కొత్త కాలాలు… – తమ్మెర రాధిక

 

”నీ ఎదటికి వస్తే వాడి బుద్ధి మారుతుందేమో!” అంది కాత్యాయని.

”ఎన్ని మార్లు పిలిపించినా రాడాయే.. ఇహ బుద్ధి గురించి ఏం మాటలెద్దూ…”

”పిలిపించడం కాదు కాస్త వాడిని ఒప్పించు” కాత్యాయని అన్నగారిని ప్రార్ధించింది తన కొడుకు గురించి.

”కుర్రకుంకలంటే వాళ్ళు ఒప్పించడానికి? చూద్దాం ముందుగా కాస్త వేడి వేడి కాఫీ గుండ ఉంటే కాఫీ పడెయ్యి పొయ్యిమీద… తాగి వెళ్తాను… చీకటి పడుతోంది” అన్నాడు రాజారావు భుజంపైన కండువా తీసి, కుర్చీలో కూర్చుంటూ తుండుతో కాళ్ళ మీద కొట్టుకుంటూ కూర్చున్నాడు.

ఫిల్టర్‌ నుంచి డికాక్షన్‌ తీసి వేడిపాలు కలిపి అతనికిస్తూ, ఒక ఫోటో తెచ్చి చూపించింది. అమ్మాయి చాలా బావుంది ఫోటోలో. కళ్ళల్లో ఆత్మ విశ్వాసం, హుందాతనం ఉన్నాయి.

”ఈ అమ్మాయి మటుకు చాలా బావుంది. ఉద్యోగం కూడా పెద్ద కంపెనీలోనే అని విన్నాను” అన్నాడు సందేహంగా.

”అందుకే అన్నాను వాడితో నీకు తోచకపోతే బుద్ధి గలవాళ్ళని సలహా అడగరా అని.. వినడే నా మాట! మంచి చెప్పబోతానా అమ్మా నీ ధోరణే నీదిలా ఉంది నేను అమ్మాయికి నచ్చాలా వద్దా. మరి నాకూ ఓ అభిరుచి ఏడుస్తుందని ఆలోచించవేం అంటాడన్నయ్యా పైగా”

చెల్లెలి మాటలకు తలాడించాడు సాలోచనగా.

”తల్లీ తండ్రీ గడుసు పిండాలని విన్నాను”.

”వాళ్ళతో మనకేంటన్నయ్యా… పిల్ల లక్షణంగా ఉంది. ఎక్కడో ఉద్యోగాలూ, సంపాదనల పేరుతో దూరంగా

ఉంటారు. మనవాడు తెలివి తక్కువ వాడైతే గడుసు పిండాలకి ఊతం వస్తుంది”.

”సరేనమ్మాయి… ఇంటికి రమ్మను వాడికి చెప్పి చూస్తాను. అత్త మెచ్చిన కోడలు ఏ ఇంటికైనా మంగళకరమేలే…” కాఫీ తాగి నవ్వుతూ అన్నాడు రాజారావు.

పదిహేను రోజుల క్రితం లక్ష్మిని చూసొచ్చారు కాత్యాయనీ, ప్రసాదూ, హరి. అప్పటినుండి హరిని వేపుకు తింటోంది పిల్ల నచ్చిందా, నచ్చలేదా ఏ మాటా చెప్పు అంటూ. ప్రతిసారీ హరి అదే అంటూ వచ్చాడు.

”అంత తొందరేం. అందంగా ఉంటే సరిపోయిందా? ఆ అమ్మాయి అలవాట్లేంటో, ఆలోచనలేంటో తెలియద్దూ? నా ఇష్టాలు ఆ పిల్లకు నచ్చుతాయో లేదో… నా అలవాట్లు ఆమెకు సరిపడతాయో లేదో…” నసిగాడు హరి. మనసులో మాత్రం తన ఆకారం ఆ పిల్లకు నచ్చిందో లేదోనని అనుమానమే.

”సరే… సరే… ఏవన్నా అంటే ఉపన్యాసం పేలగొడతావు. మాకా… వయసు అయిపోతోంది. ఒక్కగానొక్క కొడుకువి, కాస్త ఆయింత రెక్కలున్నప్పుడే పెళ్ళి చేసేస్తే మమ్మల్ని బూడిద చేస్తావని ఆశ” అంది కాత్యాయని నిష్టూరంగా.

తల్లి మెడచుట్టూ చేతులేసి బ్రతిమలాడుతున్న ధోరణిలో-

”మాటలు బాగా నేర్చావమ్మా నన్ను చిన్నబోయేట్టు చేస్తూ… నాకు పెళ్ళి విషయంలో పేచీ లేదు. చేసుకుంటాను… కానీ వచ్చే పిల్ల మన ఇంటి పరిస్థితులకు అనుకూలమో కాదో తెలియకపోతే అందరం ఇబ్బందుల పాలవుతాం. అందువల్ల అమ్మాయి నుంచి ఓకే కానీయమ్మా” అన్నాడు హరి.

అలా అన్నప్పటి నించే వారం దాటినా కొడుకు ఏ సంగతీ తేల్చడంలేదు. అందుకే కాత్యాయని అన్నగారికి కబురు పెట్టి విషయం చెప్పి మొరపెట్టుకుంది హరికి నచ్చచెప్పమని.

సాయంకాలం ఆఫీసునుంచి హరి రావడంతోనే –

”మావయ్య ఒక్కమాటు రమ్మన్నాడురా నిన్ను” అంది కాత్యాయని.

”ఆయన దగ్గర కూడా చెప్పావా ఏంటి సంబంధం గురించి చిలవలు పలవలుగా” నవ్వాడు హరి కాఫీ తాగుతూ.

”నాకదే పని మరి… చదువుక్ను వాళ్ళు కదూ మీరంతా… మంచీ సెబ్బరా అంతా పుక్కిట పట్టిన వాళ్ళైతిరి మరి” మూతి విరిచిందామె అసహనంగా.

”అయితే నుంచున్న పళంగా వెళ్ళడమే మంచిది… లేకపోతే ఆయనేదన్నా మెలికలు వేస్తాడు, పేచీలకు ప్రసిద్ధి మనిషాయే” కాఫీ త్రాగి వక్కపలుకు వేసుకుని బజార్లోకి వెళ్ళాడు మేనమామ ఇంటికి దారితీయడానికి.

హరి వెళ్ళగానే అన్నగారికి ఫోన్‌ చేసింది, ఎలాగైనా కొడుకుని పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకునేలా చేయమని.

”నేనన్నీ కనుక్కుంటాను. నువ్వు కోడలి రాక గురించి తొందరపడకు. అత్తగారి మంచీ, కోడలు వేము తీపూ ఎక్కడా లేవు లోకంలో, విన్నావా?” అంటూ ఆయన చురక వేశాడు. ఆయన మీదనే భారం వేసి వంట ప్రయత్నం మొదలుపెట్టింది.

హరి రెండు రోజుల తరువాత ఏ సంగతీ నాన్చకుండా చెబుతానన్నాడు మేనమామ దగ్గర్నుంచి వచ్చాక. అంతటికే తృప్తి పడింది కాత్యాయని. మర్నాడు లక్ష్మి దగ్గర్నుంచీ ఫోన్‌ వచ్చింది. ఆశ్చర్యంతో, ఆందోళనతో ఫోను ఎత్తింది.

”నమస్తే… నేను లక్ష్మిని మాట్లాడుతున్నా”

”ఆఁ… ఆఁ… చెప్పమ్మా!” లోలోపల అత్తయ్యా అని అననందుకు కాస్త కించపడుతూ అంది.

”ఏం లేదు ఊరికెనే చేశాను… అమ్మా వాళ్ళంతా గుడికి వెళ్ళారు… ఒక్కత్తిన్నే బోర్‌ కొడుతోంటే ఆన్‌లైన్‌ షాపింగ్‌ పూర్తి చేశాక సడన్‌గా మీరు గుర్తొచ్చారు” అంది లక్ష్మి.

”నువ్వెళ్ళలేదా గుడికి… ఇవ్వాళ గోకులాష్టమి కదా! గుళ్ళల్లో ఉట్టి వేడుకలు చాలా బావుంటాయి. మా వీథిలో

ఉన్న గోపాలస్వామి గుళ్ళో ప్రసాదాలూ అవీ భలే ఉంటాయి. హరి కూడా తప్పనిసరిగా గుడికి వెళ్ళి వస్తాడు. బాగా ఎంజాయ్‌ చేస్తాం”

ఉత్సాహంగా అంది కాత్యాయని.

”అలాగా… మీ ఇంట్లో పూజలూ అవీ చాలా చేస్తారంటగా… హరి చెప్పాడు. నాకవి పూర్తిగా సరిపడవు. అంతా అర్థం లేని వ్యవహారంలా అనిపిస్తుంది”.

”అంటే దేవుడంటే నమ్మకం లేకనా… పూజ చేసే విధానం తెలియకనా… బద్ధకం వల్లనా… దేనివల్ల పూజంటే సరిపడదూ?” అని ప్రశ్నించింది.

‘మీ ఇంట్లో’ అంటూ దూరం పెట్టి మాట్లాడుతుంటే ఆమె మనసు నొచ్చుకుంది.

”మనసు లగ్నం కాదండీ… మంత్రం విధానం అర్థం కాక… ఆ శ్లోకాలు చదివితే అర్థమే తెలియదు. ఇహ మనసుకేం పడుతుంది? దేవుడికి మన మొర ఎలా తెలుపుతాం?” అంటూ నవ్విందా అమ్మాయి.

”అర్థం సంగతి తర్వాత మంత్రాల పవిత్రతవల్ల అవి వింటోంటేనే మనోల్లాసం కలుగుతుంది. అంటే మంత్రానికి మనసు స్పందించిందనేగా అర్థం?” అడిగింది కాత్యాయని. ‘అబ్బో’ అనుకుంది లక్ష్మి.

”కొన్ని పాటలు చూడూ మనల్ని ఉర్రూతలూగిస్తాయి. ఎందుకంటే మనసు ఇష్టపడుతుంది కనుక. ఒకటికి పదిసార్లు వింటాం… మంత్రమయినా అంతే”.

ఆమె మాటలకు నవ్వుకుంది లక్ష్మి.

”ఇంకా ఏంటి నీ ఇష్టాయిష్టాలూ…”

”నాకు ట్రావెలింగ్‌ బాగా ఇష్టం. ఆఫీసుకి ఒక్కరోజు సెలవు దొరికినా బైటికి వెళ్ళిపోతాను” అంది లక్ష్మి.

ఆ మాట తనతో ఎందుకు చెబుతోందో అర్థం కాక-

”మంచిదేగా రొటీన్‌గా జీవించేకంటే అది నయం కదూ?” అంది.

”హరి మా అమ్మతో మాట్లాడు అంటే మాట్లాడదామని ఫోన్‌ చేశాను. ఉంటాను” అంది ఆ అమ్మాయి అర్థంతరంగా సంభాషణ ఆపేస్తూ ఫోన్‌ పెట్టేసింది.

కాత్యాయని హృదయం ముల్లు గుచ్చుకున్నట్టుగా స్తబ్దుగా అయ్యింది.

‘మాట కొంచెం పెళుసు’ అని తనే సర్ది చెప్పుకుంది.

సాయంకాలం హరి వస్తూనే తల్లి మొహంలోకి చూశాడు ఏమన్నా చెబుతుందేమోనని. కాత్యాయని రాత్రి భోజనం తయారుచేస్తూ మౌనంగానే ఉంది. అతను స్నానం చేసి వచ్చాక భోజనానికి కూర్చున్నాడు. తండ్రి కూడా వచ్చి కూర్చున్నాడు.

”ఆ పిల్ల ఫోన్‌ చేసి మాట్లాడిందట కదా!” అన్నాడు హరి.

”ఊఁ… ఈ కాలపు పిల్లలు మరి… ఏం మాట్లాడినా మనమే సరిపెట్టుకోవాలి మరి” అంది కాత్యాయని గుంభనంగా.

”తన అలవాట్లూ, అభిరుచులూ అంటూ చెప్పిందా ఏవన్నా?”

”చిన్న పిల్ల ఎదురు వాదం ఎందుకని నేను అనుకోలేదురా…ఆ అమ్మాయి ఏం మాట్లాడినా మంచిగానే మాట్లాడాను. కానీ నేను చెప్పిన జవాబులకు ఆమె పెద్దగా స్పందించలేదు”.

”ఆఁ… ఒకరు చెబితే వినే రకం కాదులే!” నాలుక చప్పరించాడు హరి. వాళ్ళ మాటలు వింటూ తింటున్నాడు ప్రసాదు.

”మీరు ఏం మాట్లాడరేం?” అతన్ని రెట్టించింది కాత్యాయని.

అవకాశం జారవిడుచుకోవడం మంచిది కాదనుకున్నాడు, వెంటనే వడగళ్ళ వానలాగా పెళ్ళాం మీద చీవాట్లు కురిపించాడు.

”వాళ్ళిద్దర్నీ నాల్రోజులు మాట్లాడుకోనియ్యవే. ఒకరినొకరు సరిగా తెలిస్తే బావుంటుంది. వెనకటి రోజులు కావివి. ఎకాఎకిన పెళ్ళి పీటలమీద కూర్చోవడానికి. పెళ్ళయ్యాక ఇద్దరికీ మాట పట్టింపులు వస్తే వెంటనే విడాకులకు కోర్టుకెక్కుతున్నారు తెల్సా! పెళ్ళిచూపుల నాటినుంచీ వాడ్ని తరుముతున్నావు ఏ సంగతీ చెప్పమని. చెప్తూనే ఉన్నాడుగా ఒకరు చెప్తే వినే రకం కాదనీ కాస్త నాల్రోజులు ఆగు” అన్నాడు ప్రసాదు. ఆ మాటలకు బాధపడింది కాత్యాయని.

”సరే నేనంటే తొందరపడుతున్నానని అంటున్నారు. పోనీ మనింటికి ఒకరోజు తీసుకురమ్మంటే! కాస్త మన పద్ధతులూ… విషయాలూ ఆకళింపు చేసుకోవాలిగా!” ఆశగా అడిగింది. ఆమె ధోరణికి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

హరికి పెళ్ళీడు దాటుతుండడం ఆమెకు ఆందోళన కలిగిస్తోంది. మొదట్లో సిగ్గు, ప్రేమ, మార్దవం లాంటి భావాలతో ఉండేవాడల్లా, పెళ్ళిచూపుల్లో కొంత మంది ఆడపిల్లలు అతన్ని వద్దనుకోవడం, ఉద్యోగ వత్తిడులూ, సహచర స్నేహితుల పెళ్ళిళ్ళు అవ్వడం లాంటివి జరగడంతో కొడుకు మొహంలో ముసలితనం, సగం బట్టతలా, బొర్ర పెరగడం లాంటి వాటివల్ల ఇహ పెళ్ళికాదేమో అన్న ఆరాటం పెరిగిపోతున్నది. ఈ మధ్య ఏ పెళ్ళి చూపులు చూసినా అమ్మాయి ఒప్పుకుంటేనే పెళ్ళి జరుగుతుందని కాత్యాయనికి అర్థమవుతోంది.

లక్ష్మిని ఇంటికి రమ్మందామన్న తల్లి కోరిక బానే ఉందనిపించింది హరికి.

”చూద్దాం! ఆమెకి చెప్పి చూస్తాను” అన్నాడు హరి.

అప్పటి నుంచి కాత్యాయనికి ఒకటే ఆదుర్దాగా ఉంది. లక్ష్మి వస్తే ఏం తింటుంది? ఎక్కడ కూర్చుంటుంది? ఈ మంచాలు బావుంటాయా ఆ పిల్ల దృష్టిలో. పూజగది నీట్‌గా సర్దాలి.. మంచి విలువగల సామాను ఆమె ఎదురుగా కనపడేట్టుగా పెట్టాలి. గాజు సామాను టేబుల్‌మీద పొందిగ్గా సర్ది రోజూ వాటిల్లోనే తినే భ్రమగొల్పాలి. ఇలా ఏవేవో ఆలోచనలతో హడావిడి పడింది.

మధ్యాహ్నం వస్తే భోజనం చేస్తుందా? సాయంకాలమైతే ఏం టిఫిన్‌ పెట్టాలి… వంటి ఆలోచనల్లో ఉండగానే హఠాత్తుగా లక్ష్మి దగ్గర్నుంచీ ఫోన్‌ వచ్చింది. కాసేపట్లో తను వస్తున్నాననీ, అడ్రస్‌ సరిగ్గా చెప్పమనీను. కాత్యాయని గుండె వేగం హెచ్చింది కాసేపు. వాకిట్లోకీ, ఇంట్లోకీ తెగ తిరిగింది.

”వస్తున్నది మనం పెళ్ళి చూపుల్లో చూసిన అమ్మాయి. కొత్త కోడలు వస్తున్నట్లుగా ఏంటా ఖంగారు. కాస్త ఎగ్జైట్‌మెంట్‌ తగ్గించు. లేకపోతే ఆ పిల్ల ముందు నేను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది” ప్రసాదు చిరాకుపడ్డాడు.

”ఏంటీ మీరుంటారా ఇంట్లో… ఇంకా నయం” కసిరింది కాత్యాయని.

ఆ మాటకు ఇంట్లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు ప్రసాదు, భార్య ఏం అవకతవకగా ప్రవర్తిస్తుందోనని ఆలోచిస్తూ.

ఇంటి ముందు ఆటో ఆగింది. లక్ష్మి దిగి సరాసరి లోపలికి వస్తూ కాత్యాయనిని చూసి నమస్తే అంటూ చేతులు జోడించింది. ప్రసాదును చూసి నవ్వుతూ బావున్నారా అంటూ పలకరించింది. కాత్యాయని గబగబా ఫ్రిజ్‌లోంచి మంచి నీళ్ళ బాటిల్‌ తీసి ఇచ్చి, భర్తకేసి చూసింది కూర్చోమన్నట్టు. అతను కూర్చుంటూ లక్ష్మిని కూర్చోమన్నాడు. తను కూర్చుంటూ- ”మీరూ కూర్చోండి… హరి అమ్మని కలిసి రండి అన్నాడు. హాఫ్‌డే సెలవు పెట్టి వచ్చాను” అంది లక్ష్మి.

ఇది మొదటి దెబ్బ అనుకుంది కాత్యాయని. హరిని వెళ్ళమన్నాడూ అంటూ ఏకవచనంలో చెప్పింది, తనను తాను కలిసి రండి అన్నాడు అంటూ గౌరవించుకుంది అని అబ్బురపడింది.

”అమ్మా వాళ్ళు బావున్నారా? అమ్మను కూడా తీసుకురాకపోయావా?” అంది ఏదో ఒకటి అడగాలన్నట్టు. ఇదేం తెలివి తక్కువ ప్రశ్న అన్న విధంగా చూసింది లక్ష్మి.

”నేను ఆఫీసు నుంచి వస్తున్నాను. కాసేపు ఉండి మళ్ళీ ఫంక్షన్‌కి వెళ్ళాలి. అక్కడినుంచి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పదవుతుంది”.

”ఒక్కర్తివేనా?” అసంకల్పితంగా నోరు జారింది.

ఆ మాటకు సునిశితంగా చూసింది లక్ష్మి.

”అంటే ఏంలేదమ్మా మమ్మీ వాళ్ళు అక్కడ ఫంక్షన్లో కలుస్తారా లేక…” ప్రసాద్‌ భార్యను కాపాడబోయాడు.

”నా ఫ్రెండ్‌ వాళ్ళ అన్నయది పెళ్ళి. దానికి అమ్మావాళ్ళు ఎందుకు?” ఎదురు ప్రశ్నించింది.

”ఓ”.

టిఫిన్‌ పూరీ చేద్దామని పిండి కలిపి ఉంచింది ముందుగానే. ఆమె పూరీలు వత్తుతుంటే లక్ష్మి అటు చూసి ప్రసాద్‌తో మాటల్లో పడింది. చెమటలు కారుతుంటే హైరానా పడుతూ పూరీలూ, కూరా చేసి స్వీట్లతో సహా అన్నీ పళ్ళెంలో సర్ది తీసుకెళ్ళి లక్ష్మి ముందర పెట్టింది. ఆమెకు మంచినీళ్ళు పెట్టి ఎదురుగ్గా కూర్చుంది కాత్యాయని. లక్ష్మి మొహమాటానికి కూడా పోకుండా చిన్న ముక్క తుంచుకుని తినేసి ప్లేటుకు ప్లేటు పక్కకు జరిపేసింది, తనకు పెద్దగా ఆకలి లేదంది.

మంచి కాఫీ కలిపి మెప్పించుదామని మళ్ళీ స్టవ్‌ దగ్గరికి పరిగెత్తింది.

ఆ కాఫీ కూడా ఒక్క గుక్కెడు తాగి నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది, మీగడ కడితే అసహ్యం అని చెప్తూ. ఉస్సూరంది కాత్యాయని ప్రాణం. కనీసం తన చెమట చుక్కల కష్టం కూడా గుర్తించలేదని బాధపడుతూ. ఇల్లు చూపిస్తా రమ్మని లేవదీసింది.

ఇల్లంతా చూసి, చుట్టూ చెట్లు లెవ్వెందుకని అంది. చల్లదనం, పచ్చదనం లేకపోతే వేస్టంది. ఏంటీ పిల్ల అంటూ మనసు నొచ్చుకుంది కాత్యాయని. బంధువులు ఎక్కువగా రావడం ఈ రోజుల్లో పనికిమాలిన వ్యవహారమంట! పనికి చేటు, వాళ్ళవల్ల అపనిందలు, నిష్ఠూరాలూ తప్ప ఉపయోగం లేదంది.

‘అమ్మయ్యో నా అప్పచెల్లెళ్ళూ, అత్తగారి బలగం ఏం కానూ’ అని గుబగుబలాడిపోయింది ఆ మాటకు కాత్యాయని.

లక్ష్మి అక్కడ గడిపిన గంట కాలంలో ఎంతసేపూ తన పనీ, తన ఆలోచనలూ, తన అభిప్రాయాలూ… ఇవి తప్ప రెండో వాటికి చోటు లేదూ… ఎదుటివాళ్ళని తన పరిధిలోనికి రానివ్వాలేదు… ఆమె బైల్దేరబోతుంటే-

”హరి వచ్చే వేళయ్యింది ఎలాగూ… కొద్దిసేపు ఉంటే కలిసి వెళ్ళవచ్చు లక్ష్మీ” అంది కాత్యాయని. లక్ష్మీ అని పేరుతో పిలుస్తూ మార్దవంగా.

”అమ్మో! ఫ్రెండ్సందరూ వస్తూ ఉంటారు పెళ్ళికి. హరి ఫోన్‌ చేస్తే నేను మాట్లాడతాలెండి. అవసరమైతే కలుస్తాగా!” చెప్పుల్లో కాళ్ళు దూర్చింది లక్ష్మి. పెళ్ళికి వెళ్తోందని ఫ్రిజ్జులోంచి మల్లెపూల దండ తీసి బొట్టు పెట్టి ఇచ్చింది. దాన్ని హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్ళిపోయింది.

అప్పుడు చెప్పాడు ప్రసాదు, ”ఎలాంటి శహభిషలు లేని మనిషి. చాలా ప్రాక్టికలే. ఇంకా తన అభిప్రాయం ఏంటో హరి మీద చెప్పలేదు కనుక తను మనకేం కాదు. కేవలం తెల్సిన అమ్మాయి. అంతకు మించి ఆమె గురించి మనం స్వతంత్రంగా ఆలోచించకూడదు. నీ భావాలూ… బాధలూ అర్థం అవుతూనే ఉన్నాయి నాకు. అలాంటిది ఆ అమ్మాయి తన చూపుల్తోనే నిన్ను అంచనా వేసింది అది గుర్తుంచుకో”.

కాత్యాయని కళ్ళనీళ్ళ పర్యంతమైంది, తనలోని భావాలను భర్త నిస్సంకోచంగా వర్ణిస్తుంటే.

”ప్రస్తుతం నువ్వు అత్తవి కాదు, ఆమె కోడలు కాదు. జస్ట్‌ తెలిసిన అమ్మాయి. అంతే అంతకంటే ఆశలు పెంచుకుని ఆశిస్తే భంగపడతావు” చెప్పి ప్రసాద్‌ బైటికి వెళ్ళిపోయాడు.

‘అబ్బ ఏం మనిషి, కొడుక్కు పెళ్ళి కాలేదింకా అన్న విచారం కూడా లేదు ఒట్టి పాషాణం’ అనుకుంది, పైగా

‘పిల్ల ఇల్లు చూసింది కనుక పెళ్ళికి ఒప్పుకుంటే అదే మహా ప్రసాదం. తమకు కట్నాలూ వద్దు, కానుకలూ వద్దు. తమది కూడా ఓహో అన్న సంసారమే కానీ మరోటి కాదు. ఏం లోటు లేదు ఒక్కడే కొడుకు. ఒకళ్ళు పెట్టలేదనీ, పొయ్యలేదనీ బెంగ లేదు. పెళ్ళి చేశాక ఎక్కడ ఉంటామంటే అక్కడ

ఉండనిచ్చేస్తే సరి… అందరి పిల్లలకీ పెళ్ళిళ్ళు అయిపోయాయి తమ బంధువుల్లో.

తను ఒక్కడే కొడుకు కనుక ఎంతో వైభవంగా పెళ్ళి చేయాలనీ, తరువాత కొడుకూ, కోడలూ, పిల్లలూ అని ఎంతో ఆశపడింది. కలికాలం కాకపోతే ఆడపిల్లలే ఇన్నేసి కోరికలతో, ఎంత ఆస్తి ఉందీ, పెళ్ళయితే మాకేం మిగులుతుందీ, ముందుగానే మీరు మా దగ్గర ఉండొద్దు, మేం సంపాయించిందాంటో చిల్లి గవ్వ సాయం చెయ్యం లాంటి ఐరావతపు కోర్కెలు విని, పోనీ పెళ్ళయితే చాలు అని తృప్తి పడదామన్న అవకాశం లేకుండా ఉంది.

ఆలోచిస్తూనే మళ్ళీ వస్తువులన్నీ ఎక్కడివక్కడ సర్దేసింది అన్యమనస్కంగా.

లక్ష్మి ఏ వస్తువుల్నీ చూసింది గాదు… పట్టించుకున్నదీ లేదు నా పిచ్చిగానీ అని నీరసపడింది.

తల్లి బాధ అర్థమవుతున్నా హరి మిన్నకుండిపోయాడు. లక్ష్మి ఏ సంగతీ చెప్పనప్పుడు తల్లికి తను ఏం చెప్పగలడు? అక్కడికీ లక్ష్మితో ‘అమ్మ ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయంటోంది… అందుకనీ షాపింగూ, బంగారం కొనడం లాంటివన్నీ ఉన్నాయి కదా!’ అన్నాడు.

”ఇంకా ఆర్నెల్ల దాకా బ్రహ్మాండమైన ముహూర్తాలే ఉన్నాయంటలే. కొద్ది కాలం ఆగు” అంటూ ఫోన్‌ పెట్టేసింది. అందుకని ఏం చెయ్యాలో తోచక చేతులు పిసుక్కున్నాడు. ఆ అమ్మాయి అన్న మాట సిగ్గు విడిచి తల్లితో చెప్పలేడు.

వారం రోజులు గడిచిపోయాయి. కొడుకును అడుగుదామా వద్దా అని మల్లగుల్లాలు పడుతోంది కాత్యాయని.

ఒకరోజు ప్రసాదు వద్దంటున్నా వినకుండా మధ్యవర్తికి ఫోన్‌ చేసింది ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా.

”మా అబ్బాయి సంబంధం ఏమయిందని అడుగుదామని ఫోన్‌ చేశానండీ… రెండు నెల్లు గడిచాయి కదా… అందుకనీ…”

అవతల నుంచీ ఏం సమాధానం వస్తుందోనని ప్రాణాలు ఉగ్గబట్టుకుని మరీ అడిగింది.

”చూడమ్మా! పిల్లా వాళ్ళు మీ సంబంధానికి సుముఖంగా లేరు. అదివరకే అమ్మాయితో చెప్పారట, అబ్బాయి చాలా ముదరగా

ఉన్నాడని. పిల్ల కూడా మీ అబ్బాయితో చెప్పిందట పదిరోజుల క్రిందట, తనకు ఇష్టం లేదని. మీ వాడు మీకు చెప్పలేదనుకుంటా…” అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య.

”ఆహా…అలాగా.. నేను ఈ మధ్య ఊళ్ళో లేనులెండి…” కళ్ళ వెంబడి నీళ్ళు జారిపోతుంటే అస్పష్టంగా గొణిగింది కాత్యాయని.

”మరో సంబంధం ఉంది చూద్దామంటారా?”

”చెప్పండి…” గొంతు నూతిలోంచి వచ్చినట్టుగా ఉంది.

”మరేం లేదు… మీరు సరేనంటేనే చెబుతాను…” అతని నాన్చుడుకు –

”చెప్పండి…” అంది కళ్ళు తుడుచుకుంటూ.

”అమ్మాయి దివ్యంగా ఉంది. భర్త క్షయతో పోయాడు రెండేళ్ళ క్రితం. ఒక అబ్బాయి ఉన్నాడు, ఏడేళ్ళు ఉంటాయి.”

”…………..”

”వింటున్నారా? మంచి సంబంధం మీరు ఊఁ… అంటే…”

కాత్యాయని మనసుని ఎవరో హెచ్చరిస్తున్నారు, కూలిపోతున్న స్వప్నాల జలపాతంలో చిరు మొగ్గై కనిపిస్తోన్న లక్ష్మి తాలూకు కనులు సూటిగా చూస్తున్నాయి ఎంపిక నా హక్కంటూ!

మనుగడకు సంబంధించిన పోరాటంలో ముదితలంతా వెనకటంత మృదువుగా లేరు మరి…

”నిజమే… మరి…”

పలవరిస్తున్న కాత్యాయని మాటను ఎలా అర్థం చేసుకోవాలో తెలీక తికమకపడుతున్నాడు మధ్యవర్తి… సంబంధం చూడమంటోందో వద్దంటోందో అర్థం కాక!!

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.