భూమికలో చేరిన తరువాత నాలో వచ్చిన మార్పు చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుండి బాలికల పాఠశాల, కాలేజి, ఆఖరికి ఉమెన్స్ యూనివర్శిటీలలో చదవటం, తల్లిదండ్రులు ఆడపిల్ల అని బయటికి ఎక్కువగా పంపకపోవడం వల్ల నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడేదాన్ని, నా భర్తమీదే ఆధారపడేదాన్ని. భూమికలో చేరిన తర్వాత నా భయం, అలాగే నా ఆలోచన బాగా మారాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, సందర్భానుసారంగా ఎలా మాట్లాడాలి అనేది బాగా వంటపట్టింది. నా భర్త, నా అన్న, తమ్ముడు అందరూ నీకు స్త్రీ వాదం బాగా వంటపట్టింది, ఇంతకుముందు అసలు మాట్లాడేదానివి కాదు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు, ఇంక మీరు మీ దగ్గరకు వచ్చిన స్త్రీలలో బాగా చైతన్యం తెస్తున్నారని అనిపిస్తోంది అని అనడం చాలా బాగా అనిపించింది.
భూమిక మ్యాగజైన్‌లో వచ్చే శీర్షిక చదివేటప్పుడు అది మన కళ్ళముందు, మన కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నట్లు భావన కలుగుతుంది. కొన్ని చదివేటప్పుడు తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ప్రతి నెలా భూమిక పత్రిక ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చదువుతానా అని ఎదురు చూస్తూ ఉంటాను.
-మీ జబీనా, హైదరాబాద