్మణాధిక్యతను తిరుగులేని విధంగా స్థాపించింది. బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ మనుస్మ ృతిని దహనం చేసిన కారణమేమంటే అది అసమానతల పుట్టగా, జాత్యాహంకారానికి చిహ్నంగా, మానవహక్కులను సమాధి చేసిన దుష్ట సంస్క ృతికి ప్రతిరూపంగా నిలిచినందువల్లనే అని గ్రహించాలి. మనుస్మ ృతి అంటే హిందూ ధర్మశాస్త్రం. దాని పోషకులూ రక్షకులూ ఆచరింపజేసేవాళ్ళూ బ్రాహ్మనిస్టులు.

దీన్ని ప్రభావాన్ని నశింపజేయడానికి అస్ప ృశ్యులు, శూద్రులు, మహిళలూ పూనుకుంటేనే సమాజంలో గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది.

బాబాసాహెబ్‌ మనుస్మ ృతిలో శూద్రుల గురించి రాసినట్లుగానే మనుస్మ ృతిలో స్త్రీలు అనే అంశంపై రాసారు. కులం వేరు, వర్గం వేరు, వర్ణం వేరా అన్న సందేహంతో పాటుగా ఈ మూడింటికీ ఉన్న సారూప్యత, విభిన్నత గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే అంబేడ్కర్‌ రాసిన ‘శూద్రులెవరు ?’ ‘మనుస్మ ృతిలో శూద్రులు’ అన్న గ్రంథాలను చదవాలి. అప్పుడే హిందూ సామాజిక వ్యవస్థకు చాతుర్‌వర్ణ విభజనను అందించిన వర్ణవ్యవస్థ పునాదిని అర్ధంచేసుకోగలుగుతాము.

స్త్రీ విమోచన సిద్ధాంతకర్తగా అంబేద్కర్‌ ఈ రోజున ఒక స్త్రీ ఆత్మవిశ్వాసంతో నేను స్త్రీగా పుట్టినందుకు గర్విస్తున్నాను అని అనగలుగుతుందంటే ఆ స్త్రీకి మొత్తం స్త్రీలందరికీ ఉన్న సైద్ధాంతిక పోరాట బలం పూలే అంబేద్కర్‌లు ఇచ్చిందేనని నిస్సందేహంగా భావించాలి. ఈ దేశంలో స్త్రీలు అణగదొక్కబడటానికి మూలాలు మన ప్రాచీన స్మ ృతుల్లో ఉండటాన్ని తన పరిశీలనాత్మక అధ్యయనాల ద్వారా కనుగొని ప్రకటించాడు అంబేడ్కర్‌. పురుషస్వామ్యం కన్నా ముందుగా వచ్చిన ఆర్యమతం స్త్రీ సృజనాత్మకతను, సామాజికతను అడ్డుకొని వారిని బానిసలుగా చేసింది.

గుంపులకు నాయకత్వం వహించి యోధురాలి గణనాయకురాలిగా ఉన్న స్త్రీ తన ప్రాముఖ్యతనూ స్థానాన్నీ కోల్పోడానికి కారణం హిందూ ధర్మ శాస్త్రాలేనంటారు. అంబేడ్కర్‌ హిందూ మతంపై తన పోరాటాన్ని కేంద్రీకరించి చట్టంబద్దం చేయబడిన స్త్రీల అణిచివేతను బద్ధలు కొట్టడు. ”హిందూ స్త్రీల ఉన్నతి-అధోగతి”పై ఆయన రాసిన వ్యాసంలో స్త్రీ ఉన్నతీ, పతనాల చారిత్రక పరిణామాలను గూర్చి రాసాడు.

సాంఘిక సిద్ధాంతాలను రాజ్యచట్టంగా చేయడంలో మనువు కుట్రను బహిర్గతం చేస్తూ హైందవ మత పునాదులను పునరుద్ధరించి పటిష్టం చేయడమే మనువు తెచ్చిన ధర్మ చట్టాలు అంటాడు. అందువల్ల ”భారత దేశంలో స్త్రీల అధోగతికి ముఖ్య కారకుడు మనువు” అని ప్రకటించిన అంబేడ్కర్‌ 1927 డిసెంబర్‌ 25న మనుస్మ ృతిని బహిరంగంగా దగ్ధం చేసి స్త్రీవిమోచనాకారుడిగా నిలిచాడు.

అంబేడ్కర్‌ తన ప్రసంగాలలో స్త్రీ విముక్తిని గూర్చి ప్రధానాంశంగా మాట్లాడేవాడు, ఆయన జీవిత కాలంలో చేసిన సామాజిక సైద్ధాంతిక సమీకరణలల్లో, ఉద్యమాల్లో స్త్రీలు అధికంగా పాల్గొన్నారు. ఆయన ”మీరు తాగుబోతులైన భర్తలనూ, కొడుకులనూ పోషించకండి, మీ పిల్లలను పాఠశాలలకు పంపండి, మగపిల్లలను మాత్రమే కాదు ఆడపిల్లలను ముఖ్యంగా పంపండి” అని సమావేశాల్లో స్త్రీలనుద్దేశించి పిలుపునిచ్చేవాడు.

అంతేకాకుండా ప్రతి స్త్రీ కుటుంబంలో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడాలి. తన భర్తతో సమానంగా అతనికి స్నేహితురాలిగా ఉండాలని బోధించాడు.

ఇక్కడ మనం బేబీ కాంబ్లే ఆత్మకథ (జీనా అమూచ)లో చెప్పిన విషయాలను మననం చేసుకోవచ్చు ”బాబాసాహెబ్‌ స్త్రీలనుద్దేశించి మీరు ఇన్నాళ్ళూ దైవాన్ని నమ్మారు. దైవం మీకేమీ ఇవ్వలేదు. నాకు మీ తరాన్ని ఒక ఇరవై ఏళ్ళపాటు ఇవ్వండి. ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పిల్లల్ని చదివించండి, తరవాత మీరే నాకు చెప్పండి మీరేమి పొందారో ఏమి సాధించారో” అని ఇచ్చిన పిలుపుతో ఆ రోజుల్లో దళిత స్త్రీలు తమ పిల్లలను పాఠశాలలకు పంపించారనీ, అందుకని వారు లెక్కలేనన్ని కష్టాలు పడ్డారనీ, అయినా పట్టుదలతో బాబాసాహెబ్‌ పిలుపును అందుకున్నారనీ బేబీ కాంబ్లీ చెప్తుంది.

భారత స్త్రీల విముక్తికి సంబంధించి అంబేడ్కర్‌ చేసిన కృషి స్థూలంగా 4 అంశాల ద్వారా తెలుసుకోవచ్చు

1) స్త్రీ కార్మికుల అభ్యున్నతికి చట్టాలు 2) హిందూకోడ్‌ బిల్లు ప్రతిపాదన 3) రాజ్యాంగం రచన 4) బౌద్ధాన్ని సామాజిక ప్రత్నామ్నాయం చేయడం. ఈ అంశాల ద్వారా స్త్రీ విముక్తికి చట్టపరమైన సాంస్క ృతిక పరమైన పునాదిని నిర్మించేందుకు శ్రమించాడు.

స్త్రీ శ్రమను నిరంతరం దోచుకుంటున్న బ్రాహ్మణవాదం ఇంటా బయటా స్త్రీని వివక్షకు గురిచేస్తున్నది. స్త్రీ శ్రమకు వేతనాలు లేవు, ఉన్నా అవి అరకొరగా శ్రమనిబట్టిగాక స్త్రీగా తక్కువతనంగా నిర్ణయించి ఇచ్చేవిగా ఉండేవి. గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి కోసం ప్రసూతి సెలవులు, వేతనం ఇవ్వాలని ప్రయోజనం చేకూర్చే బిల్లును కూడా అంబేడ్కర్‌ ప్రతిపాదించాడు. పితృస్వామిక హిందూ దోపిడీ సమాజం నుండి స్త్రీకి కొంచెమైనా ఉపశమనం కలిగించాలని ప్రయత్నించాడు. స్త్రీ ఔన్నత్యాన్నీ, సాధికారతనూ పూలే వలె గుర్తించిన మహోన్నత మానవీయుడు అంబేడ్కర్‌.

స్వాతంత్య్రానంతరం కూడా రాజ్యం బ్రాహ్మనిస్టుల చేతుల్లోకి పోయి మళ్ళీ స్త్రీలకు అప్పుడు కూడా న్యాయం జరగదని గ్రహించాడు. తాను నిర్మించిన రాజ్యాంగం ద్వారా ‘రాజ్యం’ అణిచివేతకు గురయ్యే స్త్రీల పరిస్థితిని గ్రహించి వారి అభ్యున్నతికి ప్రత్యేక చట్టాలూ, విధానాలూ రూపొందించాలని సూచించాడు. ఆదేశిక సూత్రాలైన 52 ఎ(ఇ) ద్వారా స్త్రీ గౌరవ పరిరక్షణకు ప్రతిపౌరుడు కృషి చేయాలన్న అభిప్రాయాన్ని ప్రకటించాడు.

హిందూకోడ్‌ బిల్లు ఈ బిల్లు చరిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనది ప్రధానంగా నాలుగు అంశాలతో రూపొందించబడింది. 1) స్త్రీలకు ఆస్తి హక్కు 2) స్త్రీలకు విడాకుల హక్కు 3) స్త్రీలకు పునర్‌వివాహ హక్కు 4) స్త్రీ-పురుష సమానత్వపు హక్కు.

అంబేడ్కర్‌ అత్యంత పట్టుదలతో హిందూకోడ్‌ బిల్లును చట్టసభల్లో ఆమోదింపజేయడానికి కృషి చేసాడు. ఈ బిల్లును రూపొందించడానికి ఆయన సుమారు 10 సం||లు తీవ్రంగా శ్రమించాడు. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఎంతోఉద్విగ్నంగా నేనూ సాంప్రదాయ వాదినే కానీ ఒక స్త్రీ స్వేచ్ఛగా, స్వాతంత్రంగా జీవించడానికి దోహదపడే బిల్లును రూపొందించాను, దీనిని అమలు చేయండి అని పేర్కొన్నాడు. తరవాత జరిగిన కుట్రలూ, వ్యతిరేకతలూ, పరిణామాలూ బిల్లును పక్కకు పడేయడంతో అది ఆయనకు కలిగించిన వేదన, భంగపాటు, దుఖం వల్ల ఆయన ‘లా’ మినిష్టర్‌ పదవిని నిరసిస్తూ రాజీనామా చేసాడు.. మొత్తం సభంతా స్త్రీ వ్యతిరేకతను చాటుకున్నది. కేవలం అంబేద్కర్‌, బయటనుండి కమ్యూనిస్టు పార్టీ సంఘం, దుర్గాబాయిదేశ్‌ముఖ్‌లు ఈ బిల్లును ఆమోదించని చట్టసభల స్త్రీ వ్యతిరేకవైఖరిని నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు.

లింగ వివక్షను తొలగించేందుకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆ బిల్లును నీరుగార్చిన మత చాంధసవాదుల చేసిన పని పెంటదిబ్బమీద ఇల్లుకట్టడంలాంటిదన్నాడు అంబేద్కర్‌. ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ ఉదారవాదం, తటస్థవాదంలోని కపటత్వాన్ని భరించలేక హృదయ భారంతో నాన్‌ కాంగ్రెస్‌వాదిగా ఉన్న అంబేడ్కర్‌ పార్లమెంట్‌ నుండి వైదొలిగాడు. స్వాతంత్రభారతదేశంలోని పాలక వ్యవస్థమీద, మతవాదపు ఛాందసత్వం మీద కృంగిపోయి, అవిశ్వాసంతో, నిరసనతో గురిచూసి విసిరిన ఆందోళనారాయి అంబేద్కర్‌ చేసిన రాజీనామా అందుకే అంబేద్కర్‌ అంటరానివాడు కాదు. ఎవ్వరిచేతా అంటబడనివాడు.

అయితే స్త్రీలపై హిందూ అవిభక్త కుటుంబాల క్రూరమైన పట్టును సడలించేందుకు ఆ తరవాత కాలంలో వచ్చిన ప్రత్యేక వివాహచట్టం 1954, హిందూ వివాహచట్టం 1955, హిందూ వారసత్వ చట్టం 1956 లాంటి చట్టాలు అంబేద్కర్‌ పోరాటాల ఫలితంగా, హిందూకోడ్‌ బిల్లు ప్రభావంతో వచ్చాయి అని తెలుసుకోవాలి.

పార్లమెంట్‌కు రాజీనామా చేసిన అనంతరం అంబేడ్కర్‌ రాసిన సిద్ధాంత పత్రంలో ”హిందూ స్త్రీల ఉన్నతి – ఆధోగతి”, స్త్రీ – పురుషుల సమానత, స్త్రీ అభ్యున్నతికి ఒక సంస్క ృతిగా, హిందూ బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా బౌద్ధంలో ఉన్న విశిష్టతను సాధికారికంగా వివరించాడు.

అంబేద్కర్‌ సమతావాది. స్త్రీ విముక్తి ఉద్యమకారులకు భావజాల, సైద్ధాంతిక మార్గదర్శి. అంబేడ్కర్‌ సిద్ధాంతం సామాజిక చలనసూత్రంగా మహిళలకు పోరాటశక్తినీ, విమోచనాజ్ఞానాన్నీ అందిస్తుంది.

సమతాసైనిక్‌ దళ్‌ :13 మార్చి 1927న ముంబాయిలో బాబాసాహెబ్‌ సమతాసైనిక్‌ దళ్‌ను స్థాపించాడు. ఆ దళ్‌ నియమాలు-లక్ష్యాలు ఆరింటిలో సమానత్వపు హక్కు అనేవి పవిత్రమైనది, ఆటంకం లేనిది, విభజింపరానిది. ఈ హక్కు వర్ణం, పంత్‌, జాతి, స్త్రీ పురుష బేధాలకి దూరంగా ఉంటుంది అని ప్రకటిస్తుంది.

సమతాసైనిక్‌ దళ్‌ కేవలం పురుషులకు మాత్రమే కాకుండా మహిళా విభాగాన్ని ప్రారంభిచాడు బాబాసాహెబ్‌. వందలాదిగా సాహసపూరితమైన వీరమహిళా సైనికులనూ తయారు చేసాడు.

పెరియార్‌ రామస్వామి నాయకర్‌ (17.9.1876 – 24.12.1973) భారతదేశంలో పూలే, అంబేడ్కర్‌ల వలె స్త్రీ విముక్తికోసం, మహోన్నతమైన ఉద్యమాలు నడిపిన తీవ్రవాది, మన సమాజం ఎవైతే సామాజిక నియమాలంటూ, నైతిక విలువలంటూ, సదాచారాలంటూ, మతవిధానాలంటూ, శాస్త్రాలంటూ పాటిస్తున్నదో ఆ విశ్వాసాలను తుత్తునియలు చేసే ప్రతిపాదనలూ, విమర్శలూ, ఆచరణాత్మక కార్యక్రమాలూ నిర్మించిన మహోగ్రుడు పెరియార్‌ ఆర్‌. రామస్వామి నాయకర్‌.

మన సమాజంలో స్త్రీలకు మాత్రమే ఆపాదించిన శీలం – పాతివ్రత్యం, ఆ కట్టుబాట్లను నిశితమైన వ్యంగ్యాస్త్రాలతో చీల్చి చెండాడు పెరియార్‌. స్త్రీ పురుషులు స్వేచ్ఛగా జీవించాలంటే ఈ శీలం – పాతివ్రత్యం (సతీవ్రత్యం) ఇద్దరికీ సమానంగా అన్వయించాలంటాడు.

తమిళ దేశంలో తిరువళువర్‌ అనే ప్రాచీన మహాకవి రాసిన నీతి గ్రంధం ‘తిరుక్కురళ్‌’ ఎంతో ప్రఖ్యాతి చెందింది. అందులో స్త్రీని తక్కువస్థాయిలో బానిసలుగా చిత్రించడం జరిగింది. పురుషులు స్త్రీల కన్నా అధికులు అనీ వారు సంపాదనాపరులనీ, ఆస్తిపరులనీ అంటాడు. మహిళలు అనుభవిస్తున్న దారుణ పరిస్థితులకు కారణం చట్టాలూ మతాలు కాదుచ ఈ పరిస్థితులను మహిళలు విశ్వసించి తలొగ్గి ఆచరిస్తుండమే. పాతివ్రత్యమనే కృతకభావన వల్ల స్త్రీలు ఇష్టంలేని వ్యక్తితో ఇష్టంకాని పెళ్ళితో జీవితాంతం ఏడుస్తుండే పరిస్థితులు పోవాలంటాడు. అంటే నిర్బంధ దాంపత్యాలను సాగించే దౌష్ట్యం పోవాలనీ స్త్రీలు పురుషులకు విధేయులుగా వారి ఆస్తులుగా కాకుండా సమానమైన శీల నియమ సుస్థిరతను పొందాలని అంటాడు.

అణగారిన వర్గాలకు మన దేశంలో తరతరాలుగ విద్యాబుద్ధులు అందకుండా వారు అజ్ఞానులుగా మారి పోవడానికి అంటరానితనాన్ని రుద్దినవారే, స్త్రీలు కూడా బౌద్ధికంగా ఎదిగే సాధనాలు లేకుండా చేసారనీ అందువల్ల దళితులూ స్త్రీలూ తక్కువ స్థాయిగలవారిగా స్వార్థపరులు మార్చివేసారు అంటాడు.

అవ్వయార్‌ రాసిన నీతి గ్రంథం ‘అత్తిచూడి’ తిరువళ్లువర్‌ లిఖిత వేదం ‘తిరుక్కురళ్‌’లు నీతులపరంగా స్త్రీలకు అన్యాయం చేసాయి. మానవతావాదులనబడే ఈ ఇద్దరిపై కూడా ఆర్యనాగరికత ఆధిక్యతా ప్రభావం పడింది. ఈ రోజుల్లో కూడా ఆర్య సంస్క ృతిని భయంతో పాటిస్తున్నారు మేధావులూ, విద్యావేత్తలు.

సమానత్వమంటే స్త్రీలు పురుషలకనుగుణంగా నడుచుకోవడం కాదు – వారిద్దరి హక్కుల్లో తేడాల్లేకపోవడమే, మానవజాతి ప్రగతికి స్త్రీ, పురుషుల గుణగణాలు స్వభావ లక్షణాలు ఒక రీతిగా ఉండటానికి ప్రకృతిలో స్థానమన్నది కానీ పురుషులు కృత్రిమంగా, స్వార్థపూరితంగా కుట్రలు చేసి స్త్రీలను బానిసలుగా చేసుకున్నారని ఆయన ఆరోపణా వాదన. ఒకరి ఎదుట ఒకరు మోకరిలల్లంలో సమానత్వం ఎక్కడుంటుంది అనేది పెరియార్‌ ప్రశ్న.

మన వివాహ వ్యవస్థలో పెళ్ళి తతంగాన్ని అడ్డుపెట్టుకొని స్త్రీలను భ్రమల్లో ముంచెత్తుతూ వారిని బానిసల్ని చేసారు. వివాహ వ్యవస్థలో వివక్షత ఉన్నది చెంగల్‌పట్టు నగరంలో జరిగిన ఆత్మగౌరవ మహాసభలో స్త్రీలకూ, పురుషులకూ విడాకుల తీసుకునే హక్కు కావాలని తీర్మానించారు.

ఈ విధంగా స్త్రీ శీలం, పాతివ్రత్యం, విడాకుల హక్కు, పునర్వివాహం కేవలం మహిళలను ఉద్దేశించబడిన వ్యభిచారం అనే పదం కొన్ని నీచమైన పదాలను అంటే వితంతువు, పతివ్రత, వ్యభిచారి, స్త్రీలకే ఉపయోగించడం ఎందుకు ? అంటూ వాటిని నిరసిస్తాడు. బ్రిటిష్‌ పాలనా కాలంనుండి కూడా వితంతు స్త్రీ పరిస్థితుల్ని ఎంతో హృద్యంగా, మానవీయంగా చర్చిస్తాడు.

తన పదహారవ ఏట తన కులంలోని మహిళలు బానిసలుగా వ్యవహరించాన్ని చూసి ఆవేదన చెందేవాన్నని, దీనికి కారణం పురుషుల అహంకారమేనని నిర్ణయానికి వచ్చాననీ పెరియార్‌ అంటూ వితంతువుల పునర్వివాహం విషయంలో తన అభిప్రాయాన్ని చెప్తూ ప్రపంచంలో మానవ సమాజంలో ఉన్న అసమానతలు, బానిసత్వం నశించాలంటే మొదట మహిళల బానిసత్వం నశించాలనీ, వారి పట్ల పురుషులకున్న అహంభావ ప్రదర్శన మారాలనీ అప్పుడే స్వేచ్ఛా మానవ సమాజం ఆవిర్భవిస్తుందనీ చెప్తాడు.

ఇంకా ఆయన స్త్రీల పరంగా ఆస్తిహక్కు, గర్భనిరోధం, పురుషాహంకారం లాంటి అంశాలను విశ్లేషించి వివరిస్తారు. స్త్రీ ఎందుకు బానిసైంది అనే అంశంపై ఎంతోవిస్త ృతంగా విశ్లేషిస్తూ నిక్కచ్చిగా తన భావాలను, ఆలోచనలనూ, అభిప్రాయాలనూ కుల-వర్గ సమాజానికి ఎక్కుపెడ్తాడు.

పెరియార్‌ తీసుకున్న స్వయం గౌరవ ఉద్యమ (1937-40) సమావేశాలన్నింటిలో ప్రధానపాత్ర స్త్రీలదే. అవి స్త్రీల అధ్యక్షతనే జరిగేవి. ఈ ఉద్యమంవల్ల స్త్రీలలో రాజకీయ చైతన్యం కలిగింది. ఒక సంవత్సరం పాటు స్త్రీలు ఊరేగింపులూ సభలూ చేస్తూ తీవ్రమైన

ఉద్యమం చేసారు, జైళ్ళపాలయ్యారు.

పితృస్వామ్యం వ్యవస్థపైనే కాకుండా ఆస్తిపై ఆధిపత్యాన్ని గుర్తించిన పెరియార్‌ పోరాటాలు చేయాలని స్త్రీలకు పిలుపునిచ్చాడు. వివాహ వ్యవస్థపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. అణిచివేతకు తాత్విక దృక్పథాన్ని వివాహం ఇచ్చిందంటాడు…

సమ సంస్కృతిని, ప్రాంతీయ భాషా స్వేచ్ఛను, మానవీయ విలువల్నీ నెలకొల్పేందుకు తత్వవేత్తగా పోరాటవాదిగా స్త్రీలను గౌరవిస్తూ వారిని చైతన్యీకరిస్తూ స్త్రీలే ప్రధాన కేంద్రంగా ఉద్యమాల నిర్మాణం చేసిన మహాయోధుడు పెరియార్‌.

జ్యోతిరావ్‌ ఫూలే, బి.ఆర్‌.అంబేద్కర్‌, పెరియార్‌, అయ్యంకాళిలు ”మనుస్మ ృతిని” ఎదిరించి ”మానవ స్మ ృతికి” ప్రాణంపోసిన తాత్వికులూ, దార్శనికులూ, వైతాళికులూ, జ్ఞానులూ, సాహసికులూ, పోరాటయోధులూ, స్త్రీ విముక్తి సంస్కర్తలు.

నూరేళ్ళ క్రితం అగ్రవర్ణ కుల పాలకులపై, వారు నెత్తికెత్తుకున్న చీకటి వ్యవస్థపై అప్రతిహత యుద్ధం చేసిన ఆ మహనీయులు స్త్రీ ఉద్ధరణకై అత్యంత ఆధునికంగా ఆలోచించారు. సైద్ధాంతికంగా ఆచరణకు నిలబడ్డారు. వారి దృష్టిలో స్త్రీ విలువ మహోన్నతమైనది. స్త్రీ అంటే మానవీయ శక్తి.

వారు కాలంకన్నా ముందు నడిచిన మానవ హక్కుల కార్యకర్తలు. బౌద్ధిక జ్ఞాన సంపన్నులుగా కార్యాచరణ చేపట్టిన ప్రజాస్వామికవాదులు. వారి ఉద్యమపథంలో స్త్రీ సమభాగస్వామి. సంపూర్ణమైన మానవి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.