ప్రథమ స్త్రీవాద చరిత్రకారిణి – భండారు అచ్చమాంబ (1874-1904) – కె.లలిత

 

మన దేశంలోని స్త్రీ వాద చరిత్ర కారులలో ప్రథమ స్థానం ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం భండారు అచ్చమాంబ అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కాని, ఇప్పటికి దాదాపు నూరు సంవత్సరాల క్రితం ”అబలా సచ్చరిత్ర రత్నమాల” రచించినపుడు అచ్చమాంబ ఒక చరిత్రకారిణిగా రాయలేదు. ఆ పుస్తక రచన వెనుక ఒక ముఖ్యమైన రాజకీయ ఉద్దేశం ఉంది. పుస్తకానికి రాసిన ముందు మాటలో ఆమె తన రచనలు, పరిశోధనల లక్ష్యాన్ని గురించి వివరించింది.

మొదటిది – సామాన్యంగా స్త్రీలకు మందబుద్ధి, సహజ భీరుత్వం లాంటి నీచగుణాలని ఆపాదించేవాళ్ళ ఆరోపణలకు కారణం పక్షపాత బుద్ధి మాత్రమేనని, స్త్రీలు సహజంగానే గాంభీర్యం, సూక్ష్మబుద్ధి, తెలివి తేటలు కలిగి ఉంటారని ఉదాహరణ పూరితంగా నిరూపించడం ఆమె ప్రధానోద్దేశం.

రెండవది – చదువుతో స్త్రీలకు అనేక దుర్గుణాలు కలుగుతాయనే వాదన మూర్ఖం అని, విద్యవల్ల మొత్తం సమాజానికే మేలు జరుగుతుందని వాదించటం.

మూడవది – స్త్రీలు వారి జీవితాలను బాగుపరచుకోవాలంటే దానికనువైన పద్ధతిలో తమ సమాజ పరిస్థితుల గురించి, వాటి చరిత్ర గురించి ఒక క్రమపద్ధతిలో కృషి చేసి విజ్ఞానాన్ని సృష్టించుకోవటం అవసరమని నొక్కి చెప్పింది. ఆ కృషిలో భాగంగా తను సోదరీ లోకానికి శుభోదకం, జ్ఞానదాయకమైన గ్రంధాన్ని అందించటం తన బాధ్యతగా ప్రస్తావించింది..

ఆధునిక చరిత్రలో మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటివి, మనం గర్వించదగినటువంటి నమూనాల కోసం వెతుక్కోవాలంటే మొట్టమొదట కనిపించేది అచ్చమాంబ. కృష్ణాజిల్లా నందిగామ గ్రామంలో ఆమె జననం, మునగాల సంస్థానానికి దివాన్‌గిరి చేసిన కొమర్రాజు వెంకటప్పయ్య పంతులుగారి కుమార్తె. తన పసివయసులో తండ్రి చనిపోవడంతో తల్లి గంగమాంబ, ఆమెను, కుమారుడు కొమర్రాజు లక్ష్మణరావును తీసుకుని 1880లో తెలంగాణా ప్రాంతంలోని దేవరకొండ గ్రామానికి వెళ్ళిపోయింది. అచ్చమాంబకు పది సంవత్సరాల వయస్సున్నప్పుడు మేనమామ భండారు మాధవరావుతో వివాహమైంది. వివాహమైన తర్వాత భర్తతో మధ్య పరగణాలకు వెళ్ళేవరకు ఆమె విద్య అనే మాట ఎరుగదు. అప్పటినుంచే విద్య ప్రారంభం. అపుడయినా బడికి వెళ్ళో, పెద్దవాళ్ళు ఇంటి దగ్గర నేర్పించటంతోటో నేర్చుకున్నది కాదు. ఈమె జీవిత సంగ్రహాన్ని రాసిన (అబలా సచ్చరిత్ర రత్నమాల నుంచి) పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ ఇలా అంటుంది. ”మన వారు జ్ఞాన సంపాదనమునకని కాకపోయినా నుదర పోషణార్థమని తలంచి యయిదేడుల యీడు వచ్చునప్పటికి మగ పిల్లలకు మాత్రము శ్రద్ధగా విద్యాభ్యాసము చేయింప ప్రారంభించెడు నాచార మెప్పటికున్నదిగదా!”. ఆ విధంగానే తమ్ముడు లక్ష్మణరావుకు పెద్దలు విద్యాభ్యాసం చేయించారు. తమ్ముడు చదువుకునే సమయంలో అచ్చమాంబ కూడా అక్కడే కూర్చొని చదువుకోవటం మొదలుపెట్టింది. అతనితో సమానంగా తెలుగు, హిందీ భాషల్ని అభ్యసిస్తూ అతనికంటే అన్నింట్లోనూ ముందు ఉండేది. తర్వాత ఆయన ఇంగ్లీషు విద్య కోసం నాగపూర్‌ వెళ్ళవలసి వచ్చినా ఆమె స్వయంకృషితోనే విద్య కొనసాగించింది. మహారాష్ట్ర భాషలో కూడా తగుపాటి జ్ఞానాన్ని సంపాదించింది. శెలవులలో లక్ష్మణరావు కూడా సహాయం చేసేవాడు. ఆమె మెల్లిగా బెంగాలీ, గుజరాతీలను కూడా నేర్చుకుంది. సంస్కృతంలో స్వల్పమైన పరిచయం ఉంది.

ఆమె తన వ్యాసాల్ని, పద్యాలని, రచనలని స్త్రీల ఉద్యమాన్ని నిర్మించటానికి, ప్రోత్సహించటానికే ఉపయోగించింది. ఈమె వ్యాసాలన్నీ ”హిందూ సుందరి”, ”సరస్వతి” అనే పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆ విధంగా స్త్రీల ఉద్యమంలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి. 1902లో మచిలీపట్నంలోని తొలి మహిళా సమాజాన్ని ”బృందావన స్త్రీల సమాజం” అన్న పేరుతో భండారు అచ్చమాంబ, ఓరుగంటి సుందరీ రత్నమాంబలు స్థాపించారు. నలభైమంది సభ్యులతో ఈ సమాజం నెలకు రెండుసార్లు సమావేశమయ్యేది. సభ్యుల కోసం పత్రికలు, పుస్తకాలు తెప్పించి గ్రంథాలయం కూడా నడిపేవాళ్ళు. 1903లో కుటుంబ సమేతంగా దేశాటనం చేసినపుడు వెళ్ళిన ప్రతిచోటా స్త్రీల సమావేశాలలో, చర్చలలో అచ్చమాంబ పాల్గొనేది. అదే సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి స్త్రీ సంఘాలు స్థాపించటానికి ఆమె కృషి చేసింది. ఎంతోమంది అనాధ స్త్రీలకు ఆమె తన ఇంట్లో ఆశ్రయమిచ్చేది. ఐదారుగురు పిల్లలకు ఎప్పుడూ తన ఇంట్లోనే చదువుకునే సౌకర్యం కల్పిస్తుండేది.

ఎటువంటి విపరీత స్వభావము కలవాళ్ళనైనా అచ్చమాంబ తన మంచితనంతో తనకనుకూలంగా తిప్పుకోగలిగే చాతుర్యం ఉన్న వ్యక్తి అని లక్ష్మీ నరసమాంబ రాసింది. దానికుదాహరణ ఆమె భర్త. ఆయన కోపదారే కాకుండా స్త్రీలను కారాగృహము లాంటి ఘోషాలో ఉంచితే కాని వారి పాతివ్రత్యం క్రమంగా ఉండదని నమ్మిన వ్యక్తి. అటువంటి వ్యక్తితో స్త్రీకి విద్య అవసరమని, స్వతంత్రత చాలా ముఖ్యమని ఒప్పించగలిగిన గొప్పదనం ఆమెదే అని నరసమాంబ రాసింది. ఆ రోజులలో భర్తల సహకారం లేకుండా భార్యలు ముందడుగు వేయటం ఎన్నో ప్రయాసలతో కూడుకున్న పని. అందువలనే పేరు తెచ్చుకున్న స్త్రీలందరూ కూడా ఏదో ఒక సందర్భంలో భర్తని ప్రశంసించకుండా

ఉండడం అరుదుగా కనబడుతుంది. భండారు అచ్చమాంబ కూడా తన గ్రంథం ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ను భర్తకు అంకితమిస్తున్నానని, ఆయన ప్రోత్సాహం లేనిదే తానీ గ్రంథం రాసే శక్తి సాధించగలిగేదాన్ని కాదని రాసింది. అదే పద్ధతిలో తమ్ముడు అందించిన సహకారాన్ని కూడా ప్రస్తావించింది. కానీ, ఆమె రాసిన దాని ప్రకారం తన దృష్టి గ్రంథరచన వైపు మరలటానికి, దానికోసం అహర్నిశలూ కృషి చేయటానికి ఉన్న మరో కారణం ఆమె వ్యక్తిగత జీవితంలోని విషాదమైన సంఘటనలు. గ్రంథ రచనకు ముందు తన కుమార్తె, కుమారుడు ఇద్దరూ చిన్న వయసులోనే మరణించటం ఆమెకు ఊహించనటువంటి దుఃఖాన్ని కలుగచేసింది. తన జీవితంలో ఏర్పడిన ఒక పెద్ద వెలితిని దుఃఖంతోనే పూరించకుండా దీక్షతో అర్థవంతమైన కృషి చేయటానికి మరల్చుకోగలగటం ఆమెలోని గొప్పతనం.

”ఆప్తులైన పురుషులచే గృహమున నిర్బంధించబడు స్త్రీలు రక్షితురాండ్రు కారు. ఏ స్త్రీలు, తమ యాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితురాండ్రు” అనే అర్థము వచ్చే సంస్కృత శ్లోకాన్ని ఉదహరిస్తూ ‘అబలా సచ్ఛరిత్ర రత్నమాల’ను ప్రారంభిస్తుంది అచ్చమాంబ. ఇది మొదటిసారి పుస్తక రూపంలో 1901లో వచ్చింది. అంతకుముందు వీరేశలింగంగారి పత్రిక ”చింతామణి”లో ధారావాహికంగా ప్రచురణ అయ్యింది. ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా రాయాలని ఆమె సంకల్పించింది. మొదటి దానిలో చరిత్రలో పేరుపొందిన స్త్రీల గురించి, రెండవ దానిలో వేదాలలో, పురాణాలలో స్త్రీల గురించి, మూడవ దానిలో ఇంగ్లండు మొదలైన విదేశాలలోని స్త్రీల చరిత్రలు రాయాలని ఆమె ఉద్దేశం. కానీ ఆమె చనిపోయే నాటికి రెండవ దానిలో సగభాగము కూడా పూర్తి కాలేదు. 1903లో కుటుంబంతో కలిసి దేశమంతా తిరిగినపుడు అవకాశమున్నపుడల్లా పండితులతో, మేధావులతో పురాణ కాలంలో స్త్రీల గురించిన సమాచారాన్ని సేకరించింది. అదే ఉద్దేశంతో బెనారస్‌ వెళ్ళడం కూడా జరిగింది. మొదటి భాగంలో కాశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించిన స్త్రీల చరిత్రలు ఉన్నాయి. వీటి గురించి సమాచారాన్ని సేకరించడానికి హిందీ మాసపత్రిక ”భారత భగిని”, గుజరాతీ పుస్తకం ”సతీ మండల”, బెంగాలీలో ”నారీ రత్నమాల”, తెలుగులో ”సతీహిత బోధిని”, ”తెలుగు జననా”లను ఉపయోగించినట్లు, ఆ పని చేయటానికి నాలుగు సంవత్సరాలు పట్టినట్లు అచ్చమాంబ రాసింది. ఆ సమయంలో ఆమె భర్తకు ఆరుసార్లు బదిలీలైనా ఆమె పనికి అంతరాయం కలగకపోవటం ఒక విశేషం. రెండో భాగంలో సీత, ద్రౌపదుల గురించి మాత్రమే రాయగలిగింది. అవి ”హిందూ సుందరి”, ”సరస్వతి” పత్రికలలో అచ్చయ్యాయి. ఆమె ఉపోద్ఘాతంలో ఉత్తర దేశంలో స్త్రీల బాగు కోసం కృషి చేస్తున్న ఎంతోమంది పేర్లను ప్రస్తావించటం మూలంగా అప్పటి కాలంలో స్త్రీల గురించిన వివరాలు మనకు లభిస్తాయి. ఉత్తరదేశంలో ”భారత భగిని” అనే పత్రిక నడిపిన హరాదేవి, బెంగాల్‌లో ”భారతి” నడిపిన సరళాదేవి, ”స్త్రీ ధర్మనీతి, అమెరికా దేశ ప్రవాసం” రాసిన మరాఠీ స్త్రీ పండిత రమాబాయి సరస్వతి, ”ఆనందీబాయి చరిత్ర” రాసిన కాశీబాయి కనేట్కర్‌, మరాఠీలో గ్రంథ రచన చేసిన రుక్మిణీబాయి పంజాగిరి, మరాఠీ కవయిత్రి జానకీబాయి, కమలా సత్యనాధన్‌, లేడీ జేన్‌ గ్రే గ్రంథాన్ని కవిత్వంగా రాసిన కొటికలపూడి సీతమ్మల గురించి తెలుసుకొనే అవకాశం అచ్చమాంబ ద్వారా మనకు కలుగుతుంది.

ఇటువంటి శక్తి సామర్ధ్యాలతో ప్రథమ చరిత్రకారిణిగా గౌరవాన్ని దక్కించుకొన్న అచ్చమాంబ జీవితం అతి త్వరగా ముగియకుండా ఉంటే స్త్రీలకు ఎన్నో విలువైన గ్రంథాలను అందివ్వగలిగేది. 1904లో జబ్బుచేసి 30 సంవత్సరాల వయసులోనే ఆమె జీవితం ముగిసిపోవటం మన దురదృష్టకరం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.