25 సంవత్సరముల నిండు జవ్వని మా భూమిక. ఇలా నిండుజవ్వనిగా తీర్చిదిద్దిన సత్యవతిగారిని సభ్యుల్ని అభినందించవలసిన శుభ సమయం 25 సం. పత్రిక క్రమం తప్పకుండా రావడం అందునా వ్యాపార ప్రకటనలు లేకుండా. సిద్ధాంత నిబద్ధతతో కొత్త రచయితల్ని ప్రోత్సహిస్తూ, గ్రామీణ మహిళల జీవన నిజనిర్దారణలతో అనువాదాల్ని అందిస్తూ స్ఫూర్తి దాయకంగా వస్తున్న స్త్రీవాద పత్రిక భూమికకి జేజేలు చెప్పాల్సిందే. చాలా పత్రికలు మఘలో పుట్టి పుబ్బలో పోవడం మనం చూస్తున్నాం. 25 సం.లు నిరాఘాటంగా రావడమే గాక, ఐ.ఎస్.బి.ఎన్. కూడా రావడం సత్యవతిగారి మహిళాభివృద్ధి, అధ్యయనాల నిబద్ధతకి నిదర్శనం. మహిళలకోసం ప్రభుత్వాలకే ఆలోచన రాక పూర్వమే భూమిక హెల్ప్‌లైన్ పెట్టడం ముదావహం. చాలా మంది ఇలాంటి సేవలు మొదలెడతారు కానీ దానిని నిరంతరం అందించడం విశేషం.
ఎందరో మహిళలకు మానసిక సాంత్వనని అందిస్తూ చట్టాలు, కోర్టులు చేయలేని పని భూమిక నిర్వహిస్తుందనడం అతిశయోక్తికాదు. అలాగే స్త్రీలని సమూహశక్తిగా మార్చడానికి యాత్రలు నిర్వహించడం కూడా చాలా చాలా మంచి విషయం. ఇలా సామూహికశక్తిగా ఒక వాకపల్లి మహిళలకు గాని నిర్భయలకిగానీ ఉద్యమాలకిగానీ అండ దండలుగా ఉంటూ మాలాంటి వాళ్ళందరికీ సృజనాత్మక రీతుల్లో ఆవిశేషాలన్నీ తెలపడం మరింత విశేషం, స్ఫూర్తిదాయకం. స్త్రీల సాధికారత దిశగా నడిపించడం కోసం అవగాహన ప్రధానం. దానికి గానూ చట్టాలపై, ఆరోగ్యంపై అనేక ప్రత్యేక సంచికలు తేవడం కూడా భూమికి ప్రత్యేకమైన విశేషం. అంతేకాదు. పరిశోధకులకు కూడా భూమిక ఎంతో ఉపయోగపడింది.
1996లో నేను స్త్రీవాద కధలు – స్త్రీల జీవిత చరిత్ర అనే అంశాలపై పరిశోధన చేసినప్పుడు మొదట ప్రొఫెసర్ అత్తలూరి నరసింహారావుగారు భూమికని పరిచయం చేసారు. తర్వాత విశాలాంధ్రలో కొనుక్కొని చదివేవాళ్ళం. నా సిద్ధాంత గ్రంధంలో చాలా సార్లు భూమిక రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. నేనేకాదు. చాలా మంది పరిశోధకులు భూమికని ఉపయోగించుకున్నారని సగర్వంగా చెప్పగలం. తర్వాత జీవిత చందా కట్టడం జరిగింది. చాలా పత్రికలకి జీవిత సభ్యత్వం తీసుకున్నా ఆ పత్రికకి చాలా సార్లు నాకు పత్రిక అందలేదనే ఫోను చెయ్యాల్సి వచ్చింది. కానీ భూమికకి మాత్రం ఆ అవసరం లేదు. ప్రతినెలా 6-7 తేదీలకల్లా మా చేతిలో ఉంటుంది.
స్త్రీవాద భావజాల ప్రచారం, కొత్త రచయితల్ని ప్రోత్సాహించడం భూమిక చేస్తున్న మరో మంచి ప్రయత్నం దాన్లో భాగంగా నాకు కూడా 2009లో కూరాకులమడి కథóకు ప్రథమ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి తీసుకొనేందుకు భూమిక నిర్వహించిన సమావేశానికి వెళ్ళడం. అక్కడ స్త్రీవాద రచయిత్రుల్ని కలవడం నిజంగా ఒక చక్కని అనుభూతేకాదు. ఒక మనోధైర్యం, ఒక ఆనందం కూడా.
భూమిక వారు నిర్వహించిన యాత్రలో భాగంగా విశాఖ-గిరిజన ప్రాంత పర్యటనకి వచ్చిన రచయిత్రులందరితో ఆంధ్రవిశ్వకళాపరిషత్ తెలుగు శాఖలో మిత్రసాహితి వారు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో మొదటిసారి అబ్బూరి ఛాయాదేవిగార్ని కలిసా. ఎంతో సంతోషమనిపించింది. నేను కుటుంబరావుగారి అమ్మాయిని శాంతసుందరిని అని పరిచయం చేసుకున్న శాంతసుందరిగారు, అబ్బ…. ఆక్షణం వారందర్ని చూసిన అనుభూతి నేటికీ మదిలో ఆనందాన్ని నింపుతుంది.
అలాగే 2010లో మా మిసెస్. ఎ.వి.ఎన్. కళాశాల 150 సంవత్సరాల సందర్భంగా నాకు లిటరరీ కమిటీ కన్వీనర్‌గా బాద్యత అప్పచెప్పారు. ఒక పుస్తకం ప్రచురించి మా కళాశాల పేరింటగత్తె అచ్చాయమ్మగారికి అంకితం చేయాలని నిర్ణయించుకొన్నాం. అంకితం వెంకట నరసింగ రావు గారి భార్య అచ్చయ్యమ్మ. ఆనాడు ఫలానావారి భార్యలుగానే గుర్తింపుకదా! నాటికి అదికూడా ఒక గొప్ప గుర్తింపే ఆమెకి. కానీ ఆమె పేరు కూడా ఎవరికీ తెలియని స్థితి. అందుకని అచ్చయ్యమ్మగారికి అంకితం ఇవ్వాలని, ఎక్కువ సమయం లేకున్నా. సత్యవతిగార్ని సంప్రదించాను. స్త్రీవాద కధల్ని ఎంపిక చేసి కొంత డబ్బు కూడా భూమిక పెట్టుకొని అంకితం-2010 పేరుతో ముద్రించగలిగాం. ఈ కధల ఎంపికలో సత్యవతిగారు కూడా సహాయం చేసారని తెలిసింది. అంకితం-2010 పుస్తకావిష్కరణ మూ మేనేజ్‌మెంట్ ఘనంగా నిర్వహించారు. దానికి అతిధిగా మన సత్యవతిగారు శ్రమకోర్చిరావడం 150 సంవత్సరాల మా కళాశాలకి భూమిక ఇచ్చిన సంతోష సందర్భంగా ఎప్పుడూ గుర్తుంటుంది.
భూమిక మరింతగా ప్రచురణలు పెంచాలని నిరాటంకంగా తన సామాజిక పాత్రని నిర్వహిస్తూ తనదైన ముద్రని చేయాలని మనసారా కోరుతూ..
-డా.అయ్యగారి సీతారత్నం, విశాఖపట్నం