సామాన్యుల్ని అంచులకి నెట్టివేస్తున్న ‘నూతన ఆర్థిక విధానం’ -డా|| రమా మెల్కోట

 

వేపచెట్టు చుట్టూ ఈ రోజు చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. వేపచెట్టు ఉపయోగాల గురించి మనందరికీ తెలిసిందే. కానీ, మన ఇళ్ళ చుట్టూ ఎక్కడపడితే అక్కడ కనిపించే వేపచెట్లు మనకు చెందకుండా అవి ఏదో కంపెనీకో లేక ఏదో పెట్టుబడిదారుకో చెందినవంటే, నమ్మడానికి వీలుకాదు. కానీ ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నదదే. వేపచెట్టుతో వచ్చే సహజమైన క్రిమి సంహారక మందుల (biopesticides) ను తయారుచేసే పేటెంట్‌ను రాబర్ట్‌ లార్సన్‌ అనే అమెరికా పౌరుడు కొని తన స్వంతం చేసుకొన్నాడు. (పేటెంట్‌ నంః 4, 556, 562), పేటెంట్‌ పొందడం అంటే ఆ వస్తువును తయారు చేయడంలో గుత్తాధిపత్యం పొందడం. మరెవరికీ దాన్ని తయారుచేసే హక్కు లేకుండా చేయడం. రాబర్ట్‌ లార్సన్‌ తన పేటెంటును డబ్ల్యు.ఆర్‌.గ్రేస్‌ డ కం. అనే అమెరికన్‌ కంపెనీకి పెద్ద లాభానికి అమ్మివేశాడు. అంటే ఇప్పుడు మన దేశ ప్రజలకు వేపచెట్టుతో వచ్చే ఎరువులు కానీ, మందులను కానీ తయారుచేసే హక్కు, అధికారాలు ఉండవు. డబ్ల్యు.ఆర్‌.గ్రేస్‌ కంపెనీ కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లా అంతరాసన హల్లి గ్రామంలో రోజుకు 20 టన్నులు అమెరికాకు ఎగుమతి చేయగలిగేటట్టుగా క్రిమి సంహారక వేప మందులను తయారుచేసే ఫ్యాక్టరీని తెరవబోతున్నారు. ప్రపంచంలో వేప మందులను మొదటిసారిగా వ్యాపారాత్మకంగా తయారు చేస్తున్నామని ఈ కంపెనీ చెప్పుకుంటోంది. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు. మన దగ్గర ఎన్నో చిన్న పరిశ్రమలు ఎప్పటినుంచో తయారు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికా పేటెంట్‌ హక్కులు పొందితే, మన దేశంలో ఉండే సహజ సంపద పైనా, దాని గురించి మనకుండే జ్ఞానంపైనా మనకే అధికారం లేకుండా పోతుంది. (వేప మందుల మీద పేటెంట్‌ హక్కులను ఎంతోమంది వ్యతిరేకిస్తూ ప్రచారం చేస్తున్నారు.) మన దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల్లో ఇది ఒక ముఖ్యమైన మార్పు. ఇది నూతన ఆర్థిక విధానం (NEP) లో ఒక భాగం. దీని పాలసీ, ఇది తేబోయే మార్పులు, ప్రభావం ముఖ్యంగా స్త్రీల పైనా, వెనుకబడ్డ తరగతుల పైనా ఉంటుంది. అయితే దీనికి కారణాలు తెలుసుకోవాలంటే నూతన ఆర్థిక విధానం గురించీ, దాని రాజకీయాల గురించి కొంత తెలుసుకోవాలి.

గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, పెరుగుతోన్న నిరుద్యోగ సమస్య, ఆకాశాన్నంటుతున్న ధరలు… ఇవన్నీ ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. కొంతమంది మన దేశంలో ఉండే ‘సోషలిజమే’ దీనికి కారణమని – అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పబ్లిక్‌ సెక్టార్‌, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం విధించినటువంటి ‘ధరల నియంత్రణ (price controls), రైతులకు ఇచ్చే రాయితీలు, ప్రైవేటు సెక్టారుపై ఉన్న నియమాలు, ఎగుమతి దిగుమతులపై ఉండే నియమాలు (controls) వంటివన్నీ కారణమంటారు. అందుచేత ఆర్థిక వ్యవస్థను సరిదిద్దాలంటే ఇవన్నీ పోయి ప్రభుత్వం వీలైనంత తక్కువగా కలుగజేసుకుని, పరిశ్రమలను ప్రైవేటు రంగానికి వదిలి, ఆర్థిక వ్యవస్థను మార్కెట్‌ శక్తులకు వదిలినట్లయితే, పోటీవల్ల ఉత్పత్తి పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందని, దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకం (Sale ability) ఉంటుందని అంటున్నారు. ఈ అవగాహన నుంచే నూతన ఆర్థిక విధానం రూపొందించబడింది.

నూతన ఆర్థిక విధానం అర్థం చేసుకోవాలంటే గత చరిత్ర గురించి కూడా కొంత తెలుసుకోవడం అవసరం. అతి క్లుప్తంగా చెప్పాలంటే దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్య వాదం, వలస విధానాలు, వాటి ప్రభావాలు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ విధానాలు. వీటిని ఇక్కడ పూర్తిగా విశదీకరించకపోయినప్పటికీ, 1947 తర్వాత వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి. రాజులచే పాలించబడిన రాష్ట్రాలు (Princely States) (ఉదా: నిజాం, ట్రావెన్‌కోర్‌, ఝునాగఢ్‌, జయపూర్‌ మొదలైనవి) స్వతంత్ర భారతదేశంలో కలిసిపోవడం, జమీందారీ, జాగిర్దారీ, తాలూక్‌దారీ అంతం కావడం, ఇవన్నీ దేశాన్ని రాజకీయంగా ఒకటిగా చేసింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రు నాయకత్వంలో ఒక ఆర్థిక విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇది 1955లో కాంగ్రెస్‌ పార్టీ జారీ చేసిన ఆవడి తీర్మానంలో రూపొందించబడింది. ఇది ‘సోషలిజం’ ఆధారిత సమాజాన్ని (Socialistic pattern of society) స్థాపించడం ధ్యేయంగా ప్రకటించుకుంది.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో వచ్చిన విభేదాలు, కలహాలు, ప్రజాఉద్యమాలు, విదేశీ పెట్టుబడిదారుల ఒత్తిడి, ఇవన్నీ కాంగ్రెస్‌ పార్టీలో వివాదాలను రేకెత్తించాయి. గాంధీ అవగాహన ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం పోరాడకుండా, ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించడానికి పూనుకోవాలి. సామాజిక ఆర్థిక వ్యవస్థలో గ్రామ రాజ్యం, పంచాయతీలు రాజకీయ అధికారాన్ని చేపట్టాలి. కేంద్రీకృతమైన రాజ్యాధికారం కాకుండా, వికేంద్రీకృతమైన గ్రామ పంచాయతీలు అధికారాన్ని చేబట్టాలి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో విభిన్న అవగాహనలు ఉన్నప్పటికీ, రాజ్యం (State), రాజ్యాధికారమే నిజమైన మార్పు తేగలుగుతుందనే ధోరణి వలన (Centrality of State as an instrument of change) ప్రజా ఉద్యమాల్ని, అధికార వికేంద్రీకరణను ప్రోత్సహించలేదు. దీనికి కారణం కాంగ్రెస్‌లో మెజారిటీగా ఉన్న భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారీ వర్గం. అయినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యంపై అన్ని వైపుల నుండి వచ్చిన ఒత్తిడి వల్ల భూసంస్కరణలు వంటి కొన్ని మార్పులు రాక తప్పలేదు. కానీ అధికార రీత్యా గ్రామాల్లో కానీ, పరిపాలనా యంత్రాంగంలో కానీ గొప్ప మార్పులు రాలేదు. ఇదివరకు బ్రిటిష్‌వారు తెచ్చిన ఎన్నో చట్టాలు అదేవిధంగా కొనసాగాయి.

ఉదా: క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం.

నెహ్రు దృక్పథంలో దేశంలో ఉన్న విచ్ఛిన్నకరమైన శక్తులు మతం, కులం, భాషాతత్వ అహంకారాలను ఎదుర్కోవాలంటే ముఖ్యంగా పరిష్కరించాల్సింది దేశం యొక్క ఆర్థిక సమస్యలు, దారిద్య్రం, నిరుద్యోగం. దీనికి మార్గం త్వరితగతిలో పారిశ్రామికీకరణ, సహకార సమిష్టి (cooperative) వ్యవసాయం. ఈ రెండింటికీ కూడా ఆధునిక రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం అవసరం. అంతేకాకుండా రాజ్య పర్యవేక్షణలో ప్రణాళికలు (planning) అంటే ఆర్థిక మార్పులకై మనకున్నటువంటి వనరులను (resources) క్రమబద్ధంగా, సక్రమంగా వాడటం, ఉత్పత్తిని పెంచడం ద్వారా అభివృద్ధి తేవడమనేది రెండవ పంచవర్ష ప్రణాళికలో రూపొందించబడింది (1957-62). దీని ప్రకారం ఆధునిక అంటే సాధారణంగా పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం, వ్యవసాయ రంగంలో కూడా యంత్రీకరణ (mechanization). ప్రవేశపెట్టి అభివృద్ధి చేయడం మొదలైనవి, రాజ్యం, రాజ్యాధికారానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అధికారం ఎక్కువ చేయడమే కాకుండా కేంద్రీకృతం కూడా చేశాయి. నెహ్రు దృక్పథంలో ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ రాజ్యపర్యవేక్షణలో జరగవలసిన ముఖ్యమైన మార్పు. ప్లానింగ్‌ ద్వారా ఆర్థిక మార్పును, అభివృధ్ధిని రాజ్యం తేగలుగుతుందనే ధోరణి ఒక విధంగా రాజకీయాల నుంచి ఆర్థిక సమస్యలు, వాటి పరిష్కరణకు దేశం దృష్టిని మళ్ళించింది. ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతనే గుర్తించారు తప్ప మౌలికమైన మార్పులను తీసుకురావటంలో సామాన్య ప్రజల పాత్రను గుర్తించలేదు. ఉదా: జాగిర్దారీ, జమిందారీ వంటి వ్యవస్థలను రద్దు చేసినప్పటికీ, అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ భూసంస్కరణలను అమలులో పెట్టడానికి కృషి చేయలేదు. వయోజన ఓటు హక్కు అందరికీ (Universal adult franchise) రావడం వల్ల వెనకబడ్డ తరగతుల, కులాలలో ఒక కొత్త చైతన్యం రావడం, దేశమంతటా ఉద్యమాలు, సమ్మెలు, అన్నింటికంటే ముఖ్యంగా భాషా రాష్ట్రాల కోసం ఉద్యమాలు ఇవన్నీ మొదటి ఎన్నికల (1952) తర్వాత స్పష్టంగా కనిపిస్తాయి. కాంగ్రెస్‌ పార్టీ 70% సీట్లను 45% ఓట్లతో పార్లమెంటులో గెలుచుకుంది. ఆవడి తీర్మానం ప్రకారంగా, కాంగ్రెస్‌ పార్టీ తన అధికారాన్ని, రాజ్యం యొక్క అధికారాన్ని (legitimate) ‘సోషలిజం’ పేరుతో సమర్ధించుకోవడానికి పూనుకుంది. అయితే ఈ సోషలిజం ప్రజా ఉద్యమాల ద్వారా కానీ, అధికార వికేంద్రీకరణ ద్వారా కానీ, సంస్థాగతమైన రాడికల్‌ మార్పుల ద్వారా కానీ కాకుండా, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పారిశ్రామికీకరణ ద్వారా అంటే కాంగ్రెస్‌ పార్టీ ఆధిపత్యంలో రావలసిన మార్పు. దీన్ని రాజ్య పెట్టుబడిదారీతనం (State Capitalism) అని కొందరు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ (mixed economy) అని కొందరు వర్ణించారు.

ప్రణాళిక ప్రకారం పారిశ్రామికీకరణ కోసం కావలసిన వనరుల (resources) ను చేకూర్చే సామర్ధ్యం, శక్తి ఒక్క రాజ్యానికే ఉందని, రెండవ పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక పెట్టుబడిదారుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వమే భారీ పరిశ్రమలను (స్టీలు లాంటివి), పారిశ్రామికీకరణకు కావలసిన సాధన సామగ్రి (infrastructure) (రైల్వేలు, రవాణా) ను నిర్మించడానికి పూనుకుంది. అంతేకాకుండా చిన్న రైతు, వ్యవసాయదారుల అవసరాలను తీర్చడానికి మధ్య దళారులను (Parasitical intermediaries) తొలగించడం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సంస్థలను నిర్మించడానికి కూడా నిర్ణయించింది. అదేవిధంగా వివిధ వృత్తులపై జీవించే మధ్యతరగతి (Professional classes) వారి కొనుగోలు శక్తి పెంచడానికి, నిరుద్యోగం నిర్మూలించడానికి ముసాయిదాలు వేసింది.

ఈ విధంగా దేశంలో మొదటి దశలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిన పాలసీ ప్రకారంగా పాశ్చాత్య దేశాలలో జరిగినట్లుగా పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ ద్వారా దేశసమైక్యత, అభివృద్ధి చేకూర్చాలనే విధానాలను పాటించింది. అయితే ఇటువంటి పారిశ్రామికీకరణకు కావలసిన పెట్టుబడులు దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద, పెద్ద స్టీలు ప్లాంట్‌లు (భిలాయ్‌, దుర్గాపూర్‌, రూర్కెలా), డ్యామ్‌లు (బాక్రానంగల్‌) లాంటివి కట్టడం జరిగింది.

నెహ్రు వాటిని ‘ఆధునిక దేవాలయాల’న్నారు. ఈ పారిశ్రామికీకరణవల్ల కొంత అభివృద్ధి జరిగినప్పటికీ పారిశ్రామికీకరణ ద్వారా ఆధునికీకరణ పేరుతో ప్రాథమిక విద్యకు, అక్షరాస్యతకు ప్రాముఖ్యతనివ్వక పోవడం, కేవలం ఉన్నత విద్యకు, ప్రత్యేకమైన విద్యకు ప్రాధాన్యతనివ్వడం వల్ల సామాన్య ప్రజలకు విద్య అందుబాటులో లేకుండా పోయింది. దాంతో క్రమంగా పెరుగుతున్న నిరుద్యోగం, ప్రాంతీయ విభేదాలు, పెరుగుతున్న ధరలు, దానికి తోడు పాకిస్తాన్‌, చైనా దేశాలతో యుద్ధాలు, పెరుగుతున్న రక్షణ బడ్జెట్‌, వీటన్నింటికీ మించి కాంగ్రెస్‌లో పెరుగుతున్న అవినీతి, ఇవన్నీ కలిసి 1960లలో ఒక కొత్త సంక్షోభాన్ని కలిగించాయి. ప్రజా ఉద్యమాలు, కాంగ్రెస్‌ వ్యతిరేకత ఇవన్నీ పెరిగి 1967లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి (1957లో కేరళలో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వం దాన్ని తొలగించి రాష్ట్రపతి పాలనను స్థాపించింది). ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ తన అధికారాన్ని పునర్‌స్థాపించడానికి కొత్త పాలసీలు (populist policies) ‘గరీబీ హఠావో’ లాంటివి అమల్లోకి తెచ్చింది. స్వయం ప్రతిపత్తి గల ఆర్థిక వ్యవస్థను స్థాపించకపోగా ఇదివరకు పాటించినటువంటి ఆర్థిక విధానాలు (heavy industry and capital intensive production) విదేశీ పెట్టుబడిపై ఆధారపడటాన్ని (defendence) పెంచింది. వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి లేనందువల్ల (ఆహార ధాన్యాలకన్నా వ్యాపార పంటలను ప్రోత్సహించడం) – (ముఖ్యంగా 65-67) అమెరికా నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక విదేశీ రుణాలు 1948లో రూ.32 కోట్ల నుండి 1967లో రూ.5,400 కోట్లదాకా పెరిగాయి. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో (61-66) సగటు జీతం అస్సలు పెరగలేదు. పెట్టుబడులు పెంచే అవకాశాలు పెరగకపోగా, విదేశీ సహాయం (రుణాలు) ప్రణాళిక బడ్జెట్‌లో 28% వరకు పెరిగింది. ఈ రుణ సహాయంలో అమెరికా అగ్రస్థానం వహించింది. ఇటువంటి పరిస్థితుల్లో, 1966లో ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ తగ్గిపోవడం జరిగింది. (36.5 శాతం వరకు) అంతేకాక ప్రభుత్వం దిగుమతి విధానాన్ని (Import policy) సరళీకృతం చేసి మార్కెట్‌ శక్తులను ప్రోత్సహించింది.

భారత ప్రభుత్వం కొత్త విధానాలను అవలంబించసాగింది. అయితే 50లలో విదేశీ పెట్టుబడి, సహాయం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితే 60లలో ఈ రుణ సహాయం ప్రభుత్వం యొక్క అసహాయతను, అసమర్ధతను తెలుపుతోంది. ఎందుకంటే 50లలో మూడవ ప్రణాళికలో ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రణాళికల మొత్తం పెట్టుబడులలో పబ్లిక్‌ సెక్టారు వంతు కూడా 55 కోట్ల నుంచి 1,520 కోట్ల వరకు పెరిగింది. అంతేకాక ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఈ క్రింది సంస్థల ద్వారా దీర్ఘకాలిక రుణాలను కూడా ఇవ్వగలిగింది. అవి ఇండియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (Indian finance Corporation), ది నేషనల్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (The National Industrial Development Corporation), స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (State Finance corporation). అయితే వ్యవసాయ రంగంలో సంస్కరణలు వచ్చినప్పటికీ 46 శాతం భూమి 10 శాతం భూస్వాముల చేతుల్లో ఉండిపోయింది. పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రజల సంఖ్య 1960-61లో 31 శాతం నుంచి 64-65లో 45 శాతం వరకు పెరిగింది. 50 శాతం పట్టణవాసులు పేదరికంలో ఉన్నట్లు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు.

నెహ్రు చనిపోకముందు ప్రణాళిక, ఆధునికీకరణ సరైన పద్ధతిలో నడపలేదని ఆర్థిక పురోగమనం మానవతా దృక్పథంతో నడవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే నెహ్రు నియన్‌ మాడల్‌ అనబడే పారిశ్రామికీకరణ పద్దతిలోనే వైరుధ్యాలుండడం వల్ల అది అనుకున్న ఫలితాలను తీసుకురాలేక పోయింది. పెద్ద పరిశ్రమలు, ఆనకట్టలకు కావలసిన పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం ఇవన్నీ కూడా ఎక్కువ ఖర్చుతో దిగుమతి చేయడం అవసరమయింది. అంతేకాక కాంగ్రెస్‌ ప్లానింగ్‌ ద్వారా రాజ్యం, రాజ్యాధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజల అవసరాలను కూడా తీర్చలేకపోయింది. 1964లో నెహ్రు చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌లో చీలికలు రావడం, ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం జరిగింది.

పెరుగుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకత ఎదుర్కోవడానికి ఇందిరాగాంధీ విప్లవాత్మకంగా అనిపించే కొన్ని విధానాలను ప్రవేశపెట్టింది. 10 సూత్రాల ప్రోగ్రాం ద్వారా బ్యాంకులు, జనరల్‌ ఇన్సూరెన్స్‌, విదేశీ వ్యాపారాన్ని జాతీయం చేసింది. ప్రజల అవసరాలు తీర్చడానికి ఆహార ధాన్యాలు, పౌర సరఫరాల వ్యవస్థ (Public Distribution) ద్వారా పంపిణీ చేయడం, సహకార సంఘాలను బలపరచడం, గుత్త పెట్టుబడిని ప్రభుత్వం క్రమబద్దం (regulate) చేయడం, పట్టణ ఆస్తి (urban property) ని కంట్రోల్‌ చేయడం, గ్రామీణ ప్రజలకు వివిధ ప్రోగ్రామ్‌లను అమల్లో పెట్టడం, వ్యవసాయదారులకు సహాయం చేయడం, మైనారిటీలకు సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ ఇందిరాగాంధీ చేపట్టిన పథకాలు. 1971-72లో ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో అగ్రకులాలతో, హరిజనులతో, మైనారిటీలతో, స్త్రీలతో ఒక కొత్త సాంఘిక అనుబంధాన్ని (social alliance) తీసుకువచ్చింది. పాకిస్తాన్‌ యుద్ధంలో, బంగ్లాదేశ్‌ విడిపోవడంతో భారత సైన్యాల పాత్ర, రష్యా సహకారం ఇవన్నీ ఇందిరాగాంధీ నాయకత్వాన్ని బలపరచడమే కాకుండా, 72 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక మెజారిటీ వచ్చేలా చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలో పోటీలు, వైరుధ్యాలు ఎక్కువ కావడం, ప్రజాస్వామ్యయుత నిర్వహణ లేకపోవడం వల్ల అధికారం వ్యక్తీకృతం (Personalised Power) కావడం జరిగింది. అంతేకాక పెద్ద పెట్టుబడిదార్ల పాత్ర ఎక్కువ కావడం, వారి దగ్గర నుంచి కాంగ్రెస్‌ పార్టీ విరాళాలు పెద్ద మొత్తంలో తీసుకోవడం జరిగింది. 1963-73 మధ్యలో ప్రైవేటు సెక్టారు ఆర్థిక స్థోమత (జుషశీఅశీఎఱష ూరరవ్‌ర) 32 శాతం నుంచి 38 శాతం వరకు పెరిగింది. దీనిలో టాటా, బిర్లా వంతులు 40.1 శాతం వరకు.

1972-73లో ధరలు ఆకాశాన్నంటడమే కాకుండా, ప్రణాళిక అనేది లేకుండా పోయింది. ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అధికారం చాలా కొద్దిమంది సలహాపై నిర్వహించడంవల్ల పార్టీలో అసంతృప్తి, దేశంలో అస్థవ్యస్థత పెరిగాయి. వీటిని ఆసరాగా చేసుకుని 75లో అత్యవసర పరిస్థితి (Emergency) ప్రకటించడం జరిగింది. ఒక కొత్త ఆర్థిక పథకం – 20 సూత్రాల పథకం తయారు చేయడం, అత్యవసర పరిస్థితి పేరుతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం, ఇవన్నీ జరిగి ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కూడా త్వరలో ఓడిపోయి తిరిగి ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేశంలో ఆర్థిక పరిస్థితులు క్షీణించడమే కాకుండా వివిధ రకాల ఉద్యమాలు – పంజాబ్‌, అస్సాం, కాశ్మీర్‌ రావడంవల్ల రాజకీయ అస్థిరత్వం కూడా పెరిగింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీ అధికారంలోకి రావడం జరిగింది.

రాజీవ్‌గాంధీ పాలనలో ఆర్థిక విధానం

రాజీవ్‌గాంధీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యంతో అంటే ఆధునిక కంప్యూటర్‌ యుగంలోకి ఆర్థిక విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాడు. 1989లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 8వ పంచవర్ష ప్రణాళికను తయారు చేసింది. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోయి జనతాదళ్‌ (వి.పి.సింగ్‌ ఆధ్వర్యంలో) అధికారంలోకి వచ్చినపుడు ఈ ప్రణాళికను మార్చడం జరిగింది. కాంగ్రెస్‌ పరిపాలనలో వచ్చినటువంటి నిరుద్యోగ సమస్యలు, వ్యవసాయ రంగంలో సమస్యలు, సమాజంలో అన్ని అవకాశాలు కొద్దిమంది చేతుల్లోనే ఉండటం, మిగతా అత్యధిక జనాభా దారిద్య్రంలో ఉండటం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తేవడం జరిగింది. పనిచేసే హక్కు, ఎక్కువ శాతం పెట్టుబడులు గ్రామీణ ప్రాంతాలకు తరలించడం, గ్రామీణ కుటీర పరిశ్రమలు, మానవ వనరులు శ్రామిక శక్తి ద్వారా (Labour intensive) ఉత్పత్తి పెంచడం, వెనుకబడ్డ కులాలకు ఉపాధి కల్పించడం, కనీస వేతనాల చట్టం అమల్లో పెట్టడం, అన్నింటికంటే ముఖ్యంగా ప్లానింగ్‌ పద్ధతిని అమల్లో పెట్టడాన్ని వికేంద్రీకృతం చేయడం ఎనిమిదవ ప్రణాళిక ముఖ్య అంశాలు. ప్రణాళికలో స్త్రీలకు ప్రత్యేక పాత్ర ఉంది. స్థానిక వనరులు, నైపుణ్యం (skills) సేకరించి ప్రణాళికను అమలులో పెట్టడం. దానికోసం స్త్రీలకు చదువు, సాక్షరతా కార్యక్రమాలు, పనులు నేర్పడానికి శిక్షణా కార్యక్రమాలు, పిల్లలకు సదుపాయాలు, ఉత్పత్తి విధానంలో స్థానం ఇవన్నీ కూడా కల్పించడానికి ప్రణాళిక రూపొందించబడింది. దీని ముఖ్యోద్దేశం స్త్రీలకు రాయితీలు ఇవ్వడం కాకుండా, వాళ్ళను అన్ని రకాలుగా శక్తివంతులను చేయడం. పర్యావరణ విచ్ఛిన్నం వల్ల స్త్రీలకు నీరు, ఆహారం, వంట చెరకు వంటివి అందకుండా పోతున్నాయి. కనుక పర్యావరణ సంరక్షణలో స్త్రీల పాత్రను గుర్తించి స్త్రీలకు కావలసిన సదుపాయాలను సమకూర్చడం ఒక ముఖ్యమైన విషయం. వీటన్నింటికంటే ముఖ్యంగా జనతాదళ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ సిఫార్సులను (వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగ రంగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించడం) అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది.

జనతాదళ్‌ తయారుచేసిన ప్రణాళికను జాతీయ అభివృద్ధి సంస్థ (National Development Council) జూన్‌ 1990లో ఆమోదించింది. అయితే వి.పి.సింగ్‌ ప్రభుత్వం పడిపోవడంతో (నవంబర్‌ 90) ప్రణాళికా సంఘాన్ని చంద్రశేఖర్‌ ప్రభుత్వం తిరిగి నియోగించింది. 6 శాతం అభివృద్ధి రేటు వచ్చేట్టుగా ప్రణాళికను జారీ చేసింది. రాజీవ్‌గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పి.వి.నరసింహారావు ఆధిపత్యంలో అధికారంలోకి వచ్చింది. రాజీవ్‌ గాంధీ ప్రారంభించిన సరళీకృత విధానాలు, కంప్యూటర్‌ యుగంలోకి దేశాన్ని అతి త్వరగా తీసుకుపోవాలన్న కలలను పి.వి.నరసింహారావు ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాల రూపంలో ప్రతిపాదించింది.

రాజీవ్‌ గాంధీ ప్రవేశపెట్టిన సరళీకృత (లిబరలైజేషన్‌) పాలసీ ఎగుమతులను పెంచింది. అభివృద్ధి రేటు 17 శాతం (డాలర్లలో) పెరిగింది. (86-87, 89-90) అయితే 90-91లో ఇది 9.0 శాతం, తర్వాత 4.4 వరకు తగ్గిపోయింది. ఆర్థిక లోటు పెరిగింది. దీనికి కారణం కొంతవరకు గల్ఫ్‌ యుద్ధం వల్ల చమురును ఎక్కువ ధరకు దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏర్పడడమే. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 1989-90లో రూ.6,273 కోట్ల నుంచి 1990-91లో రూ.10,819 కోట్ల వరకు పెరిగింది. అదేవిధంగా మిషనరీ, రవాణా సామగ్రి (equipment) దిగుమతులు 89-90లో రూ.8,559 కోట్ల నుంచి 90-91లో రూ.10,044 కోట్ల వరకు పెరిగింది. మొత్తం మీద లిబరలైజేషన్‌ పాలసీ వల్ల దేశం యొక్క ఆర్థిక లోటు 1990-91లో (current account deficit) రూ.7,295 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. విదేశీ చెల్లింపు నిల్వలు చాలా తగ్గిపోయి (90 డిసెంబరులో రూ.3,140 కోట్ల నుంచి 91 జులైలో రూ.2,500 కోట్ల వరకు) విదేశీ రుణభారం పెరిగి చెల్లింపులు కట్టడానికి చివరకు రూపాయి విలువ తగ్గించి 47 టన్నుల బంగారాన్ని ఎగుమతి చేయాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. అంతేకాక ఫిస్కల్‌ డెఫిసిట్‌ (అంటే మొత్తం ఖర్చుకు మొత్తం రాబడికి (పన్నుల ద్వారా మరియు ఇతర రాబడి) ఉండే తేడా) 1989-90లో రూ.35,630 కోట్లు ఉంటే 90-91లో రూ.43,330 వరకు పెరిగింది. చాలా పెద్ద వడ్డీపై రుణాలు తీసుకుని ఈ లోటును తీర్చడం వల్ల విదేశీ రుణభారం, వడ్డీ భారం ఆకాశాన్నంటాయి. (రుణభారం మొత్తం దేశీయ ఉత్పత్తిలో (Gross Domestic Product) లో 55%, ప్రభుత్వ మొత్తం వ్యయంలో 20% వడ్డీ తీర్చడానికి ఖర్చవుతోంది.)

నూతన ఆర్థిక విధానం

సోవియట్‌ సోషలిస్టు రష్యా విచ్ఛిన్నమైపోయిన క్రమంలో అమెరికా మోడల్‌ అంటే స్వేచ్ఛా వ్యాపారం, సరళీకృత మోడల్‌ ప్రపంచానికంతటికీ సరైన విధానమనే ధోరణి ఇప్పుడు కనిపిస్తోంది. మన దేశంలో ఆర్థిక సమస్యలను పరిష్కరించాలంటే ప్రభుత్వ పాత్ర పూర్తిగా తగ్గించి ఆర్థిక వ్యవస్థను ఏ కట్టుదిట్టాలు లేకుండా చేసినట్లయితే అభివృద్ధి చెందుతుందనే అవగాహనతో ఈ నూతన ఆర్థిక విధానం రూపొందించబడింది. అంతేకాక గల్ఫ్‌ యుద్ధం తర్వాత, పాశ్చాత్య దేశాల్లో అంతకు ముందునుంచే వస్తున్న ఆర్థిక సంక్షోభం మరింత తీవ్ర పరిస్థితి దాల్చింది. కనుక ఆ దేశాలు తమ ఆర్థిక పరిస్థితుల్ని చక్కబెట్టడానికి వర్ధమాన దేశాల నుండి రాబడి ఎక్కువ చేసుకోవడానికి సరళీకృత విధానాలను, వ్యవస్థాగతమైన (SAP – Structural Adjustment Programme) మార్పులను ప్రపంచ ద్రవ్యనిధి, (IMF) ప్రపంచ బ్యాంకు ద్వారా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

విదేశీ మార్కెట్లలో భారతదేశ వస్తువుల అమ్మకాలు పెంచడానికి, ఎటువంటి ప్రభుత్వ నియంత్రణలు లేకుండా మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేసినట్లయితే ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయగలుగుతుందనే భావనతో ఈ వ్యవస్థాగతమైన సంస్కరణలు (SAP) రూపొందించబడ్డాయి. అయితే నిజంగా ఈ ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానం ఎంతవరకు సామాన్య ప్రజల అవసరాల్ని తీర్చగలుగుతాయి అనేది ప్రశ్న. అంతేకాకుండా ఆర్థిక సమస్యలను తీర్చడానికి ఇది ఒకటే మార్గమా? ఈ పద్ధతులను అవలంబించిన దేశాల అనుభవం ఏమిటి? అందులో ముఖ్యంగా స్త్రీలపై దీని ప్రభావం ఏమిటి?

సరళీకృత విధానం యొక్క ముఖ్యమైన అంశాలు – (1) ప్రభుత్వ ఖజానా లోటు (fiscal deficit)ను తగ్గించడం అంటే ప్రస్తుత రాబడి కంటే ఎక్కువగా ఉంటే ఖర్చును తగ్గించడం (2) ద్రవ్య సరఫరా (Money supply) ను అదుపులో పెట్టడం ద్వారా దేశీయ రుణాల పెరుగుదలను (domestic credit expansion) అరికట్టడం (3) ద్రవ్యోల్బణం (సవఙaశ్రీబa్‌ఱశీఅ) అంటే రూపాయి విలువను తగ్గించడం. (4) విదేశీ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడం, అంటే దిగుమతులపై క్రమంగా పన్నులను, అడ్డంకులను (Tariff barries) తగ్గించడం, ఎగుమతులపై, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి చెందిన వస్తువులపై నిర్బంధాలను, నియమాలను తొలగించడం (5) విదేశీ పెట్టుబడి దేశంలోకి సులభంగా రావడానికి ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తులకు (Direct Foreign Investment) అవకాశాలు కల్పించడం, (6) ధరల నియంత్రణకై నిత్యావసరాల ధరలతో సహా ఉండే కట్టుబాట్లు, నియమాలు ఎత్తివేయడం (deregulation;) (7) సబ్సిడీలు – ముఖ్యంగా ఎగుమతులపై, ఎరువులు, ఆహార ధాన్యాలపై, ఆహార పదార్థాలపై ఎత్తివేయడం. ఇది ప్రభుత్వ బడ్జెట్‌లో ఖర్చులు తగ్గించడానికి, దేశీయ ధరలను అంతర్జాతీయ ధరలతో సరితూగేలా చేయడానికి (8) పబ్లిక్‌ సెక్టారును సంస్కరించడం అంటే నష్టాలకు గురవుతున్న పరిశ్రమలను మూసివేయడం, పెట్టుబడులను నిరుత్సాహపరిచి రద్దు చేయడం (disinvestment), క్రమంగా ప్రైవేటైజ్‌ చేయడం, ధరలను పెంచడం, ప్రభుత్వ రాయితీలు తగ్గించడం లేదా తీసివేయడం, (9) పెట్టుబడులను మూలధన మార్కెట్‌ను (domestic financial market) బలపరచడానికి దేశీయ ద్రవ్య మార్కెట్‌ను (domestic financial market) సరళీకృతం చేయడం కొంతవరకు జరిగినప్పటికీ, ఈ పాలసీ ఇంకా పూర్తిగా నిర్ణయించబడలేదు. (10) అదేవిధంగా లేబర్‌ మార్కెట్‌ను సరళీకృతం చేయడం అంటే పరిశ్రమల మూసివేతను సులభతరం చేయడం, కార్మికులకు ఉండే రక్షణ చట్టాలను (protective measures) తీసివేయడం. ఇవి కూడా ఇంకా అమలులోకి రాలేదు.

మన దేశంలో పరిశ్రమలు స్థాపించడానికి బహుళ జాతి సంస్థలకు అవకాశాలు కల్పించడం వల్ల, ఇక్కడ కార్మికుల శ్రమను చవక ధరలకు అంటే తక్కువ జీతాలకు కొనుక్కొని, లాభాలు గడించి ఆ లాభాలను బయటికి పంపించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నూతన ఆర్థిక విధానంతో పాటు ఇప్పుడు డంకెల్‌ ప్రతిపాదనలు కూడా ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చాలావరకు బహుముఖ విదేశీ వ్యాపారాన్ని  సరళీకృతం చేయడానికి, అంతర్జాతీయ వ్యాపారంలో (World trade) ఉండే కట్టుదిట్టాలను, నియమాలను తీసివేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛా వ్యాపార (free trade) విధానానికి మార్చివేయడానికి ఈ ప్రతిపాదనలు చేయబడ్డాయి. పేటెంటు విధానాల్లో మార్పులు కూడా ఈ ప్రతిపాదనలో ఉన్నాయి.

డంకెల్‌ ప్రతిపాదనలు

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వాణిజ్య వ్యాపారాన్ని కొన్ని కట్టుదిట్టాలలో ఉంచడానికి క్రమంగా దాన్ని సరళీకృతం చేయడానికి, వ్యాపారాన్ని బహుముఖం చేయడానికి పారిశ్రామిక దేశాల ఆధ్వర్యంలో ”గాట్‌” (GATT – General Agreement on Trade and Tariff) పై సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు 1986లో ప్రారంభమయ్యాయి. దీనిలో అతి ముఖ్యమైన విషయాలు, సాంకేతిక పరిజ్ఞాన హక్కులు (మేధోసంపత్తి హక్కులు), వ్యాపార సంబంధిత పెట్టుబడి సూత్రాలు. సూక్ష్మంగా చెప్పాలంటే వీటి ఉద్దేశ్యం వర్ధమాన దేశాలు, అదేవిధంగా జపాన్‌తో సహా మిగతా అన్ని దేశాల ప్రభుత్వాలు వాణిజ్యంపై ఎటువంటి కట్టుదిట్టాలు పెట్టకుండా స్వేచ్ఛా వ్యాపారానికి సదుపాయాలు కల్పించడం, అన్నింటికంటే ముఖ్యంగా పేటెంట్‌ హక్కులకు సంబంధించిన చట్టాలను మార్చడం, ఎగుమతి దిగుమతులపై ట్టుదిట్టాలు, ప్రభుత్వ రాయితీలు కొట్టివేసి పెట్టుబడులు, సర్వీసు సెక్టార్లను స్వేచ్ఛగా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి తరలించే అవకాశాలు కల్పించడం. ఈ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపారాలను క్రమబద్ధం చేయడానికి అమెరికా చేసిన ప్రతిపాదనలే డంకెల్‌ ప్రతిపాదనలు అంటారు. ఇవి మూడవ ప్రపంచ దేశాలకు అతి క్లిష్టమైనవి.

పేటెంట్‌ హక్కులకు సంబంధించిన విషయాలు వర్ధమాన దేశాల స్వయం ప్రతిపత్తిపై పెద్ద వేటు వేసే అవకాశం ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ, పారిశ్రామికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే క్రమంలో వచ్చినవే ఈ పేటెంట్‌ హక్కులు. అంటే ఒక కొత్త విషయాన్ని కనుగొన్నవారికి, వస్తువును తయారు చేసినవారికి ప్రభుత్వం చట్టరీత్యా ఇచ్చే కొన్ని ప్రత్యేక హక్కులు. దీని ప్రకారం ఎవరైనా కనుగొని తయారుచేసిన వస్తువును కానీ, తయారు చేసిన పద్ధతిని కానీ కొన్ని సంవత్సరాల వరకు మరెవరూ తయారు చేయడానికి వీలులేదు. ఈ విధంగా పేటెంట్‌ చేయబడిన వస్తువు, కాలపరిమితి దాటిన తర్వాత ఎవరైనా చేయడానికి, అమ్మడానికి (అంటే ప్రజలకు అందుబాటులోకి) స్వేచ్ఛ, అధికారం ఉంటాయి. ఇవి నిజంగా హక్కులనే కంటే ప్రభుత్వం ఇచ్చే హామీ, సౌకర్యం అని చెప్పాలి. ప్రాసెస్‌ పేటెంట్‌ ప్రకారం వస్తువును చేసే పద్ధతిని మరెవరూ వాడడానికి వీలులేదు. అయితే వేరే పద్ధతిలో చేయవచ్చు. కానీ ప్రొడక్డ్‌ పేటెంట్‌ అంటే ఆ వస్తువును ఏ విధంగానైనా, వేరే పద్ధతిలోనైనా మరెవరూ తయారు చేయడానికి వీలులేదు. అంటే ఒక విధంగా గుత్తాధికారమన్నమాట. ఈ పేటెంట్‌ హక్కుల పూర్వోత్తరాలు – ఏడవ శతాబ్దం బి.సి.లో కనిపిస్తాయి. గ్రీకు రాజులు కొత్త వంటలు కనిపెట్టిన వంటవాళ్ళకు ఒక సంవత్సరందాకా మరెవరూ ఆ వంట చేయకుండా హక్కులిచ్చేవారట. అయితే పేటెంట్‌ చట్టాలు 2000 సంవత్సరాల తర్వాత లెనిస్‌ (ఇటలీ)లో చేతివృత్తి కళాకారుల హక్కులను భద్రపరచడానికి వచ్చాయి. అయితే సాంకేతిక పరిజ్ఞాన రంగంలో కూడా ఈ పేటెంట్‌ హక్కులున్నప్పటికీ, శాస్త్రజ్ఞులు చారిత్రాత్మకంగా వచ్చినటువంటి పరిశోధనలు, పరిజ్ఞానం లేనిదే కొత్త విషయాలు కనిపెట్టడం సాధ్యంకాదు. అందుచేత పేటెంట్‌ హక్కుల చట్టాలున్నప్పటికీ, సామాజిక ఉపయోగానికి ప్రజలకు అందుబాటులో ఉండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు సాగనివ్వాలి. 19వ శతాబ్దంలో ఆధునిక పరిశోధనలు, శాస్త్రీయ పరిజ్ఞానం పెరగడంతో వాటిపై పేటెంట్‌ హక్కులకోసం పోటీ కూడా పెరిగింది. దీంతో పేటెంట్‌ హక్కుల చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలు కూడా చాలా వచ్చాయి. మన దేశంలో 1856 నుంచి వచ్చినటువంటి (అంటే బ్రిటిష్‌ వారు చేసింది) పేటెంట్‌ చట్టాలను 1970లో మన స్వతంత్ర ప్రతిపత్తిని నిలబెట్టుకునేట్టుగా మార్చబడింది. దీని ప్రకారంగా –

(ఎ) ఆహార పదార్థాలు, రసాయన పద్దతి ద్వారా చేసిన వస్తువులపై తప్ప మిగతా వాటిపై ప్రొడక్ట్‌ పేటెంట్‌ హక్కులు పొందవచ్చు. అంటే ఆ వస్తువులను మరెవరూ వేరే పద్ధతిలో కూడా తయారు చేయడానికి వీలులేదు. అయితే మందులు, ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిపై ప్రోసెస్‌ పేటెంట్‌ మాత్రమే ఉంది. అంటే వాటిని వేరే ఏ పద్ధతిలో ఎవరైనా తయారు చేయవచ్చు. ఉదాః వాపు అరికట్టే మందు (brand name – Feldence) మన దేశంలో 10 గోలీల ఖరీదు రూ.18 మాత్రమే. అయితే అమెరికాలో దీని ఖరీదు రూ.520. ఎందుకంటే అమెరికాలో ఫిజర్‌ (Pfizer) అనే బహుళజాతి కంపెనీకి దానిపై ప్రొడక్ట్‌ పేటెంట్‌ హక్కులున్నందువల్ల ఆ కంపెనీ తప్ప మరెవరూ దీన్ని వేరే ఏ పద్ధతిలోనూ తయారు చేయడానికి వీలులేదు. అయితే మన దేశంలో ప్రోసెస్‌ పేటెంట్‌ మాత్రమే ఉండడం వల్ల దీన్ని మన దేశంలో కంపెనీలు వివిధ పద్ధతుల్లో తయారుచేసి ప్రజలకు కొంతవరకైనా అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.

(బి) అణుశక్తి, వ్యవసాయ రంగం, హార్టీకల్చర్‌ రంగాల్లో ఎటువంటి పేటెంట్‌ హక్కులకు తావులేదు. అంటే ఈ రంగాల్లో మన దేశంలో ఎటువంటి పరిశోధనలు కానీ, ఏమైనా వస్తువులను తయారు చేయడాన్ని కానీ ఎవరూ ఆపలేరు. (సాధారణంగా అణుశక్తికి సంబంధించినవి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయి).

(సి) పేటెంట్‌ హక్కులున్నవాళ్ళు తప్పనిసరిగా ఆ వస్తువులను మన దేశంలోనే ఉత్పత్తి చేయాలి. పేటెంట్‌ హక్కులు భారతీయులు కానీ, విదేశీయులు కానీ పొందవచ్చు.

(డి) జాతీయ సంక్షేమం (National Interests) పేటెంట్‌ హక్కుల కంటే ముఖ్యం.

(ఇ) పేటెంట్‌ హక్కులున్న వాళ్ళు ఆహార, ఔషధ రంగంలో కావలసిన వస్తువులను ఉత్పత్తి చేయకపోయినా, ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో అమ్మకపోయినా, ఈ వస్తువును మరెవరైనా ఉత్పత్తి చేయవచ్చును.

(ఎఫ్‌) పేటెంట్‌ హక్కులు 14 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటాయి. ఆహార, ఔషధ రంగాల్లో మాత్రం 7 నుంచి 5 సంవత్సరాల వరకే ఉంటాయి. 1970 పేటెంట్‌ చట్టం కాక, మన సాంకేతిక పరిజ్ఞాన హక్కులను భద్రపరచడానికి ఇంకా కొన్ని చట్టాలు ఉన్నాయి. డంకెల్‌ ప్రతిపాదనలు ప్రపంచ వాణిజ్య వ్యాపార వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇవి సరళీకృత ప్రైవేటీకరణ ధోరణిలో ప్రభుత్వ పాత్రను తగ్గించడానికి పేటెంటు హక్కులను మార్చి ప్రొడక్ట్‌ హక్కులనివ్వడం, సర్వీస్‌ సెక్టర్‌ -అంటే బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ వంటి వాటిని ప్రైవేటీకరించి విదేశీ బ్యాంకులు, కంపెనీలు కూడా ఏ ట్టుదిట్టాలు లేకుండా మన దేశంలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నాయి. దీని గురించే ఇప్పుడు కొంత చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తీసివేసి, వాణిజ్యాన్ని పూర్తిగా స్వేచ్ఛా వాణిజ్యంగా మార్చి, మార్కెట్‌ను బలపరచడానికి డంకెల్‌ ప్రతిపాదనలు ప్రయత్నిస్తున్నాయి. పేటెంటు హక్కు చట్టాలను మార్చి ప్రొడక్ట్‌ పేటెంట్‌కై ఒప్పుకున్నట్లయితే మన పరిశ్రమలు-ముఖ్యంగా ఔషధ, వ్యవసాయ రంగంలో నష్టపోవడమే కాకుండా మనకు చారిత్రాత్మకంగా, సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పరిజ్ఞానంపై మనకే హక్కులు లేకుండా పోతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎన్నో మందులు మన దేశంలో తయారుచేసి చవక ధరల్లో అమ్మగలుగుతున్నాం. ప్రోడక్ట్‌ పేటెంట్‌ వల్ల వాటిని మనం తయారుచేసే హక్కులనే కోల్పోవచ్చు. కంపెనీలు పేటెంటు కొనుక్కొని గుత్తాధికారం పొందవచ్చు. దీనివల్ల ఎన్నో మందులు మనకు అందుబాటులో లేకుండా పోతాయి. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో, విత్తనాలు తయారు చేయడంలో మన రైతులకు తెలిసినటువంటి మెలకువలు, పరిశోధనల ద్వారా కనుగొన్నటు వంటి వివిధ రకాల జెనెటిక్‌ ప్లాంట్స్‌; మన దేశంలో వాడుతున్న సహజ ఎరువులు… ఇవన్నీ కూడా విదేశీ కంపెనీలు (లేదా మన దేశంలో కంపెనీలైనా) పేటెంట్‌ హక్కులు కొని మనకు అందుబాటులో లేకుండా చేయవచ్చు.

సర్వీస్‌ సెక్టారులో బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు విదేశీ వ్యాపారానికి తెరిచినట్లయితే, పోటీలో మన దేశం నష్టపోవడమే కాకుండా, ఇంతవరకు ప్రభుత్వ సబ్సిడీలు, పాలసీల వల్ల పేద రైతులకు లభించే రుణాలు, రాయితీలు పోయే అవకాశముంది. విదేశీ బ్యాంకులు, కంపెనీలు లాభాలు గడించే పద్ధతిలో పేద రైతాంగం, వ్యవసాయదారుల అవసరాలను పట్టించుకోవు. అందుకే డంకెల్‌ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు వస్తున్నాయి. ఉదాః ముందే చెప్పినటువంటి వేపచెట్టు ప్రచారం. పారిశ్రామిక దేశాల్లో కూడా ముఖ్యంగా ఫ్రాన్స్‌లో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ రాయితీలు ఇవ్వబడుతున్నాయి. అంతేకాక ఈ దేశాలు పారిశ్రామిక రంగంలో కూడా బహుళ జాతి సంస్థల ద్వారా ప్రపంచ వ్యాపారాన్ని కట్టడి చేస్తున్నాయి. ప్రపంచంలో 500 పెద్ద బహుళ జాతి కంపెనీలు, మొత్తం వ్యాపారాన్ని (4.6 ట్రిలియన్‌ డాలర్లు) కంట్రోల్‌ చేస్తున్నాయి. దక్షిణ కొరియా తప్ప ఇవన్నీ కూడా ఉత్తరాది దేశాలకు చెందినవి. ప్రపంచ వ్యాపారంలో 2/5 వరకు ఈ బహుళ జాతి కంపెనీల మధ్యలో జరుగుతుంది. అటువంటప్పుడు వాటికుండే అధికారం, ఆధిపత్యం వర్ధమాన దేశాలలో ఎటువంటి ప్రభుత్వ కట్టుదిట్టాలు లేకుండా సాగనిచ్చినట్లయితే ఈ దేశాలు తమ స్వతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.