అంబ -డా|| బి.విజయభారతి

 

హిందూ సంస్కృతిలోని చాలా విశ్వాసాలకు పురాణ వాజ్ఞ్మయం ఆధారం. ముఖ్యంగా స్త్రీల ప్రవర్తనను నియంత్రించడానికి పురాణ కథలలోని స్త్రీ పాత్రలను తమకు అనుకూలించే విధంగా ఉదహరిస్తూ వాటిని ఆదర్శంగా చెబుతుంటారు. నెగెటివ్‌ లక్షణాలున్న వాటిని, తీవ్ర స్వభావాన్ని సూచించే పాత్రలను మరుగున పడేస్తారు. ఆ విధంగా మరుగున పడేసిన పాత్ర అంబ. మహా భారత వీరుడుగా, కురు పాండవ పితామహుడిగా అజరామరుడైన భీష్ముని అంత ధీటుగానూ ఎదుర్కొన్న సాహసి అంబ. స్త్రీ ఆత్మగౌరవానికి ఆమె ప్రతీక. చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న ధీరురాలు.

శిఖండిగా ఆమె భీష్ముడిని కురుక్షేత్ర యుద్ధంలో తన పాండవ బాణాలతో పడగొట్టింది. అంత ధీర చరిత్రనూ పక్కన పడేసి ‘శిఖండి’ అనే పదాన్ని మొండితనానికి ప్రతీకగా ప్రచారంలోకి తెచ్చారు. పురాణాలను పురుషులు తమకు అనుకూలంగానే ప్రచారం చేసుకోవటం ఒక కుట్ర. స్త్రీల మనోభావాలను ప్రతిబింబించే పాత్రలను దుష్టపాత్రలుగా ప్రచారం చేయటం పురాణాలను వక్రీకరించటమే అవుతుంది.

మహాభారతంలో చెప్పబడిన విధంగానే అంబను పరిచయం చేయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం. అంబను గురించి మహాభారతం మూడు చోట్ల ఆది, ఉద్యోగ, యుద్ధ పర్వాలలో చెప్పింది. ఆ కథ సవిస్తరమే అయినా తప్పక పరిశీలించవలసి ఉంటుంది. అంబను అర్థం చేసుకోవడానికి ఆ వివరాలు అవసరం.

పురుష స్వామ్యపు దుర్నీతికి బలయినప్పటికీ పౌరుషంతో ప్రతీకారం తీర్చుకున్న వనితగా అంబ పురాణ సాహిత్యంలో నిలిచిపోయింది.

అంబ కాశీరాజైన హోత్రవాహనుని పెద్ద కూతురి కుమార్తె. అంబిక, అంబాలిక ఈమె చెల్లెళ్ళు. తండ్రి ఈ ముగ్గురికీ స్వయంవరం ప్రకటించి రాజులనందరినీ పిలిచాడు. అంబ, సాళ్వరాజు అంతకుముందే పరస్పరం ఇష్టపడి ఉన్నారు. అంబ స్వయంవరంలో అతనినే వరించాలనుకుంది. కానీ అనూహ్యంగా భీష్ముడు అక్కడికి వచ్చాడు. వచ్చిన రాజులనందరినీ వెళ్ళగొట్టి ఆ ముగ్గురినీ తీసుకుపోయాడు. తన తమ్ముళ్ళకు వారిని ఇచ్చి పెళ్ళి చేయాలని ఆయన ఉద్దేశ్యం. ఆడపిల్లల ఇష్టాయిష్టాలను బట్టి జరగవలసిన స్వయంవరాలు ఈ విధమైన దౌర్జన్యాలవల్ల విఫలమవుతూ ఉండడం సామాజిక అవ్యవస్థతకు చిహ్నంగా అనుకోవాలి. అంబ తన అభీష్టాన్ని భీష్మునికి చెప్పింది. భీష్ముడు ఆమెను గౌరవంగా సాళ్వుని దగ్గరకు పంపేశాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే సాళ్వుడు ఆమెను స్వీకరించలేదు. ఆమె చూస్తుండగా అతడు భీష్ముని చేతిలో ఓడిపోయాడు కనుక న్యూనతాభావానికి లోనయ్యాడు. అయినా ”భీష్ముడు నిన్ను తీసుకుపోవటం వల్ల నీ కన్యాత్వం దూషితమయింది” అంటూ నింద అంబపైనే మోపి ఆమెను నిరాకరించాడు.

అంబను సాళ్వుని దగ్గరకు పంపినప్పుడు వృద్ధాంగనలను తోడుగా ఇచ్చి పంపే మర్యాదను భీష్ముడు పాటించాడు. పరస్పరం ఇష్టపడినప్పుడు అంబను సాళ్వునికి ఇచ్చి వివాహం చేయవలసి ఉండగా ఆమెను స్వయంవరాలంకారం చేసి కూర్చోబెట్టడం ఆమె తండ్రి చేసిన తప్పు. భీష్ముడు తెలియక తీసుకువెళ్ళినా వెంటనే ఆమెను తిరిగి పంపేశాడు. ఇక్కడ కన్యాత్వం పోవడం అనేది జరగలేదు. అంబ ఈ విషయాలన్నీ సాళ్వునికి చెప్పింది. తనను స్వీకరించవలసిందిగా దీనంగా వేడుకుంది. సాళ్వునిది పురుషాహంకారం. ”ఇక్కడినుండి త్వరగా వెళ్ళిపో” అంటూ ఆమెను పంపేశాడు. అంబ జీవితం దారుణంగా ఛిద్రమైంది.

ఆమె మనసు ఎంత గాయపడిందో ఊహకు అందదు. ”తిరిగి ఇప్పుడు భీష్ముని దగ్గరకు వెళ్ళడం అనవసరం. నాకు జరిగిన హానికి అతడే కారకుడు. అతడు బలవంతుడు, తపస్సుతో అతన్ని సాధిస్తాను” అని నిర్ణయించుకుని అంబ ముని పుంగవులు ఉండే ఒక చోటికి వెళ్ళి తన సంగతి చెప్పింది. ”ఇది రాజులు చేసిన పని. సాధువుల వల్ల చక్కబడదు” అన్నారు వారు. ”తండ్రి దగ్గరకు పుట్టింటికి వెళ్ళు” అని సలహా ఇచ్చారు. ”ఎవరిదగ్గరికైనా ఎలా వెళ్తాను? ఇక్కడే ఒక మూల తపస్సు చేసుకుంటాను” అంది అంబ.

అదే సమయానికి అక్కడికి ‘హోత్రవాహనుడు’ అనే రాజర్షి వచ్చాడు. సంగతంతా విన్నాడు. అంబ తన మనుమరాలే అని గ్రహించాడు. ఈ సమస్య తీర్చగలవాడు పరశురాముడొక్కడే అని ఆలోచించాడు. అక్కడి మునులందరూ అంబపట్ల సానూభూతితో

ఉన్నారు. పూర్వ సమాజంలో పరివ్రాజికులు జన శ్రమణులు సామాజిక సమస్యపట్ల స్పందిస్తూ చేతనైన విధంగా సహాయం చేస్తూండేవారు. ఇక్కడి సమస్య జటిలమైంది కాబట్టి బీష్మునికి సర్దిచెప్పగల పరుశరాముని పేరు ప్రస్తావనకి వచ్చింది. అక్కడి మునులందరూ అంబ పట్ల సానుభూతితో ఉన్నారు. పరశురాముని దగ్గరకు వెళ్ళే మార్గం ఏమిటా అని ఆలోచిస్తుండగా పరశురాముని శిష్యుడయిన ‘అకృత శ్రవణుడు’ అనే ముని అక్కడికి రావడం తటస్థించింది. ఆయనను ”పరశురాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నార”ని అడిగారు. ”మీరు ఆయనకు ఇష్టులైనవారు. మిమ్మల్ని చూడడానికి ఆయనే శిష్యులతో సహా ఇక్కడికి రేపు వస్తున్నారు” అని అకృత శ్రవణుడు చెప్పాడు.

గృహస్థాశ్రమం వదిలి రాజులు కూడా ముని వృత్తి అవలంబించడమూ, వారి పర్యటనలూ, వారి మధ్య ఉండే సమాచార వ్యవస్థ వంటి అంశాలను ఇక్కడ గమనించాలి. ఏదైనా సమస్య వచ్చినపుడు, దాన్ని పరిష్కరించగలవారెవరా అని అన్వేషించడమూ అప్పటి సామాజిక జీవనశైలిని తెలుపుతున్నాయి. హోత్రవాహనుడు తన పెద్ద కూతురికీ ఆమె భర్తకూ తన రాజ్యాన్ని ఇచ్చేసి తాను వానప్రస్థానికి వెళ్ళిపోయాడనడంలో స్త్రీలకు పుత్రులు లేని సందర్భాలలో పుత్రికలకూ రాజ్యాధికారం ఉండేదని తెలుస్తోంది.

హోత్రవాహనుని మనుమరాలిగా పరశురాముడు అంబన ఆదరించాడు. ”బాధపడకు, నా దగ్గరకు వచ్చాక నీ సమస్య తీరినట్లే” అంటూ ఆమె చెప్పిందంతా విన్నాడు. ”నా పరాభవం తీర్చి నన్ను రక్షించండి” అని అంబ అడిగింది. ”నీ పరాభవం రెండు విధాలు.

సాళ్వుని సాధించాలా, భీష్ముని సాధించాలా, నీ మనస్సుకు ఏమనిపిస్తున్నదో చెప్పు” అన్నాడు పరశురాముడు.

”సాళ్వుడు నన్ను గ్రహించడనేది స్పష్టమైంది. నాకు భీష్మునిమీద కోపం. అతన్ని ఎలాగైనా చంపాలనే లక్ష్యంతోనే తపస్సు చేద్దామని ఇక్కడికి వచ్చాను. నాకు మీరే శరణ్యం” అంది అంబ.

”భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు. కాదంటే నా బాణాలతో అతన్ని నేనే కొడతాను. నీవు తపస్సు చేయడం ఎందుకు?” అంటూ పరశురాముడు అంబను వెంట తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ సరస్వతీ నది ఒడ్డున శిష్యులతో సహా విడిది చేసి తన రాకను భీష్ముడికి తెలియపరచాడు.

భీష్ముడు గురువుగారిని భక్తిశ్రద్ధలతో సమీపించి పూజించాడు. ”ఈమె కాశీరాజు కూతురు. అప్పుడు ఆమెను బలవంతంగా ఎందుకు తెచ్చావు? ఇప్పుడీమె దైన్యస్థితిలో ఉంది. ఆమెను నీ తమ్మునికిచ్చి వివాహం చేయవలసింది” అని పరశురాముడు భీష్ముని ఆదేశించాడు. భీష్ముడు జరిగిందంతా మళ్ళీ చెప్పాడు. ”ఈమెను సాళ్వుని దగ్గరకు పంపాను. వేరేవారిని వరించి

ఉన్న స్త్రీని నా తమ్ముడికిచ్చి పెళ్ళి చేయడం ధర్మమా? అది అకృత్యం…” అంటూ వాదించాడు. వాదన పెరిగి యుద్ధం వరకూ వచ్చింది.

భీష్మడు ధర్మపరాయణుడు. స్వభావరీత్యా సున్నితమైన మనస్సు కలవాడు. అయినా సమస్య గురువుతో యుద్ధం వరకూ వచ్చింది. నేనూ ఒక్కడినే యుద్ధం చేస్తాను, నా సైన్యాన్ని తీసుకురాను అంటూ భీష్ముడు నగరానికి వెళ్ళి సత్యవతికి విషయం చెప్పి ఆమె అనుమతితో కురుక్షేత్రానికి వచ్చాడు. దారిలో గంగానది స్త్రీ రూపంలో అతనికి కనపడింది. విషయం తెలుసుకుని భీష్ముని కోప్పడింది. (అంబను తెచ్చినందుకో, గురువుమీద యుద్ధానికి వెళ్తున్నందుకో – తల్లులు మాతృ వాత్సల్యంతో పిల్లలను కోప్పడుతూ ఉండడం లోకంలో చూస్తున్నదే). ఆమె పరశురాముని దగ్గరకు వెళ్ళి ‘నా కొడుకు నిరపరాధి, అతని మీద అలుక నీకు తగదు’ అంటూ నచ్చచెప్పబోయింది. అతని ధోరణిలో మార్పు రాకపోవడంవల్ల తిరిగి కొడుకు వద్దకు వచ్చింది. ఇతడూ మెత్తబడకపోవడంతో వెళ్ళిపోయింది.

భీష్ముడు రధంమీద వెళ్ళాడు. ”నేను రధం మీదనూ, నీవు నేలమీదనూ ఉండి యుద్ధం చేయడం బాగుండదు” అంటూ పరశురాముడు దివ్యమైన రథమూ, ఆయుధాలూ తెప్పించుకున్నాడు. శిష్యుడైన అకృత శ్రవణుడు సారధిగా ఉన్నాడు. భీష్మునికీ, పరశురామునికీ 22 రోజులు యుద్ధం జరిగింది.

భీష్మునికి వసువులు మోహనాస్త్రం ఇచ్చారు. దాన్ని పరశురామునిపై ప్రయోగించబోయే సమయానికి నారదుడు వచ్చి అడ్డుపడ్డాడు. ఎనమండుగురు వసువులూ వచ్చి, ”గురువుతో యుద్ధం చేయడం మర్యాద కాదని” భీష్మునికి నచ్చచెప్పారు. అప్పుడు భీష్ముడు బ్రహ్మాస్త్రం అందుకున్నాడు. పరశురాముని తండ్రి జమదగ్ని, అతని పితృవర్గమూ వచ్చి పరశురామునికి నచ్చచెప్పారు. ”భీష్ముని జయించడం ఇప్పుడు నీకు సాధ్యం కాదన్నా”రు. గంగాదేవితో సహా చాలామంది అక్కడికి వచ్చారు. ఇద్దరికీ రాయబారాలు నడిపారు. చివరకు ఇద్దరూ యుద్ధం ఆపారు. పరశురాముని అనుగ్రహం పొందాలంటూ భీష్మునికి మునులూ, పెద్దలూ చెప్పారు. ”నీ శిష్యుడిని కరుణించు” అని పరశురామునికి చెప్పారు.

”నన్ను భీష్ముడు గెలిచాడు. నేనిక చేయగలిగిందేమీ లేదు. నీకు తోచినట్టు చేసుకో” అని పరశురాముడు అంబను పంపేశాడు. భీష్ముడు ఇదంతా సత్యవతికి చెప్పాడు. ఆమె అంబ గురించి కనుక్కుంటూనే ఉంది. ”దైవలీల ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనమేమీ చేయలేము. దీని గురించి ఆలోచించవద్దు” అని భీష్ముడికి నారదుడు, వ్యాసుడు చెప్పారు.

అంబ యమునా తీరంలోనూ, ఇతర ఆశ్రమాలలోనూ, సిద్ధాశ్రమంలోనూ కఠోరమైన తపస్సు చేసింది. ఎందుకిలా చేస్తున్నావని గంగానది అడిగితే, ”భీష్ముని చేత అవమానం పొందాను. మరో జన్మలోనైనా అతన్ని చంపాలి. అందుకే ఇలా చేస్తున్నాను” అందట. ”ఈ తపస్సుతో నీవు ఈ శరీరం విడిచి నదివి కాగలవు, అంతకన్నా ఏమీ చేయలేవు” అన్నది గంగ. గంగకు భీష్మునిపై పుత్రప్రేమ. అందుకని అంబను నిరుత్సాహపరిచింది. అప్పుడు అంబ ఇంకా తీవ్రంగా తపస్సు చేసి సగం పుణ్యంతో ‘అంబ’ అనే నది అయింది. మిగతా పుణ్యఫలంతో తన రూపం చెడకుండా రక్షించుకుంటూ తపస్సును కొనసాగించింది. ఆ తీవ్రతకు రుద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. భీష్ముని చంపే వరం ఇవ్వవలసిందిగా అంబ అడిగింది. ”సరే” అన్నాడు రుద్రుడు. అది ఎలా సంభవిస్తుందని అడిగింది అంబ. ”నీవు ఈ శరీరం వదిలి ద్రుపద రాజుకు కూతురిగా పుట్టి తర్వాత కొడుకువై శిఖండి పేరుతో ఆయుధ విద్యలలో పాండిత్యం సంపాదించి యుద్ధంలో భీష్ముడిని చంపగలుగుతావు” అని రుద్రుడు చెప్పాడు. ఆ వెంటనే ”భీష్ముని చంపాలి” అనుకుంటూ అంబ క్రోధంతో చితిలో దూకి ఆ శరీరాన్ని వదిలిపెట్టింది. తనను నిస్సహాయురాలిగా చేసిన సమాజంపై కసిని భీష్మునిపై కేంద్రీకరించింది. ఈ సంగతులన్నీ భీష్మునికి తెలుస్తూనే ఉన్నాయి.

అంబ ద్రుపదునికి కూతురిగా పుట్టడమూ గొప్ప కల్పనే. ద్రుపదుని భార్య (కోకిలాదేవి)కు పిల్లలు కావాలని కోరిక. ద్రుపదునికి భీష్మునిపై కోపం. ఈ రెండు ప్రయోజనాల కోరి ద్రుపదుడు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే భీష్ముని వధించే కొడుకు కావాలన్నాడు. ముందు కూతురై పుట్టి తర్వాత కొడుకుతనం పొంది యుద్ధంలో భీష్ముని చంపుతుందని రుద్రుడు చెప్పి వెళ్ళిపోయాడు.

(భారత కథలో మొదట రుద్రుడే యజ్ఞాలకు అధి దైవతంగా ఉండేవాడు. అతడే తర్వాత శివుడయ్యాడు.)

అంబ చైతన్యంతో ద్రుపదునికి కూతురిగా పుట్టింది. అయితే ఆ సంగతి దాచి కొడుకు పుట్టాడని వారు అందరికీ చెప్పారు. ఆమెను కొడుకులానే పెంచాడు. ద్రోణుని దగ్గరే ఆయుధ విద్య నేర్పించారు. (ఈ విషయం అసంగతంగానే కనిపిస్తుంది. బహుశ ఇవి కౌరవ పాండవుల జననానికి ముందు జరిగిన సంగతులేమో?) జరిగేది జరగక మానదు అనుకుంటూ వారు కూతురికి యుక్తవయసు వచ్చాక పురుషునిగానే ఆమెకు దశార్ణ దేశపు రాకుమారునితో వివాహం చేసి కోడలిని తెచ్చుకున్నారు. ఆమె భర్త వాలకాన్ని తన దాసికి చెప్పింది. ఆ దాసి దశార్ణ రాజుకు చెప్పింది. ఆ రాజు ద్రుపదుని దగ్గరికి తన దూతను పంపాడు. ద్రుపదుడు ఆ దూతతో నేర్పుగా మాట్లాడి భయపెట్టి పంపేశాడు.

ఈ వ్యవహారంతో దశార్ణ రాజుకు సందేహమూ, కోపమూ కలిగాయి. కోపంతో ద్రుపదుని నగరాన్ని చుట్టుముట్టాడు. ద్రుపదుడు మొహం చెల్లక అంతఃపురంలోనే ఉండిపోయాడు. సేనా నాయకులు యుద్ధానికి సిద్ధపడ్డారు. తెల్లవారితే యుద్ధం మొదలవుతుందనగా ఆ రాత్రి ద్రుపదుని కూతురు (శిఖండి) చనిపోవాలని నగరం పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళింది. ఈ కథ అత్యద్భుతమైన మలుపులతో, మెళకువలతో పాఠకులలో ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగిపోయింది.

శిఖండి వెళ్ళిన అడవి ప్రదేశం స్థూల కర్ణుడు అనే యక్షునిదట. పూర్వం చెట్లూ, సరోవరాలూ, అడవులూ యక్షుల ఆస్తిగా

ఉన్నట్లున్నాయి. శిఖండి అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుండగా యక్షుడు చూశాడు. ”నీకు వచ్చిన కష్టమేమిటి? నీ మనోవ్యధ నేను తీరుస్తాను” అని ఆమెను ఓదార్చాడు. ”పురుషత్వం ధరించక నా చింత మానదు” అని ఆ పరమశివుడు తప్ప ఇతరులు తీర్చలేరు” అన్నది శిఖండి. యక్షునికి కరుణ కలిగింది. ”ఒక పని చేద్దాం. నా పురుషత్వం నీవు కొన్నాళ్ళపాటు గ్రహించి ఆ దశార్ణ రాజుకు కనబడు. అంతవరకు నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను” అన్నాడు.

శిఖండి పురుషుడై సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. విచారంతో ఉన్న తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పాడు. అప్పటికి తెల్లవారింది. ద్రుపదుడు దశార్ణ రాజును పిలిపించి కొడుకును చూపించి మర్యాదలు చేసి కట్నాలు ఇచ్చి విందు చేశాడు. ఆ సమస్య అక్కడ తీరింది.

అయితే స్త్రీ రూపంలో ఉన్న యక్షునికి సమస్య వచ్చి పడింది. అతని మిత్రుడైన ఒక కిన్నెర రాజు అప్పుడే అటు వచ్చాడు. ”మనం వచ్చామని తెలిసి కూడా స్థూలకర్ణుడు బయటకు రాడేమిటి? అంత గర్వమా” అంటూ తనవారిని పంపాడు. సిగ్గుతో రావడం లేదన్నారు వారు. ”అయినా పిలవండి, రమ్మనండి” అంటూ స్త్రీ రూపంలో ఉన్న అతన్ని చూసి ”ఇక ఇలానే ఉండు” అన్నాడట.

ఈ సంగతంతా కుబేరునికి తెలిసింది. ఆ యక్షుని మీద జాలిపడి, ”శిఖండి ఆయువు ఉన్నంతకాలం ఇతనికి ఈ స్త్రీ రూపం

ఉంటుంది. ఆ తర్వాత తన నిజరూపం పొందుతాడు” అంటూ అనుగ్రహించాడు.

చేసుకున్న ఒప్పందం ప్రకారం శిఖండి తన స్త్రీత్వం తాను తీసేసుకోవడానికి స్థూలకర్ణుని దగ్గరకు వచ్చాడు. స్థూల కర్ణుడు చెప్పినదంతా విని తనకు అచ్చంగా మగతనం స్థిరపడినందుకు సంతోషించాడు. అతని తల్లిదండ్రులు, భార్య సంతోషపడ్డారు. శిఖండి ఇంకా దీక్షగా అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. (ద్రోణాచార్యుని దగ్గరే శిష్యభావంతో ఉన్నాడని భారతం చెబుతోంది. ప్రత్యక్ష శిష్యునిగా లేడేమో!)

ఈ కథంతా నారుదుడు, వ్యాసుడు చెప్పారని భీష్ముడు కౌరవులతో చెప్పాడు. అదీ సరిగ్గా కౌరవ పాండవులకు యుద్ధం జరగబోయే ముందు…

అప్పటికే భీష్మునికి అంగనలను, (స్త్రీలతో) అంగనా పూర్వులను, అంగనా కారులను, అంగనాభిధానులను వధించకూడదనే వ్రతం (నియమం) ఉన్నదట. స్త్రీలను, స్త్రీలను ముందు పెట్టుకున్న వారిని, స్త్రీ రూపులనూ, స్త్రీ పేరుగల వారిని కూడా ఆయన యుద్ధంలో ఎదుర్కోడు. ఇది అభినందించదగిన నిర్ణయం.

మహాభారతం ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడు తన పక్షం వారి బలాబలాలు లెక్కలు వేస్తున్న సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. భీష్ముడు తాను ఎవరినైనా చంపుతాను కానీ శిఖండిని చంపనని తన నియమం చెప్పాడు. ఆ నియమాన్ని భంగపరిచి శిఖండిని చంపడం కానీ, నొప్పించడం కానీ చేసి అపకీర్తి పొందలేనన్నాడు. అది అతని నిజాయితీ. తనను నొప్పించే అవకాశం శిఖండికి ఇవ్వటమే ఇందులోని అంతరార్థం. ఆ విధంగా భీష్ముడు అంబ ప్రతిజ్ఞను గౌరవించాడు. ఆమెపట్ల తాను వ్యవహరించిన తీరు, అది ఉద్దేశ్య పూర్వకం కాకపోయినా ఆమె జీవితాన్ని కకావికలం చేయటాన్ని తెలుసుకుని ఆయన బాధపడ్డాడనే చెప్పాలి.

భీష్ముని నియమం దుర్యోధనునికి విచారం కలిగించినా అతని మగతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పాండవుల సైన్యాన్ని మట్టుపెట్టడానికి నీకు ఎన్ని రోజులు పడుతుందని భీష్ముడిని అడిగాడు. అది ఇప్పటి ఓట్ల బేరీజు లాంటిదే. ఎవర్ని ఎక్కడ నిలబెడితే పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎక్కడెక్కడ ఎవర్ని నిలబెడితే పార్టీ గెలుస్తుంది… లాంటి లెక్కలు. ఒక నెలలోపల పాండవ సైన్యం నిశ్శేషం చేస్తానన్నాడు భీష్ముడు. అలాగే దుర్యోధనుడు తన కొలువులో మిగతావారిని కూడా అడిగాడు. అశ్వత్ధామ ”పది రోజుల్లో” అన్నాడట. కర్ణుడు ”ఏడు రోజుల్లో” అన్నాడట. ఇవన్నీ విని భీష్ముడు నవ్వుకున్నాడు. కర్ణునికి గల శాపం గురించీ, కవచ కుండలాలు కోల్పోవటం గురించీ ప్రస్తావించాడు. పాండవ వీరుల బలాబలాలు కూడా లెక్కలు వేశారు.

శిఖండి విషయం తిరిగి భీష్మ పర్వంలో ప్రస్తావనకు వచ్చింది. కౌరవ సేనకు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్న భీష్ముడు తొమ్మిది రోజులు పాండవ సైన్యాన్ని కకావికలం చేశాక పాండవులు అతన్ని తట్టుకోవడం అసాధ్యమని తెలుసుకుని ఆ రాత్రి రహస్యంగా అతని దగ్గరకు వెళ్ళారు. ”మాకు ఈ సామ్రాజ్యం ఎలా వస్తుందో చెప్పు” అన్నారు (భీష్మ. 3-295-302). ”నేను యుద్ధరంగంలో ఉండగా మీరు గెలవలేరు. నేను ఆయుధం దించితేనే అది సాధ్యం” అంటూ తాను ఎవరెవరి పట్ల ఉదాసీనత చూపుతాడో వరుసగా జాబితా చెప్పాడు. తన వ్రతం గురించి చెప్పాడు – ”పుట్టినప్పుడు లేక నడుమ దైవం ఇచ్చిన పురుషత్వం గల వానితోనూ నేను యుద్ధం చేయను” అని చెప్పాడు.

”ద్రుపదుని సంతానమైన శిఖండి అలాంటి వాడని మీకు తెలుసు కదా! పైగా అతడు మొదటి జన్మలో స్త్రీ కాబట్టి అతన్ని నేను ఎదుర్కోను. అర్జునుడు వానిని ముందు పెట్టుకుని యుద్ధానికి వస్తే నేను ఎదురు యుద్ధం చేయకుండా ఉంటాను. నన్ను నొప్పించి పడగొడితే మీకు కౌరవ సేనను జయించడం సాధ్యపడుతుంది” అని సహృదయంతో భీష్ముడు చెప్పాడు. భీష్మునికి ఈ జన్మ చాలించాలని ఉంది. తమను ఎత్తుకుని పెంచిన భీష్ముడిని ఇలా కపటంగా చంపడం పాండవులకు కష్టమనిపించింది. ఎవరి విషాదంలో వారున్నారు. జనన మరణాలు, వ్యామోహాలు, ఆశలు-నిరాశలు, మైత్రి-పగ… ఇలాంటి ఎన్నెన్నో అనుభూతులతోటి జీవితాలకు మహాభారతం అద్దం పట్టింది. అందులోనే స్త్రీల మానావమానాలు చర్చకు వచ్చాయి.

కౌరవ సేనాధ్యక్షునిగా భీష్ముని పదవనాటి యుద్ధం భీష్మ పర్వం తృతియాశ్వాసంలో ఉంది. పదవరోజు యుద్ధ రంగంలో పాండవ సేన అగ్రభాగంలో శిఖండి నిలిచాడు. అతని ప్రక్కన భీమార్జునులు, వెనక అభిమన్యుడు, ఉపపాండవులు… ఇలా సేన బయలుదేరింది. కౌరవసేన అగ్రభాగంలో భీష్ముడు ఉన్నాడు. యుద్ధం భీకరంగా జరిగింది. భీష్ముడు అతనివైపు చూడకుండానే ఇలా అన్నాడట. ”మగవానిగా మారిన స్త్రీపై నేను యుద్ధం చేయను. నీవు నా మీద ఎన్ని బాణాలు వేసినా నేను నవ్వుకుంటాను తప్ప నీ మీద నాకు కోపం కలుగదు”.

”ఎవ్వతనేని ధాతసృజియించె దగన్‌ మగవానిగాగ…

… కోపము మనంబున బుట్టదు సూ శిఖండినీ”

(భీష్మ.3-321)

మహాభారతంలో శిఖండికీ, భీష్ముడికీ జరిగిన యుద్ధం 91 పద్యాలలో వర్ణించారు. భీష్మునికి దుశ్శాసనుడు, అశ్వత్ధామ మొదలయినవారు సహాయంగా నిలవడం, అర్జునుడు శిఖండితో కలిసి బాణాలు వేయడం, భీష్ముడు ‘ఇవి అర్జునుడి బాణాలు, శిఖండివి కాదు’ అని వాటిని గుర్తిస్తూ ఉండడం… ఈ విధంగా యుద్ధం తీవ్రంగానే సాగింది. సాయంత్రానికి వంటినిండా బాణాలు గుచ్చుకుని భీష్ముడు కిందకు ఒరిగాడు. ఆయన శరీరం నేలకు తాకలేదనీ, బాణాల మీదనే నిలిచిందనీ వర్ణించారు. (భీష్మ.3-413)

మహాభారత కథ చెప్పేటప్పుడు ఏ మాత్రం అవకాశం దొరికినా ఆచారాలు, విశ్వాసాలు చొప్పిస్తుండడం పరిపాటి. భీష్ముడు దక్షిణాయన కాలంలో పడిపోయాడే అని దేవతలు విచారించారట. తన తండ్రి శంతనుడు, సత్యవతిని వివాహం చేసుకున్న సమయంలో తనకు అవధ్యత్వమూ, స్వచ్ఛంద మరణమూ అనే వరాలిచ్చిన సంగతి ఇక్కడ భీష్ముడు అందరికీ చెప్పాడు. దాంతో అందరూ సంతోషించారు. ఉత్తరాయణ కాలంలో చనిపోయిన వారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని ఒక నమ్మకం. సూర్య చలనాల గురించిన విజ్ఞానం తెలియని రోజులనాటి కథలు ఇవి.

గంగానది పంపగా కొందరు మునులు ఉత్తరాయణం వరకూ బ్రతికి ఉండాలని భీష్మునికి సూచించడానికి హంసల రూపంలో వచ్చారట. ఆయన బ్రతికే ఉండడం చూసి వెళ్ళిపోయారట.

అంబ విషయంలో భీష్ముడు పశ్చాత్తాప దృష్టితోనే ఉన్నాడనిపిస్తుంది. చేసిన పొరపాటును వెంటనే సవరించుకున్నాడు, కానీ సాళ్వుని నిరాకరణతో అది సాధ్యం కాలేదు. సాళ్వునిది పురుషాహంకారం. ఇష్టపడిన స్త్రీ అభిమానాన్ని గుర్తించి స్వీకరించలేని ఔద్ధత్యం, లోకభీతి ఆ పాత్రలో కనిపిస్తాయి. ప్రేమలో ఓటమి పొందిన స్త్రీలకు అంబ ప్రతీక. స్త్రీల ప్రేమలను తృణప్రాయంగా తోసేసిన పురుష సమాజం, అప్పటి సంప్రదాయాలు, ఇలా ఈ వృత్తాంతాన్ని ఎవరి కోణంలో వారు విశ్లేషించుకోవచ్చు.

అంబ చేసిన ప్రతిజ్ఞను గౌరవించి ఆమెకు పగ తీర్చుకున్న సంతృప్తిని మిగిల్చినవాడు భీష్ముడే. స్త్రీలతో యుద్ధం చేయనని నియమం పెట్టుకోవడం వీరుల లక్షణంగా ఒప్పుకోవచ్చు, కానీ స్త్రీగా ఉండి నడుమ పురుషత్వం పొందిన వారితో యుద్ధం చేయకూడదనే నియమం పెట్టుకున్నది భీష్ముడు ఒక్కడే. అంబ ప్రతిజ్ఞ నెరవేర్చడానికే ఆయన ఆ నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం సంగతి తనపై ఆశలు పెట్టుకున్న దుర్యోధనునికీ చెప్పాడు. శత్రుపక్షంగా ఉన్న పాండవులకూ చెప్పాడు. భీష్మునిలో గల మానవతా దృష్టి, ఇతరుల మనోభావాలను గమనించి గౌరవించే స్వభావం ఆయన మూర్తిమత్వాన్ని ఇనుమడింపచేశాయి.

అంబ భారతీయ యువతుల స్వాభిమానానికి ప్రతీక. ప్రేమించిన వాడు నిరాకరించినా అందులో హేతుదృష్టినీ, లోకరీతినీ గమనించి మన్నించిన ఆమె మనోదౌర్భల్యం, ప్రేమలోని బలహీనతే కావచ్చు, ఆ పాత్ర చిత్రణలో అద్భుతంగా ఆవిష్కరించబడింది. సమాజంలో స్త్రీల పట్ల, స్త్రీల సమస్యల పట్ల ఉన్న సానుభూతి, ఆదరణ ఒకానొక కాలపు సామాజిక చలనాన్ని పట్టి ఇస్తూ ఉంది. స్త్రీత్వం, పురుషత్వం ఇచ్చి పుచ్చుకోవటాలు, వృద్ధాప్యం, యౌవనం ఇచ్చి పుచ్చుకోవటాలు లాంటి పురాణ కథలలో చెప్పిన విషయాలు అనంతర కాలపు శాస్త్ర విజ్ఞానపు ఆవిష్కరణలతో సాధ్యమవటమూ ఉండటం చూశాక అప్పటి వారి భావశబలతకూ, క్రాంత దృష్టికీ ఆశ్చర్యపడకుండా ఉండలేము.

శిఖండి సంగతి మళ్ళీ సౌప్తిక పర్వంలో కనిపిస్తుంది. అప్పటికి కౌరవ ముఖ్యులంతా చనిపోయారు. అశ్వత్ధామ, కృపుడు

ఉన్నారు. వారు పాండవ సైన్యం కంటపడకుండా తిరుగుతుండగా ఒకచోట ఒక గుడ్లగూబ రాత్రి సమయంలో నిద్రపోతున్న కాకులను చంపడం అశ్వత్ధామ చూశాడు. తానూ అలాగే పాండవులను చంపాలనుకున్నాడు. పాండవ సైన్యం, పాండవులు విజయోత్సాహంతో ఉండగా ఒక రాత్రి పాండవుల కొడుకులు ఐదుగురూ, దుష్టద్యుమ్నుడు, శిఖండి ఒక శిబిరంలో నిద్రిస్తున్నారు. అశ్వత్ధామ వారి శిబిరంలోకి వెళ్ళి నిద్రావశులై ఉన్నవారిని చంపాడు. దుష్యద్యుమ్నుని చంపుతుండగా ఉప పాండవులలోని పెద్దవాడు లేచి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అతనిని చంపేటప్పటికి రెండోవాడు లేచి ఎదుర్కొన్నాడు. ఈ విధంగా వారంతా పోరాడుతూనే మరణించారు. అప్పటికి శిఖండి లేచి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. (సౌప్తిక పర్వం. 1-191) తర్వాత పరివారమూ వచ్చి అశ్వత్థామతో పోరాడారు. అశ్వత్థామ శిఖండి శిరస్సునూ, దేహాన్నీ కత్తితో పొడిచి చంపాడు.

ఇదంతా రాత్రివేళ జరగడం వల్ల వచ్చినవాడు అశ్వత్థామ అని పాండవ పరివారం చాలాసేపటికి కానీ తెలుసుకోలేక పోయారట. దీనికీ ఒక చిన్న కారణం చెప్పబడింది.

కురు పాండవ యుద్ధం మొదలైన నాటినుంచీ రాత్రిళ్ళు యుద్ధభూమిలో ఒక స్త్రీ నీలపు శరీరం, ఎరుపెక్కిన కళ్ళు, ఎర్రని దుస్తులు, ఎర్రటి అలంకారాలతో కనిపిస్తూ యుద్ధంలో మరణించిన మనుషులు, గుర్రాలు, ఏనుగుల శరీరమూ, తలలూ అశ్వత్థామ ముందు పెడుతున్నట్టూ, అతడు వాటిని చూస్తూ కొడుతూ సంరంభాతో కేకలు వేస్తున్నట్టూ అక్కడి సైనికులకు కలలు వచ్చేవట. ఆ కలలన్నీ గుర్తుతెచ్చుకుని ఆహా! ఇదీ ఆ కలల ఫలితం అని వారు విశ్లేషించుకున్నారు. ఆ విధంగా అశ్వత్థామను గుర్తుపట్టారట. కలల మీది నమ్మకాలను ఈ విధంగా సమర్ధించే సందర్భాలు పురాణాలలో కనిపిస్తాయి. ఇదీ ఒక రకంగా మూఢనమ్మకాలను ప్రచారం చేయటమే కాకుండా మానవులను కర్తవ్య మూఢత్వం వైపు, శూన్యతవైపు నెడుతున్నది. వారిని క్రియాశూన్యులుగా చేస్తున్నది. ”కానున్నది కాక మానదు” అనే తత్వం మనిషికి అలవాటు చేస్తున్నది. అటువంటి మౌఢ్యం వ్యాపించి ఉన్న సమాజంలో అంబ క్రియా పరత్వాన్నీ, పట్టుదలనూ మెచ్చుకోకుండా, అమె పట్ల గురుభావం పెంచుకోకుండా ఉండలేము.

ఎలాంటి పరిస్థితులవల్ల జరిగినా తనకు జరిగిన పరాభవాన్ని అంబ తీర్చుకున్నది. స్త్రీల పట్ల జరిగే అఘాయిత్యాలను అప్పటి సమాజమూ నిర్లక్ష్యం చేయలేదు. మునులూ, వీరులూ ఆమె పట్ల సానుభూతి చూపారు. ఆమె ఎవరినైతే గెలవాలనుకున్నదో ఆ భీష్ముడు (భీకరమైన ప్రతిజ్ఞ చేసినవాడిగా పేరు పొందినవాడు) కూడా ఆమె దండనను ధర్మబద్ధంగా స్వీకరించాడు. ఈనాడు అలాంటి పరిస్థితి ఉన్నదా?

ఆధునిక యుగంలో పురుషులు ప్రేమించిన స్త్రీని ఏవేవో కారణాలతో నిరాకరించటం చూస్తున్నాం. పెళ్ళి చేసుకుంటానని మభ్యపెట్టి లోబరచుకుని నిరాకరించటం చూస్తున్నాం. సహజీవనం చేసి పిల్లలు కలిగాక కూడా ఆమెను భార్యగా చెప్పుకోకపోవటం చూస్తున్నాం. కొన్నాళ్ళ కాపురం తర్వాత భర్త ఇంటిలోనికి వెళ్ళటానికి భార్య తన భర్త ఇంటిముందు ధర్నా చెయ్యవలసి రావటాన్నీ చూస్తున్నాం. పురుషాహంకారం పూర్వం నుంచీ స్త్రీలను దైన్య స్థితిలోకి నెడుతూనే ఉంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.