నాకెప్పుడూ అనిపిస్తుంది… పత్రికలు లేదా వార్తా వాహినులు ఏదైనా రంగంలో లేదా వ్యవస్థ కోసం ఒక నిర్దేశిత లక్ష్యం కోసం పనిచేస్తాయా లేక కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తాయా అని. డబ్బు లేకుండా బతికేదెలా అని అనుకోవచ్చు, కానీ కొన్ని వృత్తులు దానికి అతీతమైనవని నా అభిప్రాయం. వాటిలో ఒకటి సమాజ గమనాన్ని ప్రభావితం చేయగల పాత్రికేయం.
భూమిక నా సందేహానికి సమాధానం. నాకు పాత్రికేయంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
మనసులని రంజింపచేయడానికే కాదు కలం, మనుషులకు తమ తోటి అసహాయ అణగారిన వారిపై ఉన్న ప్రాథమిక బాధ్యతలను నెరవేర్చడంలో ఉన్న ఆనందంవైపు ఉత్తేజపరిచి నడిపించు కలం నిజమైన కలం.
తాను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి మార్గాన్ని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని తపించే సత్యవతిగారు, తాను సమాజానికి చేర్చవలసిన సందేశాన్ని అందిస్తూ ఆపన్నులకు దిక్సూచిగా ఉండే సాధనంగా పత్రికను మాధ్యమంగా, అదీ పాతికేళ్ళ క్రితం, ఎన్నుకోవడం అనేది ఆమె దార్శనికతకు అద్దం.
మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ వాద పత్రికను ఎంతో నిబద్ధతతో నడిపించడంలో ఉండే ఆటుపోట్లను, కేవలం సత్యవతి గారు వారి బృందం కాబట్టి, వాటికి ఎదురొడ్డి ఈ ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. వారికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తోడ్పాటును అందించేవారు అందరూ ఎంతో అభినందనీయులు.
స్త్రీ వాద సాహిత్యంలో, స్త్రీ వాద పోరాటాలలో, స్త్రీ అభ్యున్నతిలో ప్రధాన ‘భూమిక’ పోషిస్తున్న సత్యవతిగారి మానస పుత్రిక మరిన్ని సార్థక పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆ ప్రయాణంలో నేనూ ఒక అడుగు కలపాలని ఆశిస్తూ…
– శిల్పవల్లి కోగంటి, విజయవాడ