స్త్రీ తన వ్యక్తిత్వం నిలుపుకోవడానికి పురుష నిర్మిత సమాజంతో పోరుడుతూ చాలా దూరం వచ్చింది. సంధి యుగం దాదాపు గడిచిపోయినట్లే. వ్యవస్థను నిలుపుకోవాలా? వద్దా? మార్చుకోవాలనుకుంటే ఏ విధంగా మార్చుకోవాలి? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంప్రదాయపు చట్రంలో నిలబడి స్త్రీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి సమాజాన్ని వాడిగా ప్రశ్నించే రచయిత్రి శ్రీమతి అరవింద.
‘పాడుతా తీయగా’ నవల పేరుకు తగినట్లు ”సంగీతం” నేపధ్యంగా సాగిన రచన. ప్రధాన స్త్రీ పాత్రలు కరుణ, మాధురి, కొంతవరకూ కామేశ్వరి.
వీరందరి జీవితాలూ సంగీతంతో ఏదో ఒక విధంగా పెనవేసుకునే ఉన్నాయి.
వర్తమాన సమాజంలో స్త్రీ జీవితంలో పెళ్ళికి సంబంధించినంతవరకు ఎదురవుతున్న మూడు రంగాలు, పై ముగ్గురి జీవితాలలోనూ కనిపిస్తాయి.
ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుని సాధారణ వైవాహిక జీవితం గడపటం, అంతకుముందే వివాహితుడై పిల్లలు కూడా
ఉన్నవాడిని ‘పెళ్ళి’ చేసుకుంటే ఆ జీవితం సుఖప్రదమవుతుందా? విధి వైపరీత్యం వల్ల ఒక రకంగా సంసార జీవితంలోంచి నెట్టివేయబడి, స్వతంత్రంగా బతకడం ఆనంద దాయకమా?
కరుణ సాధారణమైన గృహిణి. మాధురి వివాహితుడైన పురుషుని స్వీకరించిన స్త్రీ. కామేశ్వరి గత్యంతరం లేక స్వతంత్రంగా తన జీవితం తాను గడుపుతోన్న వ్యక్తి.
మరి, సమాజంతో పోరాటం ఉండదా?
పై మూడు కోణాలలోంచీ స్త్రీలు ఎదుర్కొనే సంఘర్షణలను, వారు చేయవలసిన పోరాటాలను చక్కని మృదుశైలిలో చూపించారు రచయిత్రి. ”నీవే తల్లివి తండ్రివి…” లాంటి ఆరాధనా క్రమాన్ని కరుణ, రవీంద్రల మధ్య పోషించిన విధానం చదివి ఆనందించవలసిందే!
మగవాళ్ళెవరూ దుర్మార్గులు కారు. అయినా స్త్రీకి తన వ్యక్తిత్వం నిలుపుకోవడానికి సమాజంతో పోరాటం తప్పదు. ఈ సంఘర్షణను రచయిత్రి అతి సున్నితంగా ఎలా పోషించారో చదివి ఆనందించవలసిందే!
జీవితంలో ఏ రంగంలోనైనా, ఎలాంటి మార్గం ఎంచుకున్నా సంఘర్షణ తప్పదు. కృంగిపోక, నిర్మాణాత్మకంగా తమ సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఎవరి జీవితమైనా ”పాడుతా తీయగా” అన్నట్లు సాగిపోతుంది.