వసంతం వచ్చేసింది. వేప పూతలు, మామిడి పిందెలు, కోయిల పాటలు, కొత్త చిగుళ్ళతో ఎర్రబారిన రావి చెట్లు, పచ్చగా మెరుస్తున్న లేత ఆకుల నడుమ తెల్లపూల గుత్తులతో కానుగ చెట్లు…
ఆ వెనకే ఎండలూ, వేడి గాలులూ, తగ్గుతున్న నీటి నిల్వలు, బావురు మంటున్న బోర్లు… బావులు… చెట్టూ, పుట్టా, ఆవూ, మేకా, పిట్టా, పురుగూ, బర్రే, గొర్రే… నీడ కోసం ఆరాటపడ్తున్నాయి. చల్లటి గాలి కోసం తపిస్తున్నాయి. పొడిబారిన మట్టి సుడిగాలులకి ఎండుటాకులతో పాటు తాడెత్తుకు లేచి విరిగి పడుతోంది. తేలిక బారిన ఎండుటాకులు మాత్రం చెల్లాచెదురై వలయంలా తిరుగుతూ పైపైకి పోతున్నాయి. అవి తమ జాతి జీవాలే అని భ్రమపడి ఎక్కడ్నుంచో రెండు, మూడు గెద్దలు, డేగలు రయ్యిన ఆ వలయంలోకొచ్చేసాయి. పొరపాటుని గ్రహించుకునేలోపే వేగంగా రావడంతో తడబడి ఏ చెట్టుపైనన్నా వాలదామన్నట్టు ఏటవాలుగా క్రిందికి రాసాగాయి. కానీ… కానీ చుట్టుపక్కల తమకి ఆశ్రయం కల్పించగల చెట్లేవి… నిట్ట నిలువుగా పెరిగిన టేకు చెట్లు… ఎండా కాలపు పెళ్ళిళ్ళకి, చలువ పందిళ్ళకి ఏ యేటికాయేడు కొమ్మలు కొట్టేస్తే మనిషి చెయ్యెత్తు మాత్రమే ఎదిగి వేలబడుతున్న కానుగ చెట్లు, గొర్రెల కాపర్ల కొంకి కర్రలకి కొమ్మలని కోల్పోయి బాహువులు కత్తిరించినట్టు నిలబడ్డ మొద్దుల్లాంటి వేప చెట్లు, చిన్న పిట్టలకి, పిచ్చుకలకి, కొంగలకి ఆశ్రయమిస్తున్న నల్ల తుమ్మ చెట్లు… రేగు పొదలు, గడ్డి దుబ్బలు… ఎగిరిపో… ఎల్లిపో అన్నట్లూగుతున్నాయి.
పదో తరగతి పరీక్షలైపోటంతో అమ్మతో పాటు ఆదివారం సరదాగా చెల్క కొచ్చిన శిరీష పత్తికట్టెలేరుతూ సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేసరికి తాటిచెట్టు కింద నీడకి చేరి, ప్లాస్టిక్ బాటిల్లో వేడెక్కిన నీళ్ళతో గొంతు తడుపుకుని చల్లటి గాలి కోసం చుట్టూ చూస్తూ నీరసంగా కూర్చుంది. స్కూల్లో వ్యాస రచన పోటీలో పర్యావరణ పరిరక్షణపై తను రాసినన వ్యాసం గుర్తొచ్చింది. నాలుగేళ్ళుగా జూన్ నుంచి నాలుగు నెల్లపాటు జాతరలా జరుగుతున్న హరితహారం గుర్తొచ్చింది. నాటిన మొక్కలు చెట్లయ్యేలోపే మిషన్ భగీరధ పైపుల కోసం తవ్వేస్తే భూ ఆధారం లేక వాలిపోయిన వరస చెట్లు గుర్తొచ్చాయి. ఇంటి చుట్టూ ఉండే కరివేపాకు, మునగ, నిమ్మ, దానిమ్మ చెట్లతో పాటు కూరగాయల మొక్కలన్నిటినీ పెరికేసి మట్టంటకుండా చుట్టూ గచ్చు చేసేసిన తమ ఇల్లు గుర్తొచ్చింది. కుండీల్లోనన్నా పూల మొక్కలు పెంచుదామంటే సిసి రోడ్లు, కాంక్రీటు బిల్డింగ్‌లు, సిమెంటు చప్టాల వేడి ఆవిర్లకి వాడిపోతున్న తన మొక్కలు గుర్తొచ్చాయి.
అంతలో గాలులు మొదలై, మెరుపులు ఉరుములతో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. చెల్కల్లో మేస్తున్న గొర్రెలు, మేకలు భయపడి మందగా చేరి ఒకదాన్నొకటి తోసుకుంటూ అరవసాగాయి. అంతలో పెద్ద పెద్ద చినుకులుగా మొదలై పెద్ద గోళీల సైజునుంచి నిమ్మకాయంత సైజులో వడగళ్ళు పడడం మొదలైంది. అప్పటికే తాటిచెట్టు నీడనుంచి పరిగెత్తి దూరంగా తుప్పల పెరిగిన కానుగ చెట్టుకిందకి చేరిపోయి గొంతుక్కూర్చుంది శిరీష. వడగళ్ళ ధాటికి తట్టుకోలేని గొర్రెలు, మేలు చెల్లాచెదురై కొన్ని శిరీష పక్కకి, ఇంకొన్ని మరో పక్కనున్న తుమ్మచెట్టు కిందికి పరిగెట్టినై. వడగళ్ళతో పాటు వర్షం… ఉరుములు, మెరుపులు, గాలుల్తో నాలుగైదు నిమిషాలు భీభత్సం సృష్టించింది ప్రకృతి. ఆ ధాటికి ఏడెనిమిది గొర్రెలు పడి పోయాయి. వర్షం తగ్గగానే ఓ పక్కనుంచి శిరీష, మరో పక్కనుంచి వాళ్ళమ్మ, అన్న పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే నాలుగ్గొర్రెలు చచ్చిపోయినై. మిగతావి కొనప్రాణంతో ఉన్నాయి.
నెత్తి పట్టుక్కూర్చున్న వాళ్ళమ్మతో ‘మొన్న చింతచెట్టు, వేపచెట్టు 30 వేలకమ్మిన లాభం ఇప్పుడీ గొర్రెలు చచ్చిన్దానికి సరిపోయిందా’ అని కచ్చిగా అడిగింది శిరీష. ‘నా చిన్నప్పుడు నాటిన చెట్లు ముప్పై ఏళ్ళు పెంచాను. కరువు కాలం, పంట పెట్టుబడికి వస్తుందని అమ్మాను. ఆ మిషను రంపంతో మూడు నిమిషాల్లో ముక్కలు చేస్తే గుండెల్లో గుచ్చుకున్నట్టే అయింది. కానీ ఇప్పుడు ఇది 50 వేల నష్టం. ఎట్లా పూడ్చేది’ అని ఏడుస్తుంటే జాలేసింది శిరీషకి. దగ్గరికి తీసుకుని ‘ఇన్సూరెన్స్ వస్తదేమో చూద్దాం లేమ్మా ఏడవకు, ఇప్పటికైనా నీడొచ్చి పంట పండట్లేదనకుండా కనీసం ఓ నాలుగు పెద్ద చెట్లని పెంచుదాం. జీవాలైనా బతుకుతై. మిగిలిన దాంట్లో పండిందే మనం తిందాం, మిగిలిందే అమ్ముదాం. మనం ముగ్గురం బతకడానికి అంతకన్నా ఎక్కువెందుకమ్మా’ అంటున్న చెల్లెలు చాలా గొప్పగా కనిపించింది శిరీష అన్నకి.
బొంత పురుగులు పుట్టలు పుట్టలు పట్టినై అని చిరాకు పడి తను కొట్టించేసిన ఇంటి ముందట తాత నాటిన రావిచెట్టు గుర్తొచ్చింది. సుమారు డెబ్భై ఏళ్ళ వయసున్న ఆ చెట్టునాశ్రయించి ఎన్ని పక్షులు, పిట్టలు, కీటకాలు ఉండేయో… దాని కింద కట్టిన అరుగుమీద మధ్యాహ్నం నీడకి, చల్లదనానికి ఊర్లోని వృద్ధులు చేరి కథలు, కబుర్లు చెప్తుంటే ఎంత సందడిగా ఉండేదో… ఇప్పుడక్కడ ఎంత నిస్తేజంగా, పేలవంగా ఉందో గుర్తొచ్చి వెంటనే అక్కడో మొక్కని నాటాలని గట్టిగా అనుకున్నాడు.
పోయిన వర్షాకాలం చెల్లి అన్న మాటలు మనసులో మెదిలి, ‘ఈ ఎండా కాలం యిత్తులన్నీ పోగేద్దాం. వర్షాలు పడగానే అన్ని చోట్లా చల్లేద్దాం శిరీషా…’ అని అంటుంటే శిరీషకి లోకమంతా ఆకుపచ్చని చల్లదనం సంతరించుకుంటున్న భావన సంతోషాన్నిచ్చింది. ఈ సారి కరెంటోళ్ళు చెట్ల కొమ్మల్ని నరుక్కుంటూ పోకుండా గట్టిగా తగుల్కోవాలని మనసులో అనుకుంటూ తల్లిని లేపి నిలబెట్టింది!