మహిళల సమస్యలు మహిళలే వినిపించాలా? వారి హక్కుల కోసం వారే పోరాడాలా? వారి పోరాటాలకు వారే నాయకత్వం వహించాలా? వారి అంతరంగాన్ని వారే అక్షరీకరించుకోవాలా? అంటే, ఎవరికైనా వినిపించవచ్చు, ఎవరైనా నాయకత్వం వహించవచ్చు, ఎవరైనా అక్షరీకరించవచ్చు. కానీ, అంగీకరించాల్సిన వాస్తవం ఏంటంటే… మహిళల సమస్యలు మహిళలే వినిపిస్తే, వారి పోరాటాలకు వారే నాయకత్వం వహిస్తే, వారి అక్షరాల అంతరంగాలను వారే ప్రచురించుకుంటే, ఎలాంటి సానుకూల ఫలితాలుంటాయో, బాధితులకు ఎంతటి భరోసానిస్తుందో, ‘భూమిక’ పాతికేళ్ళ ప్రయాణం మరోసారి నిరూపించింది.
మహిళల సమస్యల్ని మహిళలే వినిపించాలనుకుంటున్నప్పుడు నిజాయితీ, నిబద్ధత, పోరాట పటిమ, ఆటుపోట్లకు ఎదురీదే శక్తి, సంఘర్షణతో పాటు ఒక దీర్ఘకాలిక లక్ష్యం కూడా ఉంటుంది. అలాంటి లక్ష్యమే ‘భూమిక’కీ ఉంది. అందుకే, అనేకానేక ప్రతికూలతలను, ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా నిబ్బరంగా నిలబడగలిగింది.
క్రమం తప్పకుండా, పత్రికలకు నాలుగు అక్షరాలు రాసివ్వడమే కష్టమైపోతున్న తరుణంలో, అప్రతహతంగా పాతికేళ్ళుగా పత్రికను నిర్వహించడం అంత తేలికైన విషయమేమీ కాదు. మహిళలే ఎక్కువగా ఈ పత్రికలో భాగస్వాములవుతూ, వారి కలాలకు పదును పెడుతూ, పత్రికకు వెన్నుదన్నుగా నిలవడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం.
మహిళలు ఇతరులతో సమానంగా పోటీపడుతున్న అన్ని రంగాల్లోని విషయాలపై చర్చించడం, ఆలోచనల్లో ఏకత్వం కలిగిన అనేక సమూహాలను ఈ పత్రికలో ఏదో ఒక రూపంలో భాగస్వాములను చేయడం సంతోషం కలిగించే అంశం.
పత్రికను తీసుకురావడంతో పాటు, ప్రచారం కల్పించడంలోనూ, పాఠకులకు పత్రికను చేరువ చేయడంలోనూ ‘భూమిక’ విజయం సాధించింది. పాతికేళ్ళ ఈ ప్రయాణంలో ఎన్నో ఆర్థిక సమస్యలుంటాయి, సాంకేతిక సమస్యలు కూడా ఎదురవుతాయి. పత్రిక
ఉద్దేశ్యానికి, లక్ష్యానికి కొంచెం అటుఇటుగా ఉండే ఆర్టికల్స్‌కి కత్తెర వేసేటపుడు కుదించి ప్రచురించేటపుడు అనేకమందితో సంఘర్షణ పడాల్సి ఉంటుంది, చర్చోపచర్చలు జరుగుతాయి. ఊహించని మానవ మనస్తత్వాలను దగ్గరగా చూసే అవకాశముంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ పని కత్తిమీద సామే.
తెలుగు పత్రికారంగంలో, సాహిత్య వనంలో -మహిళల కృషిలో, ”భూమిక”ది చెరగని సంతకం.
పాతికేళ్ళ మైలు రాళ్ళను దాటుకుంటూ, ఇంకా అదే ఉత్సాహంతో, అదే ఊపుతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్న ‘భూమిక’ బృందానికి, సంపాదక వర్గానికి, పాఠకులందరికీ పేరుపేరునా అభినందనలు.
– పద్మ వంగపల్లి, హైదరాబాద్