సాంస్కృతిక ఎడారవుతున్న ‘మేడారం జాతర’ – జూపాక సుభద్ర

 

ఒకవైపు ఆదివాసులు ”మా అడివిని ధ్వంసం జేస్తున్నరు. మా సమ్మక్క, సారక్క జాతర నుంచి మమ్మల్ని యెల్లగొట్టే కుట్రలు జరుగుతున్నయి. గీ పట్నము, హిందుత్వ లెక్కలన్నీ మా మీద రుద్దొద్దు. మా జాతరను మా ఆదివాసీ నాగరికతగానే జరపుకుంటము. మా రీతి రివాజులే సాగాలి, బైటోల్లొచ్చి మా మేడారాన్ని బరిబాతల జెయ్యొద్దు. మా అడివి మాదే. మా సమ్కక్క- సారక్క జాతరని తెలంగాణా కుంభమేళా అని ప్రచారము కొత్తగ మొదలుబెడ్తున్నరు. మేడారం జాతర ‘కుంభమేళా’ కాదు. ‘కుంభమేళా’తో మా సమ్మక్క సారక్కల ఆదివాసీల జాతరను హిందుత్వంగా కల్తీ చెయ్యొద్దని ఆదివాసులు నినదిస్తున్నరు.

నిజమే వారి ఆవేదన న్యాయ మైందే. అడివిని అడివి నాగరికతను ఆగం జేసే యీ కలుషితాలు అక్రమమైనవే. యిప్పుడు జరుగుతున్న జాతర ఒకప్పటి సమ్మక్క సారక్క జాతర గాదు. చాలా హిందుత్వము చొరబడింది. ఆదివాసీ నమ్మకాలకు సంబంధము లేని హిందూ సంస్కృతి సమ్మక్క జాతరలోకి వచ్చింది. దాంతోపాటు విపరీతమైన వ్యాపార సంస్కృతి యీ పదేండ్లల్ల విపరీతంగా పెరిగిపోయింది. అట్లా పెరిగిపోయిన ఆ కకావికలత్వాన్ని చూస్తుంటే… మా నాగరికతలు మా కండ్ల ముందే ధ్వంసమవుతున్న బాధ మెలి బెడ్తుంటది.

మాది మేడారం జాతరకు 15 కి.మీ. దగ్గరగా వున్న గ్రామము. నా చిన్నప్పుడు (40 సం|| కింద) మేడారం జాతరని ‘మేడారం తీర్తం’ సమ్మక్క తీర్తమని గూడ అనేటోల్లు. 20 సం||ల కింద గూడ అడివి ఆకుకు ఆకు సందులేకుండా చిక్కటి పచ్చటి పచ్చదనంతో జంపన్నవాగు జలాలతో, అనేక అడివి జంతుజాలంతో, పక్షుల కూతలతో, అడివి పండ్లతో, ఆదివాసుల ఔన్నత్యమైన ప్రకృతితో కలకల్లాడుతుండేది. రెండేండ్లకోసారి వచ్చే పౌర్ణమిని ‘మేడారం పున్నమి’ అని తెలంగాణ జిల్లాల్లోని పల్లెలన్నిటికి తాళాలు బడేయి, సమ్మక్క సారక్క జాతరకు. కొంతమంది బండ్లు కట్టుకొని వూల్లు, కుటుంబాలు కుటుంబాలుగా బైల్దేరేవి. కొంతమంది కాలినడకన గూడా జాతరకు బోయేవాల్లు గుంపులు గుంపులాగా. చెట్లకిందనే బండ్లు యిడుసుకొనిన కలిసి వచ్చిన సుట్టాలతో పక్కాలతో అడివంతా అలరారుతుండేది. చెడిపోయిన కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలన్ని జాతరలో ఒక్కటయ్యేవి. నెగల్లేసుకొని పురుగు పుట్ర రాకుంట రాత్రంత బంధువులతో కడుపులోన్నయన్ని ఒకరికి ఒకరు కడిగి పోసుకునేవాల్లు.

శబరిమలై అయ్యప్ప కాడికి బోవాలంటే… అనేక నియమాలు, నిష్టలు నిషేధాలున్నయి. కాని సమ్మక్క సారక్క జాతరకు యివేమి వుండవు. అంటరాని కులాల్నించి ఆధిపత్య కులాలదాకా ఎవరైనా పోవచ్చు. అంటులేదు ముట్టులేదు, ఆడలేదు, మగలేదు, ముసలి ముతక, పిల్లలు, బీద గొప్ప భేదాల్లేవు. దివ్యాంగులు, హిజ్రాలు తేడాలేదు. సర్వమానవ సమూహాలు సమ్మక్క సారక్క జాతరకు పోవచ్చు. ఎలాంటి నిషేధాలు లేని పచ్చటి ఆకాశమంత విశాలమైన అడివి పర్యావరణం ఈ మేడారం జాతర విశిష్టత. యిది గొప్ప ప్రాపంచిక మానవ సామాజిక చైతన్యంగా సమ్మక్క జాతర కనిపిస్తుంటది. ఒక మానవ విశాల కూడలిగా సమ్మక్క సారక్క జాతరను చూడాలి. యిట్లాంటి విశాలతలు భవిష్యత్‌లో ఎలాంటి మార్పులకు లోనవుతాయో అని కూడా భయముంది.

ఎందుకంటే… ప్రతిసారీ జీవితంలో అనూహ్య మార్పులు అలివికాని, ఆదివాసీ సంస్కృతికి విరుద్ధమైన, ప్రకృతిని ధ్వంసం చేసే హిందుత్వ, వ్యాపార సంస్కృతి విరివిగా జొరబడ్తుంది.

కానీ జాతరంటే స్థానిక మానవ సమూహాలు, సామాజికాలు తమ తాత్విక ఆనందాలకు, అలజడి భయాలు పోగొట్టు కునే అవసరాలు తీర్చుకోనీకే కాదు ఆ సమూహాల మానవ సంబంధాల్ని పెంచుకునే కూర్పుగా కూడా జాతరను చూడాల్సిన అవసరముంది. దాన్ని వ్యాపారం, హిందుత్వంతో ధ్వంసం చేసే పరిణామాలు విరివిగా పెరుగుతున్నాయి. యిది పర్యావరణ వినాశం గూడ. భక్తులు, మొక్కులు కాని వాల్లు గూడ అడివిని, జంపన్న వాగుల్ని, ఎర్రటి పచ్చటి దుబ్బ, తీరొక్క చెట్లు, తీగలు, పండ్లు, పక్షుల కూతలు, ఆడ మగ శివసత్తుల పూనకాలు, వాల్లు పూనకంలో చెప్పే కమ్మటి తేటతెలుగు, అనేక మానవ సమూహాలు, సబ్బండ కులాలు, వారి కళలు, ఆదివాసీల ఆటపాటలు కలిసి గుమ్మెత్తించి అదొక పురా సంబురాల సందడిగా వుండేది. తెలంగాణ పల్లెలన్నీ యిప్పటికీ మరీ ముఖ్యంగా మేడారం చుట్టూత వున్న మా పల్లెలు మేడారంలో జరుగుతున్న విధ్వంసాల్ని కతలు కతలుగా చెప్పుకుంటుండ్రు. సెట్లు బొయినయి, సెల్‌ టవర్లొచ్చినయి, హోటల్లొచ్చినయి. వాగులు యెండిపోయి తానాల నల్లలొచ్చినయ్యి. సమ్మక్క సారక్క గద్దెను అంటుకోనియ్యని ఫెన్సింగు లొచ్చినయి, గుడిగంటలొచ్చినయి. జనం రద్ది యిసుకేసె రాలనట్లు పెరిగిపోయింది. సౌల తుల పేరుమీద సర్వనాశనం చేస్తుండ్రు. బంగారం (బెల్లం) బొయి లడ్డూ ప్రసాదాలొచ్చినయి. సమ్మక్క సారక్కలకు ఎర్రటి నేత సీరేలు పెట్టేది. యిప్పుడు పట్టు పీతాంబరాలొచ్చినయి. గుడారాలు, కుటీరాలు వచ్చినయి. రేపు గుడులు, గోపురాలు గట్టిస్తరేమోనని ఆందోళన పడ్తుండ్రు. ‘కుంభమేళాలేంది’ అని ఆశ్చర్యపోయిండ్రు.

గుడి సంస్కృతితో, అర్చకత్వ దీప నైవేద్యాల హిందూత్వాల ఆధిపత్యాలతో ఆదివాసిత్వానికి, అడవికి, సమ్మక్క సారక్కల ప్రకృతి అస్తిత్వాన్ని విధ్వంసం చేస్తున్న హిందూత్వాల్ని, వ్యాపార సంస్కృతిని ఎదుర్కోవాల్సిందే… నిలువరించాల్సిందే…

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.