భూమికతో అనుబంధం అంటే సత్యవతిగారితో అనుబంధమనే చెప్పాలి. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడే (2007) భూమిక వాలంటీర్‌గా సమావేశాలకు వెళ్తుండేదాన్ని. నేను పనిచేస్తున్న గిరిజన ప్రాంత పరిస్థితులు, అక్కడి సమస్యలు చర్చించే అవకాశం కలిగేది. సత్యవతిగారి నుంచి చాలా నేర్చుకోవాలి, నా పనిని మెరుగుపర్చుకోవాలి అనిపించేది.
అనంతగిరి అడవులలో ఆమెని వెతుక్కుంటూ రాత్రిపూట వెళ్ళడం మర్చిపోలేని అనుభూతి. అక్కడ్నుంచీ మా బంధం బలపడి కొండవీటి సత్యవతి గారు నన్ను తన కూతురుగా అనుకోవడం, నేను తనని అమ్మగా అభిమానించడం… ఈ దగ్గరితనం తల్చుకుంటుంటే ఆనందమే కాదు ఆశ్చర్యంగా కూడా ఉంది.
భూమిక పత్రిక గురించి సాహిత్యపరంగా చెప్పాలంటే నాకు అంతగా అర్హత లేదు. కానీ నాలాంటి సామాజిక కార్యకర్తలకి అదొక పెద్ద ధైర్యం. చాలా సమస్యల పరిష్కారాలకు తగిన సమాచారాన్ని ఇస్తూ ఎంతోమందిని ముందుకు నడిపిస్తుంది. నేను భూమికలో ప్రచురించిన సమాచారం ఎంతోమందికి అవసరమని గుర్తించి పత్రికను గ్రామస్థాయిలో అందరికీ పంచడం జరిగింది. ఇప్పటికీ పనిలో కొంచెం నిరాశ ఆవహిస్తే భూమిక పత్రిక చదివితే చాలు, వెంటనే రీఛార్జి అయిపోతాను. థాంక్యూ అమ్మా! లవ్ యూ..! 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భూమికకు, అమ్మకు అభినందనలు.
– మాలిని. ఎమ్, విశాఖపట్నం